10, సెప్టెంబర్ 2011, శనివారం

వెడలిపోదువా

ఈ బడలిన యొడలినుండి యింక వెడలిపోదువా
రేబవళ్ళు నీ తలపే మరి రేగుచున్నదీ మేన

పిలచితినో లేదో నా బీద యింటిలో నీవు
కొలువైతివి రేపొమాపొ కదలిపోవనా

పదిలముగా నిన్నునిలిపి పరవశించిన గుడిని
వదిలిపోవ నుంటివా వడలినదని సదయ నీవు

యీ నీ గుడి పూజారిని యేమి చేయనుంటివో
పోనీ నీ పూజకునై వేరు గుడిని చూపెదవో

యేల నశ్వరాలయముల జొచ్చి నిన్ను సేవించుట
నీలోకము చేరి సదా నిన్ను గొలుచు కొందునయా