16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

వర్తమానం

నాకు గుర్తు కూడా లేని గతం నన్నెందుకు భయపెట్టాలి
నాకేమీ తెలియరాని భవిష్యత్తుకు నేనెందుకు భయపడాలి
నా వర్తమానం మాత్రం నమ్మకంగా నిన్నల్లుకుని నిలబడింది
నా భయమల్లా దాని ధృఢత్వం నిజంగా నమ్మదగ్గదేనా అని
నా భయమల్లా నిన్ను కాలం నానుండి లాక్కోదు కదా అని
నీ దగ్గర యే భయానికీ నిలువ నీడ లేదని విన్నాను
నీ దగ్గర నిలబడి కూడా యెందుకో నేను భయపడుతున్నాను
నా దగ్గర నుండి నీవు నాలుగడుగులటు వేసేసావో
నా దయిన వర్తమానం కూడా నాది కాకుండా పోతుంది
అసలు నువ్వు కదలవద్దు అలా జరుగనియ్య వద్దు
నిన్ను నాతోనే నేమ నిశ్చలంగా కట్టేసుకుంటే
నీ స్వరూపమే యైన కాలం నిలబడి పోతుంది కదా
అప్పుడింక నీకూ నాకూ అస్తమానం వర్తమానమే