29, సెప్టెంబర్ 2011, గురువారం

సుఖం

తిరుగలిలో పడిన గింజకు
తిరుగుటలో సుఖ మున్నదా
నలుగుటలో సుఖమున్నదా
అని యడిగే నోరున్నదా

చీకటి వెలుగుల లోకమనే
తిరుగలి లో పడిన జీవికి
మెలకువలో సుఖమున్నదా
నిద్దురలో సుఖమున్నదా

పాపపుణ్యముల లోకమనే
తిరుగలి లో పడిన జీవికి
ఉదరముచే సుఖమున్నదా
హృదయముచే సుఖమున్నదా

ఆశనిరాశల లోకమనే
తిరుగలి లో పడిన జీవికి
చేతికంది సుఖమున్నదా
చేయిజారి సుఖమున్నదా

చావు బ్రతుకుల లోకమనే
తిరుగలి లో పడిన జీవికి
వచ్చుటలో సుఖమున్నదా
చచ్చుటలో సుఖమున్నదా

3 కామెంట్‌లు:

 1. జీవిత సత్యాన్ని అక్షరాలలో చూపించారు

  రిప్లయితొలగించండి
 2. సోక్రటీసు మహాశయులు పూర్వం ప్రశ్నల ద్వారా వేదంతాన్ని , సత్యాన్ని చూపేవారని.. రమణ మహర్షి "నీవెవరు ?" అన్న దాని ద్వారనే పరమార్ధం బోధ చేసేవారని విన్నాము , చదువుకున్నాము .... ఈ కవితని కేవలం కవితలా కాకుండా, ఆత్మావలోకనపు సాధనంగా ఉపయోగించుకోవచ్చు ... అభినందనలు ...

  రిప్లయితొలగించండి
 3. అరుణ తోలేటి పంపిన వ్యాఖ్య:
  ఇది అక్షర సత్యం..
  సుఖం.తృప్తి అన్నది అది అంతం లేనివి.
  నాది. నేను అను భ్రమ తొలగించి చూస్తే పరమాత్మ దర్శనం
  సాధనతో సాధ్యమవుతుంది.
  బాగా వ్రాసావు

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.