29, నవంబర్ 2018, గురువారం

ఎవరు నమ్మిన

ఎవరు నమ్మిన నీ కేమాయె మరి
యెవరు నమ్మక నీ కేమాయె

నమ్మినచో యానందము కలుగుచు
నమ్మనిచో న్యూనత కలిగేనా
నమ్మిన నమ్మకున్న నరు లితరులు నిను
నమ్మి తోడై రామనాథుడు లేడా

కమ్మని పలుకుల కరిగి నమ్మేవారు
సొమ్ముల తళతళ చూచి నమ్మేవారు
నమ్మించబోని నిను నమ్మకుంటే నేమి
నమ్మెనుగా రామనాథుడు చాలదా

నమ్ముకున్నావు నీవు నారాయణునే
నమ్ముచున్నాడు నిన్ను నారాయణుడే
నమ్ము మిదిచాలు నరుల యూసేల నిక
తమ్మిచూలి సృష్టినుండి తప్పిపోదు వంతే

28, నవంబర్ 2018, బుధవారం

శ్రీరామనామస్మరణ మొకటి


శ్రీరామనామస్మరణ మొకటి చాలుననే జన్మము
ఔరా అసలైన జన్మ మదే చివరి జన్మము

పదుల కొలది జన్మము లవి పదవులలో నున్న వారి
పదముల కడ పడిగాపులు పడుచు సతము సేవించుచు
పదవులకై ఆత్రపడుచు పాటుపడుచు చెడినవాయె
పదవులపై భ్రమలు వదలి బాగుపడెడు నొక జన్మము

పదులకొలది జన్మములవి పెదవులపై ఆశలతో
మదవతుల కొంగుబట్టి వదలకుండ సేవించుచు
పెదవులిచ్చు స్వల్పసుఖము భావించుచు చెడినవాయె
పెదవులపై భ్రమలు వదలి బాగుపడెడు నొక జన్మము

పదులకొలదు జన్మములవి ముదనష్టపు సొమ్ములకై
పదవులపై పెదవులకై మొదవులకై వెదకులాట
వదలలేని యొక జీవికి తుదకు రాము డొకడు చాలు
తదితరముల వలదటన్నతలపుజేయు నొక  జన్మము

25, నవంబర్ 2018, ఆదివారం

శ్రీరామచంద్ర కందములు - 4


కం. శ్రీరామచంద్ర! రుచిర
స్మేరా! దశరథ కుమార! శ్రిత మందారా!
ధీరా! కరుణా పారా
వారా! నను బ్రోవుమయ్య! పాపవిదారా *

కం. శ్రీరామచంద్ర మాయా
మారీచప్రాణహరణ స్మరకోటిసమా
కారా జలనిథిబంధన
ఘోరభవారణ్యదహన గుణవారినిధీ

కం. శ్రీరామచంద్ర సుజనా
ధారా సురవైరిగణవిదారా గుణకా
సారా సేవకజనమం
దారా సంసారవార్థితారకనామా

కం. శ్రీరామచంద్ర నీవై
ఘోరాటవులందు తిరుగ కోరక నీవై
కోరక రాకాసులతో
వైరము నవి కలిగె నెందు వలనం జెపుమా

కం. శ్రీరామచంద్ర ఘోరా
కారిణియా చుప్పనాక కదియగ నేలా
యా రావణు డడగుట కది
కారణ మగు టేల దైవఘటనము కాదా

కం. శ్రీరామచంద్ర కాలపు
తీరెఱిగెడు వారు కారు దేవతలైనన్
వారింపరాని కాలము
శ్రీరమణా నీకళావిశేషమె కాదా

కం. శ్రీరామచంద్ర శౌరివి
నీ రచనయె నరుడ వగుచు నేలకు దిగి దు
శ్చారిత్రుని పౌలస్త్యుని
ఘోరాజిని జంపు కథయు కువలయ నాథా

కం. శ్రీరామచంద్ర శాపము
తీరిన దటు కొంత జయుని దీనత బాపన్
నారాయణ నరుడవుగా
ధారుణి కరుదెంచినావు తామరసాక్షా

కం. శ్రీరామచంద్ర సుజనులు
ఘోరాపదలొంది విధము గొంకు వడినచో
వారల రక్షింప మహో
దారత నేరూపమైన దాల్చెదవు హరీ



* ఇది శ్రీవిష్ణునందన్ గారు అందించిన పద్యం.

23, నవంబర్ 2018, శుక్రవారం

రామకీర్తనా రమ్యకీర్తనా


రామకీర్తనా రమ్యకీర్తనా
ప్రేమభావనాయుక్తవిమలకీర్తనా

రామసంకల్పమున రవళించిన యూహతో
నామనోవీధిలో నాట్యమాడు పలుకులతో
కామితార్థప్రదవుగా కల్యాణ మూర్తివై
భూమికి దయచేసినట్టి పుణ్యకీర్తనా

ధన్యాత్ముల గుండెల తలుపుతట్టు కీర్తనా
పుణ్యాత్ముల నోళుల పులకరించు కీర్తనా
సన్యాసులు సంసారులు చాలమెచ్చు కీర్తనా
అన్యాయపరుల బుధ్ధి కందనట్టి కీర్తనా

పారమాత్మికమైన పలుకులొప్పు కీర్తనా
ధారాళమైన సుఖము దయచేయు కీర్తనా
తారకరాముని దివ్యతత్త్వ మొలుకు కీర్తనా
శ్రీరాముని యింటిదారి చెప్పునట్టి కీర్తనా

22, నవంబర్ 2018, గురువారం

రామ కల్యాణరామ


రామ కల్యాణరామ రామ కోదండరామ
రామరామ రామరామ రామరామ రామరామ

తామసించి నేను రామ తప్పుదారి నుండ రామ
కాముడనేవాడు రామ కష్టపెట్టుచుండె రామ
ప్రేమమీఱ నిన్ను రామ పిలువనీడు వాడు రామ
యేమిచేయగలను రామ యిట్లు నేను చెడితి రామ

మంచివాడ వనుచు రామ మనసిచ్చితి నీకు రామ
కొంచమైన కరుణ రామ కురిపించిన చాలు రామ
పంచమలము లింక రామ బాధించవు నన్ను రామ
వంచకుడగు కలిని రామ వంచి గెలువగలను రామ

అంతకుడు నన్ను రామ బంతులాడుచుండ రామ
వింతదేహములను రామ యెంతకాలమయ్య రామ
చింతలకు చిక్కి రామ చితుకుచుందునయ్య రామ
పంతగించి నీవు రామ పలుకకుంటివేమి రామ

21, నవంబర్ 2018, బుధవారం

ఓయీ శ్రీహరిని


ఓయీ శ్రీహరిని గూర్చి యొక్కమాట పలుకవా
మాయ నీదులాడుచు మైమరచి యుందువా

ఎన్ని జన్మలిటులెత్తి యేమి ప్రయోజనము నీకు
వెన్నవంటి మనసున్న వెన్నునే తలపక
మన్నులోన పొరలాడుట మతిమాలిన పనికదా
చిన్నగా శ్రీహరి యని చిత్తమందు పలుకరా

రామరామ యనువాడికి రాని సౌఖ్యమేమున్నది
కామదాసుడగువాడు గడియించున దేమున్నది
పామరుడై పడియుండిన బ్రతుకున ఫలమేమున్నది
స్వామినామ మికనైన  చక్కగా పలుకరా

తప్పు లెన్నొ చేసితి నని తలచి సిగ్గుపడవల దిక
తప్పొప్పులు లేక నీకు తనువు లేల కలిగినవి
గొప్పవాడు రాముడు నీ తప్పులెంచబోడురా
ఇప్పుడే శ్రీరాముని హృదయ మందు తలచరా


18, నవంబర్ 2018, ఆదివారం

శ్రీరామచంద్ర కందములు - 3


కం. శ్రీరామచంద్ర లోకపు
తీ రెఱిగియు నప్పుడపుడు తెఱలును మది నే
నారూఢుడ గాకుండుట
కారణముగ దోచు నీవు కరుణించ గదే

కం. శ్రీరామచంద్ర తనువులు
నీరములం బుడగలట్టి నిర్మాణంబుల్
కారణకారణ నీదయ
కారణముగ రాగమణగు గాక తనువులన్

కం. శ్రీరామచంద్ర లోకో
ధ్ధారక నీ దయను కాక తరియింతు రొకో
ధారుణి నరులొక నాటికి
వేరెరుగను నీకు నన్ను విడువకు తండ్రీ

కం. శ్రీరామచంద్ర మును నే
నేరిచి నీ ధ్యానమెంత నిపుణతమీఱం
గూరిమితో జేసితినో
వేరెఱుగదు నేడు మనసు విజ్ఞానమయా

కం. శ్రీరామచంద్ర వైదే
హీరమణ సమస్తలోకహితకర శౌరీ
పారాయణ మొనరింతురు
నీ రమణీయచరితము మనీషులు పుడమిన్

కం. శ్రీరామచంద్ర జీవులు
నేరరు కలిమాయ లెఱిగి నిలచు విధములన్
కారుణ్యమూర్తి వీవే
వారల కొక దారి చూపవలయును తండ్రీ

కం. శ్రీరామచంద్ర పెద్దల
నూరక నిందించువార లుందురు ధరణిన్
వా రెఱుగరు తమకే యవి
నారాచము లగుచు తగులు నా నించుకయున్

కం. శ్రీరామచంద్ర సుజనులు
క్రూరాత్ముల వలన కొంత కుందువడినచో
వారికి కలుగు విచారము
వీరికి మున్ముందు కలుగు భీతి దలచియే

కం. శ్రీరామచంద్ర ప్రాజ్ఞులు
కోరెదరా యొకరి చెడుగు కువలయనాథా
కోరెదరందరి సేమము
క్రూరాత్ములకైన శుభము కోరెద రెపుడున్


శ్రీరామచంద్ర కందములు -2


కం. శ్రీరామచంద్ర శ్రీమ
న్నారాయణ పద్మనాభ నానాలోకా
ధార దశాననగర్వవి
దార భవవిషాపహార తారకనామా

కం. శ్రీరామచంద్ర రాఘవ
వీరేంద్రా సకలలోక వినుతచరిత్రా
భూరమణీకన్యావర
కారుణ్యముచూపి నన్ను కావవె తండ్రీ

కం, శ్రీరామచంద్ర నుతగుణ
భూరికృపాభరణ భక్తపోషణచణ సం
సారాపద్వారణ సీ
తారమణ సమస్తదైత్యదండన నిపుణా

కం. శ్రీరామచంద్ర నీకృప
ధారుణి ప్రజలందరకును దక్కిన నిధియై
చేరిన పాపుల పుణ్యుల
నారూఢిగ బ్రోచుచుండు నన్నివిధములన్

కం. శ్రీరామచంద్ర యెవ్వని
బారినిపడి లోకప్రజలు పరవశులగుచున్
దారులు మరచెదరో యా
మారుడు నను చెణక కుండ మనుపవె తండ్రీ

కం. శ్రీరామచంద్ర నాలో
నీ రూపం బనవరతము నిలచెడు నటులన్
నా రసనను నీ నామము
ధారాళం బగుచు నాడ దయచేయు మయా

కం. శ్రీరామచంద్ర యోగీం
ద్రారాధ్య మహానుభావ దైత్యవిదళనా
యీరేడు లోకములలో
శూరులలో నీకు సాటి శూరుడు కలడే

కం. శ్రీరామచంద్ర నీదగు
తారకనామంబు చాలు ధారుణి ప్రజ సం
సారము దాటగ నని లో
నారసి నిను చేరియుందు రఖిలసుజనులున్

కం. శ్రీరామచంద్ర ధర్మము
నీ రూపము దాల్చి వచ్చి నిలచినటులుగా
మారీచు డన్న మాటకు
భూరియశము కల్గి వాడు పొందెను ముక్తిన్

17, నవంబర్ 2018, శనివారం

శ్రీరామచంద్ర కందములు - 1


కం. శ్రీరామచంద్ర నీవే
చేరువగా బిలువవలయు జీవుని వాడే
తీరున తానై వెదకుచు
చేరగలాడయ్య నిన్ను శ్రితమందారా

కం. శ్రీరామచంద్ర లోకా
ధారా నీయందు భక్తి తాత్పర్యంబుల్
ధారాళంబగుచో సం
సారంబునతిక్రమించ జాలుదురు నరుల్

కం. శ్రీరామచంద్ర విద్యలు
నేరిచి ఫలమేమి లోన నిన్నెఱుగనిచో
నేరిచెనా నీ నామము
కూరిమితో విద్యలెల్ల కొలిచిన యటులే

కం. శ్రీరామచంద్ర జగమున
ధీరులు నిక్కముగ బల్కు తెరగెట్లన్నన్
శ్రీరామచంద్రపాదాం
భోరుహముల కన్య మేల పూజించ నగున్

కం. శ్రీరామచంద్ర యీ భవ
వారాన్నిధి దాటదలచు వారల కెపుడున్
తీరము చేర్చెడు నౌకగ
నారూఢిగ నీదు నామ మలరుచు నుండున్

కం. శ్రీరామచంద్ర నృపతుల
పేరెన్నికగన్నవాడ విజ్ఞానులు నీ
పేరెన్నిపలుకుచుండెద
రారాటంబులు నశించు ననుచున్ భక్తిన్

కం. శ్రీరామచంద్ర ఆర్తుల
యారాటము దీర్చువాడ వయ్యును దయతో
ధారుణి నిదె నీపాదాం
భోరుహగతుడైన నన్ను బ్రోవ వదేలా

కం. శ్రీరామచంద్ర యీ సం
సారము నిస్సారమన్న సంగతి మున్నే
కారుణ్యముతో తెలిపిన
శ్రీరమణా యేల నన్ను చేదుకొన వయా

కం. శ్రీరామచంద్ర నీకొఱ
కారాటము హెచ్చుచుండె నతిదుస్సహమై
భారంబైనది యీ తను
ధారణ మిటు లెన్నినాళ్ళు దయచూడవయా


13, నవంబర్ 2018, మంగళవారం

ఇక్కడ మే ముంటి మని


ఇక్కడ మే ముంటి మని యెల్లరి కెఱుక మరి
యెక్కడ నీ వుంటివో యెవ్వరి కెఱుక

భవవార్థిలోతెంతో ప్రాణుల కే మెఱుక యది
వివరముగ తెలిసిన నీ వివర మెవరి కెఱుక
కువలయమున మాకు నీవు కొంత చెప్ప కెఱుక
యెవర మెటు పోదుమో యెవ్వరి కెఱుక

దగ్గరనే యుంటివో దవ్వులనే యుంటివో
లగ్గుగ మా కెఱుక గాదు లక్షజన్మలకును
మ్రొగ్గగు కుందగు మోసకారి మాయవలన
యెగ్గులణగు విధమేదో యెవ్వరి కెఱుక

అప్పుడెపుడొ రాముడవై యవతరించి వందురే
యిప్పుడెచట దాగితివో యెవ్వరి కెఱుక
అప్పటివలె రాక్షసులీ యవని నిండిరి కనుక
చప్పున చనుదెంచవయ్య శతకోటిదండాలు


11, నవంబర్ 2018, ఆదివారం

ఎంత వ్యామోహమే

ఎంత వ్యామోహమే యేమే ఓ చిలుకా
వింత పంజరమునే  విడువ లేవటే

లోకమంత నీదని నీ కెఱుకై.యుండగ
యే కొఱత లేకుండ యెగురుచుండగ
సౌకర్యము కాని పంజరమేల చొచ్చితివి
నీకన్న వెఱ్ఱి దీలోకాన కలదా

అన్నియు నీకైన నాటి హాయి చాలలేదటే
అన్నిట విహరించు నాటి హాయి చాలలేదటే
తిన్నగా ఒక పంజరాన దిగబడితివె చిలుకా
అన్నన్నా యెంత వెఱ్ఱి వైతివే చిలుకా

ఇప్పటికిని మించిపోయినది లేదు చిలుకా
అప్పడిదే రాముడై యరుదెంచెను చిలుకా
తప్పక దయజూచును దండమిడవె చిలుకా
చప్పున బయటపడవె చక్కని చిలుకా


10, నవంబర్ 2018, శనివారం

ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని


ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
ఒకే ఒక రాముడే యున్నాడు కావున

రామాయణ మన నేమి రాముని మార్గము
రాముడనే వాడు లోక రంజకుడై
భూమిసుతాసమేతుడై సౌమిత్రీయుక్తుడై
భూమి నెట్లు చరించెనా పుణ్యచరిత్రము

ఆరాముని కథ చక్కగ నందించెను వాల్మీకి
భారతజాతి యేమి ప్రపంచ మెల్ల
ఆరాధించు చున్నది అందమైన చరితమది
తారకలున్నంతవరకు ధరపైన నిలుచునది

ఉన్న ఒకే రామకథకు కొన్ని క్రొత్తరంగులద్ది
వన్నెలు చెడగొట్ట కోరు వారరుదెంచి
యెన్నియత్నాలు చేసి యెంత గోలపెట్టినా
చిన్నబోవునా యేమి శ్రీరాముని కీర్తి

ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని


ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
ఒకే ఒక రాముడే యున్నాడు కావున

నిన్న ప్రచురించబడిన ఒక  బ్లాగుటపా అనేక రామాయణాలు - తెలుగు అనువాదం: పి.సత్యవతి అనేది ఈ రోజు (2018 నవంబరు10)న చూసాను.

MANY RAMAYANAS : The Diversity of a Narrative Tradition in South Asia  (edited by Paula Richman, University of California Press, Bderkeley, Los Angeles, USA, 1991) అనే ఒక పుస్తకానికి పి. సత్యవతి గారి తెలుగు అనువాదం గురించి ఆ బ్లాగుటపా వివరిస్తున్నది.

అ టపా ఎత్తుగడలోనే ఎవరో సుగత శ్రీనివాసరాజు (పత్రికా రచయిత్రి) గారి ఉవాచ ఒకటి కనిపిస్తోంది.  ''రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది'' అని ఆవిడ ఆక్షేపణ వాక్యాలతో టపా మొదలు కావటంతో రెండు విషయాలు స్ఫుటం అవుతున్నాయి. మొదటిది ఆపుస్తకం అధునాతనమైన వామపక్షాది మేధావుల మనోవికాసజనితమైన రామద్వేషం అనే చిగురుకొమ్మగా ఉన్న సనాతనభారతీయసంస్కృతీవిద్వేషవృక్షం. రెండవది సదరు మేధావులకు విద్యార్థిలోకాన్ని గురిచేసుకొని తమతమవిద్వేషభావజాలవ్యాప్తికోసం అహరహం చేస్తున్నకృషి,

బ్లాగుటపా రచనాకారుడి పుస్తకపరిచయ కథనం "భారతదేశ చరిత్రలో అనేక రామ కథలున్నాయి" అన్న వాక్యంతో ప్రారంభం అవుతున్నది.

ఈ అభిప్రాయం శుధ్ధతప్పు. (నిజానికి శుధ్ధతప్పు అనేది ఎంత ప్రాచుర్యంలో ఉన్నా అది తప్పుడు సమాసమే అన్నది వేరే విషయం.)

ఒక వ్యక్తికి ఒక జీవితమే ఉంటుంది. అందులో మనం ఎన్ని పార్శ్వ్యాలను దర్శించినా సరే.

ఉన్నది ఒకే రాముడు.

ఆ వ్యక్తి గురించి పదిమంది పదిరకాలుగా ఆలోచించి పదోపాతికో పుస్తకాలు రచించితే ఆ పుస్తకాల లెక్క ఎంతో అంతమందిగా అతడు మారిపోతాడా?

ఆ పుస్తకాలను చదివి స్ఫూర్తిపొందినవాళ్ళు మరో బుట్టెడు పుస్తకాలనూ, ఆ పుస్తకాలను మెచ్చని లేదా మెచ్చలేని వాళ్ళు మరో తట్టెడు పుస్తకాలనూ అదే వ్యక్తి గురించి విరచించి జనం మీదకు వదిలితే ఆ మూలవ్యక్తి కాస్తా అంతమంది వ్యక్తులుగా మారిపోతాడా?

ఉన్నది మొదట ఒకే ఒక వ్యక్తి కదా?

జనంలో కొందరు తమతమ బుధ్ధిజనితవాదాల రంగుల కళ్ళద్దాలు పెట్టుకొని ఆ వ్యక్తిని వివిధంగా ఉన్నాడని వ్యాఖ్యానిస్తే అతడు అనేక మూర్తులుగా ఎలా మారిపోతాడూ అని వివేకవంతులకు తప్పక అనిపిస్తుంది.

ఇక్కడ కొందరు పాఠకులు ఒక అనుమానం వ్యక్తం చేయవచ్చును. అనేక రామకథలున్నాయీ అనటంలో ఉద్దేశం అనేక మంది రాముళ్ళున్నారూ అని చెప్పటం కాదూ, రామకథను అనేకులు అనేక విధాలుగా గ్రంథస్థం చేసారూ అని చెప్పటం మాత్రమే కావచ్చును కదా ఆవేశపడటం అవసరమా అని.

అవును నిజమే.

అలా అనుకోవటమూ న్యాయమే అనిపిస్తుంది.

కాని అటువంటి సందర్భంలో అనేక రామకథలు ఉన్నాయి అనకుండా భారతదేశ చరిత్రలో రామకథను అనేకమంది వివిధంగా గ్రంథస్తం చేసారు అని అనవచ్చును కదా స్పష్టంగా? కావాలనే అలా అనరు లెండి. వారికి కావలసినది రామకథకు ఉన్న ప్రామాణికతను దెబ్బతీయటం కోసం రామకథకు వాల్మీకికి ఉన్న అవినాభావసంబంధాన్ని నిరసించి ప్రక్కకు తోయటం.

ఆ సుగత గారి "రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది'' అన్న అక్షేపణలో రాముణ్ణి ఆదర్శానికి ప్రతీకగా చెప్పటం పైన -అంటే- అలా చెప్పిన వాల్మీకి రామాయణం పైన నిరసన ఎంత స్పష్టంగా ఉందో తెలియటం లేదా మనకి?

హిందూత్వవాదులు అంటూ సనాతనధర్మాన్ని ఎద్దేవా చేసే ఈ మేథావిగారి ఉవాచలో రాముణ్ణి ఈ భరతజాతి ఎంతో కాలంగా ఆదర్శపురుషుడిగా కొలవటం పైన ఉన్న ఆందోళన విస్పష్టంగా ఉన్నదా లేదా చెప్పండి.

ఇటువంటి (అంటే వాల్మీకంవంటి) రామాయణం నచ్చటం పట్ల ఈ వర్గం మేథావులకు అక్షేపణ ఉందే, మరి వారి దృష్టిలో ఎటువంటి రామాయణం జనానికి నచ్చదగినదీ అన్న ప్రశ్న వస్తున్నది కదా. దానికి సమాధానం ఏమిటీ?

నిజం చెప్పాలంటే ఈ మేథావుల దృష్టిలో రామాయణం ఎవరు ఎలాగు చెప్పినా మెచ్చదగినది కానేకాదు. వారి దృష్టిలో రాముడు ఒక అభూతకల్పన. ఉన్నాడని ఆ వాల్మీకి అతడి చరిత్రను ఒక ఆదర్శపురుషమూర్తి కథలాగా చెప్పటం హర్షణీయం కాదు.  జనం ఆ వాల్మీకి రామాయణాన్ని ఆదరించకూడదు. వాల్మీకి గొప్ప యేమీ లేదు. ఇంకా బోలెడు మంది రామకథను వ్రాసారు. వాల్మీకితో సదరు రామాయణాలన్నీ కలేసి చూడాలి కాని వాల్మీకి చెప్పాడు కదా అని రాముడు గొప్పవాడూ - అతడి జీవితం మనకి ఆదర్శం వంటి దృష్టితో వాల్మీకి ఇచ్చిన రాముడిని గొప్పవాడిని చేయకూడదు. ఇలాంటిది ఈ మేథావుల దృక్పథం. ఈ అధునాతన దృక్పథానికి ఫలంగా జాతికి వీరు అందించే మహత్తర విజ్ఞానఫలం ఏమిటంటే జాతిదృష్టిలో రాముడి పట్ల ఆరాధనాభావం నశించి దానిస్థానంలో రాముడిపై ద్వేషం పెరిగి నవచైతన్యంతో యావజ్జాతీ ధర్మభ్రష్టులు కావటం.

ఏదైనా కొత్తవిషయాన్ని జనం బుర్రలోనికి చక్కగా ఎక్కించాలంటే, పైగా అది తరతరాలకు నిలచిపోయే విధంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. అది చిన్నపిల్లల తలల్లో దట్టించటం.

ఈ దేశంలో ఒక ఆచారం ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుండి తాతలూ బామ్మలనుండీ ఇంకా ఇతర కుటుంబ పెద్దలనుండీ రామకథ పిల్లలకు అందటం సహజం ఐపోయింది.

శ్రీకృష్ణకర్ణామృతం అని లీలాశుకుడి ప్రసిధ్ధ గంథం ఒకటి ఉంది. అందులోని ఒక శ్లోకం చూడండి.

రామో  నామ బభూవ  హుం తదబలా సీతేతి హుం తౌ పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
కృష్ణేనేతి పురాతనీం నిజకథామాకర్ణ్య మాత్రేరితాం
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ:

యశోద చిన్ని కృష్ణుడికి రామకథ చెబుతున్నది.

ఆమె 'రాముడని ఒకడున్నాడు' అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'ఆ రాముడి భార్య పేరు సీత' అనగానే  కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'ఆ రాముడూ అతని భార్యా కూడా పెద్దల ఆజ్ఞమేరకు పంచవటి అనే చోట ఉంటున్నారు'  అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'అక్కడ ఆ పంచవటిలో ఆ సీతను రావణు డనే వాడు ఎత్తుకొని పోయాడు' అన్నది.
ఎప్పుడైతే 'సీతను రావణుడు ఎత్తుకొని పోయాడు' అని యశోద అన్నదో అ తక్షణం కునికిపాట్లతో ఊఁ ఊఁ అంటున్న చిన్ని కృష్ణుడు రామావతారంలోని వెళ్ళిపోయాడు.  వెంటనే కంగారుగా 'లక్ష్మణా ఏది నా విల్లేది నావిల్లేది' అని బొబ్బలు పెట్టాడు.

అలా రావణప్రసక్తి రాగానే వెంటనే రామావతారంలోనికి దుమికిన బాలకృష్ణుడు రక్షించుగాక అని కవి అంటున్నాడు. శ్రీరామకర్ణామృతం అని శంకరభగవత్పాదుల గంథం ఒకటి ఉంది. అందులోనూ ఈ శ్లోకం కనిపిస్తోంది.

ఇలా తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా రాముడి ఆదర్శవ్యక్తిత్త్వం ఈ భారత జాతికి స్ఫూర్తినిస్తున్నది.

ఈ స్ఫూర్తిని దెబ్బకొట్టాలంటే రామాయణం యొక్క గొప్పయేమీ లేదని చెప్పాలి. రాముడు హీనచరిత్రుడు అని కూడా వీలైనంతగా చెప్పాలి. అదీ పిల్లలకి చెప్పాలి.

ఇంతకంటే ఘోరం ఉంటుందా?

అసలు ఇన్ని రామాయణాలెక్కడివి? వాల్మీకి చెప్పక ముందు రామకథ ఎక్కడ? వాల్మీకి చెప్పిన రాముడు ఎవరు?
ఆ రాముడు ఒక ఆదర్శవ్యక్తి సరే.

ఆ రాముడు కల్పిత పాత్ర ఐతే ఆపాత్రను సృజించిన ఘనతను వాల్మీకినుండి ఎందుకు ఎవరు ఎలా గుంజుకుంటారు? అలా గుంజుకోవటం న్యాయం ఎలా అవుతుంది? వాల్మీకి తరువాత ఆయన సృజించిన పాత్రకు ఇతరులు ఎలా హక్కుదారులు అవుతారండీ?

ఆ రాముడు చారిత్రక వ్యక్తి ఐతే, ఆయన కథను మొట్టమొదట గ్రంథస్థం చేసి జాతికి అందించినది వాల్మీకి. ఇప్పుడు వాల్మీకి తరువాత తండోపతండాలుగా వచ్చిన పునఃకథనాలు వాల్మీకి నుండి భిన్నంగా ఉంటే తప్పు అవుతుంది కాని వాల్మీకి చెప్పనిదేదో వాళ్ళు చెప్పినట్లు మనం ఎలా తీర్మానిస్తాం? అది కాక వాల్మీకికి కొన్ని వందల వేల సంవత్సరాల తరువాత వచ్చిన వాళ్ళ రచనలలో వాల్మీకికిమించి ప్రామాణిక కథనం ఎలా వస్తుంది? అలా వస్తున్నది అని చెప్పటం అమానుషం కాదా?

ఇప్పుడు అనేకరామాయణాల ఆధారంతో రామకథను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం అనే వ్యవహారం నేటి చరిత్రకారులూ మేధావులూ ఎలా చేస్తారూ? వందలకొద్దీ ఉన్న పిల్లరామకథలన్నీ కలేసి వాల్మీకి రాముడికి కొత్తరూపురేఖలు దిద్దటం అనే నవీనశాస్త్రీయకర్మకలాపం చేస్తారా? అసలు రాముడే లేడని సిధ్ధాంతం చేస్తారా?

రాముడి కథ తెలియాలంటే వాల్మీకి అధారం.
ఇతరులు వేరేగా అందంగానో వికారంగానో కొత్తకొత్త కథలు చెబితే అవి రామకథలు కాలేవు. అవి ప్రామాణికాలు కాలేవు.

రాముణ్ణి భారతజాతికి దూరం చేయాలని కుహనామేధావులు పన్నుతున్న కుట్రల్ని తిప్పికొట్టండి!

7, నవంబర్ 2018, బుధవారం

శ్రీమన్నామ ప్రోచ్య


శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యాం
కేనప్రాప్నుర్వాంఛితం పాపినోౕ౽పి
హానః పూర్వం వాక్ప్రవృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్

భావం. నారాయణ నామం శ్రీమంతమైనది. అంటే సమస్త సంపదలతో ప్రకాశించేది, అంటే ఆనామమే సమస్తమైన సంపదయునూ అని జీవులు భావించవలసినది. అందుచేత ఎంత పాపాత్ముడైనా సరే ఆ నారాయణ నామాన్ని స్మరిస్తే సమస్తమైన శుభాలూ కలుగుతాయి. అయ్యో నేను పూర్వజన్మలలో అలా నారాయణ నామగానం చేయలేదు కాబోలు. అందుకే నాకు గర్బవాసం వంటి దుఃఖాలు కలిగాయి

అనువాదం.

తే. పాపి నారాయణా యన్న వాంఛితంబు
పొందు నందురు నేనేల పొంద ననగ
మునుపు జిహ్వ నారాయణా యనమి నేడు
గర్భవాసాది దుఃఖముల్ కనుచు నుంటి


5, నవంబర్ 2018, సోమవారం

ఒకరి కొకరము


ఒకరి కొకర మండగా నుండవలయును
సకలేశ్వర నీవు నాకు చక్కని యండవు

తోడుగా నన్ను నీవు తొలుత కల్పించుకొని
యాడుకొనుట మొదలిడితి వల్లనాడు
వేడుకగా నీకొఱకై వివిధరూపములతో
యాడుచుంటి నొంటివాడ వగుదువే నీవు

ఆదమరచితే నే నలసితే సొలసితే
వేదనలకులొంగి నిర్విణ్ణుడనైన
ఆదుకొను వాడవై చేదుకొనువాడవై
ఓదయామయ నన్నొంటిగా విడువవు

ఆటలో గడువరాని యడ్డంకు లెదురైన
ఓటమితథ్యమై యుండువేళైన
వాటముగ స్వయముగ వచ్చియాడెదవు
నాటి రామాకృతి నాకొఱ కెత్తినదే


2, నవంబర్ 2018, శుక్రవారం

ఇంతకంటె భాగ్యము


ఇంతకంటె భాగ్య మిం కేమున్నది
చింతదీర్చు మంత్రమే చేజిక్కినది

ఎన్నిజన్మలెత్తి చేసుకున్న పుణ్యఫలమో
ఇన్నాళ్ళకు నాబుధ్ధి కిది చిక్కినది
ఎన్ని శ్రీరాముడే నాకిచ్చిను నా నెంచు
కొన్నాను దీనిని కూర్మిభజింతును

సౌమిత్రి దీనిని సాధించుకొనె తొలుత
సామీరి కిది యబ్బె చక్కగాను పిదప
ఆ మీదను విభీషణాదులందుకొనిరిది
సామాన్యమా మోక్షసాధనామంత్రమిది

ఏను యోగభ్రష్టుడనో యేమో గతజన్మమున
ఏను వాని కిష్ట్టుడనో యేమో యీజన్మమున
ధ్యానించ నాకు మోక్షధనమిచ్చు మంత్రము
శ్రీనాధుడిచ్చె నిదిగో చేగొంటి నిపుడు నేను

చెప్పరాని చింతల జీవుడా


చెప్పరాని చింతల జీవుడా రా
మప్పనే తలచ వేమందురా

పుట్టిన దాదిగా పొంచియున్న కాలుడటు
పుట్టెడుపాపాల బుగ్గైన బ్రతుకిటు
గట్టిగా నొక పుణ్యకార్యమే లేదాయె
పట్టవేలరా రామపాద మిప్పటికిని

ఉత్తుత్తివేదాంత మూడబొడచునది యేమి
బత్తిలేని పూజలకు ఫలితమేమి
కొత్తకొత్తమాటల గురువులిచ్చున దేమి
చిత్తముంచవేలరా శ్రీరామునిపైని

కల్లలాడియాడి తుదకు కొల్లపోవుట
చిల్లరవేషాలు వేసి చిన్నబోవుట
ఎల్లవేళ లందు నీ కిదియేగా జీవితము
చెల్లుసేసి దానికింక శ్రీరాము నెంచవేల

మొదటికి మోసమాయి


మొదటికి మోసమాయి ముచ్చటపడి భూమికి
నిదిగో దిగివచ్చిన దిందింతగ చేటాయె

తొట్టతొలి తప్పిదము దూరపుకొండల
నుట్టిపడు సోయగాల నుట్టిట్టి వనక
గట్టిగ నమ్మి నిన్ను కాదని పోవుట
మట్టిబొమ్మగా మార మంచిశాస్తి జరిగె

రెండవ తప్పిదము రీతి దప్పి నాలోన
నుండి నీ తలపులనే యెండించి నాడ
నిండారు కరుణతో నీవెంత పిలచిన
బండగుండె విననందుకు భలేశాస్త్రి జరిగె

ఇన్నాళ్ళకు తెలిసివచ్చి యెంత మొత్తుకొన్నను
నన్నుపట్టుకొన్న మాయ చిన్నది కాదాయె
అన్నా రామన్న ఆపన్నుడను దయచూపి
నన్ను విడిపించుమన్న నిన్నింక విడువను

ఎట్టివా డనక


ఎట్టివా డనక చేపట్టినాడే వాడు
గట్టియండనే యిచ్చి కాపాడుచున్నాడు

అతనునకు తండ్రియైన యచ్యుతుడు వాడు
అతనునకు బంటైన యర్భకుడు వీడు
పతితపావనుడు వాడు పతితు డేమొ వీడు
అతికినట్లు గొప్పబంధ మమరినది చూడు

కలికి చూపులవాడు కమలాక్షుడు వాడు
కలికిపైన చూపులుండు కాపురుషుడు వీడు
పలుకు సత్యము వాడు పలుకు నసత్యము వీడు
తెలియగ మంచి పొత్తే కలిసినది చూడు

ధర్మావతారుడు వాడు దశరథ రాముడు
ధర్మమెఱుగలేని వట్టి తామసికుడు వీడు
కర్మరహితుడు వాడు కర్మబధ్ధుడు వీడు
నిర్మలమగు స్నేహమిదే నిలచినది చూడు

1, నవంబర్ 2018, గురువారం

అందమైన విందు


అందమైన విందు గోవిందనామమే
యందరి నోళులకు నందరి చిత్తంబులకు

సుందరీమణులచూడ్కు లందాల విందులు
చెందిన నాడున్న తృప్తి చెడిననాడు లేదు
బందుగులందరును పొగడి పలుమాటలవిందుల
నందించెడు తృప్తి వారలిగినపుడు లేదు

ఇందందని తిరిగితిరిగి యేవేవో రుచిచూచి
యిందిరియములను మేపి యెన్నటికిని
కందువ కెనయైన తృప్తి కలుగమిని గమనించి
సందేహము కలిగి నట్టి సర్వజనావళికిని

ఇందిరారమమణుండే యందాలరాముడై
యందరికి పంచియిచ్చె నానందసంధాయక
మందమైన నామము కడు పసందైన నామమది
అందుకొన్న ముక్తిఫలము నందించెడు నామమది

హరివీరుడే


హరివీరుడే కలికి సరివీరుడై మెఱయు
హరినామములు వాని కస్త్రశస్త్రంబులు

వాడేమొ తామసికము పడవేయ తనమీద
వేడుక సత్త్వస్థనామము పెద్దబాణమై యణచు
వాడేమో మహామోహ బాణరాజమెత్తి వేయ
వీడు కామహానామము విరుగుడుగా వేయును

ఎగసి వాడు నిజకలిమాయ నెత్తి మొత్త జూచు
నగుచు వీడు మహామాయానామాస్త్రమును విడచు
తగుదు నని భోగాసక్తి దారుణాస్త్రమేయు నతడు
తెగవేయ యోగీశనామ దివ్యాస్త్ర మేయు వీడు

కలి చేతనున్న సకల కలుషశక్తు లస్త్రములు
తిలకించ విష్ణునామదివ్యాస్త్రముల చెడును
పొలసి వాడు వేసెనా విమూఢతాస్త్రమే యదియు
మలగు రామమహామంత్రమాహాత్మ్యమున జేసి

నాచేయి వదలక


నాచేయి వదలక నడిపించవయ్యా
నాచేయునవి నీకై చేయునవి కాన

నీ పనుపున నేను నేలకు దిగితిని
నీ పని చేయుచు నిలచితిని
కాపాడు నీవుండ కష్టమే మున్నదని
తాపము లెన్నైన తాళుకొనుచుంటిని

తప్పొప్పులెంచు వారు తగులుకొని నన్ను
నొప్పింతురు నిన్ను నొప్పింతురు
గొప్పకష్టములు వారు కూర్చెడు వేళలను
చప్పున చనుదెంచి సరసనే  నిలబడి

యేమరక నిను గూర్చి యెల్లపుడు పాడుటే
రామచంద్ర పని నాకు భూమిపైనను
నీమమొప్ప నీపనిని నే చేయు వేళలను
నా మార్గమున కడ్డుగా మాయ రాకుండ