10, నవంబర్ 2018, శనివారం

ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని


ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
ఒకే ఒక రాముడే యున్నాడు కావున

నిన్న ప్రచురించబడిన ఒక  బ్లాగుటపా అనేక రామాయణాలు - తెలుగు అనువాదం: పి.సత్యవతి అనేది ఈ రోజు (2018 నవంబరు10)న చూసాను.

MANY RAMAYANAS : The Diversity of a Narrative Tradition in South Asia  (edited by Paula Richman, University of California Press, Bderkeley, Los Angeles, USA, 1991) అనే ఒక పుస్తకానికి పి. సత్యవతి గారి తెలుగు అనువాదం గురించి ఆ బ్లాగుటపా వివరిస్తున్నది.

అ టపా ఎత్తుగడలోనే ఎవరో సుగత శ్రీనివాసరాజు (పత్రికా రచయిత్రి) గారి ఉవాచ ఒకటి కనిపిస్తోంది.  ''రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది'' అని ఆవిడ ఆక్షేపణ వాక్యాలతో టపా మొదలు కావటంతో రెండు విషయాలు స్ఫుటం అవుతున్నాయి. మొదటిది ఆపుస్తకం అధునాతనమైన వామపక్షాది మేధావుల మనోవికాసజనితమైన రామద్వేషం అనే చిగురుకొమ్మగా ఉన్న సనాతనభారతీయసంస్కృతీవిద్వేషవృక్షం. రెండవది సదరు మేధావులకు విద్యార్థిలోకాన్ని గురిచేసుకొని తమతమవిద్వేషభావజాలవ్యాప్తికోసం అహరహం చేస్తున్నకృషి,

బ్లాగుటపా రచనాకారుడి పుస్తకపరిచయ కథనం "భారతదేశ చరిత్రలో అనేక రామ కథలున్నాయి" అన్న వాక్యంతో ప్రారంభం అవుతున్నది.

ఈ అభిప్రాయం శుధ్ధతప్పు. (నిజానికి శుధ్ధతప్పు అనేది ఎంత ప్రాచుర్యంలో ఉన్నా అది తప్పుడు సమాసమే అన్నది వేరే విషయం.)

ఒక వ్యక్తికి ఒక జీవితమే ఉంటుంది. అందులో మనం ఎన్ని పార్శ్వ్యాలను దర్శించినా సరే.

ఉన్నది ఒకే రాముడు.

ఆ వ్యక్తి గురించి పదిమంది పదిరకాలుగా ఆలోచించి పదోపాతికో పుస్తకాలు రచించితే ఆ పుస్తకాల లెక్క ఎంతో అంతమందిగా అతడు మారిపోతాడా?

ఆ పుస్తకాలను చదివి స్ఫూర్తిపొందినవాళ్ళు మరో బుట్టెడు పుస్తకాలనూ, ఆ పుస్తకాలను మెచ్చని లేదా మెచ్చలేని వాళ్ళు మరో తట్టెడు పుస్తకాలనూ అదే వ్యక్తి గురించి విరచించి జనం మీదకు వదిలితే ఆ మూలవ్యక్తి కాస్తా అంతమంది వ్యక్తులుగా మారిపోతాడా?

ఉన్నది మొదట ఒకే ఒక వ్యక్తి కదా?

జనంలో కొందరు తమతమ బుధ్ధిజనితవాదాల రంగుల కళ్ళద్దాలు పెట్టుకొని ఆ వ్యక్తిని వివిధంగా ఉన్నాడని వ్యాఖ్యానిస్తే అతడు అనేక మూర్తులుగా ఎలా మారిపోతాడూ అని వివేకవంతులకు తప్పక అనిపిస్తుంది.

ఇక్కడ కొందరు పాఠకులు ఒక అనుమానం వ్యక్తం చేయవచ్చును. అనేక రామకథలున్నాయీ అనటంలో ఉద్దేశం అనేక మంది రాముళ్ళున్నారూ అని చెప్పటం కాదూ, రామకథను అనేకులు అనేక విధాలుగా గ్రంథస్థం చేసారూ అని చెప్పటం మాత్రమే కావచ్చును కదా ఆవేశపడటం అవసరమా అని.

అవును నిజమే.

అలా అనుకోవటమూ న్యాయమే అనిపిస్తుంది.

కాని అటువంటి సందర్భంలో అనేక రామకథలు ఉన్నాయి అనకుండా భారతదేశ చరిత్రలో రామకథను అనేకమంది వివిధంగా గ్రంథస్తం చేసారు అని అనవచ్చును కదా స్పష్టంగా? కావాలనే అలా అనరు లెండి. వారికి కావలసినది రామకథకు ఉన్న ప్రామాణికతను దెబ్బతీయటం కోసం రామకథకు వాల్మీకికి ఉన్న అవినాభావసంబంధాన్ని నిరసించి ప్రక్కకు తోయటం.

ఆ సుగత గారి "రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది'' అన్న అక్షేపణలో రాముణ్ణి ఆదర్శానికి ప్రతీకగా చెప్పటం పైన -అంటే- అలా చెప్పిన వాల్మీకి రామాయణం పైన నిరసన ఎంత స్పష్టంగా ఉందో తెలియటం లేదా మనకి?

హిందూత్వవాదులు అంటూ సనాతనధర్మాన్ని ఎద్దేవా చేసే ఈ మేథావిగారి ఉవాచలో రాముణ్ణి ఈ భరతజాతి ఎంతో కాలంగా ఆదర్శపురుషుడిగా కొలవటం పైన ఉన్న ఆందోళన విస్పష్టంగా ఉన్నదా లేదా చెప్పండి.

ఇటువంటి (అంటే వాల్మీకంవంటి) రామాయణం నచ్చటం పట్ల ఈ వర్గం మేథావులకు అక్షేపణ ఉందే, మరి వారి దృష్టిలో ఎటువంటి రామాయణం జనానికి నచ్చదగినదీ అన్న ప్రశ్న వస్తున్నది కదా. దానికి సమాధానం ఏమిటీ?

నిజం చెప్పాలంటే ఈ మేథావుల దృష్టిలో రామాయణం ఎవరు ఎలాగు చెప్పినా మెచ్చదగినది కానేకాదు. వారి దృష్టిలో రాముడు ఒక అభూతకల్పన. ఉన్నాడని ఆ వాల్మీకి అతడి చరిత్రను ఒక ఆదర్శపురుషమూర్తి కథలాగా చెప్పటం హర్షణీయం కాదు.  జనం ఆ వాల్మీకి రామాయణాన్ని ఆదరించకూడదు. వాల్మీకి గొప్ప యేమీ లేదు. ఇంకా బోలెడు మంది రామకథను వ్రాసారు. వాల్మీకితో సదరు రామాయణాలన్నీ కలేసి చూడాలి కాని వాల్మీకి చెప్పాడు కదా అని రాముడు గొప్పవాడూ - అతడి జీవితం మనకి ఆదర్శం వంటి దృష్టితో వాల్మీకి ఇచ్చిన రాముడిని గొప్పవాడిని చేయకూడదు. ఇలాంటిది ఈ మేథావుల దృక్పథం. ఈ అధునాతన దృక్పథానికి ఫలంగా జాతికి వీరు అందించే మహత్తర విజ్ఞానఫలం ఏమిటంటే జాతిదృష్టిలో రాముడి పట్ల ఆరాధనాభావం నశించి దానిస్థానంలో రాముడిపై ద్వేషం పెరిగి నవచైతన్యంతో యావజ్జాతీ ధర్మభ్రష్టులు కావటం.

ఏదైనా కొత్తవిషయాన్ని జనం బుర్రలోనికి చక్కగా ఎక్కించాలంటే, పైగా అది తరతరాలకు నిలచిపోయే విధంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. అది చిన్నపిల్లల తలల్లో దట్టించటం.

ఈ దేశంలో ఒక ఆచారం ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుండి తాతలూ బామ్మలనుండీ ఇంకా ఇతర కుటుంబ పెద్దలనుండీ రామకథ పిల్లలకు అందటం సహజం ఐపోయింది.

శ్రీకృష్ణకర్ణామృతం అని లీలాశుకుడి ప్రసిధ్ధ గంథం ఒకటి ఉంది. అందులోని ఒక శ్లోకం చూడండి.

రామో  నామ బభూవ  హుం తదబలా సీతేతి హుం తౌ పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
కృష్ణేనేతి పురాతనీం నిజకథామాకర్ణ్య మాత్రేరితాం
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ:

యశోద చిన్ని కృష్ణుడికి రామకథ చెబుతున్నది.

ఆమె 'రాముడని ఒకడున్నాడు' అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'ఆ రాముడి భార్య పేరు సీత' అనగానే  కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'ఆ రాముడూ అతని భార్యా కూడా పెద్దల ఆజ్ఞమేరకు పంచవటి అనే చోట ఉంటున్నారు'  అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'అక్కడ ఆ పంచవటిలో ఆ సీతను రావణు డనే వాడు ఎత్తుకొని పోయాడు' అన్నది.
ఎప్పుడైతే 'సీతను రావణుడు ఎత్తుకొని పోయాడు' అని యశోద అన్నదో అ తక్షణం కునికిపాట్లతో ఊఁ ఊఁ అంటున్న చిన్ని కృష్ణుడు రామావతారంలోని వెళ్ళిపోయాడు.  వెంటనే కంగారుగా 'లక్ష్మణా ఏది నా విల్లేది నావిల్లేది' అని బొబ్బలు పెట్టాడు.

అలా రావణప్రసక్తి రాగానే వెంటనే రామావతారంలోనికి దుమికిన బాలకృష్ణుడు రక్షించుగాక అని కవి అంటున్నాడు. శ్రీరామకర్ణామృతం అని శంకరభగవత్పాదుల గంథం ఒకటి ఉంది. అందులోనూ ఈ శ్లోకం కనిపిస్తోంది.

ఇలా తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా రాముడి ఆదర్శవ్యక్తిత్త్వం ఈ భారత జాతికి స్ఫూర్తినిస్తున్నది.

ఈ స్ఫూర్తిని దెబ్బకొట్టాలంటే రామాయణం యొక్క గొప్పయేమీ లేదని చెప్పాలి. రాముడు హీనచరిత్రుడు అని కూడా వీలైనంతగా చెప్పాలి. అదీ పిల్లలకి చెప్పాలి.

ఇంతకంటే ఘోరం ఉంటుందా?

అసలు ఇన్ని రామాయణాలెక్కడివి? వాల్మీకి చెప్పక ముందు రామకథ ఎక్కడ? వాల్మీకి చెప్పిన రాముడు ఎవరు?
ఆ రాముడు ఒక ఆదర్శవ్యక్తి సరే.

ఆ రాముడు కల్పిత పాత్ర ఐతే ఆపాత్రను సృజించిన ఘనతను వాల్మీకినుండి ఎందుకు ఎవరు ఎలా గుంజుకుంటారు? అలా గుంజుకోవటం న్యాయం ఎలా అవుతుంది? వాల్మీకి తరువాత ఆయన సృజించిన పాత్రకు ఇతరులు ఎలా హక్కుదారులు అవుతారండీ?

ఆ రాముడు చారిత్రక వ్యక్తి ఐతే, ఆయన కథను మొట్టమొదట గ్రంథస్థం చేసి జాతికి అందించినది వాల్మీకి. ఇప్పుడు వాల్మీకి తరువాత తండోపతండాలుగా వచ్చిన పునఃకథనాలు వాల్మీకి నుండి భిన్నంగా ఉంటే తప్పు అవుతుంది కాని వాల్మీకి చెప్పనిదేదో వాళ్ళు చెప్పినట్లు మనం ఎలా తీర్మానిస్తాం? అది కాక వాల్మీకికి కొన్ని వందల వేల సంవత్సరాల తరువాత వచ్చిన వాళ్ళ రచనలలో వాల్మీకికిమించి ప్రామాణిక కథనం ఎలా వస్తుంది? అలా వస్తున్నది అని చెప్పటం అమానుషం కాదా?

ఇప్పుడు అనేకరామాయణాల ఆధారంతో రామకథను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం అనే వ్యవహారం నేటి చరిత్రకారులూ మేధావులూ ఎలా చేస్తారూ? వందలకొద్దీ ఉన్న పిల్లరామకథలన్నీ కలేసి వాల్మీకి రాముడికి కొత్తరూపురేఖలు దిద్దటం అనే నవీనశాస్త్రీయకర్మకలాపం చేస్తారా? అసలు రాముడే లేడని సిధ్ధాంతం చేస్తారా?

రాముడి కథ తెలియాలంటే వాల్మీకి అధారం.
ఇతరులు వేరేగా అందంగానో వికారంగానో కొత్తకొత్త కథలు చెబితే అవి రామకథలు కాలేవు. అవి ప్రామాణికాలు కాలేవు.

రాముణ్ణి భారతజాతికి దూరం చేయాలని కుహనామేధావులు పన్నుతున్న కుట్రల్ని తిప్పికొట్టండి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.