18, నవంబర్ 2018, ఆదివారం

శ్రీరామచంద్ర కందములు - 3


కం. శ్రీరామచంద్ర లోకపు
తీ రెఱిగియు నప్పుడపుడు తెఱలును మది నే
నారూఢుడ గాకుండుట
కారణముగ దోచు నీవు కరుణించ గదే

కం. శ్రీరామచంద్ర తనువులు
నీరములం బుడగలట్టి నిర్మాణంబుల్
కారణకారణ నీదయ
కారణముగ రాగమణగు గాక తనువులన్

కం. శ్రీరామచంద్ర లోకో
ధ్ధారక నీ దయను కాక తరియింతు రొకో
ధారుణి నరులొక నాటికి
వేరెరుగను నీకు నన్ను విడువకు తండ్రీ

కం. శ్రీరామచంద్ర మును నే
నేరిచి నీ ధ్యానమెంత నిపుణతమీఱం
గూరిమితో జేసితినో
వేరెఱుగదు నేడు మనసు విజ్ఞానమయా

కం. శ్రీరామచంద్ర వైదే
హీరమణ సమస్తలోకహితకర శౌరీ
పారాయణ మొనరింతురు
నీ రమణీయచరితము మనీషులు పుడమిన్

కం. శ్రీరామచంద్ర జీవులు
నేరరు కలిమాయ లెఱిగి నిలచు విధములన్
కారుణ్యమూర్తి వీవే
వారల కొక దారి చూపవలయును తండ్రీ

కం. శ్రీరామచంద్ర పెద్దల
నూరక నిందించువార లుందురు ధరణిన్
వా రెఱుగరు తమకే యవి
నారాచము లగుచు తగులు నా నించుకయున్

కం. శ్రీరామచంద్ర సుజనులు
క్రూరాత్ముల వలన కొంత కుందువడినచో
వారికి కలుగు విచారము
వీరికి మున్ముందు కలుగు భీతి దలచియే

కం. శ్రీరామచంద్ర ప్రాజ్ఞులు
కోరెదరా యొకరి చెడుగు కువలయనాథా
కోరెదరందరి సేమము
క్రూరాత్ములకైన శుభము కోరెద రెపుడున్


2 కామెంట్‌లు:

  1. ఇవి కొంత వేగిరపాటుతో రచించినట్లు ఉన్నారు. స్ఖాలిత్యాలు కనిపిస్తున్నాయి.
    ఒకటవ పద్యం మూడవ పాదం,ఏడవ పద్యం నాల్గవ పాదం సరిచేయగలరు.
    "నూరక నిందించు వారలుందురు..." అంటే వారునుందురు కన్నా బాగుంటుందేమో చూడండి.
    "పారాయణ" పదం మీద చెళ్లపిళ్ల వారు పెద్ద చర్చ చేశారు కథలు గాథల్లో. అయినా "పారాయణమే" శ్రుతి సుభగంగా నిర్దోషంగా ఉంటుందనేది నా అభిమతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమండీ. ఇంట అతిథులున్నారు. పరిశీలించి సరిచేయాలి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.