25, నవంబర్ 2018, ఆదివారం

శ్రీరామచంద్ర కందములు - 4


కం. శ్రీరామచంద్ర! రుచిర
స్మేరా! దశరథ కుమార! శ్రిత మందారా!
ధీరా! కరుణా పారా
వారా! నను బ్రోవుమయ్య! పాపవిదారా *

కం. శ్రీరామచంద్ర మాయా
మారీచప్రాణహరణ స్మరకోటిసమా
కారా జలనిథిబంధన
ఘోరభవారణ్యదహన గుణవారినిధీ

కం. శ్రీరామచంద్ర సుజనా
ధారా సురవైరిగణవిదారా గుణకా
సారా సేవకజనమం
దారా సంసారవార్థితారకనామా

కం. శ్రీరామచంద్ర నీవై
ఘోరాటవులందు తిరుగ కోరక నీవై
కోరక రాకాసులతో
వైరము నవి కలిగె నెందు వలనం జెపుమా

కం. శ్రీరామచంద్ర ఘోరా
కారిణియా చుప్పనాక కదియగ నేలా
యా రావణు డడగుట కది
కారణ మగు టేల దైవఘటనము కాదా

కం. శ్రీరామచంద్ర కాలపు
తీరెఱిగెడు వారు కారు దేవతలైనన్
వారింపరాని కాలము
శ్రీరమణా నీకళావిశేషమె కాదా

కం. శ్రీరామచంద్ర శౌరివి
నీ రచనయె నరుడ వగుచు నేలకు దిగి దు
శ్చారిత్రుని పౌలస్త్యుని
ఘోరాజిని జంపు కథయు కువలయ నాథా

కం. శ్రీరామచంద్ర శాపము
తీరిన దటు కొంత జయుని దీనత బాపన్
నారాయణ నరుడవుగా
ధారుణి కరుదెంచినావు తామరసాక్షా

కం. శ్రీరామచంద్ర సుజనులు
ఘోరాపదలొంది విధము గొంకు వడినచో
వారల రక్షింప మహో
దారత నేరూపమైన దాల్చెదవు హరీ



* ఇది శ్రీవిష్ణునందన్ గారు అందించిన పద్యం.

5 కామెంట్‌లు:

  1. పద్యాలు బాగున్నాయి.
    'ఘోర భవారణ్య దహన గుణ వారినిధీ'లో ఉన్న వ్యంగ్యార్థం ఆకట్టుకుంది.
    మీరు రామాయణం వ్రాశారో లేదో తెలియదు. ఇలాగే కందాల్లో ఏకాక్షర ప్రాసతో సంక్షిప్త రామాయణ కథను గ్రథించడానికి వీలౌతుందేమో పరిశీలించగలరు.
    'కారణమగుటేల దైవ ఘటనము కాకన్'లో వ్యతిరేక క్త్వార్థము ద్రుతాంతము కాదు. దైవ ఘటనము కాదా అంటే సరిపోవచ్చు కానీ దైవ ఘటనము కాక మరేమిటి అనడం లో ఉన్నంత ఊనిక రాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విష్ణునందన్ గారూ,
      రామాయణం వ్రాయునంతటి శక్తికలవాడనా! ఆ ఊహయే అత్యాశయేమో నాబోటికి. ఐనా నాచేతిలో యేముంది. ఎప్పటికైనా రాముడే ఏదో విధంగా వ్రాయించుకొంటాడేమో చూడాలి.

      తొలగించండి
    2. విష్ణునందన్ గారూ,
      ఘోరభవారణ్యదహనగుణవారినిధీ అన్నది ఘోరభవారణ్యదహన, గుణవారినిధీ అని విడి సంబోధనలుగా కూదా చూడవచ్చును!

      తొలగించండి
  2. నారాయణ స్తోత్రం కూడా ఇలాగే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది.
    https://youtu.be/FciN8ChT_qU

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎంతమాట! పెద్దలు రచించిన నారాయణస్తోత్రంతో పోలిక! నారాయణస్తోత్రం ఆదిశంకరాచార్య విరచితం అంటారు. నేనేమో అల్పసత్త్వుణ్ణి! ఏదో ఉడుతాభక్తిగా వ్రాసుకుంటున్నానంతే. మీ అభిమానానికి ధన్యవాదాలు. మనోహరమైన నారాయణస్తోత్రం ఆడియోలింక్ పంపినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.