31, జనవరి 2019, గురువారం

సీతాపతీ ఓ సీతాపతీ నీ తప్పు లేదో సీతాపతీ


సీతాపతీ ఓ సీతాపతీ
నీ తప్పు లేదో సీతాపతీ

అక్కటా యేనాడో
ఒక్కనికిని పెట్టక
చిక్కిన దెల్ల బొక్కి
చిక్కున పడితినే సీతాపతి

పెట్టని నేరమునకు
పుట్టదాయె నా కిపుడు
గట్టి దుఃఖము కలిగె
చెట్టఫలము విడుచునా సీతాపతీ

అవకతవక బుధ్ధితో
ఎవరెవరి కష్టములనొ
అవహేళనము చేసితి
చివరకు చెడితినే సీతాపతి

గడువరాని బాధలే
నుడువరాని నిందలే
మెడను చుట్టుకొన నేడు
చిడిముడి పడనాయెను సీతాపతి

గాసిపడు నట్లునీవు
వేసినట్టి శిక్షచాలు
దోసకారి నిక కాను
చేసిన తప్పెరిగితిని సీతాపతి


ఇడుములబడ నేమిటి కిత డీశ్వరుడైతే


ఇడుముల బడ నేమిటి కిత డీశ్వరుడైతే
నడచుచున్నాడా హరి నరవేషమున

పడతి నెడబాసి దుఃఖపరవశు డగుచు
నడలు నకట నారాయణు డందువు శంభో
పుడమి నితర నరులభంగి పురుషోత్తముడు
పడుచుండియు దుఃఖము నీశ్వరుడై యుండు

పోయి పరీక్షించ బుధ్ధి పుట్టును పరమేశా
నీ యిష్టము పార్వతి నేను కాదన నేల
వేయుదును సీత వలె వేష మప్పు డాతడు
నా యుక్తిని గమనించునా యది చూచెదను

నారాయణి నరుడనై నడువ నాయె నాకు
శ్రీరాముడ నైయుంటి నారావణు వధింప
నీ రీతి నను జూడ నేల వచ్చితి వన
స్మేరానన యగుచు దేవి శ్రీహరి నగ్గించెను

వీడు విరచించునదేమి


వీడు విరచించున దేమి నేడైన రేపైన
వేడు కెల్ల నీదన్న విషయ మెరుగడే

మాయలో మునిగియున్న మానవుడైనట్టి వీని
చేయంది కీర్తనలను చిత్రంబుగను
వ్రాయించుకొను చుందు వయ్య నీ దివ్యకృప
చేయించు కాక వీడు చేయునదేమి

రామయ్య చూడ నీ రమ్యకీర్తనము లెల్ల
నీ మహిమ చాటగ నిశ్ఛయముగను
సామాన్యుడగు వీని సత్పాత్రు జేసెడు
నీ మహితసత్కృపానిర్ణయంబులే

ఎంచి వీని బుధ్ధిలో మంచిగాను చొరబారి
మంచిమంచి భావములు మాటలు నిచ్చి
పంచదార గుళికల వంటి మంచికీర్తనల
నంచితముగ చేయించునది నీవేగా

30, జనవరి 2019, బుధవారం

సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా


సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా
యే తీరున మాటలాడు నీనది శుభచరితుడా

నీటికొరకు వచ్ఛియన్న నిశ్చయముగ తెలియదా
యేటికి నా సీతజాడ యేమందువు లక్ష్మణా
పాటించుట మౌనమును పాడిగామి యెరుగదా
యేటికి నిర్దయను బూని యిటులున్నది లక్ష్మణా

ప్రీతిగల యక్క రఘువీరుల కీ గోదావరి
ఖ్యాతిగల కులవధువు గతి చెప్పదు లక్ష్మణా
చేతులు జోడించితే చెప్పునేమొ గోదావరి
చేతులిదే జోడించితి చెప్పు మనుము లక్ష్మణా

సీత నేడు రాకాసుల చేజిక్కుట చూచినదా
నాతో వచియించుటకు భీతిగొనెనొ లక్ష్మణా
ఈ తల్లికి తెలుపవే యితడు విష్ణుతేజుడని
సీతను రక్షించునని చెప్పు మనుము లక్ష్మణా

శ్రీవల్లభునే సేవించవలె కైవల్యమునే కాంక్షించవలె


శ్రీవల్లభునే సేవించవలె
కైవల్యమునే కాంక్షించవలె

అరఘడియయును శ్రీహరిసేవనమున
  కాటంకము రాకుండవలె
మరచి యితరములు తిరముగ చిత్తము
  హరిపాదంబుల నుండవలె
కరచరణము లవి హరిసేవల కుప
  కరణము లని భావించవలె
పరమపురుషుడగు హరినే తలచుచు
  పరమానందము పొందవలె

ధరపై శ్రీహరి పరబ్రహ్మమె
  దశరథసుతుడని తెలియవలె
పరమార్థము శ్రీరామబ్రహ్మమును
  భావించుచు లో నెఱుగవలె
నరపతి రాముని నమ్మి భజించుచు
   పరమానందము పొందవలె
తరింప రాముని తారకనాముని
  తహతహలాడుచు కొలువవలె
 
మరువక తారకమంత్రోపాసన
  నిరతము చేయుచు నుండవలె
హరిపారమ్యము నాత్మనెరింగిన
  హరిభక్తులతో చేరవలె
హరిసుగుణములును హరిసత్కథలును
  హరిలీలలనే తలచవలె
హరినామామృత మానుచు నిరతము
  పరమానందము పొందవలె

28, జనవరి 2019, సోమవారం

రచ్చరచ్చ చేసేవు రామభూతమా


రచ్చరచ్చ చేసేవు రామభూతమా నాకు
పిచ్చిపట్టించేవు పెద్దభూతమా

భూమిపై నెల్లెడల పొడగట్టు చుందువీవు
యేమందు నెల్లవేళ నాముందు నీవుందువే
యే మందు నింకనా కేకమాయె రేబవళ్ళు
రామభూతమా నీకు రవ్వంతయు జాలిలేదు

నీమాయలో జిక్కి నేనుండగ నెల్లవేళ
నీమాటలే నాకు నిరంతర మగుచు నుండ
భూమిపై జనులెల్ల బుధ్ధిహీను డనుచు నుండ
రామభూతమా నాదు  ప్రేమ కొల్ల గొట్టితివే

కామాది దుర్మిత్రగణము నెల్ల  ద్రోలినావు
పాములై పట్టినట్టి బంధములను విప్పినావు
వ్యామోహముల నెల్ల వదలించి వేసి నావు
రామభూతమా పట్టు నేమాత్రము సడలించకు

ఇతడేమి చేయునన నతని కీర్తించును


ఇతడేమి చేయునన నతని కీర్తించును
నతడేమి చేయునన నితని దీవించును

దినదినమును నిటు దివ్యకీర్తనము
మనసారగ నిత డొనరించుటయును
విని ముదమున దీవన లత డిచ్చుట
యును నీయిద్దరకును సహజములు

అతడెందుంచిన నితడందుండుచు
సతతము పొగడును చక్కగ నాతని
యతులితమహిమం బతిసంతసమున
నతడిత డాత్మీయత గలవారలు

జీవుం డీతడు సేవకుడు సఖుడు
దేవుడు రాముడు జీవేశు డతడు
భావించు నితడు పాడ నతనకై
దీవించు నతడు దీనవత్సలడు

26, జనవరి 2019, శనివారం

ముదమారగ నినుతలచుచు మురియుచుందు నెల్లప్పుడు


ముదమారగ నినుతలచుచు మురియుచుందు నెల్లప్పుడు
నిదురమాట మరచితిరా నిదురనన్ను విడచెనురా

కలలలోన నీరూపము తిలకించెడు మానసమున
మెలకువలో నీరూపమె మెదలుచున్న వేళలందు
కలలో నినుజూచుటకై కనులు మూసి నిదురింపగ
వలసిన పనియేమని నే భావింతునురా సఖుడా

అలసిసొలసి లోకులెల్ల రాదమరచి నిదురించ
కలుషితమగు మానసముల కల్లోలతరంగాల
యలజడి లేనట్టి వైన యందమైన రాత్రులందు
మెలకువతో నుండి నిన్ను పలుకరింతురా సఖుడా

ఎన్నెన్నో యూహలేమి ఏవేవో పలుకు లేమి
యన్నిటికిని వీలు సుమా యర్థరాత్రి సమయములు
ఎన్నెన్నో జన్మములుగ నిదే పనిగ గడచుచుండ
ఉన్నవయా పవళులడ్డు నన్నేలెడు రాముడా

పదితల లున్ననేమి పదిలమగు బుధ్ధిలేక


పదితల లున్ననేమి పదిలమగు బుధ్ధిలేక
చదువులు గలుగనేమి సరి వివేకము లేక

వరమడిగెడి వేళ వాడు వానరులను నరుల విడచె
నరులు వానరులవలన నాశనమును పొందె
వరగర్వము చేత వాడు బాధించెను లోకంబుల
హరిదాల్చెను నరవేషము నరకెను రావణుని తలలు

పరభామామణుల పట్టి పరిభవించు తుళువ తుదకు
పరసతివ్యామోహమునకు బలిచేసెను బ్రతుకును
నరనాథుడు శ్రీరాముడు నారాయణుడని యెఱుగక
ధరాత్మజను చెఱబట్టెను దానజేసి ధరను కూలె

ఇంద్రాదుల గెలిచె గాని యింద్రియముల కోడె నతడు
ఇంద్రాదులు పొగడ రాము డిలాసుతను గూడెను
సాంద్రకృపామూర్తియైన సాకేత విభుడు రామ
చంద్రమూర్తి స్వఛ్ఛ కీర్తి  శాశ్వతమై వెలుగొందెను

వాడెమో రాకాసి వీడేమో వెన్నుడు


వాడెమో రాకాసి వీడేమో వెన్నుడు
వేడుకగా సాగినది వింతముచ్చట

వాడు వచ్చె వీడు కొట్టె వాడు తూలి వనధిజొచ్చె
వాడిబాణమేల విడిచె వాని జంపక
వాడితోడ వచ్చినట్టి వాడు కాలి బూడిదాయె
చూడ తూలిపడినవాడు చుట్టమాయెనా

వాడు మరల వచ్చినాడు వీడు వాని జూచినాడు
వాడిగలవి వేసినాడు మూడుశరములు
వాడు మూడుబాణములకు కూడ దొరుక డేమివింత
వీడు వాని తరిమికొట్టి విడచిపెట్టెనా

లేడిరూపు దాల్చినాడు వాడు తిరిగి వచ్చినాడు
వాడు రామకథను ముఖ్య పాత్రధారి
వీడు వాని జంపె కాని విడచె నేల రెండు మార్లు
చూడ వెన్నుడల్లినట్టి సొంపగులీల


మారీచుడా నీవు మాయలేడివి కమ్ము


మారీచుడా నీవు మాయలేడివి కమ్ము
ఓ రావణా చావు కోరుకొనకుము పొమ్ము

రాము డల్పవిక్రముడగు సామాన్యమానవుడు
రామబాణ మెంతరుచో రాజా నేనెరుగుదు
రామపత్ని నపహరింప రాదని బోధించకు
రామునితో యాటలాడరాదని బోధింతును

ఆడుదానికే జడిసి  అయినవారల విడచి
వాడవదలి రాముడు వనములలో దూరెను
వాడు తండ్రియానగొని వనముల కరుదెంచెను
వాడిబాణములవాడు వానిజోలి కేగకు

దయలేని యారాముడు ధర్మమే మెరుగడు
దయాశాలి వాడు రూపుదాల్చినట్టి ధర్మము
నయమున సీతాపహరణమునకు తోడ్పడవో
అయిన పలికి లాభమేమి యటులనే కానిమ్ము


బంధములు వదిలించ వయ్య రామా


బంధములు వదిలించవయ్య రామా లేని
బంధముల నేనెటుల వదలించేది

తలిదండ్రులు నాలుబిడ్డ లందరి తోడను నాకు
కలవు కద బంధము లవి కాదనవశమా
కలవు సహదరులతో గట్టి వైన బంధములే
కలిగిన యీ బంధములు కల్లలనే యందువా

ఎవరు తల్లిదండ్రులయా ఎవ్వ రాలుబిడ్డలయా
ఎవరు నీ సహోదరు లెక్కడి వీ బంధములు
తవులుకొన్న వివియెల్ల తనువునకే కాదటోయి
తవులుకొన్న వని నీవే దయతో సెలవిచ్చితివి

తనుమాత్రుడ ననుకొన్న తగిలితోచు బంధములు
తనువు కన్న వేరైనది తత్వము నీకున్నది
వినుము శాశ్వతుడవు నీవు విధముతప్పి జీవుడవు
కనుగొంటిని మాయచేత కలిగినవీ బంధములని

25, జనవరి 2019, శుక్రవారం

ఓ యంటె ఓ యను ఓరామచంద్రమూర్తి


ఓ యంటె ఓ యను ఓరామచంద్రమూర్తి
మాయతెరను తొలగించి మన్నించవే

తెర కావల నుండి తెయితెక్క లాడించు దివ్యసుందర మూర్తివే
తెర కీవల నున్న దిగులుగొన్న జీవాత్మను తెరతీసి దీవించవే
చిరకాలము నుండి చెంగుచెంగున వీడు చిత్రచిత్రపు టాటల
తెరపిలేక యాడుచుండి చేవచచ్చి యున్నాడు తెరతీసి దీవించవే

మాయదారి మాయతెర మరగున నీవుండి మంచిగ నాడింతువే
మాయలోన చిక్కి వీడు మాయతెర కవలి నిన్ను మదినెంచ లేడాయనే
భయకారణంబైన భవదుఃఖమునకు మందు భావించ లేడాయెనే
భయము నివారించి భవనాటకము నాపి  దయజూప రాదటయ్యా

శ్రీరామచంద్ర నిన్ను చింతింప సుంత నేర్వ జీవుడు తమకించెనే
ఆరాటపడు వీని నమితకృపాంతరంగ యాశీర్వదించ వేగ
రారాద తెరచాటు నుండి నీవొక్కసారి కోర డింకేమి వీడు
కారాద నీదర్శనంబు చేత వీని యాట కట్టై సంసారవిముక్తి


తమకంబు మీఱ నిన్ను తలచేనో


తమకంబు మీఱ నిన్ను తలచేనో హరి
సుమధురముగ చాల పొగడ జూచేనో

సకలసుగుణరాశి రామ సుకుమార ఓ
వికచోత్పలనయన చంద్రబింబవదన
రకరకముల మిక్కిలి రసవంతముల
అకళంకముల కీర్తనముల నమరించేనో

చవులుపుట్టు చరిత రామచంద్ర నీది నా
కవనమందు ప్రతిబింబించి చెవులకింపై
యవధరించు వారి కెల్ల నమిత భక్తి
చివురించగ కీర్తనముల చేయువాడనో

తారకనామ రామ నిన్ను తలచువారి యే
కోరికైన నేల తీరకుండు నయ్య
ధారుణి నే నిలచునంత తడవు నిన్ను
సారెకు కీర్తించి నిన్ను చేరుకొందురా

సింగపూర్ నుండి జోరుగా వ్యూస్!!


ఈ మధ్య కాలంలో శ్యామలీయం బ్లాగుకు వ్యూస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

సాధారణంగా రోజుకు మహాఐతే 50 లేదా 100 వ్యూస్ వచ్చేవేమో. వారం పది రోజులనుండి కాబోలు చూస్తున్నాను, రోజువారీ వ్యూస్ 500+ నుండి 700+ వరకూ ఉంటున్నాయి.

ఏమి జరుగుతోందో అర్థం కావటం లేదు.

ఉన్నట్లుండి ఎక్కడో సింగపూర్‍లో ఉన్న చదువరులకు ఒక తెలుగు బ్లాగుపైన అంత అభిమానం పుట్టుకొని రావటం ఏమిటో చాలా తమాషాగా ఉంది. అందులోనూ ఈ శ్యామలీయం బ్లాగులో ఉండే దేమో అంతా రామమయంగా ఉన్న సాహిత్యం. అదికూడా ముఖ్యంగా కీర్తనల రూపంలో.

ఇంకా తమాషా ఐన విషయం ఏమిటంటే రోజూ టపాలకు వచ్చే వ్యూస్ కన్నా పేజీ టాబ్‍లకు వచ్చే వ్యూస్ బాగా ఎక్కువగా ఉండటం.

ఏదో జరుగుతోంది.  మంచో చెడో మరి.

కాని ఏమిటన్నది నా చిట్టిబుఱ్ఱకు తట్టటం లేదు.

ఎవరికైనా విషయం బోధపడితే నాకు కూడా కాస్త విజ్ఞానం కలిగించే ప్రయత్నం చేసి పుణ్యం కట్టుకోవలసినదిగా విజ్ఞప్తి.


24, జనవరి 2019, గురువారం

ఎక్కువ సంకీర్తనలు వెలువడ్దాయి నేడు


రామభక్తులారా,

నేడు సుదినం. రామచంద్రులవారికి ఎక్కువ సంకీర్తనలను సమర్పించుకొనే భాగ్యం కలిగింది.
  1. హరినే అచ్యుతునే
  2. చాల దగ్గరి చుట్టము
  3. ఏమి విచారించి వీడు
  4. గోవిందునకు పూజ
  5. రాత యెట్టులున్నదో
  6. పొగడచెట్టు పరచినది
  7. భయపదకు భయపడకు
  8. వేడుకతో నిన్ను నేను
  9. సీతారాములను బడసి
ఇలా జరగటం అంతా రామచంద్రుడి కృపవలన జరిగినదే కాని నా కర్తృత్వప్రతాపం యేమీ లేదని సవినయంగా  అందరికీ మనవి చేస్తున్నాను.


సీతారాములను బడసి చెన్నొందె నడవి


సీతారాములను బడసి చెన్నొందె నడవి
సీతారాములను విడచి చిన్నబోయె నగరి

వారు నివసించు చోటు వైకుంఠ మగును
వారిని నిరసించు చోటు వల్లకా డగును
వారు కదా విశ్వమునకు కారణమగు వారు
వారు కదా పోషకులు బ్రహ్మాండములకు

ఆ రావణకుంభకర్ణాదులను దునుమంగ
కారణార్థమై పుడమికి వారిద్దరు వచ్చిరి
వారడవులు చేరకుండ పనితీరు విధమేది
శ్రీరాముని వనవాసము చిత్రమైన నాటకము

శాప మది కొంత తీరు జయవిజయుల కిపుడు
తాపమది తీరు నింక ధర్మాత్ములు సురలకు
శ్రీపతి చారిత్ర్యమింక చెలగు ముక్తిప్రదమై
పాపపంకశోషకమై పావనమై నిత్యము

వేడుకతో నిన్ను నేను వినుతించుచుందు నని


వేడుకతో నిన్ను నేను వినుతించుచుందు నని
గోడ వెనుక గుమిగూడిన కొందరు నవ్వేరు

ఏవేళ జూచినా నిదే ధ్యాస వీని కని
ఏవేవో యూహల నెపుడు వీడుండు నని
దేవుడని రాముడని తెగగొణుగు చుండునని
నావిధమును తప్పుబట్టి నవ్వుచుండేరయా

నరుల పొగడి తెగడి తుదకు నాకొఱుగున దేమిటి
హరిని పొగడ నగును కాక నరుల పొగడ నేటికి
పరులు నన్ను తప్పుబట్టి పరిహసింతురు కాక
తరచుగ హరి నీయందే తగిలియుండు నాబుధ్ధి

ఈ తనువున నేను దూరి యెప్పు డిల చేరితినో
నాతోడగు రామచంద్ర నాముందు నీవుండుట
చైతన్యము కలిగి బుధ్ధి చక్కగ నాడే యెఱిగె
నీతలపుల నాటగోలె నిత్యమై యుండగను


భయపడకు భయపడకు భగవంతు డున్నాడు


భయపడకు భయపడకు భగవంతు డున్నాడు
రయమున రక్షించునట్టి రాముడై యున్నాడు

తలపులందు జడతయే తరచుగనగు వేళ
తలమీదను బరువులే తట్టెడైన వేళ
తులువలతో తలపడక తప్పనిదగు వేళ
కలుగజేసికొని నిన్ను కాచువాడు కలడు

బలవంతులు తర్జించుచు పలికినట్టి వేళ
నిలువనీడ కొరకు వేడవలసినట్టి వేళ
పలువురినే నిగ్రహించ వలసినట్టి వేళ
కలుగజేసికొని నిన్ను కాచువాడు కలడు

నిలదీసి మాయావుల గెలువనైన వేళ
బలపడిన యధర్మమే పంతగించు వేళ
కలి పెచ్చుమీరినట్లు కనబడెడు వేళ
కలుగజేసికొని నిన్ను కాచువాడు కలడు

పొగడచెట్టు పరచినది పూలపాన్పు చక్కగ


పొగడచెట్టు పరచినది పూలపాన్పు చక్కగ
చిగురుబోడి సీతతో చేరెనచట రాముడు

సీతా యివి యేమిపూలు చిన్నిచిన్నిపూలు
చేతోముదమైన వీని చెప్పరాని పరీమళము
వీతరాగులకునైన వెర్రి పుట్టించు సుమా
భూతపతికి వీటితో పూజచేయుద మనె

పొగడపూలు పొగడపూలు భూతపతి కింపైనవి
పగలురేలు కురియు నిట్లే వాసనతగ్గని పూలు
నగజాత పూజకు నివి నప్పునట్టి పూవులు
జగదీశుడు హరికి నివి నచ్చునట్టి పూలనె

సీతారామలక్ష్మణులు సేకరించి పొగడలు
మాతగౌరికి శివునకు మాధవదేవునకును
ప్రీతితో చేసినారు విశేషముగ పూజలు
ఖ్యాతికెక్కె నీమువ్వురి గాథ ముల్లోకాల

రాత యెట్టులున్నదో రాము డేమిచేయునో


రాత యెట్టులున్నదో రాము డేమిచేయునో
చేతికందే ఫలము చేదో తీపో

ఎందుకే ఓ మనసా యింత గుంజాటన నీకు
అందించ దగినదే అందించును రాముడు
ఎందు నీకు మంచి యున్న దెరిగినవా డతడే
తొందరెందుకే యీ చిందులెందుకే

రాత రాత యందు వారాత యెవరు వ్రాసినదే
చేతులార మున్నునీవు చేయునపుడు వగవక
ఈతీరున నేడు వగచి యేమి లాభమున్నదే
సీతాపతి దయనువేడి చింతమాని యుండవే

స్వాదుఫలము దొరకితే చాల గ‌ర్వించబోకె
చేదుపండు దొరకినదా చిన్నబుచ్ఛుకొనకే
చేదైనా తీపైనా శ్రీరాముని ప్రసాదమని
కాదనక గైకొనవే కర్మక్షయము జరుగనీవె

గోవిందునకు పూజ కొంచమైన లేదు


గోవిందునకు పూజ కొంచమైన లేదు లే
దే వేళ పొట్టపూజ కెడమింత లేదు

ఈ మే నశాశ్వతమను యెఱుకయే లేదు
కాముడనే తుంటరిని కాచుకొనుట లేదు
తామసమున మంచి లేదన్న స్పృహ లేదు
పామరత్వమే కాని పాపభీతి లేదు

ఆముష్మికము పట్ల నసలు చింతలేదు
భామ వెంటరాదన్న భావనే లేదు
ఏమి కుక్షింభరత్వ మితరమే లేదు
భూమి నింతకాల మున్న బుధ్ధిమార లేదు

ధీమంతులను గూడి తిరుగుటే లేదు
రామనాముమును చేయు లక్షణము లేదు
రాము డొక్క డున్నాడన్న లక్ష్యమే లేదు
రాముని దయ దొరుకకున్న సేమమే లేదు


ఏమి విచారించి వీడిచటికి వచ్చె


ఏమి విచారించి వీడిచటికి వచ్చె
ఏమి బావుకొందునని యిచటికి వచ్చె

అందమైన లోకమని ఆశించి వచ్చెనా
అందరాని ఫలములనే ఆశించి వచ్చెనా
ఎందునులోని సౌఖ్య ముందనుకొని వచ్చెనా
ఎందుకని వచ్చెనో యెవరైన నెఱుగుదురా

వచ్చెను వేగమె భవబంధముల చిక్కెను
వచ్చెను జీవుడనను భావమును పొందెను
వచ్చెను స్వస్వరూపంబును మరచెను
వచ్చెను హరితో అనుబంధమును మరచెను

అయ్యో మోసమాయె అధఃపతనమాయె
కుయ్యోమొఱ్ఱో యనె గోవిందు నెంచెను
అయ్య శ్రీరాముడై యభయహస్త మిచ్చె
వెయ్యి జన్మల పిదప విడుదల లభియించెచాల దగ్గరచుట్ట మీ నీలవర్ణుడు


చాల దగ్గరచుట్ట మీ నీలవర్ణుడు మీకు
మేలు చేసెడి చుట్ట మీ నీలవర్ణుడు

అయ్యతరపు చుట్టము అమ్మతరపు చుట్టము
వెయ్యేల మీకు చాల విలువైన చుట్టము
అన్ని వేళ లందు మిమ్మాదుకొనెడు చుట్టము
అయ్యారే వీడే కదా అసలుసిసలు చుట్టము

పనులు చెప్పని చుట్టము పనులు చేయు చుట్టము
ధన మడుగని చుట్టము ధనము లిచ్చు చుట్టము
మన సెరిగెడి చుట్టము మంచిచేయు చుట్టము
వినుడు వినుడు వీడు సర్వవిధములుగ చుట్టము

కారుణ్యము కలవాడని పేరుపడిన చుట్టము
మీ రెట్లు చూచినను మీవాడగు చుట్టము
కోరితే మోక్షమిచ్చు గొప్పవాడీ చుట్టము
దారి చూప రాముడై తరలివచ్చిన చుట్టము

హ‌రినే యచ్యుతునే యనంతునే


హ‌రినే యచ్యుతునే యనంతునే శ్రీ
కరునే కొలువుడో నరులార

విశ్వభావనుని విశ్వాత్మకుని
విశ్వవివర్ధను విశ్వేశ్వరుని
విశ్వమోహనుని విశ్వమూర్తిని
విశ్వవందితుని విష్ణుదేవుని

కలివనదావానలు డగు వానిని
కలితిమిరాంతక ఘనభాస్కరుని
కలి దుర్విషసర్పగరుడమూర్తిని
కలివిదారకుని కల్కిరూపుని

తామసరహితులు నిష్కాములు హృ
త్తామరసంబుల తలచు వానిని
రామనామ తారకమంత్రంబుచే
భూమిని యోగులు పొందువానిని


22, జనవరి 2019, మంగళవారం

మల్లెపూలతో శివుని మనసార పూజింపమల్లెపూలతో శివుని మనసార పూజింప
తల్లి సీతమ్మకు తహతహ కలిగె

చెలులార చెలులార శివదేవుని మల్లెలతో
కొలచెదము కొల్లలుగ కోసుకొని రండన్నది
కలనైన మల్లెలను కనీవినీ యెరుగమని
చెలులందరు పలుకగా చింతించ దొడగినది

తెలిసి వదినమ్మ చింత తెచ్చి చూపె సౌమిత్రి
యలనాడు సీతారాము లొసంగిన దండలు
చెలులు రిచ్చపడి రవి చెక్కు చెదర కున్నవని
పలికె నతడు దివ్యదంపతుల మహిమచే నని

హనుమా ఓ హనుమా యని పిలచె సీతమ్మ
హనుమ వచ్చి యాజ్ఞగొని జనస్థానమున కేగి
కొనివచ్చెను విరబూచిన గుబురుమల్లె పొదలను
వనిత సీతమ్మచేసె తనివార శివపూజను


21, జనవరి 2019, సోమవారం

మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది


మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది
మల్లెలమాలలు మురిపెముతో మగనికి వేసినది

కొల్లలుగాను మాలలు తెచ్చి కోమలి వేయగను
నల్లనివాడు రాముని గళము నాతిమహిమ చేత
తెల్లగ నగుట లెస్సగ చూచి దేవర లక్ష్మణుడు
మెల్లగ నగియె ముసిముసి గాను మిగుల సంతసించి

కొన్ని మాలలు రాముడు తీసి కోమలి మెడ నుంచ
సన్నసన్నని సిగ్గులు తోచ జానకి యాత్మేశు
మన్నన కెంతొ మురియుచు నుండ మరిది లక్ష్మణుండు
అన్నావదినెల సరసము జూచి యమిత ముదమునందె

దండ లన్నియు మనమే గొనుట ధర్మము కాదనుచు
దండి మగడు శ్రీరాము డొక్కటి తమ్ముని కందించె
వెండి సీతమ్మయు నొక్కటి ప్రీతి మరది కిచ్చె
పండెను నా బ్రతుకని తనతలపై నిడుకొనె నతడు


రాహిలాకు నివాళిగాఉత్తరాయణపుణ్యకాలం పండుగను జనం పతంగులు ఎగురవేసి జరుపుకుంటూ ఉంటే, ఆ పతంగుల మాంజాల పుణ్యమా అని పక్షులు వేలాదిగా చస్తున్నాయి. అప్పుడప్పుడూ ఆ మాంజాలు మనుషుల్నీ బలితీసుకుంటున్నాయి.

అలా ఒక మాంజా మెడకు చుట్టుకొని గుజరాత్‍లో ఒకమ్మాయు రాహిలా ఉస్మాన్ చనిపోయింది.

మరింత విషాదకర విషయం ఏమిటంటే, రాహిలా పక్షిప్రేమికురాలు. పతంగుల బారినుండి పక్షులను రక్షిస్తూ ఉంటుంది!

ఈసారి కూడా గుజరాత్ అటవీశాఖవారు చేపట్టిన పక్షిసంరక్షణలో పాల్గొని మాంజాలలో చిక్కుపడి పడిపోయిన అనేక పక్షులను రాహిలా కాపాడింది.

కార్యక్రమం ముగిసి రాహిలా ఇంటికి వెడుతుండగా దారిలో ఒక మాంజా వచ్చి ఆమెమెడకు చుట్టుకొన్నది. మెడకోసుకొనిపోయి తీవ్రంగా గాయపడిన ఆమెను అస్పత్రిలో చేర్చినా ప్రయోజనం దక్కలేదు!

ఈ వార్తను ఇక్కడ చదివాను నేను. మనసు వికలం ఐనది. రాహిలాకు నివాళిగా కొన్ని పద్యాలు వ్రాస్తున్నాను.


తే. ఉత్తరాయణపుణ్యకాలోచితంబు
గాలిపటముల నెత్తు టాకాశమునకు
అందరకు వినోదాస్పంద బగుటవలన
యెల్లచోటుల సందడి వెల్లివిరియు

తే. ఎవరిపటమును వా రూఱ కెగుర వేయ
చేతులూపుటను వినోద సిధ్ధి కలదె
యొఱుల పటముల పడద్రెంచి యోజమీఱ
ఆకసంబును గెల్చుట యందు కలదు

తే. మంచిదే కాని ఈయూహ మనిషిబుధ్ధి
వెఱ్ఱితలలు వేయుటను జేసి విజయకాంక్ష
గాలిపటముల దారాల గాజుపూత
గరగరలు పుట్టి ప్రాణాంత కంబులాయె

తే. గాలిపటములు తెగవేయ గలుగుటేమి
గాజుపూతల మాంజాల మోజు వలన
పక్షులకు నక్కటా చావు వచ్చుచుండె
మనిషి పండుగ యెంత దుర్మార్గమాయె

కం. అతితెలివి మనిషివేడుక
గతితప్పిన దాని ఫలము కాసింతైనన్
వితరణము చేయు మనిషికి
ప్రతిగా ప్రకృతియును వీని పండుగ వేళన్

తే. పక్షులే కాదు మనుషుల ప్రాణములును
పోవుచున్నవి మాంజాల పుణ్యమునను
ప్రాణహింసకు దిగునట్టి పండుగేల
ఎన్నటికి వచ్చు మనిషి కొక్కింత బుధ్ధి

తే. పక్షిజాతిని రక్షించ ప్రతినబూని
పాడు మాంజాల నుండి కాపాడి తుదకు
పాడు మాంజాకె రాహిలా వసుధ కూలె
నింత కంటెను దుర్వార్త యేమి కలదు


నమ్మితే మీకున్నవి నానాలాభములు


నమ్మితిరా మీకున్నవి నానాలాభములు
నమ్మరా పెద్దపెద్ద నష్టములే యున్నవి

నమ్మితిరా చిత్తశాంతి నమ్మకముగ నిచ్చును
నమ్మితిరా చెచ్చెర పాపమ్ముల నణగించును
నమ్మితిరా కష్టవితతి నాశనంబు చేయును
నమ్మితిరా భవవార్థిని నౌకయై రక్షించును

నమ్మరా త్రివిధపాపనాశనోపాయ మేది
నమ్మరా సకలకష్టనాశనోపాయ మేది
నమ్మరా తాపోపశమ నమ్మున కింకేది దారి
నమ్మరా భవాబ్ధి తరణమ్మున కింకేది దారి

కావున శ్రీరాముని కరుణామయుని నమ్మి
యేవిధమగు చింతలేక నిత్యమా తారకుని
భావించుడు బుధ్ధిలో భవబంధము లీగుడు
శ్రీవిష్ణుదేవు డతడు సేవించుడు తరించుడు

ఎవ రెక్కడ రామచంద్రు నేరీతి పొగడినా


ఎవ రెక్కడ రామచంద్రు నేరీతి పొగడినా
చెవులకది యమృతమై చిత్త ముప్పొంగును

సరిలేని వీరుడనుచు సద్గుణాకరుణనుచు
పరమదయాపరుడనుచు భక్తసులభు డనుచు
పరమేష్ఠిపరమశివులు ప్రస్తుతించెద రనుచు
హరి యీతడు సర్వపాపహరుడీతడే డనుచు

ఈతడే సృష్టిజేసె నీ విశ్వముల నెల్ల
నీతడే పెంపుజేయు నీ విశ్వముల నెల్ల
నీతనిలో లీనమగు నీవిశ్వములు తుదకు
నీతడే దేవుడని యెఱుకతో పలుకుచు

వినుడోహో రాముడే విశ్వాంతరాత్ముడు
జనుల కెల్ల శుభములు జరిపించు వాడు
అనయము మునుల కేమి యాదిత్యుల కేమి
కనికరించి చిక్కులెల్ల కడతేర్చు వాడనచు

19, జనవరి 2019, శనివారం

జగములేలు నిన్ను పొగడజాలుదు మని కాక


జగములేలు నిన్ను పొగడజాలుదు మని కాక
పొగడదగిన నిన్ను చాల పొగడకుందుమా

నీ యన్న యింద్రుడెట్లు నిన్ను పొగడకుండును
ఆయనవలెనే  దేవతలు నట్లే నిన్ను పొగడుదురు
ధ్యేయుడవగు నిన్ను మునులు తెలియ నెంచి పొగడుదురు
ఓ యయ్యా నిన్ను పొగడుచుండు నిట్లు లోకములు

పాపోపశమనుడవని భజనచేయు వారుందురు
శాపములు తీర్చితివని చాల పొగడు వారుందురు
నీ పాదసేవకులై నిన్నుపొగడు వారుందురు
నీ పట్ల భక్తిగలిగి నిన్నిట్లు పొగడు జగము

తెలియరాని నిన్ను గూర్చి తెలియ నొక్క విధానము
కలుగజేయ భూమిపైన కలిగితివి రాముడవై
యిలమీద మా కెఱుకగ నిటులున్న పరతత్త్వమ
కలిగె మాకు భవవారిధి గడచు మంచి యుపాయము

18, జనవరి 2019, శుక్రవారం

దైవమా ఓ దయలేని దైవమా


దైవమా ఓ దయలేని దైవమా
జీవుని యెనెన్ని చిక్కుల బెట్టేవే

దయగలదు నీకని తరచుగ పొగడితే
దయపుట్టు ననుకొన్నది తప్పయ్యేనే
జయపెట్టుచు నీముందు సాగిలపడిన గాని
నయముగ చూడవే న్యాయమేనా

పడద్రోసి నన్నిట్లు ప్రళయభవజలధిని
గడుసుగా డాగియుండి గమనించేవే
విడుదల యెప్పుడో వివరముగ తెలియని
జడునిగ చేయుటేమి సంతోషమే

ఏమేమో విందు మారాముడ వీవేనట
రాముడంటే సర్వజగద్రక్షకుడేను
నా మీద దయకలగి నన్ను రక్షించవు
మా మంచి దైవమవె మన్నింపవే

17, జనవరి 2019, గురువారం

కలనైన కనుబడుమని కడు వేధింతునని

కలనైన కనుబడుమని కడు వేధింతునని
కలలేమి నిదురయే కరవుజేసినావు

బలే తెలివిగలిగిన వాడవులే రామయ్య
విలువ యిట్టిదా నా వెర్రిభక్తికి
పులకింతు నీనామమును లోనతలచుచు
తలనొప్పిగాడని తలతువా నను నీవు

అతిభక్తితో నేను నిన్ననవరతము కొలుతునే
అతులితైశ్వర్యంబుల నడిగుదునా
చతురుడనై సింహాసనములే నడిగితినా
బ్రతిమలాడుదు కంటబడు మొక్కసారియని

వినవయ్య నీకన్న వేరు దైవం బెవడు
కనుక నీ సన్నిధిని కాంక్షింతును
ననుగన్న తండ్రి నీవును నన్ని ట్లుపేక్షించి
కనుపించ కున్న నాకు కర్థవ్య మేమింకరారా రాజీవలోచన రవివంశసుధాకర


రారా రాజీవలోచన రవివంశసుధాకర
శ్రీరామా ఆప్తకామా సీతాహృత్పద్మధామ

రారా వైకుంఠధామ రారా హరి దనుజవిరామ
రారా సంసారనివార రారా హరి వేదవిహార
రారా హరి నిజభక్తవిచారధారా శుభసంచార
రారా  వేగమె నన్నేలుకోరా హరి జగదాధార

రారా ఖగరాజగమన రారా హరి దీనశరణ్య
రారా రవిచంద్ర లోచన రారా హరి యఘవిమోచన
రారా బ్రహ్మాండ నాయక రారా హరి మోక్షదాయక
రారా  యీ జాలమేలర రారా యిక తాళజాలర

రారా సుజనజనావన రారా హరి లోకపావన
రారా భవపంకశోషణ రారా హరి భక్తపోషణ
రారా వినీలగగనాకారా హరి ధర్మవిచార
రారా నా మొఱ వినిరావేరా నరహరి  శ్రీకర

16, జనవరి 2019, బుధవారం

వినదగిన మాటొకటి వినవయ్య


వినదగిన మాటొకటి వినవయ్య నీవు
కనదగిన సత్యమే కనవయ్య

చేయరానివి చేయ  చిక్కులు పడ్డావొ
మోయరాని నింద లంటేను వినుము
మాయదారి బుధ్ధి మంచిచేయదు నీకు
హేయమైన గతియె పట్టేను

మంచిదారిని నీవు మనసార నడచితే
మంచి నీకెప్పుడు జరిగేను నీవు
పంచిన మంచి నీ ప్రాణమే కాచు నీ
అంచితంబగు పుణ్య మబ్బేను

శ్రీరామునే నీవు చిత్తాన నమ్మితే
నారాయణుండని తోచేను వాడు
కారుణ్యమున నిన్ను కాచేను నీకు
పారమార్థిక మింత దొరికేను


జలజాప్త కులసంభవ రామచంద్ర నళినాక్ష నారాయణజలజాప్త కులసంభవ రామచంద్ర
నళినాక్ష నారాయణ

అజ్ఞానతిమిరనాశ విజ్ఞానసుప్రకాశ
ప్రజ్ఞానఘనరూప రమణీయనరవేష
అజ్ఞుడను నన్ను నీ వాదరించి దయతోడ
నాజ్ఞచేసితివి నా కంతియ చాలు

సురగణార్తిశోషణ వరమునీంద్రతోషణ
పరమభక్తపోషణ కరుణాబరితేక్షణ
వరదాయక నీవు నాభావనలో నిలచితివి
పలమాత్మ నాకదే పదివేలయ్య

సర్వేశ్వర సర్వాత్మక సర్వలోకప్రకాశక
సర్వార్తిశమనౌషధ సర్వపాపవదారక
సర్వవిధంబులుగ నిను చక్కగా నమ్మితిని
సర్వస్వము నాకు నీ చరణంబులే

శ్రీరఘురామా సీతారామా కారణకారణ ఘనశ్యామా


శ్రీరఘురామా సీతారామా
కారణకారణ ఘనశ్యామా

ఘోరభవార్ణవతారకనామా
నారాయణ జగన్నాథ హరీ
దారుణవిశిఖాదండితసురారి
వీరగణా లక్ష్మీరమణా

జగదోధ్దారక జయ సురనాయక
అగణితసుగుణగణాకర శ్రీకర
నిగమాగమనుత నీరజభవనుత
నగరాజసుతానాధనుతా

భక్తజనావన పావనచరితా
ముక్తిప్రదాయక మోహనరూపా
శక్తహీనజనసంరక్షక ధర్మా
సక్తసాధుజనసంపోషా


15, జనవరి 2019, మంగళవారం

రామజయం శ్రీరామజయం


రామజయం శ్రీరామజయం
రామజయం రఘురామజయం

రామజయం  రామజయం రామజయం రవివంశవర్ధన
రామజయం రామజయం రామజయం దశకంఠమర్దన

రామజయం రామజయం రామజయం శివచాపఖండన
రామజయం రామజయం రామజయం ప్రభులోకమండన

రామజయం రామజయం రామజయం మునిరాజతోషణ
రామజయం రామజయం రామజయం నిజభక్తపోషణ

రామజయం రామజయం రామజయం సాకేతపాలక
రామజయం రామజయం రామజయం సర్వార్తినాశక

రామజయం రామజయం రామజయం త్రైలోక్యమోహన
రామజయం రామజయం రామజయం భవమోహనాశన

రామజయం రామజయం రామజయం వైదేహీనాయక
రామజయం రామజయం రామజయం అపవర్గదాయక


ఉన్నావే రామనామ మన్నది మరచి


ఉన్నావే రామనామ మన్నది మరచి నీ
వున్నదే రామనామ మన్నది కొలువ

సురలు సేవించునట్టి సొంపైన నామమిది
నరుల తరింపజేయు నాణ్యమైన నామమిది
నరుల భూసురుడవే నావిధి యనుకొనవే
వరరామమంత్రనిష్ఠ భారమైపోయెనా

పరమశివుడు తలచితలచి మురియునట్టి మంత్రము
నరుడవు నీనాలుకపై నానుచుండ వలయునే
ధరామరుడ వయ్యు నీతలపులోన నిలువదే
హరిమెచ్చని విధమున చరియింతువే

హరేరామ మంత్రనిష్ఠ యబ్బని యీజన్మము
నరదేహపు సౌలభ్యము నాశనము చేసినది
మరల భూసురుడవన్న మహాగొప్ప యొకటా
సరిసరి యికనైనను సద్బుధ్ధి నుండవే

కోదండరాముడా కోనేటిరాయడా


కోదండరాముడా కోనేటిరాయడా
నీ దివ్యనామమే నిజమైన రక్ష

ఆపదలు చుట్టుముట్టి యదలించిన వేళ
సైపరాని నిందల జంకిన వేళ
కాపుదల లేనివేళ కానివారు గదుము వేళ
పాపాత్ముల మధ్యన బ్రతుకనైన వేళ

వయసుపొం గుడిగి బ్రతుకు భారమైనవేళ
నయముకాని వ్యాధిపా లయిన వేళ
అయినవారు లేనివేళ అదృష్టమే లేనివేళ
భయావహ గ్రహదశలు వచ్చిన వేళ

చప్పున చేయందించు జనులులేని వేళ
గొప్పలుడిగి తిండికిగతి తప్పిన వేళ
అప్పులపా లైనవేళ తిప్పలు హెచ్చైన వేళ
తప్పుచేసి కుందువేళ తనదికాని వేళ14, జనవరి 2019, సోమవారం

దండిగ నీయండ దయచేసితివా


దండిగ నీయండ దయచేసితివా
పండువే ప్రతిదినము భగవంతుడా

పండువౌనా క్రొత్తబట్టలిన్ని కట్టగనే
పండువౌనా పంచభక్ష్యంబులతో
పండువౌను పున్నెములు పండగ మెచ్చీవు
నిండుగ దీవించి నీదయ కురిసినపుడె

ఉన్నవాడండ్రు ధనమున్నవాడిని జనులు
ఉన్నవాడండ్రు భూము లున్నవాని
ఉన్నవాడనగ నెవడన్న దెరుగరు వారు
ఉన్న వాడు నీదయ యున్నవా డొక్కడే

రాముడా నీవు నన్ను రక్షించి యాదరించి
గోముగ దయామృతము కురిపించి
సామర్ద్య మిచ్చితివి చక్కగ నిన్నుపొగడ
ఏమయ్య పండుగే ఏదినమైన నాకు


జయజయ రామ జానకిరామ


జయజయ రామ జానకిరామ
భయహర రామ పావననామ

జయజయ అమరాశ్వాసక రామ
జయజయ రవికుల సంభవ రామ
జయజయ మునిజన సన్నుత రామ
జయజయ రావణ సంహర రామ

జయజయ సురగణ సంస్తుత రామ
జయజయ  కోసల జనపతి రామ
జయజయ త్రిజగత్శాసక రామ
జయజయ  మంగళదాయక రామ

జయజయ అగణితసద్గుణ రామ
జయజయ గానవిశారద రామ
జయజయ భక్తాభయకర రామ
జయజయ మోక్షప్రదాయక రామ

11, జనవరి 2019, శుక్రవారం

కంచి పరమాచార్య పావన గాథలు పుస్తకం


శ్రీ భండారు పర్వతాలరావు గారు రచించిన పరమాచార్య పావనగాథలు పుస్తకం మనకు కంచి శంకరమఠం వారి వెబ్ సైట్‍లో లభిస్తోంది. ఇక్కడ ఈపుస్తకమే కాక అనేక తెలుగు గ్రంథాలూ ఉన్నాయి.

ఈ పరమాచార్య పావనగాథలు పుస్తకం ముఖపత్రం వివరాలు మఠంవారి వెబ్‍సైట్‍లో ఇలా కనిపిస్తున్నాయి.

PARAMACHARYA PAVANA GATHALU
Telugu
By. B. Parvatala Rao

Cover Design : Ms. Prema Malini and Mr. Ganesh
Copies : 1000
May, 1994

All Rights Reserved by the Author

Publisher:
NATIONAL INFORMATION SERVICES
Somajiguda
Hyderabad - 500 048

Printed at:
Manorupa Art Printers
Ramkoti
HYDERABAD.

అన్నట్లు, ఈ పుస్తకంలో 115 అధ్యాయా లున్నాయి.

నడిచే దేవుడిగా పేరుగొన్న కంచి పరమాచార్య వారి గురించి విశేషాలు తెలుసుకుందుకు అసక్తి కలవారు తప్పక పఠించవలసిన గ్రంథం.

వినుడోహో రామాయణ వీరగాథ

వినుడోహో రామాయణ వీరగాథ
ఘను డాదినారాయణుని గాథ

వినుడువినుడు రాముడనే వీరుడు కలడు
తనకుతానె సాటి యా దశరథసుతుడు

వినుడువినుడు గొప్పముని విశ్వామిత్రుడు
మనరాముని యజ్ఞరక్షకునిగ చేసెను

వినుడువినుడు తాటక విరుచుకపడగ
ఘనుడు గురువు నుడువ దాని గ్రక్కునజంపె

వినుడువినుడు రాకాసులు వేగ వచ్చిరి
మునిజన్నము పాడుచేయు మూర్ఖబుధ్ధులు

వినుడువినుడు భస్మముగ వేగ నొక్కని
వనరాశిని తూలనొకని బాణములేసె

వినుడువినుడు  అదృశ్యయౌ వనిత అహల్య
మునిశాపము తొలగ రామమూర్తిని పొగడె

వినుడువినుడు జనకునింటి వింటిని విరచి
మునిశిష్యుడు పెండ్లాడె జనకాత్మజను

వినుడువినుడు జామదగ్న పిడుగైరాగ
వనజాక్షుని వలన గర్వభంగము నొందె

వినుడువినుడు రాముడంత జనకజ తోడ
తనపురమున కేగియందు ఘనముగ నుండె

జను లెరిగిన రాముడు సాకేతప్రియధనుడు

జను లెరిగిన రాముడు సాకేతప్రియధనుడు
మును లెరిగిన రాముడు మోక్షశ్రీవితరణుడు

జనకునాజ్ఞ మీద నతడు చనినాడు వనములకని
జను లెంచుచుందురు సాదరముగను
తనయుడన్న రామునట్టి తనయుడే తనయుడని
యినకులంబు నీతడు పావనము చేసె నందురు

దేవతల సంకల్పము తెచ్చె నితని వనములకని
భావించి సంతోష పడుదురు మునులు
రావణఖరదూషణాది రాకాసుల పీచమడచ
దేవుడు దిగి వచ్చెనని తెలిసి పొంగుచుందురు

అనిమిషుల కోర్కె దీర్చ హరి రాముడై వచ్చెను
జనకునాజ్ఞ యని చేసె వనవాసము
మునుల కొరకు రాకాసి మూకల నణగించెను
తనకుతానె సాటియైన దశరథనందనుడు

10, జనవరి 2019, గురువారం

మునులు తక్క జనులు లేని వనము లోన


మునులు తక్క జనులు లేని వనము లోన
వనజనేత్రి జంగమ దేవరను కాంచెను

ఇంతవింత జంగ మయ్యెవ డనుకొనక
యింతి యతిథి యని యాదరించ జూడగ
నంతలోనె జంగమయే యసురుం డాయె
నెంత మాయ జేసె దుశ్చింతు డౌరా

మాయగొని వచ్చిన గోమాయువా నీ
యాయువుగొను రాముడని యన్నది సీత
ఆయనయే సర్వరాక్షసారి శ్రీహరి
నీయాశ కులముజెఱచు నిలువు మన్నది

వంచన మారాక్షసుల మెంచు నీతియె
కొంచుపోదు నిన్నని కుటిలుడాడెను
మంచిది నీరాముడే మాధవు డైతే
యంచితమగు చావు నా కగును లెమ్మనె

9, జనవరి 2019, బుధవారం

నాలో మసలే నామమే పూని విశుధ్ధుని చేయునులే


నాలో మసలే నామమే
పూని విశుధ్ధుని చేయునులే

నేను పవిత్రుడ నైన నేమగు
నేనపవిత్రుడ నైన నేమగు
ఆ నామామృత మాని నంతట
నేను విశుధ్ధుడ గానా

మరిమరి హితమది మానసమునకు
పరమోత్సాహము మరి పలుకునకు
అరయ రసన కది యతిరుచికరము
సరిసరి శుధ్ధుడ గానా

శుధ్ధుని చేయగ శుభనామంబు
శుద్దుని చేయగ శుభచింతనము
శుధ్ధుని చేయగ శుభసేవనము
శుధ్ధుడ రాముని భక్తుడను

8, జనవరి 2019, మంగళవారం

రాముడా రామునకు రాముడే సాటియని

రాముడా రామునకు రాముడే సాటియని
భూమి నుండు జనులంతా పొగడేరయ్యా

నీవంటి కొడుకు లేడు నిజమైన మాటయది
నీవంటి యన్న లేడు నిజమైప.మాటయది
నీవంటి మగడులేడు నిజమైన మాటయది
నీవంటి వాడెవ్వడు నీవు చెప్పుమా

నీవంటి ధర్మాత్ముడు నేల మీద వేరెవ్వడు
నీవంటి ధానుష్కుడు నేల మీద వేరెవ్వడు
నీవంటి గుణవంతుడు నేల మీద వేరెవ్వడు
నీవంటి వాడొక్కడు నేల నడచెనే

నీవంటి శిష్యుడే నిజముగా లేడు కదా
నీవంటి సద్గురువు నిజముగా లేడు కదా
నీవంటి యజమాని నిజముగా లేడు కదా
నీవంటి తరింపజేయు దైవముండెనే

రాముడా వైకుంఠధాముడా వినవయా


రాముడా వైకుంఠధాముడా వినవయా
నామనోరథ మైన దా మోక్షమే

అదియిచ్చి యిదియిచ్చి యటుద్రిప్పి యిటుద్రిప్పి
వదలు దేవతలవంటి వాడవు కావే
ముదమార మోక్షమిచ్చు పురుషోత్తముండ వని
వదలక సేవించుచుంటి భగవంతుడా నిన్ను

ఇలాతలమహారంగస్థలమునం దింతదాక
పలువిధముల తొడుగులలో వర్తించినాడ
అలసిపోతి నింకమీద నాడించవలదు నను
నిలకడగా నీయొద్దనె నిలచియుండ నీవే

ఇప్పించవే స్వామి యింకెంత కాల మని
తప్పించుక తిరిగెదవు దయచూపక
విప్పవయ్య భవపాశము లప్పడా యికనైన
చప్పున నీయెడకు నన్ను రప్పించుకొనవయ్య

రాముడా అందాలరాయడా


రాముడా అందాలరాయడా నినుగని
కామించి ఋషులు గోపకన్య లైరి

పురుషోత్తము డెవడని పరమాత్ము డెవడని
వరమునీంద్రగణములు భావించినవో
నరుడుగా నట్టి యా నారాయణుడు వచ్చి
చిరునవ్వులు చిందించిన చిత్తు కాకుందురే

పరమవిరాగులు వారు పరమశాంతులు వారు
పరమతపోనిష్ఠులైన వారు నిన్ను
పరికించి పులకించి పరమసాధ్వీభావ
పరవశులు కారె లోకపతివి నీవు కావే

హరివి నీవు వారి కోర్కె నాదరించి కృష్ణుడవై
కరుణించితివి కొల్ల కన్యలైన వారిని
నిరుపమాన దయానిధివి నీవరంబున మునులు
పరమపదంబైన నీ పాదసీమ చేరిరి

రాముడా నీశరము రాక్షసాధమ్ముని


రాముడా నీశరము రాక్షసాధమ్ముని
కోమలంబుగ దాకకూడదే యిదియేమి

పనిగ మారీచసుబాహులనెడు వారు
మునులుచేయు యజ్ఞములకు విఘ్నముల
ననవరత మొనరించు నట్టి వారే యొకని
పనిబట్టి వేరొకని వదలునా నీశరము

వదలినది కాదు సుబాహుని ప్రాణాలు
వదలినది మారీచు పడగొట్టి శరధిలో
పదునాలుగేండ్లీవు వనముల గ్రుమ్మర
కదలిరావలె వీడె కద మాయలేడిగా

కాలస్వరూపుడవు కాగల కార్యమ్ము
నేలీల జరుపుదో యెవ్వ రెఱుగుదురు
నీలమేఘశ్యామ నీబాణ మటుగాక
యేల రాకాసిపై జాలి చూపించును


రాముడా రాజులు రాజ్యాల నేలుదురు


రాముడా రాజులు రాజ్యాల నేలుదు
రీమూడు లోకాల నేలు రాజువు నీవు

పేరోలగంబున పెద్దగద్దియ నెక్కి
శూరుడా యింద్రుడు శోభించు గాక
ఆ రావణుని ఢాక కాగలేమిని జేసి
శౌరి లోకేశ నిను శరణువేడెను కాదె

ధారుణీపతి వీవు ధర్మప్రభుడ వీవు
నీ రేడు లోకాల కేలికవు నీవు
కారుణ్యమును జూపి కమలాక్ష రావణుని
దారుణమ్ము లణచ తరలవే యనడే

పూని నీవీ మాయామానుషాకారమును
మానుషాదుని జంపి మహినేలి పెక్కేండ్లు
మానవాళికి ధర్మ మార్గమ్ము బోధించి
నీ నామమే ధ్యాననీయ మొనరించితివి

7, జనవరి 2019, సోమవారం

దినదినమును కొన్ని దివ్యకీర్తనములు


దినదినమును కొన్ని దివ్యకీర్తనములు
వనజాక్ష యీ జీవుని పలుకనీవే

మునులుపొగడు నీరూపము ముందుగా స్మరియించి
మనుజుడైన యీసామాన్యజీవుడు
మనసారగ నీగుణముల ననితరసాధ్యంబుల
తనివితీర పలుకాడుచు ధన్యుడు కానీవే

సురలయార్తి దీర్చునీదు శూరత్యము మదినెంచి
పరమహర్ష మొప్ప యీ భక్తజీవుడు
నిరుపమానదివ్యాస్త్రానీకవృష్టి ధర్మమును
ధరను పండించెడు నీ తత్త్వ మెన్న నీవే

నరలోకము పొగడు నీదు  చరితమే స్ఫూర్తిగా
విరివిగా సంసార విరక్త జీవుడు
శరణాగతుల బ్రోచు జానకీరాముడా
సరసమైన కీర్తనలను సంధించ నీవే

రాముడా నన్నేలాగున రక్షింతువో


రాముడా నన్నేలాగున రక్షింతువో
ఈ మాయాజగతిలో నిముడలేను

ఒక ధర్మము లేదే యొక సత్యము లేదే
ఒక న్యాయము లేదే యొక నీతి లేదే
ఒక బంధము లేదే యొక నెయ్యము లేదే
రకరకముల నాటకా లన్నియు నిచట

దైవదర్శనమునకు ధనమడుగును గుడులు
దైవప్రసాదముకు ధనమడుగును గుడులు
దేవుని ముందధికారులు ధనవంతులు ఘనులు
దేవుడే ధనము ముందు దిగదుడు పిచట

ధనాశా గురువులే దైవములుగ వెలయగ
జ్ఞానముడిగి వారికి సాగిలపడు భక్తుల
లేనిపోని మహిమలు పూనకాలు భజనలు
శ్రీనాథుడు శివుడనగ చెల్లదంట యిచ్చట

రాముడా నీవేమో రమ్యగుణార్ణవుడవు


రాముడా నీవేమో రమ్యగుణార్ణవుడవు
నామానుషం బిది దుర్గుణంబుల పుట్టాయె

అటులయ్యు నీవు నన్నాదరించు నేస్తుడవు
కటువు లెప్పు డాడక గారవింతు
వెటులైన సద్గుణముల నెన్ని కొన్నింటిని
దిటవుగ నాకిచ్చి నన్ను దిద్దరాదే

ఎన్ని జన్మములనెత్తి యేమినేర్చితి నేను
చిన్నమెత్తు తత్త్వచింత చేయనైతి
నెన్నెన్నో దుర్గుణముల మిన్నాగుల పుట్టనై
యున్నాను నీవు నన్నుధ్ధరించవే

వేడుకతో నిన్నెల్లవేళలను కొలిచెదను
చూడగా నదొక్కటే సుగుణము నాది
వేడువారి కీవు మోక్షవితరణశీలుడవు నా
కేడుగడవు కాన నన్నేలుకోవే

ఈమనోహరుని పేరు రామచంద్రుడు


ఈమనోహరుని పేరు రామచంద్రుడు
భూమిని నడయాడు వీడె పురుషోత్తముడు

వీడే రాకాసులను విరచునట్టి వెన్నుడు
వీడే దేవతలకెల్ల పెద్దదిక్కు
వీడే మునులెంచెడు వేదవేద్యుడైన వాడు
వీడే విశ్వముల జేసి పెంచుచుండు వాడు

వీడు జనకునింట శివునివింటి నిట్టె విరచెను
వీడు జానకిని వేడ్క పెండ్లాడెను
వీడు జనకునాజ్ఞను గొని విపినములకు వచ్చెను
వీడు పూని రాకాసుల పీడను వదలించును

వీనివలన రావణుండు విరుగడై పోవును
వీనివలన విశ్వశాంతి వెల్లివిరియును
వీనివలన సత్యధర్మ విధానములు వెలుగును
వీనివలన ముముక్షువుల వేడుకలు తీరును

6, జనవరి 2019, ఆదివారం

రాముడా నిను కొలువరాదని


రాముడా నిను కొలువరాదని భావించు
పామరు లేమేమో పలికిన నేమి

ఎన్నెన్ని జన్మంబు లెత్తియుంటినో కాని
యన్నిజన్మములను నిన్నంటి యుంటి
వెన్నుడా యిన్నాళ్ళకు వెఱ్ఱులెవ్వారలో
నిన్నుకొలువ రాదంటే నేను విందునే

నీవు నాకండగా నిలబడియున్నావు
కావలసిన దంతకంటే కలదే నాకు
ఈవేళ నినుగూర్చి యెఱుగని వారెవ్వరో
యేవోవో పలికినచో నెట్లు విందురా

నా యంతరంగమున నవ్వుచు నీవుండ
నీ యంతరంగమున నిండినట్టి కరుణ
హాయిగా నిత్యమును నన్నలరించుచుండ
యే యజ్ఞుల మాటలైన నేల విందునో


రాముడా లోకాభిరాముడా రవికులాభ్ది సోముడా


రాముడా లోకాభిరాముడా రవికులాభ్ది
సోముడా నావంక చూడవయ్యా

ఏమికర్మములు చేసి యెత్తితినో యీజన్మ
మేమేమి పుణ్యమ్ము లేమి పాపమ్ములో
యేమి పుణ్యపాపముల నీజన్మమందున
పాముకొంటినో చెప్ప వశమే నాకు

మున్నెన్ని మార్లిట్టు లెన్నరాని కర్మముల
పున్నెమాయని నేల పుట్టియుంటినో
యెన్నెన్ని జన్మంబుల నికమీద నెత్తుదునో
యన్నదే తెలియరాని దాయెను గాదె

పనికిరాని కర్మానుభవము లెందుకు నాకు
నినుజేరు దారి చూప నేరనివగుచో
కనుక నీ కటాక్షము కరుణించితే చాలు
మనికి తొల్లింటిది మరల కలుగు గాదె

2, జనవరి 2019, బుధవారం

దేవుడవగు నీకు తెలియని దేముండును


దేవుడవగు నీకు తెలియని దేముండును
జీవుడనగు నేను చేయున దేముండును

తోలుతిత్తిలోన నేను దూరిన పిమ్మటను
నేల నిదే చేరి నేను నిలచిన పిమ్మటను
కాలమునం దుఱక కలుగు కష్టసుఖంబులను
తేలుచు నిరతంబును తిరుగునే యుందును

మానవుగా వినోదముగ మాయలో ముంచుటను
మానుదునా వినోదము నే నందించుటను
యేనాటికి మాయలను మానుదువో కాని
యానా డెపుడెపుడని ఆశపడుచుందును

రామా నీ వాడను గద రవ్వంత దయచూపి
పామరత్వ మెల్ల బాపి పాలించగ రాదా
కామిత మిది కాక నాకు కలదా వేరొక్కటి
నా మెఱాలకించ కున్న నేమన గలవాడను

చక్కగా నీకు నాకు సమకూరి నట్టిది


చక్కగా నీకు నాకు సమకూరి నట్టిది యీ
యొక్క బంధమే సత్య ముట్టుట్టి వితరములు

ఎన్నెన్నిజన్మముల నెత్తియుంటి నో నా
కెన్నిన్ని బంధములే యేర్పడెనో చెడెనొ
మూన్నాళ్ళ ముచ్చటలై ముగిసిన వాటికై
మున్నెట్టి మోహములె మోసితినో కాని


నేలకు నే దిగక మున్నే నీకు నా కున్నదాయె
చాల మంచి చుట్టరికము వేలాది తనువుల
నేలాగు నేనున్నను వాలాయముగ నుండి
కాలమున కించు కైన కగ్గకుండె గాదె

భావింప నాత్మసఖుడు భగవంతు డొక్కడె
కావున చుట్టరికము గట్టిది మనమధ్య
యేవేవొ చుట్టరికము లింకేల నయ్య రామ
నీవు తలకు చుట్టెదవు నిబ్బరించ రాదె

నేను కోరినది యేమి. నీవిచ్చినది యేమి


నేను కోరినది యేమి నీవిచ్చినది యేమి
కానిమ్ము రామ నేను కాదన వశమా

జరిగిన దేనాడో జరిగిన దింకేల వగవ
మరల తొల్లిటి వలెను మన ముందమన్నచో
సరకుచేయక వినతి జన్మము లెత్తింతువు
పరమాత్ముడా నీవు భలేవాడవే

గుణగణాతీతుడవు గుణనియామకుడ వని
గుణములలో కొన్ని మంచి గుణములిమ్మని వేడ
గుణము లంటగట్టతివి కొరగాని వెన్నెన్నో
గుణమిట్టిదా నీది గొప్పవాడవే

యుక్తి చేసి తొల్లింట నుంచుమని కోరునట్టి
భక్తుని విన్నపమును పట్టించుకొన వీవు
రక్తిలేదు సంసారమున నని మొత్తుకొన్న
ముక్తినీయవే భలే మోసగాడవే

1, జనవరి 2019, మంగళవారం

శ్రీరామసంకీర్తనంలో 500 కీర్తనల ప్రస్థానం


ఈ శ్రీరామసంకీర్తనా కార్యక్రమం ప్రస్థానం ఈక్రింది విధంగా ఉన్నది.

మొట్టమొదటి సంకీర్తన వేగ కనరావయ్య అన్నది 20, ఏప్రిల్ 2012, శుక్రవారం శుక్రవారం నాడు వెలువడింది.
100వ సంకీర్తనం బంటునై నిన్నంటి యుండే అన్నది 15, ఏప్రిల్ 2016, శుక్రవారం నాడు వెలువడింది.
200వ సంకీర్తనం దేవతలకు నైన తెలియరాదు అన్నది 31, అక్టోబర్ 2016, సోమవారం నాడు వెలువడింది.
300వ సంకీర్తనం హాయిగా శ్రీరామభజన అన్నది 23, ఫిబ్రవరి 2018, శుక్రవారం నాడు వెలువడింది.
400వ సంకీర్తనం త్రిజగన్మోహన రూపుని అన్నది 11, సెప్టెంబర్ 2018, మంగళవారం నాడు వెలువడింది.
500వ సంకీర్తనం జయజయ రామా అన్నది 1, జనవరి 2019, మంగళవారం నాడు వెలువడింది.

ప్రయాణవేగాన్ని గమనిస్తే మొదటి నూఱు సంపన్నం కావటానికి ఎక్కువ సమయం పట్టినా ఆపైన వేగంగానే కొనసాగినట్లున్నది.

శ్రీరామచంద్ర మహాప్రభువు సంకల్పం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ కార్యక్రమం ఇతోధికంగా కొనసాగే అవకాశం ఉన్నది.

జయజయ రామా జయ శుభనామా


జయజయ రామా  జయ శుభనామా
జయజయ భవహర జానకి రామా

జయజయ వైకుంఠసంస్థితరామా
జయజయ శ్రీభూసమేత రామా
జయజయ సురగణ సంస్తుత రామా
జయజయ మునిగణ సన్నుత రామా

జయజయ లోకాశ్రయ శ్రీరామా
జయజయ భక్తాశ్రయ శ్రీరామా
జయజయ ధర్మాశ్రయ శ్రీరామా
జయజయ మోక్షప్రద శ్రీరామా

జయజయ సద్గుణసాంద్రా రామా
జయజయ కరుణాసాగర రామా
జయజయ కీర్తివిశాలా రామా
జయజయ జయజయ జయజయ రామా


దేవుడే రాముడని తెలియునందాక


దేవుడే రాముడని తెలియునందాక
జీవు డజ్ఞానియని చెప్పవలయును

మహానాగదేహ మైన మశకదేహ మైన
విహాయసపు దేహ మైన విశదంబుగ నా
దేహసత్త్వంబులు తెలివిడి నిచ్చేనా
ఊహింప నరాకృతి నున్న గొప్పేమి

ఎన్నెన్ని జన్మ లెత్తి యేమేమి చేసెనో
యెన్నెన్ని బంధాల నెట్లెట్లు నెరపెనో
యన్నది లెక్కించ నవసరమే లేదు
తిన్నగ నాత్మజ్ఞాన మన్నదబ్బు దాక

తారకనామస్ఫురణ తన కబ్బినంతట
కోరికల గోలతగ్గి కొల్లయగు శాంతి
శ్రీరాముని పైన చేరును చిత్తంబును
తీరుగ కలుగును తెలివిడి జీవునకు

రామనామనౌక నెక్కరాద టయ్యా


రామనామనౌక నెక్కరాద టయ్యా నీ
కేమిటి కీయోటిపడవ లెక్కిదిగుటలు

తీరమును దాటి నీవు తింగరపడవ నెక్కి
పారము లేనట్టిదైన భవజలధిని
చేర నవలియొడ్డు లేమి చింతించవైతివి
చేర రానిదాయె తొల్లిటి తీరమైన జీవుడా

మించిపోయినది లేదు మీది కార్యమేమనగ
కొంచెము దూరమున నదిగో గొప్పనౌక
అంచితమగు రామనామాంకితమగు నౌక
ఎంచగ నీ వరుగు తీర  మెఱుగు నెక్కుమా

ఇంకమీద భవవారాసి నీదులాటలు లేవు
నింక మీద దారి గనక నేడ్చుట లేదు
నింక మీద రామతీర్థ మెడబాయుట లేదు
శంకదక్కి రామనౌక చక్కగ నెక్కిన