24, జనవరి 2019, గురువారం

సీతారాములను బడసి చెన్నొందె నడవి


సీతారాములను బడసి చెన్నొందె నడవి
సీతారాములను విడచి చిన్నబోయె నగరి

వారు నివసించు చోటు వైకుంఠ మగును
వారిని నిరసించు చోటు వల్లకా డగును
వారు కదా విశ్వమునకు కారణమగు వారు
వారు కదా పోషకులు బ్రహ్మాండములకు

ఆ రావణకుంభకర్ణాదులను దునుమంగ
కారణార్థమై పుడమికి వారిద్దరు వచ్చిరి
వారడవులు చేరకుండ పనితీరు విధమేది
శ్రీరాముని వనవాసము చిత్రమైన నాటకము

శాప మది కొంత తీరు జయవిజయుల కిపుడు
తాపమది తీరు నింక ధర్మాత్ములు సురలకు
శ్రీపతి చారిత్ర్యమింక చెలగు ముక్తిప్రదమై
పాపపంకశోషకమై పావనమై నిత్యము

9 కామెంట్‌లు:

  1. పాట పల్లవి భావన చాలా బాగుంది. అన్ని పాటలు ఆణి ముత్యాలు లాగా ఉన్నాయి. చదువుతుంటే రామాయణం లోని ఘట్టాలు అలా కళ్ళముందు కనిపిస్తున్నాయి. మీరు పుస్తకం గా ప్రచురించితే బాగుంటుంది.

    ఈ రోజు త్యాగరాజస్వామి ఆరాధానోత్సవం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ మీకీ పాటలు నచ్చుతున్నందుకు.
      అవునండీ నేడే త్యాగరాజస్వామి ఆరాధానోత్సవం!
      ఈరోజున భగవంతుడు ఏమి కీర్తనలను వెలువడ జేస్తాడా అని నాకూ కుతూహలంగానే ఉన్నది.

      తొలగించండి
    2. పంచరత్న కృతులు చాలు నాబోంట్లకు.

      తొలగించండి
    3. విన్నకోట వారు, పంచరత్నకృతులను చిన్నబుచ్చే ప్రయత్నం యేమీ జరుగటం లేదండీ నానుండి. ముఖేముఖే సరస్వతీ యని నా ధోరణిలో నేను వ్రాసుకొంటున్నాను. అందరూ చదవాలనీ లేదు, అందరూ మెచ్చాలనీ లేదు. నిజానికి దాదాపు యెవరూ చదువటం లేదన్నదే నిజం.

      తొలగించండి
    4. విన్నకోట వారు, ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా అని చేమకూర వేంకటకవి వాపోయినట్లు మనకు తెలుసును. ఆమాట ఈకాలానికీ నిజమేను. కాలక్షేపం కబుర్ల బ్లాగులోకంలో రామకీర్తనలు ప్రకటించటం ఒక పిచ్చితనమేమో. అదటుంచి ఆట్టేమంది చదివేది లేకపోయినా యేదో నాతృప్తికోసం వ్రాసుకుంటున్నాను. అంతా రామానుగ్రహం అనే నమ్మకం ఉండనే ఉంది. ఐనా ఇలా నాబోటివాడూ కీర్తనలు వెలువరించటం అనుచితం అన్నది విజ్ఞుల అభిప్రాయం ఐన పక్షంలో ఈవ్యాసంగాన్ని నిలువరించమని రాముణ్ణే అడుగుతున్నాను. ఎన్నో ప్రతికూలపరిస్థితుల మధ్యన ఈ సంకీర్తనావ్యాసంగం కొంతలో కొంతగా ఊరటగా ఉన్నది. ఆయన ఇకచాలు అని అదేశించి, ఈవ్యాసంగాన్ని తప్పించినా ఈజీవుని తప్పించినా సంతోషమే. ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తుంటాను.

      తొలగించండి
  2. చిన్నబుచ్చారని నేనన్నానా? సంగీత పరిజ్ఞానం లేని నాబోటి సామాన్యుడు ఆశ్వాదించడానికి పంచరత్న కృతులు చాలు అని నా స్వఘోష చెప్పుకున్నాను. మరో ఉదాహరణ: అన్నమయ్య గారు వేల కొద్దీ కీర్తనలు రచించారు కదా, కానీ నాలాంటి పామరుడు ఆశ్వాదించేది బహుళప్రాచుర్యంలో ఉన్న కొన్నింటినే (“అన్నమయ్య” సినిమా రాకముందు చాలా సంవత్సరాల నుండే .... M.S. సుబ్బులక్ష్మి గారి కేసెట్ల పుణ్యమా అని). మీరు అకారణంగా కోపం తెచ్చుకుంటున్నారు 🙏.

    పైన మీ స్పందన చూడగానే జవాబిద్దామనుకున్నాను గానీ అనుకోకుండా ఆలస్యం అయింది. ఈలోగా మీరు చేమకూర వేంకటకవిని తీసుకొచ్చేశారు, నైరాశ్యంలోకీ వెళ్ళిపోయారు. జరిగేది జరుగుతుంది కానీ ఇలా నిస్పృహ అయితే ఎలాగండీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట వారు, శేషం కోపేన పూరయేత్ అన్న నానుడి ఒకటుంది. ఈ వాక్యంలో రెండర్థాలు వస్తాయి. మొదటిది వాదనలో తేలిపోయిన వాడి చివరియత్నం కోపప్రకటనమే అన్నది. రెండవది శేషుడు ఎప్పుడూ కోపావేశంతో నిండి ఉంటాడు అన్నది. ఈసందర్భంలో రెండూ విశేషంగా వర్తిస్తున్నాయి! పెద్దలతో అసంకల్పితంగా పోలిక వచ్చినప్పుడు నేనెంతవాడను అన్న కించ వలన బక్కకోపం ఒకవైపున వస్తూ ఉంటుంది. ఏ నేను అన్న స్పృహనుండి దూరంగా మసలుతూ ఉన్నానో అది మీదికి యేదోవిధంగా దూకినప్పుడు ధ్వనించే కోపం అన్నమాట. రెండవ విధంగానూ యెలాగు ఆనానుడి వర్తిస్తుందంటారా, నాలో ఆశేషాంశ నిత్యమైనది కాబట్టి - నాగారాథన ఉన్న కుటుంబం పెద్దను చూడండి. అదన్న మాట. నిజంగా తూ.గో.జి. లోని మాస్వగృహం శేషావాసంగా విరాజిల్లేదంటే ఈకాలం వారు నమ్మరు. మాబామ్మ గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను అందరమూ ప్రత్యక్షంగా ఆ శేషుణ్ణి దర్శించుకున్నాము. మానాన్నగారైతే ఇంట్లోవారు భయపడుతున్నారని వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తే అందరకూ మరింత నిరదర్శనం కావటంతో విరమించుకున్నారు. మా తాతమ్మగారు కూడా సుబ్రహ్మణ్యభక్తి గలవారై కొన్ని నిదర్శనాలు గమనించారు. అందుచేత, ఎంత తగ్గినా నాకు ముంగోపం సహజంగానే ఉంటున్నది. మా పితామహులు సుబ్రహ్మణ్యవరప్రసాదులై జనించటంవలన ఆయన పేరు సుబ్బారావు గారు.

      ఇకపోతే, నైరాశ్యం యేమీ లేదు. రామచంద్రుడి ప్రొద్బలం లేనిదే ఇక్కడ యేమీ జరగదు.

      తొలగించండి
  3. ఓహో, communication gap ఎక్కడొచ్చిందో నాకిప్పుడు అర్థం అయింది. నేను పంచరత్న కృతులు అన్న మాటను మీరు స్వయంగా రచిస్తున్న కీర్తనల మీద విసురు అనుకున్నట్లున్నారు. కాదండీ స్వామీ. ఈ రోజు త్యాగరాజ ఆరాధనోత్సవం జరుగుతున్న సందర్భంగా // "ఈ రోజు భగవంతుడు ఏమి కీర్తనలను వెలువడ జేస్తాడా అని నాకూ కుతూహలంగానే ఉన్నది." // అని పైన మీరన్నదానికి నాలాంటి వాడికి పంచరత్న కృతులు చాలు అన్నాను (ఆరాధనోత్సవంలో ... అని నా కవిహృదయం). అది మీ మీద విమర్శలాగా మీకు అర్థమయినట్లుంది. హతోస్మి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విచారించకండి. ఒక్క సంకీర్తనం ఇక్కడ రావాలన్నా అది నా స్వకపోలసృష్టిగా మాత్రం రాలేదు. ఐనా ఎలాగూ ఎప్పటికీ ఆగక తప్పదు కదా, ఈ ఉపాధిపరిమితిని బట్టి.

      నా విన్నపానికి సమాధానం దృష్టాంతం ఐనది. ఈకృషి వెనుకనున్న వారిని గురించి మరింతగా తెలిసింది కూడా. ఇంతకంటే బహిరంగంగా వివరించలేను. సారాంశం యేమిటంటే కొనసాగవలెననే. మరొక విషయం కూడా విదితమైనది కాని అది వెల్లడించకూడదు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.