21, జనవరి 2019, సోమవారం

రాహిలాకు నివాళిగా



ఉత్తరాయణపుణ్యకాలం పండుగను జనం పతంగులు ఎగురవేసి జరుపుకుంటూ ఉంటే, ఆ పతంగుల మాంజాల పుణ్యమా అని పక్షులు వేలాదిగా చస్తున్నాయి. అప్పుడప్పుడూ ఆ మాంజాలు మనుషుల్నీ బలితీసుకుంటున్నాయి.

అలా ఒక మాంజా మెడకు చుట్టుకొని గుజరాత్‍లో ఒకమ్మాయు రాహిలా ఉస్మాన్ చనిపోయింది.

మరింత విషాదకర విషయం ఏమిటంటే, రాహిలా పక్షిప్రేమికురాలు. పతంగుల బారినుండి పక్షులను రక్షిస్తూ ఉంటుంది!

ఈసారి కూడా గుజరాత్ అటవీశాఖవారు చేపట్టిన పక్షిసంరక్షణలో పాల్గొని మాంజాలలో చిక్కుపడి పడిపోయిన అనేక పక్షులను రాహిలా కాపాడింది.

కార్యక్రమం ముగిసి రాహిలా ఇంటికి వెడుతుండగా దారిలో ఒక మాంజా వచ్చి ఆమెమెడకు చుట్టుకొన్నది. మెడకోసుకొనిపోయి తీవ్రంగా గాయపడిన ఆమెను అస్పత్రిలో చేర్చినా ప్రయోజనం దక్కలేదు!

ఈ వార్తను ఇక్కడ చదివాను నేను. మనసు వికలం ఐనది. రాహిలాకు నివాళిగా కొన్ని పద్యాలు వ్రాస్తున్నాను.


తే. ఉత్తరాయణపుణ్యకాలోచితంబు
గాలిపటముల నెత్తు టాకాశమునకు
అందరకు వినోదాస్పంద బగుటవలన
యెల్లచోటుల సందడి వెల్లివిరియు

తే. ఎవరిపటమును వా రూఱ కెగుర వేయ
చేతులూపుటను వినోద సిధ్ధి కలదె
యొఱుల పటముల పడద్రెంచి యోజమీఱ
ఆకసంబును గెల్చుట యందు కలదు

తే. మంచిదే కాని ఈయూహ మనిషిబుధ్ధి
వెఱ్ఱితలలు వేయుటను జేసి విజయకాంక్ష
గాలిపటముల దారాల గాజుపూత
గరగరలు పుట్టి ప్రాణాంత కంబులాయె

తే. గాలిపటములు తెగవేయ గలుగుటేమి
గాజుపూతల మాంజాల మోజు వలన
పక్షులకు నక్కటా చావు వచ్చుచుండె
మనిషి పండుగ యెంత దుర్మార్గమాయె

కం. అతితెలివి మనిషివేడుక
గతితప్పిన దాని ఫలము కాసింతైనన్
వితరణము చేయు మనిషికి
ప్రతిగా ప్రకృతియును వీని పండుగ వేళన్

తే. పక్షులే కాదు మనుషుల ప్రాణములును
పోవుచున్నవి మాంజాల పుణ్యమునను
ప్రాణహింసకు దిగునట్టి పండుగేల
ఎన్నటికి వచ్చు మనిషి కొక్కింత బుధ్ధి

తే. పక్షిజాతిని రక్షించ ప్రతినబూని
పాడు మాంజాల నుండి కాపాడి తుదకు
పాడు మాంజాకె రాహిలా వసుధ కూలె
నింత కంటెను దుర్వార్త యేమి కలదు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.