11, జనవరి 2019, శుక్రవారం

జను లెరిగిన రాముడు సాకేతప్రియధనుడు

జను లెరిగిన రాముడు సాకేతప్రియధనుడు
మును లెరిగిన రాముడు మోక్షశ్రీవితరణుడు

జనకునాజ్ఞ మీద నతడు చనినాడు వనములకని
జను లెంచుచుందురు సాదరముగను
తనయుడన్న రామునట్టి తనయుడే తనయుడని
యినకులంబు నీతడు పావనము చేసె నందురు

దేవతల సంకల్పము తెచ్చె నితని వనములకని
భావించి సంతోష పడుదురు మునులు
రావణఖరదూషణాది రాకాసుల పీచమడచ
దేవుడు దిగి వచ్చెనని తెలిసి పొంగుచుందురు

అనిమిషుల కోర్కె దీర్చ హరి రాముడై వచ్చెను
జనకునాజ్ఞ యని చేసె వనవాసము
మునుల కొరకు రాకాసి మూకల నణగించెను
తనకుతానె సాటియైన దశరథనందనుడు