30, జనవరి 2019, బుధవారం

శ్రీవల్లభునే సేవించవలె కైవల్యమునే కాంక్షించవలె


శ్రీవల్లభునే సేవించవలె
కైవల్యమునే కాంక్షించవలె

అరఘడియయును శ్రీహరిసేవనమున
  కాటంకము రాకుండవలె
మరచి యితరములు తిరముగ చిత్తము
  హరిపాదంబుల నుండవలె
కరచరణము లవి హరిసేవల కుప
  కరణము లని భావించవలె
పరమపురుషుడగు హరినే తలచుచు
  పరమానందము పొందవలె

ధరపై శ్రీహరి పరబ్రహ్మమె
  దశరథసుతుడని తెలియవలె
పరమార్థము శ్రీరామబ్రహ్మమును
  భావించుచు లో నెఱుగవలె
నరపతి రాముని నమ్మి భజించుచు
   పరమానందము పొందవలె
తరింప రాముని తారకనాముని
  తహతహలాడుచు కొలువవలె
 
మరువక తారకమంత్రోపాసన
  నిరతము చేయుచు నుండవలె
హరిపారమ్యము నాత్మనెరింగిన
  హరిభక్తులతో చేరవలె
హరిసుగుణములును హరిసత్కథలును
  హరిలీలలనే తలచవలె
హరినామామృత మానుచు నిరతము
  పరమానందము పొందవలె

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.