8, జనవరి 2019, మంగళవారం

రాముడా వైకుంఠధాముడా వినవయా నామనోరథ మైన దా మోక్షమే


రాముడా వైకుంఠధాముడా వినవయా
నామనోరథ మైన దా మోక్షమే

అదియిచ్చి యిదియిచ్చి యటుద్రిప్పి యిటుద్రిప్పి
వదలు దేవతలవంటి వాడవు కావే
ముదమార మోక్షమిచ్చు పురుషోత్తముండ వని
వదలక సేవించుచుంటి భగవంతుడా నిన్ను

ఇలాతలమహారంగస్థలమునం దింతదాక
పలువిధముల తొడుగులలో వర్తించినాడ
అలసిపోతి నింకమీద నాడించవలదు నను
నిలకడగా నీయొద్దనె నిలచియుండ నీవే

ఇప్పించవే స్వామి యింకెంత కాల మని
తప్పించుక తిరిగెదవు దయచూపక
విప్పవయ్య భవపాశము లప్పడా యికనైన
చప్పున నీయెడకు నన్ను రప్పించుకొనవయ్య

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.