17, నవంబర్ 2026, మంగళవారం

నేనో ఛాయామాత్రుడను

 
నేనో ఛాయామాత్రుడను నీవో జ్యోతి స్వరూపుడవు
నేనో మానవమాత్రుడను నీవో దేవదేవుడవు

నేనన నీలో నంశను గావున మానక నీవిదె నాలో నుందువు
నేను నేననెడు నహమిక యడ్డై నేనెన్నడు నిను కనలే కుందును
నేనను భావన యడగిన తక్షణమే నిను నాలో కనగలుగుదును
ఏనాటికి యీ నేనను భావన నేవిధి దాటగ నేర్చుట గలుగును

విడిగా నుండుట సంభవ మగుటకు వేదవేద్య యాకాశ ముండవలె
అడుగు దూరమో అనంత దూరమొ అయ్యా నీకును నాకును యెడము
ఎడము గల్గెనని కాలము గలుగును గడుసు సృష్టియును ఘనముగ గలుగును
విడిగా లేమని తెలిసిన నాడీ యెడబాటన్నది హుళక్కి యగును

నాలో సకలసృష్టిని నిండిన నారాయణుడవు రామా నీవు
నాలో నిండిన మాయాభేదము నాశనమాయెను నిన్నెఱుగుటచే
కాలస్థలములు సర్వసృష్టియును నాలోచించగ నీవిభూతులే
లీలాఖేలన శుధ్ధబ్రహ్మమ నేలను నేనన నీచాయనయా


నిన్నే నమ్మితి రామ విభో

 
నిన్నే నమ్మితి రామ విభో న న్నేమరకుము రామ విభో

ఆపదలందున పెద్దది ఐన ఆపదయనగా రామ విభో
ఈ పగిదిని భవసాగరమందున ఈదులాడుటే రామ విభో

శోకములందున పెద్దది ఐన శోకంబనగా రామ విభో
నీకు దూరమై విలపించుటయే నిక్కంబరయగ రామ విభో

సంతోషముల పెద్దది అయిన సంతోషమన రామ విభో
అంతకు డను వా డొకడున్నాడను చింత తొలగుటే రామ విభో

సిరులన్నిటిలో పెద్దది ఐన సిరి యేదంటే రామ విభో
తరింప చేసే నీ నామము నను వరించు యుండుట రామ విభో

ఘనకార్యంబుల పెద్దది ఐన ఘనకార్యంబన రామ విభో
తనువు పైన మోహమును వీడి నిను తగులుకొనుటయే రామ విభో

చుట్టములందున ముఖ్యుండైన చుట్టం బెవడన రామ విభో
ఇట్టే భవ చక్రంబును ద్రుంచే ఈశ్వర నీవే రామ విభో

కర్మములందున ముఖ్యం భైన కర్మం బేదన రామ విభో
నిర్మల మగు సద్భక్తిని కలిగి నీకు మ్రొక్కుటే రామ విభో

చదువుల యందున పెద్దది ఐన చదువేదన గా రామవిభో
విదితముగా నీ పైన భక్తిని వెలయించినదే రామ విభో

పలుకుల యందున మేలిమి ఐన పలుకేదనగా రామ విభో
పలికిన భవతారకమగు నీదు ప్రశస్తనామమె రామ విభో

నమ్మదగిన వాడెవడయ్యా యన నారాయణ శ్రీరామ విభో
అమ్మవు అయ్యవు గురుడవు దైవము నైన నీవె కద రామ విభో

రామ రామ రఘురామ రామ జయరామ రామ శ్రీరామ విభో
కామిత వరదా కరుణామయ న న్నేమరకయ్యా రామవిభో

14, నవంబర్ 2026, శనివారం

నీవు దయామయుడ వని నేనెఱుగుదును


నీవు దయామయుడ వని నే నెఱుగుదును

ఆ విషయము తక్క నే నన్య మెఱుగను

 

నీ నామ మది యేదో నే నెఱుగను

నే నేమని పిలువవలయు నే నెఱుగను


నీ దివ్యరూపంబును నే నెఱుగను

నీ దివ్యప్రభావమును నే నెఱుగను


నీ భావ మదియేమొ నే నెఱుగను

నా భావము లెఱుగుదువా నే నెఱుగను


౪నీతో నెవరుందురో నే నెఱుగను

నాతో కలిసుందువా నే నెఱుగను


నీ తీరుతెన్ను లేవి నే నెఱుగను

నీ తత్త్వ మదియేమొ నే నెఱుగను


నీ వెంతటి వాడవో నే నెఱుగను

నీ వెచట నుందువో నే నెఱుగను


నీ వెపుడు వచ్చెదవో నే నెఱుగను

నీ వసలు వచ్చెదవా నే నెఱుగను


నీ వార లెవ రన్నది నే నెఱుగను

నీవాడ నగుదు కాను నే నెఱుగను


నీవు నను చూచెదవో నే నెఱుగను

నీవు నను కరుణింతువొ నే నెఱుగను


నీవు నన్ను నమ్ముదువా నే నెఱుగను

నీవు నన్ను చేరెదవా నే నెఱుగను


నిన్ను రాము డందురని నే నెఱుగుదును

నిన్ను నమ్మవచ్చు నని నే నెఱుగుదును


నీ కోసమె నేనుంటిని నే నెఱుగుదును

నాకు నీవె లోకమని నే నెఱుదును


నిన్ను నేను వలతు నని నే నెఱుగుదును

నన్నెప్పుడు గ్రహింతువో నే నెఱుగను


అడవిపూలతో దండ

  
అడవిపూలతో దండ నల్లి తెచ్చి రామయ్య
మెడలోన వేసి మురిసె మేదినీసుత

నాకు దండ నల్లి తెచ్చినావు నీవు జానకీ
నీకు దండ నల్లి వేయ నాకు వశంబౌనటే
నాకా పుష్పాపచయపు నాజూకును తెలియదే
ఈ కార్ముకవిద్య తప్ప యేమి చేతు ననెను హరి

అంతలోనె సౌమిత్రియు నరుగుదెంచెను బుధ్ధి
మంతుడైన నతడు తెచ్చె మంచి వనమాలికను
సంతోషపడుచు నంత స్వామి వనమాల సీతా
కాంత కంఠసీమ నుంచి గలగలమని నవ్వెను

చిరునగవుల సౌమిత్రియు సీతారాముల జూచి
విరిదండను దాల్చినాడు వేడుకతో మాయన్న
సరి సరి వనమాల దాల్చె చక్కగా వదిన యన
హరి ధరాత్మజలు దండ లపుడు మార్చుకొన్నారు


13, నవంబర్ 2026, శుక్రవారం

దశోపనిషత్సారశ్రీరామభద్రస్తోత్రం


శ్రీమద్రామపదారవిందమధు యే భృంగాః సరాగా అమీ
సేవంతే సనకాః శుకాదిమునయస్తేషాం న కాచిత్స్పృహా .
శ్రీమద్రామపదారవిందమధునో జానంతి వై తే రసం
తత్స్వాదాత్పరసౌఖ్యదా భవతి యా సా స్యాత్స్థితిర్నః సదా .. 1..

ఈశావాస్యమిదం జగత్భవతి భో జీవాః సుఖాన్వేషకాః
నాస్త్యస్మిన్ సుఖలేశ ఇత్యుత ఇహ బూతే శ్రుతిర్మా గృధః .
భుఞజీథా ఇతరాం చ రామపదవీం త్యక్తేన తేనాధునా
మోహో నాస్తి న శోక ఇత్యపి భవేదేకాత్మతాదర్శనే .. 2..

శిష్యః పృచ్ఛతి కేన ఖాని చ మనః ప్రాణా గురో చేశితాః
యచ్ఛ్రోత్రం శ్రవణస్య వాక్చ వచసశ్చిత్తస్య చేతోపి తత్ .
చక్షుర్గచ్ఛతి నో మనో న చ వచో యత్రాస్తి తత్కో వదేత్
ఏతత్తే ప్రభురామరూపమగుణం యక్షాత్మకం సర్వభృత్ .. 3..

శ్రేయః ప్రేయ ఇతి ద్వయం ఖలు తయోస్తచ్ఛ్రేయ ఏవాభయం
ధీరో యస్తు విరక్తచిత్తవిలయసంధన్యః కృతీ చాత్మవిత్ .
సూర్యాచంద్రమసౌ న యత్ర హుతభుగ్ రామస్య తస్మిన్ పదే
శుద్ధే శుద్ధజలం యథా భవతి సః స్వాత్మైవ వక్తి శ్రుతిః .. 4..

తం వేద్యం పురుషం హి వేద న పరం వేద్యం న తన్మృత్యుభిః
యోఽస్యామేవతనౌ విభాతి సతతం శుభ్రో భవత్యక్షరః .
యజ్జ్ఞాత్వా ముదమశ్రుతేఽత్ర సకలం భద్రం చ సర్వజ్ఞతాం
తచ్ఛ్రీరామపదస్వరూపమమలం జ్ఞేయం చ గేయం పునః .. 5..

యద్జ్ఞానాద్విదితం జగత్తదవికృద్ధామస్వరూపం స్వయం
విజ్ఞాయ స్వగురోర్ముఖాత్పరమితో భిన్నం న వేత్తి క్వచిత్ .
సింధుం ప్రాప్య యథా న ముఞచతి నదీ విద్వాన పరం విందతే
యో వై తత్పరమం చ వేద సతతం బ్రహ్మైవ స బ్రహ్మవిత్ .. 6..

ఓంకారం వ్యభజచశ్రుతిర్వదతి తదభుతం భవిష్యద్గవత్
జీవేశౌ చ విభావయత్యపి పునర్బ్రూతే తయోరేకతాం .
యద్జ్ఞాత్వా నితరామభిన్నపదవీం ప్రాప్నోత్యమాత్రాం శివాం
శుద్ధం తుయరి మదం స్ఫుటం పరిమితి శ్రీరామభద్రోవ్యయః .. 7..

సంసారస్య చ రేరివా మమ తు యా కీర్తిర్గిరేరున్నతా
యతూర్ధ్వ జగతోఽస్య మూలమితి తద్ బ్రహ్మాత్మమద్రూపకం .
యజ్జ్ఞాత్వా స్వమృతం పరం విభురహం బ్రూతే త్రిశఙకుర్యతః
తచ్ఛ్రీరామప్రదారవిందభజనే కిం వా భవేద్దుర్ఘటం .. 8..

ఆనందాత్సముదీర్య యాన్బహువిధాన్బాహ్యాన్పరాం శ్వాపరాన్
సత్యం జ్ఞానమనంతమక్షరమహం యో వేద నిష్కామతః .
సర్వాన్ సోఽశ్రుత ఇత్యపి శ్రుతిరహో బూతే పరం విందతే
తత్ శ్రీ రామపదం భజధ్వమధునా బ్రహ్మైవ యన్నిభయం .. 9..

యత్సృఋష్టస్థితిపాలనం విదలనం ధృత్వాపి సాక్షీ స్వయం
అన్నం ప్రాణమనోమతిభ్య ఇతి తచ్చానందకోశాగతిమ .
యన్మాయారహితం చకాస్తి సతతం కార్యం న యస్మిన్ క్వచిత్
తచ్ఛ్రీ రామపదం భజామి నితరామానందమాత్రం శివం .. 10..

యేనేదం మన ఇన్న్ద్రియాణి చ తథా ప్రాణా జగజ్జాయతే
జన్మాదిష్వపి జాగ్రదాదిషు తథా యజ్జ్ఞాపకం విస్ఫుటం .
యస్మిన్సర్వజగత్ప్రతిష్ఠితమిదం రజ్వాం యథా హి భ్రమః
ప్రజ్ఞానం ప్రభురామరూపమచలం తచ్చింతయే సిద్ధయే .. 11..

యో భూమా సుఖమద్వితీయమధునా జానీహి తత్త్వం బృహత్
తచ్ఛ్రీరామపదాత్మరూపమితి యత్సూక్ష్మాచ్చ సూక్ష్మం పరం .
శ్రద్ధత్స్వేతి పునశ్చ తత్త్వమసి భేరాబూ?రతే శ్రుతిర్నైకధా
జ్ఞాత్వా స్వల్పమిదం హి మర్త్యమిహ యత్సత్యం భజే తత్పదం .. 12..

బ్రహ్మాగ్రే యదవేదహం పునరిదం తత్సర్వమేవాభవత్
నాస్త్యస్మాదపరం యతో జగదిదం బ్రహ్మైవ సర్వం ఖలు .
తద్యోఽబుధ్యత సోఽభవత్తదపరం నాసీత్స ఏవాద్వయః
జ్ఞాత్వా శ్రీగురురామరూపమభయం చాశ్రిత్య ధన్యా వయం .. 13..

దశోఽపనిషదాం సారం శ్రీరామస్తవముత్తమం .
యః పఠేచ్ఛూణు యాభక్త్యా ముక్తిభాక్స భవేద్ధురవం ..

ఇతి దశోపనిషత్సారశ్రీరామభద్రస్తోత్రం సంపూర్ణం ..

ఆధారం:   https://share.google/qbWzk7nMI5CJx1eba

10, నవంబర్ 2026, మంగళవారం

అలుకచాలు రామయ్యా అన్నానికి రావయ్యా

 

అలుకచాలు రామయ్యా అన్నానికి రావయ్యా
అలా బాణమేయు విద్య అమ్మ తెలుపు లేవయ్యా

అన్నీ నీకు తెలుస్తాయి అస్త్రాలని ఉంటాయి
కొన్నాళ్ళాగా వంటే గురువు లవి చెబుతారు
నిన్ను మించు విలుకాడే నేల నింగి నుండడయా
కన్నతండ్రి రామయ్యా కైకమ్మను నమ్మవయా

చిట్టిచిట్టి చేతు లివి చిగురుటాకు చేతులివి
పట్టలేవు విల్లంబులు కొట్టలేవు గురిచూసి
కొట్టే రోజు వచ్చునయా కొంచెమాగు రామయ్యా
కొట్టగలవు పెద్దపెద్ద కోరలున్న రాకాసుల

వికచోత్పలనయన చిన్న వింటి నిత్తు రామయ్యా
చకచకా బాణాలను సంధించుట నేర్పెదను
నికార్సయిన వీరునిగా నిన్ను తీర్చి దిద్దెదను
ఇకనైనా అలుక మాని ఇంత బువ్వ తినవయ్యా


కోరుదు నీదయామృతము గోవిందుడా

 

కోరుదు నీదయామృతము గోవిందుడా నా

కోరిక నెరవేర్చ వయ్య శ్రీరాముడా


కోరనుగా వాహనములు గోవిందుడా నేను

కోరనుగా భూము లిండ్లు గోవిందుడా

కోరనుగా బలగంబులు గోవిందుడా నేను

కోరనుగా సిరు లేవియు గోవిందుడా


కోరనుగా దొరతనములు గోవిందుడా నేను

కోరను మృష్టాన్నములను  గోవిందుడా

కోరనుగా దేహబలము గోవిందుడా నేను

కోరనుగా దీర్ఘాయువు గోవిందుడా


కోరనుగా పరుల మెప్పు గోవిందుడా నేను

కోరనుగా కీర్తి గీర్తి గోవిందుడా

కోరనుగా యేమహిమలు గోవిందుడా నేను

కోరనుగా మరల జన్మ  గోవిందుడా



9, నవంబర్ 2026, సోమవారం

కులుకుచు నాగుండెలోన కూరుచున్న వాడవు

 
కులుకుచు నాగుండెలోన కూరుచున్న వాడవు నీ
వులుకుపలుకు లేకుండగ నుండనేలరా 

నేల నాలుగు చెరగులను నేను నీదు కీరితినే
మేలుగాను చాటుచుండ మెచ్చికోలుగ
వీలైతే యొక్కమాట వీలుకాదొ చిరునగవు
చాలు కదా దయచేయగ జాలవేమిరా

ఇన్ని జన్మములను దాల్చి యింత కాలముగను నేను
నిన్ను పొగడుచుండ నీవు మిన్నకుందువా
కన్నతండ్రి వనుచు కదా నిన్ను నేను పొగడుచుంటి
కన్నబిడ్డ ననుచును మమకారము లేదా

ఇంత గురుతు నిచ్చి మరియు నంత ముద్దు చేసి యిపుడు
సుంత కరుణ జూప వింత పంతమేలరా
చింతలన్ని చెదరగొట్టి శ్రీరామా కావుమన్న
వింతగాను నీవు వినియు విననియటు లుందు వేరా



8, నవంబర్ 2026, ఆదివారం

రార శ్రీరామ సంసారవిముఖకామ

 
రార శ్రీరామ సంసారవిముఖకామ
వారిజాసనవినుతశూర సుగుణధామ

చారుమందహాససహితచంద్రవదన రామ
శ్రీరమారమణ సర్వసేవ్య పరంధామ
మారవైరిసదావినుత మంగళకరనామ
ఘోరపాపశాపశమనకుశల శుభదనామ

నారాయణ సదాసురానంద సీతారామ
భూరికృపాపరాయణ పురుషోత్తమనామ
క్రూరదైత్యవిదళనశర కోదండరామ
సారసాక్ష సకలలోకసార్వభౌమ రామ

ధీర గంభీర సదాచారసుముఖ రామ
పూరితనిజభక్తకామ పూర్ణకామ రామ
శౌరి సకలయోగిరాజసంపూజ్యనామ
దూరీకృత దీనలోకదుఃఖ భవవిరామ



7, నవంబర్ 2026, శనివారం

నీనామమే మాకు నిజమైన ధనము

 
నీనామమే మాకు నిజమైన ధనము
జానకీనాయక జగదేకనాయక

చిక్కి మాయలోన మేము సిరుల వేటలో పడి
ఎక్కడెక్కడనో వాని నెల్లప్పుడు వెదకచు
దక్కిన స్వల్పంబులనే తలచితలచి మురియుచు
నిక్కువముగ వెర్రులమై నిను మరతుము కాని

ఎంత ప్రోగు చేసినను ఎంత ప్రేమ జూపినను
సుంతైనను వెంటరాని సొమ్ములకై తిరుగుచు
నెంతకాలమైన కాని నించుకయు బుధ్ధిరాక
పంతగించి నిను మరచి పరుగిడుదుము కాని

రామనామ మిచ్చును సామ్రాజ్యములని యెరుగము
రామనామ మిచ్చు సర్వకామనలని యెరుగము
రామనామ మిచ్చు మోక్ష రాజ్యమని యెరుగము
ఏమేమో ధనములనుచు నెంచి చెడుదుమే కాని

4, నవంబర్ 2026, బుధవారం

కాలజ్ఞానము తెలియండీ - 2

 

కాలజ్ఞానము తెలియండీ పో

గాలపు రాకడ తెలియండీ


నేలా నీరూ నలుపౌనండీ

 చాలామందే చచ్చేరండీ

కాలేకత్తుల వానలుకురియగ

 చాలామందే చచ్చేరండీ

బాలిసు లూళ్ళను కాల్చివేయగ

 చాలామందే చచ్చేరండీ

తూలుచు తెలియని వ్యాధులపాలై

 చాలామందే చచ్చేరండీ


బారులుతీరిన వీరులందరను

 భామిని యొక్కతె జంపేనండీ

క్రూరమతమ్మును కూలదోయగ

 కోమలి యొక్కతె పుట్టేనండీ

ఔరా వేరొక కూటమతమ్మును

 కోమలి యొక్కతె కూల్చేనండీ

వేరొక భామిని ధూర్తత్వంబున

 వేలకొలదిగా చచ్చేరండీ


నీలాకాశము ధూళిమయంబై

 చాలామందే చచ్చేరండీ

చేలను చెట్లను సారము చెడగా

 చాలామందే చచ్చేరండీ

పాలిచ్చే యేపసరము దొరుకక

 చాలామందే చచ్చేరండీ

చాలా గ్రహములు మూలను చేరగ

 చాలామందే చచ్చేరండీ


యెక్కడలేని యుపద్రవములచే

 చిక్కిజనంబులు చచ్చేరండీ

మిక్కిలి జనములు బ్రతికే దారే

 యెక్కడ నుండక పోయేరండీ

అక్కడక్క డొక భాగవతోత్తము

 డొక్కడుమాత్రము మిగిలేనండీ

చక్కగ రామా రామా యనువా

 రెక్కడున్నను బ్రతికేరండీ


3, నవంబర్ 2026, మంగళవారం

కాలజ్ఞానము తెలియండీ - 1

కాలజ్ఞానము తెలియండీ కల
 కాలము బుధ్ధిగ నుండండీ

నానా బాధలు పెట్టేకాలము 
 నరులారా ముందుందండీ
దానిని దాటునుపాయము తెలిసిన
 ధన్యులు మాత్రము లేరండీ
మానవులంతా దుర్బుధ్ధులలో
 దానవులను మించేరండీ
కాని కాలమున కడు దుస్సహమగు
 కాటకములు కలిగేనండీ

వానలు కురియక పంటలు పండక
 మానవు లల్లాడే రండీ
కూనల కైనను తిండిపెట్టుటకు
 కొంచెమైన కనబడదండీ
చేనులు బీళ్ళై ఊళ్ళకు ఉళ్ళే
 చితికి శ్మశానా లగునండీ
కోనల తిరుగుచు కొండల తిరుగుచు
 గొల్లున విలపించేరండీ

కల్ల గురువుల చుట్టూ మనుజులు
 కాకులవలె మూగేరండీ
కల్లదైవముల గొలుచుచు బహు దు
 ష్కర్మంబులు చేసేరండీ
తల్లిదండ్రులను తన్నే బిడ్డలు
 ధర్మము నణగించేరండీ
అల్లరిచేసే కుజనుల ధాటికి
  అనేకు లణగారే రండీ

ఏవేవో దుర్మతముల బోధల
 నెల్లరు చెడిపోయేరండీ
పూవుల యందున తావియన్నదే
 పుట్టనిదై పోయేనండి
వావివరుసలును బాంధవ్యములును
 వసుధ నుండి పోయేనండీ
కోవెల లరుదగు పూజలుండ విక
 గోవిందుని మరచేరండీ

ఈమాయలు ఆమాయలు చేసే
 హీనుల పూజించేరండీ
రామమంత్ర ముపదేశించినచో
 రాళ్ళతోడ కొట్టేరండీ
భూమిని లక్షల కొక్కరిద్దరే
  రాముని తలపోసేరండీ
రాముని నమ్మిన వారు మాత్రము
 లక్షణముగ మిగిలేరండీ


చిన్నమాట. "మిష్టర్ వీటో"

ట్రంప్ గారికి కోపం వచ్చింది. డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్‌ వీటో’గా మారిపోతా.. అని గర్జించారు. డెమోక్రాట్లు గెలిస్తే అన్ని నిర్ణయాలను వీటో చేస్తానని హెచ్చరించారు.

చిత్తం. అంతా మీయిష్టం కదా ట్రంప్ గారూ. మీరేమో ప్రజలెన్నుకున్న అద్యక్షులాయె. ఇంకా ప్రజలు వేరెవరికైనా ఓటు వేయటం ప్రజాస్వామ్యం ప్రకారం చెల్లదు కదండీ. మీరే దేశం. మీరే ప్రజలు. మీరే ప్రపంచం. కాదన్నవాడికి పుట్టగతులు ఉండకూడ దంతే.

చిన్నమాట. "అటు నేనే - ఇటు నేనే"

రాప్తాడులో గోపిక అనే విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను కాపాడేందుకు జగన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసిన సాల్మన్‌ రాజు, మంగళగిరికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు గుండా గోపీకృష్ణ ద్వారా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయించారని ఒక వార్త వచ్చింది. అందులో "ఒకవైపు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆడబిడ్డను పరామర్శించి మొసలి కన్నీరు కారుస్తూనే, మరోవైపు ఆ దాడికి పాల్పడిన వ్యక్తిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు" అంటున్నారు!

జగన్ గారు "అటు ఉన్నది నేనేలే ఇటు ఉన్నది నేనేలే" అంటున్నా రన్న మాట

చిన్నమాట. "ఉద్యమకారుడి బలవన్మరణం"


జనగామ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్  ఆత్మహత్య వార్త, "తండ్రి కష్టపడి చదివిస్తే, ఉద్యమంలో పాల్గొని జీవితాన్ని పాడుచేసుకున్నాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల బతుకులు మారలేదు" అని ఆవేదనతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు!

కేసీఆర్ & కుటుంబం కన్నా గొప్ప ఉద్యమకారులు ఎవరున్నారు? వారి బ్రతుకులు ఎంతగా మారాయి? వారెంత బాగుపడ్డారు? కాని ఉద్యమకారుల బ్రతుకులు మారలేదు అంటున్నారు ఏమిటి?

రాముని యిఛ్ఛ ప్రకారము గానే

 

రాముని యిఛ్ఛ ప్రకారము గానే

 బ్రహ్మాండంబులు నడిచేను

రాముని యిఛ్ఛ ప్రకారము గానే

 భూమిని సర్వము జరిగేను


రాముని ఆటకు తగిన విధముగా

 భూమియె వేదిక గానగును

భూమిని వేదికగా నొనరించుచు

 రాముడు కథ నడిపించేను

రాముడు కథ నడిపించుట కొరకై

 భూమికి హంగులు కూర్చేను

భూమిని నానాజీవుల చెట్టూ

 చేమల జాతుల నింపేను


రాముని యిఛ్ఛ ప్రకారము జీవుడు

 భూమిని వేషము క ట్టేను

భూమిని వేషము కట్టేను ఆ

 స్వామి కోసమే ఆడేను

స్వామి కోసమే ఆడుట లోనే

 స్వామికి వేడుక గొలిపేను

స్వామి చాలుచా లన్నపుడే తన

 స్వస్వరూపమును పొందేను


రాముని యాటను రాణించే యీ

 బ్రహ్మాండము లివి యెక్కడవి

రాముని యాటల రంగస్థలములు

 రాముని యిఛ్ఛాకల్పనలు

రాముని యాటల నాడే జీవులు 

 యేమయ్యా వీరెవరయ్యా

రాముని యిఛ్ఛారూపములే యీ

 భూమిని జీవులు పోవయ్యా

 

మనకెందుకు పోనీ

 

మహి నెవ్వరి కేమహిమ యున్నదో

 మనకెందుకు పోనీ మనసా

మహిలో ఎవ్వరి మర్మమెట్టిదో

 మనకెందుకు పోనీ 


దినదిన మందరు వేల్పుల గొలుచుట

 మనకెందుకు పోనీ మనసా

పనిగొని వారిని వీరిని పొగడుట

 మనకెందుకు పోనీ

ధనముల కొరకై తలక్రిం దగుటలు

 మనకెందుకు పోనీ మనసా

మనుజుల నల్పులు మాటలు మిగిలిన

 మనకెందుకు పోనీ 


తనువుల కేవో తగులము లుంటే

 మనకెందుకు పోనీ మనసా

తనువుల కేవో తాపము లైతే

 మనకెందుకు పోనీ 

తనువుల వృధ్ధిక్షయములు గలిగిన

 మనకెందుకు పోనీ మనసా

తనవుల బాగోగులకై చింతలు

 మనకెందుకు పోనీ 


ఇనకులపతి చింతనమున కన్యము

 మనకెందుకు పోనీ మనసా

మన రాముని సేవలకు నప్పనివి

 మనకెందుకు పోనీ 

మనసాధన కనుకూలము కానివి

 మనకెందుకు పోనీ మనసా

మనకు మోక్షమే ముఖ్య మన్యములు

 మనకెందుకు పోనీ 


2, నవంబర్ 2026, సోమవారం

రాముని కన్నా చుట్టం బెవడే

 
రాముని కన్నా చుట్టం బెవడే
 రాలుగాయి మనసా నీకు
రాముని కన్నా ఆప్తు డెవ్వడే
 భూమి మీద మనసా

చిక్కులు నిన్ను చుట్టుముట్టితే
 చేరు మతని చెంత నీకు
దిక్కు తోచని దినమున వానికి
 మ్రొక్కు లిడవె మనసా
మిక్కిలి దయగల వాడే రాముడు
 నిక్కువ మిది మనసా నీకు
చిక్కులు చింతలు తీర్చి బ్రతుకును
 చక్కజేయు మనసా

పనికిమాలిన పామరజనులను
 కొనియాడకు మనసా నీవు
ఘనుడగు శ్రీరఘురామచంద్రుని
 కొనియాడవె మనసా
ఉనికికి మనికికి రాముని దయ నీ
 కున్నది కద మనసా వేగ
కనికరించి యిక మోక్ష మిమ్మని
 తనను వేడవే మనసా

అది యొక్కటె నీవహర్నిశలును
 హరి నడుగవె మనసా నీవు
అదిగా కన్యము లడిగి చెడకువే
 అమాయకపు మనసా
మృదుస్వభావుడు 
రాముడు దయతో
 మేలుచేయునే మనసా వాడు
సదమలపరమపదమ్మున నిన్ను
 స్థాపించును మనసా

1, నవంబర్ 2026, ఆదివారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

 
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం 

పరమాత్మా హరి సీతారాం బ్రహ్మాదివినుత సీతారాం 
కారణకారణ సీతారాం కౌసల్యాత్మజ సీతారాం 
దశరథనందన సీతారాం దానవమర్దన సీతారాం
లక్ష్మణసంయుత సీతారాం రమ్యగుణార్ణవ సీతారాం 
మాయామానుష సీతారాం మానవనాయక సీతారాం
శిక్షితరాక్షస సీతారాం రక్షితమునిమఖ సీతారాం 
సర్వమనోహర సీతారాం సత్యపరాక్రమ సీతారాం 
ప్రియమృదుభాషణ సీతారాం శ్రితజనవత్సల సీతారాం
కరుణాసాగర సీతారాం కామితదాయక సీతారాం
ఘనకార్ముకధర సీతారాం హనుమత్సేవిత సీతారాం 
రావణసంహర సీతారాం బ్రహ్మాద్యభినుత సీతారాం 
పావన‌సుచరిత సీతారాం భవభయవారక సీతారాం 

26, అక్టోబర్ 2026, సోమవారం

ఎక్కడి వాడో యీజీవుడు తా నెప్పటి వాడో యీజీవుడు


ఎక్కడి వాడో యీజీవుడు తా 
  నెప్పటి వాడో యీజీవుడు
మిక్కిలి నటనల యీజీవుడు పర
  మేశ్వర వింతైన యీజీవుడు

క్రిందికి మీదికి గెంతుచు బహు ప
 సందుగ నెగిరే జీవుడు
అందని వాటికి నర్రులు జాచుచు
 క్రుందుచు నుండే యీజీవుడు

కాలతరంగిణి డోలలలోన
 తేలుచుమునిగే జీవుడు
గాలికెగురు తృణకణము విధాన
 తూలుచు నుండే యీజీవుడు

భూమిని నిత్యము పుట్టుచు చచ్చుచు
 రాము నెరుంగని జీవుడు
ఏమో యెపుడో ఈశ్వరకృపచే
 రామభక్తుడౌ నీజీవుడు


20, అక్టోబర్ 2026, మంగళవారం

రాముడు రాడా రాముడు లేడా

 
రాముడు రాడా రాముడు లేడా
స్వామికి నాపై జాలే లేదా

ఎందుకు నన్నీ యిలపై కంపెను
ఎందుకు కష్టము లిన్నిటి నిచ్చెను
ఎందుకు మొరవిన నిచ్చగించడో
ఇందే మర్మం బిముడి యున్నదో

తన యాదేశమె తలపై దాల్చితి
తన కార్యములకె ధరకరు దెంచితి
తన పారమ్యమె ధర కెరిగించితి
తన కేమిటి కని దయరాదాయెను

పెక్కు జన్మముల పిలిచి యలసితిని
పెక్కు విధంబుల పిలిచి యలసితిని
ఒక్క మారయిన దక్కడు చూపుకు
ఒక్క మారయిన చక్కగ పలుకడు

కనబడితే నే వెనుదవిలెద నని
కనరాకున్నా డనుకొన వలెనా
కనరాకున్నా డని నే నలిగితి
ఘను డదియైనను గమనింపడుగా

కరుణాత్ముండని గట్టిగ పొగడితి
హరి యది వినియును కరుగడు చిత్రము
సరిసరి యిక నీ స్వస్థానమునకు
తిరిగి రమ్మనడు దేవుడు చూడుడు


హరా యనక హరీ యనక మరే మందువో

 

హరా యనక హరీ యనక మరే మందువో

మరే మనిన మోక్ష మబ్బు మాట సున్నరా


హరహర శివ శంభో యని యార్తితో పిలిచితే

పరమశివుం డగుచు నీకు పలుకునురా దైవము

హరదీక్షాపరుడ వగును నరజన్మము నడిపితే

మరల గర్భనరక మన్న మాట లేదు సత్యము


రామ రామ రామ యని ప్రేమతో పిలిచితే

రామచంద్రు డగుచు నిన్ను రక్షించును దైవము

రామభక్తివిశేషమే ప్రాణముగా బ్రతికితే

భూమి నింక నీ వెన్నడు పుట్ఝబోవు సత్యము


ఎవరెవరినొ యెంచి నీవు యింపుగా పిలిచితే

భువిని నిన్ను కటాక్షించబోదు కదా దైవము

వివర మెరిగి హరిహరులను వేడుకొన్న వారికే

భవబంధవిమోచన మను పలుకు మిగుల సత్యము



19, అక్టోబర్ 2026, సోమవారం

హరేరామ యనే శ్రీహరినామము


హరేరామ యనే శ్రీహరినామము
హరేకృష్ణ యనే శ్రీహరినామము

అతిసులభ మైనది హరినామము
అతిసుఖద మైనది హరినామము
అతిమధుర మైనది హరినామము
అతి విమల మైనది హరినామము

పరమసంపత్ప్రదము హరినామము
పరమశాంతిప్రదము హరినామము
పరమతేజఃప్రదము హరినామము
పరమధామప్రదము హరినామము

నిరుపమానధనము హరినామము
పరమయోగిహితము హరినామము
పరమేష్ఠి భావించు హరినామము
పరమశివుడు నుడువు హరినామము


ధర మీద పుట్టించి తైతక్క లాడించి

 
ధర మీద పుట్టించి తైతక్క లాడించి
హరి నీవు మాతోడ నాడేవులే బలే

ఆంతు తెలియగ రాని వింతలు కల్పించి 
అంతంతమాత్రపు నాటకు రుచిపెంచి
చింతలు కల్పించి చిందులు వేయించి
అంతలోనే యెంచి యవలకు పంపించి

వేల వేసంబులు వేయించి పిమ్మట
జాలిని చూపించి చాలించి యాటను
లీలగ వేరొక్క రీతిగ నాడింప
ఆలోచనము చేసి మేలైన విధమెంచి

పామరత్వము బాపి బహు దీవనలు సేసి
రామనామ మిచ్చి రంజుగ పాడించి
నామపారమ్యము నలుగడ చాటింప
భూమిని నీభటుల పొలుపుగ మమ్మిట


18, అక్టోబర్ 2026, ఆదివారం

గోపాల గోవింద మాంపాలయ


గోపాల గోవింద మాంపాలయ పరి
తాపోపశమనైకదక్షకృపామేఘ

కేశవ మాధవ కిల్బిషమోచన
నాశనరహిత యనాథశరణ్య
దశరథసుత భవతారణనౌకా
శ్రీశ సురాధిపసేవ్యపదాంబుజ

కామితదాయక కరుణాధామా
శ్రీమద్దశరథప్రియధన రామా
పామరపండితభావితనామా
క్షేమంకర హరి శ్రితజనవత్సల

కరధృతభూధర ఘనసుగుణాకర
గురుమఖరక్షక సురరిపుశిక్షక
సురగణతోషక సుజనసుపోషక
హరి నిర్వాణమహాఫలదాయక


17, అక్టోబర్ 2026, శనివారం

కరుణించవలయు నను కాదులే దనక

 

కరుణించవలయు నను కాదులే దనక

పరమభక్తుడనను భావంబు తోడ


నరసింహుడవు నీవు నారాయణుడ వీవు

పరమాత్ముడవు నీవు పట్టాభిరామా

కరుణాళుడవు నీవు వరదాయకుడ వీవు 

సురసేవ్యుడవు నీవు సొంపుమీరగను


కరివరదుడవు నీవు కాలరూపుడ వీవు

పురుషొత్తముడ వీవు భువనైకనాథా

ధరణిజాపతి వీవు సరసహృదయుడ వీవు 

సురవైరికాలుడవు సొంపుమీరగను


రవికులేశుడ వీవు రఘునాథుడవు నీవు

కువలయేశుడ వీవు గోవిందరామా

భవతారకుడ వీవు బాగుగా నామొఱల

నవధరించుచు మిగుల నానందముగను


14, అక్టోబర్ 2026, బుధవారం

శ్రీరాం జయరాం సీతారాం

 

శ్రీరాం జయరాం సీతారాం

కారుణ్యాలయ శ్రీరఘురాం


దినకరఘనకుల దీపన రాం

జననుతసద్గుణసంయుత రాం

మునిజనకామిత మోహన రాం

దనుజకులైకవిదారణ రాం


విరించిసన్నుతవిక్రమ రాం

ధరాతలేశ్వర దశరథ రాం

పురాణపూరుష సురేశ రాం

సురారిగర్వవిశోషణ రాం


పవమానాత్మజ భావిత రాం

భవనుత త్రిజగత్పావన రాం

భువనేశ్వర బుధపోషక రాం

ధవళేక్షణ భవతారక రాం


12, అక్టోబర్ 2026, సోమవారం

నీవే దిక్కని నిజముగ నమ్మిన


నీవే దిక్కని నిజముగ నమ్మిన

జీవుడ నిక నీ చిత్తము రామా


అతిచపలాత్ముడ నతిమూఢాత్ముడ

నతిదుర్మార్గుడ నతిపాపాత్ముడ

నతిక్రూరాత్ముడ నయ్యును నీయెడ

నతివినయాత్ముడనై యనిశయంబును


దొరకిన జన్మము దురుపయోగముగ

దిరిగితి స్వల్పము లరయుచు ధరపై

మరవరాని నిను మరచి చరించితి

స్ఫురణ కలిగి యిదె శరణం బంటిని


పగవా డైనను పాదము లంటిన

తగిన విధంబుగ దయజూపెదవే

జగదీశ్వర నను సత్వర మేలగ

తగు నని తలపవె దశరథనందన


9, అక్టోబర్ 2026, శుక్రవారం

నిను దక్క వేరెవ్వరిని


నిను దక్క వేరెవ్వరిని నమ్మని
నను బ్రోవ బెట్టేల నాస్వామి

నీవుండ చేజాచి నేనొరుల కడ
నేవేని వేడిన దెన్నడు లేదే
నీవేది యిచ్చిన నేనది గైకొని
భావింతు నదియే పదివే లనుచును
నావంక జూచుటె నగుబాటన్నట్లు
నీవేల నటనలు నేడు సేసేవు

ఎన్నెన్ని జన్మల నెత్తించినావో
ఎన్నండు నందుల కేమన లేదే
తిన్నగా నిచ్చిన దేహము గైకొని
నిన్నలరింపగ నే నాడితినే
అన్నన్నా నేనలసితి నంటేను
విన్నను వినలేదన్నటు లున్నావు

పెద్దపేరే గల వెన్నుడవే నీవు
పెద్దగ సిరులేవి వేడుటలేదే
కొద్దిగ దయజూపి కోదండరామా
అద్దరి ననుజేర్చ మంటినిగాని
ముద్దుగ భక్తాళి మొరలే వినరాని
మొద్దునిద్ధురలో మునిగున్నావో

3, అక్టోబర్ 2026, శనివారం

హరేహరే


హరేరామ హరేరామ రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే

నిరుపమానగుణాకర నీలవర్ణ హరేహరే
పరమయోగిసేవ్యమాన పాదపద్మ హరేహరే

మారజనక నారాయణ మధుసూదన హరేహరే
దూరీకృతభవబంధన తోయజాక్ష హరేహరే

దానవేంద్రమదవిదార మానవేంద్ర హరేహరే
జ్ఞానగమ్య సదానంద శ్రీనివాస హరేహరే

మునిమానసరాజహంస వనజేక్షణ హరేహరే
జనకసుతామనోరమణ జగదధీశ హరేహరే

సనకాదిమునీంద్రవినుత సర్వేశ్వర హరేహరే
వినతాసుతఘనవాహన విష్ణుదేవ హరేహరే

శాపతాపశమననిపుణశాంతమూర్తి హరేహరే
పాపతిమిరవిధ్వంసనభానుమూర్తి హరేహరే

సురనాయక నరనాయక వరదాయక హరేహరే
సురసన్నుత హరసన్నుత పురుషోత్తమ హరేహరే

సంసారనివార రామచంద్రదేవ హరేహరే
కంసాంతక కృష్ణచంద్ర కలుషాంతక హరేహరే


1, అక్టోబర్ 2026, గురువారం

నీవెక్కడ నీవెక్కడ నిన్నే నమ్ముకున్నాను

 

నీవెక్కడ నీవెక్కడ నిన్నే నమ్ముకున్నాను
రావేమీ రావేమీ రామా యెంత పిలిచాను

కనుపాపలు నీకొరకై కలలుకనని దినం లేదు 
వినువీధిని నాపిలుపే వినిపించని దినం లేదు
నినువెదకుచు భూమిపైన నేనడుగని ముని లేడు
కనరాక నీవు దాగ కారణమే కనరాదు

కనవచ్చిన నొక్కసారి కరిగిపోయే దేమి నీకు
నను పలుకరించుటయే నగుబాటా యేమి నీకు
క్షణకాలము ననుకలసిన చాలు నీకు పోయేదేమి
మనసుదీర్చ రారాదా మరిమరి ప్రార్ధింతును

సిరిసంపద లడుగుదునని చింతించగ వలదు నీవు
చిరాయువే యడుగుదునని చింతించగ వలదు నీవు
వరములేమీ వలదు నాకు హరి నీదరిసెనము దక్క
మరి యేదీ వలదు నాకు పరమాత్మా రావయ్యా

మానిత సిధ్ధులు మహిమలు

 

మానిత సిధ్ధులు మహిమలు యశములు

  నేనెపుడైనను కోరితినా

పోనీ సిరిసంపద లైనను ఘన

  భోగము లైనను కోరితినా


నీనామము నా నాలుకపైనే

  నిలువ నీయమని కోరితిని

నీనిజతత్త్వము నిచ్చలు తలచే

  నిలకడ నిమ్మని కోరితిని

నీనిజభక్తుల సత్సాంగత్యము

  నిత్యము నిమ్మని కోరితిని

మానక నీమంగళరూపము నా

  మనసున నిలుపగ కోరితిని


నిరంతరముగా నీసేవలలో

  నిలచియుండుటను కోరితిని

పరమాత్ముడవగు నిను సేవించుచు

  పండిపోవుటను కోరితిని

పరుల నెప్పుడును తలపక నిన్నే

  భావించుటనే కోరితిని

శరణాగతవత్సలుడవు నిన్నే

 శరణము మరిమరి కోరితిని


నిను నే కోరిన వన్నియు నుచితము

  లని తెలిసియు కరుణించవుగా

ఘనుడవు కరుణామయుడ వైనను

  నను కరుణించగ తలచవుగా

ఇనకులతిలకా దశరథతనయా

  యీ బెట్టెందుకు రఘురామా

కొనకంటను నను తిలకించిన నీ

  ఘనతకు లోటగునా రామా

  


30, సెప్టెంబర్ 2026, బుధవారం

రామనామము కన్న గొప్పది భూమిపైనే లేదురా


రామనామము కన్న గొప్పది

  భూమిపైనే లేదురా

భూమిపైనే కాదు సకల

  భువనములలో లేదురా


మంచివారికి మంచిచేయుచు

  మంచిగా రక్షించు నామము 

అంచితంబుగ సర్వశుభముల 

  నందజేసెడు మంచినామము

సంచితములాగాములన్నియు

  ద్రుంచి కాచే దివ్యనామము

మంచినామము రామనామము 

  మాధవుని యుత్కృష్టనామము


మందుగా భవరోగమును తన

  మహిమచేతనె మాన్పు నామము

నందివాహను డెల్లవేళల

  నవ్వుచు స్మరియించు నామము

అందుకొని మునిముఖ్యులందరు

  హాయిగా జపియించు నామము

సుందరీమణి సీతమనసున

  చిందులాడుచు నుండు నామము


వేడుకగ నాజిహ్వాగ్రమున

  నాడుచుండెడి రామనామము 

వాడుగక సజ్జనుల కెప్పుడు

  వరములిచ్చే విష్ణునామము

మూడులోకము లందు చక్కగ

  పూజలందెడు పుణ్యనామము

వాడవాడల భక్తులందరు

  పాడుచుండే భవ్యనామము



28, సెప్టెంబర్ 2026, సోమవారం

నమ్మిన రాముడు నాకగుపడడే

 

నమ్మిన రాముడు నా కగుపడడే

యిమ్మహి వా డిపు డెందున్నాడో


ఎందున్నాడో యెవ్వరి కెరుకో

యిందీవరాక్షుడు యినకులతిలకుడు

మందిరశతమున మరిమరి వెదకితి

నెందును లేడే యేమైనాడో


వనముల మునులే తనవారని నే

విని యుంటిని నా విభుని జాడలను

మునిజను లందరి మనసుల వెదకితి

కనరా కెచటికి చనినాడో కద


దాగుడుమూతలు తనకు వినోదము 

బాగోలే దన వశమా ఐనను

ఆగుదునా హరి నరయుచు నిటులే

సాగుదు విడవక సంతోషముగా 



23, సెప్టెంబర్ 2026, బుధవారం

అధ్యక్ష విన్యాసాలు


అధ్యక్షుడు అంటే ఆయనే.

తనను పదవి నుండి దించివేస్తే అధికారసౌధాన్ని అనుచరులను వెంటవేసుకొని పోయి ముట్టడించి గలాభా చేసారు.

పట్టుదలతో మళ్ళీ ఎన్నకలలో గెలిచి ఆ అధికారసౌధాన్ని దర్జాగా స్వాధీనం చేసుకున్నారు.

గతంలో తాను చేసిన గలాభా తాలూకూ కేసును కూడా అంతే దర్జాగా ఎత్తి అవతల పారేసారు.

ఈయన వ్యవహారశైలితో తగాదాపడి సోషల్ మీడియా తనను బహిష్కరిస్తే తానే ఒక పోటీ సోషల్ మీడియాను ప్రారంభించారు. 

తనను సబహుమానంగా కవర్ చేయటంలేదు టీవీ ఛానెల్స్ అని తోచగానే వాటినీ అధికారసౌధం నుండి బహిష్కరించారు.

ఆయనకు తెలియనిది లేదు.

అలా ఉండటానికి వీల్లేదంతే.

ఆయనకు నచ్చనిది ఉండటానికి వీల్లేదు.

వీల్లేదంతే.

అలా ఉన్నది ఏదైనా కనిపిస్తే దాన్ని తనకు నచ్చినట్లు మార్చి అవతల పడేస్తారు.

జలసంధులు, ద్వీపాలు దేశాలు ఏవైనా సరే అధ్యక్షుల వారికి నచ్చకపోతే పేరు మార్చేసుకోవలసిందే.

కొత్తగా వారికి నచ్చనిది మరొకటి కనిపించింది.

దాని పేరు మార్చేసారు.

మీరు కాని ఆపాతపేరు వాడారో మీరు అద్యక్షుల వారి ఆనతిని ధిక్కరించిన నేరస్థులు ఐపోతారు.

మీరు విదేశీమూలం కలవారైతే దేశంనుండి గెంటేయకలరు జాగ్రత్తగా ఉండాలి.

మీది వేరే దేశం ఐతే మీదేశం మీద ఆర్ధికమైన ఆంక్షలు విధించగలరు.

ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప ప్రమాదం పొంచి ఉంది.

ఈ అద్యక్ష మహాశయులను పదవీకాలం పూర్తి అయిన పిదప నిబంధనలన్నీ మార్చిపారేసి ఐనా తిరిగి ఎన్నుకోకపోతే?

వారి ఆగ్రహం ఎంతదూరం పోతుందో?!!

 వారు తమదేశం రాజ్యాంగాన్ని మార్చేస్తారా?

తమ దేశం పేరునే మార్చేస్తారా?

ఒక వేళ కొంపమునిగి అద్యక్షుల వారిని హోల్ మొత్తం ప్రపంచం ఛీ కొట్టితే? వారు దిగిపోక తప్పనిసరి పరిస్థితే వస్తే?

అధ్యక్షుల వారు దిగిపోతారా?

ప్రపంచాన్నే తిరస్కరించి పోటీ ప్రపంచాన్ని ఏర్పాటుచేస్తారా?

ఏమో!!

18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

హరేరామ జయ యనేవారికే బరాబరిగ మోక్షం

 
హరేరామ జయ యనేవారికే బరాబరిగ మోక్షం శ్రీ
హరేకృష్ణ జయ యనేవారికే సరాసరిగ మోక్షం 

నిరంతరముగా హరిని స్మరించిన బరాబరిగ మోక్షం
హరిస్మరరణము నేమరని  వారికే సరాసరిగ మోక్షం
హరిభక్తులకే ధరాతలంబున బరాబరిగ మోక్షం
బరాబరిగ మోక్షం బాబూ సరాసరిగ మోక్షం

పరమపురుషుడని రాముని నమ్మిన బరాబరిగ మోక్షం
శరణాగతుడై హరిని వేడితే సరాసరిగ మోక్షం
హరియే సర్వస్వంబని నిలచిన బరాబరిగ మోక్షం
బరాబరిగ మోక్షం బాబూ సరాసరిగ మోక్షం

గురువును దైవము హరియని నమ్మిన బరాబరిగ మోక్షం
హరిపారమ్యము నెరిగన వారికి సరాసరిగ మోక్షం
నరునకు వేరొక దారిన దొరుకదు బరాబరిగ మోక్షం
బరాబరిగ మోక్షం బాబూ సరాసరిగ మోక్షం


17, సెప్టెంబర్ 2026, గురువారం

నీ వినోదము కొరకు నే నాడుచున్నాను

 

నీ వినోదము కొరకు నే నాడుచున్నాను

నీ వాడు మనునటులే నే నాడుచున్నాను


ధర్మానుబంధమును తగిలించునది నీవు

కర్మానుబంధములు కల్పించునది నీవు

నిర్మోహముగ నాడ నియమించునది నీవు

శర్మదుడవగుచు నను శాశించునది నీవు


నీదైన యీయాట నే నాడుచున్నాను 

నాదైన యహమికయు నీదు సంకల్పమే

భేదములు వాదములు నీదు సంకల్పమే 

నీదివ్యలీలలో నేను పాత్రధారిని


ఆనందముగ నిట్టు లాడించుచున్నావు

ఆనందముగ నేను నాడుచునున్నాను

ఆనంద మిర్వురకు ననవచ్చునా చూడ

నేను నీకన్న వేరుగా నుంటినా రామ



పొమ్మంటి వొక్క నాడు భూతలంబునకు

 
పొమ్మంటి వొక్క నాడు భూతలంబునకు తిరిగి
రమ్మనవు నేటి దనుక రామా యిది తగునా

నీవు మసలినట్టి భూమి కావున నే నియ్యకొని
నీ వానతి యిచ్చినట్లు నివసించగ దొడగితిని
నీవారల నరసికొనుచు నేలను గాలించుచును
భూవలయము తిరుగుచునే ప్రొద్దుపుచ్చు చుంటిని

ఇచట నేను చేయదగిన దేమియు నగుపడదే
ఇచట నన్ను తెలియు వార లెవ్వరు నగుపడరే
ఇచట నేను పొందదగిన దేమియు. నగుపడదే
ఇచట బహువేషంబుల నేల నేను తిరుగుట

నీపాటలు పాడుకొనుచు నేను ప్రొద్దుపుచ్చుదును
నీపవిత్రనామముతో నేను ప్రొద్దుపుచ్చుదును
తాపత్రయములను నన్ను తగిలించినది చాలును
శ్రీపతి యిక నీసన్నిధి చేర ననుమతించుము

16, సెప్టెంబర్ 2026, బుధవారం

మనిషిని మనిషిగా చేసేది ఏమిటి?

 

ఇదొక పెద్ద ప్రశ్న.

మనిషిని మనిషిగా చేసేది ఏమిటి?

ఈప్రశ్నకు సమాధానం కోసం ఆలోచించే ముందు ఒక విషయం గమనిక లోనికి తెచ్చుకోవాలి.

మనిషి ఒక జీవి. ముఖ్యంగా ఒక జంతువు.

జీవులు అన్నాక ఆహార భయ నిద్రా మైథునాలు అనే నాలుగు సహజ లక్షణాలు ఉంటాయి.మొదటి మూడు లక్శణాలూ స్వకీయమైన మనుగడకు అవసరమైనవి. నాలుగవది ఒక జాతిగా మనుగడకు అవసరమైనది.

జీవులు అన్నపుడు వృక్షజాతి కూడా లెక్కకు వస్తుంది.

జంతువులు అన్నపుడు అవి స్వయంచలనశక్తి కలవి కావటం వలన వృక్షజాతి కన్నా భిన్నత్వం కలవి.

జగదీశ్ చంద్ర బోస్ నిరూపించే వరకు వృక్షాలకు జీవం ఉన్నదనే పాశ్చాత్య ప్రపంచం నమ్మలేదు.

భారతీయ భావనలో వృక్షాలకు జీవం ఉందని ఏమిటి రాళ్ళకూ జీవం ఉందనే ఉదారభావన అనాది యైనది. మన శిల్ప శాస్త్రం శిలలకూ స్త్రీ పురుష లక్షణాలు చెబుతుంది.

జీవులకు ఆలోచన అనేదీ ఒకటి ఉంటుంది. నాలుగు సహజాతాలలో ఇది చెప్పబడక పోయినా, ఆలోచన కూడా ఒక ముఖ్య జీవ లక్షణం.

తాను ఉండాలీ అన్న భావన సహజాతం.

తాను సుఖంగా ఉండాలీ అన్న భావన ఆతరువాతది. 

తానే సుఖంగా ఉండాలీ అన్న భావనా వైపరీత్యం ఆ తరువాత స్థాయి.

సుఖంగా ఉండాలీ అంటే ముందుగా సురక్షితంగా ఉండాలి కదా?

జీవులలో రక్షణ వ్యవస్థల గురించి మనకు నేడు బాగానే అవగాహన ఉంది.

వృక్షజాతి యైనా ప్రతికూల పరిస్థితుల్లో రక్షణకోసం ప్రయత్నాలు చేయటం గురించి తగినంత సమాచారం మనకు నేడు తెలుసు.

ఈవిధమైన ప్రాధమిక వాంఛలు రెడూ జీవులకు సహజాతాల తరువాతి లక్షణాలు ఆనుకోవచ్చును. అంటే ప్రతి జీవీ 1. తా నుండాలీ 2. తాను సుఖంగా ఉండాలీ అనేవి జీవుల మనుగడతో అనుబంధం కల మొదటి స్థాయి విషయాలు.

పురితన కాలంలో మానవుల విషయంలోనూ ఇంత వరకే కావచ్చును.

ఈస్థాయిలో జీవులకు ప్రకృతిపై ఆధిపత్యం అన్న భావన లేదు. ప్రకృతితో సహజీవనం అన్న భావనయే ఉంది.

కాని మనిషికి ఒక గమనిక ఉంది. అది ఎలా వచ్చింది అన్నది ఆలోచనీయం. ఆగమనిక ఏమిటంటే ప్రకృతి పైన తాను పెత్తనం చేయగలను అన్నది.

మనుష్యులలో కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. ఐతే కుటుంబ వ్వవస్థల మూలాలు ఇతర జంతు ప్రపంచం నుండే మనీషికి అబ్బినవి కాని మానవజాతికే ప్రత్యేకంగా ఏర్పడినవి కావు.

ప్రకృతిని కొంత తెలివిగా ఉపయోగించుకోవటం విషయంలో శరీర నిర్మాణ రీత్యా ఇతర జంతువుల కన్నా మనిషికి ఎక్కువ అవకాశం దొరికింది.

ఇది క్రమంగా ఆధునిక సమాజ నిర్మాణానికి దారితీసింది.

(ఇంకా ఉంది)