18, నవంబర్ 2026, బుధవారం

చిరునవ్వే భూషణము శ్రీరామునకు

 
చిరునవ్వే భూషణము శ్రీరామునకు స
త్కరుణయే తత్త్వము మేఘశ్యామునకు

మంచితనము మూర్తిదాల్చి మారాము డాయెను
మంచిమంచి గుణములతో మహిని ప్రకాశించెను
మంచివారి నేడిపించు మంకు రాకాసులను
ద్రుంచుచు చిరునగవుల భాసించి శోభించెను

చిరుచిరు నగవులతోనే సీతమ్మతో గూడి
పరమశాంతచిత్తు డగుచు వనసీమల కేగెను
వరమునులను సురవైరుల బారినుండి కాచెను
కరుణతో దిగివచ్చిన హరియే యనిపించెను

చిరునగవుల దీనులను చేరదీసి కాచెను
కరుణతో వారికి గల కష్టములను తీర్చెను
శరణాగతవత్సలు డను బిరుదునే దాల్చెను
పురుషోత్తము డని జనుల పొగడికల నందెను


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.