8, నవంబర్ 2026, ఆదివారం

రార శ్రీరామ సంసారవిముఖకామ

 
రార శ్రీరామ సంసారవిముఖకామ
వారిజాసనవినుతశూర సుగుణధామ

చారుమందహాససహితచంద్రవదన రామ
శ్రీరమారమణ సర్వసేవ్య పరంధామ
మారవైరిసదావినుత మంగళకరనామ
ఘోరపాపశాపశమనకుశల శుభదనామ

నారాయణ సదాసురానంద సీతారామ
భూరికృపాపరాయణ పురుషోత్తమనామ
క్రూరదైత్యవిదళనశర కోదండరామ
సారసాక్ష సకలలోకసార్వభౌమ రామ

ధీర గంభీర సదాచారసుముఖ రామ
పూరితనిజభక్తకామ పూర్ణకామ రామ
శౌరి సకలయోగిరాజసంపూజ్యనామ
దూరీకృత దీనలోకదుఃఖ భవవిరామ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.