23, జూన్ 2026, మంగళవారం
లోకమేల లోకులతో నీకు పనియేల
22, జూన్ 2026, సోమవారం
హరినామ మింతదని యననేర్తుమా
21, జూన్ 2026, ఆదివారం
ఇటులేల చేసితివో యినకులేశ్వరా
ఇటులేల చేసితివో యినకులేశ్వరా
కటకటా ఈదేహి కష్టమే కష్టము
ఘోరభవబంధముల గూర్చి యోచించగ
వైరాగ్యదివ్యసంపదనైన తగినంత
శ్రీరామ నాకీయ చింతించ వైతివే
ఔరౌర యీదేహి కొక దారి యున్నదా
నేరుపున నీసేవ నిరతంబు సేయగా
కోరు చిత్తమును నోచు కొనిన దేహంబును
శ్రీరామ నాకీయ చింతించ వైతివే
నీరేజదళనేత్ర నిన్నే మనగ వచ్చు
నోరార నీపాట నూరూర పాడగల
తీరైన చక్కని తీయన్ని జిహ్వైన
శ్రీరామ నాకీయ చింతించ వైతివే
కారణం బేదైన కష్టమే యిదినాకు
నేనుండేదా యిటుల నేనుండేదా
నేనుండేదా యిటుల నేనుండేదా రామ
నేనుండేదా హాయిగా నుండేదా
నీయందే శ్రధ్ధ నిలిపి నీయందే బుధ్ధి నిలిపి
నీయందే తెలివి నిలిపి నేనుండేదా
నీయందే శాస్త్ర మరసి నీయందే సత్య మరసి
నీయందే జ్ఞాన మరసి నేనుండేదా
నీయందే మనసు కలిగి నీయందే ఆశ కలిగి
నీయందే ప్రేమ కలిగి నేనుండేదా
నీయందే విశ్వ మెరిగి నీయందే సర్వ మెరిగి
నీయందే నన్నెరింగి నేనుండేదా
నీయందే రక్తి నొంది నీయందే భక్తి నొంది
నీయందే శక్తి నొంది నేనుండేదా
నీయందే యునికి నరసి నీయందే మనికి నరసి
నీయం దానంద మరసి నేనుండేదా
19, జూన్ 2026, శుక్రవారం
హరేరామ హరేకృష్ణ హరేవాసుదేవ
హరేరామ హరేకృష్ణ హరేవాసుదేవ శ్రీ
హరే పరమానంద అంబుజనాభ
హరే దశరథాత్మజ హరచాపఖండన
హరే నందకుమారక గిరిధర గోవింద
హరే సురవైరిగర్వహరణవిజయశీల
పరాకేల ననుబ్రోవ పతితపావన
హరే రామచంద్ర మునియాగ సంరక్షక
హరే కృష్ణచంద్ర సర్వాత్మక గోవింద
హరే వసుంధరాభారహరణశుభదశీల
పరాకేల ననుబ్రోవ పతితపావన
హరే భక్తజనావన హరే ధర్మరక్షక
హరే పాపవిషవపదావానల గోవింద
హరే సదామునిమోక్షవితరణకృపాశీల
పరాకేల ననుబ్రోవ పతితపావన
పాడండీ హరిని గూర్చి ఆడండీ హరికొరకే
పాడండీ హరిని గూర్చి ఆడండీ హరికొరకే
వేడండీ హరి నొకనే వేడుకతో మీరు
పాడదగిన వా డింకొక భగవంతు డనగ లేడు
వేడదగిన వా డింకొక విభుడెవ్వండును లేడు
ఆడించే ఆటగాడు హరికన్యుం డన లేడు
వేడుకగా హరియే మీవాడై యున్నాడు
వాడు మిమ్ము సత్కృపతో పాలించుచు నున్నాడు
వాడు మీకు సమస్తమును ప్రసాదించు చున్నాడు
వాడు మీకు సమీపమున వర్తించుచు నున్నాడు
వాడు మీకు మోక్షమిచ్చు వాడై యున్నాడు
హరేరామ యనుచును మీ రాడండీ పాడండీ
హరేకృష్ణ యని వేడ్కగ నాడండీ పాడండీ
మరొక్కరిని తలపోయగ మనకేల చెప్పండీ
హరికై మీరాడి పాడి యానందము పొందండీ
సతులారా శోభన పాడరమ్మ??
ఈరోజున ఒకటపా కంటబడింది.
చూడరమ్మ సతులారా శోభన పాడరమ్మ
దయచేసి సంప్రదాయసాహిత్యాన్ని గురించిన రచనలు చేసేవారు కొంచెం జాగరూకులై ఉండండి.
అప్పటి సాహిత్యకారుల రచనలను తెలిసో తెలియకో దిద్ది ప్రకటించే ముందు తమకు ఆపని చేసేందుకు తగిన అధికారమూ సాధసంపత్తీ ఉన్నాయా అన్నది బాగా వివేచన చేసుకొని కాని ఆమహానుభావుల వ్రాతలలో తప్పులు దిద్దే సాహసం చేయకండి.
అన్నమయ్య సాహిత్యాన్ని గురించి, అది ఒక ఆరువందల యేండ్ల క్రిందటి భాషాస్వరూపంగా, కవిత్వధోరణిగా ముందు అవగాహనలో ఉంచుకోండి. వాటి గురించి తగినంత సాధికారికంగా తెలియనిదే ఆయననే తప్పులు దిద్దే పని చేయకండి.
"అదివో అల్లదివో హరివాసము" అన్న దానిని "అదిగో అల్లదిగో శ్రీహరివాసము" అని మార్ఛి పాడే అతితెలివి ప్రచారంలో ఉంది! ఎవరీ పని చేసారో తెలియదు. అన్నమయ్య అదిగో బదులు పొరపాటున అదివో అనలేదండీ. అక్కడ శ్రీ అని చేర్చి యతిభంగం చేసారే అసలు ఆయన యతిప్రాసలను నియమంగా పాటిస్తారని తెలుసుకోలేకపోయారు కదా! తప్పుడుపాఠం ప్రచారం కావటం దురదృష్టం. ఎవరిదో దురహంకారం ఫలితం.
ఈకీర్తనలో ఈటపాలో సతులాల అన్నమాటను సతులారా అనిదిద్దారు. సోబాన అన్న దానిని శోభన అని దిద్దారు!
"సతులారా", "శోభన పాడరమ్మ" అని కాదండీ "సతులాల", "సోబాన పాడరమ్మ" అనే సాహిత్యం. తితిదే వారి ప్రచురణను పరిశీలించండి.
ఓపికలేదా? ఈప్రయత్నాలు మానుకోండి. తెలిసీతెలియని విధంగా వ్రాసి పెద్దల సాహిత్యాన్ని అవమానించకండి, దాన్ని భ్రష్టు పట్టించకండి.
పైగా "కలశాబ్ది" పదాన్ని "కళాశాబ్ధి" అని మార్చటం ఘోరాతిఘోరవిషయం! ఏమివ్రాస్తున్నారో ఆవ్రాసేవారికి అవగాహన లేదే! దారుణం.
అక్కడ ఆటపాను ఇంక చదువలేదు. చదువలేను కూడా! ఇంకేమి తప్పులున్నాయో!
ఈమాటలు కొన్నింటిని టపాకు ఒక కామెంటుగా పంపాను. ఐనా అందరికీ అందుబాటుగా ఉండాలని ఒక టపా రూపంలోనూ బ్లాగులో ఉంచుతున్నాను.
జనకజామనోభిరామ సాకేతరామ
18, జూన్ 2026, గురువారం
నిజమేమో గోపబాల నీకే యెరుక
నిజమేమో గోపబాల నీకే యెరుక యింక
ఋజువులేల మధురకేగు విజయశీల
ఎపుడు తిరిగి వచ్చెదవో యెవ్వరి కెరుక నీ
కృప యెన్నడు కలుగునో కృష్ణ ముకుంద
అపకారిని కంసరాజు నణచి ప్రజలకు నా
యుపకారము చేసి వచ్చుటున్నదా నిజముగా
తలిదండ్రుల చెరబాపగ తరలుట తగును నె
చ్చెలు లెదురు చూచెదరని తలచుట తగును
కొలువ నృపులు మధురలోన నిలుచుట తగును నీ
తలపు మాకు గోపబాల తెలియకున్న నిజముగా
క్షేమముగా తిరిగిరమ్ము కృష్ణా యనుచు హరి
మేమెల్లరమును నిన్ను మిగుల దీవించి
ఆమధురకు పంపుచుంటి మది మరిచెదవో మా
ప్రేమలనే తలచి మరల విచ్చేతువొ నిజముగా
హరినామ మేదైన నది మంత్రమే
హరినామ మేదైన నది మంత్రమే
హరిమంత్ర మేదైన నారాధ్యమే
హరినామమును బలుకు టది పూజయే
హరికథలను చదువు టది పూజయే
హరిభక్తులను జేరు టది పూజయే
హరి శరణజొచ్చుట యది పూజయే
హరిపూజ నొనరించ నది యజనమే
హరిభజన చేసిన నది యజనమే
హరికీర్తనము జేయ నది యజనమే
హరిప్రీతిగా జేయు నది యజనమే
నరునకు హరిభక్తి యరుదైనదే
మరియును కలియందు మానక హరినామ
స్మరణ మబ్బిన చాలు మరి ముక్తియే
అరిది హరేరామ యన ముక్తియే
నరుని జేరితే బంధము హరిని జేరితే మోక్షము
15, జూన్ 2026, సోమవారం
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనువాడు
14, జూన్ 2026, ఆదివారం
నందాత్మజ మప్రమేయం
నందాత్మజ మప్రమేయం
వందామహే సతతం
గోపీమానసచోరం
శ్రీపతి మతిశయవీరం
గోపాలం నతదిక్పాలం
తాపసజనమందారం
సుందరగోపకుమారం
బృందావనసంచారం
నిందితదైత్యసమూహం గో
విందం పరమానందం
వ్యక్తావ్యక్యస్వరూపం
ముక్తజనార్చితతత్త్వం
ముక్తివితరణసుశీలం స
ద్భక్తజనావననిపుణం
13, జూన్ 2026, శనివారం
హరికృపయే మన కానందము
పరమేశ్వరుడే నాగురువు
నీవాడ నీవాడ రామయ్యా
నీవాడ నీవాడ రామయ్యా
నావాడవై యుండు రామయ్యా
నీవాడనే కాని రామయ్యా
నేనెవరి వాడను రామయ్యా
నీవిచ్చునది కాక రామయ్యా
నేనేమి కోరెదను రామయ్యా
నీమాట వినకుండ రామయ్యా
నేనెందు బోదునో రామయ్యా
నీమంత్రమే కాక రామయ్యా
నేనేమి జపియింతు రామయ్యా
నీపాటలే గాక రామయ్యా
నేనేమి పాడుదును రామయ్యా
నీపలుకులే గాక రామయ్యా
నేనేమి గణియింతు రామయ్యా
నీయనుమతిని గాక రామయ్యా
నేనేమి చేయుదును రామయ్యా
నీయానచే గాక రామయ్యా
నేనేల ధరనుందు రామయ్యా
నీభక్తులే గాక రామయ్యా
నేలపై హితులెవరు రామయ్యా
నీభూరికృప గాక రామయ్యా
నేనేమి వలచెదను రామయ్యా
నరులార మీరెరుగ నాల్గు మాటలు
హరిరాజ్యమున నుండు హరిభటుడను నేను
12, జూన్ 2026, శుక్రవారం
హరహర యటువంటి మాట యసలుండునా
11, జూన్ 2026, గురువారం
బాధ తమకేలా
శ్రీరమారమణ హరి నారాయణా
10, జూన్ 2026, బుధవారం
ఏమి చేయుచున్నారో యింతులారా
ఏమి చేయుచున్నారో యింతులారా బాల
బాలరామునకు కట్టబెట్టరె చెలులు
ముంగురులను ద్రువ్వి మంచి బంగారు కిరీటము
బంగారుతండ్రి కిపుడు పెట్టరె చెలులు
బంగారపు గిన్నెలలో అందాలరామునకు
అందించరే పాయసాన్నము లిపుడు
సింగారముచేసి మన చిన్నిరామయ్య నిక
చేర్చరే తల్లికడకు చేడియ లార
బహుకోటిశ్రీరామభక్తవర్యులు
బహుకోటిశ్రీరామభక్తవర్యులు
విహరించు భరతభూమి వేదభూమి
బహుదేవతావిహార పావనభూమి
బహుధాన్యపుష్పఫలభరితభూమి
ఈభూమిపై బుట్టి యెంతయు గర్వంబుగా
యినకులేశ్వరు గొల్చు నత డెట్టివాడో
ఈభూమిపై బుట్ట యెన్నెన్నో జన్మలుగా
యెంతో తపియించువా డత డెట్టివాడో
ఈభూమిపై నున్న సద్భక్త వరులారా
మీభావమేమో మాకు తెలుపుడీ
ఈభూమిపై బుట్టి యీశ్వరుడగు రామునే
యెవ్వాడు పూజించ డత డెట్టివాడో
ఈభూమిపై నిలచి యీశ్వరు డన నెవడని
యేమేమో పలుకువా డత డెట్టి వాడో
ఈభూమిపై నున్న సద్భక్త వరులారా
మీభావమేమో మాకు తెలుపుడీ
ఈభూమిపై నేడు కల్లదైవాల గోల
యెంతయు చెలరేగు టదియేమి కర్మమో
ఈభూమిపై శివుడు ధ్యానించు రామునే
యీసడించు వారుపుట్టు టేమి కర్మమో
ఈభూమిపై నున్న సద్భక్త వరులారా
మీభావమేమో మాకు తెలుపుడీ