27, జూన్ 2026, శనివారం

శ్రీరామనామమె చాలు శ్రీరామనామమె మేలు

శ్రీరామనామమె చాలు 
 శ్రీరామనామమె మేలు
శ్రీరామనామమె కాలు 
 దూరముగా నుంచ జాలు

అబలకు రూపము నిచ్చిన నామము
 అతిశుభకరమగు నామము
శబరికి మోక్షము నిచ్చిన నామము 
 శంభుడు మెచ్చిన నామము

పక్షికి మోక్షము నిచ్చిన నామము
 పరమపదప్రద నామము
పక్షికి రెక్కల నిచ్చిన నామము
 అక్షయ మహిమల నామము

దనుజుల గర్వము నణచిన నామము
 తపసులు వలచెడు నామము
హనుమను బ్రహ్మమును చేసిన నామము
 అతిసులభంబగు నామము

సుజనుల కోర్కెలు తీర్చెడి నామము
 విజయప్రదమగు నామము
కుజనుల బుద్ధికి తోచని నామము
 ఘోరభవాంతక నామము

పోడిమి భువనము లేలెడు నామము 
 వేడుకగొలిపెడు నామము
పాడెడు భక్తుల బ్రోచెడు నామము
 పరమోత్సవమగు నామము

యుక్తంబగు సిరులిచ్చెడి నామము
 రక్తిని గొలిపెడు నామము
భక్తుల నేలెడు బంగరు నామము 
 ముక్తిప్రదమగు నామము 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.