30, జూన్ 2026, మంగళవారం

వేరెవరిని పొగడుదురో వెర్రులారా


వేరెవరిని పొగడుదురో వెర్రులారా మన
శ్రీరామచంద్రు డుండ చింతలు దీర్చ

సిరు లడిగిన సిరు లిచ్చును శ్రీరామచంద్రుడు
పర మడిగిన పర మిచ్చును పరమాత్ముడు కనుక
నిరంతరము బహుప్రేముడి నిజభక్తవరేణ్యులు
వరము లే మడిగినను వలదన కిచ్చు

అడుగకయే శాపముడిపె నహల్యకు నడవిలో
నడగకయే పక్షీంద్రుని కందించె మోక్షంబు
నడుగకయే బ్రహ్మపదవి నందించె సామీరికి
యడిగిన మీమీ కోరిక లన్నియు నిచ్చు

ఇచ్చునట్టి శ్రీరఘుపతి యింత సుముఖుడై యుండ
పుచ్చుకొనగ మొగమాటం బిచ్చట మన కెందుకు
సచ్చరిత్రుడు వదాన్యుడు సాకేతపురనాథుని
ముచ్చటగా చేరి మీరు మోక్షమడుగుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.