18, జూన్ 2026, గురువారం

నరుని జేరితే బంధము హరిని జేరితే మోక్షము


నరుని జేరితే బంధము
  హరిని జేరితే మోక్షము
అరయ నిజంబిది స్పష్టము
  మరి నీ కిందే దిష్టము

కాలము కలిగించును బంధంబులు
 ఘనముగ నీ విల కలిగిన నాడే
కాలము కరిగించును బంధబులు
  చాలని దేహము విడచిన నాడే
కాలము కల్పించెడు బంధంబులు
   కాయముతోనే కలుగును తొలగును
చాలు నరులతో చచ్చుబంధములు
   సంపాదించుము హరితో బంధము 

సతులు బంధములు సుతులు బంధములు
  అతిశయముగ చుట్టములు బంధములు
అతిప్రేముడిగల హితులు బంధములు
  అతిగ మెచ్చు స్నేహితులు బంధములు
క్షితిని కొందరు మోహబంధములు
   ప్రతిగ కొందరు ద్వేషబంధములు
మతిమంతులు బంధము లివి వలదని
 మదిని కోరుదురు హరితో బంధము 

నరులకు నరులకు మధ్య బంధములు
  నమ్మగ రానివి మాయబంధములు
హరే రామ యన హరితో బంధము
  సరగున కలుగును తొలగని బంధము
హరే కృష్ణ యన హరితో బంధము
  సరగున కలుగును తొలగని బంధము
మరియొక విధమున హరితో బంధము
  నరునకు కలుగదు నమ్మకమైనది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.