13, జూన్ 2026, శనివారం

నరులార మీరెరుగ నాల్గు మాటలు


నరులార మీరెరుగ నాల్గు మాటలు చెప్ప
  హరియానతిని గొని పలుకుచుంటి

హరిరాజ్యమున నుండు హరిభటుడను నేను
  హరియాన తలదాల్చి ధర జేరితి

హరి మెచ్చుకొను నటుల ధరపైన నేనిపుడు
  హరికార్యనిర్వహణ మం దుంటిని

హరినామమును నేను ధరియించి జిహ్వపై
  హరిమహిమ చాటుచును తిరుగుచుంటి

హరికీర్తనలు నేను మరువక జేయుచును
  హరిభక్తులకు పంచిపెట్టుచుంటి

నరులకు హరిపట్ట తిరమైన సద్భక్తి
  నాటించుటకు కృషి చేయుచుంటి

నరునకు హరేరామ యను మంత్రజపనిష్ఠ
  అందించు ఫలము వివరించుచుంటి

నరునకు హరేకృష్ణ యను మంత్రజపనిష్ఠ
  అందించు ఫలము వివరించుచుంటి

హరిసేవలో మీరు తరియించ దలచుచో
  హరిమెచ్చునని మీకు చెప్పుచుంటి

హరిభక్తివిరహితులగు వార లెన్నటికి
  తరియించలే రనుచు తెలుపుచుంటి

హరిభక్తిపరిపూర్ణులగు వారు చెడిపోవు
  టనుమాట లేదనుచు నుడువుచుంటి

హరి నాదు సేవలకు నానందపడుచుండు
  నని నమ్మి హరికొరకు బ్రతుకుచుంటి

హరినామజపపరాయణులార హరి మీకు
  పరమపద మిచ్చునని పలుకుచుంటి
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.