9, జూన్ 2026, మంగళవారం

హరిని ప్రేమించుటయే యసలైన పూజ


హరిని ప్రేమించుటయే 
  యసలైన పూజ
హరిని సేవించుటయే 
  యసలైన పూజ

హరినామము నుడువుటయే
  యమర రసన చేయు పూజ
హరి కీర్తన లాలకించు
  టరయ చెవులు చేయు పూజ
హరిదర్శన పరవశమే
  యక్షు లాచరించు పూజ
హరికి సదా మ్రొక్కుటయే
  కరము లాచరించు పూజ

హరిక్షేత్రములకు జనుటే
  చరణంబులు చేయు పూజ
హరిని తలచి మురియుటయే
  అంతఃకరణంపు పూజ
హరితత్త్వము ధ్యానించుటె
  నరుని మనసు చేయు పూజ
హరిమయమై యుండుటయే
  ఆత్మార్పణ మైన పూజ

హరేరామ హరేకృష్ణ
  యనుటయె వాగ్రూప పూజ
హరిభక్తుల గూడుటయే
  నరునినడత చేయు పూజ
హరిసన్నిధి విడువ కునికి
   అమితమధురమైన పూజ
హరిని చేర తహతహయే
  యరయ జీవాత్మ పూజ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.