29, జూన్ 2026, సోమవారం

రామాష్టకం

 

రామనామం బుండ మన నోట 

రామభక్తులు కలుగ మన తోడు 

రామచంద్రుం డుండ మన పాల 

ఏమి కావలె నింక జనులార 1


రామసేవకు నురుకు తనువుండ

రామతత్త్వము విదితమై యుండ

రామచంద్రుడు హృదయమున నిండ

ఏమి కావలె నింక జనులార 2


రామచంద్రుడు బంధువై యుండ 

రామచంద్రుడు మిత్రుడై యుండ 

రామచంద్రుడు గురువుగా నుండ 

ఏమి కావలె నింక జనులార 3


రామకీర్తన వినెడు చెవులుండ 

రామకీర్తన పాడు నోరుండ 

రామకీర్తన చేయు మనసుండ 

ఏమి కావలె నింక జనులార 4


రాముడే మన సంపదగ నుండ 

రాముడే మన భాగ్యమై యుండ 

రాముడే సర్వస్వమై యుండ

ఏమి కావలె నింక జనులార 5


రామునే సేవించు తనువుండ 

రామునే కామించు మనసుండ

రాముడే మన నాథుడై యుండ 

ఏమి కావలె నింక జనులార 6


రామదర్శన కాంక్ష మనకుండ 

రామదర్శన ప్రాప్తి మనకుండ 

రామదర్శన మెపుడు మనకుండ 

ఏమి కావలె నింక జనులార 7


రాముడే హరి యనుచు లోనెఱిగి

రాముడే శివు డనుచు లోనెఱిగి

రామునే లలితమ్మగా నెఱిగి

ఏ మెఱుగవలె మనము జనులార 8


శ్యామలరాయ ప్రణీతము

రామాష్టక మఖిలసుజనరంజక మగుచున్

కామితఫలదం బగుచున్

భూమిజనుల కొసగు గాక భూరిశుభంబుల్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.