31, మే 2026, ఆదివారం

క్షేత్రదర్శనం ఫలం నిజంగా ఉంటుందా?

పుణ్యక్షేత్రాలకు పొలోమని పోయే వాళ్ళందరూ నిజమైన భక్తులు కారు.

ఈవిషయాన్నిఋజువుపరచే ఐతిహ్యం మనకు శ్రీశైలక్షేత్రమాహాత్మ్యంలో కనిపిస్తుంది.

శ్రీశైలశిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని ఒక మాట ఉంది. అది బహుప్రసిధ్ధం. అందుకేనేమో శ్రీశైలానికి భక్తులు బాగా వస్తూ ఉన్నారు. పార్వతీ అమ్మవారికి ఒక అనుమానం కలిగింది. ఏమిటి ఈజనసందోహం అందరికీ ముక్తి వస్తుందా అని శివుణ్ణి అడిగింది. అయన నవ్వి, అందరికీ ఎందుకు వస్తుంది? శ్రీశైలానికి వచ్చిన నిజమైన భక్తులకే వస్తుంది ముక్తి తప్పకుండా అని చెప్పాడు. అవునా అని పార్వతి అంటే శివుడు పద, ఈవచ్చినవాళ్ళలో ముక్తిని పొందే సద్భక్తి ఎవరికి ఉందో పరీక్షిద్దాం అని బయలదేర దీసాడు.

అమ్మవారు పెద్దముత్తైదువ వేషంలో, అయ్యవారు పండుముదుసలి రూపంలో శ్రీశైలానికి వెళ్ళారు. అక్కడ గుడికిపోయే దారికో ఒక నీటిగుంటను సృజించి అయ్యవారు అందులో పీకలోతున దిగి గడబడ చేయటం మొదలు పెట్టాడు. అమ్మవారు మొత్తుకుంటూ అందరినీ ముసలాయన్ను కాపాడండీ అని వేడుతూ నాటకం రక్తికట్టిస్తోంది.

చాలామంది మనకెందుకు వచ్చిన తంటా, ఈగుంట లోతుగా కనిపిస్తోంది కూడానూ, మనం మన దారిన గుడికిపోదాం అని తప్పుకొని చేదుకో మల్లన్నా అని అరుస్తూ పోతున్నారు.

అప్పుడప్పుడూ ఎవరో ధైర్యం చేసి ముందుకు వచ్చి దిగబోతే ముసలావిడ మాత్రం పుణ్యాత్ములైతేనే అయన్నంటుకోండి లేకపోతే ప్రమాదం సుమా అని హెచ్చరిస్తోంది. దాంతో ఇక ఎవరూ తెగించకుండా బాబోయ్ మనకెందుకు అంత పుణ్యాత్ములం అని హామీ ఎలాగిచ్చేదీ అని వెళ్ళిపోతున్నారు.

ఇలా చాలా గంటలపాటు ఈగడబిడ నడచింది.

ఇంతలో ఒక పడుచు ముందుకు వచ్చింది. ముసలావిడ హెచ్చరికను విని కూడా లెక్కపెట్టకుండా తల ఊపి ముసలాయన్ను రెక్క పట్టుకొని జాగ్రత్తగా బయటకు లాగుకొని వచ్చింది.

ముసలావిడ మెచ్చుకొని ఎంత పుణ్యాత్మురాలి వమ్మా కాకపోతే ఈయన్ను రెక్కపుచ్చుకొని ఏప్రమాదం లేకుండా తీసుకొని వచ్చావు, ఏమి చేస్తుంటావమ్మా, ఎవరమ్మాయివి అంటూ ఆరాతీసింది. ముసలాయన తల ఊపుతూ అవునవును అన్నాడు.

ఆపిల్ల ఇద్దరికీ నమస్కరించి, క్షమించండి. నేనొక వేశ్యను. శివదర్శనానికి వచ్చాను అంది.

ముసలావిడ నిర్ఘాంతపోయి ఎంత ధైర్యం నీకు అని నిలదీసింది.

ఆ అమ్మాయి అందికదా, తల్లీ నేను శ్రీశైలశిఖరాన్ని తనివితీరా చూచాను. ఇంక పాపం ఎక్కడిది నాకు? శివుడి క్పప వలన నాకు పునర్జన్మ కూడా లేదు కదా అని.

వెంటనే శివపార్వతులు నిజరూపాలతో ఆఆమ్మాయికి దర్శనం ఇచ్చారు.

శివుడు అమ్మవారితో చెప్పాడు. ఎందరో వచ్చారు. కాని ఈ అమ్మాయికి మాత్రమే జన్మరాహిత్యం అని.

శిఖరదర్శనం చేయటం కాదు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఎవ్వరూ చేయటం లేదు. చేసిన వారికి జన్మరాహిత్యం సిధ్ధం.

అలాగే దైవదర్శనం పేరుతో క్షేత్రాల చుట్టూ తిరిగే వాళ్ళలో చిత్తశుధ్ధితో నమ్మకంతో వెళ్తున్నవారు అల్పాల్పంగా ఉంటారు. భక్తి ఒక వ్యాపారం కాదు. ఒకడు వచ్చాడని ఉబ్బిపోయి ముక్తినో వేరే కోరికలనో దేవుడు ఇవ్వడు. చిత్తశుద్ధి ఉన్నవాళ్ళకు తప్పకుండా ఇస్తాడు. కాని అటువంటి వాళ్ళు కోటికొకరు ఉంటారు.

మిగతా సజ్జు అంతా భక్తితో వ్యాపారం చేసేవాళ్ళూ దురాశాపరులే. ఇటువంటి పామరులు పుణ్యక్షేత్రాల్లో కూడా వెర్రివేషాలూ వెకిలివేషాలూ వేస్తారు. 

సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం ప్రస్తావిస్తాను. భక్తికి సంబంధించినదే.

కోర్సు పూర్తిచేసిన వాళ్ళందరినీ ఎక్కడా పాస్ చేసేయరు. పరీక్షలో వడపోసి చిత్తం లగ్నం చేసి పాఠాలు ఒంటబట్టించుకున్న వాళ్ళనే పాస్ చేస్తారు. అలాగే ఉద్యోగార్ధు లందరిలో  కావలసిన కొద్దిమందిని ఎన్నుకోవాలంటే ఏఆఫీసులో ఐనా కఠినపరీక్షలు తప్పవు. ఎవరూ అన్యాయం అనరు.

కొన్నికొన్ని విద్యలను సాధన చేసినవారిని ఆవిద్యాధిదేవత కఠినంగా పరీక్షించటం జరుగుతుంది. 99.999% మంది సాధకులు ఆ దేవత గురిచేసే ప్రలోభాలకు లొంగిపోయి భ్రష్టులైపోతారు. తపస్సులు చేసే వాళ్ళను ఇంద్రుడు దారుణంగా పరీక్షిస్తాడు అవసరం ఐతే అప్సరసలను ఎరవేసి ఫెయిల్ చేస్తాడు. ఇటువంటి పరీక్షలను ఎక్కడో ఎవరో తట్టుకొని నిలబడటం జరుగుతుంది. వారికి సిధ్హి కలుగుతుంది. ఇంద్రియవిజయం లేని వారికి సిధ్ధిని అనుగ్రహిస్తే లోకానికి వారి వలన అపకారం కలుగుతుంది.

చాలా పురాతనమైన కొన్ని గుళ్ళలో అభ్యంతరకరమైన అసభ్యమైన భంగిమలలో శిల్పాలుంటాయి. చాలా కొద్ది మంది మాత్రమే నిర్వికారంగా వాటిని దాటుకొని పోయి శుధ్ధచిత్తంతో దైవదర్శనం చేస్తారు. వాళ్ళకు తప్పకుండా అనుగ్రహం దొరుకుతుంది. వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది. మిగతావాళ్ళు ఏదో దర్శనం మమ అనిపించుకొని చేసి వస్తారంతే. ఆధునికుల్లో కేవలం ఈబొమ్మలను చూడటం కోసమే ఆపుణ్యక్షేత్రాలకు పోయేవాళ్ళు హెచ్చు శాతంగా ఉన్నారు.

భక్తిలో నిజాయితీ, నమ్మకంలో పూర్ణత్వం ఉన్నవాళ్ళకే క్షేత్రదర్శనఫలాలు దక్కుతాయి. మిగతా వాళ్ళ కోలాహలం అంతా వట్టి తమాషాగా మిగులుతుంది.

చిల్లరమనుషులు ఎక్కడకు పోయినా పోకపోయినా ఒకటే. పుణ్యక్షేత్రంలో ఐనా వాళ్ళ ప్రవర్తనలు పూర్తి పామరత్వంతో ఉంటాయి.

తిరుమల దేవుణ్ణి దర్శించుకోవటానికి వెళ్ళే వాళ్ళలో ఎక్కువమంది శ్రధ్ధ మంచిమంచి సదుపాయాలను ఎలా కొనుక్కొని మంచి దర్శనం చేసుకోవటమా అనే ఉంటుంది. ఈసుఖలాలసే ఎక్కువగా ఉన్న జనం వేంకటేశ్వర స్వామిని గొంతెమ్మ కోరికలతో విసిగిస్తారు! వాళ్ళ కోరికలు నెరవేర్చమని దేవుడికి ఒక పరీక్షలాగా మాట్లాడుతారు. 

మరొకసారి జగ్రత్తగా గమనించండి. నిజమైన భక్తులకే క్షేత్రదర్శనం ఫలవంతం అవుతుంది.


హరేరామ యనరా జీవా హరేకృష్ణ యనరా


హరేరామ యనరా జీవా హరేకృష్ణ యనరా
మరియొక రీతిని ముక్తిలేదురా హరే హరే యనరా

పరమశివుడు తనమదిలో నెప్పుడు హరేరామ యనడే
పరమయోగు లనునిత్య మాత్మలో హరేరామ యనరే
నిరంతరముగా నాంజనేయుడును హరేరామ యనడే
మరువక నీవును పరమభక్తితో హరేరామ యనవే

నరు డక్రూరుడు భీష్ముడు నిత్యము హరేకృష్ణ యనరే
వరముని గణములు ద్రోవది నిత్యము హరేకృష్ణ యనరే
నిరంతరంబుగ నారదాదులును హరేకృష్ణ యనరే
హరి కరుణామయు నాశ్రయించి శ్రీహరేకృష్ణ యనవే

పరమాత్ముడు శ్రీరాముని గుణములు పదేపదే తలచి
పరమపురుషుడగు కృష్ణుని బోధలు బాగుగ మదినెంచి
నిరంతరము హరినామ స్మరణమె నీపని యని యెంచి
పరిపరివిధముల పరమమధురముగ పాడుదు ననితలచి



30, మే 2026, శనివారం

హరిపై తలపే నిత్యం బైతే ఆనందం పరమానందం


హరిపై తలపే నిత్యం బైతే ఆనందం పరమానందం
హరిభక్తులు నీస్నేహితు లైతే ఆనందం పరమానందం

హరిసంకీర్తన చెవులకు సోకిన ఆనందం పరమానందం
హరిరూపము నీకనులకు తోచిన ఆనందం పరమానందం
హరినామము నీజిహ్వను నిలచిన ఆనందం పరమానందం
హరిసన్నిధి నీకాయము నిలిపిన ఆనందం పరమానందం

హరిచరణాంబుజసేవ లభించిన ఆనందం పరమానందం
హరిచరితము మనసారా చదివిన ఆనందం పరమానందం
హరిభజనలతో కాలము గడచిన ఆనందం పరమానందం
హరి యికచాలని భవము లణంచిన ఆనందం పరమానందం

హరేరామయని అరచిపాడితే  ఆనందం పరమానందం
హరేకృష్ణయని చిందులుత్రొక్కిన ఆనందం పరమానందం
హరిభక్తులుగా ప్రజలను మలచిన ఆనందం పరమానందం
హరిలోకములో స్థిరనివాసమే ఆనందం పరమానందం



పదుగురితో మనకు వృధాప్రసంగములు మేలా


పదుగురితో మనకు వృధాప్రసంగములు మేలా
మదిలో శ్రీహరిని నిలిపి మసలుటయే మేలా

ధారుణి పామరుల పేర్లు తలచుచున్న మేలా
శ్రీరాముని నామము మన జిహ్వనున్న మేలా

వారివీరి పనులకొరకు పరుగులిడుట మేలా
ఆరూఢిగ హరిపూజల నలరుచున్న మేలా

తరచుగ వేదాంతగ్రంథములు చదువ మేలా
హరికథలను చదువ బుధ్ధి యమరియున్న మేలా

పరమునకు కాని ధనము పట్ల ప్రీతి మేలా
పరమాత్ముని కృపాధనము పట్ల ప్రీతి మేలా

ఆలుబిడ్ఢ లందు ప్రీతి యధికమైన మేలా
చాల ప్రీతి శ్రీహరిపై జనియించుట మేలా

నేలకు నింగికిని తిరుగు నియమమిదే మేలా
చాలు నని భవములు హరి సన్నిధిగొన మేలా


29, మే 2026, శుక్రవారం

మధురమైన పేరు కల మారాముడు


మధురమైన పేరు కల మారాముడు మాకు
మధురమైన వరములిచ్చు మారాముడు

మధురదరహాసంబుల మారాముడు పరమ
మధురముగా మమ్మేలును మారాముడు
మధురమైన పలుకులతో మారాముడు మమ్ము
మధురముగా దీవించును మారాముడు

మధురమైన చరిత కల మారాముని మునులు
మధురముగా పొగడే రదె మారాముని
మధురకీర్తిమంతుడైన మారాముని మేము
మధురముగా పొగడెదము మారాముని

మధురమైన భక్తినొసగి మారాముని మేము
మధురముగా సేవింతుము మారాముని
మధురమైన కృపగలిగిన మారాముడు మాకు
మధురముగా మోక్షమిచ్చు మారాముడు


రామనామము పలుకవలెరా


రామనామము పలుకవలెరా
  రామునే పూజించవలెరా
రామచంద్రుని గొప్పచాటుచు
  భూమిపై చరియించవలెరా

ఆలుబిడ్డలు నీకు చేసెడి
  మేలుకలదో లేదొ తెలియదు
మేలుచేయును రామనామము
  మిక్కిలిగ నిది యొకటె సత్యము

కూడబెట్టిన ధనము లన్నవి
  కూర్చుమేలు ఋజువు తెలియదు
నేడు చేసే రామనామము
  వేడుకగ రక్షించు సత్యము

కష్టములలో మిత్రమండలి
  కావవచ్చునొ లేదొ తెలియదు
దుష్టువేళల రామనామము
  కాచు నన్నది పరమసత్యము

త్రోవచూపవు కూటివిద్యలు
  నీవు ముక్తిని పొందగోరిన
త్రోవచూపగ రామనామము
   నీవు తరియించెదవు సత్యము

26, మే 2026, మంగళవారం

రామనామం రామనామం


రామనామం రామనామం
రామనామం మాకు ప్రాణం

శాపము లణచే రామనామం 
  పాపము లణచే రామనామం
తాపము లణచే రామనామం 
  దయచూపించే రామనామం

క్రోధము నణచే రామనామం 
  కుటిలత మాన్పే రామనామం
వ్యాధులు మాన్పే రామనామం
  బాధలు తీర్చే రామనామం 
  
అతులిత మైనది రామనామం
  అతిశయ మణచే రామనామం 
బ్రతుకును నడిపే రామనామం 
  రాగము నణచే రామనామం

అవనిజ నేలిన రామనామం
  హనుమను బ్రోచిన రామనామం
భువనాశ్రయ మీ రామనామం
   పురహర వినుతం రామనామం

దనుజవిరామం రామనామం
  దశముఖభయదం రామనామం
మునిజన వినుతం రామనామం
   పుణ్యోపేతం రామనామం

నిగమప్రసిధ్ధం రామనామం
  నిరుపమ మైనది రామనామం
జగదారాధ్యం రామనామం
  సంతతశుభదం రామనామం

శాశ్వతమైనది రామనామం
  సర్వశరణ్యం రామనామం
ఐశ్వర్యప్రదం రామనామం
   అనాది యైనది రామనామం

రమణీయం శ్రీరామనామం
  భ్రమలను విరిచే రామనామం
కమనీయం శ్రీరామనామం
  ఘనశుభవరదం రామనామం

పరమసులభ మీ రామనామం

పరమసుఖద మీ రామనామం

పరమమంత్ర మీ రామనామం

పరమైశ్వర్యము రామనామం


పరమవరద మీ రామనామం

పరమమధుర మీ రామనామం

పరమరమ్య మీ రామనామం

పరమగమ్య మీ రామనామం


పరమానందం రామనామం
  కరుణాభరితం రామనామం
పరమపవిత్రం రామనామం
  తరణోపాయం రామనామం

ప్రవిమల మైనది రామనామం
  ప్రతిలేనిది శ్రీరామనామం
భవభయ మణచే రామనామం
  వదలకు వదలకు రామనామం



22, మే 2026, శుక్రవారం

రాము డొక్క డున్న చాలురా


రాము డొక్క డున్న చాలురా మనకందరకు శ్రీ

రాము డిక్క డున్న చాలురా మనకందరకు 


తనను నమ్ముకొన్నచో దయజూపే రాముడు

తనవెంబడి నడచినచో తనవారను రాముడు

తనను శరణుకోరితే తలగాచే రాముడు

తనకు తాను సాటిగా తనరారే రాముడు

అరెరే ఆ..


కోరుకున్న వరములను కురిపించే రాముడు

చేరికొలుచు వారికెపుడు సేమమిచ్చు రాముడు

దారుణములు చేయువారి దండించెడు రాముడు

నారాయణుడని మనులు నమ్మి పలుకు రాముడు

అరెరే ఆ..


సీతమ్మను గూడి మన చెంతనున్న రాముడు

ప్రీతితోడ సద్భక్తుల వేడ్క దీర్చు రాముడు

నీతిపథము నందు జనుల నిలబెట్టెడు రాముడు

ఖ్యాతిగ భవబంధములను ఖండించెడు రాముడు

అరెరే ఆ..


రామనామము చేయరే


రామనామము చేయరే శ్రీ
  రామనామము చేయరే
రామనామము చేసి మోక్ష
  గాములొ వెలుగొందరే

రామ రామ యనిన చాలును
  కామక్రోధము లంతరించును
రామ రామ యనిన చాలును
  తామసత్వ మంతరించును
రామ రామ యనిని చాలా
  గామిసంచిత మంతరించును
రామ రామ యనిన మీలో
  సౌమనస్యము వెల్లివిరియును

రామ రామ యనెడు వారికి
  లేమి యన్నది లేకపోవును
రామ రామ యనెడు వారల
  కేమిచింతలు లేకపోవును
రామ రామ యనెడు వారికి
  కేమి భయములు లేకపోవును
రామ రామ యనెడు వారికి
  భూమి నెదురే లేకపోవును

రామ రామ యనెడు జీవుని
  రాముడే రక్షించుచుండును
రామ రామ యనుట కధికం
  బేమి భాగ్యము కలదు భూమిని
రామ రామ యనెడు హనుమకు
  రాము డిచ్చెను బ్రహ్మపదము
రామ రామ యనిన మీకును
   ప్రేమతో హరి మోక్షమిచ్చును

 

చింతలన్ని తొలగించును శ్రీరాముడు


చింతలన్ని తొలగించును శ్రీరాముడు మన
కంతులేని సుఖము నిచ్చు నారాముడు

మూడులోకముల వారు మ్రొక్కుచుండగ తాను
వేడుకగా మనవాడై వెలసినాడు
ఏడుగడగ సద్బక్తుల కెల్లప్పుడు నుండెడు
వేడుకతో భూమిపైన వెలసినాడు

మనసారా పిలిచితే మనసులోనె నెలకొని
మనవాడై మసలుచుండు మనరాముడు
మనసును కల్లోలపరచు మాయలమారి కలిని
మనవంకకు రానీయడు మనరాముడు

ధనము కాదు మనసు చూచి తనవానిగ చేసుకొని
ఘనముగ రక్షించుచుండు ఘనశ్యాముడు
తనకన్యము నెరుగనట్టి తనవారికి మోక్షమును
మనసుపడి యిచ్చుచుండు మనరాముడు

21, మే 2026, గురువారం

చావుపుట్టుకలను మాన్పు చక్కనిమందు


చావుపుట్టుకలను మాన్పు చక్కనిమందు మీకు
కావలసిన నిచ్చెద కడు కమ్మనిమందు

ఏతరుణము నందు గొన్న హితముగూర్చు మందు
ఖ్యాతిగొన్న గొప్నమందు కమ్మనైన మందు
ఏతీరున సేవించిప హితముగూర్చు మందు
మోతాదున కెక్కు వైన ముప్పులేని మందు

సామాన్యుల కైన దొరకు సరసమైన మందు
ఏమాత్రము సేవించిన హితముగూర్చు మందు
కామాదివికారములకు గట్టిమందు వినుడు
కామారియె మెచ్చుకొన్న ఘనతగొన్న మందు

పామరత్వ మణచివేయు భలే మంచిమందు
తామసత్వగుణము నిట్టె తగ్గించెడు మందు
ప్రేమతోడ సేవించిన క్షేమమిచ్చు మందు
రామనామ మనే భలే రమ్యమైన మందు


20, మే 2026, బుధవారం

రామా నీనామమే ప్రాణమైన


రామా నీనామమే ప్రాణమైన
నామనసు పలుక దన్యనాములను

ఉదయమే నీనామ మొప్పుగ బల్క
నుదితమై దినము నిదుర కొరుగు దాక
సదా నీదివ్యనామస్మరణము తోనే
ముదమారగ నడచును మోహనాంగ

ఏపారగ నీనామమే యెల్లవేళలను
పాపతమోభాస్కరమై పరగుచు నుండ
లోపమేమి రానీక రూపింతు సద్భక్తి
నాపాలి దైవతమా కాపాడుము

హరి యన్నను హరుడన్న నరయ నీవే
మరి నాకు సర్వస్వం బనగ నీవే
పరమపురుష నీసరిగ భావింతునా
మరియొక్కని నన్నింక కరుణింపుము


17, మే 2026, ఆదివారం

గురువు కల్లమనుజుడైన గోవింద గోవింద


గురువు కల్లమనుజుడైన గోవింద గోవింద
పరము కూడ కల్ల కదా హరిగోవిందా

కూటవిద్యానిపుణలను గోవింద గోవింద
పాటించి గురువులని పామరజనులు
కోటానుకోట్లు గాను గోవింద గోవింద
చేటెరుగక నిత్యమును చెడుచున్నారు

కుమతులాడు మాటలకే గోవింద గోవింద
భ్రమసి మతము మారిన పామరజనులు
కుములవలయు ముందుముందు గోవింద గోవింద
సమవర్తి క్రోధానల జ్వాలలకెనయై

గురు వాదిశంకరు డగు గోవింద గోవింద
వరరామకృష్ణరూపములను నీవు
గురువులు మన వేదర్షులు గోవింద గోవింద
మరి యితరుల గురువులని మరిగతి చెడదే


13, మే 2026, బుధవారం

కల్లగురువులను కొలిచి జీవితము గుల్లచేసుకొనకు


కల్లగురువులను కొలిచి జీవితము
  గుల్లచేసుకొనకు జీవా
కల్లమతములను చేరి పరమును
  గుల్లచేసుకొనకు

ఎల్లలోకముల కీశ్వరు డనుచు
  నెరుగవయ్య హరిని జీవా
ఎల్లదిక్కలుకు నీశ్వరు డనుచు
  నెరుగవయ్య హరిని
ఎల్లజీవులకు నీశ్వరు డనుచు
  నెరుగవయ్య హరిని జీవా
నల్లనయ్యయే చల్లని వాడని
  యెరురుగవయ్య నీవు

ఎల్లరకును ప్రభువైన శ్రీహరి
  నెపుడు మరువబోకు జీవా
కల్లగురువులను కల్లమతములను
  కలిసి నీవు చెడకు
చల్లగచూసే శ్రీహరి యండయె
  చాలునెపుడు మనకు జీవా
ఎల్లవేళలను శ్రీహరి పాదము
  లెంచి బ్రతుకు నీవు

హరియే రాముడు హరియే కృష్ణుం
  డనుచు నెరుగవయ్యి జీవా
హరియే శివుడని శివుడే హరియని
  యాత్మ నెరుగవయ్యా
హరేరామ యని హరేకృష్ణ యని
  యనిన పరము గలదు జీవా
పరమప్రమాణము వేదమార్గ మిది
  మరచి చెడకు నీవు


9, మే 2026, శనివారం

భావన చేయవయా

 
జీవా జీవబ్రహ్మైక్యతనే భావన చేయవయా
భావన చేయుచు విశ్వమయంబగు బ్రహ్మము నెరుగవయా

ప్రపంచమంతా బ్రహ్మమయంబని భావన చేయవయా
విపరీతంబుగ తలచుట యది యవివేకము తెలియవయా

బంధములెందుకు బాధలెందుకని భావన చేయవయా
బంధము లన్నీ భావనలే నని భావన చేయవయా

బ్రహ్మమెక్కటే పరమసత్యమని భావన చేయవయా
బ్రహ్మము నీకన్యంబుగ లేదని భావన చేయవయా

సత్యస్ఫురణకు హరికృప యొకటే సాధన మెరుగవయా
నిత్యము రామా యంటే హరికృప నీకు లభించునయా