30, ఏప్రిల్ 2023, ఆదివారం

హరిపూజాకుసుమములే యందమైన కీర్తనలు

హరిపూజాకుసుమములే యందమైన కీర్తనలు
హరికి నివేదించుటకే యావిర్భవించినవి

మంచిమంచి భావనలే మంచిపరీమళములుగా
మంచిమంచి పదములే మంచివర్ణములుగా
మంచిమంచి చరణములే‌ మంచిపువురేకులుగా
మంచిగ విరబూసినట్టి మంచిహరికీర్తనలు

పల్లవులే తొడిమలుగా ప్రభవించిన కీర్తనలు
మెల్లగ సద్భావనల చల్లగ వెదజల్లుచును
నల్లనయ్య సత్కీర్తి నెల్లెడల జాటుచును
సల్లలిత మధురభక్తి సమన్వితం బైయుండే

హరేరామ హరేకృష్ణ యని పరమప్రీతితోడ
నిరంతరము జపియించే నిర్మలాంతఃకరణులు
పరాత్పరా రామచంద్ర ప్రభో నీవు వినుమనుచు
హరిభక్తులు నిత్యముని పరవశమున నర్పించే 
 

29, ఏప్రిల్ 2023, శనివారం

గోవిందుని నామములే కొంగుబంగరు కాసులు

గోవిందుని నామములే కొంగుబంగరు కాసులు
ప్రోవు చేసుకొనవయ్య ప్రొద్దుగూకులు

నీవు పీల్చు యూపిరికి నీవిచ్చు కృతజ్ఞతలు
నీవు చేయు పనులకెల్ల నిత్యసహకారాలు
నీవు మోసుకొనిపోయే నిజమైన ఆస్తులు
నీవు కొను ముక్తిమేడకు నీవిచ్చే సొమ్ములు
 
భావింపగ బ్రతుకు పొలము పండించే చినుకులు
దేవుని సంబోధించే దివ్యమైన పదములు
లావైన పాపలతల ఠీవిచెఱచు కత్తులు
ఆవిధివ్రాతలను మార్చు అందమైన ఆజ్ఞలు

సేవించెడు వారికెల్ల క్షేమమిచ్చు దీవనలు
ధీవరులను నడిపించు దివ్యకరదీపికలు
భావనాకాశమందు ప్రకాశించు తారకలు
ఆవిభుని రామనామ మందు చంద్రబింబము 

 
 

హరినామములే పలికెదము

హరినామములే పలికెదము హరిభజనలనే చేసెదము
హరికీర్తనమే సలిపెదము  హరిభక్తులమై మెలగెదము

హరిహరి హరి యని యన్నివేళలను ఆనందముతో అనురాగముతో
పరమాత్మా యని పరాత్మరా యని పతితపావనా యని వేడుకతో
నిరుపమ సుగుణాకర రామా యని నీరజనయనా యని మనసారా
దరసెనమీరా దశరథతనయా దనుజవిదారా యని మనసారా

విరించిపశుపతివాసవాదినుత విభీషణార్చిత విభో హరే యని
ధరాత్మజాహృదయాంబుజవాస ధర్మపరాక్రమ రఘునందన యని
నరసింహాచ్యుత త్రిభువనపాలక వరమునిసన్నుత పరంతపా యని
నరనాథోత్తమ దరహాసముఖా నారాయణ హరి నిరంజనా యని

సత్యపరాక్రమ రామచంద్రయని సాకేతాధిప జగదీశ్వర యని
నిత్యనిర్మల నిరుపాధిక యని నీరజనయనా జ్ఞానాశ్రయ యని
భృత్యపాలక పురుషోత్తమ యని వేదవేద్య సద్భక్తవరద యని
నిత్యము సద్భక్తులమై నిలచి నిర్మోహులమై నరంతరంబుగ



28, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఎన్నడేని రామచంద్రు బన్నుగా నుతింపకున్న

ఎన్నడేని రామచంద్రు బన్నుగా నుతింపకున్న 
నన్న మెట్లు సహించునో యన్న సద్భక్తునకు 

అన్నోదకంబు లన్నియు హరిదయతో నిచ్చినవని
తిన్నగాను మనసులోన నెన్నుచు సంతోషముగా
కన్నతండ్రి నీదయచే కలిగిన నీతనువు నిపుడు
నిన్ను దలచి పోషించెద నీవిచ్చిన మెతుకుల నని

చకలచరాచరంబులను చక్కగాను పోషించుచు
అకళంకస్థితిని లోకము లన్నింటిని నిలుపు తండ్రి
శుకాదియోగివరు లెన్ను శుధ్ధబ్రహ్మస్వరూపమవు
వికచతామరసాక్ష నిన్ను వేనోళ్ళను పొగడుదునని 

పన్నగేంద్రశయన హరి పన్నగేంద్రభూష వినుత
పన్నగారివాహన ఆపన్నశర ణ్యాప్రమేయ
ఎన్నగ నీకృపామృతం బన్నరూపమగుచు కలిగె
నన్ను ధన్యుని చేసినట్టి నారాయణ వందనమని


రామనామ స్మరణమునకు రమ్యమైన సమయము

రామనామ స్మరణమునకు రమ్యమైన సమయము

భూమిజనులు నిదురపోవు పుణ్యసమయమే


నరుల దురాలోచనాతరంగములు ప్రకృతిలో

తిరుగుచుండు వేళలందు దివ్యభావనల యోగి

వరులు సాధనల నిలుప వలయుననిన కష్టము

మరి యందుకె రాత్రులన్న మక్కువ చూపింతురు


ఏల దైవచింతనమని యెవరును ప్రశ్నించరు

ఏల రామా యందువని యెవరను ప్రశ్నించరు

ఏల భక్తిపిచ్చి యనుచు నెవరు నికిలించరు

చాల ప్రశాంతముగ  రామచంద్రస్మరణ సాగును


పవలును రేలును తారకనామము

పవలును రేలును తారకనామము వదలక చేయుము తారకనామము
దివిలో భువిలో తారకనామము దీక్షగ చేయుము తారకనామము
 
నిరతము మదిలో తారకనామము నిష్ఠగచేయుము తారకనామము
సరళంబైనది తారకనామము చక్కగచేయుము తారకనామము
 
పదుగురి లోనను తారకనామము మదిలో నిలుపుము తారకనామము
విదులను గూడుక తారకనామము విరివిగ చేయుము తారకనామము
 
ధనముల కోరక తారకనామము తప్పకచేయుము తారకనామము
మనసుతీరగా తారకనామము మానకచేయుము తారకనామము
 
కలుషాంతకమని తారకనామము తెలిసి జపించుము తారకనామము
కలినణగించును తారకనామము కావున చేయుము తారకనామము
 
భవబంధమ్ముల తారకనామము బ్రద్దలుచేయును తారకనామము
సవినయముగను తారకనామము చక్కగ చేయుము తారకనామము
 
హరేరామ యని తారకనామము నార్తిగ చేయుము తారకనామము
హరేకృష్ణ యని తారకనామము నాపకచేయుము తారకనామము
 
శక్తికొలదిగను తారకనామము చక్కగచేయుము తారకనామము
భక్తులందరకు తారకనామము ముక్తినొసంగును తారకనామము


27, ఏప్రిల్ 2023, గురువారం

శ్రీరామునే నమ్మి సేవించు జనులార

శ్రీరామునే నమ్మి సేవించు జనులార చింతలే మీకెపుడు లేవు
శ్రీరాముడే యోగక్షేమంబు లరయగా చింతలెందుకు కలుగు మీకు
 
శ్రీరామకీర్తినే చాటించు జనులార చెలగు మీకెప్పుడును జయము
శ్రీరాముడే విజయకారకుండై యుండ సిధ్ధించవా జయము లెపుడు

శ్రీరామభక్తు లన్యులచేరి యెన్నడును చేయిజాచుట మాటలేదు
శ్రీరామచంద్రుడే సర్వార్ధముల నీయ చేయిజాచగ నేల మీరు

శ్రీరామ తత్త్వంబు నెఱిగిన జనులార చెంద రెన్నడు మదిని భ్రమలు
శ్రీరామమయముగా జగము మీ‌కగుపించ చిత్తవిభ్రమ మెట్లు కలుగు 

శ్రీరామనామమే స్మరియించు జనులార మీరింక జన్మించ బోరు
శ్రీరామనామమే భవతారకము గాన మీరేల జన్మింతు రింక

అమితదయాపర రామా జయజయ

అమితదయాపర రామా జయజయ హరి నన్నేలుము రామా
మరువకు మరువకు రామా నన్ను పరిపాలించుము రామా

దశరథనందన రామా జయజయ దరహాసముఖ రామా
దశముఖమర్దన రామా జయజయ ధర్మవివర్ధన రామా

సురగణపోషక రామా జయజయ సురారిశోషక రామా
వరమునిసన్నుత రామా జయజయ పరమార్ధప్రద రామా
 
శ్రితజనపోషక రామా జయజయ సీతానాయక రామా
జితశతమన్మథ రామా జయజయ అతిమనోహర రామా

జలనిధిబంధన రామా జయజయ కలుషవిదారణ రామా
కలిమలభంజన రామా జయజయ కరుణాసాగర రామా

లోకపోషక రామా జయజయ శోకనాశక రామా
భీకరవిక్రమ రామా జయజయ వీరరాఘవ రామా

నీరజనయనా రామా జయజయ నితనిరంజన రామా
శ్రీరఘునందన  రామా జయజయ తారకనామా రామా

ఓరి దేవుడా నాకొసగ వద్దు

ఓరి దేవుడా నాకొసగ వద్దు అది ఓరి దేవుడా నాకొసగ వద్దు


శ్రీరామనామమును చేయని జన్మమా ఓరి దేవుడా నాకొసగ వద్దు

శ్రీరామ సేవకే దూరమౌ జన్మమా ఓరి దేవుడా నాకొసగ వద్దు

శ్రీరామ భక్తులను చేరని జన్మమా ఓరి దేవుడా నాకొసగ వద్దు

శ్రీరాముని దయను కోరని జన్మమా ఓరి దేవుడా నాకొసగ వద్దు

శ్రీరాముని చేరనేరని జన్మమా ఓరి దేవుడా నాకొసగ వద్దు

శ్రీరామ తత్త్వమే తెలియని జన్మమా ఓరి దేవుడా నాకొసగ వద్దు

శ్రీరామ విముఖుల చేరెడి జన్మమా ఓరి దేవుడా నాకొసగ వద్దు

శ్రీరామ చింతనకు నోచని జన్మమా ఓరి దేవుడా నాకొసగ వద్దు

 

మనవాడై శ్రీరాముడుండగా

మనవాడై శ్రీరాముడుండగా మనకేలా భయము
ఘనుడగు రాముని భక్తులకెన్నడు కలుగ దనిష్టమ్ము
 
సురారి రావణు బిరాన జంపగ ధరాతలంబునకు
పురాణపురుషుడు పరాత్పరుడు హరి నరాకృతిని గొనుచు
ధరాతలపతి పరంతపుండగు దశరథసూనుండై
చరించి వధించి సురారి వీరుల జనులను బ్రోచుచును

నిరంతరంబును మునీంద్రవరులును నిఖిలదేవతలును
పరాక్రమంబున సమానులనగా హరి నీ కెవరనుచు
వరించి పొగడగ విశాలనయనుడు ప్రసన్నుడైయుండి
విరించి ప్రముఖుల శిరంబులూపగ వేడుక చేయుచును

సమస్తభక్తుల మనోరథంబులు చక్కగ నిచ్చుచును
సమానరహితుడు పరంతపుండగు సర్వేశ్వరుడు హరి
రమించి సుజనులు తరించ తన నిజతత్త్వము నందెపుడు
విమోహరహితులు ముముక్షువుల కిదె పిలచి మోక్షమీయ


26, ఏప్రిల్ 2023, బుధవారం

నిత్యసత్యవ్రతునకు నీరజశ్యామునకు

నిత్యసత్యవ్రతునకు నీరజశ్యామునకు 
భృత్యులము శ్రీరామభృత్యులము మేము 

కమనీయగాత్రునకు కరుణాసముద్రునకు
విమలచారిత్రునకు వీరరాఘవునకు
కమలాయతాక్షునకు ఘనపాపహరునకు
విమలకీర్తియుతునకు భృత్యులము మేము

అరివీరమర్దనునకు వరభక్తసులభునకు 
దరహాసవదవునకు ధర్మావతారునకు
పరమయోగీంద్రునకు పరమసుఖప్రదునకు
విరించ్యాదినుతునకు భృత్యులము మేము
 
తారకనామునకు ధరణిజానాధునకు
నారాయణమూర్తికి దారుణదైత్యారికి
వారాశిబంధనునకు పట్టాభిరామునకు
వీరాధివీరునకు భృత్యులము మేము


శ్రీరామ సీతారామ యనే చిత్త మున్నదా

శ్రీరామ సీతారామ యనే చిత్త మున్నదా
శ్రీరాముని పూజించు మంచిచేయి యున్నదా

శ్రీరామ భక్తిపరుల తోడ స్నేహమున్నదా
శ్రీరామసేవ యందు బుధ్ధి చేరియున్నదా
శ్రీరామ తత్త్వమందించుక చింతనున్నదా
శ్రీరామయోగమార్గ మందు కోరికున్నదా
 
శ్రీరామ రామ రామ యనుచు చెప్పుడందుకే
శ్రీరామ నామ మొకటి చాలు చేయుడందుకే
శ్రీరామ నామస్మరణమే చేయువారికి
శ్రీరామచంద్రు డేమీయడు చింతదేనికి
 
శ్రీరామ భక్తిపరుల కెపుడు సేమమున్నది 
శ్రీరామ భక్తిపరు లెపుడు చెడుటకలుగదు
శ్రీరామ భక్తి కుదిరితేను సిధ్ధికలుగును
శ్రీరామ భక్తి వలన మోక్ష సిధ్ధికలుగును
 

హరిని నమ్ముకొంటే మీకు హరియే తోడు

హరిని నమ్ముకొంటే మీకు హరియే తోడు శ్రీ

హరిని నమ్మకుంటే మీకు మరి యెవరు తోడు


సురవరులందరకును హరియొకడే తోడు

హరబ్రహ్మాదులకును హరియొకడే తోడు

చరాచరసృష్టి కెల్ల హరియొకడే తోడు

హరితోడు వలదంటే మరి యెవరు తోడు


పరమయోగీంద్రులకు హరియొకడే తోడు

అరయ మునులందరకు హరియొకడే తోడు

పరమభక్తులందరకు హరియొకడే తోడు

హరి గాక యెవరికైన మరి యెవరు తోడు


హరి యొకడే తోడని హరేరామ యనరే

హరి యొకడే తోడని హరేకృష్ణ యనరే

హరి యొకడే తోడని యనిశము పలుకరే

మరి యెవరు తోడు శ్రీహరియే తోడనరే


శ్రీరాముని చేరవలెను సుజనులారా

శ్రీరాముని చేరవలెను సుజనులారా శ్రీరాముని వేడవలెను సుజనులారా
 
చిత్తశుధ్ధి కలిగి మీరు శ్రీరాముని చేరి సేవించవలెను శ్రీరాముని
నెత్తావి విరులతోడ శ్రీరాముని నిత్యము పూజించవలెను శ్రీరాముని
 
పరమప్రేమతోడ మీరు శ్రీరాముని భావించుచుండవలెను శ్రీరాముని
నిరుపమానదయాశాలి శ్రీరాముని తరచుగా తలపవలెను శ్రీరాముని
 
ధర్మావతారుడైన శ్రీరాముని దశరథనందనుడైన శ్రీరాముని
కర్మబంధమోచకుని శ్రీరాముని ఘనముగా వేడవలెను శ్రీరాము
 
దుర్మోహము లెల్లవిడచి శ్రీరాముని దోయిలించి వేడవలెను శ్రీరాము
నిర్మలహృదయు లగుచు శ్రీరాముని నిత్యమును వేడవలెను శ్రీరాముని
 
శివధనుర్భంజకుడగు శ్రీరాముని సీతాహృదయోల్లాసుని శ్రీరాముని
భవబంధనాశకుడగు శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
పరమపూరుషుండైన శ్రీరాముని పతితపావనుడైన శ్రీరాముని
పరమభక్తుసులభుదైన శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
దరహాసవదనుడైన శ్రీరాముని నిరుపమానవీరుడైన శ్రీరాముని
పరమాత్ముడైన యట్టి శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
శరణాగతవత్సలుడగు శ్రీరాముని పరమసుందరుడైన శ్రీరాముని
పరమయోగిసేవితుడగు శ్రీరాముని భక్తితోడ వేడవలెను  శ్రీరాముని
 
వేలుపులకు దిక్కైన శ్రీరాముని నీలమేఘశ్యాముడైన శ్రీరాముని
ఫాలనేత్రవినుతుడైన శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
బ్రహ్మానందకరుండైన శ్రీరాముని పరమయోగిపూజితుడగు శ్రీరాముని
బ్రహ్మాద్యభినందితుడగు శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
మానవేంద్రనాథుడైన శ్రీరాముని మహామహిముడైనట్టి శ్రీరాముని
వానరాధినాధనుతుని శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
దాసజనపోషకుడగు శ్రీరాముని దనుజలోకనాశకుడగు శ్రీరాముని
భాసురసత్కీర్తియైన శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
రావణాసురనాశకుని శ్రీరాముని రమ్యసుగుణధాముని శ్రీరాముని
భావనాతీతుడైన శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
భవతారకనాముడైన శ్రీరాముని పట్టాభిరాముడైన శ్రీరాముని
పవనజసంసేవితుడగు శ్రీరాముని భక్తితోడ వేడవలెను శ్రీరాముని
 
నిత్యసత్యవ్రతుండైన శ్రీరాముని నిత్యసత్యకీర్తియైన శ్రీరాముని 
నిర్మలచారిత్రుడైన శ్రీరాముని నిర్మలుడై వేడవలెను శ్రీరాముని
 
ఇనకులాబ్ధిసోముడైన శ్రీరాముని హృదయసంస్థితుడైన శ్రీరాముని
మునిమోక్షవితరణుని శ్రీరాముని ముముక్షువై వేడవలెను శ్రీరాముని 

25, ఏప్రిల్ 2023, మంగళవారం

భారమైతినా నీకు పతితపావనా

భారమైతినా నీకు పతితపావనా సం

సారబాధకోర్వక నిను శరణుజొచ్చితే


శరణుజొచ్చి నపుడు కరి చాలభార మనలేదు

శరణుజొచ్చి నంత సురలు సాధ్యపడ దనలేదు

శరణమన్న కపిరాజుకు చాలకష్ట మనలేదు

శరణమంటే నేనిపుడు మరియేల మౌనము


శరణమన్న కాకాసురు కరుణించి విడచితివి

శరణమన్న విభీషణుని సత్కృపతో కాచితివి

శరణమంటే రావణనే కరుణించెద నంటివి

శరణమంటే నన్నిప్పుడు కరుణించ కుందువు


శరణాగతులగు భక్తుల పరిదీనత మాన్పుచు

తరచుగ వారకి మోక్ష వితరణము నొనరించే

పరమపురుష రామచంద్ర పరాంగ్ముఖుడ వైతివి

శరణమంటే విననట్లే విరసుడవై యుందువు


సీతానాయకా హరే సీతానాయకా

సీతానాయకా హరే సీతానాయకా రామ
చేతులెత్తి మ్రొక్కేము సీతానాయకా
 
పాతకులమయ్యా మేము సీతానాయకా కలి
చేతులలో పాడైతిమి సీతానాయకా
రోతధనముల కొఱకు సీతానాయకా బహు
పాతకములు చేసితిమి సీతానాయకా
 
చేతబట్టి పాశములను సీతానాయకా యమ
దూతలు మము పట్టెదరు సీతానాయకా
ఆతురులమయ్యా మేము సీతానాయకా బహు
భీతచేతస్కులము సీతానాయకా
 
మాతప్పులు కాయవయ్య సీతానాయకా మ
మ్మేతీరున బ్రోచెదవో సీతానాయకా 
మాతలపుల నిన్నుంచి సీతానాయకా బహు
ప్రీతితో స్మరించెదము సీతానాయకా

 

రఘువంశజలధిచంద్ర రామచంద్ర

రఘువంశజలధిచంద్ర రామచంద్ర
అఘుమోచక నామొఱ్ఱ లాలకింపరా

పురుషోత్తమ నీపాదాంబుజములే చాలు
నిరతము ముల్లోకములకు శరణము కాగ
శరణమనే లోకములను కరుణను కావ
పరాత్పర నారాయణ పతితపావన

పాదంబులు కాదు నీదు పాదుకలే చాలు
వేదనలను తగ్గించుచు మేదిని నేల
నీదాసుల ఘనతలను నేలను చాట
వేదవేదాంతవేద్య విమలరాఘవ

పాదుకలా నీపావన నామంబే చాలు
ఆదరించి బ్రహ్మపద మైన నొసంగ
నీదయచే తారకమగు నీనామంబు
నాదీనతబాపి ముక్తి నాకిడు గాక

 

సర్వసృష్టియందు రామచంద్రుని గనరా

సర్వసృష్టియందు రామచంద్రుని గనరా

గర్వరహిత రామభక్తాగ్రగణ్యుడా


పవలు రేలు రామధ్యానపరత నుండరా

భువిన దివిని నీకు సుఖము పుట్టుచుండురా


బయట నింట నీవు రామభజన చేయరా

జయము లెపుడు నీకు రామచంద్రు డిచ్చురా


ప్రజలమధ్య రామకీర్తి వ్యాప్తి చేయరా

సుజనులెపుడు కోరునట్టి సుగతిచెందరా 


24, ఏప్రిల్ 2023, సోమవారం

హరి నీవాడైతే నదియే చాలు

హరి నీవాడైతే నదియే చాలు తుం
టరులాడు టక్కరిమాటలతో నేమి

యెంచి నిన్ను భక్తుడవని ఎవరైనా పలికితే
పొంచియుండి తుంటరులు పొరిపొరి నవ్వేరు
వించు హరికీర్తనము విబుధవరులు మెచ్చితే
కొంచెపుబుధ్ధుల వారు గుసగుసలాడేరు

హరినీకు దయచూపి యనువుగ పలికించితే
ధరమీద కొందరు నిను తప్పులుపట్టేరు
మరి పెద్దల దారిలోన మానక నీవుండితే
తరచుగా తుంటరులు దారి కడ్డుపడేరు

రామరామ యనుచు నీవు రంజుగా పాడితేను
పామరులది హాస్యములపాలుగా చేసేరు
భూమినున్న కుజనులతో పోట్లాట లెందుకులే
శ్యామసుందరునితోడి సఖ్యమొకటి చాలును


భమిడిపంజర మైనను కాని

భమిడిపంజర మైనను కాని పంజరము పంజరమే
విమలయశస్సాంద్రరామ విరక్తితో నివాసమే
 
పాయసమును పెట్టినను బందిఖాన యనును కాని
హాయిగ నుందని యనునా యందులోని రామచిలుక
హేయమైన పంజరమున నెన్నాళ్ళని వగచు గాని
ఓ యయోధ్యరామ తానుండునా సంతసమున
 
వటువైన గృహస్థుడైన బ్రహ్మజ్ఞాని యోగియైన
దిటవులేనిబ్రతుకు బ్రతుకు దేశద్రిమ్మరిగ నైన
నెటువంటి దేహ మిచ్చిన నీజీవికి పంజరమే
అటమటపడి యందుండుట హరి చాలదుర్భరమే

 

చాలదా శ్రీరాముని దయయే

చాలదా శ్రీరాముని దయయే చాలదా మన కెల్లపుడు

రాముని నామము నోటను సుస్థిరంబుగ నుండిన చాలదా
రాముని రూపం బెడదను సుస్థిరంబుగ నుండిన చాలదా
రాముని కథయే మదిలో సుస్థిరంబుగ నుండిన చాలదా
రాముని దయయే బ్రతుకున సుస్థిరంబుగ నుండిన చాలదా

రాముని యందనురాగము సుస్థిరంబుగ నుండిన చాలదా
రాముని భక్తుల సంగతి సుస్థిరంబుగ నుండిన చాలదా
రాముని పూజల శ్రధ్ధయె సుస్థిరంబుగ నుండిన చాలదా
రాముని వాడను పేరే సుస్థిరంబుగ నుండిన చాలదా


మాటిమాటికిని పొగడ మనసౌనురా

మాటిమాటికిని పొగడ మనసౌనురా యెన్ని
పాటలైన పాడుదురా పరవశించుచు
 
ఆనారదు లట్టులనా యని నవ్వబోకురా
దానికేమి యెవరి భక్తితత్పరత వారిది
తానేమో కల్పములుగ మానక నినుపొగడ
నేనెన్నో జన్మములుగ నిలచి నిన్ను పొగడనా
 
ఆవాయుసుతు వలెనా యని నవ్వబోకురా
భావించగ నెవరి కబ్బుభాగ్యములు వారివి
పావని నీపాదంబుల వసియించుచు పాడ
నీవానిగ నెంచుకొనుచు నిలచి నిన్ను పొగడనా

శివుని వలె బ్రహ్మవలెను చేరి నిన్ను పొగడగా
భువిని యెక్క నరుడ నాకు పొసగునా యేమి
వివరింప నాదు భక్తి వెక్కసమా రామ
అవధరింపచయ్య నీవు హాయిగ నాపాటలను


శరణము శరణము శ్రీరఘురామా

శరణము శరణము శ్రీరఘురామా సర్వరక్షకా జగత్ర్పభో
కరుణాసాగర పరిపాలయమాం కామితవరదా జగత్ప్రభో

నీనామామృత ముండినచాలని నిత్యము తలచుచునుందు కదా
నీనామము నానోట నుండగా నిర్భయముగ నేనుందు కదా
మానుగ నీశుభనామ మెప్పుడును మంగళములు కలిగించు కదా
జ్ఞానము సౌఖ్యము మోక్షము నీయగ నీనామంబే చాలుగదా

నిన్నే మదిలో నమ్మినవారల కెన్నడు నాశములేదు కదా
నిన్నే కొలిచెడువారల సౌఖ్యము లెన్నడు తరుగుటలేదు కదా
చిన్నగ శ్రీరఘురామా యంటే శీఘ్రమె రక్షించెదవు కదా
పన్నుగ నిను శరణంబు జొచ్చుటే పరగ వివేకంబగును కదా 

దుర్భరభవవారాన్నిధి లోపల దొరకిన నావవు నీవె కదా
నిర్భయముగ నీయోడనుండిన నిక్కముగా తరియింతు గదా
గర్భనరకమున మరిజొరబారెడు కర్మము నాకిక రాదు కదా
అర్భకజీవుడ నపవర్గముగొని హాయిగ నీకడ నుందుకదా

ఇంత బ్రతుకు బ్రతికి నేనేమి సాధించితిరా

ఇంత బ్రతుకు బ్రతికి నేనేమి సాధించితిరా
యింతవరకు నాతపం బంతయు వృథయేనా

పాతజన్మలదోషముల వలన తపము ఫలించదో
పూతచరిత్రుడవు నిన్ను పొగడినది చాలదో
యేతంత్రము నేమంత్రము నెఱుగనిదొక దోషమో
యేతప్పే జరిగినదో యేల నీకు దయరాదో

ఆగామిసంచితంబుల నన్నివిధంబులగ నేల
పోగొట్టదు నీనామము భువననాయక రామ
వేగివేగియున్న మనసు వేయిచెక్కలగుచున్నది
సాగించిన మౌనమింక చాలును దయచూపరా

మరల జన్మ మెత్తుదునా మరలతపము చేయుదునా
మరల నీవు మౌనమూని మరియును బాధింతువు
పరమకృపామూర్తివంట కరకువాడవైయుండగ
దొరకొంటివి నాయెడల తొల్లిటిపద మీయకను

మేలుకదా నిను శరణము జొచ్చుట

మేలుకదా నిను శరణము జొచ్చుట మేదిని మనుజునకు రామా
కాలాంబుదఘనశ్యామా దితికులకాలా నిజముగను

పరమపురుష నిను భావన చేయని బండజన్మమేలా రామా
నిరవధిసుఖసంధాయక నిన్నే యెఱుగని బ్రతుకేలా రామా
కలిచేతులలో నిత్యము దెబ్బలు కాచుకొనగ నేలా రామా
నిలచి ధైర్యముగ రామ రామ యని పలుకక వెఱపేలా రామా

నిన్ను కాదని ధనపిశాచమును సన్నుతించనేలా రామా
తిన్నగ నిన్నే యడుగక యల్పుల దేబిరించనేలా రామా
నిన్నును చిల్లర దేవగణముతో నెన్ని చెడగనేలా రామా
పన్నుగ నీచరణంబుల నుండక బాధలు పడనేలా రామా

నుతశీలుడ వగు నిను కీర్తించని నోరు కలుగనేలా రామా
వ్రతముగ నీసేవారతి నుండని బ్రతుకు బ్రతుకనేలా రామా
పతితపావనుడ వని నిను తెలియక భంగపడగనేలా రామా
మతిచెడి దుష్టులమాటలు విని దుర్మతముల జొరనేలా రామా

 

23, ఏప్రిల్ 2023, ఆదివారం

చాలదా ఆభాగ్యము మనకు

చాలదా ఆభాగ్యము మనకు చాలదా బహుజన్మలకు
మేలుగా శ్రీరామమయంబై మించిన బ్రతుకే చాలదా

రాముని మంగళరూపము హృదయఫలకమున నుండిన చాలదా
రాముని తారకనామము జిహ్వాగ్రంబున నుండిన చాలదా
రాముని చరితామృతమును సతమనురక్తిని చదివిన చాలదా
రాముని  భక్తులతో సహవాసము ప్రాప్తించిన నది చాలదా
 
రాముని సేవాభాగ్యము కలిగి విరాజిల్లిన నది చాలదా
రాముని ముక్కాలంబుల దలచుచు బ్రతికినచో‌ నది చాలదా
రాముని కన్యము నెన్నడు నెఱుగక బ్రతికినచో నది చాలదా
రాముని స్వప్నము నందును మరువక బ్రతికినచో నది చాలదా
 
రాముని సంకీర్తన మొనరించుచు బ్రతికినచో‌ నది చాలదా
రాముని తల్లిగ తండ్రిగ నెఱుగుచు బ్రతికినచో‌ నది చాలదా
రాముని కరుణామృతమును చవిగొను ప్రాప్తము కలిగిన చాలదా
రాముని వాడై మోక్షము పొందెడు ప్రాప్తము కలిగిన చాలదా

22, ఏప్రిల్ 2023, శనివారం

నిన్నే నమ్మినవాడే రామా ధన్యుడు

వాడే ధన్యుడు నిన్నే  నమ్మినవాడే రామా ధన్యుడు


నారాయణ నిను మదిలో చక్కగ నమ్మినవాడే ధన్యుడు

ధారాళమగు నీకృపచాలని తలచెడువాడే ధన్యుడు

కోరినవరముల నిచ్చెడు నిన్నే కొలిచెడువాడే ధన్యుడు

మారజనక నీసేవాభాగ్యము మరిగినవాడే ధన్యుడు


నోరారా నీశుభనామంబును నుడివెడువాడే ధన్యుడు

తీరుగ నీచరితంబును చాటుచు తిరిగెడువాడే ధన్యుడు

శ్రీరామా నిను తనివారగ పూజించెడువాడే ధన్యుడు

భారమునీదే రామాయనుచు పలికెడువాడే ధన్యుడు


వైరాగ్యంబును బొంది భోగములు వలదనువాడే ధన్యుడు

సారహీనసంసారము నాకిక చాలనువాడే ధన్యుడు

నీరజనాభా నిన్నే కోరుచు నిలిచినవాడే ధన్యుడు

శ్రీరఘువర నిను శరణముజొచ్చిన ధీరపురుషుడే ధన్యుడు 


పెద్దలతో పోలికలే వద్దనవే మనసా

పెద్దలతో పోలికలే వద్దనవే మనసా ఆ

పెద్జలిచ్చు దీవనలే ముద్దనవే మనసా


మొద్దులము కేవలమును పొట్టకూటికై కొన్ని

విద్దెలను నేర్చినంతనె విర్రవీగ రాదుకదా

వద్దని యేబుధ్ధుల నాపెద్ద లుపేక్షింతు రవే

కద్దు మాయందు నిత్యము కావున పోలిక లేల


సంసారవిరక్తు లగుచు సదారామభక్తు లగుగు

హింసావ్యతిరేకులై రహించుచుండు పెద్దలతో

సంసారవిమోహు లగుచు సదాశయరహితు లగుచు

హింసాప్రవృత్తిగల మాకెచ్చటి పోలిక కాన 


నీదయ నాకున్న చాలు కాదనకయ్యా

నీదయ నాకున్న చాలు కాదనకయ్యా నే
నాదయ కన్న నేమి యడిగెద నయ్యా

వైకుంఠము నందు నిలచి భక్తుల పాలించు దయ
లోకంబులు లోకేశులు ప్రాకులాడునట్టి దయ
శోకంబుల నణచి ప్రోచు సుఖప్రదమై నట్టి దయ
నాకు చాలునయ్య ఓ లోకపతి ఆ దయ

మున్ను ధృవుని కాపాడి బ్రోచినట్టి దైన దయ
వెన్నుగాచి ప్రహ్లాదుని పెంపుమీఱి నట్టి దయ
తిన్నగా విభీషణునకు దిక్కుచూపినట్టి దయ
నన్ను చెందనీయ వయ్య నారాయణ ఆదయ

పరమేష్టికి సృష్టిచేయు బలమిచ్చెడు నట్టి దయ
పరమపురుష సురవరులకు తిరముగా రహించు దయ
ధరను సుజనకోటి కెపుడు తప్పకుండు నట్టి దయ
హరినాకును పంచవయ్య అనుమమమగు నాదయ
 

21, ఏప్రిల్ 2023, శుక్రవారం

చెంతనే యున్నాడు శ్రీరాముడు

చెంతనే యున్నాడు శ్రీరాముడు ని
శ్చింతగా నుండుడే చెడును కలుగదు 

రామ రామ యనుచున్న రామభక్తులార వినుడు
స్వామి మీకెప్పును నెడము జరిగియుండ డయ్య
పామరత్వ మెందుకయ్య పాడు కలికి జడియ నేల
ఏమాత్రము భయము వలదు రాము డెపుడు మీవాడే

లోకులతో నేమి మీ లోకమే రాముడైతే
భీకరమని సంసారము వెఱగుపడగ మీకేటికి
ఈకర్మబంధములకు నింత చింతించనేల
అకైవల్యమ్మునిచ్చి ఆదరించు వాడగుచు

హరేరామ యనగానే అన్ని పాపములును పోయె
హరేకృష్ణ యనగానే ఆన్ని బంధములును పోయె
మరెందుకు విచారములు మహానందపరవశులై
పరాత్పరుని చేరికొలిచు పరమానందంబు గనరె

యింతి కైక వీని పుట్టు వేదో రహస్యమే

యింతి కైక వీని పుట్టు వేదో రహస్యమే
కొంత నీకు తెలిసినట్లు గోచరించు నాకు

ఎన్నడేని చూడ నతివ నెవరును విల్లంబుల
చిన్న బిడ్డ ముందుంచుట నన్నప్రాశనంబున
ఇన్నాళ్ళకు నీవుంచగ గన్నప్పుడు నవ్వితిమి
అన్నన్నా వాడు పట్టె తిన్నగ విల్లంబులు
 
కన్నతల్లిని నాయెద్ద గడపుచుండునా వాడు
తిన్నగ నీకొంగుబట్టి తిరుగుచుండును గాని
చిన్ననకా ధనుర్విద్య చెప్పుచుందువును నీవు
ఎన్నెన్నో రహస్యము లిది యేమి వింతయే

పురుషోత్తమ రామ యని పొలతుక నీవొక్కనాడు
పరాకున పిలచితివని వార్త వచ్చెను నాకు
జరుగుతున్న దేమో నా కెఱిగింపవే నేడు
తరుణీ వీడెవడే యీ దాశరథి నాకొడుకు


20, ఏప్రిల్ 2023, గురువారం

మనసున నున్నది మీమంచి

మనసున నున్నది మీమంచి మనసున నున్నది మీచెడుగు
మనసుపెట్టి మీరాలోచించిన మర్మము మీకే ఎఱుకపడు
 
లోపములేని మనసే యుంటే రుచియగు మీకు హరినామం
పాపమునిండిన మనసే యుంటే పలుకరు మీరు హరినామం
 
శాంతము నిండిన మనసే యుంటే చింతన నుండును హరిచరితం
చింతలు నిండిన మనసే యుంటే చింతన చేయరు హరిచరితం
 
రాముని విడిదగు మనసే యుంటే భూమి సమస్తం హరినిలయం
కామున కిరవగు మనసే యుంటే కాంక్షింపరు శ్రీహరినిలయం

నాకొడుకా నీకొడుకా నంగనాచి కైకా

నాకొడుకా నీకొడుకా నంగనాచి కైకా

నీకొడుకేనా రాముడు నాకు కొడుకు కాడా


దుంప లెందుకు పెట్టావే దొంగముఖము దానా

దుంపలు వాడిష్టపడితె దోషమేమిటమ్మా


చెంపలెందుకు గిచ్చావే చీలిముఖము దానా

చెంపమీది యంటు చీరచెంగున తుడిచానే


తుప్పలలో త్రిప్పావట దొడ్డికాళ్ళ కైకా

తుప్పలన్నీ వెదకి వాని తెచ్చితి నోయమ్మా


ఇప్పుడేల విల్లంబుల నిచ్చితివే కైకా

తప్పేమే వాడు గొప్ప దశరథుని కొడుకే


నాకన్నా వాడిమీద నీకెక్కువ ప్రేమటే

నీకు వాడుకైతే నాకు వాడు ప్రాణమే


నాకు దూరము చేయకే నాటకాల కైకా

నీకొడుకు బాగుకొరకు నిందకైన సిధ్ధమే 


ఎందు కలిగి నావురా రఘునందనా

ఎందు కలిగి నావురా రఘునందనా బహుసుందరా కను

విందుగా చిరునవ్వుల కిరవొందు మోమిటు కందెరా


మంచి వస్త్రాభరణములు కట్టించి నేడు నీకు దాదులు

మంచిగా తిలకమును దిద్దమరచినారని కోపమా

పంచదార కలుపకుండ పాలబువ్వ పెట్టి దాదులు

కొంచెము పరాకుపడిరని కోపగించుకొంటివా


ఎంతగానో ముద్దుచేయు నింతి కైక పిన్నతల్లి

ఇంతవరకును జాడలేదని  యంతలోనే కోపమా

వింతవింత క్రీడలందున చెంతనిలువక తమ్ముకుఱ్ఱలు

పంతగించి దాగినందుకు పట్టరానికోపమా


పెద్దవారికి కాని నీకీ విల్లుబాణము లెందుకనుచును

ముద్దుగా వారించినానని పుట్టెనటరా కోపము

ముద్దరాలు సుమిత్ర బువ్వముద్దలను నీనోటబెట్టక

పెద్దవైతివి నీవె తినుమన పిచ్చికోపము వచ్చెనా 


ఏమయ్యా రామా యిదేమిటయ్యా

ఏమయ్యా రామా యిదేమిటయ్యా మ
మ్మేలుకొనగ తాత్సార మేలనయ్యా

ఎంతో మంచివాడవని యెఱుగుదుమయ్యా నీ
వెంతకును కనరా విదేమిటయ్యా ని
న్నెంతో నమ్మినామని యెఱుగవటయ్యా ఇం
కెంతకాల మోర్తుమో యినకులేశ్వరా

ఎంతో గొప్పవాడవని యెఱుగుదుమయ్యా ని
శ్చింతగ నీసన్నిధిలో చేరితిమయ్యా మ
మ్మింత నిరాదరణచేయు టెందుకయ్యా నీ
పంతములకు తాళలేము పతితపావనా

ఎంతో చక్కనివాడవని యెఱుగుదుమయ్యా ని
న్నెంతో ప్రేమతోడ సేవించెదమయ్యా నీ
వెంతచక్కగా భక్తుల నేలుకొందువో చూ
పింతువుగా నేడు మాకు ప్రియమారగా

19, ఏప్రిల్ 2023, బుధవారం

నిన్ను పొగడ కెట్టులుందు నీరేజనయన

నిన్ను పొగడ కెటులుందురా నీరేజనయన నీ
కన్నను నాప్తులెవరు నాకున్నారయ్య రామ
 
చాల చెడ్డవాడయ్యును జాతివైర ముండియును
నాలుకను పీకికొనును నాడు మారీచుడు
మేలిమివాక్యముల తోడ మిక్కిలిగా నినుపొగడ
చాల కుతూహలము చూప సద్భక్తుడ నయ్యును

వైరితమ్ముడయ్యు గూడ వచ్చి నిను శరణువేడి
ధారాళంబుగ పొగడడె దయామయా నిన్ను
కూరిమితో పగతునైన చేరదీయు నుదారుడవు
వారిజాక్ష నిన్నుపొగడి పరవశించ కుందునా
 
కోరి కొలుచుచుండు నట్టి కొతినొక బ్రహ్మనుగా
మారుచు దైవమవ నిన్ను మరిమరి పొగడనా
మారజనక నీకన్నను మహిమాన్వితు లెవ్వరురా
నోరారా నినుపొగడక యూరకండ వచ్చునా

ధనకనకంబులె సర్వము తమకని

ధనకనకంబులె సర్వము తమకని తలచుచునుందురు కొందరు
వనజాక్షా నీసేవాభాగ్యము వదలలేరు మరికొందరు

రమణీమణుల సాంగత్యమునకు భ్రమపడుచుందురు కొందరు
రమారమణ నీసాంగత్యమునకు ప్రార్ధింతురు మరి కొందరు
కుమారకులు తమ నుధ్ధరించుటను కోరుచునుందురు కొందరు
కమలాక్షా నీవుధ్ధరించుటను కాంక్షింతురు మరి కొందరు

పరుల మెప్పునకు శాయశక్తులను పాటుపడుదు రిల కొందరు
పరాత్పరా హరి నీమెప్పునకై ప్రార్థింతురు మరి కొందరు
పొరిపొరి నానాదేవగణంబుల పూజించెద రిల కొందరు
పురుషోత్తమ హరి  నిన్నొక్కడినే పూజింతురు మరి కొందరు 

నోరుచేసుకొని దేవుడు లేడని నుడువుచు నుందురు కొందరు
శ్రీరఘురామా నిన్ను నమ్ముకొని జీవింతురు మరి కొందరు
ఊరక బహుమంత్రంబుల జదువుచు నుందురు మూర్ఖులు కొందరు
తారకనామ స్మరణము చేయుచు తరియింతురు మరి కొందరు

18, ఏప్రిల్ 2023, మంగళవారం

వరద వరద నీనామము పలికెదమయ్యా

వరద వరద నీనామము పలికెదమయ్యా నీవు

కరుణజూపి మమువేగమె కావవయ్యా


తరచుగ నీలీలలనే తలచెదమయ్యా నీ

చరితమునే నిత్యమును చదివెదమయ్యా

నిరతంబును నీసేవల నిలిచెదమయ్యా నీ

పరమభక్తవరులతోడ తిరిగెదమయ్యా


మరువక నిను కలను గూడ మసలెదమయ్యా నీ

వరగుణములు జనులమధ్య పాడెదమయ్యా

పరమకృపామూర్తివని పలికెదమయ్యా నీ

సరివారే లేరన్నది చాటెదమయ్యా


హృదయంబుల నిను నిలిపి యెసగెదమయ్యా నిను

ముదమారగ నర్చించుచు మురిసెదమయ్యా

వదలము నీపాదములను వదలమయ్యా ఓ

సదయ రామభక్తులమని చాటెదమయ్యా

  

రామవిభో శ్రీరామవిభో

రామవిభో శ్రీరామవిభో హరి రమ్యగుణాకర రామవిభో

జయజయ బ్రహ్మాద్యమరప్రార్ధిత జానకిరమణా రామవిభో
జయజయ సురగణశుభకర శ్రీకర జానకిరమణా రామవిభో
జయజయ దశరథనందన రాఘవ జానకిరమణా రామవిభో
జయజయ కౌసల్యాసుఖవర్ధన జానకిరమణా రామవిభో
 
జయజయ విశ్వామిత్రప్రియధన జానకిరమణా రామవిభో
జయజయ పశుపతికార్ముకభంజన జానకిరమణా రామవిభో
జయజయ త్రిలోకవిశ్రుతవిక్రమ జానకిరమణా రామవిభో
జయజయ దశముఖరావణమర్దన జానకిరమణా రామవిభో
 
జయజయ విరించిపశుపతి సన్నుత జానకిరమణా రామవిభో 
జయజయ త్రిలోకపాలననిపుణా జానకిరమణా రామవిభో
జయజయ భక్తాభీష్టప్రదాయక జానకిరమణా రామవిభో
జయజయ మునిజనముక్తివితరణచణ జానకిరమణా రామవిభో


 

17, ఏప్రిల్ 2023, సోమవారం

ఇంత దయాశాలివని యెఱుగుదు మయ్యా

ఇంత దయాశాలివని యెఱుగుదు మయ్యా

వింతయే మాకేమీ చింతలు లేకుండుట


సతి చనుల ముట్టిన వాని క్షమియించు వారుందురె

అతిదయ నీయొక్కనికే యన్వయించునే గాక

పతితపావన రామ నీ పాదముల బడినవాడు

గతకల్మషుడగుట చూడ కడుముచ్చటౌనుగా


సతిని కొనిపోయిన వాని క్షమియించు వారుందురె

అతని నైన మన్నించెద ననుట నీకె తగు గాగ

పతితపావన వాడు నీ పాదముల బడినయెడల

నతడి కయౌధ్యనే యిచ్చు నంతటి యౌదార్యమా


సతిని నిందించిన వారి క్షమియించు వారుందురె

మతిలేక మాటలనక మన్నించుట నీకె తగెను

పతితపావన నీదయాపరత కేది సాటి భువిని

మతిమంతు లవశ్యము నీమరువుజొచ్చు చుందురు


మాకు రాము డున్నాడని మరువకండీ

మాకు రాము డున్నాడని మరువకండీ

మాకు రామనామ ముంది మరువకండీ


మాకెందుకు ధనములపై మమకారము కలుగును

మాకెందుకు కాంతలపై మరులుగొనుట కలుగును

మాకెందుకు పదవులకై మనసుపడుట కలుగును

మాకు మారాము డుండ మరియేమి కావలెను


మాకెందుకు మీగురువుల మంత్రోపదేశములు

మాకెందుకు మీగురువుల మహాతంత్రవిద్యలు

మాకెందుకు మీగురువుల మహితచరిత్రంబులు

మాకు మారాము డొకడె లోకంబున సర్వము


రామనామ మొకటుండగ రాముడు మాకుండగా

రామభక్తులకు జయమే స్వామి ప్రసాదించగా

రామ రామ రామ యనుచు భూమి మారుమ్రోగగా

మేము చెలరేగుదుమని యేమరకండీ 


బుధ్ధిశాలి నన్న మాట పొసగదు రామా

బుధ్ధిశాలి నన్న మాట పొసగదు రామా నాకు
బుధ్దియున్న మరలమరల పుట్టుచుందునా

మరలమరల పుట్టుదునా మరలమరల ధనములకై
తిరిగితిరిగి చెడుచు  గ్రుడ్లు తేలవేయుచుందునా
మరలమరల హీనులను మతిలేక సేవించుచు
పరమనికృష్ఠుడనగుచు వసుధ నిట్లుందునా

బుధ్ధియున్న పాపకార్యములకు పాలుపడుదునా
బుధ్ధియున్న పుణ్యకార్యములను చేయకుందునా
బుధ్ధియున్న నిరతము సత్పురుషుల సేవించనా
బుధ్ధియున్న నిన్ను మరచి భూమినిట్లుందునా

నీదయచే కొంతబుధ్ధి నేటికి నాకబ్బినది
నీదయచే నేటికి నిను నేను పొగడ నేర్చితిని
నీదయచే యీబుధ్ధియె నిలుచుగాన నాలోన
నీదయచే బుధ్ధిశాలినే యగుదు నినుజేరగ

పంచవన్నెల చిలుకా బంగారుచిలుకా

పంచవన్నెల చిలుకా బంగారుచిలుకా ఈ

మంచిపంజర మందు నీవు మసలుకోవే


పంజరము పంజరమే బంగారు పంజరమైనా 

పంజరము పంజరమే బ్రతు కందు దుర్భరమే

పంజరము నందు స్వేచ్ఛ ప్రసక్తియే లేదుకదా

రంజన చెడి యుండనేల పంజరమ్ము నందు


పంచగవాక్షములుండిన బంగారు పంజరమందున

మంచి పంచతిన్నెలున్న మహితశుభ పంజరమందున

నుంచి పోషింతునంటే ఉలికిపడే ఓ చిలుకా

వంచన యిందేమి లేదే భయపడకే చిలుకా 


పారిపోయే చిలుకనా పంజర మిది దేనికయా

ఓరామా నీపదముల నుండు మంచి చిలుకనే

శ్రీరామా నీనామమె చెప్పుచుండు చిలుకనే

ఓ రామచిలుకా యిక కోరి నట్లుండవే


16, ఏప్రిల్ 2023, ఆదివారం

మంచిమాట చెప్పుట మరువకయ్యా

మంచిమాట చెప్పుట మరువకయ్యా నీ
మంచితనము కాక మాకు మరి దిక్కేది

మంచిమాట చెప్పితివి మానక నాదిత్యుల
కొంచెపఱచు రావణుని కూల్చెద నేనని
మంచిదాయె యాగమును మహినేలు రాజున
కంచితమున బిడ్డవై యవతరించి నావు

మంచిమాట చెప్పితివి మార్తాండ సుతుని కా
వించెదను కిష్కింధకు విభునిగ నేనని
మంచిమాట చెప్పితివి మరి విభీషణుని మ
న్నించి లంకేశునిగ నియమించెద నేనని

ఎంచి నీవన్నట్టి యన్ని మంచిమాట లారయ
మంచిమంచి వరములాయె మహి నవ్వారికి
మంచిమాట సెలవీవయ్య మరి కర్మబంధముల
ద్రుంచి మోక్షమిచ్చి మిము రక్షించెద నేనని


14, ఏప్రిల్ 2023, శుక్రవారం

బీపీ మందులు - రకాలు

రక్తపుపోటు రావటానికి రకరకాల కారణాలుంటాయి. అలాగే రక్తపుపోటు లేదా బీపీ (బ్లడ్ ప్రెషర్ blood pressure) కోసం వాడే మందుల్లో కూదా రకరకాలున్నాయి.

అవి ఈ క్రింది రకాలుగా వర్గీకరించవచ్చును.

  1.     Diuretics
  2.     Beta-blockers
  3.     ACE inhibitors
  4.     Angiotensin II receptor blockers
  5.     Calcium channel blockers
  6.     Alpha blockers
  7.     Alpha-2 Receptor Agonists
  8.     Combined alpha and beta-blockers
  9.     Central agonists
  10.     Peripheral adrenergic inhibitors
  11.     Vasodilators

ప్రస్తుతం వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

Diuretics

ఇవి శరీరంలో అధికంగా ఉన్న నీటినీ‌, ఉప్పునీ తొలగించటం ద్వారా రక్తపుపోటును తగ్గిస్తాయి. సాధారణంగా వీటిని విడిగా కాకుందా ఇతర రకాల రక్తపుపోటు మందులతో కలిపి మరీ వైద్యులు సిఫారసు చేస్తారు.

 

Beta-blockers

ఇవి గుండె కొట్టుకొనే వేగాన్నీ, గుండె మీది వత్తిడినీ తగ్గిస్తాయి. తద్వారా గుండె నుండి పంపింగ్ అయ్యే రక్తపు పరిమాణం తగ్గి రక్తపుపోటు తగ్గుతుంది.

 

ACE inhibitors

ఇక్కడ Angiotensin-converting enzyme అన్నసాంకేతికపదబంధానికి క్లుప్తరూపమే ACE అన్నమాట.ఈ Angiotensin అనేది ఒక ప్రోటీన్. ఈప్రోటీన్ ప్రభావంతో శరీరంలో aldosterone అనే ఎంజైం విడుదల అవుతుంది. ఈ aldosterone శరీరంలో నీరూ ఉప్పూ శాతాన్ని తూకంలో ఉంచటానికి అవసరం. ఈ aldosterone ఎక్కువ ఐతే రక్తపుపోటు పెరుగుతుంది. ఈ Angiotensin వలన శరీరంలో శరీరం అంతటికి మంచి రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ధమనులు సన్నం అవుతాయి. అందువల్ల రక్తపుపోటు పెరుగుతుంది. ACE inhibitors అనేవి Angiotensin విడుదలను అడ్డుకోవటం ద్వారా రక్తపుపోటు పెరుగకుండా చూస్తాయి.angiotensin తక్కుగా విడుదలకావటం వలన రక్తనాళాలు విప్పారకొని రక్తపుపోటు తగ్గుతుంది.

 

Angiotensin II receptor blockers 

ఇవి angiotensin విడుదలను అడ్డుకోవటం చేయవు.కాని angiotensin కలిగించే ప్రభావాన్ని అడ్డుకుంటాయి. అంటే‌ ఇవి రక్తంలో angiotensin ప్రోటీన్ ఉనికిని గుర్తించే కెమికల్ స్విచ్‌ని అడ్డుకుంటా యన్నమాట. అందుచేత రక్తనాళాలు విప్పారుకొనే ఉండి రక్తపుపోటు పెరగకుండా ఉంటుంది.

 

Calcium channel blockers

ఇవి గుండెలోని మృదువైన కండరాలకణాలకూ ధమనులకు రక్తం ద్వారా కాల్షియం మూలకం అందకుండా అడ్డుకుంటాయి. కాల్షియం సరఫరా తగ్గటంతో గుండె మరీ అంత బలంగా సంకోచాలు చెందటం తగ్గుతుంది. గుండె కొట్టుకొనే వేగం తగ్గి రక్తపుపోటు తగ్గుతుంది.
 

Alpha blockers

ఇవి ధమనుల్లో నిరోధాన్ని తగ్గిస్తాయి. గుండె కండరాల్లో బిగువు తగ్గించటం ద్వారా రక్తపుపోటును అదుపుచేస్తాయి.
 
 

Alpha-2 Receptor Agonists

ఇవి గుండెపై adrenaline హార్మోన్ ప్రభావాన్ని తగ్గించటం ద్వారా రక్తపుపోటుని నియంత్రిస్తాయి.
 
 

Combined alpha and beta-blockers

ఇవి రక్తపుపోటి చాలా అధికమై గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న సందర్భాల్లో వాడే మందులు. తరచుగా ఇవి IV drip ద్వారా ఇస్తారు. అరుదుగా నిత్యవాడకానికి సిఫారసు చేస్తారు.


Central agonists

ఇవి కూడా గుండెకండరాల సంకోచాల మీద పనిచేసే మందులే. ఐతే alpha and beta-blockers కన్నా భిన్నమైన రీతిలో నాడీమండలంపై పనిచేసినా సాధించే ఫలితం అదే, రక్తపుపోటును తగ్గించటం.


Peripheral adrenergic inhibitors

ఇవి తమాషాగా మెదడు మీద పనిచేస్తాయి. మెదడులోని neurotransmitters మీద నిరోధంగా పనిచేస్తాయి. అప్పుడు గుండె కండరాలకు సంకోచాలను నియంత్రించే సంకేతాలు మెదడునుండి అందవు! చాలా అరుదుగా వేరే దారి లేనప్పుడు ఈమందులు వాడుతారు రక్తపుపోటుని తగ్గించటానికి.


Blood vessel dilators (vasodilators)

ఇవి రక్తనాళాలు - ముఖ్యంగా  ధమనులు విప్పారుకొనేలాగా చేస్తాయి. అప్పుడు రక్తం తక్కువపోటుతో ప్రయాణిస్తుంది.
 

రాబోయే వ్యాసాల్లో ఈ రకరకాల రక్తపుపోటు మందుల్లో ఒక్కొక్క తరగతి మందుల గురించీ విపులంగా తెలుసుకుందాం.


రిఫరెన్స్ వ్యాసం: Types of Blood Pressure Medications


ఏమిరా నాకన్నతండ్రీ యెందు కలిగినావురా

ఏమిరా నాకన్నతండ్రీ యెందు కలిగినావురా
రామ నాతో చెప్పరా నీ కేమికష్టము కలిగెరా

గోరుముద్దలు కైక నీకు గోముగా తినిపించదా
చేరబిలిచి నిను సుమిత్ర చెంపలను ముద్దాడదా
 
నీమనోరథమును తెలిసి నేడు లక్ష్మణు డుండడా
ఏమి నొవ్వు మాటలాడిరి యెంచి భరతశత్రుఘ్నులు

అవనినాథుడు శిరసుమూర్కొని యంకపీఠిక నుంచడా
భువనమోహన యని సుమంత్రుడు ముద్దుగా నిను పిలువడా

మాటిమాటికి ఓడు నేస్తులు మానక తగువాడిరా
అటలాడిన దింకచాలని యందురా నిను దాదులు
 
రామచంద్రా మంత్రులు నిను రాజసభలో పొగడరా
రామ నీదే‌ గద్దె యనిచు రాజు మురియుచు పలుకడా

నీలమేఘశ్యామ యేల నీకు కోపము కలిగెరా
చాలు నలుకలు రార అమ్మకు సంతసము కలిగించరా

 

13, ఏప్రిల్ 2023, గురువారం

ఊరకె యెవడు పోతున్నాడో ఊళ్ళోని రాముని గుడికి

ఊరకె యెవడు పోతున్నాడో ఊళ్ళోని రాముని గుడికి 

కష్టాలు చుట్టుముట్టినప్పుడే కదలును రాముని గుడికి
నష్టాలు మిక్కుటమైనప్పుడే నడచును రాముని గుడికి
ఇష్టకామనల విన్నవించగా నేగును రాముని గుడికి
దుష్టుల పీడన పడలే కేగును తోడ్తో రాముని గుడికి

ఈనాడు పండుగరోజని పోవును తప్పక రాముని గుడికి
ఈనాడు పుట్టినరోజని పోవును మానక రాముని గుడికి
ఈనాడు తనపెండ్లిరోజని పోవును దశరథరాముని గుడికి
ఈనాడు పదుగురి మెప్పుకోసమై తరలును రాముని గుడికి

సీట్ల కోసమై రాముని చెంతచేరి మ్రొక్కుటకు గాక
ఓట్లకోసమై ఊరివా రెదుట నుత్తుత్తి నటనలు కాక
కోట్లాది ధనములు క్రుమ్మరింతువని గొప్ప దురాశతో గాక
పాట్లుచాలురా భవములు నాకిక వలదని వేడగ పోడే


చిన్నవిల్లు చేతబట్టి శ్రీరాముడు

చిన్నవిల్లు చేతబట్టి శ్రీరాముడు
అన్నవెంట విల్లుబట్టి ఆలక్ష్మణుడు
 
నడిచి సభలోని కపుడు నవ్వుచు నరుదెంచగ
కడుముదమున సభాసదులు గాంచి రంతట

నడచివచ్చు సోదరులను నవ్వుచు తిలకించుచు
కడుముదమును పొందెనపుడు భూమిపతియును

నడచివచ్చు శిష్యులను కడుముదమున జూచుచు
జడదారి వశిష్ఠు డపుడు చాలపొంగెను
 
కడుముదమున హరిశేషుల గాంచుచు గాధేయుడు
పడునింక రావణుండని భావనచేసెను

నడచివచ్చి సోదరులు నాన్నకును మునులకును
అడుగులంటి మ్రొక్కిరంత కడుముదంబున
 
నడచివచ్చి మ్రొక్కినంత అడవిని మునియజ్ఞము
కొడుకులార కాచిరమ్మనె కువలయేశుడు

12, ఏప్రిల్ 2023, బుధవారం

నిన్నే నమ్మి యుంటినని నీవెఱిగియును

నిన్నే నమ్మి యుంటినని నీవెఱిగియును
మన్నింపక యుందు విది మరియాదేనా

మడులు మాన్యాలేమి యడుగుట లేదేనే
నడుగున దైన కష్టమైనది కాదే
అడిగితే లేదు కాదనవని కొంటేనే
నడుగుటే తప్పన్న ట్లాయెనేమయా

శరణన్న వారలను చక్కగ బ్రోచే
నరనాథుడవు నిన్ను నమ్మితి నయ్యా
కరుణించకుండుటకు కారణమేమో
నరనాథ రామయ్యా నాకు తెలుపుమా

ఎన్నెన్ని జన్మలుగ నిన్నే కొలుచుచు
నున్నానో నీవెరుగకున్నది కాదే
ఎన్నడీ భవబంధ మన్నది తొలగి
నిన్ను చేరుదునయ్య నీరజనయన

11, ఏప్రిల్ 2023, మంగళవారం

నిశాచరుల గుండెలు జారు

నిశాచరుల  గుండెలు జారు నీబంటు పేరు చెప్పగనే

నిశాచరుల మూక పరారు నీబంటు కంటబడగానే


వారెరుగరు రామా నీబంటు వాయుసుతు డని

వారెరుగరు రామా నీబంటు శివునియంశ యని

వారెరుగరు రామా నీబంటు బ్రహ్మయగు నని

వారెరుగరు రామా నీబంటు బలము నీవని


నీనామము నూతగగొని తాను కడలి దాటెను

నీనామము నూతగగొని నిశాచరుల నణచెను

నీనామము నూతగగొని తాను లంక కాల్చెను

ఆమారుతి పేరు విన్న అసురజాతి పరారు


లంకేశుని కొడుకుచచ్చె రామా నీబంటు వలన

లంక కాలి బూడిలయె రామా నీబంటు వలన

లంకేశుడు రుచిచూచెను రామా నీబంటు దెబ్బ

శంకింతురు యముండనుచు సామీరిని రాకాసులు 


మంచివాడవు రాఘవా

మంచివాడవు రాఘవా నా
మంచిని కోరుట మానవురా

నిన్ను నేను మరచి నీనామమే విడచి
యున్న జన్మంబుల నోపికతో నుండి
తిన్నగ నినుగూర్చి తెలియు నందాకను
నన్ను ప్రబోధించి నడిపించి నట్టి

ధనములనాశించి తప్పుడు దారులం
దనిశము తిరిగిన దైన జన్మంబుల
గినియక నీభక్తి ధనమిచ్చి బ్రోచి యీ
తనువున నీసేవ దయచేసి నట్టి

నేడు కొంచెమెఱిగి నీపైన కీర్తనల
వేడుకతో చేయు విధమున దొసగులు
జూడక మన్నించి చూపుల పెదవుల
వీడని నగవుల వెదజల్లుదువు దయ
 
 

10, ఏప్రిల్ 2023, సోమవారం

కృపానిధివి కావా కేవలము

కృపానిధివి కావా కేవలము

నృపాలశేఖర నీలశరీర


విమలవేదాంతవేద్యనిజతత్త్వ

సుమధురదరహాసశోభితరూప

అమరవిరోధిగణహననచణ రామ

సమరాంగణభీమ సజ్దనుల యెడ


పరమయోగీంద్రభావితనిస్తుల

పరమానంద హరి తరణికులేశ

హరవిరించివినుత అద్భుతవిక్రమ

నిరుపమగుణధామ నిజభక్తుల యెడ


భవసంశోషణపావననిజతత్త్వ

రవిపుత్రపాలకరాజారామ

పవమానసుతనుత భవతారకనామ 

నవనీతహృదయ నాకు నీవియ్యెడ 


రామనామమహిమ యిట్టిట్టిదన రాదు

రామనామమహిమ యిట్టిట్టిదన రాదు సుమా ఎవరికైనా


రామనామమహిమ చేత బడయరానట్టి ధనమేమి యున్నది

రామనామమహిమ చేత చెందరానట్టి పదవేమి యున్నది

రామనామమహిమ చేత నేర్వరానట్టి విద్యేమి యున్నది

రామనామమహిమ చేత పొందరానట్టి సుఖమేమి యున్నది


రామనామమహిమ చేత గడువరానట్టి భయమేమి యున్నది

రామనామమహిమ చేత దాటరానట్టి చిక్కేమి యున్నది

రామనామమహిమ చేత త్రోయరానట్టి చింతేమి యున్నది

రామనామమహిమ చేత తీర్చరానట్టి ఋణమేమి యున్నది


రామనామమహిమ చేత పాపరాశికి యునికేమి యున్నది

రామనామమహిమ చేత పుణ్యరాశికి మితిలేక యున్నది

రామనామమహిమ చేత జన్మరాహిత్యమే కలుగుచున్నది

రామనామమహిమ చేత మోక్షరాజ్యమ్ము మనచేత నున్నది 

మంచుకొండ మీది మహదేవా

మంచుకొండ మీది మహదేవా నీవు మంచిదేవుడవు మహదేవా

రామనామమిచ్చి మహదేవా మమ్ము రక్షించినావయ్య మహదేవా

తారకనామంబు మహదేవా మేము తలదాల్చి యుందుము మహదేవా

ముప్పూటలను దాని మహదేవా మేము మ్రొక్కుచు నుడివేము మహదేవా

రామనామమహిమ మహదేవా మంచి లక్షణముల నిచ్చు మహదేవా

రామనామమహిమ మహదేవా పాపరాశిని దహియించు మహదేవా

రామనామమహిమ మహదేవా సర్వకామన లీడేర్చు మహదేవా

రామనామమహిమ మహదేవా మనోలయమును చేయును మహదేవా

మంత్రమహిమ చేత మహదేవా కలుగు మాకు మోక్షపదవి మహదేవా

మోక్షపదవి కలిగి మహదేవా మేము భువికి తిరిగిరాము మహదేవా 


9, ఏప్రిల్ 2023, ఆదివారం

తీరుతీరుగ నీదు పేరు పలుకుట కన్న

తీరుతీరుగ నీదు పేరు పలుకుట కన్న
వేరేమి కోరేము శ్రీరాముడా

శ్రీరామచంద్రుడా జిహ్వాగ్రమందుండ
కోరేము నీదివ్యనామమే
వేరేమి కోరేము వేయి జన్మలకైన
నీ రమ్యనామమే‌ కోరేము

సీతామనోహరా జీవలోకేశ్వరా
ప్రీతితో నీదివ్యనామమే
వాతాత్మజాదులకు ప్రాణమై చెలువొందు
భాతి మాకుండుటను కోరేము
 
భువననాయక రామ రవికులాంబుధిసోమ
భవవార్ధి దాటగా దలచేము
వివరింప మోక్షమే వేడుచు నీపేరు
సవినయంబుగ బలుక గోరేము

ఐనను నీకేల దయయన్నది రాదో

ఐనను నీకేల దయయన్నది రాదో
మానవేంద్ర రామచంద్ర మన్నించవు
 
నీదు దివ్యనామజపము నేను మానియున్న దెపుడు
నీదు మహిమాతిశయము నేను మరచియున్న దెపుడు
నీదు భక్తికోటిలోన నేను చేరకున్న దెపుడు
నీదు కృపామృతంబునకు నేను వేడకున్న దెపుడు

నిన్ను కాక యితరుల నే నెన్నడైన పొగడితినా
నిన్ను కాక యితరుల నే‌ నెన్నడైన వేడితినా
నిన్ను మోక్షమొకటి కాక నేనితరము లడిగితినా
నిన్ను నమ్మి యుంటి ననుచు నీకు తెలియకున్నదా

నారద తుంబురుల వలె నాకు పాడుటయె రాదు
మారుతితో పోల్చదగిన మహాభక్తవరుడ కాను
నారాయణ మూర్తి వనుచు నమ్మి శరణు జొచ్చితిని
మారజనక యది చాలదొ మన్నించ నాబోంట్లను


8, ఏప్రిల్ 2023, శనివారం

శ్రీరామచంద్రునకు జైకొట్టరా

శ్రీరామచంద్రునకు జైకొట్టరా సీతమ్మ తల్లికి జైకొట్టరా

నారాయణుండని జైకొట్టరా నారి శ్రీలక్ష్మి యని జైకొట్టరా


కారడవులను తిరిగి కష్టాలు పడుటెందుకు

శ్రీరామచంద్రుడును సీతమ్మయు

నారాయణుడ నిట్లు నరునిగ వచ్చితినని

ఔరౌర మరచినాడే శ్రీరాముడు


మరిచినాడో హరి మరపు నటించినాడో

సురవైరి రావణుని పరిమార్చగ

మరియొక్క దారిలేక నరుడాయె శ్రీహరి

సిరియే సీతమ్మగను తరలివచ్చె


సిరియే సీతమ్మగను తరలివచ్చి లంకా

పురిజొచ్చి రావణుని పుట్టిముంచె

సురలెల్ల మునులెల్ల పరమహర్షమ్మున

సరిలేరు మీకన్నట్టి జంటకిప్పుడు 


నాకు రాము డిష్టమైన నీకేమి కష్టము

నాకు రాము డిష్టమైన నీకేమి కష్టము
ఓ కఠినప్రపంచమా యోర్వజాలవేల

నిన్నను మొన్నటిదాక నేను పదిమందివలె
యున్నవాడనే ధనము లున్ననే బ్రతుకనుచు
అన్నవాడనే కానియు నది యంతయును గతము
తిన్నగా నిపుడు భక్తియన్నది తలకెక్కి నేడు

నాకు రాముడు చాలంటే నీకెందుకు కష్టము
నాకు నీవు వలదంటే నీకెందుకు కష్టము
నాకు మేలు కలిగితే నీకెందుకు కష్టము
నీకు నేను దూరమైన నీకెందుకు కష్టము

ఇష్టమైన నీవు కూడ ఇలకులేశు కొలువుము
కష్టమైన ఆకలినే ఇమ్ముగా కొలువుము
భ్రష్టుడవై యుండరా రాముడు నీకెందుకని
దుష్టుమాటలాడకుము దోయిలించెద నీకు


రండి రండి శ్రీరామచంద్ర మహరాజుగారి సభకు

రండి రండి శ్రీరామచంద్ర మహరాజుగారి సభకు
వెండికొండదొర పొగడుచుండు రఘువీరుని ఘనసభకు

రండి రండి ఓ భాగ్యశాలులగు ప్రజలారా కో
దండరాముని నిండుకొలువులో దర్శించగ రండి

రండి రండి సీతమ్మవారితో రత్నపీఠమందు
చండకిరణకులమండను డున్నా డండి చూదాము

రండి రండి శ్రీరామచంద్రునకు ప్రాణాధికుడైన
గండరగండడు లక్ష్మణస్వామిని కనులజూద మండి

రండి రండి ఆవాయునందనుడు రామబంటు హనుమ
యుండు విధానము హరిసన్నిధిలో నొప్పుగ చూదాము

7, ఏప్రిల్ 2023, శుక్రవారం

హరికృప చాలు హరికృప చాలు

హరికృప చాలు హరికృప చాలు
హరికృప యొక్కటే నరునకు చాలు

హరి కొంత దయచూపి యాదరించితే చాలు
మరల పుట్టు పనిలేదు ధరణి మీద

మరల పుట్టు పనిలేని భాగ్యమబ్బితే చాలు
హరిభక్తుడు కోరుకొనే దది యొక్కటే

హరిభక్తుడు కోరుకొనే దది యొకటే కాదు
హరిసన్నిధి నుండిపోవు టనునది కూడ

హరిసన్నిధి నుండిపోవు టనునది కోరు
నరుడు చేయుచుండ వలయు నామజపమును

నరుడు చేయుచుండ వలయు నామజపమును
హరేరామ హరేకృష్ణ యనెడు జపమును

హరేరామ హరేకృష్ణ యనెడు జపమును
నరుడు చేసెనేని కలుగు హరికి సత్కృప


వాడే ఘనుడు వాడే ఘనుడు భక్తులార వినుడు

వాడే ఘనుడు వాడే ఘనుడు భక్తులార వినుడు
వాడే ఘనుడు వసుధలోపలను పరమసుఖము గలవాడు

శ్రీరాముని పాదారవిందములు సేవించెడువాడే ఘనుడు
శ్రీరాముని నామామృతంబును సేవించెడువాడే ఘనుడు
శ్రీరాముని హృదయారవిందమున చేర్చియున్నవాడే ఘనుడు
శ్రీరాముని సంకీర్తన మలయక చేయుచున్నవాడే ఘనుడు
 
శ్రీరాముని తన తల్లిగ తండ్రిగ చెప్పుకొనెడువాడే ఘనుడు
శ్రీరాముని తన దైవము గురుడని చెప్పుచుండువాడే ఘనుడు
శ్రీరాముని  తన సర్వస్వంబని చెప్పుచుండువాడే ఘనుడు 
శ్రీరాముని సత్కీర్తిని చాటుచు చెలగుచుండువాడే ఘనుడు

శ్రీరాముని శుభక్షేత్రములందున ప్రీతినుండువాడే ఘనుడు
శ్రీరాముని సద్భక్తులవద్దను చేరియుండువాడే ఘనుడు
శ్రీరాముని కన్యంబునెఱుగని చిత్తముగలవాడే ఘనుడు
శ్రీరాముని నిజధామము హాయిగ చేరికొనినవాడే ఘనుడు