ఎందు కలిగి నావురా రఘునందనా బహుసుందరా కను
విందుగా చిరునవ్వుల కిరవొందు మోమిటు కందెరా
మంచి వస్త్రాభరణములు కట్టించి నేడు నీకు దాదులు
మంచిగా తిలకమును దిద్దమరచినారని కోపమా
పంచదార కలుపకుండ పాలబువ్వ పెట్టి దాదులు
కొంచెము పరాకుపడిరని కోపగించుకొంటివా
ఎంతగానో ముద్దుచేయు నింతి కైక పిన్నతల్లి
ఇంతవరకును జాడలేదని యంతలోనే కోపమా
వింతవింత క్రీడలందున చెంతనిలువక తమ్ముకుఱ్ఱలు
పంతగించి దాగినందుకు పట్టరానికోపమా
పెద్దవారికి కాని నీకీ విల్లుబాణము లెందుకనుచును
ముద్దుగా వారించినానని పుట్టెనటరా కోపము
ముద్దరాలు సుమిత్ర బువ్వముద్దలను నీనోటబెట్టక
పెద్దవైతివి నీవె తినుమన పిచ్చికోపము వచ్చెనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.