శరణము శరణము శ్రీరఘురామా సర్వరక్షకా జగత్ర్పభో
కరుణాసాగర పరిపాలయమాం కామితవరదా జగత్ప్రభో
నీనామామృత ముండినచాలని నిత్యము తలచుచునుందు కదా
నీనామము నానోట నుండగా నిర్భయముగ నేనుందు కదా
మానుగ నీశుభనామ మెప్పుడును మంగళములు కలిగించు కదా
జ్ఞానము సౌఖ్యము మోక్షము నీయగ నీనామంబే చాలుగదా
నిన్నే మదిలో నమ్మినవారల కెన్నడు నాశములేదు కదా
నిన్నే కొలిచెడువారల సౌఖ్యము లెన్నడు తరుగుటలేదు కదా
చిన్నగ శ్రీరఘురామా యంటే శీఘ్రమె రక్షించెదవు కదా
పన్నుగ నిను శరణంబు జొచ్చుటే పరగ వివేకంబగును కదా
దుర్భరభవవారాన్నిధి లోపల దొరకిన నావవు నీవె కదా
నిర్భయముగ నీయోడనుండిన నిక్కముగా తరియింతు గదా
గర్భనరకమున మరిజొరబారెడు కర్మము నాకిక రాదు కదా
అర్భకజీవుడ నపవర్గముగొని హాయిగ నీకడ నుందుకదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.