భారమైతినా నీకు పతితపావనా సం
సారబాధకోర్వక నిను శరణుజొచ్చితే
శరణుజొచ్చి నపుడు కరి చాలభార మనలేదు
శరణుజొచ్చి నంత సురలు సాధ్యపడ దనలేదు
శరణమన్న కపిరాజుకు చాలకష్ట మనలేదు
శరణమంటే నేనిపుడు మరియేల మౌనము
శరణమన్న కాకాసురు కరుణించి విడచితివి
శరణమన్న విభీషణుని సత్కృపతో కాచితివి
శరణమంటే రావణనే కరుణించెద నంటివి
శరణమంటే నన్నిప్పుడు కరుణించ కుందువు
శరణాగతులగు భక్తుల పరిదీనత మాన్పుచు
తరచుగ వారకి మోక్ష వితరణము నొనరించే
పరమపురుష రామచంద్ర పరాంగ్ముఖుడ వైతివి
శరణమంటే విననట్లే విరసుడవై యుందువు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.