28, జూన్ 2016, మంగళవారం

ఫలించిన జోస్యం - 7 (మోడీసాయిబు జోస్యం)


(మొదటిభాగం  రెండవభాగం  మూడవభాగం  నాలుగవభాగం ఐదవభాగం  ఆరవభాగం)

  మేము  గెద్దనాపల్లె నుండి కొత్తపేటకు వచ్చామన్న సంగతి లోగడ ఒకటి రెండు సంధర్భాల్లో ప్రస్తావించాను కదా.  అక్కడి నుండి ప్రారంభించాలి ఈ‌ కథనాన్ని.

గెద్దనాపల్లె అన్నది గ్రామనామం. కాని లోకులంతా  గెద్దనాపిల్లి అనో గెద్దనాపల్లి అనో‌ పిలిచేవారు. కొందరు గ్రద్దనపల్లె అని కొంచెం గ్రాంథికం చేసేవారు. సరైన పేరు ఏమిటో మరి. ఈ గ్రామం‌ కిర్లంపూడి పక్కన ఉంది. అమలాపురానికి కొద్ది దూరంలో మరొక గద్దనాపల్లె ఉందిట, ఈ మధ్యనే విన్నాను.

మేము ఆ ఊరికి వచ్చిన కొత్తలో, తొయ్యేటి శంకరంగారని ఒక పురోహితులవారి యింట్లో ఉండే వాళ్ళం.  తరువాత కరంణంగారి ఇంటికి మారాం. ఆయన పేరు సోమప్ప గారు. ఆయన అసలు పేరు సోమరాజుగారు. ఇంటి పేరు తురగావారని గుర్తు. కరణంగారికి సోమప్ప అన్నది వ్యవహారనామం అన్నమాట. ఆయన పెద్ద తమ్ముడు గవరప్ప. చిన్నతమ్ముడు సత్తెప్ప. గవరప్పకు వేరే చోట ఉద్యోగం. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఇంట్లో అన్నపూర్ణమ్మగారూ, సోమప్పగారూ, సత్తెప్పా, వారి వితంతుసోదరి రాముడు ఉండేవారు. రాముడు అనే అమె అసలు పేరు రామలక్ష్మి అని గుర్తు.

ఈ సత్తెప్ప ఒకటో రకం బేకార్ టీనేజర్. ఊళ్ళోని క్లబ్బువద్ద జనం కాల్చిపారేసిన సిగరెట్ పీకలు పోగేసి వాటితో దమ్ము కొట్టి దొరికిపోయి తన్నులు తింటూ‌ ఉంటే వాడు. ఒకసారి అతను ఆ ఎంగిలిపీకలు ఏరుతుంటే అదే‌ంపని అన్నాను. దానికి అతడిచ్చిన సమాధానం‌ 'సిగరెట్ మజా నీకేం తెలుసురా' అని! సోమప్పగారు నిజంగా చాలా పెద్దమనిషి.

అ సత్తెప్ప అన్నగారి చేతుల్లో దెబ్బలు తింటున్న  ఒక సందర్భంలో నేను భయంభయంగా చూస్తూ‌ ఉంటే మా బామ్మగారు జన్మమొత్తానికి సరిపోయే గుణపాఠం లాంటి మాట అన్నారు, 'రేపు నువ్వూ‌ బుధ్ధిగా ఉండకపోతే నీకూ ఇలాగే తన్నులు తప్పవూ' అని. ఎందుకన్నా రంటే సత్తెప్ప అస్తమానం నన్ను వెంటేసుకొని తిరుగుతూ‌ఉండే వాడు కదా, వాడి సావాసం వదలూ అని హెచ్చరించటాని కన్నమాట!

కరణంగారింట్లో‌ జరిగిన తమాషాలు అన్నీ‌ చెప్పటానికి ఇది సందర్భం‌ కాదు. ఇక్కడ చెప్పవలసిన సంఘటన ఒకటి ఉంది కాబట్టి ఈ‌ నాలుగు మాటల ఉపోద్ఘాతమూ వ్రాసాను.

ఒకనాడు ఒక విప్రవినోది వచ్చాడు. వాడి కూడా అతడి కొడుకు నాయీడు వాడొకడు. అతను అరుగుమీద కూర్చుని ఎన్నో వినోదాలు చూపించాడు. కరణంగారు వాళ్ళకు భోజనం పెట్టించి కొంచెం డబ్బు ఇచ్చారు. మా నాన్నగారూ వాళ్ళకి డబ్బులిచ్చారు.

విప్రవినోదులంటే ఈ‌కాలం వాళ్ళకి తెలియక పోవచ్చును. వాళ్ళూ గారడి విద్యతో పొట్టపోసుకొనే వాళ్ళే. ఈ‌ ఇంద్రజాలికులు బ్రాహ్మణులు. వీళ్ళల్లో రెండురకాల వాళ్ళున్నారు. కొందరు తమవిద్యను జనబాహుళ్యం‌ ముందు ప్రదర్శిస్తారు. కొద్దిమంది మాత్రం తమ విద్యను బ్రాహ్మణుల ఇండ్లలో తప్ప ఎన్నడూ మరెక్కడా ప్రదర్శించరు.ఈ వచ్చిన వాళ్ళు ఇటువంటి నిష్టగలవాళ్ళు. కాకపోతే కరణంగారి చిన్న పెంకుటింటికి ఎదురుగా పంతంవారి బ్రహ్మాండమైన మేడ ఒకటుంది. ఆ ఇంటాయన పేరు ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. కరణం గారింటికి ఎడమ ప్రక్కన మరొక బ్రహ్మాండమైన మేడ ఉంది. ఆ యింటాయన పేరు పంతం‌ ప్రసాదరావుగారు. ఇంకా ఆ ఊళ్ళో, ఆమాటకు వస్తే ఆ వీధిలోనే సంపన్నగృహాలున్నాయి తగినన్ని. కాని ఈ‌యింద్రజాలికులు మాత్రం ఒక సాధారణ బ్రాహ్మణగృహస్థు ఇంటికి వచ్చి విద్యాప్రదర్శనం చేసారు.

ఈ సంఘటనలో పెద్దగా విశేషం ఏమీ‌ కనబడటం‌ లేదంటారా? ఉందండి. నాకు ఈ‌ ఇంద్రజాలం‌ పరమాధ్బుతంగ ఉండి ఆ తరువాతి కాలంలో కొత్తపేటలో ఎక్కడ ఎవడు మోడీ‌కట్టినా సరే కుతూహలంగా వాళ్ళ విద్యలు చూదామని చివరిదాకా ఓపిగ్గా నిరీక్షించేవాడిని. కాని దాదాపు అందరూ సోదిగాళ్ళే వాళ్ళల్లో.

ఒక్కరు తప్ప.

అప్పటికి నేను పెద్దతరగతుల్లోనే ఉన్నాను. తొమ్మిదో పదో. సరిగా గుర్తులేదు.

కొత్తపేట స్టేట్ బ్యాంక్ ఎదురుగా కొన్ని చెట్లున్నాయి రోడ్డుమీద. వాటిక్రింద పళ్ళు అమ్మేవాళ్ళవి మూడో నాలుగో‌ చిన్నదుకాణాలు ఉండేవి. అక్కడ పిల్లామేకాతో సహా కొంచెం‌ జనసమ్మర్ధం ఉండేడి. కాబట్టి ఒక మోడీ‌సాయిబు హడావుడి చేస్తున్నాడు, ఒక రోజున.

సరే నేనక్కడ తయారు.

మోడీకట్టే‌ సాయిబుకు ఒక నలభై ఉంటాయి. కొంచెం దూరంలో ఒక చిన్నపిల్లవాడు డప్పుకొడుతున్నాడు. మరొక ప్రక్కన మరొక ముసలతను చిన్న మురళీ వాయిస్తున్నాడు. అది అరోజుల్లో అప్ప్పుడప్పుడూ పండగతీర్థాల్లో అణాకో బేడకో అమ్మే బాపతు మురళీ అన్నమాట.

కొన్ని చిల్లరమల్లర ట్రిక్కులు చూపించాక, తానొక పెద్ద విద్య చూపించబోతున్నానని జనాన్ని ఆ అబ్బి ఊదరగొట్టటం మెదలు పెట్టాడు.

ఏమిటేమిటో‌ చేస్తున్నాడు. ఏమీ క్రొత్తవిశేషం‌ కనిపించటం‌ లేదు. సరిగా కుదరటం‌ లేదేమో. చుట్టూ మూగిన జనానికి దొరక్కుండా ఉండటానికి ఏవేవో‌ జోకులు పేలుస్తూ హడావుడి చేస్తున్నాడు.

కొంచెం సేపు ఇలా గడిచాక, మురళీ పట్టుకొని ఒక పెడగా కూర్చున్న ముసలాయన లేచి వచ్చాడు.

కళ్ళతో‌జనాన్ని పరికిస్తూ ఒకసారి తిరిగాడు బరి చుట్టూ. మరలా తిరుగుతూ తిన్నగా నా దగ్గరకు వచ్చి ముఖం‌లో ముఖం పెట్టి చూస్తూ ఒక క్షణం చూసాడు.

హస్తానక్షత్రం దేవగణం
గండాలమారి జాతకం‌ గట్టి జాతకం
వెన్నుకాచి రాముడు తోడున్న జాతకం
దేవుడి ముందు మనమంత్రాలా తప్పు తప్పు

అని గట్టిగా అరుస్తున్నట్లు చెప్పాడు.

నాది హస్తానక్షత్రం. ఆసంగతి ఆతని కెట్లా తెలుసు!
నేను అప్పటికే రామభక్తుణ్ణి.  ఆసంగతి కూడా ఆతని కెట్లా తెలుసు!

ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఆ ముసలతను వెనక్కు వెళ్ళి ఒకఅరటిపండూ తాంబూలమూ‌ తెచ్చి నా చేతిలో‌ పెట్టాడు.

ఇక్కడ అతనన్న మాటలు సరిగా గుర్తుకు రావటం‌లేదు. కాని నేను తాంబూలం తీసుకొని అనుమతి దయచేస్తేనే అక్కడ తమ కనుకట్టు విద్య పారుతుందట!

ఈ‌సంఘటన నన్ను అబ్బురపాటుకు గురిచేసింది.

నాకు గుర్తున్నంతవరకూ ఆరోజున నేను కొన్ని బత్తాయిపళ్ళు కొనటానికి అక్కడకు వచ్చాను. అవి జబ్బుగా ఉన్న మానాన్నగారి కోసం రసం తీసి ఇవ్వటానికి. బాల్య చాపల్యం‌కొద్దీ‌ ఆ మోడీ చూస్తూ‌ చాలాసేపే అక్కడ ఉండిపోయాను. ఒక గంట సేపన్నా అలస్యంగా ఇంటికి వెళ్ళాను.

మా అమ్మగారు ఇచ్చిన బత్తాయి రసం‌ మానాన్నగారు తాగుతున్నప్పుడు జరిగిన సంగతి అంతా చెప్పాను.

మా నాన్నగారు మాత్రం వాళ్ళు ఏవేవో‌ చెబుతూ‌ ఉంటారు జనరంజకత్వం‌ కోసం. ఆ మాటలన్నీ‌ పట్టించుకోకు అన్నారంతే.

మా అమ్మగారు మాత్రం కంగారు పడ్డారు.

మా బామ్మగారూ‌ మా అమ్మగారూ‌ కలిసి దృష్టి తీసారు.

ఈ‌సంఘటన ప్రభావం బాగానే కనిపించింది. నేను బయటకు వెళ్ళి వచ్చినప్పుడల్లా మా అమ్మగారు దిష్టితీయటం‌ మొదలుపెట్టారు. కొన్నాళ్ళ తరువాత మా బామ్మగారు ఒకచోట ఏదో‌ భజన జరుగుతుంటే అక్కడకు వెళ్ళారు. అక్కడ ఎవరో‌ హరనాథబాబా భక్తులట - వాళ్ళు భజన అయ్యాక అందరికీ ప్రశ్నలకు జవాబులు చెబుతుంటే నాభవిష్యత్తు గురించి మా బామ్మగారు ప్రశ్నవేసారు.

వాళ్ళు మరేమీ‌ భయం లేదనీ, భవిష్యం బాగా ఉంటుందనీ చెప్పాక కుదుటపడి, ఆ వార్తను  మా అమ్మగారి చెవినీ నా చెవినీ వేసారు.

ఈ మోడీ‌సాయిబులు నిజంగా సాయిబులేనా?‌ వాళ్ళు రాముడి పేరు కూడా ఎత్తారే అని నాకు చాలా అనుమానంగా ఉండేది.

హైదరాబాదు వచ్చిన క్రొత్తలో నిజంగానే మంచి రామభక్తుడైన ఒక పిల్లవాడిని చూసాము. అతడిని గురించి ప్రస్తావిస్తూ‌ మా అమ్మగారు 'తురకల్లోనూ రామభక్తులు చాలామందే ఉంటారని' వ్యాఖ్యానించారు.

అలాగే ఆ మోడీ‌సాయిబులు నిజంగా సాయిబులేనేమో.

ఇక జోస్యం విషయానికి వస్తే అతడన్నది కాలక్రమంలో అక్షరసత్యంగా జరుగుతున్నది.

నాకు అనేక ప్రాణగండాలు తలవెంట్రుక వాసిలో‌తప్పిపోయాయి మరి.

ఈ‌‌టపా పెద్దదైపోయింది కదా. వాటి గురించి వచ్చే టపాలో వ్రాస్తాను క్లుప్తంగా.

24, జూన్ 2016, శుక్రవారం

ఫలించిన జోస్యం - 6. (నాగేంద్రుడి కథ ప్రామాణికత గురించి)


(మొదటిభాగం  రెండవభాగం  మూడవభాగం  నాలుగవభాగం ఐదవభాగం

 నేను వెనుకటి టపాలో చెప్పిన నాగేంద్రుడి కథ విషయంలో కొందరికి సందేహం‌ కలగటం సహజం. ఆ కథ సత్యమే అనటానికి ప్రమాణం ఏమిటీ అన్న ప్రశ్న సముచితమైనదే.

ఆ కథ అంతా కొన్ని తరాల వెనుక జరిగినది. ముత్తాతగారి కాలంలో ఇలా జరిగిందట అని చెప్పేవాడు అసమగ్రమైన సమాచారానికి తన ఊహాశక్తితో ఒక రూపాన్ని ఆపాదించి చెప్పే ఆస్కారం ఎక్కువే. లేదా ఏదో‌ ఒక ప్రయోజనాన్ని ఆశించి కేవలం ఊహాకల్పితమైన కథను పాఠకుల ముందు ఉంచే అవకాశాన్నీ‌ కొట్టి పడెయ్యలేమన్నదీ వాస్తవమే. ఈ రెండు విధాలుగానూ‌ కాకపోయినా తాను విశ్వసిస్తున్న కథనే నిజాయితీగానే చెప్పినా సరే ఆకథ తనకు తెలిసీతెలియకయే కాలం గడిచి కొన్నికొన్ని మార్పులకు లోనై ఉండే అవకాశమూ ఉంటుంది కదా అంటే అదీ‌  నిజమేను.

కానీ ఆ కథను నాకు చెప్పిన వారు మా అమ్మగారు. ఆవిడకు అది తెలియజేసినది మా బామ్మగారు.  ఈ‌ ఇద్దరూ నాకు స్వయంగా తెలిసిన వ్యక్తులే‌ కాని అన్యులు కారు కదా.

ఒక విషయం యొక్క సత్యాసత్యాలను తెలుసుకుందుకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది సంప్రదాయం. అవి ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్థాపత్తి, అనుపలబ్ధి, సంభవం, ఐతిహ్యం అనేవి. ఇక్కడ శబ్దము అంటే శ్రుతి.అంటే వేదం. ఈ‌ ఎనిమిది రకాల ప్రమాణాల్లోనూ‌ నేను చెప్పిన కథ ఎటువంటి ప్రమాణాన్ని కలిగి ఉంది అన్న ప్రశ్న వేసుకుంటే అనుమాన ప్రమాణం అనే చెప్పవలసి ఉంది. ఇక్కడ నమ్మకానికి దృష్టాంతమూ‌ సాధ్యతా వంటి వన్నీ‌ సుష్టువుగానే ఉన్నాయి.

ధర్మం సూక్ష్మంగా ఉంటుంది. దానిని వేదప్రామాణ్యంగా తెలుసుకుందుకు తరచుగా శక్తి చాలదు. అటువంటి సందర్భాల్లో పెద్దల నడవడినీ, మాటనూ ప్రమాణంగా గ్రహించాలి. మా అమ్మగారూ మాబామ్మగారూ ఈ‌ కథ విషయంలో కల్పనలో అసత్యాలో చెప్పవలసిన కారణం ఏమీ లేదు కబట్టి వారి కథనాన్ని నేను ప్రామాణికంగా ఎంచుతున్నాను.

అనుమాన ప్రమాణంలో‌ దృష్టాంతం‌ కూడా ఒక అవయవం. కొన్ని దృష్టాంతాలను మీ ముందుంచటం ద్వారా ఈ‌కథ యొక్క ప్రామాణికతను మరింతగా తెలియచేయాలని ఆశిస్తున్నాను.

మొదటిది నాకు బాగా చిన్నతనంలో‌ జరిగిన సంఘటన. ఒక నాటి మధ్యాహ్నం‌ పడకగదిలో పట్టెమంచం‌ మీద నేనూ మా నాన్నగారూ‌ నిద్రపోతున్నాము. పడకగది కిటికీ భోజనాల వసారా లోనికి తెరుచుకొని ఉంటుంది. ఆ వసారాకు ఆనుకొని వంటగది. కిటికీ వెలుపలనుండి మా బామ్మగారు మెల్లగా పిలుస్తూ మమ్మల్ని నిద్రలేపారు. నాన్నగారు ఏమిటి సంగతి అని అడిగే లోపలనే ఆవిడ పాము పామురా అని చెప్పారు.  ఇంటి మధ్యలో విశాలమైన హాలు ఉంది. దానిపైన అటక ఉంది. పడకగది తలుపు ఆ హాల్లోకి తెరుచుకుంటుంది. అటకమీద పాము ఉందని మా బామ్మగారు గాభరా పడుతూ చెప్పటంతో మొల్లగా మా నాన్నగారు గది తలుపులు తెరచుకొని బయటికి వచ్చారు. వెనుకనే నేనూ ఉన్నాను. బయటికి వచ్చి చూద్దుము కదా ఒక పెద్ద తెల్లని పాము అటకపైన ఒక నిట్రాటకు చుట్టుకొని ఉంది.

మా నాన్నగారు భయపడి అమ్మవారి గుడిదగ్గర ఉండే పాములు పట్టే వాళ్ళకు కబురు పెట్టారు. ఆ గుడి మా యింటికి దగ్గరే. ఇంటి వెనుకవైపునుండి కనబడుతూనే‌ ఉంటుంది కూతవేటు దూరం లోనే. వాళ్ళు వచ్చే దాకా మేము బిక్కుబిక్కు మంటూ ఇంటి వెనుక పెరటిలో ఉన్నాం. వాళ్ళు కొద్ది నిముషాల్లోనే వచ్చారు కానీ‌ ఈ‌లోగా పాము అక్కడ నుండి తప్పుకుంది. పాములవాళ్ళు ఇంటినీ‌ ఇంటి చుట్టూరా ఎంత వెదకినా అది కనబడలేదు. వాళ్ళు అటకమీదనే ఉండి ఉంటుంది పైకి పోయి వెదకుతాం అన్నారు. అనటం‌ ఏమిటీ ఇద్దరు పైకి వెళ్ళారు టార్చిలైట్లూ కర్రలూ‌ తీసుకొని. కాని అదెక్కడా కనబడలేదు. తెలివి తేటలు ప్రదర్శించారు కరంటువైర్లను తెచ్చి అటకమీద పరచటం ద్వారా. చివరికి వాళ్ళంతా అది కాస్తా ఏదో‌ చూరుగుండా బయటకు పోయి ఉంటుందని తేల్చి వెళ్ళిపోయారు.

మా నాన్నగారికి అనుమానం పోలేదు. అదెక్కడన్నా నక్కి ఉండి ఈ‌గలాభాకు దడిసి బయటకు రాలేదేమో అని. మాకూ భయాందోళనలు సహజంగానే అధికంగా ఉన్నాయి.

ఊళ్ళో ఫలానా వారు పేరుపొందిన మంత్రవేత్తలు ఉన్నారని ఎవరో సలహాయిస్తే వారి దగ్గరకు వెళ్ళారు మానాన్నగారు. వాళ్ళు ఎవరో గాని మినుములు ఒక గిన్నెడు మంత్రించి ఇచ్చారు. ఇంటి లోపలా బయటా అంతటా చల్లండి ఏ మూలా వదలకుండా అని చెప్పారట. అలాగైతే ఆపాము మా చుట్టుప్రక్కలకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ‌ రాదని చెప్పారట.

ఏం చేస్తాం‌ ఆ సలహాను తూచ తప్పకుండా పాటించాం.

లైట్లు  వేసుకొనే పడుకున్నాం‌ అంతా ముందు హాల్లోనే.  ముందు హాలు అంటే భోజనాల వసారా ముందు ఉన్నది కాదు. ఆ హాలుకు ఎదుట ఉన్నది. ఇంటి గుమ్మం తెరచి నేరుగా ఆహాల్లోనికే వస్తాం. అది చాలా ఎక్కువ పొడుగు.

ఇక ఒక రాత్రివేళ నుండి చూడండి భాగవతం!

ఇంటి ప్రక్క సందునుండి మల్లెపూల వాసన గుప్పుమంది. అందరమూ లేచి కూర్చుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం కాసేపు.

ఆ వాసన హఠాత్తుగా మాయమైపోయింది.

కొంచెం సేపటికి తీపివాసన - మినపసున్ని సువాసన.  అది మధ్యహాలునుండి చిన్నగా మొదలై ముందు హాలు అంతా వ్యాపించింది.

అది తగ్గిపోయిన తర్వాత ఇంటి వీధి గుమ్మం‌ బయటనుండి మళ్ళా మరోక రకం పూలవాసనలు.

ఇలా మార్చిమార్చి రకరకాల సువాసనలు పూలవీ‌ పండ్లవీ పిండివంటలవీ వగైరావన్నీ రాత్రంతా మాపని పట్టాయి.

ఈ విధంగా ఆ రాత్రి మాకు కాళరాత్రి అయ్యింది.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జాగరణ చేసాం.

తెల్లవారిన తరువాత మా నాన్నగారు మళ్ళా బయటకు వెళ్ళారు. ఆ మంత్రగాడికి చెప్పటానికీ‌ కొత్త సలహా కోసమూ.

కొద్దిసేపటికే తిరిగి వచ్చారు.

మీ‌ పెద్దల నాటినుండీ‌ మీ‌యింట్లో సుబ్రహ్మణ్యస్వామిని నాగేంద్రరూపంలో ఆరాధించటం ఉంది. ఆ పాము మీ‌యింట్లో‌ తరచూ‌ కనిపించేదే అట. మీరు దాన్ని బెదిరించాలనీ‌ తరిమెయ్యాలనీ పట్టించాలనీ వగైరా ఆలోచనలు చేయటం‌ అపరాధం  అనిపిస్తోంది. నిన్న మీరు వచ్చివెళ్ళాక విచారిస్తే ఈ సంగతి తెలియవచ్చింది. పొరపాటున మీకు మంత్రించిన మినుములు ఇచ్చాను. దేవుడిమీద మంత్రాలా? క్షమించండి.  స్వామికి నమస్కారం చేసుకొని నిక్షేపంగా ఆ యింట్లో ఉండండి. మీకేమీ‌ భయం‌ ఉండదు.

ఇదీ‌ మా నాన్నగారికి వారినుండి తెలియవచ్చిన సంగతి.

మా బామ్మగారూ అమ్మగారు దణ్ణాలు పెట్టుకున్నారు. నాకు తెలుసు.

మా నాన్నగారు దండం‌ పెట్టుకోవటం ఐతే నేను చూడలేదు. పెట్టే ఉండవచ్చును.

మరలా మాకు భయం‌కాలేదు. ఆరాత్రి అనే కాదు మరలా అటువంటి సువాసనలూ వగైరా మమ్మల్ని మళ్ళీ హడలెత్తించలేదు.

ఇదొక దృష్టాంతం. దీన్ని హేతువాదం చేసేవాళ్ళు ఎలా వ్యాఖ్యానిస్తారో నాకుతెలుసు. వాళ్ళతో‌ నాకు పేచీ లేదు. అలాగని వాళ్ళకు నచ్చజెప్పే ఉద్దేశమూ‌ లేదు. ఉన్నసంగతి చెప్పానంతే.

మరొక దృష్టాంతం మా నాన్నగారు గెద్దనాపల్లె మాధ్యమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ఉండగా జరిగింది.

 మా బామ్మగారు మాతో కొన్నాళ్ళూ మా లక్ష్మీపోలవరం ఇంట్లో కొన్నాళ్ళుగానే తిరుగుతూ‌ ఉండేవారు. ఆవిడ భ్రాంతి ఆవిడది ఆయింటిమీద. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు క్షేమసమాచారాలు కార్డుముక్క మీద తెలియబరచే వారు అప్పుడప్పుడు. అనంతర కాలంలో మా అమ్మగారు కూడా హైదరాబాదునుండి తరచుగా లక్ష్మీపోలవరం ప్రయాణం కట్టే వారు. ఆ యిల్లు పాడవుతోందని వేలకు వేలు పోసి వెళ్ళిన ప్రతిసారీ‌ మరమ్మత్తులూ‌చేయించే వారు. వాళ్ళ భ్రాంతి వాళ్ళది.

అలా ఒకసారి మా బామ్మగారి నుండి ఉత్తరం వచ్చింది.అందులో ఆవిడ వ్రాసిన కథనం చెప్తాను.

ఆవిడ యింటికి వచ్చి మర్నాడు పడకగది అంతా శుభ్రం చేదా‌ం దుమ్మూ‌ గట్రా పేరుకుని ఉంటుంది కదా అని ఆ గదిలో అన్ని వస్తువులూ‌ కదిపీ‌ ఎత్తీ తుడిచి బాగుచేస్తున్నారట గదంతా. పెద్ద చెక్కపెట్టె ఒకటుంది లెండి. దాని మూత తీసి లోపలి వస్తువులు ఒక్కోటీ బయటకు తీస్తున్నారు.

రెండో మూడో వస్తువులు తీసి బయటపెట్టి మళ్ళా లోపలికి చేయిపెట్టి వెలికి తీస్తే చేతిలో ఒక పెద్ద తెల్లని పాము!

పెద్దగా అరుచుకుంటూ ఒక్కగంతులో‌ బయటకు వచ్చారావిడ.

మ యింటికి యిరుప్రక్కలా ఉన్నవీ‌ మావాళ్ళ ఇళ్ళే! ఎడం వైపున ఉన్నది మా చినతాతయ్య వేంకటరత్నంగారి యిల్లు. కుడివైపున ఉన్నది చిట్టెమ్మగారిల్లు. ఆవిడ కుమారుడు గోపాలం ఆ ఊరి కరణం‌. మాకు వాళ్ళు ఙ్ఞాతులు. గోపాలం‌ నాకు అన్నయ్య వరస. నాకంటే చాలా పెద్దవాడు. కరణంగారి యిల్లంటే అరుగునిండా జనం ఉంటారు కదా సందడిగా.

ఈవిడ కేకలకు గోపాలం పరుగెత్తుకొని వచ్చాడు.

నలుగురూ‌ మళ్ళా కర్రలూ‌బుర్రలూ‌ పట్టుకొని వెళ్ళి ఇల్లంతా గాలించారు కాని ఆ పాము మళ్ళా కనబడలేదు!

మాబామ్మగారు ఆపాము ఉన్న పెట్టెలో చేతులు పెట్టి అవీ ఇవీ‌ దాని ప్రక్కనుండే బయటకు తీస్తుంటే అదేమి చిత్రమో అదేమీ‌ చేయలేదు! చివరకు ఆవిడ నేరుగా ఆపామునే చేత్తే‌ పట్టి బయటకు తీసినా అదేమీ చేయలేదు! ఆశ్చర్యపోవలసిన విషయమే కదా.

మేము కొత్తపేటలో ఉన్నప్పుడు పండగకూ‌ పబ్బానికీ ఎప్పుడన్నా మావూరు వెళ్ళి వచ్చేవాళ్ళం. ఎంతైనా మావూరు కదా! అలాగు కొన్ని సార్లు సంక్రాంతికి వెళ్ళటం‌ జరిగింది. వేరే‌ సందర్భాల్లోనూ‌ కొద్ది సార్లు వెళ్ళాం.

అలా లక్ష్మీపోలవరం‌ వెళ్ళినప్పుడు మా అమ్మగారికి రెండుమూడు సార్లు ఆ పెద్ద తెల్లని పాము దర్శనం ఇచ్చింది. ఒకసారైతే మా అమ్మగారు ఆ పామును దాటి ఆవలకు వెళ్ళారట. అనుమానం వచ్చి వెనుదిరిగి చూసుకుంటే పెరటిగడపను ఆనుకొని పొడుగ్గా పరచుకొని ఆ పాము దర్జాగా శయనించి ఉంది. మా అమ్మగారి ముందునుండే మెల్లగా కదలి వెళ్ళిపోయింది. ఏముంది. మళ్ళా గోడవతలకు గోపాలం గోపాలం అని కేకవేసి పిలవటమూ, అతడు దిట్టమైన మనుషులతో‌ రావటమూ మళ్ళా పాము ఎక్కడా కనబడక పోవటమూ.

ఒక పర్యాయం గోపాలం పెరటిలో‌ని చెత్తచెదారం అంతా మొత్తం పూర్తిగా పీకించి వేసి మరీ వెదికించాడు - ఒక చిన్న ఇటుకల గుట్ట ఉండేదిలెండి ముఖ్యంగా అది తీసేసామప్పుడే.

ఇలా మాకుటుంబానికి ఆ శ్వేతసర్పం దర్శనం ఇవ్వటం చాలా సార్లే‌ జరిగింది. కాని ఎప్పుడూ ఎవరికీ నిజంగా ఇబ్బంది కలిగించ లేదు.

కాలక్రమేణా మా ఉనికి ఆ వూరినుండి దూరం అయ్యింది. తాతల నాటి ఇల్లు శిధిలమై పోయింది. ఇప్పుడా యిల్లు లేదక్కడ.

ఉద్యోగరీత్యా మా నాన్నగారు వేరే ఊళ్ళో కాపురం‌ ఉంటున్నా జిల్లాలోనే ఉండే వారు కాబట్టి మాకుటుంబానికి అప్పుడప్పుడూ ఆ యింటి మీద భ్రాంతి తీర్చుకుందుకు వెళ్ళి వచ్చేందుకు కొంచెం వీలయ్యేది.

ఉద్యోగరీత్యా నా ఉనికి హైదరాబాదుగా మారింది. నలభైయేళ్ళ చిల్లర సంవత్సరాలు గడిచాయి, నేనీ‌ హైదరాబాదుకు వచ్చి.

కాలవైపరీత్యం వలన తెలుగు రాష్ట్రం ఒకటి రెండు కావటం‌ జరిగింది. ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లాకే కాదు ఆంద్రప్రదేశానికే స్థానికుడిని కాకుండా పోయాను. మాతాతగారు అంతగా భవిష్యత్తు తెలిసిన వారు కారు కాబట్టి రాబోయే మనవడు హైదరాబాదులో ఉండబోతున్నాడూ‌ వాడికి ముందుముందు ఇబ్బంది కాకూడదూ‌ అన్నది గ్రహించలేకపోయారు. అందుకే ఆయన తెలంగాణాకు వలసరాలేదు. ఆయనే పందొమ్మిది వందల యాభైయ్యారుకు ముందే హైదరాబాదుకు వలస వచ్చి ఉంటే  నేను తెలంగాణా పౌరుడిని అని ఇక్కడి దొరతనం వాళ్ళకు ఆమోదం అయ్యేదేమో. ఏంచేసేదీ, నేను తెలంగాణా వాడినీ‌ కాకుండా పోయాను. ఏం చేస్తాం. కాదంటే పోనీలే అనుకోవటమే.  ఈ‌విధంగా నేను ఏ తెలుగు రాష్ట్రానికి చెందని వ్యక్తినే అనిపిస్తుంది. పోనీయండి, దేశపౌరుడినే కదా - అంతవరకూ నయం. ఇదంతా అనవసర శాఖాచంక్రమణం. కాబట్టి వదిలేద్దాం.

చెప్పవచ్చేది ఏమిటంటే మాస్వగ్రామం లక్ష్మీపోలవరం నుండి మేము దూరం అయ్యాం. ఇప్పుడు వెడితే ఆ పాము కనిపిస్తుందా అన్న ప్రశ్న లేదు. అసలా ఇల్లే లేదుగా.

కాని సుబ్రహ్మణ్యస్వామి ఉన్నాడు కదా.

ఆయన నాకు వేరే నిదర్శనాలు ఇస్తున్నా వాటి గురించి వ్రాయను. అవి ఆథ్యాత్మికమైనవి. ప్రకటనీయాలూ  చర్చనీయాలూ కావు.

ఈ‌ నాగేంద్రుడి అనుగ్రహం అనండి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం అనండి అది మా మీద ఉండబట్టి వంశవిస్తరణ జరిగింది. ఈ సందర్భంగా ఒక సాధువుగారి నుండి అందిన సూచన ఒక జోస్యం వంటిదే మామూలుగా అలోచిస్తే. అందుకని ఇదంతా వ్రాసాను.


(ఇంకా ఉంది)

23, జూన్ 2016, గురువారం

ఫలించిన జోస్యం - 5 (నాగేంద్రుడి కథ)


(మొదటిభాగం  రెండవభాగం  మూడవభాగం  నాలుగవభాగం)

జ్యోతిషం చాలా పురాతనమైన శాస్త్రం.

దీని మూలాలు వైదికమైనవి.  మానవజాతికి అందిన విఙ్ఞానం‌ యొక్క అవతరణం వేదస్వరూపంగా జరిగిందని మన నమ్మకం. మన జీవనవిధానానికి మూలాధారం ఆ వేదమే.

ఈనాటి భౌతికవిఙ్ఞానపరిభాషలో విశ్వం యొక్క ఉనికి ఒక అనిర్వచనీయమైన మహావిస్ఫోటనంతో ప్రారంభం కావటం‌ జరిగింది.  అలా విస్ఫోటనం చెందినది ఏమిటీ అన్న ప్రశ్న వస్తుంది సహజంగా. దానికి సమాధానం మనకు తెలియదు. శాస్త్రపరిభాషలో చెప్పాలంటే ఇంకా తెలియదు. ఎందుకు ఆ విస్ఫోటనం‌ జరిగిందీ అంటే అదీ మనకు తెలియదు. కొన్ని సిధ్ధాంతప్రతిపాదనలు మాత్రం ఉన్నాయి. ఆ మహావిస్ఫోటనం జరుగక ముందు పరిస్థితి ఏమిటీ అన్న ప్రశ్న అసలు ఉత్పన్నమే‌ కాదు. ఎందుకంటే ముందు వెనుక అన్నవి కాలానికి సంబంధించిన ప్రాతిపదికలు. అసలు కాలం అనేదే లేదు. ఆ మహావిస్ఫోటనంతోనే‌ కాలం‌ అనేది ప్రారంభం అయ్యింది. మహావిస్ఫోటనం‌ యొక్క పరిణామం ఏమిటంటే అనంతమైన శక్తి విడుదలై అందులో కొంత పదార్ధ రూపం దాల్చింది. ఆ పదార్థం విస్తరించటానికి అనువుగా స్థలం అనే‌ ప్రమాణం ఏర్పడింది. ఆ శక్తిలో‌అధిక భాగం అంచనాకు అందటం‌లేదు. ఆ పదార్థంలోనూ‌ అధికభాగం మన అంచనాలకు అందటం లేదు. వాటి ఉనికిని మనం‌ పరోక్షంలో‌ ఒప్పుకోవటమే‌ కాని వాటి ఉనికిని పట్టి యిచ్చే ఏవిధమైన ఋజువునూ గుర్తించ లేకుండా ఉన్నాం. ఇంకా విస్తరిస్తూనే ఉన్నది విశ్వం వేగంగా - ఎంత వేగంగా అన్న విషయంలో మనం అంచనాలు వేయటమూ అవి తప్పని ఋజువై మరలా కొత్త అంచనాలకు రావటమూ జరుగుతున్నది. సమస్తమైన విశ్వానికీ దానిలోని సర్వప్రమాణాలకూ మూలాధారం ఆ మహావిస్ఫోటనమే. ఈ విధంగా ఒక ప్రారంభం అంటూ‌ ఉంది. దానినుండే సమస్తమూ కలిగింది.  మరి మహావిస్ఫోటనం చెందినది ఏమిటీ అంటే అది అనిర్వచనీయంగా ఉంది కాని మన మస్తిష్కానికి అందకపోయినా మన సిధ్ధాంతాలకు అందక పోయినా అదేదో ఉండనే ఉందిగా. ప్రస్తుత విఙ్ఞానశాస్త్రం దానిని నిర్వచించలేక పోయినంత మాత్రాన అది లేదనేందుకు వీల్లేదు కదా.
 
అలాగే మన సనాతనధర్మం యొక్క నమ్మిక ప్రకారం అనిర్వచనీయమైనది భగవత్తత్త్వం. దాని వలననే ప్రకృతి యేర్పడింది. ఆ ప్రకృతియే విశ్వంగా పరిణామం చెందింది. భగవత్తత్త్వం ఋషులకు విఙ్ఞాన రూపంగా భాసిల్లింది. అదే వేదం. సమస్తమైన జీవనతత్త్వానికీ అదే అధారం. ఈ భగవత్తత్త్వమూ మన తెలివిడికీ సిధ్ధాంతాలకూ అందదు. భౌతికవిఙ్ఞానశాస్త్రం దాని గురించి ఏమీ చెప్పలేదు. ఉందనీ‌ చెప్పలేదు - లేదనీ‌ చెప్పలేదు. సైంటిఫిక్ ఋజువులు లేవు కాబట్టి భగవత్తత్త్వం అనేది ఉండటానికే వీల్లేదంటే అలా అనేవారి విఙ్ఞతకు ఒక నమస్కారం చేసి ఊరుకోవటమే.

ఆ వేదాన్ని ఋషులు ఆరు అంగాలు కలిగిన దానిగా వర్గీకరించారు. ఆ వేదాంగాలు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం‌, కల్పం అనేవి. అందుచేత జ్యోతిషం వేదంలో భాగంగానే వచ్చింది. అందుచేత వేదప్రామాణ్యత కలది. కాలస్వరూపాన్ని తెలియజేసేది జ్యోతిషం.

జ్యోతిషాన్ని లోకంలో అనేకులు దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కరెన్సీ నోట్లతో మంటవేసి టీ‌ కాచుకోవటం ఆ నోట్లకు అధమప్రయోజనం‌ కదా. జ్యోతిషంతో కాలస్వరూపాన్ని గ్రహింపు చేసుకొని లోకోపకారం చేయ గలిగితే అది సరైన ప్రయోజనం. ఇతర వినియోగాలు వర్జనీయాలే. ఉత్తములు జ్యోతిషాన్ని సరిగానే వినియోగిస్తారు. కాని వారు అరుదుగా కనిపిస్తారు.

కృష్ణమూర్తి పధ్ధతికి చెందిన జ్యోతిషపత్రిక ఒకటి ఒక కథనాన్ని ప్రకటించింది. ఎప్పటి మాటో చెబుతున్నాను లెండి. ఆ కథనంలో జ్యోతిషం తెలిసిన ఒకాయన పనిమనిషి రాకకోసం వేచి చూడవలసి వచ్చిందట ఒకనాడు. అమె రాక ఆలస్యం అవుతుంటే అమె ఎప్పుడు వచ్చేదీ తెలుసుకొనేందుకు చక్రం వేసి వివరాలు పరిశీలించాడట. అధ్బుతం! అమె సరిగ్గా అతను లెక్కగట్టినట్లుగానే అన్ని గంటల అన్ని నిముషాల అన్ని సెకనులకే అమె ఇంటిలోనికి ప్రవేశించిందట.

మరొక పత్రికలో ఒక పెద్దమనిషి జ్యోతిషం ఉపయోగించి వరసగా కొన్నాళ్ళపాటు రేసుల్లో ఏఏ గుఱ్ఱాలు గెలిచేదీ సరిగ్గా లెక్కకట్టాడట. ఆ వివరాలతో ఒక వ్యాసం.

ఇవి దిక్కుమాలిన ప్రయోజనాలు కదా!

బి.వి.రామన్ గారి అష్ట్రలాజికల్ మేగజైన్‌లో ఒకప్పుడు వచ్చిన ఒక వ్యాసంలో డాక్టరుగారు ఒకాయన గుండెజబ్బు లున్న కొందరు రోగుల జాతకచక్రాలను పరిశీలించి కొన్ని కాంబినేషన్లు ప్రకటించాడు. అవి ఆసక్తి కరంగా ఉన్నాయి. వాటిలో ఒక కాంబినేషన్ కనిపించిన పిల్లవాడికి గుండెలో రంధ్రం ఉన్నదని స్వయంగా నా అనుభవంలో తెలుసుకోవటం జరిగింది.

ఇటువంటి పరిశోధనలు మానవాళికి ఉపయోగిస్తాయి. కొందరు అలాంటి పరిశోధనలు చేస్తున్నారు. అది మంచిదే.

కాలస్వరూపాన్ని ఇలా కొందరు జ్యోతిషం ఆధారంగా తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కొందరు సద్వినియోగం చేస్తున్నారు.

కాని కొందరు మహానుభావులకు వారి వారి యోగశక్తిని అనుసరించి కాలస్వరూపం అవగతం అవుతూ ఉండటం జరుగుతుంది. అలాంటి వాళ్ళని త్రికాలవేదులు అంటున్నాము. అలా త్రికాలవేదులం‌ కాము కాబట్టి మనబోటి వాళ్ళం జ్యోతిషాన్ని ఆశ్రయిస్తున్నాం. సద్బుధ్ది ఉంటే సద్వినియోగమే చేస్తున్నాం.

త్రికాలవేదులం అని డప్పువేసుకొనే వారు కచ్చింతంగా బోగస్ అయ్యే అవకాశం ఉంది. నిజమైన త్రికాలవేదికి మన పొగడ్తలతో పనిలేదు కదా. కరుణతో ఎవరికన్నా ఉపకారం చేయాలని భగవత్సంకల్పంగా వారికి మనస్సులకు సందేశం అందితే వారి వలన అటువంటి లోకోపకారం జరుగుతుంది.

వేదం ట్రాష్. జ్యోతిషం ట్రాష్. యోగం‌ ట్రాష్. కాలం‌ తెలియటం ట్రాష్ అనే గొప్ప తెలివిడితో మసలుకొనే మహానుభావులు కూడా ఉంటారు లోకంలో. వాళ్ళు ఇదంతా నమ్మరు. నేను వ్రాస్తున్నది ఒకరిని నమ్మించటానికో ఒకరిని మోసగించటానికో కాదు. నా జీవితానికి సంబంధించిన సంఘటననల గురించి వ్రాస్తున్నాను. ఎందుకు వ్రాస్తున్నానూ‌ అంటే అందరికీ సంతృప్తి నిచ్చే సమాధానాన్ని నేను చెప్పలేను. నా తృప్తి కోసమే వ్రాస్తున్నాను. కాని ఆ మాట వెనుక ఏమన్నా వేరే ప్రయోజనం దాగుందా అంటే ఆ విధంగా ఆలోచించే వాళ్ళకి తలొక వంద నమస్కారాలూ చేయటం మినహా మరేమీ చేయలేను.

నమ్మే వారిని నమ్మించటానికి ఉన్నవీ లేనివీ చిలువలు పలువలుగా చిత్రించి వ్రాయటానికి నాకు అవసరం ఏమీ‌ లేదు. నమ్మని వారితో నాకు తగాదా యేమీ లేదు. చదవటం చదవక పోవటం ఎప్పుడూ వ్యక్తుల ఇష్టమే కాని వ్రాసేవాడి బలవంతం ఏమీ ఉండదు కదా. ఈ ముక్కలు ఇప్పుడు ఎందుకు చెబుతున్నానూ‌ అంటే ముందు జాగ్రత్త కోసం అన్నమాట. అదేం‌ అలా అన్నావూ‌ అనకండి దయచేసి.  ఇంక కథ లోనికి వధ్దాం.

అటువంటి త్రికాలవేది ఒక సాదువు ఆ యింటి గుమ్మం వద్దకు వచ్చాడు.
ఆ యింటి ఇల్లాలు బిక్ష ఇవ్వటం కోసం బయటకు వచ్చింది.

అది లక్ష్మీపోలవరం అనే గ్రామం. శ్రీజగన్మోహినీకేశవస్వామివారు నెలకొని ఉన్న పుణ్యక్షేత్రమైన ర్యాలికి ప్రక్కనే ఉన్న ఊరు.

ఆ యూళ్ళో వీరి యిల్లు గ్రామం మధ్యలో ఉన్న ఒక వీధిలోని మూడిళ్ళలోనూ మధ్యయిల్లు.

ఆ యిల్లాలి నుండి భిక్షను స్వీకరించిన సాధువు, ఇలా అన్నాడు

అమ్మా నీవు సంతానం కోసం పూజలు చేస్తున్నావు. అవి ఫలోన్ముఖం అయ్యే రోజులు వచ్చాయి. మీ యిలవేలుపు నాగేంద్రుడు.  అయన కటాక్షం కోసం ప్రార్థించు. త్వరలోనే మీకు ఆయన దర్శనం అనుగ్రహిస్తాడు. మీ దంపతులు శయనించి ఉండగా ఒకనాడు ఆయన మీ పడక మీదనే దర్శనం ఇస్తాడు. మీరు ఏదో పాము పాము అని భయంతో గడబిడపడి ఆ సర్పానికి హాని చేయటానికి ప్రయత్నించవద్దు. మీకు కలగబోయే కుమారుడికి స్వామి నామధేయం ఉంచుతామని దండం పెట్టుకొని విన్నవించుకోండి. నేను మీకు ఈ మాటలు చెప్పటానికే వచ్చాను.

ఈ మాటలు చెప్పి ఆ సాధువు ఎవరో తన దారిన తాను పోయాడు.

ఆమెకు చిత్రంగా అనిపించాయి ఈ మాటలు.

భర్తగారు ఇంటికి వచ్చాక జరిగిన సంగతిని ఆవిడ ఆయనకు పూసగ్రుచ్చినట్లు చెప్పింది.

ఆయన ఆశ్చర్యపోయాడు.

సాధువుగారు చెప్పినట్లే ఒక నాడు వారికి పడక గదిలోనే వారి పట్టెమంచం మీదనే ఒక పెద్ద తెల్లని సర్పం హఠాత్తుగా దర్శనం ఇచ్చింది. నిద్రలో ఉన్న వారికి తమ మీదుగా సర్పం ఒకటి ప్రాకుతూ వెళ్ళటంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది. పామును చూసి వాళ్ళిద్దరూ భయంతో కొయ్యబారి పోయారు.

కాని వారికి సాధువుగారి జోస్యం గుర్తుకు వచ్చి చెరియొక వైపునకూ మంచం దిగి నమస్కారం చేసుకున్నారు కొంచెం వణుకుతూనే.  ఆయన సూచించినట్లే చెప్పుకున్నారు కోరస్‍గా.
 

ఆ సర్పం తన దారిన తాను వెళ్ళిపోయింది మంచదిగి కిటికీ గుండా.

ఒక పెంకుటింట్లో అటకమీద ఎలకలూ గట్రా తిరుగుతూ ఉంటాయి కదా, పాములు చేరటంలో ఆశ్చర్యం ఏముందీ అనవచ్చును. అలాగే అటక మీదినుండి క్రిందపడో క్రిందికి దిగివచ్చో ఒక పాము కిటికీ గుండా పడకగది లోనికి రావటమూ విశేషం కాదనీ అనవచ్చును. కాని త్వరలో ఇలా జరుగుతుందనీ, దండం పెట్టుకుంటే అది ఏహానీ చేయకుండా వెళ్ళిపోతుందనీ, ఆ తరువాత మాత్రమే కొన్నాళ్ళకు తప్పకుండా సంతు కలుగుతుందనీ ఎవరో వచ్చి జోస్యం చెప్పటం విశేషమే తప్పకుండా. కాదంటారా?

ఈ సంఘటన జరిగిన తరువాత కొంతకాలానికి వారికి పుత్రోదయం ఐనది.

ఈ విధంగా తాడిగడప బాపిరాజుగారికి పెద్ద కుమారుడు వేంకట సుబ్బారావుగారు జన్మించటం జరిగింది.

ఈ సుబ్బారావుగారు మా తాతగారు. ఆ బాపిరాజుగారు మా ముత్తాత గారు.

బాపిరాజు గారు కాటన్ దొర వధ్ద ఒక ముఖ్య సర్వేయరుగా ఉద్యోగం చేసారట.

మా అత్తగారు చాలా ఊళ్ళు తిరిగారు. ఆవిడకు చాలా భాషలే వచ్చును అని మా బామ్మగారు నాతోనే స్వయంగా చెప్పారు. మా బామ్మగారు కానీ మా అమ్మగారు కానీ బాపిరాజుగారి భార్యపేరు చెప్పలేదు. కొంచెం పరిశోధించి తెలుసుకోవాలి. తెలియవస్తే ఈ టపాను సరిచేస్తాను ఆ వివరంతో.

మా కుటుంబంలో ప్రతితరంలోనూ సంతానంలో ఒకరి కైనా  తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పేరు పెట్టుకోవాలని మా అమ్మగారు  హెచ్చరిస్తూ ఉండేవారు. మాతరంలో పాటించాం. మా చెల్లెలు ఒకామె పేరులోనూ ఒక తమ్ముడి పేరులోనూ సుబ్రహ్మణ్యస్వామి సూచకమైన నామం ఉంచటం జరిగింది. ముందు ముందు కూడా అలాగే జరుగుతుందని విశ్వసిస్తున్నాను.

కాలం గడిచిన కొద్దీ తరాలు మారి ఈ నాటికి మా కుటుంబాల్లో సుబ్రహ్మణ్యుడి పట్ల కొంచెంగా భక్తిశ్రధ్దలు తగ్గాయా అన్న అనుమానం వస్తున్నది. ఒకప్పుడు మా యింట్లొ ప్రతి నాగులచవితినీ చాలా నిష్ఠగా జరుపుకునే వాళ్ళం. సుబ్బారాయడి షష్ఠి మరొక కోలాహలమైన పండుగగా ఉండేది. ఇప్పుడు ఆరోగ్యపరిస్థితుల కారణంగా మా యింట్లో ఉపవాసాలు లేవు. పట్నవాసం మిషతో ఆ రెండు పండగలూ పెద్దగా జరుగుతున్నదీ లేదు. ఇది అసంతృప్తిని కలిగిస్తోంది నాకు.

ఇప్పటికే టపా పెద్దదయ్యింది. ఇంకా కొంత విషయం ఉంది ఈ సందర్భం గురించి. అది వచ్చే టపాలో చూదాం.( ఆరవభాగం)22, జూన్ 2016, బుధవారం

ఫలించిన జోస్యం - 4 (అయాచితజోస్యం కథ )


(మొదటిభాగం    రెండవభాగం    మూడవభాగం)


క్రమంగా మా శ్రీనివాసుడు మాకొక ఙ్ఞాపకంగా మిగిలిపోయాడు. కాలం అనేది మనస్సులకు తగిలే గాయాలకు మరపు అనే మందుపూత వేస్తుంది. అందరమూ మెల్లగా వాస్తవజగత్తులోనికి వచ్చాం.

ఒకటి రెండు సార్లు మాత్రం నాన్నగారు శ్రీనివాస్ ఉంటే ఎంత బాగుండేది అని విచారంగా అన్నారు నాతో.

మా నాన్నగారు ఉద్యోగరీత్యా కొత్తపేటలో పదేళ్ళపాటు నివాసం ఉన్నారు. ఆరోజుల్లో ఉపాధ్యాయులపట్ల లోకానికి గొప్ప గౌరవం ఉండేది. ఈనాడు అంత గౌరవం ఉందా అన్నది అనుమానమే.

అప్పుడప్పుడు నాన్నగారు ఒక మాట అనేవారు. కలెక్టరు ఉద్యోగం చేసినవాడికి రాచమర్యాదలు జరగవచ్చు. కాని అ ఉద్యోగానంతరం సాధారణంగా అతను పదిమందిలో ఒకడే. ఒకసారి ఉపాధ్యాయుడిగా పనిచేసాక జీవితాంతం అందరూ మాష్టారూ అంటూ గౌరవంగా నమస్కరిస్తారు అని.  మా నాన్నగారితో నేను జజార్లో నడుస్తూ వెళ్ళుతున్నప్పుడు అనేకమంది వాహనాలు - అవేలెండి సైకిళ్ళు - దిగి నమస్కారం చేసి ఆయన్ను పలకరించటం నా స్వానుభవంలో చాలా తరచుగా చూసాను. అందుచేత నాకూ‌ ఉపాధ్యాయవృత్తి పట్ల చాలా ఆకర్షణ ఉండేది.

ఒకటి రెండుసార్లు మా యింటికి యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు గారు వచ్చారు. ఆయన కపిలేశ్వరపురం జమిందారు గారు. తూర్పుగోదావరి జిల్లాపరిషత్తుకు ఆయన ఛైర్మన్ కూడా. ఆయనకూ మానాన్నగారికీ స్నేహం‌ ఎలాగో నాకు వివరం తెలియదు. మా నాన్నగారికంటే ఆయనే కొద్దిగా పెద్దవారు. పాఠశాలల నిర్వహణ విషయంలో మా నాన్నగారికి మంచిపరిఙ్ఞానమూ నైపుణ్యమూ‌ ఉన్నాయని జిల్లావ్యాప్తంగా మంచి పేరు ఉండేది. అప్పుడప్పుడూ ఆయన పిలుపు మేరకు నాన్నగారు పరిషత్ కార్యాలయానికి కాకినాడ వెళ్ళిన సందర్భాల్లో‌ కొన్ని సార్లు ఆయన వెంట నేనూ‌ ఉన్నాను - అక్కడ నాన్నగారికి కార్యాలయంలో చాలా ఆదరణా పలుకుబడీ ఉండేవన్నది నా ప్రత్యక్షానుభవం పైన తెలిసిన సంగతులే.

పిల్లల చదువుల నిమిత్తం తాను చదువుకొన్న ఊరు కొత్తపేటకే వచ్చి నాన్నగారు స్థిరపడినట్లున్నా ఉద్యోగికి బదిలీలు తప్పవు కదా. ఇప్పటికి తప్పదని నాన్నగారికి రంపచోడవరం బదిలీ చేసారు. అదొక సమస్యాత్మకమైన ఉన్నత పాఠశాల. పిల్లల్లో ముఠాలూ టీచర్లలో ముఠాలుగా పరిషత్తువారికి అదొక తలనొప్పి ఐపోయిందట. బహుశః మా నాన్నగారి సలహామేరకే అక్కడి స్టాఫ్ అందరినీ చెల్లాచెదరుగా బదిలీలు చేసి కొత్త స్టాఫ్ ఏర్పాటు చేసారు. ప్రధానోపాధ్యాయులుగా నాన్నగారు బదిలీ మీద వెళ్ళారు.

రంపచోడవరం చేరేనాటికి నా అమలాపురం చదువు పూర్తి కావటంతో డిగ్రీ చేతికి వచ్చి నేను ఉద్యోగప్రయత్నాలు మొదలు పెట్టాను. టైప్ రైటింగ్ లోయర్ పరీక్షలకు సిధ్ధంగా ఉన్నా ఆ బదిలీ‌కారణంగా పరీక్షలు ఇవ్వటం వాయిదా వేసుకోవలసి వచ్చింది. మాకు అక్కడ ఒక క్వార్టర్స్ ఇచ్చారు. దాంట్లో కరంటు సదుపాయం‌ లేదు! ఆ ఊరికి వార్తాపత్రికలు‌ సమయానికి వచ్చేవి కావు ఆరోజుల్లో. నా ఉద్యోగప్రయత్నాలు కొంచెం‌ నింపాదిగానే సాగుతున్నాయి. అప్పటికే జిల్లాపరిషత్తులో అన్‌ట్రైన్‌డ్ టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు పంపుకున్నాను. పత్రికల్లో వచ్చిన వాటికీ దరఖాస్తులు పంపుతున్నాను. ఏ ప్రయత్నాలూ  ఫలోన్ముఖం కాక నిరాశగా ఉండేది.

నేను కొత్తపేటలో ఉన్నప్పుడు ఎలా మా మాతామహుల ఇంటికి దాదాపు ప్రతి వేసవిసెలవుల్లోనూ వెళ్ళి వచ్చేవాడినో అలాగే రంపచోడవరంలో ఉన్నా వెళ్ళాను. నేను వెళ్ళేది ముఖ్యంగా నాకు ప్రాణసమానురాలైన మా బేబీపిన్నిని చూడటం‌ కోసమే.

అలా వెళ్ళిన ఒక సందర్భంలో ఒకనాడు అక్కడికి లక్ష్మీనారాయణగారు వచ్చారు. వారి సోదరి ఇల్లే‌ కదా. నిజం చెప్పాలంటే కొంచెం‌ బియ్యం‌ వగైరా అడగటానికే అయన ఆరోజున వచ్చారు. ముందుగదిలో నేనూ బలరామకృష్ణులూ‌ ఉన్నట్లున్నాం. వాళ్ళు నా మేనమామలు - నాకంటే చిన్నవాళ్ళు.  లక్ష్మీనారాయణగారు వచ్చి మాతో కబుర్లు వేసుకున్నారు.

మా బేబీపిన్ని వచ్చి నన్ను లోపలికి పిలిచింది ఏదో‌ పనిమీద. ఈలోగా ఈయనే పలకరించారు నన్ను.

ఉన్నట్లుండి నీ డిగ్రీ‌ అయ్యింది కదా ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నావా ఎక్కడన్నా అంటూ నా చేయి అందుకొని పరిశీలించటం‌ మొదలు పెట్టారు. నేను కూడా అయన నా చేయి చూసి ఏమి చెబుతారా అని ఎదురు చూస్తున్నాను. ఆయన చెప్పేదేదో విన్నాక లోపలికి వెళ్ళవచ్చు కదా అనుకున్నాను.

ఫలానా బాంక్ వాళ్ళ పరీక్షలు వ్రాసానండీ అని చెప్పాను ఆయనకు. 'అదేమీ‌ కలిసిరాదులే. నీకు ఏదో టెక్నికల్ లేదా సైన్సు  సైడ్ జాబ్ వస్తుంది మూడు నాలుగు నెలల్లోనే ఏదో‌ పెద్ద చోటే' అన్నాడాయన.

నేను కొంచెం‌ తరచి అడగబోయాను.

ఇంతలో లోపల వంటగదిలో నుండి మా అమ్మమ్మగారి కంఠం గర్జించినట్లే వినిపించింది. 'ఒరే శ్యామలరావూ లోపలికిరా అర్జంటుగా' అని. నేను వస్తున్నానా లేదా అని చూడటానికి కాబోలు మా బేబీపిన్ని వచ్చి తొంగిచూసింది కొంచెం‌ కోపంగా.

నేను లోపలకు వెళ్ళగానే చీవాట్లు పడ్డాయి 'నీకు బుధ్ధుందా లేదా?' అని.

నాకేమీ‌ అర్థం కాలేదు. మా అమ్మమ్మగారే కొంచెం శాంతించి 'వాడికి చేతులూ‌ జాతకాలూ చూపించద్దు ఎప్పుడూ.  వాడి నోరు మంచిది కాదు. కాస్సేపు ఇక్కడే కూర్చో అన్నది. అప్పుడర్థమైంది ముందే బేబీపిన్ని ఎందుకు లోపలికి పిలిచిందో.  మాట్లాడకుండా వంటిట్లోనే కూర్చున్నాను ఆయన బయటకు వెళ్ళేదాకా.

తరువాత మా అమ్మమ్మగారింట్లో నేను తెలుసుకున్నది ఏమంటే లక్ష్మీనారాయణగారు మంచి విద్వత్తు కలవాడే కాని నోటి ఏది అనిపిస్తే ఫెడీఫెడీ మని అనెయ్యటమే‌ కాని అవతలవాళ్ళు ఏమనుకుంటారూ ఇలా చెప్పవచ్చునా అన్నది ఆలోచించి చూసే మనిషి కాదు. ఎప్పుడూ ఏవో అపశకునం‌ మాటలే చెబుతూ‌ ఉంటాడు.  ఆయన కేదో దిక్కుమాలిన వాక్శుధ్ది లాంటిదేదో ఉన్నట్లుంది. తరచుగా అయన మాటలు అక్షరాలా జరుగుతాయి. అందుచేత ఆయన నోటి మాటకు భయపడి ఎవ్వరూ అయనతో‌ జ్యోతిషవిషయాల్లో సంప్రదించరు. అందుకే కాబోలు లౌక్యంగా ప్రియోక్తులు పలకటం చేతకాని ఆయన విద్యకు రాణింపు లేకుండా పోయింది.

అప్పుడు నాకు అర్థమైంది. ఆరోజున మా అమ్మగారు ఎందుకు మా నాన్నగారిని అంతగా వారించటానికి సంఙ్ఞలు చేసారా అన్నది.

ఏదైతే నేమి అదంతా గతం.

కాని ఈ సారి ఐతే ఆయన అయాచితంగా ఒక జోస్యం చెప్పాడు నాకు. నేను ఆశలు పెట్టుకొన్న బాంక్ జాబ్ రాదు పొమ్మని. అది చివరికి నాకు రానేలేదు. ఆ బాంక్ పరీక్షలకోసం నేనూ నా సహాధ్యాయి ఎఱ్ఱాప్రగ్గడ కొప్పేశ్వర ప్రసాదూ విజయవాడ వెళ్ళి పరీక్షలు వ్రాసాం. తరువాత కాలంలో అతను చెప్పిన మాట ఏమిటంటే విజయవాడ సెంటరు నుండి ఒక్కరంటే ఒక్కరూ‌ ఎంపిక కాలేదట.

ఇకపోతే లక్ష్మీనారాయణగారు చెప్పిన అయాచిత జోస్యంలో రెండవభాగం ఉంది. కాని అదెలా నిజమయ్యేనో తెలియటం లేదు నాకు. అలా మరొక మూడు నెలల కాలం గడిచింది.

ఉన్నట్లుండి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ నుండి ఒక ఉత్తరం వచ్చింది హైదరాబాద్‌లో ఉన్న ఇ.సి.ఐ.యల్ కంపెనీలో ఉద్యోగానికి వ్రాతపరీక్షకు వెళ్ళమని.

మొత్తం 650మంది పైగా దేశవ్యాప్తంగా అభ్యర్ధులు ఆ వ్రాతపరీక్షకు హాజరైతే అందులో ఒక 28మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. చివరికి ఎంపికైనది కేవలం 8మందిమి. అందులో మొదటి వాడిని నేను. మొదటి నలుగురినీ మాత్రం కంప్యూటర్ గ్రూప్‌లో జాయిన్ చేసుకున్నారు. నాతో‌పాటి చావలి నరసింహం, హోతా జానకీదేవి, సుబ్బారావు అనే ముగ్గురు ఎంపికయ్యారు కంప్యూటరు గ్రూపులో చేరటానికి.  అక్కడ ఒక సంవత్సరం‌పాటు కంప్యూటర్ సైన్సూ ప్రోగ్రామింగూ‌ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డాను. అలా లక్ష్మీనారాయణగారి జోస్యంలో రెండవ భాగమూ పూర్తిగా సత్యంగా తేలింది.


(ఐదవభాగం రేపటి టపాలో)


21, జూన్ 2016, మంగళవారం

ఫలించిన జోస్యం - 3 (శ్రీనివాసుడి కథ)

( మొదటిభాగం రెండవభాగం )

 చిన్నపిల్లలను కొందరు ఇట్టే చేతుల్లోనికి తీసుకొని ముద్దుచేస్తూ‌ ఉంటారు.

నాకైతే అతిసున్నితంగా ఉండే చిన్నపిల్లలను చేతుల్లోనికి తీసుకోవటం అంటే చాలా సంకోచం. నిజం చెప్పాలంటే చచ్చేంత భయం. ఎక్కడ కొంచెం గట్టిగా పట్టుకుంటానో వాళ్ళకి ఎక్కడ నొప్పికలుగుతుందో అని నా అనుమానం. అందుచేత వాళ్ళను చూసి సంబరపడటమే కాని ఎత్తుకోవటం నావల్ల కాదు.

మా తమ్ముడు రామానికి (సత్యశ్రీరామచంద్రమూర్తికి) అలాంటి సంకోచాలేమీ‌లేవు. వాడికి పిల్లలంటే అందరిలాగా ముద్దే. శ్రీనివాసుణ్ణి ఎత్తుకొని తిరుగుతూ తెగసంబరపడేవాడు.

మా చెల్లెళ్ళ సంగతి చెప్పనే అక్కరలేదు. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూడటం ఆడపిల్లలకి వెన్నతో పెట్టిన విద్య కదా.

శ్రీనివాసుడి ఆటపాటలతో - అంటే అటలు వాడివే అనుకొండి, పాటలు మావి అన్నమాట. వాటితో క్రమంగా లక్ష్మీనారాయణగారి జోస్యం సంగతి మరుగున పడింది. నిజానికి నేనైతే మరచిపోయానేమో క్రమంగా.  బహుశః చదువుసంధ్యల హడావుడి కారణంగా కావచ్చును.

కానీ మా నాన్నగారు మరచినట్లు లేదు.

శ్రీనివాసుడికి ఎనిమిదవ నెల దగ్గరకు వస్తోంది జాగ్రత్తగా ఉండాలీ అని ఒకరోజున నాన్నగారు నాతో‌ అన్నప్పుడు నాకు మరలా జోస్యం విషయం స్ఫురణకు వచ్చింది.

మా యింటి ప్రక్కవాటాలో వక్కలంక నరసింహమూర్తిగారని మరొకాయన అద్దెకుండేవారు ఆరోజుల్లో. ఆయన హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. నిజానికి వాళ్ళు మాతో పాటు అదే ఇంట్లో చాలా కాలమే అద్దెకున్నారు. మా రెండుకుటుంబాల మధ్య స్నేహసంబంధం బాగానే ఉండేది.  ఆయన భార్యగారి పేరు పద్మావతి గారు. వారి అబ్బాయిలు గోపాలరావు (గోపీ), ప్రకాశరావు (ప్రకాశ్) ఇద్దరూ నా కంటే కొద్దిగా చిన్నవాళ్ళు. వాళ్ళమ్మాయి సావిత్రి నాకంటె చాలా చిన్నది. వక్కలంకవారికి ఈ కథా కాలానికి ఇంకా నాలుగవ సంతానం పుట్టలేదు. తరువాత జన్మించాడు. ఆ అబ్బాయి పేరు సీతారామ్. అతను చక్కగా కీర్తి తెచ్చుకున్నాడు. సితారా అని పేరుతో వ్రాసూ ఉంటాడని మా తమ్ముడు రామం చెప్పాడు. ఆఖరి అబ్బాయి మేము కొత్తపేటను విడిచి వెళ్ళిన తరువాత జన్మించాడు. సత్తిబాబు అంటాం అతణ్ణి.

ఈ వక్కలంక నరసింహమూర్తి గారిని ఈ విషయమై నాన్నగారు సంప్రదించారేమో అనుకుంటున్నాను. నాకైతే స్వయంగా తెలియదు.

నాన్నగారు ఊళ్ళో ఉన్న వైద్యశిఖామణులిద్దరినీ‌ సంప్రదించారు. అది మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే రెండుచోట్లకూ ఆయనతో వెళ్ళింది నేనే కాబట్టీ అక్కడ జరిగిన సంభాషణలకు నేను ప్రత్యక్షసాక్షిని కాబట్టీ.

వారిలో ఒకాయన పేరు అంబారుఖానా శ్రీరామమూర్తిగారు. ఆయనా ఆయన తమ్ముడు భగవంతరావు గారూ కలిసి ఆయుర్వేదవైద్యం చేసేవారు. భగవంతరావుగారైతే మానాన్నగారికి క్లాసుమేటు కూడా. మా కుటుంబానికి ముఖ్యవైద్యులు శ్రీరామమూర్తిగారే. అన్నదమ్ములు కలిసే వైద్యం నడిపించినా, బోర్డూ ప్రాక్టీసూ అంతా అన్నగారు శ్రీరామమూర్తి గారి పేరు మీదే ఉండేది. పేరుకు ఆయుర్వేద వైద్యం ఐనా ఇదం బ్రాహ్మ్యం - ఇదం‌ క్షాత్రం అన్నట్లు ఆయుర్వేదమూ ఇంగ్లీషు వైద్యమూ‌ రెండూ చాలా చక్కగా చేసేవారు. ముఖ్యంగా పేదసాదలకు అక్షరాలా ఉచితంగానే వైద్యం చేసేవారు. మంచి కీర్తిమంతులు ఊళ్ళో. ఇద్దరూ బలరామకృష్ణులో రామలక్ష్మణులో అన్నట్లుండే వారు. అన్నదమ్ములు కలిసి ఊరిచివరన ఉన్న శ్రీరామమూర్తిగారు నిర్మించిన భవంతిలోనే ఉండేవారు. కథకు అవసరం లేకపోయినా వాళ్ళ ప్రసక్తి వచ్చింది కాబట్టి లోకరీతి ఎలా ఉంటుందన్నదానికి ఉదాహరణకోసం చెప్పక తప్పటంలేదు. కాలాంతరంలో శ్రీరామమూర్తిగారు పరమపదించాక భగవంతరావుగారికి నిలువనీడకూడా లేక కేవలం కట్టుబట్టలతో మిగిలింది ఆయన కుటుంబం! మిగతా విషయం అంతా చదువరులు ఆలోచించి అర్థంచేసుకో గలరు! నేను ఎక్కువగా విశదీకరించలేను. ఆ రెండు కుటుంబాలూ ఇప్పటికీ‌ మాకు ఆప్తులే.

ఆ ఊళ్ళో మరొక వైద్యులు ఇరగవరపు సుబ్రహ్మణ్యం గారు. ఈయన పక్కా యం.బి.బి.యస్ డాక్టరు. బహుశః ఊళ్ళో మొదటి ఇంగ్లీషు డాక్టరు (అలానే అనేవారు ఆరోజుల్లో) కాశిన చిన్నంరాజు గారు. ఈ‌ చిన్నంరాజుగారి తమ్ముడి కుమారుడు నాకు క్లాసు మేట్. మంచి జోరు మీద ఉండేది చిన్నంరాజు గారి వైద్యం. తలనొప్పి అంటే తొమ్మిది పదిమందులకు తక్కువ కాకుండా రాసి ఇచ్చేవారు ఆయన - ఈ మాట అక్షరసత్యం - నేను ప్రత్యక్షంగా చూసిన సంగతి కాబట్టి. ఆయన స్వంతంగా హాస్పిటల్ కమ్‌ నివాసభవనం కట్టుకొని వెళ్ళిపోయాక ఆ వసతిలో ఈ‌రెండవ డాక్టరు సుబ్రహ్మణ్యం గారు వచ్చి అంతకంటే జోరు ప్రాక్టీసు అందుకున్నారు. చిత్రంగా చిన్నంరాజు గారి పని పూర్తిగా ఖాళీ‌ అయ్యింది! స్థానబలం అని ఉంటుంది సుమా అంటా రందుకే అనిపించేది.  ఈ ఇరగవరపు సుబ్రహ్మణ్యం గారు మాకు కొంచెం దూరపు బంధువులు కూడా. ఏ విధంగా అన్న వివరం ఇప్పుడు నాకు గుర్తు లేదు.

ఆ రోజన శ్రీనివాసుడికి ఎనిమిదవ నెల వచ్చింది. ఎప్పటిలాగే ఆరోగ్యంగా కిలకిల లాడుతూ‌ ఉన్నాడు.

ఆ రోజు ఆదివారం. కాబట్టి అందరమూ‌ ఇంట్లోనే ఉన్నాం.

సాయంత్రం ఆరు గంటయ్యింది.

ఏడు గంటలు కూడా కావస్తోంది.

నాకూ‌ నాన్నగారికీ ఇంక ఫరవాలేదు అన్న భావం‌ కలిగింది. ఒకరితో‌ ఒకరం ఈ‌అభిప్రాయం పంచుకున్నాం‌ కూడా.  శ్రీనివాసుడికి ఏ అనారోగ్యచిహ్నాలూ లేవు. హాయిగా ఆడుకుంటూనే ఉన్నాడు.

ఉన్నట్లుండి పిల్లవాడికి వరుసగా విరేచనాలు వెళ్ళాయి.

అందరం చాలా కంగారు పడ్డాం.

వెంటనే అందుబాటు దూరంలోనే ఉన్న శ్రీరామమూర్తిగారికి కబురు వెళ్ళింది. అత్యవసరంగా రావాలని. డాక్టరు వద్దకు పరుగెత్తింది నేనా మరొకరా అన్నది గుర్తు లేదు సరిగా.

ఆరోజుల్లోనే మోటారు సైకిల్ మీద తిరిగేవారు శ్రీరామమూర్తిగారూ ఆయన తమ్ముడు భగవంతరావుగారూ. ఒక డాక్టరు గారు రిక్షాను పిలిపించుకొని అది వచ్చిన తరువాత రోగులను చూడటానికి వెళ్ళే సరికి కాలాతీతం ఐపోతుంది కదా అప్పుడప్పుడూ. అందుకని ఆయనా ఆయన తమ్ముడూ కూడా తమ మోటారు సైకిళ్ళమీదే రోగుల ఇళ్ళకు వెళ్ళి వైద్యం చేసేవారు.

క్షణాలమీద అన్నట్లుగా భగవంతరావుగారు బండిమీద వచ్చి వాలారు.

వెంటనే వివరాలు అడిగి వైద్యం‌ మొదలు పెట్టారు. ఒకటో రెండో ఇంజక్షన్లు ఇచ్చారు.  అప్పటికే శ్రీనివాసుడి పరిస్థితి బాగోలేదు. చాలా నీరసించి ఉన్నాడు.

భగవంతరావుగారు పెదవి విరచారు.

క్షణాలమీద పిల్లవాడి పరిస్థితి విషమించింది.

పద్మావతిగారూ మాఅమ్మగారూ పిల్లవాడి ఒళ్ళు నిమురుతూ పరిశీలిస్తున్నారు దిగులుగా.

కొద్ది సేపటికే చిన్ని శ్రీనివాసుడు పెద్ద శ్రీనివాసుడి దగ్గరకు వెళ్ళిపోయాడు.

నేను అక్కడనే మా అమ్మగారి ప్రక్కనే ఉన్నాను. ఒకటి రెండు అడుగుల దూరంలో మరొక ప్రక్కన మా తమ్ముడు రామం ఉన్నాడు.  ఎందుకో తెలియదు నాకు కళ్ళవెంట చుక్కనీరు కూడా రాలేదు ఎంతో విచారం కలిగినా! రామం ఐతే బావురుమన్నాడు పిల్లవాడిని ఆ గదినుండి బయటకు తీసుకొని వెళుతుంటే.

అప్పటికే చీకట్లు బాగా ముసురుకున్నాయి.

మా బామ్మగారు ఇంటి అరుగుదిగి, పిల్లవాడిని కాళ్ళమీద ఉంచుకొని మౌనంగా కూర్చున్నారు.

మా నాన్నగారికి ఇంకా ఏమూలో ఆశ కొట్టుమిట్టాడుతోంది.

ఒళ్ళు వేడిగానే ఉంది కదండీ అని నరసింహమూర్తిగారితో అన్నారు.

ఆయన ఓదార్చుతూ, 'మందుల వేడి అండీ. అంతే.' అన్నారు రుద్ధకంఠంతో.

నాన్నగారు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.  ఆయన చీకట్లో అరుగుక్రింద ఉన్నారు కాబట్టి ఆయన ముఖంలోని భావాలు నాకు తెలియరాలేదు.

మా అమ్మగారి ముఖం చూడటానికి నాకు ధైర్యం చాలలేదు. నేను అరుగుమీదే నిలబడి మమ్మల్నిలా అర్థాంతరంగా వదలి వెళ్ళిపోయిన పిల్లవాడి కేసే విచారంగా చూస్తూ ఉండిపోయాను.

చాలా సేపటి తరువాత మా బామ్మగారికి ఇంటిలోపలికి రావటానికి వీలయ్యింది.

అప్పడు ఆవిడకి స్ఫురించింది. ఎవరికీ ఆకళ్ళు లేకపోయినా పిల్లలు అభోజనంగా ఉదయం వరకూ ఉండలేరని. అందుకని లేచి ఏదో గబగబా వండి వడ్డించింది పిల్లలకి. ఎంతో ఓదార్చి బ్రతిమాలితే కాని పిల్లలెవరూ కూడా భోజనాలకు రాలేదు.

కంచంలో వడ్డించిన పదార్థాలు చూడగానే రామం అంతెత్తున ఎగిరాడు. మా తమ్ముడు చచ్చిపోయి మేం ఏడుస్తుంటే నువ్వు పప్పు వండుతావా అని పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు. ఆవిడ త్వరగా సిధ్ధం అవుతుందని పెసరపప్పు వండారు. తప్పు కాదు. కాని మాకలా అనిపించలేదు అప్పుడు. ఆవిడ చాలా కష్టపడి మాకు నచ్చజెప్పవలసి వచ్చింది.

మరునాడు నాకు కాలేజీకి అమలాపురం వెళ్ళక తప్పని పరిస్థితి. ఆ సోమవారం నుండి ఏవో పరీక్షలు మొదలు మరి.  మా నాన్నగారూ నేనూ కూడా పెద్దగా మాట్లాడు కోలేదు. ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేని మానసికస్థితి ఇద్దరిదీ. మా నాన్నగారు గంభీరులు స్వభావరీత్యా.  ఆయన కండ్లవెంట నీళ్ళు కారటం ఎన్నడూ చూడలేదు నేను. అయన విచారంగా ఉండిపోయారంతే, మిగతా అందరూ ఎంతో వ్యసనపడుతూ ఉన్నా.  ఆయన బాగా డీలా పడ్డారు కాని నాతో మాత్రం 'ధైర్యంగా ఉండు, పరీక్షలు బాగా రాయి' అన్నారంతే. మా నాన్నగారి పోలికే వచ్చిందేమో నాకళ్ళవెంటా ఒక్క బొట్టూ రాకపొవటానికి.

కాళ్ళీడ్చుకుంటూ బస్సు స్టాండుకు వెళ్ళి బస్సెక్కి కూర్చున్నాను. కొద్ది నిముషాల తరువాత మా స్నేహితుడు కన్నబాబు అమ్మగారూ చెల్లెలు ప్రసూనా వచ్చి నా ముందు వరుసలో కూర్చున్నారు. ఆ కుటుంబమూ మాకు బాగా ఆత్మీయులే. వారు కందుకూరి వారు. కన్నబాబు అనబడే వీర వేంకట సత్యనారాయణ నా క్లాస్ మేట్ బెంచ్ మేట్ స్కూల్లో. అతని తండ్రి  భాస్కరం గారు స్టేట్‌ బ్యాంక్ ఉద్యోగి. ఆయన మా నాన్నగారికి క్లాస్ మేట్ బెంచ్ మేట్ వాళ్ళ స్కూల్ రోజుల్లో. వాళ్ళింట్లో నేను యధేఛ్ఛగా వాళ్ళబ్బాయిలాగే మసిలే వాడిని. వాళ్ళింట్లోనే అప్పుడప్పుడూ భోజనం చేసేవాడిని. మాయింటికి వాళ్ళిల్లు కూతవేటు దూరంలోనే ఉండేది.

నేనూ వాళ్ళూ ఒకే‌ బస్సులో ఉన్నాం కొంచెం వెనుక ముందు సీట్లల్లో. కాని తమాషా ఏమిటంటే వాళ్ళు నన్ను గమనించనే లేదు. లేకపోతే తప్పకుండా పలకరించే వారు. ఒకవేళ వాళ్ళేదన్నా శుభకార్యానికి హాజరవటానికి అమలాపురం వెడుతున్నారేమో.  అందుచేత ఆ సమయంలో పరామర్శలూ అవీ తప్పు అనుకుని మౌనంగా ఉండిపోయారేమో. ఏదైనా కావచ్చు. కాని నా అభిప్రాయంలో ఐతే వాళ్ళిద్దరూ నన్ను నిజంగా గమనించలేదు. హడావుడిగా బస్సు బయలుదేరుతుండగా వచ్చి ఎక్కిన వాళ్ళు వెనుక  సీటులో విచారంగా కూర్చున్న అబ్బాయిని గమనించకపోవటంలో అశ్చర్యం ఏమీ లేదు కదా. కాని నిజం చెప్పాలంటే ఆనాడు అలా అలోచించానా అంటే లేదనే చెప్పాలి నిజాయితీగా. కొంచెం‌ మనస్సు కష్టపెట్టుకున్న మాట వాస్తవం. సరే శాఖాచంక్రమణం వదిలేద్దాం.

ఆ విధంగా శ్రీనివాసుడు మా కళ్ళ ముందు నుండి మా జ్ఞాపకాల్లోనికి జారిపోయాడు.

నాకైతే వాడు ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని మిగిల్చాడు తన స్మృతి చిహ్నంగా.

ఎప్పుడూ నేను చిన్నపిల్లల్ని ఎత్తుకోనన్నది చెప్పాను కదా.  వాడి విషయంలో మిహాయింపు ఇవ్వవలసి వచ్చింది ఒకసారి - అదే నాకు మిగిలిన గుర్తు.

ఒక రోజున మధ్యాహ్నం ముందుగదిలో వాడు చిన్నమంచం మీద నిద్రపోతున్నాడు. కొంచెం దూరంలో నేను చాపమీద కూర్చుని చదువుకుంటున్నాను.  ఎందుకనో ఒకసారి తలఎత్తి వాడికేసి చూద్దును కదా మంచం అంచుదాకా వచ్చేసాడు దొర్లుకుంటూ. ఈ క్షణమో మరుక్షణమో క్రిందకు పడిపోతాడన్నట్లున్నాడు. నేను ఒక గంతు వేసి వాడిని పైకితీసి ఎత్తుకొని ప్రక్కసరిచేసి జాగ్రత్తగా మంచం మధ్యలో పడుకోబెట్టాను.

బాబులు గారి జోస్యం అంతా కోరుకున్నట్లే చక్కగా ఫలించి మేము నలుగురు అన్నదమ్ముల మయ్యాం. కాని లక్ష్మీనారాయణ గారి జోస్యం కూడా మేము ఎంత వద్దువద్దని దణ్ణాలు పెట్టుకున్నా నిర్దాక్షిణ్యంగా ఫలించి అప్పట్లో మళ్ళా ముగ్గురమయ్యాం.

ఈ దీర్థకథనం ప్రారంభించిన నాటి మొన్నటి రాత్రి నిద్రాసమయంలో శ్రీనివాసుడిని గురించి తలచుకుంటుంటే ఆశ్చర్యంగా నా కళ్ళు చెమర్చాయి. డాంబికం వదలి చెప్పాలంటే బాగానే దుఃఖపడ్డాను.

ఏ కథను చెప్పే విషయం‌లో ఐనా మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని అని చెప్పమన్నారు. కాని వాస్తవ జీవిత సంఘటనలను చెప్పేటప్పుడు అంతా అలా ఉంటుందా?  రామాయణంలో సీతాపహరణం లేదా? మంచి చెడ్డలూ ఆశనిరాశలూ తప్పవు జీవితం అన్నాక. అలాగని నైరాశ్యంలో మునిగిపోతే జీవితం భరించశక్యంగా ఉంటుందా చెప్పండి?  ఇది చదివి ఎవరైనా మనస్సు కష్టపెట్టుకుంటే క్షమించండి. ముందు ముందు కథ మంగళయుతంగానే ఉంటుంది లెండి.

(నాలుగవ భాగం రేపు మీ ముందుకు వస్తుంది) 


 

20, జూన్ 2016, సోమవారం

ఫలించిన జోస్యం - 2 (లక్ష్మీనారాయణ గారి జోస్యం)

( మొదటిభాగం)

 బాబులు గారి జోస్యం ఫలించింది!

శ్రీతాడిగడప వేంకట సత్యనారాయణ గారికి చతుర్ధపుత్రుడు జన్మించాడు. ఆయన సంతోషానికి మేరలేదు. పిల్లవాడికి బారసాల ఘనంగా జరిపి ఆనాడు వాడికి శ్రీనివాసుడని నామకరణం చేసాం.

రోజులు సంతోషంగా గడిచి పోతున్నాయి. పిల్లవాడు దిన దిన ప్రవర్థమాను డవుతున్నాడు.

కొవ్వూరు నుండి ఒకరోజున కేశిరాజు లక్ష్మీనారాయణ గారు మాయింటికి వచ్చారు.  మా మాతామహుల కుటుంబం కొవ్వూరులోనే ఉంటుంది. ఈ కేశిరాజు లక్ష్మీనారాయణ గారు మా అమ్మమ్మ కామేశ్వరమ్మ గారికి స్వయంగా సహోదరుడు. మా తాతగారు పాలకోడేటి భీమశంకరం గారిది మధ్యతరగతి కుటుంబం. ఆయన బావమరది ఈ‌ లక్ష్మీనారాయణగారిది దిగువ మధ్యతరగతి కుటుంబం కూడా కాదు. అప్పట్లో వారి కుటుంబం చాలా బీదరికంలో ఉండేది.

ఒక్కొక్క జీవితం అంతే. ప్రతిభావంతుడైన వాడికి రాణింపు యేమీ ఉండదు. వారు చేసే ప్రయత్నాలూ పెద్దగా ఫలించవు. కారణం విధినిర్ణయం అను కోవలసిందే.

ఈ లక్ష్మీనారాయణ గారి తండ్రి  కేశిరాజు సీతారామయ్య గారు. ఆయన మంచి కవి. శృంగారశాకుంతలం అని అద్భుతమైన అచ్చతెలుగు కావ్యం వ్రాసారు. అప్పట్లో దానికి మంచి పేరు వచ్చిందా లేదా అన్నది నాకు తెలియదు. కాని దానిలో మధునాపంతుల సత్యనారాయణ కవిగారు వ్రాసిన ప్రశంసా వాక్యాలున్నాయి. అన్నట్లు ఆకావ్యంలో ఉన్న అద్భుతమైన వృషభగతి రగడను నేను ఈ‌బ్లాగులో లోగడ ప్రచురించాను కూడా.

సీతారామయ్యగారి కుమారుడైన లక్ష్మీనారాయణ గారు కూడా మంచి పండితులు సంస్కృతాంధ్రాల్లో. కాని ఆయనకు ఏ డిగ్రీలూ‌ బొగ్రీలూ‌ లేవు. అవుంటే కాని మనదేశంలో దొరతనం వారు పండితుణ్ణి పండితుడిగా గుర్తించరు. అవుంటే కాని ఏ మంచి ఉద్యోగమూ దొరకదాయె.

లక్ష్మీనారాయణగారి సంస్కృతపాండిత్యం గురించి ఈ కథాకాలంలో కాక అనంతరం కొన్నేళ్ళకు నాకు ప్రత్యక్షానుభవం అయ్యింది.  మా పెద్ద మేనమామ గంగాధరం గారి వివాహానికి మేమంతా విజయనగరం వెళ్ళాం. అక్కడ ఎవరో కాలక్షేపం కబుర్లలో కొంచెం కాళిదాసు గురించో శాకుంతలం గురించో ఏదో తెలిసీ‌తెలియకుండా అనటం జరిగిందని గుర్తు. అంతే లక్ష్మీనారాయణగారు చెలరేగిపోయారు. ఒక గంట పైచిలుకు సమయం కాళిదాసు గొప్పదనం గురించీ శాకుంతల కథావైశిష్ట్యం గురించి సాధికారికంగా ఎన్నెన్నో శ్లోకాలు వగైరా ఉటంకించి వివరిస్తూ గొప్పప్రసంగం చేసారు. అందరూ ముగ్ధులై పోయారని చెప్పటంలో ఏమీ అతిశయోక్తి లేదు.  మా రెండవమేనమామ జగన్నాథరావు ఈ సంఘటనకు మరొకప్రతక్షసాక్షి. ఆయన అప్పట్లో విద్యాప్రవీణ చదువుతూ ఉండేవాడు కొవ్వూళ్ళోనే.

అంతటి పండితుడి తలరాత ఆయనను పరమబీదరికంలోనే ఉంచింది. కొవ్వూరులో ఒక సంస్కృతకళాశాల ఉంది. ఆ కళాశాల వారు ఈయనకు ఉపకారం చేయాలని చివరికి ఆయన్ను అటెండరుగా నియమించుకున్నారు.

ఈ లక్ష్మీనారాయణగారు సంస్కృతాంధ్రాల్లోనే కాదు, జ్యోతిషంలో కూడా దిట్ట.

ఈ సంగతి మా అమ్మగారికి తెలుసునేమో‌ కాని మా నాన్నగారికి తెలియదు.

భోజనాదికాలు అయ్యాక ఇంతకీ ఆయన మాయింటికి వచ్చిన కారణం చెప్పారు. శృంగారశాకుంతలం కాపీలు కొన్ని మానాన్నగారు తమ స్కూలుచేత కొనిపిస్తారేమో అన్న ఆశతో వచ్చారట.  పుస్తకం ఖరీదు కేవలం‌ 2 రూపాయలు. మా నాన్నగారు ఆ బీదబ్రాహ్మడికి సాయం చేయాలని రేపు హెడ్మాష్టరు గారితో మాట్లాడి వీలైతే పది కాపీలు తీసుకుంటాం లెండి అని చెప్పారు.  మరీ ఎక్కువ కాపీలు కొంటే విద్యశాఖవారి డి.యీ.వో కు రేపు సమాధానం చెప్పటం‌ కుదరదు కదా.

మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో ఆయన కాస్త ప్రక్క వాలుస్తారేమో అనుకున్నాం. కాని ఆయన అలా చేయలేదు. మా తమ్ముడు పసివాడు శ్రీనివాసుడిని ముద్దు చేస్తూ ఉన్నారు.

ఉన్నట్లుండి, అబ్బాయి జాతకం వేయించారా అని అడిగారు లక్ష్మీనారాయణగారు.

మా నాన్నగారు ఇంకా లేదండీ అన్నారు.

మా అమ్మగారు ఎందుకనో  మా నాన్నగారిని వారిస్తూ‌ సంఙ్ఞలు చేస్తున్నారు. మంచి జ్యోతిషపండితుడి చేత పిల్లాడికి జాతకం వ్రాయించే ఉత్సాహంలో మా నాన్నగారు ఆ సంగతి గమనించుకోలేదు. ఈ విషయం నేనూ గమనించాను. తరువాతి కాలంలో మా అమ్మగారు కొన్నిసార్లు ఈ విషయం నా ముందు ప్రస్తావించారు కూడా.

పిల్లవాడి జననసమయాదులు మా నాన్నగారు ఆయనకు చెప్పగానే ఒక పెద్ద తతంగం మొదలయ్యింది. అప్పట్లో ఈ‌రోజుల్లో‌లాగా కంప్యూటరు జాతకాలు వగయిరాలు లేవు కదా. పాతకాలం వాళ్ళందరూ పంచాంగం సహాయంతోనే‌ ఋక్షాద్యంతాలమీద త్రైరాశికాలు చేసుకుంటూ జాతకచక్రాన్ని తయారు చేసుకొనే వాళ్ళు. అపైన ఏతత్కాలప్రవర్తమాన చంద్రయుక్త నక్షత్రం  ఆధారంగా వింశోత్తరీ దశాగణనం చేసే వారు. కాలుక్యులేటర్లూ వగైరాలు లేని రోజులు కాబట్టి అన్ని గుణకారభాగహారాదులూ చచ్చీచెడీ‌ చేతిలెక్కల తోనే చేయాలి. జాతకచక్రం వేయటం‌ ఒక విద్యగానే భావింపబడేది ఆరోజుల్లో.

లక్ష్మీనారాయణగారు దానికి ఇది కలుపు, ఇది తీసేయి, ఇది పెట్టి గుణకారం చేయి ఇలా భాగించూ‌ అంటూ ఆఙ్ఞలు  జారీ చేయటమూ నేను ఓపిగ్గా ఆ లెక్కలన్నీ చేస్తూ ప్రతీ గణనమూ ఒకటికి రెండుసార్లు సరిచూసి చెబుతూ‌ ఉండటమూను. ఇదంతా బోలెడంత సేపు చాలా హడావుడిగా నడిచింది.

మా అమ్మగారు మౌనంగా అంతా తిలకిస్తూ ఉన్నారు.

మొత్తానికి జాతకచక్రం వేయటమూ దశాగణనమూ పూర్తయ్యాయి. లక్ష్మీ నారాయణగారు ఆ చక్రాన్ని నిశితంగా పరిశీలిస్తూ చాలా సేపు ఉండిపోయారు.

జాతకం బాగుందయ్యా అన్నారు చివరికి.

మా నాన్నగారికి ఆనందోత్సాహాలు రెట్టింపయ్యాయని వేరే చెప్పాలా?

అబ్బాయి చదువూ‌సంధ్యా అంటూ నాన్నగారు అడగటం మొదలు పెట్టారు.

లక్ష్మీనారాయణగారు ఆ సంగతి చెప్పకుండా నేరుగా మా అమ్మగారితో, అమ్మాయీ మీ కేమైనా పిల్లాడిని దత్తతకు యిచ్చే ఉద్దేశం లాంటి దేమన్నా ఉందా అన్నారు.

మా అమ్మగారు వెంటనే కస్సు మన్నారు.  ఇంకో వందమంది పిల్లలు పుట్టినా హాయిగా పెంచుకుంటానే కాని బొందిలో ప్రాణం ఉండగా దత్తత కివ్వటాలు వంటి పిచ్చిపని ఎంతమాత్రం చేయను అని కొంచెం‌ అరిచి మరీ తెగేసి చెప్పారు.

ఈ‌ పెద్దమనిషి తుసుక్కున ఇలా అడిగాడేమిటా అని మా నాన్నగారు చిన్నబుచ్చుకున్నారు.

లక్ష్మీనారాయణగారు, అమ్మ అలా గద్దించి చెప్పేసరికి కొంచెం‌ నీళ్ళునములుతూ మరేం లేదే అమ్మాయీ, పిల్లాడికి కొంచెం ఇంటికి దూరంగా కొన్నాళ్ళు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఐనా అదేమంత పెద్ద సంగతి కాదులే. నిక్షేపంగా నీపిల్ల వాడేను అని ఓదార్పు మాటలు చెప్పారు. ఐనా మా అమ్మగారు ప్రసన్నురాలు కాలేదు. పిల్లవాడి జాతకంలోని మంచి సంగతులు ఏకరువు పెట్టారు లక్ష్మీనారాయణగారు చాలా సేపు. అవన్నీ బాగున్నాయి.


మరునాడు భోజనం అయ్యాక, మా నాన్నగారు లక్ష్మీనారాయణగారిని స్కూలుకు తీసుకొని వెళ్ళారు.వాళ్ళిద్దరి కూడా నేనూ తోకలాగా వెళ్ళాను. పది శృంగారశాకుంతలం పుస్తకాలకు గాను స్కూలు వారి నుండి  ఇరవై రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఆయన ముఖంలో చాలా సంతోషం కనిపించింది. ఇరవై అంటే అప్పట్లో కూడా మరీ పెద్ద మొత్తం ఏమీ కాదు. అదే మహాభాగ్యంగా అనిపించినట్లుందంటే ఆయన ఆర్థికపరిస్థితిని మనం ఊహించుకో వలసిందే మరి.

స్కూలు నుండి ఇంటికి తిరిగివచ్చాక ఆయన ఆ పూటే బయలు దేరి వెళ్ళిపోయారు. నేనూ మా నాన్నగారూ ఆయన్ను బస్సెక్కించటానికి కూడా వెళ్ళాం. అదొక మర్యాద అంతే. స్వయంగా రాగలిగిన వారు స్వయంగా వెళ్ళలేరని కాదు.

బస్సు స్టాండుకు వెళ్ళే దారిలో లక్ష్మీనారాయణగారు కొంచెం సంశయిస్తూనే మా నాన్నగారితో ఇలా అన్నారు. సత్యనారాయణగారూ, పిల్లాడికి మీ దగ్గర ఉండే యోగం జాతకంలో లేదు. మాతృస్థానం చాలా బలహీనంగా ఉంది. దత్తత యోగమో బాలారిష్టమో అన్నట్లుగా  ఉంది. అందుకని అలా చెప్పాను. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎనిమిదవ నెల దాటితే నేను చెప్పినట్లు పూర్ణాయుర్దాయమే నిశ్చయంగా. కాని ఎనిమిదవ నెల దాటటం అసంభవంగా అనిపిస్తోంది. మొదటిరోజునే గండం‌ పొంచి ఉంది. ఆరోజు దాటటమే అసలు కష్టం. అది దాటితే‌ మిగతా నెల సామాన్యదోషం అనుకోండి. కాని నెలంతా జాగ్రత్తగా ఉండండి.  మీరు నాకెంతో ఉపకారం చేసారు. కాని నేనేమో‌ మీకు మనస్తాపం కలిగే మాటలు చెప్పి వెడుతున్నాను.  ఇలా చెప్పి కొంచెం బాధపడుతూనే ఆయన వెళ్ళిపోయారు.

ఈ మాటలను మా నాన్నగారు నాకు తెలిసి మా అమ్మగారితో ఎన్నడూ చెప్పనేలేదు. ఎందుకూ చెప్పటం? ఆవిడను క్షోభపెట్టటానికి కాకపోతే. అందుచేత మనస్సులోనే మథనపడుతూ‌ ఉన్నా పైకి నిబ్బరంగానే ఉన్నారు. మా నాన్నగారు నాకు ప్రత్యేకంగా హెచ్చరిక ఏమీ చేయలేదు కాని అమ్మకు బాధకలిగించే మాటను చెప్పలేక నేనూ ఎన్నడూ‌ పెదవి విప్పలేదు.

జాతకపండితులు ఏవేవో చెబుతారు కాని వాళ్ళే‌మన్నా సర్వఙ్ఞులా ?

శ్రీనివాసుడు చక్కగా అరోగ్యంగా ఉన్నాడు. 


(మూడవ భాగం కోసం దయచేసి వేచి ఉండండి) 

19, జూన్ 2016, ఆదివారం

ఫలించిన జోస్యం - 1 (బాబులు గారి కథ)

బాబులుగారు మా యింటికి వచ్చారు.

వచ్చారంటే వచ్చారు అనే చెప్పగలను కాని ఆరోజున మాయింటికి ఆయన్ను నేను పిలుచుకు వచ్చానో లేక మానాన్నగారు ముందుగానే చెప్పటం వలన ఆయనంతట ఆయనే వచ్చారో ఈ రోజున సరిగా గుర్తుకు రావటం లేదు.

బాబులుగారు అంటే అయన అసలు పేరు అది కాదు. అయన పేరు తాడిగడప బసవరాజు గారు.

తాడిగడపవారు అన్నాను కాబట్టి మా యింటి పేరే వారిదీ‌ కాబట్టి, ఆయనకూ‌ మాకూ‌ బంధుత్వం ఏదో ఉందనుకునేరు. అలాంటిదేమీ లేదు.  మేము అరువేల నియోగులం ఐతే వారు లింగధారులు. గోత్రాలు కూడా వేరు అనే గుర్తు. మేము ఆ ఊరికి రాకముందే ఈ బాబులుగారు మా నాన్నగారికి సుపరిచితులు. మా నాన్నగారు కూడా తన చిన్నతనంలో కొత్తపేటలోనే చదువుకున్నారు. ఇప్పుడు నేను చెబుతున్నది మేము మానాన్నగారికి గెద్దనాపల్లె నుండి కొత్తపేటకు బదిలీపైన వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత జరిగిన ఒక సంఘటన  గురించి.

మేము కొత్తపేటకు వచ్చే నాటికి మా యింట్లో రేడియో లేదు. మేము ఆ ఊరు వచ్చిన కొత్తలోనే ఒక నాడు మా నాన్నగారు నన్ను బజారుకు తీసుకొని వెడుతూ మనింట్లో ఒక రేడియో ఉంటే బాగుంటుంది కదూ‌ అన్నారు. అప్పుడు మేమొక దుకాణంలోనికి వెళ్ళాం. అది బాబులు గారిది. మా నాన్నగారూ ఆయనా ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కాని కొద్ది రోజుల తరువాత తమ  రెక్స్ కంపెనీ‌ రేడియో ఒకటి మా యింటికి బాబులుగారే స్వయంగా తీసుకొని వచ్చారు. దాని బాడీ పనస చెక్కతో చేసారని తరువాత మా నాన్నగారు చెప్పారు. కొన్నాళ్ళ తరువాత బాబులుగారితో నేను ఏదో సందర్భంలో పనస చెక్కే ఎందుకూ అంటే ఆయన సంగీతవాయిద్యాలు కూడా పనసచెక్కతోనే‌ చేస్తారు తెలుసా, ఎందుకంటే పనసచెక్క అద్భుతమైన నాదం ఇస్తుంది కాబట్టి అని చెప్పారు.

బాబులు గారు కొద్ది కాలం తరువాత తన రేడియో కంపెనీని మూసేసారు. కారణం మామూలుగా జరిగేదే - భాగస్వామి మోసపూరిత ప్రవర్తన.  అన్నట్లు బాబులు గారు పెద్ద ఎలక్ట్రానిక్ ఇంజనీరు అని మీకు ఇప్పటి దాకా చెప్పనేలేదు! కంపెనీ మూసేసాక ఆయన మరేమీ పని చేయలేదు. అప్పటికి నడివయస్సులో ఉన్న ఆయన బోలెడంత సంపాదించారు కాబట్టి ఆ ఊళ్ళో కూర్చుని తిన్నా అయనకు రాజభోగంగానే జరిగేది. ఈ‌ బాబులుగారు ఆ రోజుల్లోనే‌ ఫారిన్ రిటర్న్డ్ - అమెరికాలో పదేళ్ళుండి వచ్చారు.  ఈయన దూరదేశంలో ఉండిపోయారని పెద్దవాళ్ళు గోలపెడితో సరేనని చెప్పి అక్కడి ఉద్యోగం వదిలిపెట్టి మనదేశానికి తిరిగి వచ్చేసారట.

మేము మా యింటికి ఒక రేడియో వచ్చేనాటికి డాబాసత్తెమ్మ గారి ఇంటిలో అద్దె కుండేవాళ్ళం.  ఒక సంవత్సరం చిల్లర కాలం అక్కడుండి తరువాత గర్ల్స్ హైస్కూలు ఎదురుగా ఉన్న తాడిగడప రాఘవరావు గారి ఇంట్లోకి మారాం.  ఈ రాఘవావుగారి తమ్ముడు తాడిగడప సత్యనారాయణరావు మా నాన్నగారికి క్లాసుమేటు మరియు స్నేహితుడూను. ఈ రాఘవరావు గారింటికి వెనుకనే బసవరాజు గారి ఇల్లు. ఈ రెండిళ్ళకీ మధ్యన ఒక అడ్డుగోడ ఉండేది - దానిలో కొంతభాగం అప్పటికే పడిపోయి రెండిళ్ళకీ మధ్య రహదారే ఉండేది. గోడ ఉన్నది పేరుకు మాత్రమే. అందుచేత మా కుటుంబానికీ బాబులు గారి కుటుంబానికీ మంచి స్నేహం ఉండేది.

తరచుగా ఒక తమాషా జరిగేది. మా నాన్నగారు ఇంటి అద్దెను విజయవాడకు మనియార్డరు చేసినప్పుడు పోష్టాఫీసు గుమాస్తాలు గందరగోళంలో పడేవారు.   తాడిగడప సత్యనారాయణ గారు తాడిగడప సత్యనారాయణ గారికి  మనీఆర్డరు చేయటం ఏమిటా అని!

కాలక్రమేణా బాబులుగారికీ‌ నాకూ మధ్య చాలా చనువు ఏర్పడింది. ఒక్కో సారి వాళ్ళింట్లోనే పడుకునే వాణ్ణి కూడా.  నా ప్రాణస్నేహితుడు గుడిమెళ్ళ పాండురంగారావూ, నేనూ, బాబులుగారూ, ఆయన కూతురు కుమారీ కూర్చుని అర్థరాత్రి దాటేదాకా ఢంకాఫలాసు ఆడుకునే వాళ్ళం. ఆఁ, ఢంకాఫలాసు అంటే మరేమీ లేదండీ మూడుముక్కలాట - సినిమాల్లో చూపించే మూడాసుల ఆట అదే. మా ఆటకు కావలసిన ధనం అంతా పాత పేకముక్కల రూపేణా వాళ్ళ ఇంటినిండా గుట్టలు గుట్టలుగా ఉండేది. అనంతర కాలంలో బాబులుగారికి మా పాండురంగారావు అల్లుడయ్యాడనుకోండి, అది వేరే కథ.  పెళ్ళికి ముందే వాళ్ళ కుటుంబాల మధ్యా చుట్టరికం కూడా ఉంది.

కథలో ప్రవేశిస్తూనే బాబులుగారి గురించి చెబుతూ ఎక్కెడికో వెళ్ళిపోయాను కదూ. మన్నించాలి, ఆయనకూ నాకూ‌ మధ్యన ఉన్న బంధం దొడ్డది మరి - నేను హైదరాబాదు వచ్చిన తరువాత కూడా అయన ఏదైనా పనిమీద ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు వర్తమానం చేసేవారు. ఒకటి రెండు రోజులు సినిమాలూ షికార్లతో జల్సా చేసేవాళ్ళం. ఒకసారి ఆయనతో కలిసి It's a Mad, Mad, Mad, Mad World సినిమా చూసాను. బహుశః అదే నేను చూసిన మెట్టమొదటి ఇంగ్లీషు సినిమా.  ఇంత అనుబంధం ఉన్న కారణంగా కొంచెం‌ ఎక్కువగానే వ్రాసాను. సరే ఇక అసలు కథలోకి బుధ్ధిగా వచ్చేస్తున్నాను.

ఇంటికి వచ్చిన బాబులు గారు కాఫీ గట్రా సేవించి పనిలో‌ పడ్డారు. సత్యనారాయణా నీ జాతకం ప్రకారం కొడుకు గ్యారంటీ ఈ సారి అని చెప్పారు. మా నాన్నగారి చాలా ఆనందం‌ కలిగిందని వేరే చెప్పాలా మరి? అప్పటికే నాకు బోలెడు మంది చెల్లెళ్ళున్నారు. ఇద్దరు తమ్ముళ్ళూ ఉన్నారు. అన్నట్లు ఇంట్లో పెద్దకొడుకును అనే కాదు మా నాన్నగారి ప్రథమసంతానాన్ని నేనేను.

బాబులుగారు నాన్నగారి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరొక ముక్క కూడా చెప్పారు.సత్యనారాయణా, నీ‌ జాతకం ప్రకారం నీకు ఖచ్చితంగా నలుగురు కొడుకులు అని.

ఎవరూ అపోహపడ నవసరం లేదు. బాబులుగారు ఔత్సాహిక జ్యోతిష్కులు మాత్రమే.  అయనేమీ జ్యోతిషం మీద సంపాదన చేయటం లేదు - ఆయనకు ఆ ఉద్దేశమూ లేదు అవసరమూ లేదు. కేవలం మారెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహసంబంధాల కారణంగానే, మా నాన్నగారి కోరిక మేరకే ఆయన నాన్నగారి జాతకాన్ని పరిశీలన చేసారు.(రెండవ భాగం రేపు వస్తుంది)

3, జూన్ 2016, శుక్రవారం

అడిదం సూరకవి గురించి..

ఈ రోజున మనలో మనమాట టపాలో మాలతి గారు సూరకవిగారి చాటువుని ఉదహరించినందుకు సంతోషం. ఐతే దాని పాఠం కొంచెం సరిచేయాలి, క్రింద చూపినట్లుగా

క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలందు యుద్ధములందున్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!

ఈ పద్యాన్ని గురించిన సందర్భంలో ఆవిడ కొంచెం పొరబడ్డారు. రాజుగారు పూసపాటి విజయరామ గజపతి రాజు గారు. పూసపాటి సీతారామరాజు గారు రాజుగారికి (సవతి) అన్నగారు.  కవిగారికీ రాజుగారికీ ప్రాణస్నేహం. సీతారామరాజు గారికి కవిగారి పొడగిట్టదు. అదీ సంగతి. అందుచేత వీలైనప్పుడల్లా సూరకవిగారిని సీతారామరాజుగారు తప్పుపట్టుకుంటూనే ఉండే వారు. ఏదో ఒక సందర్భంలో కవిగారు రాజుగారిపై చెప్పిన పద్యంలో ఏకవచనసంబోధన ఉందని తప్పులెన్ని సీతారామరాజుగారు ఆగ్రహించారు.. రాజుగారు సరసులు కాబట్టి ఆయనకేమీ ఇబ్బంది కాలేదు. సీతారామరాజుగారి ఆక్షేపణను సూరకవిగారు తక్షణం తిప్పికొడుతూ చెప్పినదే ఈ పద్యం.

సూరకవిగారు గురించి ఇంకొంచెం. చెప్పుకుందాం సందర్భం వచ్చింది కాబట్టి

ఒకసారి రాజులందరూ ఒక సమావేశం జరుపుకుంటున్నారు. అందరు రాజులూ మధ్యమధ్యలో వినోదవిజ్ఞానకార్యక్రమాలూ ఉండాలి కదా అని తమతమ రాజ్యాలలోని కవుల్నీకళాకారుల్నీ కూడా తీసుకొని వెళ్ళారు. సీతారామరాజుగారు చాలా తెలివిగా రాజుగారికి సగం సగం వివరాలే అందించటం వలన ఆయనకు విషయం తెలియక ఒక్కరే వెళ్ళారు. తీరా అక్కడ కవులు పదిమందీ తమ తమ కవితా చాతుర్యాన్ని చక్కగా ప్రదర్శిస్తూ ఉంటే, తమ తమ రాజుల్ని పెద్దచేసి పొగడుతూ పద్యాలను వినిపిస్తుంటే విజయరామరాజుగారికి చాలా విచారమూ మనస్తాపమూ కలిగాయి. అయ్యో వీళ్ళంతా సూరకవికి సాటివచ్చే వాళ్ళా, నాకు తెలియకపోయిందే కవిగారిని తీసుకొని రావాలనీ అని విచారించారు. ఇదంతా ఎవరో బయటివాళ్ళు చేసిన పన్నాగం కాదనీ సాక్షాత్తూ అన్నగారే సూరకవిమీద అక్కసుతో ఆయన్ని పక్కన పెట్టాలని ఇలా చేసాడని మథన పడ్డారు. అంతలో ఖంగున వినిపించిది ఒక రసగుళిక.

రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీను డంబికా
రాజు దిగంబరుండు మృగరాజు గుహాంతరసీమవర్తి వి
భ్రాజిత పూసపాడ్విజయరామనృపాలుడు రాజుగాని ఈ
రాజులు రాజులా పెనుతరాజులు కాక ధరాతలంబునన్

అందరూ ఆశ్చర్యపోయారు. 

విజయరామరాజుగారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు.  సూరకవి .. సూరకవి. వచ్చాడయ్యా. వచ్చాడు. ఎంతగొప్ప పద్యం చెప్పాడూ తనమీద!

తనపరువు నిలబెట్టిన సూరకవిని మనస్సులో వేనోళ్ళ కీర్తించారు.

ఐతే కొందరు విరసులూ ఉంటారు కదా అన్ని సభల్లోనూ! అలాగే కవిత్వసారస్యం తెలిసీతెలియని కొందరు రాజులు 'విజయరామ నృపాలుడు రాజు కానీ, ఈ రాజులు రాజులా' అని ఈ సూరకవిగారు తమందరినీ ఆక్షేపించాడని గింజుకున్నారు. కొందరు రంకెలు వేసారు.

అప్పుడు సూరకవి అన్నాడు కదా. 'మహారాజులారా. నేను మీలో ఎవరినీ చిన్నబుచ్చటం లేదు.. మీరు పొరపడకుండా సరిగా అర్థం చేసుకోండి మరి. పద్యంలో ఉన్న రాజుల్ని గురించే 'ఈ రాజులు రాజులా' అన్నానండీ ' అని ఇలా వివరణ ఇచ్చుకున్నాడు. కాదనటం ఎలా?

మొదటి రాజుగారు,  రాజు అంటే చంద్రుడు - ఆయనేమో కళంకమూర్తి అంటే ఒంటిమీద మచ్చలవాడు. తరువాతి రాజు రతిరాజు అంటే మన్మధుడు. సరిసరి వాడికి అసలు శరీరమే లేదు అందుకే వాణ్ణీ శరీరవిహీనుడూ అని తీసి పక్కన పెట్టింది. మూడవది అంబికారాజుగారి వంతు. అంబిక అంటే పార్వతీదేవి గారు కాబట్టి ఇక్కడ శివుడి గురించి చెప్పాలి. ఏం చెప్పాలీ, ఆయనకు కట్టుకుందుకు బట్టలకే కరువాయె. పక్కన పెట్టేద్దాం, దిగంబరుడికేం గొప్ప లెండి.  ఇకపోతే మహామహా మృగరాజు గారు అంటే సింహం అన్నమాట. ఏం గొప్ప లెండి అడవికి రాజట - పోయి గుహల్లో నక్కి ఉంటుంది -దాని రాజమహలు కొండగుహేను. అందుకే ఈ రాజులంతా ఏపాటి రాజులూ అన్నది.  అందుచేత గొప్ప కీర్తిమంతుడైన మా రాజుగారు పూసపాటి విజయరామ రాజుగారితో పద్యంలో ముందు చెప్పిన రాజులంతా పోల్చటానికి పనికిరారూ అని చెప్పానూ అన్నది సూరకవి గారి వివరణ అండి.

తిరుగు ప్రయాణంలో రాజుగారిని మీరు సమయానికి వచ్చి  భలేపద్యం చెప్పి నా పరువు కాపాడి రక్షించారండీ కవిగారూ అని పొగడి, మీకెలా  తెలిసిందీ వార్త అంటే కవిగారు నగరంలో సభగురించిన వార్తవిని మీరు నన్ను తీసుకొని పోకుండా వెళ్ళటంలో ఏదో పొరపాటు ఉందనిపించి పరుగున వచ్చాను మహారాజా అని విన్నవించాడట.

సూరకవిగారు శాపానుగ్రహసమర్థుడని ప్రతీతి. దాని గురించి ఒక ఐతిహ్యం. సరవయ్య అనే ఒక సెట్టిగారు ఈ కవిగారికి తాను వార్షికం ఇస్తానని ఒకసారి ఏదో సందర్భంలో అందరిముందూ  గొప్పకోసం అన్నాడు కాని తీరా ఇవ్వటానికి మాత్రం చేతులు రాలేదు. రేపురా మాపురా అని త్రిప్పుతూ ఉండే వాడు కవిగారిని. సూరకవి ఓపిగ్గా తిరుగుతూనే ఉండే వాడు. ఒకసారి ఉదయమే సూరకవి సరవయ్య ఇంటికి వెడితే ఆప్పుడు ఆ మహానుభావుడు బారెడు పొద్దెక్కాక లేచి దంతధావనం చేస్తున్నాడు. కవిగారు పొద్దున్నే గుమ్మంలో నిలబడేసరికి చిరాకు నెత్తికెక్కి, 'దాచిపెట్టిన సొమ్మన్నట్లు వచ్చాడే వీణ్ణి పాం గరవ' అన్నాడు.  సెట్టిగారి అరుగుమీద ఉన్న వాళ్ళంతా వికవికా నవ్వారు.  కవిగారు విస్తుపోయి ఆనక ఆగ్రహంతో ఊగిపోతూ, 'ఆపామే నిన్నుకరవ అయ్యో సరవా' అని పలికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సెట్టిగారు దంతధావనం ముగించి పైకి లేచీ లేవగానే ఎప్పుడు వచ్చిందో ఒక పాము చూరునుండి క్రిందికి దిగి ఫెడీ మని కాటువేసింది!

సూరకవిగారు మహా అభిమానధనుడు. పేదరింకం అనుభవిస్తూ కూడా రాజుగారిని ఎప్పుడూ దేహీ అన లేదు. గమనించిన రాజుగారే ఏదో వంకపెట్టి ఇచ్చినా పుచ్చుకోడు కదా ఈ కవి అని ఒక ఎత్తు వేసారు.  కవిగారికి కనకాభిషేకం చేసారు. తనమీద గుమ్మరించిన బంగారాన్ని సభలో ఉన్న కవిపండితులకి పంచేసాడు సూరకవి. రాజుగారు హతాశులయ్యారు.  ఇదేమిటయ్యా నీకోసం ఇంత బంగారం ఇస్తే ఇలా చేసావూ అని నిష్ఠూరం ఆడితే సూరకవిగారు తాపీగా అన్నాడు కదా, 'మహారాజా తాను స్నానంచేసిన నీళ్ళను ఎవ్వడూ తాగటానికి తీసుకుపోడు కదా' అని!

1, జూన్ 2016, బుధవారం

జూన్ 2వ తారీఖు.


  ధర్మపక్షాన నార్తనాదములు మిగుల
  నవలి పక్షాన నుత్సాహ మతిశయింప
  తెలుగు గడ్డను రెండుగా తెగనఱకిన
  జూను రెండవ తారీకు క్షుద్రదినము

  కానిపనులను చేసెడు కాంగిరేసు
  పూని విభజించి తెలుగింటి పుట్టిముంచి
  బాగుపడలేదు మునుముందు బాగుపడదు
  పాడుపనులకు తెగబడు పాపిగాన

  చిన్న రాష్ట్రాలు మా పాలసీ యటంచు
  పోయి కాంగ్రేసు  వారితో చేయి కలిపి
  నేడు ముదనష్టలబ్ధికి మురియుచున్న
  భాజపా కూడ తక్కువ పాపికాదు

  దుష్టపార్టీలు రెండును తోడుదొంగ
  లన్న తప్పేమి యునులేదు మొన్నమొన్న
  నన్ని ప్రియములు పలికిన యాత్రగాళ్ళు
  మొండి చేతులు చూపించుచుండి రిపుడు

  మాట నిలబెట్టుకొమ్మని మరలమరల
  బ్రతిమలాడుట మరియింత పలుచనగుట
  కాక నొరగెడి దేమియు కాన రాదు
  కాలమే యిచ్చు నన్నియు కరుణమీఱ

  ఇచ్చి చచ్చున దేమున్న దీతుళువలు
  మోసపోయిన యాంద్రులు ముందుముందు
  విభవమొప్పార సత్కీర్తి ప్రభలు తోడ
  తేజరిల్లుట తధ్యము దిక్కులదర

  కూటవిజయాల గొప్పలు కూలిపోవు
  నాత్మశక్తియొ యాంధ్రుల కన్ని యిచ్చు
  కాలమే వారి పక్షమై కరుణచూపు
  ధర్మపరులకు దైవమే దారి చూపు

  కాన పునరంకితులు కండు జూను రెండు
  క్షుద్రదినమైన కానిండు క్షోభమాని
  నవనవోజ్వలదివ్యాంధ్ర నవతరింప
  జేయ ఘనదీక్ష బూనుడీ చిత్తములను

  ఆంధ్రతేజమా యీదీక్ష యవసరమ్మె
  ఆంధ్రవీరుడా యీదీక్ష యవసరమ్మె
  ఆంద్రభామినీ యీదీక్ష యవసరమ్మె
  ఆందరీ దీక్ష  గొనుడు నవ్యాంధ్రకొరకు