24, జూన్ 2016, శుక్రవారం

ఫలించిన జోస్యం - 6. (నాగేంద్రుడి కథ ప్రామాణికత గురించి)


(మొదటిభాగం  రెండవభాగం  మూడవభాగం  నాలుగవభాగం ఐదవభాగం

 నేను వెనుకటి టపాలో చెప్పిన నాగేంద్రుడి కథ విషయంలో కొందరికి సందేహం‌ కలగటం సహజం. ఆ కథ సత్యమే అనటానికి ప్రమాణం ఏమిటీ అన్న ప్రశ్న సముచితమైనదే.

ఆ కథ అంతా కొన్ని తరాల వెనుక జరిగినది. ముత్తాతగారి కాలంలో ఇలా జరిగిందట అని చెప్పేవాడు అసమగ్రమైన సమాచారానికి తన ఊహాశక్తితో ఒక రూపాన్ని ఆపాదించి చెప్పే ఆస్కారం ఎక్కువే. లేదా ఏదో‌ ఒక ప్రయోజనాన్ని ఆశించి కేవలం ఊహాకల్పితమైన కథను పాఠకుల ముందు ఉంచే అవకాశాన్నీ‌ కొట్టి పడెయ్యలేమన్నదీ వాస్తవమే. ఈ రెండు విధాలుగానూ‌ కాకపోయినా తాను విశ్వసిస్తున్న కథనే నిజాయితీగానే చెప్పినా సరే ఆకథ తనకు తెలిసీతెలియకయే కాలం గడిచి కొన్నికొన్ని మార్పులకు లోనై ఉండే అవకాశమూ ఉంటుంది కదా అంటే అదీ‌  నిజమేను.

కానీ ఆ కథను నాకు చెప్పిన వారు మా అమ్మగారు. ఆవిడకు అది తెలియజేసినది మా బామ్మగారు.  ఈ‌ ఇద్దరూ నాకు స్వయంగా తెలిసిన వ్యక్తులే‌ కాని అన్యులు కారు కదా.

ఒక విషయం యొక్క సత్యాసత్యాలను తెలుసుకుందుకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది సంప్రదాయం. అవి ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్థాపత్తి, అనుపలబ్ధి, సంభవం, ఐతిహ్యం అనేవి. ఇక్కడ శబ్దము అంటే శ్రుతి.అంటే వేదం. ఈ‌ ఎనిమిది రకాల ప్రమాణాల్లోనూ‌ నేను చెప్పిన కథ ఎటువంటి ప్రమాణాన్ని కలిగి ఉంది అన్న ప్రశ్న వేసుకుంటే అనుమాన ప్రమాణం అనే చెప్పవలసి ఉంది. ఇక్కడ నమ్మకానికి దృష్టాంతమూ‌ సాధ్యతా వంటి వన్నీ‌ సుష్టువుగానే ఉన్నాయి.

ధర్మం సూక్ష్మంగా ఉంటుంది. దానిని వేదప్రామాణ్యంగా తెలుసుకుందుకు తరచుగా శక్తి చాలదు. అటువంటి సందర్భాల్లో పెద్దల నడవడినీ, మాటనూ ప్రమాణంగా గ్రహించాలి. మా అమ్మగారూ మాబామ్మగారూ ఈ‌ కథ విషయంలో కల్పనలో అసత్యాలో చెప్పవలసిన కారణం ఏమీ లేదు కబట్టి వారి కథనాన్ని నేను ప్రామాణికంగా ఎంచుతున్నాను.

అనుమాన ప్రమాణంలో‌ దృష్టాంతం‌ కూడా ఒక అవయవం. కొన్ని దృష్టాంతాలను మీ ముందుంచటం ద్వారా ఈ‌కథ యొక్క ప్రామాణికతను మరింతగా తెలియచేయాలని ఆశిస్తున్నాను.

మొదటిది నాకు బాగా చిన్నతనంలో‌ జరిగిన సంఘటన. ఒక నాటి మధ్యాహ్నం‌ పడకగదిలో పట్టెమంచం‌ మీద నేనూ మా నాన్నగారూ‌ నిద్రపోతున్నాము. పడకగది కిటికీ భోజనాల వసారా లోనికి తెరుచుకొని ఉంటుంది. ఆ వసారాకు ఆనుకొని వంటగది. కిటికీ వెలుపలనుండి మా బామ్మగారు మెల్లగా పిలుస్తూ మమ్మల్ని నిద్రలేపారు. నాన్నగారు ఏమిటి సంగతి అని అడిగే లోపలనే ఆవిడ పాము పామురా అని చెప్పారు.  ఇంటి మధ్యలో విశాలమైన హాలు ఉంది. దానిపైన అటక ఉంది. పడకగది తలుపు ఆ హాల్లోకి తెరుచుకుంటుంది. అటకమీద పాము ఉందని మా బామ్మగారు గాభరా పడుతూ చెప్పటంతో మొల్లగా మా నాన్నగారు గది తలుపులు తెరచుకొని బయటికి వచ్చారు. వెనుకనే నేనూ ఉన్నాను. బయటికి వచ్చి చూద్దుము కదా ఒక పెద్ద తెల్లని పాము అటకపైన ఒక నిట్రాటకు చుట్టుకొని ఉంది.

మా నాన్నగారు భయపడి అమ్మవారి గుడిదగ్గర ఉండే పాములు పట్టే వాళ్ళకు కబురు పెట్టారు. ఆ గుడి మా యింటికి దగ్గరే. ఇంటి వెనుకవైపునుండి కనబడుతూనే‌ ఉంటుంది కూతవేటు దూరం లోనే. వాళ్ళు వచ్చే దాకా మేము బిక్కుబిక్కు మంటూ ఇంటి వెనుక పెరటిలో ఉన్నాం. వాళ్ళు కొద్ది నిముషాల్లోనే వచ్చారు కానీ‌ ఈ‌లోగా పాము అక్కడ నుండి తప్పుకుంది. పాములవాళ్ళు ఇంటినీ‌ ఇంటి చుట్టూరా ఎంత వెదకినా అది కనబడలేదు. వాళ్ళు అటకమీదనే ఉండి ఉంటుంది పైకి పోయి వెదకుతాం అన్నారు. అనటం‌ ఏమిటీ ఇద్దరు పైకి వెళ్ళారు టార్చిలైట్లూ కర్రలూ‌ తీసుకొని. కాని అదెక్కడా కనబడలేదు. తెలివి తేటలు ప్రదర్శించారు కరంటువైర్లను తెచ్చి అటకమీద పరచటం ద్వారా. చివరికి వాళ్ళంతా అది కాస్తా ఏదో‌ చూరుగుండా బయటకు పోయి ఉంటుందని తేల్చి వెళ్ళిపోయారు.

మా నాన్నగారికి అనుమానం పోలేదు. అదెక్కడన్నా నక్కి ఉండి ఈ‌గలాభాకు దడిసి బయటకు రాలేదేమో అని. మాకూ భయాందోళనలు సహజంగానే అధికంగా ఉన్నాయి.

ఊళ్ళో ఫలానా వారు పేరుపొందిన మంత్రవేత్తలు ఉన్నారని ఎవరో సలహాయిస్తే వారి దగ్గరకు వెళ్ళారు మానాన్నగారు. వాళ్ళు ఎవరో గాని మినుములు ఒక గిన్నెడు మంత్రించి ఇచ్చారు. ఇంటి లోపలా బయటా అంతటా చల్లండి ఏ మూలా వదలకుండా అని చెప్పారట. అలాగైతే ఆపాము మా చుట్టుప్రక్కలకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ‌ రాదని చెప్పారట.

ఏం చేస్తాం‌ ఆ సలహాను తూచ తప్పకుండా పాటించాం.

లైట్లు  వేసుకొనే పడుకున్నాం‌ అంతా ముందు హాల్లోనే.  ముందు హాలు అంటే భోజనాల వసారా ముందు ఉన్నది కాదు. ఆ హాలుకు ఎదుట ఉన్నది. ఇంటి గుమ్మం తెరచి నేరుగా ఆహాల్లోనికే వస్తాం. అది చాలా ఎక్కువ పొడుగు.

ఇక ఒక రాత్రివేళ నుండి చూడండి భాగవతం!

ఇంటి ప్రక్క సందునుండి మల్లెపూల వాసన గుప్పుమంది. అందరమూ లేచి కూర్చుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం కాసేపు.

ఆ వాసన హఠాత్తుగా మాయమైపోయింది.

కొంచెం సేపటికి తీపివాసన - మినపసున్ని సువాసన.  అది మధ్యహాలునుండి చిన్నగా మొదలై ముందు హాలు అంతా వ్యాపించింది.

అది తగ్గిపోయిన తర్వాత ఇంటి వీధి గుమ్మం‌ బయటనుండి మళ్ళా మరోక రకం పూలవాసనలు.

ఇలా మార్చిమార్చి రకరకాల సువాసనలు పూలవీ‌ పండ్లవీ పిండివంటలవీ వగైరావన్నీ రాత్రంతా మాపని పట్టాయి.

ఈ విధంగా ఆ రాత్రి మాకు కాళరాత్రి అయ్యింది.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జాగరణ చేసాం.

తెల్లవారిన తరువాత మా నాన్నగారు మళ్ళా బయటకు వెళ్ళారు. ఆ మంత్రగాడికి చెప్పటానికీ‌ కొత్త సలహా కోసమూ.

కొద్దిసేపటికే తిరిగి వచ్చారు.

మీ‌ పెద్దల నాటినుండీ‌ మీ‌యింట్లో సుబ్రహ్మణ్యస్వామిని నాగేంద్రరూపంలో ఆరాధించటం ఉంది. ఆ పాము మీ‌యింట్లో‌ తరచూ‌ కనిపించేదే అట. మీరు దాన్ని బెదిరించాలనీ‌ తరిమెయ్యాలనీ పట్టించాలనీ వగైరా ఆలోచనలు చేయటం‌ అపరాధం  అనిపిస్తోంది. నిన్న మీరు వచ్చివెళ్ళాక విచారిస్తే ఈ సంగతి తెలియవచ్చింది. పొరపాటున మీకు మంత్రించిన మినుములు ఇచ్చాను. దేవుడిమీద మంత్రాలా? క్షమించండి.  స్వామికి నమస్కారం చేసుకొని నిక్షేపంగా ఆ యింట్లో ఉండండి. మీకేమీ‌ భయం‌ ఉండదు.

ఇదీ‌ మా నాన్నగారికి వారినుండి తెలియవచ్చిన సంగతి.

మా బామ్మగారూ అమ్మగారు దణ్ణాలు పెట్టుకున్నారు. నాకు తెలుసు.

మా నాన్నగారు దండం‌ పెట్టుకోవటం ఐతే నేను చూడలేదు. పెట్టే ఉండవచ్చును.

మరలా మాకు భయం‌కాలేదు. ఆరాత్రి అనే కాదు మరలా అటువంటి సువాసనలూ వగైరా మమ్మల్ని మళ్ళీ హడలెత్తించలేదు.

ఇదొక దృష్టాంతం. దీన్ని హేతువాదం చేసేవాళ్ళు ఎలా వ్యాఖ్యానిస్తారో నాకుతెలుసు. వాళ్ళతో‌ నాకు పేచీ లేదు. అలాగని వాళ్ళకు నచ్చజెప్పే ఉద్దేశమూ‌ లేదు. ఉన్నసంగతి చెప్పానంతే.

మరొక దృష్టాంతం మా నాన్నగారు గెద్దనాపల్లె మాధ్యమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ఉండగా జరిగింది.

 మా బామ్మగారు మాతో కొన్నాళ్ళూ మా లక్ష్మీపోలవరం ఇంట్లో కొన్నాళ్ళుగానే తిరుగుతూ‌ ఉండేవారు. ఆవిడ భ్రాంతి ఆవిడది ఆయింటిమీద. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు క్షేమసమాచారాలు కార్డుముక్క మీద తెలియబరచే వారు అప్పుడప్పుడు. అనంతర కాలంలో మా అమ్మగారు కూడా హైదరాబాదునుండి తరచుగా లక్ష్మీపోలవరం ప్రయాణం కట్టే వారు. ఆ యిల్లు పాడవుతోందని వేలకు వేలు పోసి వెళ్ళిన ప్రతిసారీ‌ మరమ్మత్తులూ‌చేయించే వారు. వాళ్ళ భ్రాంతి వాళ్ళది.

అలా ఒకసారి మా బామ్మగారి నుండి ఉత్తరం వచ్చింది.అందులో ఆవిడ వ్రాసిన కథనం చెప్తాను.

ఆవిడ యింటికి వచ్చి మర్నాడు పడకగది అంతా శుభ్రం చేదా‌ం దుమ్మూ‌ గట్రా పేరుకుని ఉంటుంది కదా అని ఆ గదిలో అన్ని వస్తువులూ‌ కదిపీ‌ ఎత్తీ తుడిచి బాగుచేస్తున్నారట గదంతా. పెద్ద చెక్కపెట్టె ఒకటుంది లెండి. దాని మూత తీసి లోపలి వస్తువులు ఒక్కోటీ బయటకు తీస్తున్నారు.

రెండో మూడో వస్తువులు తీసి బయటపెట్టి మళ్ళా లోపలికి చేయిపెట్టి వెలికి తీస్తే చేతిలో ఒక పెద్ద తెల్లని పాము!

పెద్దగా అరుచుకుంటూ ఒక్కగంతులో‌ బయటకు వచ్చారావిడ.

మ యింటికి యిరుప్రక్కలా ఉన్నవీ‌ మావాళ్ళ ఇళ్ళే! ఎడం వైపున ఉన్నది మా చినతాతయ్య వేంకటరత్నంగారి యిల్లు. కుడివైపున ఉన్నది చిట్టెమ్మగారిల్లు. ఆవిడ కుమారుడు గోపాలం ఆ ఊరి కరణం‌. మాకు వాళ్ళు ఙ్ఞాతులు. గోపాలం‌ నాకు అన్నయ్య వరస. నాకంటే చాలా పెద్దవాడు. కరణంగారి యిల్లంటే అరుగునిండా జనం ఉంటారు కదా సందడిగా.

ఈవిడ కేకలకు గోపాలం పరుగెత్తుకొని వచ్చాడు.

నలుగురూ‌ మళ్ళా కర్రలూ‌బుర్రలూ‌ పట్టుకొని వెళ్ళి ఇల్లంతా గాలించారు కాని ఆ పాము మళ్ళా కనబడలేదు!

మాబామ్మగారు ఆపాము ఉన్న పెట్టెలో చేతులు పెట్టి అవీ ఇవీ‌ దాని ప్రక్కనుండే బయటకు తీస్తుంటే అదేమి చిత్రమో అదేమీ‌ చేయలేదు! చివరకు ఆవిడ నేరుగా ఆపామునే చేత్తే‌ పట్టి బయటకు తీసినా అదేమీ చేయలేదు! ఆశ్చర్యపోవలసిన విషయమే కదా.

మేము కొత్తపేటలో ఉన్నప్పుడు పండగకూ‌ పబ్బానికీ ఎప్పుడన్నా మావూరు వెళ్ళి వచ్చేవాళ్ళం. ఎంతైనా మావూరు కదా! అలాగు కొన్ని సార్లు సంక్రాంతికి వెళ్ళటం‌ జరిగింది. వేరే‌ సందర్భాల్లోనూ‌ కొద్ది సార్లు వెళ్ళాం.

అలా లక్ష్మీపోలవరం‌ వెళ్ళినప్పుడు మా అమ్మగారికి రెండుమూడు సార్లు ఆ పెద్ద తెల్లని పాము దర్శనం ఇచ్చింది. ఒకసారైతే మా అమ్మగారు ఆ పామును దాటి ఆవలకు వెళ్ళారట. అనుమానం వచ్చి వెనుదిరిగి చూసుకుంటే పెరటిగడపను ఆనుకొని పొడుగ్గా పరచుకొని ఆ పాము దర్జాగా శయనించి ఉంది. మా అమ్మగారి ముందునుండే మెల్లగా కదలి వెళ్ళిపోయింది. ఏముంది. మళ్ళా గోడవతలకు గోపాలం గోపాలం అని కేకవేసి పిలవటమూ, అతడు దిట్టమైన మనుషులతో‌ రావటమూ మళ్ళా పాము ఎక్కడా కనబడక పోవటమూ.

ఒక పర్యాయం గోపాలం పెరటిలో‌ని చెత్తచెదారం అంతా మొత్తం పూర్తిగా పీకించి వేసి మరీ వెదికించాడు - ఒక చిన్న ఇటుకల గుట్ట ఉండేదిలెండి ముఖ్యంగా అది తీసేసామప్పుడే.

ఇలా మాకుటుంబానికి ఆ శ్వేతసర్పం దర్శనం ఇవ్వటం చాలా సార్లే‌ జరిగింది. కాని ఎప్పుడూ ఎవరికీ నిజంగా ఇబ్బంది కలిగించ లేదు.

కాలక్రమేణా మా ఉనికి ఆ వూరినుండి దూరం అయ్యింది. తాతల నాటి ఇల్లు శిధిలమై పోయింది. ఇప్పుడా యిల్లు లేదక్కడ.

ఉద్యోగరీత్యా మా నాన్నగారు వేరే ఊళ్ళో కాపురం‌ ఉంటున్నా జిల్లాలోనే ఉండే వారు కాబట్టి మాకుటుంబానికి అప్పుడప్పుడూ ఆ యింటి మీద భ్రాంతి తీర్చుకుందుకు వెళ్ళి వచ్చేందుకు కొంచెం వీలయ్యేది.

ఉద్యోగరీత్యా నా ఉనికి హైదరాబాదుగా మారింది. నలభైయేళ్ళ చిల్లర సంవత్సరాలు గడిచాయి, నేనీ‌ హైదరాబాదుకు వచ్చి.

కాలవైపరీత్యం వలన తెలుగు రాష్ట్రం ఒకటి రెండు కావటం‌ జరిగింది. ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లాకే కాదు ఆంద్రప్రదేశానికే స్థానికుడిని కాకుండా పోయాను. మాతాతగారు అంతగా భవిష్యత్తు తెలిసిన వారు కారు కాబట్టి రాబోయే మనవడు హైదరాబాదులో ఉండబోతున్నాడూ‌ వాడికి ముందుముందు ఇబ్బంది కాకూడదూ‌ అన్నది గ్రహించలేకపోయారు. అందుకే ఆయన తెలంగాణాకు వలసరాలేదు. ఆయనే పందొమ్మిది వందల యాభైయ్యారుకు ముందే హైదరాబాదుకు వలస వచ్చి ఉంటే  నేను తెలంగాణా పౌరుడిని అని ఇక్కడి దొరతనం వాళ్ళకు ఆమోదం అయ్యేదేమో. ఏంచేసేదీ, నేను తెలంగాణా వాడినీ‌ కాకుండా పోయాను. ఏం చేస్తాం. కాదంటే పోనీలే అనుకోవటమే.  ఈ‌విధంగా నేను ఏ తెలుగు రాష్ట్రానికి చెందని వ్యక్తినే అనిపిస్తుంది. పోనీయండి, దేశపౌరుడినే కదా - అంతవరకూ నయం. ఇదంతా అనవసర శాఖాచంక్రమణం. కాబట్టి వదిలేద్దాం.

చెప్పవచ్చేది ఏమిటంటే మాస్వగ్రామం లక్ష్మీపోలవరం నుండి మేము దూరం అయ్యాం. ఇప్పుడు వెడితే ఆ పాము కనిపిస్తుందా అన్న ప్రశ్న లేదు. అసలా ఇల్లే లేదుగా.

కాని సుబ్రహ్మణ్యస్వామి ఉన్నాడు కదా.

ఆయన నాకు వేరే నిదర్శనాలు ఇస్తున్నా వాటి గురించి వ్రాయను. అవి ఆథ్యాత్మికమైనవి. ప్రకటనీయాలూ  చర్చనీయాలూ కావు.

ఈ‌ నాగేంద్రుడి అనుగ్రహం అనండి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం అనండి అది మా మీద ఉండబట్టి వంశవిస్తరణ జరిగింది. ఈ సందర్భంగా ఒక సాధువుగారి నుండి అందిన సూచన ఒక జోస్యం వంటిదే మామూలుగా అలోచిస్తే. అందుకని ఇదంతా వ్రాసాను.


(ఇంకా ఉంది)

8 కామెంట్‌లు:

  1. నాకు పాములంటే చాలా చాలా భయమండి. ఈత రాకపోవడం చేత నీళ్ళన్నా భయమే. ఈ కథలు చదువుతూంటే కూర్చున్న చోటా, ఇంటికెళ్ళాక అక్కడా పాము కనిపిస్తుందేమో అని భయపడిపోతున్నాను. :-(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంత భయంకరంగా వ్రాసానంటారూ! :) అభయం అభయం. నిశ్చింతగా ఉండండి.

      తొలగించండి
  2. Maa chinnathanam guethukosthondi chaduvuthunte ...
    .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్నతనాన్ని దాటి చాలా దూరం వచ్చేసాను కదండీ. అప్పటి సంగతులూ విశేషాలూ ఎన్నో పదిలంగా మస్తిష్కంలో పేరుకొని ఉన్నాయి. అవన్నీ‌ గుర్తుచేసుకోవటం అన్నమాట ఈ‌ప్రయత్నం అంతా. మీ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. ఎప్పుడో చదివిన లల్లాదేవి శ్వేతనాగు గుర్తుకొచ్చింది...

    రిప్లయితొలగించండి
  4. Chandrika గారు కష్టేఫలీ బ్లాగుద్వారా ఇచ్చిన వ్యాఖ్య ఇది. :
    శ్యామలీయం గారు : మీ బ్లాగులో వ్యాఖ్య పెట్టడానికి రావటం లేదండీ . ఇదీ నేను పెడదామనుకున్న వ్యాఖ్య: నాగేంద్రుడి గురించి చెప్పినపుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. మీరు చెప్పినట్లు నమ్మితే నమ్మచ్చు పిట్టకథలు గా కొట్టి వేయవచ్చు. ఒక రోజు ‘శంకరాభరణం’ సినిమా మీద నేను చాగంటి వారి ప్రవచనం వినటం జరిగింది. వాసుకి కథ విన్నాను. విన్నాక ఏదో పని చేద్దామని గారేజ్ లోకి వెళ్ళగానే ఒక నల్ల పాము కనిపించింది. గారేజ్ తలుపులు తీయగానే వెళ్ళిపోయింది అనుకోండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రిక గారు, మీరు WordPress ప్రొఫైల్ ఎన్నుకొని వ్యాఖ్యను ఉంచవచ్చును కదా. మీకు ఎందుకు ఎలా ఇబ్బంది వచ్చినదీ‌ తెలియదు. మీ వ్యాఖ్యను ఇక్కడికి తెచ్చి వేసాను.

      అనవసరంగా పాముల్ని చంపకూడదు. మీరు మంచి పనే చేసారు. పాపం దాని దారిన అది వెళ్ళిపోయింది కదా. కాని చుట్టుపట్ల ఉన్నవారిని హెచ్చరించటం‌ మాత్రం‌ తప్పక అవసరం.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.