20, జూన్ 2016, సోమవారం

ఫలించిన జోస్యం - 2 (లక్ష్మీనారాయణ గారి జోస్యం)

( మొదటిభాగం)

 బాబులు గారి జోస్యం ఫలించింది!

శ్రీతాడిగడప వేంకట సత్యనారాయణ గారికి చతుర్ధపుత్రుడు జన్మించాడు. ఆయన సంతోషానికి మేరలేదు. పిల్లవాడికి బారసాల ఘనంగా జరిపి ఆనాడు వాడికి శ్రీనివాసుడని నామకరణం చేసాం.

రోజులు సంతోషంగా గడిచి పోతున్నాయి. పిల్లవాడు దిన దిన ప్రవర్థమాను డవుతున్నాడు.

కొవ్వూరు నుండి ఒకరోజున కేశిరాజు లక్ష్మీనారాయణ గారు మాయింటికి వచ్చారు.  మా మాతామహుల కుటుంబం కొవ్వూరులోనే ఉంటుంది. ఈ కేశిరాజు లక్ష్మీనారాయణ గారు మా అమ్మమ్మ కామేశ్వరమ్మ గారికి స్వయంగా సహోదరుడు. మా తాతగారు పాలకోడేటి భీమశంకరం గారిది మధ్యతరగతి కుటుంబం. ఆయన బావమరది ఈ‌ లక్ష్మీనారాయణగారిది దిగువ మధ్యతరగతి కుటుంబం కూడా కాదు. అప్పట్లో వారి కుటుంబం చాలా బీదరికంలో ఉండేది.

ఒక్కొక్క జీవితం అంతే. ప్రతిభావంతుడైన వాడికి రాణింపు యేమీ ఉండదు. వారు చేసే ప్రయత్నాలూ పెద్దగా ఫలించవు. కారణం విధినిర్ణయం అను కోవలసిందే.

ఈ లక్ష్మీనారాయణ గారి తండ్రి  కేశిరాజు సీతారామయ్య గారు. ఆయన మంచి కవి. శృంగారశాకుంతలం అని అద్భుతమైన అచ్చతెలుగు కావ్యం వ్రాసారు. అప్పట్లో దానికి మంచి పేరు వచ్చిందా లేదా అన్నది నాకు తెలియదు. కాని దానిలో మధునాపంతుల సత్యనారాయణ కవిగారు వ్రాసిన ప్రశంసా వాక్యాలున్నాయి. అన్నట్లు ఆకావ్యంలో ఉన్న అద్భుతమైన వృషభగతి రగడను నేను ఈ‌బ్లాగులో లోగడ ప్రచురించాను కూడా.

సీతారామయ్యగారి కుమారుడైన లక్ష్మీనారాయణ గారు కూడా మంచి పండితులు సంస్కృతాంధ్రాల్లో. కాని ఆయనకు ఏ డిగ్రీలూ‌ బొగ్రీలూ‌ లేవు. అవుంటే కాని మనదేశంలో దొరతనం వారు పండితుణ్ణి పండితుడిగా గుర్తించరు. అవుంటే కాని ఏ మంచి ఉద్యోగమూ దొరకదాయె.

లక్ష్మీనారాయణగారి సంస్కృతపాండిత్యం గురించి ఈ కథాకాలంలో కాక అనంతరం కొన్నేళ్ళకు నాకు ప్రత్యక్షానుభవం అయ్యింది.  మా పెద్ద మేనమామ గంగాధరం గారి వివాహానికి మేమంతా విజయనగరం వెళ్ళాం. అక్కడ ఎవరో కాలక్షేపం కబుర్లలో కొంచెం కాళిదాసు గురించో శాకుంతలం గురించో ఏదో తెలిసీ‌తెలియకుండా అనటం జరిగిందని గుర్తు. అంతే లక్ష్మీనారాయణగారు చెలరేగిపోయారు. ఒక గంట పైచిలుకు సమయం కాళిదాసు గొప్పదనం గురించీ శాకుంతల కథావైశిష్ట్యం గురించి సాధికారికంగా ఎన్నెన్నో శ్లోకాలు వగైరా ఉటంకించి వివరిస్తూ గొప్పప్రసంగం చేసారు. అందరూ ముగ్ధులై పోయారని చెప్పటంలో ఏమీ అతిశయోక్తి లేదు.  మా రెండవమేనమామ జగన్నాథరావు ఈ సంఘటనకు మరొకప్రతక్షసాక్షి. ఆయన అప్పట్లో విద్యాప్రవీణ చదువుతూ ఉండేవాడు కొవ్వూళ్ళోనే.

అంతటి పండితుడి తలరాత ఆయనను పరమబీదరికంలోనే ఉంచింది. కొవ్వూరులో ఒక సంస్కృతకళాశాల ఉంది. ఆ కళాశాల వారు ఈయనకు ఉపకారం చేయాలని చివరికి ఆయన్ను అటెండరుగా నియమించుకున్నారు.

ఈ లక్ష్మీనారాయణగారు సంస్కృతాంధ్రాల్లోనే కాదు, జ్యోతిషంలో కూడా దిట్ట.

ఈ సంగతి మా అమ్మగారికి తెలుసునేమో‌ కాని మా నాన్నగారికి తెలియదు.

భోజనాదికాలు అయ్యాక ఇంతకీ ఆయన మాయింటికి వచ్చిన కారణం చెప్పారు. శృంగారశాకుంతలం కాపీలు కొన్ని మానాన్నగారు తమ స్కూలుచేత కొనిపిస్తారేమో అన్న ఆశతో వచ్చారట.  పుస్తకం ఖరీదు కేవలం‌ 2 రూపాయలు. మా నాన్నగారు ఆ బీదబ్రాహ్మడికి సాయం చేయాలని రేపు హెడ్మాష్టరు గారితో మాట్లాడి వీలైతే పది కాపీలు తీసుకుంటాం లెండి అని చెప్పారు.  మరీ ఎక్కువ కాపీలు కొంటే విద్యశాఖవారి డి.యీ.వో కు రేపు సమాధానం చెప్పటం‌ కుదరదు కదా.

మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో ఆయన కాస్త ప్రక్క వాలుస్తారేమో అనుకున్నాం. కాని ఆయన అలా చేయలేదు. మా తమ్ముడు పసివాడు శ్రీనివాసుడిని ముద్దు చేస్తూ ఉన్నారు.

ఉన్నట్లుండి, అబ్బాయి జాతకం వేయించారా అని అడిగారు లక్ష్మీనారాయణగారు.

మా నాన్నగారు ఇంకా లేదండీ అన్నారు.

మా అమ్మగారు ఎందుకనో  మా నాన్నగారిని వారిస్తూ‌ సంఙ్ఞలు చేస్తున్నారు. మంచి జ్యోతిషపండితుడి చేత పిల్లాడికి జాతకం వ్రాయించే ఉత్సాహంలో మా నాన్నగారు ఆ సంగతి గమనించుకోలేదు. ఈ విషయం నేనూ గమనించాను. తరువాతి కాలంలో మా అమ్మగారు కొన్నిసార్లు ఈ విషయం నా ముందు ప్రస్తావించారు కూడా.

పిల్లవాడి జననసమయాదులు మా నాన్నగారు ఆయనకు చెప్పగానే ఒక పెద్ద తతంగం మొదలయ్యింది. అప్పట్లో ఈ‌రోజుల్లో‌లాగా కంప్యూటరు జాతకాలు వగయిరాలు లేవు కదా. పాతకాలం వాళ్ళందరూ పంచాంగం సహాయంతోనే‌ ఋక్షాద్యంతాలమీద త్రైరాశికాలు చేసుకుంటూ జాతకచక్రాన్ని తయారు చేసుకొనే వాళ్ళు. అపైన ఏతత్కాలప్రవర్తమాన చంద్రయుక్త నక్షత్రం  ఆధారంగా వింశోత్తరీ దశాగణనం చేసే వారు. కాలుక్యులేటర్లూ వగైరాలు లేని రోజులు కాబట్టి అన్ని గుణకారభాగహారాదులూ చచ్చీచెడీ‌ చేతిలెక్కల తోనే చేయాలి. జాతకచక్రం వేయటం‌ ఒక విద్యగానే భావింపబడేది ఆరోజుల్లో.

లక్ష్మీనారాయణగారు దానికి ఇది కలుపు, ఇది తీసేయి, ఇది పెట్టి గుణకారం చేయి ఇలా భాగించూ‌ అంటూ ఆఙ్ఞలు  జారీ చేయటమూ నేను ఓపిగ్గా ఆ లెక్కలన్నీ చేస్తూ ప్రతీ గణనమూ ఒకటికి రెండుసార్లు సరిచూసి చెబుతూ‌ ఉండటమూను. ఇదంతా బోలెడంత సేపు చాలా హడావుడిగా నడిచింది.

మా అమ్మగారు మౌనంగా అంతా తిలకిస్తూ ఉన్నారు.

మొత్తానికి జాతకచక్రం వేయటమూ దశాగణనమూ పూర్తయ్యాయి. లక్ష్మీ నారాయణగారు ఆ చక్రాన్ని నిశితంగా పరిశీలిస్తూ చాలా సేపు ఉండిపోయారు.

జాతకం బాగుందయ్యా అన్నారు చివరికి.

మా నాన్నగారికి ఆనందోత్సాహాలు రెట్టింపయ్యాయని వేరే చెప్పాలా?

అబ్బాయి చదువూ‌సంధ్యా అంటూ నాన్నగారు అడగటం మొదలు పెట్టారు.

లక్ష్మీనారాయణగారు ఆ సంగతి చెప్పకుండా నేరుగా మా అమ్మగారితో, అమ్మాయీ మీ కేమైనా పిల్లాడిని దత్తతకు యిచ్చే ఉద్దేశం లాంటి దేమన్నా ఉందా అన్నారు.

మా అమ్మగారు వెంటనే కస్సు మన్నారు.  ఇంకో వందమంది పిల్లలు పుట్టినా హాయిగా పెంచుకుంటానే కాని బొందిలో ప్రాణం ఉండగా దత్తత కివ్వటాలు వంటి పిచ్చిపని ఎంతమాత్రం చేయను అని కొంచెం‌ అరిచి మరీ తెగేసి చెప్పారు.

ఈ‌ పెద్దమనిషి తుసుక్కున ఇలా అడిగాడేమిటా అని మా నాన్నగారు చిన్నబుచ్చుకున్నారు.

లక్ష్మీనారాయణగారు, అమ్మ అలా గద్దించి చెప్పేసరికి కొంచెం‌ నీళ్ళునములుతూ మరేం లేదే అమ్మాయీ, పిల్లాడికి కొంచెం ఇంటికి దూరంగా కొన్నాళ్ళు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఐనా అదేమంత పెద్ద సంగతి కాదులే. నిక్షేపంగా నీపిల్ల వాడేను అని ఓదార్పు మాటలు చెప్పారు. ఐనా మా అమ్మగారు ప్రసన్నురాలు కాలేదు. పిల్లవాడి జాతకంలోని మంచి సంగతులు ఏకరువు పెట్టారు లక్ష్మీనారాయణగారు చాలా సేపు. అవన్నీ బాగున్నాయి.


మరునాడు భోజనం అయ్యాక, మా నాన్నగారు లక్ష్మీనారాయణగారిని స్కూలుకు తీసుకొని వెళ్ళారు.వాళ్ళిద్దరి కూడా నేనూ తోకలాగా వెళ్ళాను. పది శృంగారశాకుంతలం పుస్తకాలకు గాను స్కూలు వారి నుండి  ఇరవై రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఆయన ముఖంలో చాలా సంతోషం కనిపించింది. ఇరవై అంటే అప్పట్లో కూడా మరీ పెద్ద మొత్తం ఏమీ కాదు. అదే మహాభాగ్యంగా అనిపించినట్లుందంటే ఆయన ఆర్థికపరిస్థితిని మనం ఊహించుకో వలసిందే మరి.

స్కూలు నుండి ఇంటికి తిరిగివచ్చాక ఆయన ఆ పూటే బయలు దేరి వెళ్ళిపోయారు. నేనూ మా నాన్నగారూ ఆయన్ను బస్సెక్కించటానికి కూడా వెళ్ళాం. అదొక మర్యాద అంతే. స్వయంగా రాగలిగిన వారు స్వయంగా వెళ్ళలేరని కాదు.

బస్సు స్టాండుకు వెళ్ళే దారిలో లక్ష్మీనారాయణగారు కొంచెం సంశయిస్తూనే మా నాన్నగారితో ఇలా అన్నారు. సత్యనారాయణగారూ, పిల్లాడికి మీ దగ్గర ఉండే యోగం జాతకంలో లేదు. మాతృస్థానం చాలా బలహీనంగా ఉంది. దత్తత యోగమో బాలారిష్టమో అన్నట్లుగా  ఉంది. అందుకని అలా చెప్పాను. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎనిమిదవ నెల దాటితే నేను చెప్పినట్లు పూర్ణాయుర్దాయమే నిశ్చయంగా. కాని ఎనిమిదవ నెల దాటటం అసంభవంగా అనిపిస్తోంది. మొదటిరోజునే గండం‌ పొంచి ఉంది. ఆరోజు దాటటమే అసలు కష్టం. అది దాటితే‌ మిగతా నెల సామాన్యదోషం అనుకోండి. కాని నెలంతా జాగ్రత్తగా ఉండండి.  మీరు నాకెంతో ఉపకారం చేసారు. కాని నేనేమో‌ మీకు మనస్తాపం కలిగే మాటలు చెప్పి వెడుతున్నాను.  ఇలా చెప్పి కొంచెం బాధపడుతూనే ఆయన వెళ్ళిపోయారు.

ఈ మాటలను మా నాన్నగారు నాకు తెలిసి మా అమ్మగారితో ఎన్నడూ చెప్పనేలేదు. ఎందుకూ చెప్పటం? ఆవిడను క్షోభపెట్టటానికి కాకపోతే. అందుచేత మనస్సులోనే మథనపడుతూ‌ ఉన్నా పైకి నిబ్బరంగానే ఉన్నారు. మా నాన్నగారు నాకు ప్రత్యేకంగా హెచ్చరిక ఏమీ చేయలేదు కాని అమ్మకు బాధకలిగించే మాటను చెప్పలేక నేనూ ఎన్నడూ‌ పెదవి విప్పలేదు.

జాతకపండితులు ఏవేవో చెబుతారు కాని వాళ్ళే‌మన్నా సర్వఙ్ఞులా ?

శ్రీనివాసుడు చక్కగా అరోగ్యంగా ఉన్నాడు. 


(మూడవ భాగం కోసం దయచేసి వేచి ఉండండి) 

12 కామెంట్‌లు:

  1. కధ అయిపోయిందాండీ ? మొదటిలైనులో జ్యోస్యం ఫలించి ఆఖరిలైనులో జ్యోస్యం వికటించిందేమిటా అన్న సందేహం కలిగింది.శ్రీనివాసులు గారికి గండమని చెప్పారా ? వారి తల్లిగారికి గండమని చెప్పారా ? మకర రాశి వారు పుడితే తల్లిదండ్రులకు గండం గానీ అనారోగ్యం గానీ,తల్లిదండ్రులు విడిపోవడంగానీ జరుగుతున్నాయి. నిజమో కాదో శాస్త్రీయంగా ఇంకా నీర్ధారించలేదు.

    రిప్లయితొలగించండి
  2. you are well understood the logic in sastrys prediction Neeharika ji..any how shayamala rao ji,whats your mothers age now?what happend to her at the 8th month[after the birth of srinivas]?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దయచేసి నీహారిక గారికి ఈ సందర్భంలో ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించండి.
      కథాకాలం ఇప్పటికి దాదాపు అర్థశతాబ్ది క్రిందటిది.
      ఈ కథ ఇంకా కొన్ని భాగాలుగా వస్తుంది.

      తొలగించండి
  3. లక్ష్మీనారాయణ గారు పిల్లవాడి మాతృస్థానం బలహీనంగా ఉందని చెప్పారు. మీ రన్నట్లే ఈ ముక్కకు రెండు రకాల సందర్భాలూ అన్వయిస్తాయి. పిల్లవాడికీ గండం ఉండవచ్చును లేదా పిల్లవాడి తల్లికే గండం ఉండవచ్చును. ఏ విషయమూ జాతకం మొత్తం పరిశీలించిన పిదప నిర్ణయిస్తారు. బాలారిష్టం అంటే పిల్లలు కాస్త గడితేరేవరకూ పొంచి ఉండే అపమృత్యుయోగం అన్నమాట. జాతకపధ్ధతిలో ఇలాంటివి చాలానే చెబుతారు. ఇవి కొన్నికొన్ని నక్షత్రపాదాల్లో శిశువుయొక్క జననం మొదలుకొని కొన్నికొన్నిజాతకచక్రంలో కొన్నికొన్ని అవాంచనీయమైన గ్రహస్థతిదృష్టులవరకూ రకరకాలు. వాటినీ వింశోత్తరీదశా ప్రవర్తనాన్నీ, ఆయుర్యోగాల వంటివాటినీ సమన్వయం చేసుకొని ఫలనిర్ణయం చేయవలసి ఉంటుంది. ఒక్కోసారి జాతకంలో ఆయుర్యోగం బాగుండక పోయినా దాన్ని మరుగుపరుస్తూ దీర్ఘకాలంలో పట్టే రాజయోగాదులూ జ్యోతిషపండితులనే తప్పుదారి పట్టిస్తాయి. ఏది ఏమిటీ ఎలాంటిదీ ఎంతవరకూ అన్నది పాండిత్యంతో బాటు అనుభవమూ దండిగా ఉంటేనే గ్రహింపుకు వస్తుంది.

    మకరరాశిలో చంద్రుడుండగా పుట్టినంత మాత్రాన తలిదండ్రులు విడిపోవటానికి ఆస్కారం తక్కువనే అనుకోవాలి. ప్రతి చంద్రమాన మాసంలోనూ చంద్రుడు మకరరాశిలో 29.5/12= 2రోజుల 11గంటల చిల్లర ఉంటాడు సగటున. ఈ సమయంలో అనేకులు జన్మిస్తారు కదా. సగటున ప్రతి పన్నెండుమందిలోనూ ఒకరు మకరరాశివారే కావాలి కదా - ఉన్నవి పన్నెండు రాశులే కాబట్టి. అంటే తలిదండ్రులు విడిపోతున్నది 8.33% ఉంటున్నదా? ఈ రోజుల సంగతి అటుంచి పూర్వం అంత ఉండేది కాదుగా కచ్చితంగా? ఇకపోతే అనారోగ్యం అన్నది కొంత ఆలోచించదగ్గదే ఐనా పూర్వం బాలింతలకు ప్రసవగండం గడిచినా వైద్యం అంతంతమాత్రంగానే అందేదన్నది విస్పష్టం. అప్పట్లో బాలింతల మరణాలూ అనారోగ్యాలూ సర్వసాధారణం కాబట్టి మకరరాశిమీదే నిందవేయలేమేమో. ఐనా లోతుగా అలోచించాలి. మీకు తెలిసిన వివరాలు ఏమన్నా పరిశోధనకు పనికివచ్చేవి ఉంటే పరిశీలిద్దాం తప్పకుండా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కే ఈ కృష్ణమచార్యులు గారు సూర్యమానం ప్రకారం మకర రాశి కి చెందినవారి తల్లితండ్రులకు గండం గానీ విడిపోవడం కానీ ఉండవచ్చు అని వ్రాసారు. మీరన్నట్లు నాకు తెలిసిన 10మంది మకర రాశివారిలో 8 మందికి తల్లి గానీ తండ్రి కానీ చనిపోవడం జరిగింది.ఉదా : ప్రియాంక గాంధీ,ఏ ఆర్ రెహమాన్
      మా బంధువుల్లో ఒకరికి తల్లి,ఒకరికి తండ్రి ఏక్సిడెంటల్ గా చనిపోయారు. నేను చెప్పేది ఏవిటంటే జ్యోతిష్యులకు చనిపోతారని ముందుగా తెలిస్తే తల్లిదండ్రులకు దూరంగా ఉంచడమే మంచిది కదా ?

      తొలగించండి
    2. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి గురించా మీరు ప్రస్తావిస్తున్నది. ఆయన కృష్ణమూర్తి పధ్ధతిని పాటించే వారనుకుంటాను? సూర్యమానం కాదేమో? నాకు అంత వివరంగా తెలియదు కాని నాకు తెలిసిన వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ వాళ్ళు అందరూ కృష్ణమూర్తి పధ్ధతిని పాటించే వారు. ఐనా సూర్యమానం ప్రకారం మకరరాశి అంటే ఒక కాలెండర్ నెల అంతా కదా? ఆ నెలరోజుల్లో పుట్టినవారందరి తల్లిదండ్రులకూ ఆ పిల్లల బాల్యంలోనే పితరులకు మారకమా? ఆలోచించాలి. నేను జ్యోతిర్విద్యకు రెండు దశాబ్దులుగా కొంచెం దూరంగానే ఉంటున్నాను - సమయం కేటాయించలేక.

      జ్యోతిషం మీద పూర్ణవిశ్వాసంతో పిల్లల్ని దూరంగా ఉంచటాని ఒప్పుకునే నాన్నలుంటారేమో కాని అలాంటి అమ్మలుంటారా? నమ్మటం కష్టం.

      తొలగించండి
  4. To be precise,a good astrologer never procedds wthout confirming the longivity levels..when comes to experience and pandithya,one must keep in mind,that even thoug severals born in capricon,their navamsa and other divisional charts varies vrey meaningfully..so your mathical caliculations in this regard are not valid sir..sastry ji only pointed weakness of mathrusthana,thats why he mentioned adoption first and then balaaristta..when coming to parents misunderstandings.i dont find any such kind if cases in my 25years of astrological experiences and study..

    రిప్లయితొలగించండి
  5. మీ అమ్మగారు కస్సుమన్నట్లే అందరూ కస్సుమంటారు. తల్లిదండ్రులను శాస్వతంగా కోల్పోయేకన్నా దూరంగా ఉంచడమే మంచిదేమో ?
    నాక్కూడా ఈ విషయంలో స్పష్టత లేదు అందుకే శాస్త్రీయత లేదని చెపుతున్నాను.

    రిప్లయితొలగించండి
  6. మీ బంధువులైన కేశిరాజు లక్ష్మీ నారాయణ గారి గురించి చదువుతుంటే - నరసింహ శతకం లోని "అధిక విద్యావంతులప్రయోజకులైరి ... ...ధర్మవాదనపరుల్ దారిద్ర్యమొందిరి " అన్న పద్యం గుర్తుకొచ్చింది :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతేనండీ. మీకెంత తెలుసని కాదు కదండీ, మీ‌కింత తెలుసునూ‌ అని ఒక ధృవపత్రం‌ కావాలి కదా! అది లేదాయెను మరి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.