21, జూన్ 2016, మంగళవారం

ఫలించిన జోస్యం - 3 (శ్రీనివాసుడి కథ)

( మొదటిభాగం రెండవభాగం )

 చిన్నపిల్లలను కొందరు ఇట్టే చేతుల్లోనికి తీసుకొని ముద్దుచేస్తూ‌ ఉంటారు.

నాకైతే అతిసున్నితంగా ఉండే చిన్నపిల్లలను చేతుల్లోనికి తీసుకోవటం అంటే చాలా సంకోచం. నిజం చెప్పాలంటే చచ్చేంత భయం. ఎక్కడ కొంచెం గట్టిగా పట్టుకుంటానో వాళ్ళకి ఎక్కడ నొప్పికలుగుతుందో అని నా అనుమానం. అందుచేత వాళ్ళను చూసి సంబరపడటమే కాని ఎత్తుకోవటం నావల్ల కాదు.

మా తమ్ముడు రామానికి (సత్యశ్రీరామచంద్రమూర్తికి) అలాంటి సంకోచాలేమీ‌లేవు. వాడికి పిల్లలంటే అందరిలాగా ముద్దే. శ్రీనివాసుణ్ణి ఎత్తుకొని తిరుగుతూ తెగసంబరపడేవాడు.

మా చెల్లెళ్ళ సంగతి చెప్పనే అక్కరలేదు. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూడటం ఆడపిల్లలకి వెన్నతో పెట్టిన విద్య కదా.

శ్రీనివాసుడి ఆటపాటలతో - అంటే అటలు వాడివే అనుకొండి, పాటలు మావి అన్నమాట. వాటితో క్రమంగా లక్ష్మీనారాయణగారి జోస్యం సంగతి మరుగున పడింది. నిజానికి నేనైతే మరచిపోయానేమో క్రమంగా.  బహుశః చదువుసంధ్యల హడావుడి కారణంగా కావచ్చును.

కానీ మా నాన్నగారు మరచినట్లు లేదు.

శ్రీనివాసుడికి ఎనిమిదవ నెల దగ్గరకు వస్తోంది జాగ్రత్తగా ఉండాలీ అని ఒకరోజున నాన్నగారు నాతో‌ అన్నప్పుడు నాకు మరలా జోస్యం విషయం స్ఫురణకు వచ్చింది.

మా యింటి ప్రక్కవాటాలో వక్కలంక నరసింహమూర్తిగారని మరొకాయన అద్దెకుండేవారు ఆరోజుల్లో. ఆయన హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. నిజానికి వాళ్ళు మాతో పాటు అదే ఇంట్లో చాలా కాలమే అద్దెకున్నారు. మా రెండుకుటుంబాల మధ్య స్నేహసంబంధం బాగానే ఉండేది.  ఆయన భార్యగారి పేరు పద్మావతి గారు. వారి అబ్బాయిలు గోపాలరావు (గోపీ), ప్రకాశరావు (ప్రకాశ్) ఇద్దరూ నా కంటే కొద్దిగా చిన్నవాళ్ళు. వాళ్ళమ్మాయి సావిత్రి నాకంటె చాలా చిన్నది. వక్కలంకవారికి ఈ కథా కాలానికి ఇంకా నాలుగవ సంతానం పుట్టలేదు. తరువాత జన్మించాడు. ఆ అబ్బాయి పేరు సీతారామ్. అతను చక్కగా కీర్తి తెచ్చుకున్నాడు. సితారా అని పేరుతో వ్రాసూ ఉంటాడని మా తమ్ముడు రామం చెప్పాడు. ఆఖరి అబ్బాయి మేము కొత్తపేటను విడిచి వెళ్ళిన తరువాత జన్మించాడు. సత్తిబాబు అంటాం అతణ్ణి.

ఈ వక్కలంక నరసింహమూర్తి గారిని ఈ విషయమై నాన్నగారు సంప్రదించారేమో అనుకుంటున్నాను. నాకైతే స్వయంగా తెలియదు.

నాన్నగారు ఊళ్ళో ఉన్న వైద్యశిఖామణులిద్దరినీ‌ సంప్రదించారు. అది మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే రెండుచోట్లకూ ఆయనతో వెళ్ళింది నేనే కాబట్టీ అక్కడ జరిగిన సంభాషణలకు నేను ప్రత్యక్షసాక్షిని కాబట్టీ.

వారిలో ఒకాయన పేరు అంబారుఖానా శ్రీరామమూర్తిగారు. ఆయనా ఆయన తమ్ముడు భగవంతరావు గారూ కలిసి ఆయుర్వేదవైద్యం చేసేవారు. భగవంతరావుగారైతే మానాన్నగారికి క్లాసుమేటు కూడా. మా కుటుంబానికి ముఖ్యవైద్యులు శ్రీరామమూర్తిగారే. అన్నదమ్ములు కలిసే వైద్యం నడిపించినా, బోర్డూ ప్రాక్టీసూ అంతా అన్నగారు శ్రీరామమూర్తి గారి పేరు మీదే ఉండేది. పేరుకు ఆయుర్వేద వైద్యం ఐనా ఇదం బ్రాహ్మ్యం - ఇదం‌ క్షాత్రం అన్నట్లు ఆయుర్వేదమూ ఇంగ్లీషు వైద్యమూ‌ రెండూ చాలా చక్కగా చేసేవారు. ముఖ్యంగా పేదసాదలకు అక్షరాలా ఉచితంగానే వైద్యం చేసేవారు. మంచి కీర్తిమంతులు ఊళ్ళో. ఇద్దరూ బలరామకృష్ణులో రామలక్ష్మణులో అన్నట్లుండే వారు. అన్నదమ్ములు కలిసి ఊరిచివరన ఉన్న శ్రీరామమూర్తిగారు నిర్మించిన భవంతిలోనే ఉండేవారు. కథకు అవసరం లేకపోయినా వాళ్ళ ప్రసక్తి వచ్చింది కాబట్టి లోకరీతి ఎలా ఉంటుందన్నదానికి ఉదాహరణకోసం చెప్పక తప్పటంలేదు. కాలాంతరంలో శ్రీరామమూర్తిగారు పరమపదించాక భగవంతరావుగారికి నిలువనీడకూడా లేక కేవలం కట్టుబట్టలతో మిగిలింది ఆయన కుటుంబం! మిగతా విషయం అంతా చదువరులు ఆలోచించి అర్థంచేసుకో గలరు! నేను ఎక్కువగా విశదీకరించలేను. ఆ రెండు కుటుంబాలూ ఇప్పటికీ‌ మాకు ఆప్తులే.

ఆ ఊళ్ళో మరొక వైద్యులు ఇరగవరపు సుబ్రహ్మణ్యం గారు. ఈయన పక్కా యం.బి.బి.యస్ డాక్టరు. బహుశః ఊళ్ళో మొదటి ఇంగ్లీషు డాక్టరు (అలానే అనేవారు ఆరోజుల్లో) కాశిన చిన్నంరాజు గారు. ఈ‌ చిన్నంరాజుగారి తమ్ముడి కుమారుడు నాకు క్లాసు మేట్. మంచి జోరు మీద ఉండేది చిన్నంరాజు గారి వైద్యం. తలనొప్పి అంటే తొమ్మిది పదిమందులకు తక్కువ కాకుండా రాసి ఇచ్చేవారు ఆయన - ఈ మాట అక్షరసత్యం - నేను ప్రత్యక్షంగా చూసిన సంగతి కాబట్టి. ఆయన స్వంతంగా హాస్పిటల్ కమ్‌ నివాసభవనం కట్టుకొని వెళ్ళిపోయాక ఆ వసతిలో ఈ‌రెండవ డాక్టరు సుబ్రహ్మణ్యం గారు వచ్చి అంతకంటే జోరు ప్రాక్టీసు అందుకున్నారు. చిత్రంగా చిన్నంరాజు గారి పని పూర్తిగా ఖాళీ‌ అయ్యింది! స్థానబలం అని ఉంటుంది సుమా అంటా రందుకే అనిపించేది.  ఈ ఇరగవరపు సుబ్రహ్మణ్యం గారు మాకు కొంచెం దూరపు బంధువులు కూడా. ఏ విధంగా అన్న వివరం ఇప్పుడు నాకు గుర్తు లేదు.

ఆ రోజన శ్రీనివాసుడికి ఎనిమిదవ నెల వచ్చింది. ఎప్పటిలాగే ఆరోగ్యంగా కిలకిల లాడుతూ‌ ఉన్నాడు.

ఆ రోజు ఆదివారం. కాబట్టి అందరమూ‌ ఇంట్లోనే ఉన్నాం.

సాయంత్రం ఆరు గంటయ్యింది.

ఏడు గంటలు కూడా కావస్తోంది.

నాకూ‌ నాన్నగారికీ ఇంక ఫరవాలేదు అన్న భావం‌ కలిగింది. ఒకరితో‌ ఒకరం ఈ‌అభిప్రాయం పంచుకున్నాం‌ కూడా.  శ్రీనివాసుడికి ఏ అనారోగ్యచిహ్నాలూ లేవు. హాయిగా ఆడుకుంటూనే ఉన్నాడు.

ఉన్నట్లుండి పిల్లవాడికి వరుసగా విరేచనాలు వెళ్ళాయి.

అందరం చాలా కంగారు పడ్డాం.

వెంటనే అందుబాటు దూరంలోనే ఉన్న శ్రీరామమూర్తిగారికి కబురు వెళ్ళింది. అత్యవసరంగా రావాలని. డాక్టరు వద్దకు పరుగెత్తింది నేనా మరొకరా అన్నది గుర్తు లేదు సరిగా.

ఆరోజుల్లోనే మోటారు సైకిల్ మీద తిరిగేవారు శ్రీరామమూర్తిగారూ ఆయన తమ్ముడు భగవంతరావుగారూ. ఒక డాక్టరు గారు రిక్షాను పిలిపించుకొని అది వచ్చిన తరువాత రోగులను చూడటానికి వెళ్ళే సరికి కాలాతీతం ఐపోతుంది కదా అప్పుడప్పుడూ. అందుకని ఆయనా ఆయన తమ్ముడూ కూడా తమ మోటారు సైకిళ్ళమీదే రోగుల ఇళ్ళకు వెళ్ళి వైద్యం చేసేవారు.

క్షణాలమీద అన్నట్లుగా భగవంతరావుగారు బండిమీద వచ్చి వాలారు.

వెంటనే వివరాలు అడిగి వైద్యం‌ మొదలు పెట్టారు. ఒకటో రెండో ఇంజక్షన్లు ఇచ్చారు.  అప్పటికే శ్రీనివాసుడి పరిస్థితి బాగోలేదు. చాలా నీరసించి ఉన్నాడు.

భగవంతరావుగారు పెదవి విరచారు.

క్షణాలమీద పిల్లవాడి పరిస్థితి విషమించింది.

పద్మావతిగారూ మాఅమ్మగారూ పిల్లవాడి ఒళ్ళు నిమురుతూ పరిశీలిస్తున్నారు దిగులుగా.

కొద్ది సేపటికే చిన్ని శ్రీనివాసుడు పెద్ద శ్రీనివాసుడి దగ్గరకు వెళ్ళిపోయాడు.

నేను అక్కడనే మా అమ్మగారి ప్రక్కనే ఉన్నాను. ఒకటి రెండు అడుగుల దూరంలో మరొక ప్రక్కన మా తమ్ముడు రామం ఉన్నాడు.  ఎందుకో తెలియదు నాకు కళ్ళవెంట చుక్కనీరు కూడా రాలేదు ఎంతో విచారం కలిగినా! రామం ఐతే బావురుమన్నాడు పిల్లవాడిని ఆ గదినుండి బయటకు తీసుకొని వెళుతుంటే.

అప్పటికే చీకట్లు బాగా ముసురుకున్నాయి.

మా బామ్మగారు ఇంటి అరుగుదిగి, పిల్లవాడిని కాళ్ళమీద ఉంచుకొని మౌనంగా కూర్చున్నారు.

మా నాన్నగారికి ఇంకా ఏమూలో ఆశ కొట్టుమిట్టాడుతోంది.

ఒళ్ళు వేడిగానే ఉంది కదండీ అని నరసింహమూర్తిగారితో అన్నారు.

ఆయన ఓదార్చుతూ, 'మందుల వేడి అండీ. అంతే.' అన్నారు రుద్ధకంఠంతో.

నాన్నగారు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.  ఆయన చీకట్లో అరుగుక్రింద ఉన్నారు కాబట్టి ఆయన ముఖంలోని భావాలు నాకు తెలియరాలేదు.

మా అమ్మగారి ముఖం చూడటానికి నాకు ధైర్యం చాలలేదు. నేను అరుగుమీదే నిలబడి మమ్మల్నిలా అర్థాంతరంగా వదలి వెళ్ళిపోయిన పిల్లవాడి కేసే విచారంగా చూస్తూ ఉండిపోయాను.

చాలా సేపటి తరువాత మా బామ్మగారికి ఇంటిలోపలికి రావటానికి వీలయ్యింది.

అప్పడు ఆవిడకి స్ఫురించింది. ఎవరికీ ఆకళ్ళు లేకపోయినా పిల్లలు అభోజనంగా ఉదయం వరకూ ఉండలేరని. అందుకని లేచి ఏదో గబగబా వండి వడ్డించింది పిల్లలకి. ఎంతో ఓదార్చి బ్రతిమాలితే కాని పిల్లలెవరూ కూడా భోజనాలకు రాలేదు.

కంచంలో వడ్డించిన పదార్థాలు చూడగానే రామం అంతెత్తున ఎగిరాడు. మా తమ్ముడు చచ్చిపోయి మేం ఏడుస్తుంటే నువ్వు పప్పు వండుతావా అని పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు. ఆవిడ త్వరగా సిధ్ధం అవుతుందని పెసరపప్పు వండారు. తప్పు కాదు. కాని మాకలా అనిపించలేదు అప్పుడు. ఆవిడ చాలా కష్టపడి మాకు నచ్చజెప్పవలసి వచ్చింది.

మరునాడు నాకు కాలేజీకి అమలాపురం వెళ్ళక తప్పని పరిస్థితి. ఆ సోమవారం నుండి ఏవో పరీక్షలు మొదలు మరి.  మా నాన్నగారూ నేనూ కూడా పెద్దగా మాట్లాడు కోలేదు. ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేని మానసికస్థితి ఇద్దరిదీ. మా నాన్నగారు గంభీరులు స్వభావరీత్యా.  ఆయన కండ్లవెంట నీళ్ళు కారటం ఎన్నడూ చూడలేదు నేను. అయన విచారంగా ఉండిపోయారంతే, మిగతా అందరూ ఎంతో వ్యసనపడుతూ ఉన్నా.  ఆయన బాగా డీలా పడ్డారు కాని నాతో మాత్రం 'ధైర్యంగా ఉండు, పరీక్షలు బాగా రాయి' అన్నారంతే. మా నాన్నగారి పోలికే వచ్చిందేమో నాకళ్ళవెంటా ఒక్క బొట్టూ రాకపొవటానికి.

కాళ్ళీడ్చుకుంటూ బస్సు స్టాండుకు వెళ్ళి బస్సెక్కి కూర్చున్నాను. కొద్ది నిముషాల తరువాత మా స్నేహితుడు కన్నబాబు అమ్మగారూ చెల్లెలు ప్రసూనా వచ్చి నా ముందు వరుసలో కూర్చున్నారు. ఆ కుటుంబమూ మాకు బాగా ఆత్మీయులే. వారు కందుకూరి వారు. కన్నబాబు అనబడే వీర వేంకట సత్యనారాయణ నా క్లాస్ మేట్ బెంచ్ మేట్ స్కూల్లో. అతని తండ్రి  భాస్కరం గారు స్టేట్‌ బ్యాంక్ ఉద్యోగి. ఆయన మా నాన్నగారికి క్లాస్ మేట్ బెంచ్ మేట్ వాళ్ళ స్కూల్ రోజుల్లో. వాళ్ళింట్లో నేను యధేఛ్ఛగా వాళ్ళబ్బాయిలాగే మసిలే వాడిని. వాళ్ళింట్లోనే అప్పుడప్పుడూ భోజనం చేసేవాడిని. మాయింటికి వాళ్ళిల్లు కూతవేటు దూరంలోనే ఉండేది.

నేనూ వాళ్ళూ ఒకే‌ బస్సులో ఉన్నాం కొంచెం వెనుక ముందు సీట్లల్లో. కాని తమాషా ఏమిటంటే వాళ్ళు నన్ను గమనించనే లేదు. లేకపోతే తప్పకుండా పలకరించే వారు. ఒకవేళ వాళ్ళేదన్నా శుభకార్యానికి హాజరవటానికి అమలాపురం వెడుతున్నారేమో.  అందుచేత ఆ సమయంలో పరామర్శలూ అవీ తప్పు అనుకుని మౌనంగా ఉండిపోయారేమో. ఏదైనా కావచ్చు. కాని నా అభిప్రాయంలో ఐతే వాళ్ళిద్దరూ నన్ను నిజంగా గమనించలేదు. హడావుడిగా బస్సు బయలుదేరుతుండగా వచ్చి ఎక్కిన వాళ్ళు వెనుక  సీటులో విచారంగా కూర్చున్న అబ్బాయిని గమనించకపోవటంలో అశ్చర్యం ఏమీ లేదు కదా. కాని నిజం చెప్పాలంటే ఆనాడు అలా అలోచించానా అంటే లేదనే చెప్పాలి నిజాయితీగా. కొంచెం‌ మనస్సు కష్టపెట్టుకున్న మాట వాస్తవం. సరే శాఖాచంక్రమణం వదిలేద్దాం.

ఆ విధంగా శ్రీనివాసుడు మా కళ్ళ ముందు నుండి మా జ్ఞాపకాల్లోనికి జారిపోయాడు.

నాకైతే వాడు ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని మిగిల్చాడు తన స్మృతి చిహ్నంగా.

ఎప్పుడూ నేను చిన్నపిల్లల్ని ఎత్తుకోనన్నది చెప్పాను కదా.  వాడి విషయంలో మిహాయింపు ఇవ్వవలసి వచ్చింది ఒకసారి - అదే నాకు మిగిలిన గుర్తు.

ఒక రోజున మధ్యాహ్నం ముందుగదిలో వాడు చిన్నమంచం మీద నిద్రపోతున్నాడు. కొంచెం దూరంలో నేను చాపమీద కూర్చుని చదువుకుంటున్నాను.  ఎందుకనో ఒకసారి తలఎత్తి వాడికేసి చూద్దును కదా మంచం అంచుదాకా వచ్చేసాడు దొర్లుకుంటూ. ఈ క్షణమో మరుక్షణమో క్రిందకు పడిపోతాడన్నట్లున్నాడు. నేను ఒక గంతు వేసి వాడిని పైకితీసి ఎత్తుకొని ప్రక్కసరిచేసి జాగ్రత్తగా మంచం మధ్యలో పడుకోబెట్టాను.

బాబులు గారి జోస్యం అంతా కోరుకున్నట్లే చక్కగా ఫలించి మేము నలుగురు అన్నదమ్ముల మయ్యాం. కాని లక్ష్మీనారాయణ గారి జోస్యం కూడా మేము ఎంత వద్దువద్దని దణ్ణాలు పెట్టుకున్నా నిర్దాక్షిణ్యంగా ఫలించి అప్పట్లో మళ్ళా ముగ్గురమయ్యాం.

ఈ దీర్థకథనం ప్రారంభించిన నాటి మొన్నటి రాత్రి నిద్రాసమయంలో శ్రీనివాసుడిని గురించి తలచుకుంటుంటే ఆశ్చర్యంగా నా కళ్ళు చెమర్చాయి. డాంబికం వదలి చెప్పాలంటే బాగానే దుఃఖపడ్డాను.

ఏ కథను చెప్పే విషయం‌లో ఐనా మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని అని చెప్పమన్నారు. కాని వాస్తవ జీవిత సంఘటనలను చెప్పేటప్పుడు అంతా అలా ఉంటుందా?  రామాయణంలో సీతాపహరణం లేదా? మంచి చెడ్డలూ ఆశనిరాశలూ తప్పవు జీవితం అన్నాక. అలాగని నైరాశ్యంలో మునిగిపోతే జీవితం భరించశక్యంగా ఉంటుందా చెప్పండి?  ఇది చదివి ఎవరైనా మనస్సు కష్టపెట్టుకుంటే క్షమించండి. ముందు ముందు కథ మంగళయుతంగానే ఉంటుంది లెండి.

(నాలుగవ భాగం రేపు మీ ముందుకు వస్తుంది) 


 

6 కామెంట్‌లు:

  1. శ్రీనివాసుడి మరణం దురదృష్టకరం. కేశిరాజు లక్ష్మీనారాయణ గారు హెచ్చరించినట్లే జరిగిందన్నమాట చివరికి.
    తర్వాత అడుగుదామని నేను ఆపిన సందేహం ఇప్పుడు అడుగుతున్నాను. మీ కథ రెండోభాగంలో ఒక చోట మీరు అన్నారు - ఇంకా జాతకం వేయించలేదండీ అని లక్ష్మీనారాయణ గారితో మీ తండ్రిగారు అంటున్నప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారిని వారిస్తూ సంజ్ఞలు చేశారు అని. ఆ ప్రస్తావన మీ అమ్మగారికి ఎందుకని నచ్చలేదో? లక్ష్మీనారాయణ గారు సమర్ధుడైన జ్యోతిష్కుడిలాగానే ఉన్నారుగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట వారూ, మీ‌ సందేహానికి రేపటి భాగంలో సమాధానం‌ ఉంటుంది.

      తొలగించండి
  2. 'చిన్ని శ్రీనివాసుడు పెద్ద శ్రీనివాసుడి దగ్గరకు వెళ్ళిపోయాడు.'
    చదివి మనసంతా ఏదోలా అయిపోయిందండీ!

    రిప్లయితొలగించండి
  3. గుండె పిండేసారండి. "ఫలించిన జోస్యం" అనేదానికంటే "ఓ చేదు జ్ఞాపకం" అని ఉంటే బాగుండేదేమో? చివరి వరకూ ఎలాగో ఒకలాగ కుర్రాడు బతికి బయటపడతాడనే అనుకున్నాను.

    ఇంతకీ ఏమి జబ్బు చేసింది కుర్రాడికి? ఋణానుబంధ రూపేణా...అనుకోవాలి కాబోలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Acute dehydration కారణమండీ. ఫలించిన జోస్యం అనేది మొత్తం పూర్తి కథకు సంబంధించినది కదా. ఇంకా కొంత వ్రాయవలసి ఉంది. కొసదాకా చదవండి.

      తొలగించండి
  4. మీ కథకి అంత సంబంధంలేదు, కానీ డాక్టర్ల ప్రస్తావన చూస్తే గుర్తొచ్చింది. మీరు పేర్కొన్న డాక్టర్లతో బాటు ఆరోజుల్లో కొత్తపేటలో డాక్టర్ సత్యవోలు రామ్మూర్తి గారు కూడా ఉండేవారని గుర్తు. కదా?

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.