3, జూన్ 2016, శుక్రవారం

అడిదం సూరకవి గురించి..

ఈ రోజున మనలో మనమాట టపాలో మాలతి గారు సూరకవిగారి చాటువుని ఉదహరించినందుకు సంతోషం. ఐతే దాని పాఠం కొంచెం సరిచేయాలి, క్రింద చూపినట్లుగా

క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలందు యుద్ధములందున్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!

ఈ పద్యాన్ని గురించిన సందర్భంలో ఆవిడ కొంచెం పొరబడ్డారు. రాజుగారు పూసపాటి విజయరామ గజపతి రాజు గారు. పూసపాటి సీతారామరాజు గారు రాజుగారికి (సవతి) అన్నగారు.  కవిగారికీ రాజుగారికీ ప్రాణస్నేహం. సీతారామరాజు గారికి కవిగారి పొడగిట్టదు. అదీ సంగతి. అందుచేత వీలైనప్పుడల్లా సూరకవిగారిని సీతారామరాజుగారు తప్పుపట్టుకుంటూనే ఉండే వారు. ఏదో ఒక సందర్భంలో కవిగారు రాజుగారిపై చెప్పిన పద్యంలో ఏకవచనసంబోధన ఉందని తప్పులెన్ని సీతారామరాజుగారు ఆగ్రహించారు.. రాజుగారు సరసులు కాబట్టి ఆయనకేమీ ఇబ్బంది కాలేదు. సీతారామరాజుగారి ఆక్షేపణను సూరకవిగారు తక్షణం తిప్పికొడుతూ చెప్పినదే ఈ పద్యం.

సూరకవిగారు గురించి ఇంకొంచెం. చెప్పుకుందాం సందర్భం వచ్చింది కాబట్టి

ఒకసారి రాజులందరూ ఒక సమావేశం జరుపుకుంటున్నారు. అందరు రాజులూ మధ్యమధ్యలో వినోదవిజ్ఞానకార్యక్రమాలూ ఉండాలి కదా అని తమతమ రాజ్యాలలోని కవుల్నీకళాకారుల్నీ కూడా తీసుకొని వెళ్ళారు. సీతారామరాజుగారు చాలా తెలివిగా రాజుగారికి సగం సగం వివరాలే అందించటం వలన ఆయనకు విషయం తెలియక ఒక్కరే వెళ్ళారు. తీరా అక్కడ కవులు పదిమందీ తమ తమ కవితా చాతుర్యాన్ని చక్కగా ప్రదర్శిస్తూ ఉంటే, తమ తమ రాజుల్ని పెద్దచేసి పొగడుతూ పద్యాలను వినిపిస్తుంటే విజయరామరాజుగారికి చాలా విచారమూ మనస్తాపమూ కలిగాయి. అయ్యో వీళ్ళంతా సూరకవికి సాటివచ్చే వాళ్ళా, నాకు తెలియకపోయిందే కవిగారిని తీసుకొని రావాలనీ అని విచారించారు. ఇదంతా ఎవరో బయటివాళ్ళు చేసిన పన్నాగం కాదనీ సాక్షాత్తూ అన్నగారే సూరకవిమీద అక్కసుతో ఆయన్ని పక్కన పెట్టాలని ఇలా చేసాడని మథన పడ్డారు. అంతలో ఖంగున వినిపించిది ఒక రసగుళిక.

రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీను డంబికా
రాజు దిగంబరుండు మృగరాజు గుహాంతరసీమవర్తి వి
భ్రాజిత పూసపాడ్విజయరామనృపాలుడు రాజుగాని ఈ
రాజులు రాజులా పెనుతరాజులు కాక ధరాతలంబునన్

అందరూ ఆశ్చర్యపోయారు. 

విజయరామరాజుగారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు.  సూరకవి .. సూరకవి. వచ్చాడయ్యా. వచ్చాడు. ఎంతగొప్ప పద్యం చెప్పాడూ తనమీద!

తనపరువు నిలబెట్టిన సూరకవిని మనస్సులో వేనోళ్ళ కీర్తించారు.

ఐతే కొందరు విరసులూ ఉంటారు కదా అన్ని సభల్లోనూ! అలాగే కవిత్వసారస్యం తెలిసీతెలియని కొందరు రాజులు 'విజయరామ నృపాలుడు రాజు కానీ, ఈ రాజులు రాజులా' అని ఈ సూరకవిగారు తమందరినీ ఆక్షేపించాడని గింజుకున్నారు. కొందరు రంకెలు వేసారు.

అప్పుడు సూరకవి అన్నాడు కదా. 'మహారాజులారా. నేను మీలో ఎవరినీ చిన్నబుచ్చటం లేదు.. మీరు పొరపడకుండా సరిగా అర్థం చేసుకోండి మరి. పద్యంలో ఉన్న రాజుల్ని గురించే 'ఈ రాజులు రాజులా' అన్నానండీ ' అని ఇలా వివరణ ఇచ్చుకున్నాడు. కాదనటం ఎలా?

మొదటి రాజుగారు,  రాజు అంటే చంద్రుడు - ఆయనేమో కళంకమూర్తి అంటే ఒంటిమీద మచ్చలవాడు. తరువాతి రాజు రతిరాజు అంటే మన్మధుడు. సరిసరి వాడికి అసలు శరీరమే లేదు అందుకే వాణ్ణీ శరీరవిహీనుడూ అని తీసి పక్కన పెట్టింది. మూడవది అంబికారాజుగారి వంతు. అంబిక అంటే పార్వతీదేవి గారు కాబట్టి ఇక్కడ శివుడి గురించి చెప్పాలి. ఏం చెప్పాలీ, ఆయనకు కట్టుకుందుకు బట్టలకే కరువాయె. పక్కన పెట్టేద్దాం, దిగంబరుడికేం గొప్ప లెండి.  ఇకపోతే మహామహా మృగరాజు గారు అంటే సింహం అన్నమాట. ఏం గొప్ప లెండి అడవికి రాజట - పోయి గుహల్లో నక్కి ఉంటుంది -దాని రాజమహలు కొండగుహేను. అందుకే ఈ రాజులంతా ఏపాటి రాజులూ అన్నది.  అందుచేత గొప్ప కీర్తిమంతుడైన మా రాజుగారు పూసపాటి విజయరామ రాజుగారితో పద్యంలో ముందు చెప్పిన రాజులంతా పోల్చటానికి పనికిరారూ అని చెప్పానూ అన్నది సూరకవి గారి వివరణ అండి.

తిరుగు ప్రయాణంలో రాజుగారిని మీరు సమయానికి వచ్చి  భలేపద్యం చెప్పి నా పరువు కాపాడి రక్షించారండీ కవిగారూ అని పొగడి, మీకెలా  తెలిసిందీ వార్త అంటే కవిగారు నగరంలో సభగురించిన వార్తవిని మీరు నన్ను తీసుకొని పోకుండా వెళ్ళటంలో ఏదో పొరపాటు ఉందనిపించి పరుగున వచ్చాను మహారాజా అని విన్నవించాడట.

సూరకవిగారు శాపానుగ్రహసమర్థుడని ప్రతీతి. దాని గురించి ఒక ఐతిహ్యం. సరవయ్య అనే ఒక సెట్టిగారు ఈ కవిగారికి తాను వార్షికం ఇస్తానని ఒకసారి ఏదో సందర్భంలో అందరిముందూ  గొప్పకోసం అన్నాడు కాని తీరా ఇవ్వటానికి మాత్రం చేతులు రాలేదు. రేపురా మాపురా అని త్రిప్పుతూ ఉండే వాడు కవిగారిని. సూరకవి ఓపిగ్గా తిరుగుతూనే ఉండే వాడు. ఒకసారి ఉదయమే సూరకవి సరవయ్య ఇంటికి వెడితే ఆప్పుడు ఆ మహానుభావుడు బారెడు పొద్దెక్కాక లేచి దంతధావనం చేస్తున్నాడు. కవిగారు పొద్దున్నే గుమ్మంలో నిలబడేసరికి చిరాకు నెత్తికెక్కి, 'దాచిపెట్టిన సొమ్మన్నట్లు వచ్చాడే వీణ్ణి పాం గరవ' అన్నాడు.  సెట్టిగారి అరుగుమీద ఉన్న వాళ్ళంతా వికవికా నవ్వారు.  కవిగారు విస్తుపోయి ఆనక ఆగ్రహంతో ఊగిపోతూ, 'ఆపామే నిన్నుకరవ అయ్యో సరవా' అని పలికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సెట్టిగారు దంతధావనం ముగించి పైకి లేచీ లేవగానే ఎప్పుడు వచ్చిందో ఒక పాము చూరునుండి క్రిందికి దిగి ఫెడీ మని కాటువేసింది!

సూరకవిగారు మహా అభిమానధనుడు. పేదరింకం అనుభవిస్తూ కూడా రాజుగారిని ఎప్పుడూ దేహీ అన లేదు. గమనించిన రాజుగారే ఏదో వంకపెట్టి ఇచ్చినా పుచ్చుకోడు కదా ఈ కవి అని ఒక ఎత్తు వేసారు.  కవిగారికి కనకాభిషేకం చేసారు. తనమీద గుమ్మరించిన బంగారాన్ని సభలో ఉన్న కవిపండితులకి పంచేసాడు సూరకవి. రాజుగారు హతాశులయ్యారు.  ఇదేమిటయ్యా నీకోసం ఇంత బంగారం ఇస్తే ఇలా చేసావూ అని నిష్ఠూరం ఆడితే సూరకవిగారు తాపీగా అన్నాడు కదా, 'మహారాజా తాను స్నానంచేసిన నీళ్ళను ఎవ్వడూ తాగటానికి తీసుకుపోడు కదా' అని!

6 కామెంట్‌లు:

  1. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్తుంటే విన్న విశేషాలు ఇవి . మర్చిపొయాను - ఎక్కడినా దొరికితే బావుండును అనుకున్న పెన్నిధి - మీ బ్లాగ్ లో ఇలా దొరికింది. ధన్యవాదాలు అనేది చిన్న మాట.

    మీరేమనుకోనంటే ఒక్క మాట సరిచేయగలరా - ఐదవ పేరాలో "కవిల్నీ కళాకారుల్నీ" అనివుంది - అది "కవుల్నీ కళాకారుల్నీ" అని వుండాలేమో కదండీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం బ్లాగుకు సుస్వాగతం. స్పందించినందుకు ధన్యవాదాలు లలిత గారూ. మీరు సూచించిన ముద్రారాక్షసం సరిచేసానండీ.

      తొలగించండి
  2. మీ బ్లాగులో ఈ పద్యాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు పోగొట్టుకున్న ఇష్టమైన వస్తువేదో మళ్ళీ దొరికినట్టనిపించింది. ఓ ప్రియ నేస్తంతో ప్రొద్దున్నే మాట్లాడుతూ ఇంకొన్ని పద్యాలు గుర్తు చేసుకున్నాము. అంత మంచి పద్యాన్ని గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శ్యామలీయం గారూ,
    సూర కవి గురించిన కథా కథనం బాగుంది. ఇంకొక్క విశేషం కూడా ముచ్చటిస్తే, సమగ్రమవుతుంది.
    తురగా రామకవి అని సూరకవి సమకాలీనుడు ఇంకో కవి ఉండేవాడు. ఆయన ఈయన కన్నా పెద్ద తిట్టు కవి.
    ఒకసారి సూర కవి తనొక కొత్త ఇంటిని తనకు తానే నిర్మించుకుంటూ ఇంటి పైకప్పు మీద కూర్చుని ఆ దారిలో వచ్చీ పోయే ప్రతొక్కరిని క్రింది నించి ఒక్కో రాయిని తనకు అందించమని 'జబర్దస్తీ'గా అడిగి మరీ ఇప్పించుకుంటూ ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. అంతలో అటుగా రామ కవి వెళ్తూ ఉన్నాడు. ఆయన పేరు మాత్రమే విన్నవాడవటం మూలాన, ముఖ పరిచయం లేకపోవడం మూలాన... రామ కవిని కూడా రాయినందివ్వమని అడిగి,ఆయన పట్టించుకోకుండా ముందుకి వెళ్లిపోతూంటే ' సూర కవి తిట్టు కంసాలి సుత్తి పెట్టు ' అని ఘీంకరించాడు ఆ హెచ్చరిక వినైనా ఈ క్రొత్త వ్యక్తి భయపడతాడేమో అని. ఆ వచ్చిన వాడంతకంటే పెద్ద గొంతుకతో ' రామ కవి బొబ్బ పెద్ద ఫిరంగి దెబ్బ ' అని గర్జించే సరికి అంతటి సూరకవి ఇల్లు దిగి క్రిందికి వచ్చి రామ కవినాశ్రయించాడు. ఆయన ధాటి అటువంటిది మరి.

    ఈ ఉపకథ తరువాత,

    చిన్నప్పుడు రతికేళిక/ నున్నప్పుడు అనేది పాఠాంతరం. లేదా చిన్నప్పుడు రతికేళిని ...అని వ్రాస్తే , రతికేళిని/ యున్నప్పుడు అని కాకుండా , రతికేళిని/ నున్నప్పుడు అని సవరించండి. యడాగమం పరిహరించండి.

    రిప్లయితొలగించండి
  4. చక్కటి ఉపమానం. కవి యొక్క పాండిత్య ప్రతిభని మీదైన శైలిలో బాగా విసిదీకరించారు. కొత్త విషయాలు తెలుసుకున్నమన్న ఆనందం తో మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.