1, జూన్ 2016, బుధవారం

జూన్ 2వ తారీఖు.


  ధర్మపక్షాన నార్తనాదములు మిగుల
  నవలి పక్షాన నుత్సాహ మతిశయింప
  తెలుగు గడ్డను రెండుగా తెగనఱకిన
  జూను రెండవ తారీకు క్షుద్రదినము

  కానిపనులను చేసెడు కాంగిరేసు
  పూని విభజించి తెలుగింటి పుట్టిముంచి
  బాగుపడలేదు మునుముందు బాగుపడదు
  పాడుపనులకు తెగబడు పాపిగాన

  చిన్న రాష్ట్రాలు మా పాలసీ యటంచు
  పోయి కాంగ్రేసు  వారితో చేయి కలిపి
  నేడు ముదనష్టలబ్ధికి మురియుచున్న
  భాజపా కూడ తక్కువ పాపికాదు

  దుష్టపార్టీలు రెండును తోడుదొంగ
  లన్న తప్పేమి యునులేదు మొన్నమొన్న
  నన్ని ప్రియములు పలికిన యాత్రగాళ్ళు
  మొండి చేతులు చూపించుచుండి రిపుడు

  మాట నిలబెట్టుకొమ్మని మరలమరల
  బ్రతిమలాడుట మరియింత పలుచనగుట
  కాక నొరగెడి దేమియు కాన రాదు
  కాలమే యిచ్చు నన్నియు కరుణమీఱ

  ఇచ్చి చచ్చున దేమున్న దీతుళువలు
  మోసపోయిన యాంద్రులు ముందుముందు
  విభవమొప్పార సత్కీర్తి ప్రభలు తోడ
  తేజరిల్లుట తధ్యము దిక్కులదర

  కూటవిజయాల గొప్పలు కూలిపోవు
  నాత్మశక్తియొ యాంధ్రుల కన్ని యిచ్చు
  కాలమే వారి పక్షమై కరుణచూపు
  ధర్మపరులకు దైవమే దారి చూపు

  కాన పునరంకితులు కండు జూను రెండు
  క్షుద్రదినమైన కానిండు క్షోభమాని
  నవనవోజ్వలదివ్యాంధ్ర నవతరింప
  జేయ ఘనదీక్ష బూనుడీ చిత్తములను

  ఆంధ్రతేజమా యీదీక్ష యవసరమ్మె
  ఆంధ్రవీరుడా యీదీక్ష యవసరమ్మె
  ఆంద్రభామినీ యీదీక్ష యవసరమ్మె
  ఆందరీ దీక్ష  గొనుడు నవ్యాంధ్రకొరకు2 వ్యాఖ్యలు:

 1. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నా కుల దీక్షలు , ఆందోళనల మీద మీ అభిప్రాయం చెప్పగలరా.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. A system is as strong as its weakest component అని ఒకటుంది నానుడి. ఒక పెద్ద యంత్రం సరిగా పనిచేయకపోవటానికి దానిలోని ఒక అతిచిన్న సీల చెడిపోవటం‌ కారణం‌ కావచ్చు. అలాగే దేశంలో ఏ యంత్రాంగం ఐనా సమాజంలో ఏ వ్యవస్థ ఐనా సరిగా నడవాలంటే అన్నివిధాలా సరిగా ఉండాలి. చిన్న పనీ పెద్ద పనీ చిన్న ఉద్యోగీ పెద్ద ఉద్యోగీ అంతా ఈ విషయంలో ఒకటే. రైల్వేలో ఒక సర్వాధికారి ఎంతో ఒక గేట్ మెన్ కూడా అంతే ముఖ్యం - అతను కనుక గేట్‌ను సరిగా నిర్వహించకపోతే అనేక ప్రాణాలు పోతాయి, సమయస్ఫూర్తితో వందల ప్రాణాలు కాపాడబడతాయి.

   ప్రతిభా, పేదరికమూ అనేవి కొలమానాలు కావాలి ఎంపికకూ‌ ప్రోత్సాహకాలకూ. కులమతాలు ఆధారంగా ప్రోత్సాహకాలూ ఎంపికలూ అన్నవి ఓటుబాంక్ రాజకీయులకు తప్ప సమాజవికాసానికి తోడ్పడవని నా ఉద్దేశం. ఈ మాటను అందరూ అంగీకరించక పోవచ్చును - అది వేరే విషయం.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.