19, జూన్ 2016, ఆదివారం

ఫలించిన జోస్యం - 1 (బాబులు గారి కథ)

బాబులుగారు మా యింటికి వచ్చారు.

వచ్చారంటే వచ్చారు అనే చెప్పగలను కాని ఆరోజున మాయింటికి ఆయన్ను నేను పిలుచుకు వచ్చానో లేక మానాన్నగారు ముందుగానే చెప్పటం వలన ఆయనంతట ఆయనే వచ్చారో ఈ రోజున సరిగా గుర్తుకు రావటం లేదు.

బాబులుగారు అంటే అయన అసలు పేరు అది కాదు. అయన పేరు తాడిగడప బసవరాజు గారు.

తాడిగడపవారు అన్నాను కాబట్టి మా యింటి పేరే వారిదీ‌ కాబట్టి, ఆయనకూ‌ మాకూ‌ బంధుత్వం ఏదో ఉందనుకునేరు. అలాంటిదేమీ లేదు.  మేము అరువేల నియోగులం ఐతే వారు లింగధారులు. గోత్రాలు కూడా వేరు అనే గుర్తు. మేము ఆ ఊరికి రాకముందే ఈ బాబులుగారు మా నాన్నగారికి సుపరిచితులు. మా నాన్నగారు కూడా తన చిన్నతనంలో కొత్తపేటలోనే చదువుకున్నారు. ఇప్పుడు నేను చెబుతున్నది మేము మానాన్నగారికి గెద్దనాపల్లె నుండి కొత్తపేటకు బదిలీపైన వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత జరిగిన ఒక సంఘటన  గురించి.

మేము కొత్తపేటకు వచ్చే నాటికి మా యింట్లో రేడియో లేదు. మేము ఆ ఊరు వచ్చిన కొత్తలోనే ఒక నాడు మా నాన్నగారు నన్ను బజారుకు తీసుకొని వెడుతూ మనింట్లో ఒక రేడియో ఉంటే బాగుంటుంది కదూ‌ అన్నారు. అప్పుడు మేమొక దుకాణంలోనికి వెళ్ళాం. అది బాబులు గారిది. మా నాన్నగారూ ఆయనా ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కాని కొద్ది రోజుల తరువాత తమ  రెక్స్ కంపెనీ‌ రేడియో ఒకటి మా యింటికి బాబులుగారే స్వయంగా తీసుకొని వచ్చారు. దాని బాడీ పనస చెక్కతో చేసారని తరువాత మా నాన్నగారు చెప్పారు. కొన్నాళ్ళ తరువాత బాబులుగారితో నేను ఏదో సందర్భంలో పనస చెక్కే ఎందుకూ అంటే ఆయన సంగీతవాయిద్యాలు కూడా పనసచెక్కతోనే‌ చేస్తారు తెలుసా, ఎందుకంటే పనసచెక్క అద్భుతమైన నాదం ఇస్తుంది కాబట్టి అని చెప్పారు.

బాబులు గారు కొద్ది కాలం తరువాత తన రేడియో కంపెనీని మూసేసారు. కారణం మామూలుగా జరిగేదే - భాగస్వామి మోసపూరిత ప్రవర్తన.  అన్నట్లు బాబులు గారు పెద్ద ఎలక్ట్రానిక్ ఇంజనీరు అని మీకు ఇప్పటి దాకా చెప్పనేలేదు! కంపెనీ మూసేసాక ఆయన మరేమీ పని చేయలేదు. అప్పటికి నడివయస్సులో ఉన్న ఆయన బోలెడంత సంపాదించారు కాబట్టి ఆ ఊళ్ళో కూర్చుని తిన్నా అయనకు రాజభోగంగానే జరిగేది. ఈ‌ బాబులుగారు ఆ రోజుల్లోనే‌ ఫారిన్ రిటర్న్డ్ - అమెరికాలో పదేళ్ళుండి వచ్చారు.  ఈయన దూరదేశంలో ఉండిపోయారని పెద్దవాళ్ళు గోలపెడితో సరేనని చెప్పి అక్కడి ఉద్యోగం వదిలిపెట్టి మనదేశానికి తిరిగి వచ్చేసారట.

మేము మా యింటికి ఒక రేడియో వచ్చేనాటికి డాబాసత్తెమ్మ గారి ఇంటిలో అద్దె కుండేవాళ్ళం.  ఒక సంవత్సరం చిల్లర కాలం అక్కడుండి తరువాత గర్ల్స్ హైస్కూలు ఎదురుగా ఉన్న తాడిగడప రాఘవరావు గారి ఇంట్లోకి మారాం.  ఈ రాఘవావుగారి తమ్ముడు తాడిగడప సత్యనారాయణరావు మా నాన్నగారికి క్లాసుమేటు మరియు స్నేహితుడూను. ఈ రాఘవరావు గారింటికి వెనుకనే బసవరాజు గారి ఇల్లు. ఈ రెండిళ్ళకీ మధ్యన ఒక అడ్డుగోడ ఉండేది - దానిలో కొంతభాగం అప్పటికే పడిపోయి రెండిళ్ళకీ మధ్య రహదారే ఉండేది. గోడ ఉన్నది పేరుకు మాత్రమే. అందుచేత మా కుటుంబానికీ బాబులు గారి కుటుంబానికీ మంచి స్నేహం ఉండేది.

తరచుగా ఒక తమాషా జరిగేది. మా నాన్నగారు ఇంటి అద్దెను విజయవాడకు మనియార్డరు చేసినప్పుడు పోష్టాఫీసు గుమాస్తాలు గందరగోళంలో పడేవారు.   తాడిగడప సత్యనారాయణ గారు తాడిగడప సత్యనారాయణ గారికి  మనీఆర్డరు చేయటం ఏమిటా అని!

కాలక్రమేణా బాబులుగారికీ‌ నాకూ మధ్య చాలా చనువు ఏర్పడింది. ఒక్కో సారి వాళ్ళింట్లోనే పడుకునే వాణ్ణి కూడా.  నా ప్రాణస్నేహితుడు గుడిమెళ్ళ పాండురంగారావూ, నేనూ, బాబులుగారూ, ఆయన కూతురు కుమారీ కూర్చుని అర్థరాత్రి దాటేదాకా ఢంకాఫలాసు ఆడుకునే వాళ్ళం. ఆఁ, ఢంకాఫలాసు అంటే మరేమీ లేదండీ మూడుముక్కలాట - సినిమాల్లో చూపించే మూడాసుల ఆట అదే. మా ఆటకు కావలసిన ధనం అంతా పాత పేకముక్కల రూపేణా వాళ్ళ ఇంటినిండా గుట్టలు గుట్టలుగా ఉండేది. అనంతర కాలంలో బాబులుగారికి మా పాండురంగారావు అల్లుడయ్యాడనుకోండి, అది వేరే కథ.  పెళ్ళికి ముందే వాళ్ళ కుటుంబాల మధ్యా చుట్టరికం కూడా ఉంది.

కథలో ప్రవేశిస్తూనే బాబులుగారి గురించి చెబుతూ ఎక్కెడికో వెళ్ళిపోయాను కదూ. మన్నించాలి, ఆయనకూ నాకూ‌ మధ్యన ఉన్న బంధం దొడ్డది మరి - నేను హైదరాబాదు వచ్చిన తరువాత కూడా అయన ఏదైనా పనిమీద ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు వర్తమానం చేసేవారు. ఒకటి రెండు రోజులు సినిమాలూ షికార్లతో జల్సా చేసేవాళ్ళం. ఒకసారి ఆయనతో కలిసి It's a Mad, Mad, Mad, Mad World సినిమా చూసాను. బహుశః అదే నేను చూసిన మెట్టమొదటి ఇంగ్లీషు సినిమా.  ఇంత అనుబంధం ఉన్న కారణంగా కొంచెం‌ ఎక్కువగానే వ్రాసాను. సరే ఇక అసలు కథలోకి బుధ్ధిగా వచ్చేస్తున్నాను.

ఇంటికి వచ్చిన బాబులు గారు కాఫీ గట్రా సేవించి పనిలో‌ పడ్డారు. సత్యనారాయణా నీ జాతకం ప్రకారం కొడుకు గ్యారంటీ ఈ సారి అని చెప్పారు. మా నాన్నగారి చాలా ఆనందం‌ కలిగిందని వేరే చెప్పాలా మరి? అప్పటికే నాకు బోలెడు మంది చెల్లెళ్ళున్నారు. ఇద్దరు తమ్ముళ్ళూ ఉన్నారు. అన్నట్లు ఇంట్లో పెద్దకొడుకును అనే కాదు మా నాన్నగారి ప్రథమసంతానాన్ని నేనేను.

బాబులుగారు నాన్నగారి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరొక ముక్క కూడా చెప్పారు.సత్యనారాయణా, నీ‌ జాతకం ప్రకారం నీకు ఖచ్చితంగా నలుగురు కొడుకులు అని.

ఎవరూ అపోహపడ నవసరం లేదు. బాబులుగారు ఔత్సాహిక జ్యోతిష్కులు మాత్రమే.  అయనేమీ జ్యోతిషం మీద సంపాదన చేయటం లేదు - ఆయనకు ఆ ఉద్దేశమూ లేదు అవసరమూ లేదు. కేవలం మారెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహసంబంధాల కారణంగానే, మా నాన్నగారి కోరిక మేరకే ఆయన నాన్నగారి జాతకాన్ని పరిశీలన చేసారు.(రెండవ భాగం రేపు వస్తుంది)

3 కామెంట్‌లు:

 1. నిజానికి ఈ‌ కథను ఈ‌రోజునుండే ప్రారంభించాలని అనుకోలేదు. నిన్ననే మొదటి రెండు భాగాలూ వ్రాసాను. మొత్తం మూడునాలుగు రోజుల్లో అంతా పూర్తిచేసాక వేదాం వరుసగా అనుకున్నాను. ఈ‌రోజున ఫాదర్స్ డే అంటూ భండారు వారు ఒక టపా వేసారు. అది చూసాక, నా ఈ కథనం కూడా ఈ రోజునుండే ఇస్తే సముచితంగా ఉంటుందని అనిపించింది. మొత్తం నాలుగైదు భాగాలుగా వస్తుందని అనుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 2. కథ మొదటి భాగంలోనే బోల్డన్ని విశేషాలు చెప్పారు మీరు. మిగిలిన భాగాలకి ఎదురు చూస్తున్నాను.

  ~లలిత

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఈ రోజున రెండవభాగం టపా ప్రచురించానండీ. చదివి మీ‌ అభిప్రాయం చెప్పండి.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.