22, జూన్ 2016, బుధవారం

ఫలించిన జోస్యం - 4 (అయాచితజోస్యం కథ )


(మొదటిభాగం    రెండవభాగం    మూడవభాగం)


క్రమంగా మా శ్రీనివాసుడు మాకొక ఙ్ఞాపకంగా మిగిలిపోయాడు. కాలం అనేది మనస్సులకు తగిలే గాయాలకు మరపు అనే మందుపూత వేస్తుంది. అందరమూ మెల్లగా వాస్తవజగత్తులోనికి వచ్చాం.

ఒకటి రెండు సార్లు మాత్రం నాన్నగారు శ్రీనివాస్ ఉంటే ఎంత బాగుండేది అని విచారంగా అన్నారు నాతో.

మా నాన్నగారు ఉద్యోగరీత్యా కొత్తపేటలో పదేళ్ళపాటు నివాసం ఉన్నారు. ఆరోజుల్లో ఉపాధ్యాయులపట్ల లోకానికి గొప్ప గౌరవం ఉండేది. ఈనాడు అంత గౌరవం ఉందా అన్నది అనుమానమే.

అప్పుడప్పుడు నాన్నగారు ఒక మాట అనేవారు. కలెక్టరు ఉద్యోగం చేసినవాడికి రాచమర్యాదలు జరగవచ్చు. కాని అ ఉద్యోగానంతరం సాధారణంగా అతను పదిమందిలో ఒకడే. ఒకసారి ఉపాధ్యాయుడిగా పనిచేసాక జీవితాంతం అందరూ మాష్టారూ అంటూ గౌరవంగా నమస్కరిస్తారు అని.  మా నాన్నగారితో నేను జజార్లో నడుస్తూ వెళ్ళుతున్నప్పుడు అనేకమంది వాహనాలు - అవేలెండి సైకిళ్ళు - దిగి నమస్కారం చేసి ఆయన్ను పలకరించటం నా స్వానుభవంలో చాలా తరచుగా చూసాను. అందుచేత నాకూ‌ ఉపాధ్యాయవృత్తి పట్ల చాలా ఆకర్షణ ఉండేది.

ఒకటి రెండుసార్లు మా యింటికి యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు గారు వచ్చారు. ఆయన కపిలేశ్వరపురం జమిందారు గారు. తూర్పుగోదావరి జిల్లాపరిషత్తుకు ఆయన ఛైర్మన్ కూడా. ఆయనకూ మానాన్నగారికీ స్నేహం‌ ఎలాగో నాకు వివరం తెలియదు. మా నాన్నగారికంటే ఆయనే కొద్దిగా పెద్దవారు. పాఠశాలల నిర్వహణ విషయంలో మా నాన్నగారికి మంచిపరిఙ్ఞానమూ నైపుణ్యమూ‌ ఉన్నాయని జిల్లావ్యాప్తంగా మంచి పేరు ఉండేది. అప్పుడప్పుడూ ఆయన పిలుపు మేరకు నాన్నగారు పరిషత్ కార్యాలయానికి కాకినాడ వెళ్ళిన సందర్భాల్లో‌ కొన్ని సార్లు ఆయన వెంట నేనూ‌ ఉన్నాను - అక్కడ నాన్నగారికి కార్యాలయంలో చాలా ఆదరణా పలుకుబడీ ఉండేవన్నది నా ప్రత్యక్షానుభవం పైన తెలిసిన సంగతులే.

పిల్లల చదువుల నిమిత్తం తాను చదువుకొన్న ఊరు కొత్తపేటకే వచ్చి నాన్నగారు స్థిరపడినట్లున్నా ఉద్యోగికి బదిలీలు తప్పవు కదా. ఇప్పటికి తప్పదని నాన్నగారికి రంపచోడవరం బదిలీ చేసారు. అదొక సమస్యాత్మకమైన ఉన్నత పాఠశాల. పిల్లల్లో ముఠాలూ టీచర్లలో ముఠాలుగా పరిషత్తువారికి అదొక తలనొప్పి ఐపోయిందట. బహుశః మా నాన్నగారి సలహామేరకే అక్కడి స్టాఫ్ అందరినీ చెల్లాచెదరుగా బదిలీలు చేసి కొత్త స్టాఫ్ ఏర్పాటు చేసారు. ప్రధానోపాధ్యాయులుగా నాన్నగారు బదిలీ మీద వెళ్ళారు.

రంపచోడవరం చేరేనాటికి నా అమలాపురం చదువు పూర్తి కావటంతో డిగ్రీ చేతికి వచ్చి నేను ఉద్యోగప్రయత్నాలు మొదలు పెట్టాను. టైప్ రైటింగ్ లోయర్ పరీక్షలకు సిధ్ధంగా ఉన్నా ఆ బదిలీ‌కారణంగా పరీక్షలు ఇవ్వటం వాయిదా వేసుకోవలసి వచ్చింది. మాకు అక్కడ ఒక క్వార్టర్స్ ఇచ్చారు. దాంట్లో కరంటు సదుపాయం‌ లేదు! ఆ ఊరికి వార్తాపత్రికలు‌ సమయానికి వచ్చేవి కావు ఆరోజుల్లో. నా ఉద్యోగప్రయత్నాలు కొంచెం‌ నింపాదిగానే సాగుతున్నాయి. అప్పటికే జిల్లాపరిషత్తులో అన్‌ట్రైన్‌డ్ టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు పంపుకున్నాను. పత్రికల్లో వచ్చిన వాటికీ దరఖాస్తులు పంపుతున్నాను. ఏ ప్రయత్నాలూ  ఫలోన్ముఖం కాక నిరాశగా ఉండేది.

నేను కొత్తపేటలో ఉన్నప్పుడు ఎలా మా మాతామహుల ఇంటికి దాదాపు ప్రతి వేసవిసెలవుల్లోనూ వెళ్ళి వచ్చేవాడినో అలాగే రంపచోడవరంలో ఉన్నా వెళ్ళాను. నేను వెళ్ళేది ముఖ్యంగా నాకు ప్రాణసమానురాలైన మా బేబీపిన్నిని చూడటం‌ కోసమే.

అలా వెళ్ళిన ఒక సందర్భంలో ఒకనాడు అక్కడికి లక్ష్మీనారాయణగారు వచ్చారు. వారి సోదరి ఇల్లే‌ కదా. నిజం చెప్పాలంటే కొంచెం‌ బియ్యం‌ వగైరా అడగటానికే అయన ఆరోజున వచ్చారు. ముందుగదిలో నేనూ బలరామకృష్ణులూ‌ ఉన్నట్లున్నాం. వాళ్ళు నా మేనమామలు - నాకంటే చిన్నవాళ్ళు.  లక్ష్మీనారాయణగారు వచ్చి మాతో కబుర్లు వేసుకున్నారు.

మా బేబీపిన్ని వచ్చి నన్ను లోపలికి పిలిచింది ఏదో‌ పనిమీద. ఈలోగా ఈయనే పలకరించారు నన్ను.

ఉన్నట్లుండి నీ డిగ్రీ‌ అయ్యింది కదా ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నావా ఎక్కడన్నా అంటూ నా చేయి అందుకొని పరిశీలించటం‌ మొదలు పెట్టారు. నేను కూడా అయన నా చేయి చూసి ఏమి చెబుతారా అని ఎదురు చూస్తున్నాను. ఆయన చెప్పేదేదో విన్నాక లోపలికి వెళ్ళవచ్చు కదా అనుకున్నాను.

ఫలానా బాంక్ వాళ్ళ పరీక్షలు వ్రాసానండీ అని చెప్పాను ఆయనకు. 'అదేమీ‌ కలిసిరాదులే. నీకు ఏదో టెక్నికల్ లేదా సైన్సు  సైడ్ జాబ్ వస్తుంది మూడు నాలుగు నెలల్లోనే ఏదో‌ పెద్ద చోటే' అన్నాడాయన.

నేను కొంచెం‌ తరచి అడగబోయాను.

ఇంతలో లోపల వంటగదిలో నుండి మా అమ్మమ్మగారి కంఠం గర్జించినట్లే వినిపించింది. 'ఒరే శ్యామలరావూ లోపలికిరా అర్జంటుగా' అని. నేను వస్తున్నానా లేదా అని చూడటానికి కాబోలు మా బేబీపిన్ని వచ్చి తొంగిచూసింది కొంచెం‌ కోపంగా.

నేను లోపలకు వెళ్ళగానే చీవాట్లు పడ్డాయి 'నీకు బుధ్ధుందా లేదా?' అని.

నాకేమీ‌ అర్థం కాలేదు. మా అమ్మమ్మగారే కొంచెం శాంతించి 'వాడికి చేతులూ‌ జాతకాలూ చూపించద్దు ఎప్పుడూ.  వాడి నోరు మంచిది కాదు. కాస్సేపు ఇక్కడే కూర్చో అన్నది. అప్పుడర్థమైంది ముందే బేబీపిన్ని ఎందుకు లోపలికి పిలిచిందో.  మాట్లాడకుండా వంటిట్లోనే కూర్చున్నాను ఆయన బయటకు వెళ్ళేదాకా.

తరువాత మా అమ్మమ్మగారింట్లో నేను తెలుసుకున్నది ఏమంటే లక్ష్మీనారాయణగారు మంచి విద్వత్తు కలవాడే కాని నోటి ఏది అనిపిస్తే ఫెడీఫెడీ మని అనెయ్యటమే‌ కాని అవతలవాళ్ళు ఏమనుకుంటారూ ఇలా చెప్పవచ్చునా అన్నది ఆలోచించి చూసే మనిషి కాదు. ఎప్పుడూ ఏవో అపశకునం‌ మాటలే చెబుతూ‌ ఉంటాడు.  ఆయన కేదో దిక్కుమాలిన వాక్శుధ్ది లాంటిదేదో ఉన్నట్లుంది. తరచుగా అయన మాటలు అక్షరాలా జరుగుతాయి. అందుచేత ఆయన నోటి మాటకు భయపడి ఎవ్వరూ అయనతో‌ జ్యోతిషవిషయాల్లో సంప్రదించరు. అందుకే కాబోలు లౌక్యంగా ప్రియోక్తులు పలకటం చేతకాని ఆయన విద్యకు రాణింపు లేకుండా పోయింది.

అప్పుడు నాకు అర్థమైంది. ఆరోజున మా అమ్మగారు ఎందుకు మా నాన్నగారిని అంతగా వారించటానికి సంఙ్ఞలు చేసారా అన్నది.

ఏదైతే నేమి అదంతా గతం.

కాని ఈ సారి ఐతే ఆయన అయాచితంగా ఒక జోస్యం చెప్పాడు నాకు. నేను ఆశలు పెట్టుకొన్న బాంక్ జాబ్ రాదు పొమ్మని. అది చివరికి నాకు రానేలేదు. ఆ బాంక్ పరీక్షలకోసం నేనూ నా సహాధ్యాయి ఎఱ్ఱాప్రగ్గడ కొప్పేశ్వర ప్రసాదూ విజయవాడ వెళ్ళి పరీక్షలు వ్రాసాం. తరువాత కాలంలో అతను చెప్పిన మాట ఏమిటంటే విజయవాడ సెంటరు నుండి ఒక్కరంటే ఒక్కరూ‌ ఎంపిక కాలేదట.

ఇకపోతే లక్ష్మీనారాయణగారు చెప్పిన అయాచిత జోస్యంలో రెండవభాగం ఉంది. కాని అదెలా నిజమయ్యేనో తెలియటం లేదు నాకు. అలా మరొక మూడు నెలల కాలం గడిచింది.

ఉన్నట్లుండి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ నుండి ఒక ఉత్తరం వచ్చింది హైదరాబాద్‌లో ఉన్న ఇ.సి.ఐ.యల్ కంపెనీలో ఉద్యోగానికి వ్రాతపరీక్షకు వెళ్ళమని.

మొత్తం 650మంది పైగా దేశవ్యాప్తంగా అభ్యర్ధులు ఆ వ్రాతపరీక్షకు హాజరైతే అందులో ఒక 28మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. చివరికి ఎంపికైనది కేవలం 8మందిమి. అందులో మొదటి వాడిని నేను. మొదటి నలుగురినీ మాత్రం కంప్యూటర్ గ్రూప్‌లో జాయిన్ చేసుకున్నారు. నాతో‌పాటి చావలి నరసింహం, హోతా జానకీదేవి, సుబ్బారావు అనే ముగ్గురు ఎంపికయ్యారు కంప్యూటరు గ్రూపులో చేరటానికి.  అక్కడ ఒక సంవత్సరం‌పాటు కంప్యూటర్ సైన్సూ ప్రోగ్రామింగూ‌ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డాను. అలా లక్ష్మీనారాయణగారి జోస్యంలో రెండవ భాగమూ పూర్తిగా సత్యంగా తేలింది.


(ఐదవభాగం రేపటి టపాలో)


11 కామెంట్‌లు:

  1. వాక్కు ఫలించడం గురించి కూడా కృష్ణమాచార్యులు గారు వ్రాసారు. కర్కాటకం,వృశ్చికం,వృషభం,కుంభం ఈ నాలుగు రాశులవారి నాలుక పలికినవి సత్యం అయి కూర్చుంటాయి. వాక్కు ఫలిస్తుంది అని విర్రవీగకుండా పాజిటివ్ గా మాట్లాడితే వాళ్ళకే మంచిది లేకపోతే ఇలాగే తిట్టుకుంటారు. కేసీఆర్ గారు కుంభ రాశి అందుకే ఆయన "నా జాతకమే అలాంటిది నేను అనుకున్నది అవ్వకపోవడం అంటూ జరుగదు" అని అంటారు.

    రిప్లయితొలగించండి
  2. అయితే అదన్నమాట సంగతి, ఆనాడు మీ అమ్మగారు మీ నాన్నగారిని వారించడానికి గల కారణమున్నూ. ఆవిడ భయం ఆవిడదిలెండి.

    నిజానికి (నా అభిప్రాయంలో) పాపం నిష్కర్షగా మాట్లాడే జ్యోతిష్కుడిని తప్పుపట్టడం అన్యాయం. ఆయన జరగబోయేది అంటూ చెబుతున్నాడే కానీ జాతకం చెప్పించుకున్నవాడిని శపించడం లేదుగా! అశుభం జరిగితే జ్యోతిష్కుడి వాక్శుద్ధా, మంచి జరిగితే మాత్రం కాదా / ఆయన వాక్శుద్ధి గుర్తుకురాదా ? ఉదాహరణకి మీ విషయమే తీసుకోండి - టెక్నికల్ సైడ్ ఉద్యోగం వస్తుందని ఆయన చెప్పినది చెప్పినట్లే ఫలించిందిగా, అది మంచే కదా. జోస్యం చెప్పించుకునేవారు రెండూ వినడానికి సిద్ధపడాలి - డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడులాగా. అఫ్‌కోర్స్ అశుభపు మాటలు, అపశకునం మాటలు వినడానికి ఎవరూ ఇష్టపడరనుకోండి, కానీ మంచి మాత్రమే చెప్పి అప్రియమని చెడు సంగతి దాచిపెట్టే జ్యోతిష్కులు లౌక్యం తెలిసినవారు / బతకనేర్చినవారు అనిపించుకుంటారేమో కానీ తమని సంప్రదించినవారికి పూర్తి న్యాయం చేసినట్లు కాదుగా. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలేలెండి.

    ఏమయినా కానీ మీ తమ్ముడు అలా హఠాత్తుగా పసితనంలోనే పోవడం మాత్రం విచారకరం. ఈ సారి పూర్ణాయుష్కుడుగా ఎక్కడో మళ్ళీ జన్మించే ఉంటాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోటవారూ, మీ స్పందనకు ధన్యవాదాలు. రాబోయే భాగంలో ఇటువంటి విషయాలను గురించి మరికొంత సమాచారమూ కొంచెం విచికిత్సా ఉంటాయి. మీ అభిప్రాయం నిజమే, ఉన్నదున్నట్లు చెప్పినందుకు జ్యోతిష్కుడిని తప్పుపట్ట కూడదు. అలాగే నేనూ తప్పుపట్టటం లేదు. కాని లోకం భయం లోకానిది!

      తొలగించండి
  3. చేదు నిజం చెప్పడానికి "అదేమీ కలిసిరాదులే," అనకుండా చక్కగా చెప్పవచ్చు. కానీ ఈ జ్యోతిష్యులున్నారే వీళ్లకున్నంత అహంభావం ఎవరికీ ఉండదు. నేను చెప్పింది జరిగి తీరుతుంది అంటారు. అలాగే వీళ్ళు చెప్పాక ఆ చెప్పించుకున్నవాళ్ళు చెప్పినవి నిజం అయితే నేనింతవాడిని అంతవాడిని అంటూ విర్రవీగుతూ ఉంటారు. ఈ బ్లాగుల్లో ఆస్థాన జ్యోతిషులొకరున్నారు. "మీరందరూ వెధవలురా, నేనెంత గొప్పవాడ్నో చూస్కోండి. అంటూ అమావస్య, పౌర్ణమి ప్రభావాలూ అవీ రాసి జనాలని బెదరగొడుతూ ఉంటారు. మహామహులైన శివానందులకీ ౠషులకీ ఇవన్నీ జరుగుతాయని తెలియదా? అయినా సరే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రజలకి సహాయం చెయ్యాలని, దీక్ష ఇచ్చి బాగు చేద్దామనీ అనుకుంటారే తప్ప, "ఒరే మీరందరూ వెధవలు, ఈ జనం మీద నాకు నమ్మకం పోయింది అని రోజూ ఏడిపించుకు తినరు. ఎందుకో తెలుసాండి? హిర్ణ్యకశిపుడి దగ్గిర్నుంచీ జనాలని ఏడిపించుకు తినడం అనేది సర్వసాధారణమేను, అది లోకం పోకడ. అప్పుడు హిరణ్యకసిపుడు ఒంటికాలి మీద "యుగ్రాచార దైత్రేంద్ర దిసోద్దూత సధూమహేతి పటలోదంచత్తపోవహినిచేన్." అంటూ తపస్సు చేసి జనాలని చెండుకు తింటే ఇప్పుడు మనని వీళ్ళు లాప్ టాపులు వాడి ఏడిపిస్తున్నారు. వాడికీ, వీళ్లకీ ఏమీ తేడా లేదు. ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అందులోంచే శివానందులనే, వివేకానందులనే వజ్రాలు పుట్టి ధగధగలాడటం మొదలుతుంది. అది సర్వ సహజం.

    జనాలని భయపెట్టి ఏడిపించుకుంటు తిడుతూ వాళ్లు చేసే పాపాలన్నీ బ్లాగుల్లో చూపిస్తూ ఉంటే ఏమౌతుందో తెలుసాండీ? సాయిబాబా చెప్పినదే జరుగుతుంది - జనాలని పాపాలన్నీ వీళ్ళకీ, వీళ్ళుచేసే సాధన అనే పుణ్యం అంతా జనాలకీ చేరుతుంది. ఇంక వాళ్ళు చేసే సాధన వల్ల ఏమి ప్రయోజనం? (నేను చదివినది చెప్పాను. నేను వీరికి గానీ సాయికి గానీ విపరీత భక్తుణ్ణి గాదు. ఆయన చెప్పిన సూక్తి నాకు నచ్చింది కనక ఇక్కడ రాసాను). స్వస్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. DG గారూ, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం అవుతున్నది. నిజమే లోకం అంతా డాంబికులతో నిండి ఉంది. అందులో కొందరు చాకచక్యంగా లోకోధ్ధరణకోసం మాట్లాడవలసి వస్తోంది కాని మాకు మా మౌనమూ మా ధ్యానమూ అన్నవే ముఖ్యం. నిజానికి మేమెప్పుడూ నిత్యసమాధిస్థితిలోనే ఉంటాం కాని మిమ్మల్ని అనుగ్రహించటం కోసం మీ మధ్యన తిరుగుతూ ఉన్నాం. లేకపోతే మీరంతా బాధగురువులను ఆశ్రయించి చెడిపోతారని మీపైన మాకు కనికరం అంతే అంటారు. అదొక జాణతనం అనుకోండి. వీటికి మనమేమీ చేయలేము. యోగ్యుడైన గురువుకు యోగ్యులైన శిష్యులు దొరుకుతారు. అలాగే యోగ్యత కల శిష్యులకు మంచి గురువులూ దొరుకుతారు. మనం బాధగురువుల పాలబడటమూ కర్మానుభవమే అనుకోక తప్పదు.

      సాధనవలన వచ్చే శక్తులు మరింత సాధనచేసేందుకు ఉపకరణాలుగా పనికిరావటం కోసం మనకి అనుగ్రహించబడ్డవి. వాటిని బాంకిలో డబ్బు లాగా భావించే అమాయకులు తాము ములుగుతూ ఇతరులనూ ముంచుతున్నారు. శక్తిపాతాలు చేస్తామని బోర్డులు టముకు వేసుకోవటాలూ లోకోధ్ధరణ మేమి కాబట్టి చేస్తున్నామని మనకు అనుగ్రహభాషణం చేయటాలూ అన్నీ పతనోన్ముఖుల ఆడంబర ప్రదర్శనాలు. పట్టించుకోకండి.

      జ్యోతిష్యపండితులలో ముప్పాతికమువ్వీసం ఫ్రాడ్ సరుకు. జ్యోతిషం ప్రయోజనం డనసంపాదనో కీర్తిసంపాదనో అనుకోవటం వలన వాళ్ళు అందరినీ తప్పుదారి పట్టించటమే కాక శాస్త్రానికి చెడ్డపేరు తెస్తున్నారు. అది విచారించవలసిన సంగతి.

      తొలగించండి
    2. DG గారూ, మరొక్క సంగతి చేదు నిజం చెప్పడానికి "అదేమీ కలిసిరాదులే," అనకుండా చక్కగా చెప్పవచ్చు. కానీ ఈ జ్యోతిష్యులున్నారే వీళ్లకున్నంత అహంభావం ఎవరికీ ఉండదు. అని కోప్పడకండి. లక్ష్మీనారాయణగారి వయస్సెంత పిల్లవాడిని నా వయస్సెంత ఆనాడు? అదీకాక అ కాలం వాళ్ళ మాటతీరును నేటి కొలమానాల్లోనికి తేలేము. కొందరు కట్టేవిరచినట్లే మాట్లాడే వారు కాని వారు అహంభావులు కానక్కరలేదు. లక్ష్మీనారాయణగారు నాకు తెలిసి పరమనిరాడంబరులూ యోగ్యులూను.

      తొలగించండి
  4. మిగతా భాగాలకోసం ఎదురు చూస్తున్నా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శర్మగారు, కొన్నాళ్ళుగా దర్శనం లేదు! కులాసాయే కదా? మిగతాభాగాలు వరుసగా వస్తాయండి. మీ వ్యాఖ్యకు సంతోషం.

      తొలగించండి
  5. మీ పోస్ట్‌కి పెద్దగా సంబంధం లేదనుకోండి. ఏవో నా జ్ఞాపకాలు.
    నా స్కూల్ చదువు కూడా కొంత కొత్తపేట హైస్కూల్లో 1960ల్లో జరిగిందిలెండి, అందుకని అడుగుతున్నాను ఏమనుకోకండి - మీ తండ్రిగారు ఆ స్కూలులోనే బోధించేవారా? అప్పటి మాస్టర్లని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సూర్యప్రకాశరావు మాస్టారు ఉండేవారు, ఆయన స్కౌట్ మాస్టరు కూడాను - వారు తర్వాత PhD చేసి యూనివర్శిటీలో లెక్చరరుగా జేరారు. నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు తిరిగి కలుసుకోవడం జరిగింది.
    మీరు చేసిన వక్కలంక వారి ప్రస్తావన చూస్తే గుర్తొచ్చింది - అమలాపురం ZP హైస్కూల్లో వక్కలంక వెంకటరావు అనే మాస్టారు లెక్కలు బోధించేవారు. నేనాయనకి ప్రియశిష్యుడ్ని :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ మానాన్నగారు కొత్తపేట హైస్కూల్లో ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ బోధించేవారు. జిల్లేళ్ళ సూర్యప్రకాశరావుగారు ఫిజికల్ సైన్సు బోధించేవారు. మా యింటికి దగ్గర్లో ముసునూరి వారింట్లో అద్దెకుండేవారు. ఆయన తమ్ముడు జిల్లేళ్ళ కృష్ణ నాకు కొంచెం సీనియర్ స్కూల్లో.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.