శ్రీరామ చంద్రుడు సీతమ్మ గూడి సింహాసనస్థుడై చెన్నుమీఱగను సార్వభౌముండుగా జగమేలు చుండ సురలెల్ల ప్రీతులై చూచుచుండంగ నెలమూడు వానలు నిత్యమై యుండ కలికంబునకు నేని కరవు లేకుండ ఉర్విసుభిక్షమై యొప్పారు చుండ జనులెల్ల సంతోషస్వాంతులై యుండ ప్రతినాడు జనులకు పండువై యుండ భూనాధు జనులెల్ల పొగడుచు నుండ భూనాధు మునులెల్ల పొగడుచు నుండ భూనాధు నరపతుల్ పొగడుచు నుండ భూనాథు కవులెల్ల పొగడుచు నుండ భూనాథు సత్కీర్తి భూమిపై నిండ భూనాథు సత్కీర్తి భువనముల్ నిండ సర్వంబు చక్కగా జరుగుచు నుండ సాకేత మరుదెంచె జనకుని దూత సభలోని కరుదెంచె జనకుని దూత జానకమ్మను చూచె జనకుని దూత సార్వభౌముని చూచె జనకుని దూత సంతోషమున పొంగె జనకుని దూత వినుతశీలుండైన జనకుని దూత జ్ఞానియు వృధ్ధుడౌ జనకుని దూత సీతమ్మతల్లి కాశీర్వాద మిచ్చె శ్రీరామవిభున కాశీర్వాద మిచ్చె మామగా రంపిన మహితాత్మునకును రామచంద్రుడు సేసె రాజోచితములు మరియాదలెన్నియో నిరుపమానములు గౌరవంబులు సేసి కానిక లిచ్చి సాకేతపతి పల్కె సాంజలి యగుచు పెద్దలు జనకులు వినిపించ మనిన ఆనతి వినిపించు డయ్యరో మీరు సీరధ్వజుల యాన శ్రీరాము డెపుడు శిరమున దాల్చును సీతమ్మ యాన అనినంత నా దూత యానంద పడుచు అగణితగుణధామ యా మాట చాలు మారాజు కోరిక మన్నించి నటులె వినవయ్య చక్కగా వినిపింతు నీకు జనకుల మాటలు వినిపింతు నీకు ప్రియమైన మాటలు వినిపింతు నీకు అతిలోక వీరుడ యల్లుడ రామ దనుజేంద్రగర్వవిధ్వంసక రామ సకలలోకస్తుత్యసద్గుణధామ సత్యాశ్రయా సురసన్నుత రామ పరమేశబ్రహ్మేంద్రప్రస్తుత రామ పిల్ల నిచ్చితి గాన చల్లని వాడ నీకు బంధువు నైతి నేను ధన్యుడను మన్నించి నీవు నీ మామ గేహంబు పావనం బొనరింప వలయు విచ్చేసి చిన్నతల్లిని నాదు సీతను జూడ కన్నులు కాయలు కాచిన వయ్య నా తల్లి నాయింట నడయాడి నాకు కనులపండువ సేయు ఘనభాగ్య మిమ్ము నాగేటి చాలులో నాముందు వెలసి నాబిడ్డయై నిల్చి నన్ను పాలించి నీయింటి వెలుగైన నిరుపమజ్యోతి నా తల్లి సీతను నాకు చూపించు అవలీలగా నాడు శివుని విల్లెత్తి దాని నొంచిన నిన్ను తాను చేపట్టి మీ యింటి కోడలై మెఱసిన తల్లి అడవికి నీతోడ నడచె నా సీత పడరాని యిడుములు పడెను నా సీత రాకాసి లంకలో శోకించె సీత నా బిడ్డ సీతను నాకు చూపించు పంక్తికంఠుని నీవు పట్టి వధించి తేఱి యవనజ మోము తిలకించ లేక నిన్నొల్ల బొమ్మన్న నిప్పులో దూకె అగ్నిహోత్రుడు తల్లి నగ్గించ గాను కష్టాల గుండాలు గడచె నా తల్లి నా చిట్టితల్లిని నాకు చూపించు పుట్టింట సుఖములు పొందుచు పెరిగె ముగ్గురత్తలు తన్ను ముద్దు సేయగను ఆరళ్ళు పెట్టని యత్తింట వెలిగె కష్టాలు కడతేది గద్దియ కెక్కె నా కన్నతల్లిని నాకు చూపించు బ్రహ్మేంద్రరుద్రులు ప్రస్తుతించగను దివినుండి తనమామ దిగివచ్చి పొగడ అసమాన కీర్తితో నలరారి నట్టి నా ముద్దుబిడ్డను నాకు చూపించు సర్వాభినుతయైన సౌశీల్యజ్యోతి నా కంటివెలుగును నాకు చూపించు ఇనకులసౌభాగ్యహేతువై నట్టి నా భాగ్యరాశిని నాకు చూపించు రావణగర్వనిర్వాపణాకార నా పుణ్యరాశిని నాకు చూపించు వీరరాఘవధర్మవిజయపతాక నా సీత నొకసారి నాకు చూపించు మిథిలానగరకీర్తి మేలిపతాక నా తల్లి నొకసారి నాకు చూపించు రామయ్య ఒకసారి రావయ్య నీవు సీరధ్వజుని జూడ సీతమ్మ తోడ మీ యిర్వురను జూడ మిథిలలో వారు వేయి కన్నుల తోడ వేచి యున్నారు మీ యిర్వురను జూడ మా యింటి వారు వేయి కన్నుల తోడ వేచి యున్నారు మీ యిర్వురను జూడ మీ మామ యత్త వేయి కన్నుల తోడ వేచి యున్నారు రావయ్య మిథిలకు రామయ్య నీవు రమణి సీతమ్మతో రాజశేఖరుడ అని పల్కె మిథిలాపురాధీశ్వరుండు వినిపించితిని వారు వినిపించమన్న పలుకు లన్నింటిని బ్రహ్మాండనాథ భవదీయమైన సభాస్థలంబునను మీ యాఙ్ఞ మేరకు మీ సమ్ముఖమున శ్రీరామచంద్ర నీ చేయదగినది చేయుము రాజేంద్ర శీఘ్రంబుగాను మన్నించ దగు నీకు మామ కోరికను అని పల్కె నా దూత వినయ మొప్పంగ సీతమ్మ కన్నులు చెమ్మగిల్లినవి విభుని మోమేమొ గంభీరమై యుండె అటునిటు రాజు మాట్లాడక యుండె గుడుసుళ్ళుపడి రాజు కూర్చుని యుండె అరమోడ్పు కనులతో నట్లె కూర్చుండె వేచి యుండెను దూత విభుడట్టు లుండె విభుని మాటలు విన సభ వేచియుండె అరఘడియకును మాట్లాడడు రాజు కాంతుని తిలకించె కలికి సీతమ్మ కాంతుడు సీతమ్మ కనులలో జూచె మిగుల ప్రసన్నుడై జగదీశ్వరుండు ముని వశిష్ఠుని దొల్త కనుగొని యపుడు దూతను కనుగొని తోయజాక్షుండు సభవారి కనుగొని సర్వాత్మకుండు తమ్ముల కనుగొని ధర్మవిగ్రహుడు మంత్రుల కనుకొని మానవేశ్వరుడు మధురాక్షరంబుల మాటాడ దొడగె (సశేషం) |
రామగాధామంజరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామగాధామంజరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
4, జులై 2016, సోమవారం
మిథిలాసందర్శనము
16, డిసెంబర్ 2014, మంగళవారం
వాల్మీకిరామాయణంలో శివధనుర్భంగ ఘట్టం - వివరణతో. (66వ సర్గ)
వాల్మీకి రామాయణం. బాలకాండ. 66వ సర్గ |
[ ఈ టపా అసంపూర్ణం. మార్పులకోసం వేచియుండ వలసిందిగా విజ్ఞప్తి.] 66వ సర్గ సంపూర్ణంగా వ్యాఖ్యానించబడింది. 67వ సర్గ ఇంకా వ్యాఖ్యానం చేయాలి. |
తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవం 1 |
జనకమహారాజు గారు ఉదయమే సంధ్యావందనాది నిత్య కర్మ లన్నింటినీ పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత మహాత్ముడైన బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారిని, ఆయన శిష్యులుగా వచ్చిన రఘువంశానికి చెందిన ఆ ఇద్దరు రాచబిడ్డలతో సహా ఆహ్వానించారు. |
నిత్య కర్మలనీ నైమిత్తక కర్మలనీ రెండువిధాలు వైదిక కర్మలు. సంధ్యావందనాదులూ, దేవతార్చనా వంటివి నిత్యం చేయవలసినవి. ఏ దైనా సందర్భానికి అనుగుణంగా కాని ఇష్టకామ్యార్థసిధ్ధికి కాని ప్రత్యేకంగా చేసే కర్మలు నైమిత్తికాలు. అంటే పండగల్లో చేసే ప్రత్యేకపూజలూ, సత్యనారాయణవ్రతాలూ వంటివన్నీ నైమిత్తికాలు . ఈ నైమిత్తికాలకు అవి ఏఏ సమయాల్లో చేయాలో వాటి విధివిధానాలు ఆయా కర్మలకు సంబంధించి విడిగా ఉంటాయి. కానీ, నిత్య కర్మలన్నీ కూడా తప్పనిసరిగా సూర్యభగవానుడు ఉదయించటానికి ముందటి ముహూర్తంలోనే పూర్తి చేయాలి. ఈ ముహూర్తాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. ఈ మధ్య కొందరు తప్పుగా బ్రహ్మముహూర్తం అనటం వినిపిస్తోంది. ఇక్కడ తతః ప్రభాతే అంటే ఆ ఉదయమే అని చెప్పారు కాబట్టి విశ్వామిత్రులవారు రామలక్ష్మణులతో సహా మిధిలాపురానికి రాత్రికాలంలో వేంచేసారు. ఆ రాత్రి గడచిన వెంటనే ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతం అంతా అన్నమాట. అలాగే విశ్వామిత్రుడికి మహాత్ముడని ఒక విశేషము వేసారు వాల్మీకి. అలాగే రామలక్ష్మణులను రాఘవులు అన్నారు. ఎందుకంటే విశ్వామిత్రుడు రామాయణకాలానికే బ్రహ్మర్షిత్వాన్ని సాధించిన మహనీయుడు. సగౌరవంగా అంతా ఆయనను భగవాన్ అని సంబోధిస్తారు. ఇక ఈ అన్నదమ్ములను రాఘవులు -అంటే రఘువంశంవారు- అనటం మహా ఉచితమైన మాట. ఆ రఘుమహారాజు వారికి వంశకర్తకదా! కుబేరుడి మీదకే దండయాత్రకు సమకట్టగలిగిన మహావీరుడు. పరీక్షించటానికి వృధ్ధబ్రాహ్మణరూపంలో ఇంద్రుడు వచ్చి, దాసీగా సాక్షాత్తూ మహారాణీనే కోరుకుంటే సరే దానమిస్తున్నాను తీసుకు వెళ్ళండి అనగలిగిన అసామాన్యమానవోత్తముడు. అటువంటి వారి వంశంలో పుట్టిన ఉత్తమక్షత్రియకుమారులని రామలక్ష్మణులను కీర్తించటం ఇలా రాఘవులూ అనటంలోని ఉద్దేశం. |
తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేణ కర్మణా రాఘవౌచ మహాత్మానౌ తదావాక్య మువాచహ 2 |
శాస్త్రవిధిని చక్కగా అనుసరించి జనకమహారాజుగారు విశ్వామిత్ర మహర్షిని పూజించారు. అలాగే రఘువంశసంజాతులైన రామలక్ష్మణులను కూడా మహాత్ములవలెనే సంభావించి సముచితరీతిని సన్మానించారు మహారాజుగారు. అనంతరం అయన ఇలా అంటున్నారు. |
అర్షధర్మంలో అన్నింటికీ విధివిధానాలను నిర్ణయించారు. ఆ నిర్ణయాలసమాహారానికే శాస్త్రం అని పేరు. శాసయతి ఇతి శాస్త్రః. అంటే ఇది ఇలా చేయాలి. ఇది చేయరాదు అని నిష్కర్షగా చెప్పేదే శాస్త్రం అన్నమాట. దానిని తూచ తప్పకుండా పాటించటాన్ని సముదాచారం అని పిలుస్తారు. జనకుడు స్వయంగా గొప్ప విద్వాంసుడు, వేదాంతి. ఆ ఆచారాలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అలాగే రామలక్ష్మణులు అతిథులుగా వచ్చారు. అతిథి దేవోభవ అన్నారు కదా. అందుచేత చాలా పధ్ధతిగా జనకమహారాజు గారు అ మహర్షికీ, అన్నదమ్ములకూ కూడా శాస్త్రోచితంగా సత్కారం జరిపారు స్వయంగా. ఇక్కడ మన ఇంటికి వచ్చిన వారికి ఏదో తోచినట్లుగా కాకుండా ధర్మం ఎలాచెబుతోందో అలా శాస్త్రప్రకారం మర్యాదలు చేయాలీ అని వాల్మీకులవారు మనకి హితవు చెబుతున్నారు అన్యాపదేశంగా అని తెలుసుకోవాలి. |
భగవాన్ స్వాగతం తేస్తు కింకరోమి తవానఘ భవానాజ్ఞాపయతు మాం ఆజ్ఞాపయ భవతాహ్యహం 3 |
(వారికి సకల మర్యాదలూ జరిపించిన తరువాత విశ్వామిత్రమహర్షితో జనకులు అంటున్నారు.) ఓ భగవాన్, మీకు స్వాగతం. మీకు నేనేమి చేయగలను? నా వలసిన కార్యం ఏమిటో తమరు ఆజ్ఞాపించండి. |
మన ఇంటికి వచ్చిన అతిధులను చూసి వారు ఎందుకు వచ్చారో అని మనం కొంచెం ఆత్రుత పడటం సహజం. అలాగని వారు వచ్చీ రాగానే చెప్పులన్నా విప్పుకోకముందే, నిలబెట్టి, "ఏదో పనిమీద వచ్చినట్లున్నారే? ఏమిటి సంగతి? ఏమన్నా నా సహాయం కావాలా?" అని అడగకూడదు కదా? ముందు వచ్చిన వారికి తగిన మర్యాదలూ గట్రా చేసి వారు కాస్త కుదురు కున్నాక, అప్పుడు వారిని కుశలప్రశ్నలూ అవీ వేయటమూ, వారు వచ్చిన పని గురించి వివరంగా తెలుసుకుందుకు ప్రయత్నించటమూ ఉచితంగా ఉంటుంది. అందుచేత జనకులవారు మహర్షికీ, ఆయన శిష్యులిద్దరికీ అతిథిమర్యాదలు శాస్త్రీయంగా జరిపించి, ఆ పిమ్మట, విశ్వామిత్రులవారిని ప్రశ్నిస్తున్నారు. పెద్దవారి ముందు మనం చూపవలసినది వినయం. వారు మనకి పని చెప్పటమూ ఒక్కొక్కసారి మనని అనుగ్రహించటమే! అందుచేత తమకు నా వలన కావలసిన కార్యం ఉంటే తప్పక ఆజ్ఞాపించండీ అని జనకులు సవినయంగా మనవి చేసుకుంటునారు. |
ఏవ ముక్తా స ధర్మాత్మా జనకేన మహాత్మనా ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్యవిశారదః 4 |
మహాత్ముడైన జనకమహారాజు తన కేమి ఆజ్ఞ అని సవినయంగా ప్రార్థించగా విశ్వామిత్రులవారికి సంతోషమైనది. మాట్లాడటంలో అనే కళలో నేర్పరి ఐన ఆయన ఈ విధంగా రాజుగారికి జవాబు చెబుతున్నారు. |
ఇక్కడ జనకేన మహాత్మనా అని జనకమహారాజుగారు మహాత్ముడు అని చెబుతున్నారు వాల్మీకి. అలా ఎందు కన్నారూ? నా కేమి ఆజ్ఞ అని ఆయన మాటవరసకు అన్నవాడు కాదు. అది ఆయన త్రికరణశుధ్ధిగా చెప్పిన మాటే. మహర్షి ఆజ్ఞను పాలించటం అంటే మాటలు కాదు. ఆయన చెప్పిన పని ఏదైనా చేయగల శక్తియుక్తులు కావాలి. అటువంటి స్థిరచిత్తమూ కావాలి. జనకులు అటువంటి వారు నిజంగానే. అయనేదో ముసలివాడూ వేదాంతగోష్టుల్లో కాలక్షేపంచేసే మనిషే కాని అవసరమైతే ఎవరిమీదనైనా విల్లెక్కుపెట్తగల ధీరుడా ఏమిటీ అని జనం సినీమాలూ సీరియళ్ళూ చూసి అనుకోవచ్చును. కాని ఆయన శాపాదపి శరాదపి అని నిలబడగల గొప్పవాడు. దానికి సంబంధించిన వివరం ఒకటి ఈ సర్గలోనే ముందుముందు వస్తుంది, చదువుదురు గాని. ఎంత అసాధ్యమైన పనిని విశ్వామిత్రులు ఇచ్చినా వెనుదీయక రంగంలోనికి దిగగల మహాత్ముడు. అందుకని వాల్మీకులు అలా మహాత్ముడనే విశేషణం వేసారు రాజుగారికి. అలాగే ఈశ్లోకంలో విశ్వామిత్రులను మునివీరులనీ వాక్యవిశారదులనీ అనటం కూడా గమనించండి. ఇక్కడా తగిన కారణాలున్నాయి. నిష్కారణంగా వాల్మీకులవారినుండి ఒక్కముక్కా రాదుకదా. వీరుడన్నమాటను చూదాం. వీరత్వం యొక్క ప్రయోజనం లోకోపకారం. అలా కాని బలం ధూర్తత్వం అవుతుందంతే. విశ్వామిత్రులు లోకోపకారులు. అందులో ఏమీ సందేహం అక్కర లేదు. రాముణ్ణి శిష్యుణ్ణి చేసుకోవటం తనకోసమూ కాదు, రాముడు రక్షించిన యాగం విశ్వామిత్రుడికి స్వర్గభోగాలకోసమూ కాదు. ఆ ఋషి చేసేదంతా లోకకళ్యాణమే. ఆయన బ్రహ్మర్షి. సాక్షాత్తూ భగవత్స్వరూపుడు. ఆయనకు స్వప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అంతా లోకం కోసమే. అదీ ఆయన వీరం. ఆయన వాక్యవిశారదత్వం ఆయన యందున్న భగవత్తత్త్వమే. అయనకు అందరి యోగ్యతలూ తెలుసును. ఎవరు లోకాపకారులో తెలుసును. ఎవరి వలన ఎలా లోకోపకారమో తెలుసును. అందుచేత ఆయన వాక్కు సాక్షాత్తూ వేదమే. అందుచేత ఆయన జనకుడి యోగ్యతను తెలిసినవాడై అబినందన పూర్వకంగా, ఆయన వలన రాబట్టవలసిన లోకోపకారకక్రియను సూచించటానికి కాను, జనకుడికి ప్రీతి కలిగేలా ఇలా మాట్లాడుతున్నారు అని వాల్మీకులవారి హృదయం అని నా భావన. |
పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుశ్శ్రేష్ఠం యదేతద్వయి తిష్ఠితౌ 5 |
ఈ ఇద్దరూ దశరథమహారాజుగారి పుత్రులు. లోకప్రసిధ్ధులైన క్షత్రియులు. నీ దగ్గర ఒక శ్రేష్ఠమైన ధనస్సు ఉందని తెలిసి దానిని చూడాలనే కోరికతో వచ్చారు. |
ఈ రామలక్షంణులను ఇద్దరినీ దశరథమహారాజుగారి కుమారులూ అని జనకుడికి పరిచయం చేయటం వరకూ బాగానే ఉంది. కాని వారిని విశ్వామిత్రులవారు లోకప్రసిధ్ధులూ అని చెప్పటం కొంచెం అశ్చర్యం కలిగిస్తుంది. అప్పటికి రాముడు చేసిన గొప్పపనులు తాటకావధ, మారీచసుబాహులను దండించి యజ్ఞాన్ని సంపన్నం చేయటం, అహల్యాశాపవిమోచనం అన్నవి. ఐతే అవి అప్పుడే దేశదేశాలూ తిరిగి రాముడికి అఖండఖ్యాతిని ఆర్జించి పెట్టాయా? లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఈ సంఘటనలన్నీ అరణ్యాలలో జరిగినవే కాని ఏదీ నాగరికుల మధ్యన జరిగినది కాదు. మరి వాక్యవిశారదులైన వాల్మీకులవారు లోకవిశ్రుతులూ అని అనటం ఎలా నప్పుతున్నదీ? దీనికి సమాధానం చూదాం. అసలు లోకం అంటే ఏమిటి? భౌతికార్థంలో జీవులకు ఉనికియైన ప్రదేశం. కొంచెం లోతుగా చెబుతే లోకం అంటే జీవుల సమూహం. జీవులసమూహంలో ఈ కుఱ్ఱవాళ్ళిద్దరూ ప్రసిధ్ధులూ అంటున్నారు మహర్షి. జీవులలో బహుప్రసిధ్ధుడు కేవలం భగవంతుడే. అయన సర్వజీవులలోనూ తానే నిండి ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సర్వజీవరాశీ ఆయన యందే ఉన్నది అన్నదే సదైన అవగాహన. జీవులలో రెండవవాడుగా బహుప్రసిధ్ధుడు అ భగవంతుని యొక్క భక్తుడు. ఇతరులు అజ్ఞానులు కాబట్టి వారిని వదిలివేద్దాం. ఈ భక్తుడికే అత్యంతమైన అర్హతా, బహగవత్సాన్నిధ్యమూ. ఆ విధమైన భక్తిసామ్రాజ్యాధినేతల్లో అతి ముఖ్యుడు ఆదిశేషువు. వైష్ణవసంప్రదాయంలో ఆయన గురించి ఒక ముక్క చెబుతారు. ఆదిశేషువు మనకు తెలిసి విష్ణుదేవునికి పరుపుగా ఉంటాడని మనకు తెలిసిన సంతతే కాని, ఇంకా విశేషం ఉందిట. శేషుడు భగవంతునికి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో దానిని తగిన విధంగా మారి సేవచేస్తాడట, శయ్యాసనపాదుకాది విధాలుగా అమరి. అన్నమాచార్యులవారు అంటారు కదా ఒక ప్రసిధ్ధమైన సంకీర్తనంలో, "విన్నపాలు వినవలె, వింతవింతలూ.. పన్నగపుదోమతెర పై కెత్త వేలయా?" అని ఆ దోమతెరగా మారిన పన్నగం అంటే శేషుడే. ఈ విధంగా జీవలోకంలో భగవానునికి అత్యంత సన్నిహితుడుగా అతిప్రసిధ్ధుడైనవాడు శేషయ్యగారు. ఇలా ఈ రామలక్ష్మణులు ఇద్దరూ సమస్తలోకంలో ప్రసిధ్ధులైన దేవుడూ, ముఖ్యజీవుడూ అన్నది విశ్వామిత్రముని నర్మగర్భంగా సూచిస్తున్నారు. ఇదంతా చాలా దూరాన్వయంగా అనిపిస్తోందా? మరొక చిన్న సమర్థన ఉంది. ఇది మీకు నచ్చవచ్చును. ఒకాయన వచ్చారు మన ఊరికి. నిజానికి మనఊరి పెద్దమనిషే ఈ మహానుభావుణ్ణి తీసుకొని వచ్చారు ఏదో సభకి. అక్కడ అందరికీ పరిచయం చేస్తూ, ఈయన ఫలాని నగరంలో ఉంటారూ, నాకు తెలిసినవారూ గొప్ప కవీ, జగత్ప్రసిధ్దులూ అంటారు. మనకి అక్షేపణ అనిపించదు. అదేమిటయ్యా మా ఊళ్ళో ఈయన ఎవరో తెలియదే జగత్ప్రసిధ్దుడేమిటీ అనం. ఓహో అక్కడ అందరికీ బాగా తెలిసినవాడన్న మాట అనుకుంటాం. నిజమే కదా? అలాగే మహర్షి ఇక్కడ రామలక్ష్మణులను దశరధమహారాజుగారి కుమారులూ అని చెబుతూ లోకవిశ్రుతులూ అన్నది అదే అర్థంలో అనుకోండి. అక్కడ దశరధుడికన్నా కూడా రాముడికే ఎక్కువ గా జనం ప్రీతులై ఉన్నారన్నా అశ్చర్యం లేదని మనకూ తెలుసుకదా? ఇకపోతే, మహర్షి రామలక్ష్మణులు వచ్చిన పని గురించి క్లుప్తంగా నీ దగ్గర గొప్పవిల్లేదో ఉందిట కదా, దాన్ని చూదాం అని కుతూహలంతో వచ్చారూ అని చెబుతున్నారు. ఇది గమనించండి. సినీమాలూ సీరియళ్ళూ చెప్పేటట్లుగా మిధిలాధీశులు ఏ ధనుర్యాగమూ చేయటం లేదు. సీతాస్వయంవర సభ అని ప్రకటన ఏదీ చేయలేదు. విల్లెక్కుపెట్టే పోటీ ఏదీ ఏర్పాటుచెసి దేశదేశాల వాళ్లనీ సభకు రావించలేదు కూడా. చూసారా అసలు కథకు మనం తెలుసూ అనుకుంటున్న కథావిధానానికి ఎంత తేడా ఉన్నదో? |
ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ. దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః 6 |
(జనకమహారాజా!) నీకు శుభం కలుగుగాక. ఈ రాజకుమారకులకు ఆ ధనువును చూపించు. దానిని మనసారాచూసి ఈ బిడ్డలు యధేఛ్ఛగా తిరిగి వెళతారు. |
ఇక్కడ గమనించవలసి అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ పిల్లలు మీ దగ్గర ఉన్న మహాధనువును చూడటానికే వచ్చారని విశ్వామిత్రమహర్షి చెబుతున్నారు. అ ధనస్సును ఎక్కుపెట్టాలన్న ఉద్దేశం వారికి గాని, వారు దానిని ఎక్కుపెడితే బాగుంటుందన్న ఉద్దేశం తనకే ఉన్నట్లుగాని విశ్వామిత్రులు చెప్పటం లేదు. మనం ఎన్నో సినిమాలు, హరికథలు, నాటకాలు, టీవీ సీరియళ్ళలో చూసామో చెప్పనలవి కానంతగా మనకు రామలక్ష్మణులు మిధిలకు వచ్చినది జనకుడి దగ్గర ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టి స్వయంవరంలో విజేతలు కావాలని అన్నది ప్రచారం ఐపోయింది. కాని నిజానికి అటువంటిది ఏమీ లేదని తెలుసుకోవాలి. వాల్మీకులవారి శ్రీమద్రామాయణం బాలకాండ 31వ సర్గలో ఈ శివధనువు ప్రసక్తి వస్తుంది. రామలక్ష్మణులు విశ్వామిత్రులవారి యాగాన్ని సంరక్షించిన పిదప, మునుజనపరివేష్ఠితులైన ఆయనను సమీపించి తాము ఇక మీద చేయవలసిన కార్యం ఏమిటో అజ్ఞాపించవలసిందని అడుగుతారు. అప్పుడు విశ్వామిత్రాది మునులు మిధిలాధిపతి జనకరాజు గొప్పయాగం చేస్తున్నారనీ మీరు కూడా రండనీ రామలక్ష్మణులకు చెప్పి, అందరూ మిధిలా ప్రయాణం మొదలు పెడతారు. ఇదే సందర్భంలో ఆ ధనస్సును గురించి మునులు రామలక్ష్మణులకు వివరంగా చెబుతారు. సీతాస్వయంవరం వంటి ప్రసక్తులేమీ లేవిక్కడ. అందుచేత రామలక్ష్మణులు మిధిలకు వచ్చినది జనకమహారాజునూ, ఆ శివధనస్సునూ దర్శించాలనే. |
ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్. శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి 7 |
ఈ విధంగా విశ్వామిత్రులు సెలవియ్యగానే, జనకమహారాజుగారు విశ్వామిత్రమహామునికి ఇలా ప్రత్యుత్తరం ఇస్తున్నారు. అయ్యా, ఏ కారంఅగా ఆ మహాధనుస్సు మా వద్ద ఉన్నదీ (ముందుగా) తమకు తెలియజేస్తాను. |
ఇక్కడొక చమత్కారం ఉంది. విశ్వామిత్రులకు ఈ మహాధనస్సు సంగతి వివరంగా తెలియదనా జనకులు మరలా చెప్పటం? అయనకు స్పష్టంగా తెలిసి ఉంటుందనటంలో జనకులకు అనుమానం అక్కర లేదు. అలాగే ఆయన ఈ పిల్లలను ఫలాని గొప్పధనస్సును చూపిస్తాను రండి అని తీసుకొని వచ్చారంటే దాని అర్థం మహర్షి ద్వారా ద్బనస్సుకు సంబంధించిన సకలవృత్తాంతమూ ఈ కుఱ్ఱవాళ్లకూ తెలిసి ఉంటుందన్నదీ రాజుగారికి ఎలాగూ అర్థమయ్యే ఉంటుంది. ఐనా సరే, రాజుగారు మరలా ధనస్సు గొప్పదనమూ అది తమ వద్ద ఉన్న కారణమూ అన్నవి మరలా ఎందుకు చెబుతున్నట్లూ అన్నది ఆసక్తికరమైన సంగతి. మనకూ జనకుల నోట వృత్తాంతం అంతా విన్నాక అయన అలా ఎందుకు దాని కథంతా చెప్పిందీ అర్థం అవుతుంది. ప్రస్తుతానికి వేచి ఉందాం. |
దేవరాత ఇతి ఖ్యాతో నిమేష్షష్ఠో మహీపతిః న్యాసోయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా 8 |
భగవాన్ విశ్వామిత్రమహర్షీ. మా వంశకర్త నిమి అనే మహాత్ముడు. అయన నుండి ఆరవ రాజుగారి పేరు దేవరాతుడు. సాక్షాత్తూ పరమశివుడే సంరక్షించ వలసిందిగా ఈ వింటిని అ దేవరాతుడికి ఇచ్చాడు. |
ఏదైనా అపురూపమైన వస్తువును మనం ఇతరులకు చూపించే సందర్భంలో దాని వైశిష్ట్యాన్నీ, అది మనవద్దకు చేరిన విధానాన్నీ అందరిముందూ మరొకసారి ప్రస్తావించటం సహజం. ఇక్కడ జనకమహారాజుగారూ అదేపని చేస్తున్నారు. ఇప్పుడాయన రెండు విషయాలు ప్రస్తావించారు. అవి ఆ ధనువు సాక్షాత్తూ పరమశివుడిదీ అన్న సంగతీ, దాన్ని ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా స్వీకరించినది తమ వంశంలోని పూర్వీకుడు కాని అది ఈ మధ్య సంగతి కాదు అన్నదీ. ఈ దేవరాతుడు నిమినుండి ఆరవవాడైతే, జనకమహారాజుగారి నుండి పదహారు తరాల పైన వాడు. అంటే ఎంతో కాలం నుండీ ఆ దివ్యధనువు జనకుల ఇంట పూజలందుకుంటూ ఉన్నదన్నమాట. ఇదే శ్లోకంలో మరొక కీలకమైన మాట మన దృష్టినుండి తప్పిపోరాదు. దానిని శివుడు తమ వంశంవారికి 'న్యాసం'గా ఇచ్చాడట. దాని అర్థం, ఆ ధనువుకు దాము సంరక్షకులమే కాని దానికి తాము యజమానులం కాము అన్నది చెబుతున్నారు. |
దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్. రుద్రస్తు త్రిదశాన్ రోషాత్సలీలమిదమబ్రవీత్ 9 |
శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన సందర్భంలో, ఆయన ఆ యజ్ఞానికి వెళ్ళిన దేవతలమీదా ఆగ్రహించారు. వారి అవజ్ఞతకు రోషించిన ఆయన కోపంతో వారిపైన విల్లెక్కు పెట్టి ఇలా అన్నాడు. |
ఒకప్పుడు దక్షుడనే ప్రజాపతి ఒక యాగం చేసాడు - అదీ శివుడికి యజ్ఞభాగాన్ని పరికల్పించకుండానే. అందుచేత నింద్యమైన యజ్ఞానికి వెళ్ళి దేవతలూ తప్పుచేసినవారయ్యారు. ఆ దక్షప్రజాపతి శివుడికి సాక్షాత్తూ మామగారు. ఈ దేవతలు అంతా శివుడి అనుజ్ఞతో లోకాలను సంరక్షించే వారు. భగవద్విరోధం కారణంగా దక్షుడు, శివరహితయాగం పేర నేరం చేసి శిక్షార్హుడైనాడు. అటువంతి యాగం లోకోపద్రవకారణం కాబట్టి దాన్ని శివుడు విఛ్ఛిన్నం చేసాడు. అలా లోకహితేతరమైన యాగానికి లోకరక్షకులైన దేవతలు పోవచ్చునా? పోరాదన్న సంతతి తెలిసీ, ప్రజాపతి అన్న గౌరవంతో దక్షుణ్ణి మన్నించి ఆ యాగానికి వెళ్ళారే కాని శివేతరమైన ఆ యాగం సాక్షాత్తూ శివుణ్ణే అగౌరవించటం అని అర్థమైన తరువాత వాళ్ళు అ యాగాన్ని తిరస్కరించాలి కదా? అలా చేయకపోవటం లోకేశ్వరుడైన శివుణ్ణే తిరస్కరించటం అవుతున్నది కదా? అందు కని వారు శివుడి ఆజ్ఞ మీరిన వారయ్యారు. అందుకే శివుడు వారిపై కోపించి రుద్రుడై ఇక లోకాలకు మీ వలన ప్రయోజనం శూన్యం అని వారిపై విల్లెక్కు పెట్టాడు. |
యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురాః వరాఙ్గాణి మహార్హాణి ధనుషా శాతయామి వః 10 |
వేదవిహితమైన క్రతుభాగాన్నినాకు సమర్పించకుండా యజ్ఞం చేయవచ్చునా ఓ దేవతలారా? మీ ఉత్తమాంగాలను నేను నా ధనుస్సుతో ఖండించి వేస్తాను. |
యజ్ఞంలో దేవతలకు హవిస్సులు అర్పించబడతాయి. అవి దేవతలకు తేజస్సును వృధ్ధి చేస్తాయని వేదం చెబుతున్నది. హవిస్సులు అందుకున్న దేవతలు యజ్ఞకర్తకు కామితార్థాన్ని ప్రసాదిస్తారు. యజ్ఞాలలో దేవతలకే కాదు, అంతకన్న ముఖ్యంగా త్రిమూర్తులకూ భాగం కల్పించబడుతుంది. త్రిమూర్తుల తేజస్సును ఆ హవిస్సులు వృధ్దిచేస్తాయనా? కాదు. వారు లోకకర్తలు. వారికి అర్పించబడిన హవిస్సు లోకాలకు తేజోవృధ్ధి కరం. అంటే లోకక్షేమకరం. అందుచేత విహితమైన భగవద్భాగాల యొక్క ప్రయోజనం లోకక్షేమకరమై లోకకర్తకు లోకేశ్వరుల అశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. ఇదీ దాని రహస్యం. ఐతే మంగళదాయకుడైన పరమేశ్వరునికి యజ్ఞభాగాన్ని కల్పించకపోవటం తప్పు అన్న స్పృహ లేకపోగా ఆయనను విడచి కేవలం కామ్యార్థఫలప్రదాతలు మాత్రమే ఐన దేవతలకు హవిస్సులు అందించటం, లోకక్షేమాన్ని విసర్జించి కేవలం స్వార్థం కోసమే యాగం చేయటం. అది ఘోరం. కాబట్టి ఆ యజ్ఞమూ చెడింది. దానినుండి హవిస్సులు ఆశించిన దేవతలూ శిక్షార్హులయ్యారు. అందుకే పరమేశ్వరుడు, మీ శిరస్సులను తీసివేస్తాను అని హెచ్చరిస్తున్నాడు. |
తతో విమనసస్సర్వే దేవా వై మునిపుఙ్గవ ప్రసాదయన్తి దేవేశం తేషాం ప్రీతో భవాద్భవః 11 |
ఓ మునిపుంగవా, విశ్వామిత్రా, ఆ మాటలు విని హతాశులైన దేవతలంతా దేవాధిదేవా పరమేశ్వరా మా తప్పు కాచి మాపైన దయ చూపవలసింది అని పరిపరి విధాలుగా వేడుకున్నారు. ఆయన వారికి ప్రసన్నుడై రుద్రుడుగా ఉన్న మూర్తినుండి కరుణాసముద్రుడైన భవుడుగా మారాడు. |
ముందటి తొమ్మిదవశ్లోకంలో శివుడు కోపంతో రుద్రుడయ్యాడని చదువుకున్నాం. రుద్రుడంటే శోకింప జేసేవాడు, నశింపచేసేవాడు. ఇప్పుడేమో దేవతలు తప్పైపోయింది రక్షించండీ అని ప్రార్థిస్తూ కాళ్ళమీద పడగానే ప్రసన్నుడై భవుడు అంటే జన్మప్రసాదకుడు అయ్యాడు. ఈ సందర్భంలో చావుదప్పి దేవతలకు పునర్జన్మ లభించినట్లే కదా. అందుకనే భవుడు అనటం అన్నమాట. |
ప్రీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్ తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వ కే విభో 12 |
దేవతలపై ప్రీతి చెందిన పరమేశ్వరుడు వారికి ప్రాణదానం చేయటమే కాదు. వాళ్ళపై తాను ఎక్కుపెట్టిన ఆ మహాధనస్సునూ ఆ దేవతలకే అనుగ్రహంతో ఇచ్చివేసాడు. ఓ మహర్హీ, అలా శివుడు తమకు అనుగ్రహించిన ధనూరత్నాన్నే ఆ దేవతలు మా పూర్వీకుడైన దేవరాతునికి దాచమని ఇచ్చారు. |
చూడండి, శివుడు ఎంత కరుణాసముద్రుడో. ఆయనకు కోపం వచ్చి తప్పుచేసిన దేవతలని దండిస్తానని రుద్రుడై ఒక మహా ధనస్సుని వాళ్ళపైకి ఎక్కుపెట్టాడు. మళ్ళా ఆ దేవతలు తప్పొప్పుకుని కాళ్ళమీద పడగానే అనంతమైన కరుణతో వారికి తన కోపాగ్నినుండి పునర్జన్మను ప్రసాదించాడు. అంతే కాదు శివుడి కోపానికి బిక్కచచ్చి చిన్నబోయిన దేవగణాల్ని సంతోషపెట్టాలని తన వింటిని, ఆ దేవతలకు బహుమతిగా ఇచ్చేసాడు. |
అథ మే కృషతః క్షేత్రం లాఙ్గూలాదుత్థితా మయా క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా 13 |
ఆ పిమ్మట కొంత కాలమునకు నేను నాగలితో యాగభూమిని దున్నుచు శుధ్ధి చేయుచు నుండగ ఆ భూమిని చీల్చుకొని పైకి వచ్చి నా కొక బాలిక లభించినది. అమె సీత యన్న పేరుతో ప్రఖ్యాతి గాంచినది. |
ఇక్కడ పిమ్మట అని చెప్పినది, దేనిని గురించి? శివుడు ధనస్సును దేవతలకు ఇచ్చుట, దానిని వారు నిమి వంశమునకు నిక్షేపముగా నిచ్చుట యను నవి జరిగిన కొంతకాలము నకు అని. అప్పటికి జనక మహారాజు కాలము వచ్చినది. |
భూతలాదుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా 14 |
అప్పుడు భూతలమునుండి పైకి వచ్చి ఈమె నా స్వంత బిడ్డగా పెరిగినది. అంతేకాని ఒక స్త్రీగర్భమునుండి సాదారణ బాలికవలె జన్మించలేదు. ఈమెను తన ప్రతాముతోనే గెలుచుకొన గలిగినవానికి ఇచ్చుటకు నిశ్చయించుకొంటిని. |
ఉథ్థానం అంటే పైకి లేవటం. ఈ శ్లోకంలో జనకమహారాజుగారు సీత స్వయంగా భూతలాన్ని చీల్చుకొని పైకి ఆవిర్భవించిందని స్పష్టం చేస్తున్నారు. అంటే ఆ తల్లి తనంతతానుగా భూమినుండి ఆవిర్భవించి, నాగలితో నేలను దున్నుతున్న జనకులవారి ముందు ప్రత్యక్షం ఐనది. అంతే కాని ఇందులో జనకులు కాని మరొకరు కాని ప్రయత్నంతో ఆమెను భూమినుండి పైకి తీయలేదు. సీత అన్నమాటకు నాగేటి చాలు అని అర్థం ఉంది. అంటే నాగలితో భూమిని దున్నుతుంటే దాని ములికితో ఏర్పడిన లోతైన చారిక అన్నమాట. అలా జనకులవారి నాగలి ఒక చాలు తీస్తూ పోతూ ఉంటే దానినుండి హఠాత్తుగా భూమిని చీల్చుకొని అమ్మ ఆవిర్బవించింది బాలికా రూపంలో. ఒకానొక ప్రవచనంలో శ్రీచాగంటివారు ఆ బాలిక తనపేరు సీత అని అప్పుడే అందరికీ స్పష్టం చేసిందని చెప్పారు. అంటె సీత అన్నది జనకులో ఆయన పురోహితులో ఆ బాలికకు ఇచ్చిని పేరు కాదు. ఉథ్భిజము అంటే భూమిని చీల్చుకొని జన్మించేది చెట్టు అన్న అర్థం సాధారణంగా చెబుతూ ఉంటాము. జీవులు నాలుగు రకాలు స్వేదజములు, అండజములు, ఉథ్భిజములు జరాయుజములు అని. స్వేదజము అంటే చెమటనుండి జనించినవని కీటకాదులు. అండజము అంటే గ్రుడ్ఢునుండి జనించినవి అని పక్షులు, ఉథ్భిజము అంటె భూమిని పెకలించుకొని పుట్టినవి అని వృక్షజాతి, జరాయుజములు అంటే మావినుండి జనించినవి అని పశుమనుష్యజాతులు. ఇక్కడ సీతమ్మవారు భూమిని స్వయంగా చీల్చుకొని ఆవిర్బవించినది. అది కేవలం దైవసంబంధమైనదే ఐన జననం కాని తదన్యం కాదు. జనశ్రుతిలో ఒక కథ ఉన్నది. సినిమాలలోనూ కనబడుతున్నది, జనకమహారాజుగారు యజ్ఞార్థం భూమిని దున్నుతుంటే, నాగేటి చాలులో ఒక చిన్న పెట్టె దొరికిందనీ, దానిని తెరిచి చూస్తే అందులో కనిపించిన బాలికయే సీత అని. ఇంకా చిత్రమైన విషయం కూడా ఉన్నది. రామాయణసారోధ్దారము అనే ఉద్గ్రంథంలోనూ కనిపిస్తున్నది. ఆ కథలో పితా స్త్వాం దుహితరాం అంటూ రావణుడిని ఉద్దేశించిన ఒక విషయం ప్రస్తావనకు వస్తుంది. సీత రావణపుత్రికయే నట. ఆమెవల్ల లంకకు చేటు అని కార్తాంతికులు చెప్పగా రావణుడే ఆ బిడ్దను ఒక పెట్టెలో పెట్టి భూస్థాపితం చేసాడనీ ఆమె తదనంతరం జనకుడికి దొరికి ఆయన పుత్రికగా పెరిగి అన్నంతపనీ చేసిందనీ. ఇతే ఈ కథలకు శ్రీమద్రామయణంలో ఆథారం కనిపించదు. జనకులవారు సీత భూమినుండి ఆవిర్భవించింది అని చెబుతున్నారు కాబట్టి పెట్టె గిట్టె అన్నది అసంగతం. ఆమె స్వయంగా ఆవిర్బవించినప్పుడు అయోనిజ కావటమే స్పష్టం. పెట్టెలో దొరికితే వేరెవరో అక్కడ వదిలి వెళ్ళి ఉండవచ్చును కదా అన్న అనుమానం ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది కదా? స్వయంగా ఆవిర్భవించిన తల్లి తాను సీతను అని అన్నది అందరితో అప్పుడే అని చాగంటివారు చెప్పినది సముచితంగానే అనిపిస్తోంది. |
భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్ వరయామాసురాగమ్య రాజానో మునిపుంగవ 15 |
ఓ మునిపుంగవా, వినండి. అలా భూమినుండి ఉద్భవించి దినదిన ప్రవర్థమానయై వివాహయోగ్యమైన వయస్సు వచ్చిన నా పుత్రికను వరించి ఎందరో రాజులు ఆశతో వచ్చారు. |
ఈ శ్లోకంలో కొంతభాగం ముందటి శ్లోకంలోనుండే తీసుకున్నట్లు కనిపించటం లేదూ? సీత సామాన్య స్త్రీ కాదూ, ఆమె స్వయంజాత. అయోనిజ. నా కళ్లముందే భూమిని చీల్చుకొని వచ్చిన తల్లి అని ఆయన అనందంతో మరొకమారు అదే విషయాని నెమరు వేసుకుంటున్నారు. అదేమీ అసహజం కాదు కదా. పైగా ఎంతో సమయోచితమైన భావన. ఇక్కడ సీత ప్రసక్తి నడుస్తోంది. ఆమె గురించి చెబుతూ జనకులవారు తన్మయులై ఉన్నారని మనం స్పష్టంగా గ్రహించాలని శ్రీవాల్మీకులవారి భావన. అంతే కాదు, ముందటి శ్లోకంలో వలనే ఇందులోనూ మమాత్మజా అని సీతను సంబోధిస్తున్నారు జనకులవారు. ఆత్మజులు అంటే లౌకికార్థంగా సంతానం అనే అర్థం. లౌకికార్థంలో కవిత్వంలో కూడా ఆత్మ అన్న మాటను తాను అన్న పదానికి పర్యాయంగా వాడుకచేస్తూ ఉంటాం. అందుచేత ఆత్మజుడు అంటే కొడుకు. ఆత్మజ అంటే కూతురు. ఐతే, ఇక్కడ అర్థం కొంచెం విశేషం కలదిగానే చెప్పుకోవాలి. జనకులకూ, సీతమ్మకూ ఉన్న సంబంధం ఆత్మసంబంధం. జనకుడు మహాయోగి. ఆయన పరబ్రహ్మానుసంధానమైన స్థితిలో నిత్యం ఉండే మహానుభావుడు. ఆయనకు విదేహుడు అని బిరుదు. విదేహుడు అంటే దేహంతో సంబంధం లేని స్థితిలో ఉండేవాడు. ఆయన కుమార్తెగా వచ్చి అమ్మవారు వైదేహి అన్న నామధేయంతో ప్రసిధ్ధ ఐనది. అమ్మవారు జగన్మాత. ఆవిడ ఆత్మవిద్యాస్వరూపిణి. శ్రీలలితాసహస్రనామావళిలో ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా। శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా॥ అని ఉంది కదా. ఆత్మయోగి ఐన మహాత్మునకు అత్మవిద్యాస్వరూపిణి పుత్రికగా రావటం ఆశ్చర్యం కలిగించదు కదా. అమ్మ అనుగ్రహం అనేది అద్భుతం. అది ఆనాడూ, ఈ నాడూ కూడా అదే విధంగా గోచరిస్తూనే ఉంది. మనకాలం వారే ఐన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు. ఆయనను అమ్మవారు చిన్నపిల్ల రూపంలో నిత్యం ప్రత్యక్షంగా అంటిపెట్టుకొని తిరుగుతూ ఉండేది. అందుచేత సందేహించవలసింది ఏమీ లేదు. జనకులదీ సీతమ్మవారిదీ ఆత్మసంబంధం. అందుకే మమాత్మజా అని ఆయన చెప్పుకున్నారు. కేవలం లౌకికార్థంలో కాదని గ్రహించాలి. |
తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్ వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహమ్ 16 |
భగవాన్ విశ్వామిత్రమహర్షీ, వాళ్ళు వరించి వచ్చినా, నా పిల్లను కేవలం ఎవరైనా సమర్థుడు పరాక్రమంతో గెలుచుకోవలసిందే అని చెప్పి, నా కన్యను వారిలో ఎవరికి ఇవ్వటానికీ నేను ఒప్పుకోలేదు. |
తన బిడ్డ కేవలం పరాక్రమం చేతనే గెలుచుకోదగినదీ అని జనకులవారు మరలా స్పష్టంగా చెబుతున్నారు. తన మనోనిశ్చయాన్ని ఇంతకు ముందే ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఆ నిశ్చయాన్ని ఇప్పటికే ఆమె కోసం వచ్చిన రాజులకు చెప్పానని చెబుతున్నారు. అంటే అనేక మంది రాజులు ఆ అమ్మాయి అందచందాల గురించి విని తమ కిమ్మని కబురులు చేసి ఉంటారు. కాని జనకమహారాజుగారు మాత్రం అలా ఎవరికి పడితే వారికి ఇవ్వటం కుదరదనీ, అపురూపమైన ఆ కన్యను కేవలం పరాక్రమంలో అద్వితీయుడిగా నిరూపించుకున్న వాడికే ఇవ్వటం జరుగుతుందనీ సమాధానం పంపించారన్న మాట. అది అప్పటి కాలానికి అనుగుణమైన సంగతిగానే మనం పరిగణించాలి. బ్రాహ్మణులలో వేదాధ్యయనమూ, క్షత్రియుల్లో పరాక్రమమూ, వైశ్యుల్లో ధనసంపత్తీ, ఇతరుల్లో కార్యదక్షతా అనేవి ముఖ్యగుణాలుగా చెప్పబడతాయి కదా. సహజంగానే ఒక క్షత్రియుడికి తన కుమార్తెకు ఉత్తమమైన సంబంధం అంటే వరుడు క్షాత్రగుణసంపన్నుడుగా ఉండటమే అని అనటంలో ఆశ్చర్యకరం ఏమీ లేదు. ఐతే మరొక సంగతీ ఇక్కడ అర్థం చేసుకోవాలి. వివిధ దేశాల రాజులు లేదా వారి తండ్రులు సంబంధం కలుపుకుందుకు వర్తమానాలు చేసారు అంటే అక్కడ వంశప్రశస్తి ఆధారంగా కూడా సంబంధాలు కుదిరేవని అనుకోవచ్చును. అలాగే రాజ్యాధిపతులను నుండి వర్తమానాల వెనుక ఆయా రాజ్యాల బలాబలాలూ అంచనాకు వస్తాయి కదా. అంటే బలవంతమైన రాజ్యానికి అమ్మాయిని కోడల్ని చేస్తే అమెకు భద్రత అన్న కోణమూ అప్పట్లోనూ పరిశీలనలో ఉండేదీ అన్నది కూడా అవగతం చేసుకోవచ్చును. ఐతే, జనకుల వారు మాత్రం అబ్బే మీ గొప్పలూ అవీ ఏవీ లెక్కలోకి రావూ మీ మీ వరుల పరాక్రమం చూసాకే నిర్ణయించటం అవుతుందీ అని ఖరాఖండిగా చెప్పేసారు. |
తతస్సర్వే నృపతయ స్సమేత్య మునిపుంగవ మిథిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా 17 |
ఓ మునిపుంగవా విశ్వామిత్ర మహర్షీ, అప్పుడు, తమతమ పరాక్రమాలను నిరూపించుకొనే ఆసక్తితో ఆ రాజులంతా కలిసి మిథిలకు వచ్చారు. |
ఇక్కడ మనం గమనించ వలసిన విషయాలు ఏమిటంటే, రాజులంతా కలిసి మిథిలకు రావటం. వారికి తమ బలాన్ని నిరూపించుకోవాలన్న ఆసక్తి కలగటం. నిజానికి ఒకరాజు మరెవరైనా రాజును నీ బలం నిరూపించుకో అనటం యుధ్ధరంగంలోనే జరుగుతుంది కాని మరొక రకంగా జరగదు. జనకమహారాజు ఈ మాట అనేకమంది రాజులతో అన్నాడు. వాళ్ళంతా ఒప్పుకొని మిథిలకు వచ్చారు. మానవ స్వభావంలోని ఒక విశేషం చూడండి. ఒక బలీయమైన కాంక్ష కలిగినప్పుడు మనషులు దానిని సాధించుకుందుకు గాను ఎటువంటి వాటినైనా త్యజించటానికి సిధ్ధపడతారు. వారు ఇంటిప్రతిష్ఠను పణంగా పెడతారు. యావత్తు కులంప్రతిష్ఠను కూడా పణంగా పెడతారు. తమ వ్యక్తిగతమైన కీర్తిప్రతిష్ఠలను పణంగా పెడతారు. సీత అనే అమ్మాయి యొక్క సౌందర్యం అనేది మిగతా రాజలోకానికి ఎంత ఆకర్షణీయమైనది అయ్యింది అంటే వారు ఆమెను సాధించుకోవాలనే పట్టుదలతో సాటి రాజు జనకుని వద్దకు తమతమ బలాలకు అయనపెట్టే పరీక్షను ఎదురుకుందుకు సిధ్ధపడి వచ్చారు. వాళ్ళకు జిజ్ఞాస కలిగిందట. ఈ జనకుడు తమబలాన్ని ఎలాపరీక్షిస్తాడూ అని. దానితో పాటుగా తమలో ఎవరికి ఆ మహాబలశాలి అన్న కీర్తిదక్కుతుందీ అని కూడా తప్పకుండా జిజ్ఞాస కలిగే ఉంటుంది. అన్నింటికన్నా ముందుగా తాము అంతకాలమూ ఏ అమ్మాఅయి సౌందర్యాన్ని గురించి ఐతే కడు కుతూహలంతో వింటూన్నారో ఆమె నిజంగా ఎంత గొప్ప సుందరాంగి ఐనదీ తమ కళ్ళతో చూడాలి స్వయంగా అన్న జిజ్ఞాస తప్పకుండా కలిగే ఉంటుంది. ఇలా తహతహలాడుతూ ఆ రాజులంతా మిథిలానగరానికి వచ్చారట. జనకమహారాజుగారు వాళ్ళంతా కలిసే వచ్చారు అన్నారు అన్నప్పుడు ఫలాని రోజున రమ్మని జనకులవారు ఏమైనా నిర్ణయం చేసి చెప్పారా అన్నది స్పష్టంగా లేదు. |
తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్ న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేపి వా 18 |
అలా జిజ్ఞాసతో వచ్చిన రాజులు తమ వద్దకు తీసుకొని రాబడిన శివధనువును చేబట్టలేక పోయారు. ఎవరూ దానిని తిన్నగా చేతులలో తిన్నగా నిలబెట్టేందు శక్తులు కాలేదు. |
ఈ శివధనువు అనేది మహాసత్త్వవంత మైనది. దానిని సాక్షాత్తూ పరమమేశ్వరుడే ధరించదగినవాడు కాని అన్యులు దానిని స్వాధీనం చేసుకొన లేరు. అటువంటి ధనస్సును ఆ మానవమాత్రులు ఎలా లొంగదీసుకోగలరు? ఆ శివధనుస్సు ఒక మందసంలో నిక్షిప్తమై ఉంది. ఆ మందసాన్ని ఒక చక్రాలబండి వంటి వేదికపైన అమర్చి ఉంచారు. వచ్చే సర్గలో వాల్మీకులవారు అలా పదిలపరచబడిన శివధనస్సును ఐదువేలమంది బలవంతులైన పురుషులు కష్టపడి తీసుకొని వచ్చారన్నది చెబుతారు. కొన్ని రామాయణాలలో శివధనస్సును వందలకొద్దీ శ్రేష్ఠమైన వృషభాలు లాగికొని వచ్చాయనీ, అది భారమైన ధనువు కాబట్టి అనేకమంది లాగికొనివచ్చారనీ చెప్పారు. ఐనా మనకు శ్రీమద్రామాయణం అనే ఆదికావ్యాన్ని ఇచ్చిన వాల్మీకులవారి వచనమే ప్రమాణం ఈ విషయంలో. జనశ్రుతిలోనికి ఒక కథ వచ్చి చేరింది. అది నాటకాలద్వారానూ సినిమాలద్వారానూ మరింతగా ప్రజలలో వ్యాపించింది, ఆ కథ ప్రకారం, ఒకానొక సందర్భంలో సీతాదేవి ఆ ధనువు ఉన్న చక్రాలవేదికను అవలీలగా ప్రక్కకు జరిపి దాని క్రిందకు పోయిన తన బంతిని తీసుకుందట. ఈ కథ వాల్మీకం అనుకోను. ఐనా పరిశీలించకుండా నిర్థారణగా చెప్పనూ లేను. ఈ కథ ద్వారా స్పష్టీకరించబడే విషయం యేమిటంటే సీతాదేవి సాక్షాత్తూ శక్తిస్వరూపిణి ఐన జగన్మాత కాబట్టి అలా జరిగిందని. ఏది యేమైనా ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అది దైవసంబంధమైన దనువు. దాని మీద దైవానికి, దైవభక్తులకూ మాత్రమే యేమైనా అధికారం ఉంటుంది కాని అన్యులకు ఎంతమాత్రం దాని జోలికి పోవటం వల్లకాదు. ఈ బలపరాక్రమాలను ప్రదర్శించటానికి వచ్చిన రాజులకు దృష్టి రెండే రెండు విషయాలమీద ఉన్నది. ఒకటి తమ శక్తిని ప్రదర్శించే విషయంలో ఉత్సాహమూ గర్వమూ. రెందవది సీతాకరగ్రహణం చేయాలనే మనోభీష్టమూ. అంతేకాని ఆ ధనువును గురించి వారి మనస్సులలో భక్తిశ్రధ్ధలు లేవు. కాబట్టి వారందరికీ పరాభవం తప్పదు. ఒకవేళ వారిలో ఎవరికైనా ఆ ధనువు దైవీయమైనది అన్న స్పృహ కలిగితే కలుగవచ్చును. కాని తాత్కాలికంగా వారికి కలిగే ఆ వినయం సంస్కారజం కానీ దైవీయమైనది కానీ కాదు కనుక వారికీ పరాభవం నిశ్చయమే. శ్రీమద్రామాయణంలో శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టే సందర్భంలో ఆయనకు క్షత్రియోచితమైన కుతూహలమే కాని రాజదర్పమూ బలగర్వమూ ఏమీ లేవని స్పష్టంగా తెలుస్తున్నది కథాగమనంలో. ఆ ధనువును కూడా ఆయన గురువుల అనుజ్ఞ మేరకే ఎక్కుపెట్టిన వినయశీలి. శివకేశవులకు అబేధం కనుక ఆ ధనువు ఆయనదే. దైవీయమైన ఆ ధనువును అందుకే ఆయన ఒక్కడే ఎక్కుపెట్టగలిగాడు. |
తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన 19 |
మహామునీ విశ్వామిత్రా, ఈ రాజులంతా అలసత్త్వులని తెలిసిపోయింది. ఓ తపోధనా, నిర్మొగమాటంగా వాళ్ళందరినీ నీరాకరించి పంపివేసాను.
|
జనకమహారాజుకు సీతమ్మ యొక్క తత్త్వం దైవీయమైనది అని తెలుసు. ఆమె అయోనిజ, తనంత తానుగా భూమి నుండి ఆవిర్భవించి స్వయంగా నేను నీ కూతురిని అని ప్రకటించినది ఆ బాల. అటువంటి దైవసంబంధమైన ఘటన కాక మానవలోక సహజం కానే కాదు కదా.
ఈ శివధనస్సు దైవీయం. భగవదనుగ్రహం వలనే ఆ ధనువూ, ఈ పుత్రికా తనకు లభించారు. అందుచేత ఆ కుమార్తెకు వరుడుగా అర్హమైన వ్యక్తి కూడా దైవీయమైన శక్తి యుక్తులు కలవాడే అవుతాడు.
అన్యులు ఏ పాటి? వారి శక్తులు ఏ పాటి? వారంతా తమకు తాముగా పరీక్షకు అంగీకరించి ఓడి తమది అల్పసత్త్వమే కాని ఏ దైవీయమైన విశేష బలపరాక్రమాలూ తమ వద్ద లేనేలేవని తామే సభాముఖంగా నిరూపించుకున్నారు. జనకమహారాజుగారి ఆంతర్యాన్ని మూర్ఖులైన ఆ రాజులు గుర్తించలేరు. సామాన్యులైన సభాసదులు ఎవరూ గ్రహించలేరు.
కాని మహా తపస్వి ఐనవాడూ, అపరబ్రహ్మ ఐన విశ్వామిత్రమహర్షి గ్రహించగలడని చెప్పటానికి యేమీ అనుమానం ఉండదు కదా. ఆ రాజులను అల్పసత్త్వులని చెప్పటమూ, విశ్వామిత్రులను మహామునీ, తపోధనా అని రెట్టించి సంబోధించటమూ ఈ విషయాలను గుంభనగా చెబుతున్నాయి.
|
తతః పరమకోపేన రాజానో నృపపుఙ్గవ న్యరుంధన్మిథిలాం సర్వే వీర్యసందేహమాగతాః 20 |
తమతమ ప్రతాపాల గొప్పలు సందేహాస్పదం అని ఇలా సభాముఖంగా ప్రకటించినట్లుగా జరిగింది. దాంతో అవమాన భారంతో ఆ రాజులందరికీ పిచ్చికోపం వచ్చింది. వాళ్ళు అవమానంతో కుతకుతలాడి, అంతా కలిసి మిథిలను ముట్టడించారు.
|
నిజానికి ఆ రాజులంతా శ్రేష్ఠమైన పరాక్రమం కలవాళ్ళే కాని సభలో విల్లుముందు తేలిపోయారు. ఆ మాట చెప్పటానికే ఆ రాజుల్ని జనకులు నృపపుంగవులు అన్నారు.
వాళ్ళెంత పరాక్రమవంతులైనా వారి పరాక్రమంలో దైవీయమైన కోణం ఏమీ లేదు కాబట్టి ఆ విల్లు వారిని నిరోధించింది. అందుకే జనకులు వారిని పొమ్మన్నారు. వాళ్ళకి కోపం రావటంలో వాళ్ళ తప్పు కాని ధూర్తత్వం కాని ఏమీ లేదని ఈ శ్లోకంలో జనకులు ఈనృపపుంగవ అన్న మాటతో సూచించారు.
ఏదో ఒక్క ముక్క పట్టుకుని ఇలా అనటం కుదురుతుందా అంటే తప్పకుండా కుదురుతుంది. వాల్మీకి మాటల్లో పొల్లుమాటలు ఉండవు. అందులోనూ జనకుడి మాటలుగా చెబుతున్నవి ఖచ్చితంగా జనకమహారాజు హృదయాన్ని ఆవిష్కరించేవే కాని ఏదో పూరణకోసం అల్పకవి వాక్యాలుగా ఉండనే ఉండవు.
|
ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుఙ్గవాః రోషేణ మహతాఽఽవిష్టాః పీడయన్మిథిలాం పురీమ్ 21 |
ఓ మునిపుంగవా, ఈ రాజులంతా నేనేదో వాళ్ళని కావాలని అవమానించి పంపివేసానని భావించారు. అందుకే వాళ్ళంతా కలిసి మిథిలపైన ముట్టడి చేసారు.
|
అంటే ఆ రాజులంతా ఈ మిథిలారాజు కపటి అని భావించారని అర్థం.
ప్రపంచంలో ఒక వస్తువు యొక్క ధర్మాలను మనం మన ఇంద్రియానుభూతుల సహాయంతో నిర్ణయిస్తాం. తరచుగా పూర్వానుభవమూ, లోకానుభవమూ అనేవి కూడా సహాయం చేస్తాయి ఈ విషయంలో.
ఇది ఒక రకంగా బలమే. నిత్యజీవితంలో అనేకవిషయాలను పదే పదే అనుభవించవలసిన పరిస్థితి తప్పుతుంది. తడిగా ఉన్న నున్ననిగచ్చు మీద నడిస్తే పడతామని లేదా ఇతరులు పడగా తెలుసుకున్నామనీ జ్ఞానం ఉన్నప్పుడు ప్రతిసారీ పడి తెలుసుకోవలసిన పని లేదు కదా? అలాగే చెక్క వస్తువు కన్నా ఇనుపవస్తువు బరువుగా ఉంటుందన్నదీ స్వానుభవమో లోకానుభవమూ కూడా కదా.
ఇలాంటి ఇంద్రియ జ్ఞానాన్ని భ్రమపరచి తప్పుదోవ పట్టించి ఇంద్రజాలికులు వినోదం కలిగిస్తారు. మోసగాళ్ళు నిలువునా ముంచి పోతూ ఉంటారు. జనకమహారాజు ఒక విల్లును ఎత్తమన్నాడు. విల్లును ఒక ధృఢమైన వెదురు వంటి వాటితో చేస్తారు. కాని లోహంతో చేయరు కదా. తీరా చెక్కవస్తువు అని భ్రమపెట్టేలా ఏదో బరువైన లోహపు వింటిని ఇచ్చాడు జనకుడు. అదీ కాక పట్తుకుందుకు అనువుగా లేకుండా దాని తయారీలోనే ఏదో చమత్కారం ఉంది. అది ఒక విల్లు అని భ్రమపడి అందరూ మోసపోయారు. పిల్లని ఇవ్వటం ఇష్టం లేక మిథిలా రాజు ఈ ఎత్తు వేసి అందర్నీ నిందుసభలో అవమానం చేసాడు.
ఇదీ ఆ రాజుల అనుమానం.
బహుశః ఆ వింటి గొప్పను జనకుడు ఆ రాజులకి చెప్పినా వాళ్ళు పామరత్వంతో ఆ కథనాన్ని నమ్మలేరు. అంతా మోసం అనే వారి అనుమానం. జనకుడు కూడా బలశాలి ఐన రాజోత్తముడు కాబట్టి ఏ రాజో దండెత్తి ఓడించేది అనుమానం. అందుకే అందరూ కలిసి జనకుణ్ణి ఓడించాలని మిథిలా నగరాన్ని ముట్టడించా రన్నమాట.
|
తతస్సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః సాధనాని మునిశ్రేష్ఠ తతోఽహం భృశదుఃఖితః 22 |
ఈ రాజులంతా కలిసి ఒక సంవత్సరం పాటు ముట్టడించారు. నగరంలో ఆహారపదార్థాలకు కొఱత వచ్చే పరిస్థితి దాపురించింది. ఓ ముని శ్రేష్ఠా, అది నాకు చాలా కష్టం కలిగించింది.
|
అంటే వాళ్ళంతా కలిసి ముట్టడించినా మిథిల లొంగలేదు. ఒక సంవత్సరం పాటు వాళ్ళు పట్టువిడవకుండా ఆ దాడిని కొనసాగించినా జనకుడు వాళ్ళని సమర్థంగా నిగ్రహించగలిగాడు.
ఏ కాలంలో ఐనా ఒక ప్రాంతాన్ని దశదిశలా దిగ్భంధం చేసి ముట్టడిస్తే ఎంత సమర్థంగా వాళ్ళని లోపలకి చొరబడకుండా నిలువరించినా క్రమంగా చిక్కుబడ్డ ప్రాంతానికి తిండి కొరత వస్తుంది తప్పకుండా.
ఎందుకంటే ఏ ప్రాంతమూ సర్వవిధాలా స్వయం సమృధ్ధం కాలేదు కదా. కొన్ని రకాల తిండి దినుసులను మనం తయారు చేసుకుంటే మరికొన్ని ఇతరప్రాంతాలనుండి దిగుమతి చేసుకుంటాం. ఒకచోట్నే అన్ని అవసరమైన పంటలూ పండవు కదా. అలా బయటినుండి రావలసిన దినుసులకు తప్పకుండా కరువు వచ్చితీరుతుంది.
ఆన్ని దినుసులూ ముఖ్యావసరాలు కాకపోవచ్చును. కాని వాటిలో కొన్నైనా ముఖ్యావసరాలు ఉండితీరతాయి. కేవలం చింతపండుకో, ఉల్లిపాయలకో కొరత వస్తే ఎంత గడబిడ చెలరేగుతుందో అందరం చూస్తూనే ఉంటాం కదా. అలాంటిది నిత్యావసరాలు బయటినుండి నగరంలోనికి వచ్చే దారులన్నీ మూసుకొని పోతే, అదీ ఒక సంవత్సరం పాటు ఐతే. నగరంలో జీవితం అత్యంత సంకతస్తితిలోకి వచ్చేస్తుంది.
పాలకుల మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఇలా వచ్చింది ముట్టడి ప్రభావం అని జనకులు చెబుతున్నా రిక్కడ,
|
తతో దేవగణాన్ సర్వాన్ తపసాఽహం ప్రసాదయమ్ దదుశ్చ పరమప్రీతా శ్చతురంగ బలం సురాః 23 |
నేను సమస్త దేవగణాలనూ సహాయం కోసం ప్రార్థించాను. వారి దయ కోసం నేను చేసిన తపస్సుకు దేవతలు సంతోషించి నాకు చతురంగ బలాల్నీ అనుగ్రహించారు.
|
మానవ ప్రయత్నంతో జనకరాజుగారు కోపాలసులైన ఆ రాజుల్ని ఏడాది పాటు ఎదిరించి నిలిచినా, పౌరజీవనానికి అంతరాయం కలగటం వలన దుఃఖించి, ఈ ముట్టడిని అంతంచేసే శక్తి కోసం దేవతల్ని ప్రార్థించారు.
జనకుడు తనకోసం కాక ప్రజలకోసమే దేవతలను ఉద్దేశించి తపస్సు చేసారు కాబట్టి ఆ దేవగణాలు చాలా సంతోషించాయి. వారి అనుగ్రహం ఎలా వచ్చిందంటే దేవతలు ఆయనకు చతురంగబలాలను సమకూర్చారట. అంటే దేవతలదయ వలన ఆయనకు రథ, గజ, తురగ పదాతి బలాలు కొత్తగా సమకూడా యన్నమాట. దీని విషయంలో మనకు వివరం తెలియదు. కాబట్టి ఏదో ఒక విధంగా అర్థం చేసుకోవాలి మనమే.
యుద్దంలో క్షతగాత్రులైన సైనికులూ, అలాగే గాయపడిన గుఱ్ఱాలూ, ఏనుగులూ అన్నీ తిరిగి మంత్రం వేసినట్లుగా మరలా యుధ్ధానికి సర్వం సిధ్ధం కావటం జరిగి ఉండవచ్చును. దెబ్బతిన్న రథాలన్నీ దేవతల అనుగ్రహం వలన సులభంగా బాగుపడి ఉండవచ్చును. దానితో ఆయన బలం పెరిగి ఉండవచ్చును.
దేవతలు అఘటనఘటనా సమర్థులు కాబట్టి నిజంగా వారి మాయ వలన బోలెండంత బలగం ఆయనకు ఏర్పడి ఉండవచ్చును అని కూడా చెప్పుకోవచ్చును.
|
తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః అవీర్యా వీర్యసన్దిగ్ధా స్సామాత్యాః పాపకర్మణః 24 |
దానితో ఆ పాపాత్ములైన రాజులంతా సందిగ్థంలో పడిపోయారు. పెరిగిన నా బలాన్ని ఎదుర్కోలేక ఇంక తమతమ ప్రతాపాలను నమ్ముకోలేక ఆ రాజులూ వారిని ప్రేరేపీస్తున్న మంత్రులూ అంతా చెల్లాచెదరుగా తలో దిక్కుకూ పారిపోయారు.
|
ఇక్కడ జనకమహారాజుగారు ఆ రాజుల్ని పాపాకర్ములని నిందిస్తున్నారు. తాము తమ చేతకాని తనంతో కొనితెచ్చుకున్న పరాభవానికి జనకుని నిందించటమూ, ఆయనతో యుధ్ధం పేర పౌరులకు తిండికి తిప్పలు తేవటమూ అనే తప్పుడు పనులకు వాళ్ళు పాల్పడ్డారు. అమాయకులకు హింసచేసే వాళ్ళని పాపకర్ములని తిట్టరా మరి?
సాధ్యమైనంత వత్తిడి తెచ్చారు. మిథిల లొంగలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కాని మరింత సైన్యంతో విరుచుకు పడి జనకమహారాజు తమని ఊచకోత కోస్తున్నాడు. అందుకే వాళ్ళకు దిక్కు తోచలేదు. అసలు ఈయన మూలబలం ఇంకా ఎంత ఉందో ఏమిటో? ఏడాదైనా అలవడు. చివరకు తమబలం అంతా నాశనం అయ్యే చిక్కు ఉంది.
అందుకే ఇంకేమీ చేసేది లేక, ఆయనకు తాళలేక ఎవరి ఊరి దిక్కుకు వాళ్ళు చక్కాపోయారు. అంటే ఇన్నాళ్ళూ ఐకమత్యంగా ముట్టడి చేసారు కాని ఇంక ఎవరి మాటా ఎవరూ వినే స్థితి లేదు. ఎగదోస్తున్న మంత్రులూ, నచ్చచెబుతున్న పట్టు వదలని రాజుల తాలూకు మంత్రులూ అంతా కూడా నోరు మూసుకోవలసి వచ్చింది. గందరగోళం నెలకొంది. ఎవరి దారిన వారు ఎవరు ఏమి చెబుతున్నా వినకుండా పలాయనం చిత్తగించారు.
|
తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరమ్ రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత 25 |
ఓ ముని శార్దూలా, ఇదే నయ్యా ఆధనుస్సు సంగతి. అది అత్యంత ప్రకాశవంతమైనది. ఆ వింటి జోలికిపోయే వచ్చిన రాజాదిరాజు లందరూ చిన్నబోయినది. ఈ రామలక్ష్మణులకు కూడా ఈ వింటిని చూపిస్తాను. |
జనకుడు చెప్పిన ఈ మాటలు గమనార్హమైనవి. ఆయన ఇంకా రామలక్ష్మణుల సామర్థ్యాన్ని నమ్మటం లేదు. నమ్మటానికి ఆట్టే ప్రాతిపదికలు లేవు కూడా కదా ఆయనకు.
రాముడూ ఆయన తమ్ముడూ విశ్వామిత్రుడి యాగాన్ని సంరక్షించిన సంగతి జనకుడికి ఈ పాటికి తెలిసే ఉండవచ్చును. అలా జరగటం నిస్సందేహంగా గొప్ప విశేషమే. కాని అందులో విశ్వామిత్రుడి మహత్తు కూడా ఎంతో ఉండి ఉందవచ్చును రామలక్ష్మణుల గొప్పదనం కన్నా కూడా.
ఏమో తనకు ఏమి తెలుసును? అరణ్యంలో ఎన్ని జంతువులు ఉన్నా అవన్నీ పులిముందు తోక ముడుస్తాయి. అలాగే పులి లాంటి ముని ఐన విశ్వామిత్రుడి ముందు రాక్షసులు ఒకరిద్దరి ఆటలు సాగుతాయా? ఆయన తలచుకోబట్టే రామలక్ష్మణులు ఆ రాక్షసుల్ని ఎదిరించే సాహసం చేసి ఉండవచ్చును కదా? అందులో అసంభావ్యం ఏమీ లేదు.
అందుకే కొంచె ముక్తసరిగానే అదే నయ్యా విల్లు కథ, ఈ పిల్లలకీ చూపిస్తాను అనేసాడు.
|
యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్ 26 |
మహామునీ, ఒకవేళ ఈ రాముడు గనుక ఆ వింటికి నారిని తొడగ గలిగితే, ఆయోనిజ ఐన నా కుమార్తె సీతను ఈ దాశరధికి ఇస్తాను.
|
రాముడు శివధనస్సుకు నారిని తొదగగలిగితే అతడికి సీతను ఇస్తాను అంటున్నారు జనకమహారాజు. ఆయనకి రాముడి పైన పూర్ణవిశ్వాసం కలగలేదు కనుకనే అలా చేయగలిగితే అని అనటం.
ఈ రాముడేమో కాకలు తీరిన యోధుడా? ఆయన పేరు వీరుల్లోకి ఎక్కి దేశదేశాలా ప్రాకిందా? ఇంకా అలాంటి దేమీ లేదే? ఇతనా పిల్లవాడు. దశరథుడు విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపటానికి మొదట తటపటాయించాడు కదా. నిర్మొగమాటంగా "ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచనః" అని అన్నాదు కదా నిండా పదహారు యేళ్ళు లేని పిల్లవాడే అని సాకు చెబుతూ.
కాకలు తీరిన భుజబలశాలురు ఓడి వెనుదిరిగిన సంగతి చూసిన జనకుడు, ఆ వింటిని ఈ నూనూగు మీసాల రాముడు ఎత్తగలడనీ దానికి నారిని సంధించగలదనీ ఒక పట్టాన ఎలా నమ్మగలడు?
|
1, డిసెంబర్ 2014, సోమవారం
హనుమంతుడి కోరిక
శ్రీరామచంద్రుడు సింహాసనమున కూర్చుండి యుండగా కొలువుకూటమున లోకవృత్తము లెల్ల సాకల్యముగను దక్షులై మంత్రులు తన కెఱిగింప ఉచితాసనంబుల నున్నట్టి వారు సామంతరాజులా సరిలేని దొఱను కొలిచి యాదేశముల్ తెలియు చుండగను కవులు నట్టువరాండ్రు గాయకు లెల్ల విద్యల జూపంగ వేచి యుండగను మునివరేణ్యులు నవ్వుమోముల వారు తులలేని మహిమలు గలిగిన వారు సాకేతపురనాథు సభలోని కంత నాకాశమార్గాన నరుదెంచినారు వచ్చిన తపసుల వసుధేశు డంత సింహాసనము డిగ్గి సేవించి తగిన యాసనంబుల నుంచి యందర కపుడు ప్రీతిగా నిటుబల్కె వినయంబు మీఱ మునిసత్తములు మీరు జననాథు నొకని గనవచ్చు టది వాని ఘనభాగ్య మగును వాని రాజ్యంబున పాడిపంటలకు సమృధ్ధి కలుగును సర్వకాలముల వాని రాజ్యంబున ప్రజల కందరకు పూర్ణాయువులు గల్గు పొల్పు మీఱగను వాని రాజ్యంబున ప్రజల కందరకు ధర్మార్ధకామముల్ తప్పక దొఱకు మీ రాకయే మాకు మిక్కిలి శుభము మీ రాకయే మాకు మిక్కిలి జయము మా పుణ్యములు పండి మాకు మీ దివ్య దర్శనభాగ్యంబు తాపసులార కలిగిన దిక మీద తెలుపుడు మాకు మీ యాజ్ఞ రాముడు మీఱడు దాని ననవుడు శ్రీరాము గనుగొని మునులు ఆదినారాయణుండవు నీవు రామ జానకీహృదయేశ జగదభిరామ రఘుకులాంబుధిసోమ రాజలలామ రావణనిర్మూల రణరంగభీమ కారుణ్యగుణధామ తారకనామ పరమర్షిగణములు సురలు భూదేవి ధాతయు నినుజేరి తద్దయు భక్తి ప్రార్థించి యోదేవ రావణాసురుని ఆగడంబుల తీరు నణచగా నీవు నరరూపమును దాల్చు తరుణ మేతెంచె నని విన్నవించగా నపుడు వారలకు నభయంబు దయసేసి యవని కౌసల్య గర్భవాసంబున కడువేడ్క నిట్లు ప్రభవించితివి శేషఫణి లక్ష్మణుడుగ చక్రశంఖంబులు చక్కగా భరత శత్రుఘ్నులను పేర జనియించినారు రఘువంశమున నీవు రామచంద్రునిగ అవతరించగ నుంటి వనెడు సత్యమును చిత్తమం దెఱిగి వశిష్టుండు మున్నె మీ కులగురువుగా మెలగుచున్నాడు నిత్యానపాయిని నీకు తోడుగను శ్రీయాదిలక్ష్మియే శీఘ్రంబుగాను అవని కడుపునుండి యవతరించినది రావణు నడగించి దేవాధిదేవ పట్టాభిషిక్తుండ వగునాడు నీదు వైభోగమును చూడవచ్చుట కేము యాగదీక్షితులమై యడవులనుండి రాలేకపోతిమో రామయ్య తండ్రి వచ్చితి మీనాడు వనజాక్ష నిన్ను కనులార చూడ సంకల్పంబు జేసి మాకు సీతను జూపుమా రామచంద్ర మాకు లక్ష్మణు జూపుమా రామచంద్ర మాకు భరతు జూపుమా రామచంద్ర శత్రుఘ్ను జూపించు సాకేతరామ సామీరినిం జూపు సాకేతరామ చూపవె శ్రీరామ సుగ్రీవు నటులె యందర వీక్షించి ఆశీర్వదించి స్వస్థానముల కేము చనువార మయ్య యీ చిన్ని కోరిక నీడేర్ప వలయు వేఱొండు వలదని వినిపించినంత నీరేజ నేత్రుండు నెవ్వెరపాటు చెంది యీ రీతిగ చెచ్చెర బలికె ఘనులార మునులార వనవాసులార వినుడయ్య సభ కేను పిలిపింతు నిపుడు మా తమ్ము లందర మహిత సత్వులను రాజసభకు వచ్చు రాముడు పిలువ సీతామహాదేవి శిరసావహించి మీపాదముల కేము మీఱిన భక్తి మ్రొక్కువారము గాని తక్కుంగ లట్టి సామీరి ప్రభృతుల్ సభకు రాలేరు మునివరేణ్యుల యాన గొని రాముడెట్లు తప్పి చరించునో తాపసులార కావున వారికి కబురంపు వాడ వారెల్ల వచ్చెడు వరకు మా యింట విడిది చేయుడు మిమ్ము వేడెద నింక ననవుడు మునులెల్ల రాశ్చర్యపడుచు రాచనగరుల నుండ రాదు మా కెపుడు వారు వచ్చెడు దాక వారిజనేత్ర మీ యింటనే విడిది చేయుట యెట్లు పోనిమ్ము నినుజూచి పొంగితి మదియె మాకు చాలని యెంచి మరలి పోయెదము కలగకు మో రామ కమలాయతాక్ష యని యూరడించుచు నాడిరి నగుచు నా మాటలొప్పక నంబుజోదరుడు శ్రీరామచంద్రుడు చిన్మయు డపుడు కులగురువుల వంక తిలకించి బలికె వీరు మహాత్ములు విచ్చేసి నారు కోరిన కోరిక కోసలరాజు తీర్చలేదని బల్కి తిరిగిపోయెదరు కాలంబు నన్ను వెంగళిజేయ నెంచె నా కీర్తి ప్రభలెల్ల లోకాన నణగ కాల మొనరించిన గారడీ విద్య పుణ్యమా యని నేడు పుట్టె నీ చిక్కు రఘువంశ మర్యాద రక్షించ వలయు బ్రహ్మర్షి పరమపావనమూర్తి మీరె యనినంత నా మాట లాలించి మునుల కనునయంబుగ బల్కె నంత వశిష్ఠ మౌనీంద్రు డో దయామయులార మీరు మూడు పవళ్ళును మూడు రాత్రులును విడిసిన చాలును తడయక నిపుడు పుష్పకంబును రామభూపాలు డంపు సౌమిత్రి తానేగి సుగ్రీవ హనుమ దాదుల గొనివచ్చు నా పైన వారి నందర వీక్షించి యరుగుట యొప్పు నని నంత ఋషివరు లట్లు గాదయ్య వనముల నుండుటే భావ్యంబు మాకు నొక దినంబున కన్న నొండొక్క చోట నుండుట మా కెప్పు డుచితంబు గాదు బ్రహ్మర్షి మము దప్పు పట్టకు మయ్య యనుచు వాక్రుచ్చగా నాత్మగతమున శ్రీరామచంద్రుండు చింతించె జొచ్చె నన్ను నే నెఱిగియు నరుని పధ్ధతిని వర్తించు చుంటిని పరమర్షు లిపుడు నన్నుపరీక్షింప నెన్నిన యట్లు కనుపించు చున్నది కాన వీరలకు కామితం బొనరించ గడగుదు నింక నని నిశ్చయంచుచు వనజాక్షుడంత మంచిది మునులార మహితాత్ములార దయతోడ దిన మొండు తమరిందు విడిసి మము కృతార్థుల జేయ మన్నించవలయు మీరు కోరిన యట్లు పేరోలగమున పురజనంబుల ముందు భూపుత్రితోడ మా సోదరులతోడ మారుతితోడ సూర్యకుమారుడౌ సుగ్రీవుతోడ నాతని పుత్రుడౌ నంగదుతోడ వీతరాగుండు విభీషణుతోడ ఋక్షేశ్వరునితోడ ఋజువుగ మిమ్ము దర్శించగల నిట్లు దయచేయ వలయు నని విన్నవింఛిన హర్షించి వారు విడుదుల కేగిరి విభుని కీర్తించి రాజేంద్రు డంతఃపురంబున కేగి సభలోన జరిగిన సంగతు లెల్ల సీతామహాదేవి చెవులొగ్గి వినగ విశందబుగను జెప్పి పిదప నిట్లనియె రేపటి సభలోన తాపసవరులు నగరవాసులు జూడ నాతోడ నీవు సింహాసనస్థవై చెన్ను మీఱగను నా తమ్ములందరు నా ప్రక్కనుండ మారుతిప్రభృతుల్ మనసమక్షమున నేత్రోత్సవంబుగా నెలకొని యుండ రఘువంశమర్యాద రాజిల్లుగాక ననవిని సీతమ్మ అవనీశ యింత నవ్యవధిగా నెట్టులా కపివరులు సభలోని కరుదెంచజాలుదు రనియె చిరుచిరు నగవుల శ్రీరాముడంత నింతిరో యిదియెల్ల నెరిగెద వెల్లి పేరోలగంబున వారల నోట చింతించవలదని సీత నోదార్చె నంతట జానకి యగ్నిహోత్రునకు విన్నపంబులు సేసె వేవేగ నీవు పవనాత్మజాదుల భావంబులందు రామదర్శనకాంక్ష రగిలించవయ్య ఉన్నవా రున్నట్లు తిన్నగా రేపు రఘునాథు కొలువుకు రావలెనయ్య అఖిలదేవతలందు నాద్యుండ వగుచు నాపదలను గాయు నగ్నిహోత్రుండ మున్ను గాచినయట్లు నన్ను నా పతిని కావవే యెల్లి యో కరుణాంతరంగ యని చాలమారులు వినతులు చేసె అగ్నిహోత్రుని గూర్చి యానాటి రాత్రి కులగురువులు కూడా కోరిరా రీతి సామీరిలంకేశజాంబవదాంగ దాదులు సర్వులు దశరథసుతుని కొలువున కెల్లి రా గూర్చుమీ వనుచు నరనాథు డంతట మరుచటిదినము ఘనముగా నారవకాలంబు నందు సభదీర్చ జనులెల్ల చనుదెంచినారు సౌమిత్రులిర్వురు చనుదెంచినారు పరువున వచ్చెను భరతుడా సభకు హనుమంతుడంతలో నరుదెంచినాడు రాక్షసనాథుండు రయమున వచ్చె జాంబవంతుడు వచ్చె సంతోషమొప్ప ఘనుడు సుగ్రీవుండు కపిరాజు వచ్చె నంగదనీలాదు లరుదెంచినారు ఎక్కెడెక్కడివారు నెక్కటి కపులు వచ్చిరి శ్రీరామవల్లభుసభకు నంతలో నరుదెంచె నవనిజ గూడి విభు డయోధ్యాపతి వేడుక మీఱ నంతలో ఋషివరు లరుదెంచినారు కులగురువుల తోడ జలజాక్షుసభకు సింహాసనంబున సీతమ్మతోడ నీరేజనేత్రుండు నేత్రపర్వముగ ఉపవిష్ఠుడై యుండ తపసులెల్లరును తనివితీరగ గాంచి ధన్యులైనారు జయరామ శ్రీరామ సాకేతరామ రావణాంతకరామ రాజలలామ కళ్యాణగుణధామ కమనీయనామ అద్భుతదర్శనం బందించినావు మా కోరికను నీవు మన్నించినావు షష్టిఘడియలలోన సర్వులం జూపి కన్నుల పండువ గావించినావు పోయివచ్చెద మింక భూనాధ నీకు శుభమగు ననిపల్కి శ్రుతుల వల్లించి దండిగా దీవించి తాపసోత్తములు సభ యొల్ల జూడంగ క్షణమాత్రమందె అంద రంతర్హితులై చనినారు వచ్చిన సామీరి ప్రభృతులకును బహుమతు లందించె పార్థివు డపుడు బహుమతు లొల్లక పలుకాడ దొడగె సామీరి యంతట స్వామికి మ్రొక్కి ఏ మయ్య నాకేల నీ బహుమతులు నిన్న మా నిదురలో నీవు కన్పించి ఉన్నపాటుగనె రమ్మన్నంత లేచి ఎగిరివచ్చితి మయ్య యెల్లవారలము నీకు దూరంబుగ నే నుండజాల సాకేతరామ నీ చరణారవింద సేవనాశీలుండ నై వసియింతు నీ మ్రోలనే యుండి నీ పరిచర్య చేయుచుండుట చాలు నేయితరములు నే నొల్లనో తండ్రి నీ చిత్తమనిన నీ కోర్కి యిదియని నే నెఱుగుదును కావున నిది యెల్ల కల్పించినాడ నీవు వేఱొక్కచో నిలువగ నేల నే రీతి నది నాకు హితమౌను హనుమ కావున నిది యెల్ల కల్పించినాడ పుత్రవాత్సల్యంబు పొంగారు చుండ సీతామహాదేవి చింతించు నిన్ను కావున నిది యెల్ల కల్పించినాడ సమ్ముఖంబుననుండి సామీరి నీవు పరమహర్షమ్మున వర్థిల్లవయ్య యని స్వామి ప్రియమార హనుమకు నుడివె |
26, ఆగస్టు 2014, మంగళవారం
రేఫరహిత శివధనుర్భంగము
మున్నుడి:
శ్రీకంది శంకరయ్యగారు తమ శంకరాభరణం బ్లాగులో ఈ నెల 17న నిషిధ్ధాక్షరి - 5 పేరిట ‘ర’ అనే అక్షరాన్ని ఉపయోగించకుండా శివధనుర్భంగం గురించి మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి అని ఇచ్చారు. ముందుగా అనుకొనక పోయినా క్రమంగా నాకొక ఉద్దేశం కలిగింది. శ్రీరామకథాఘట్టాల లోని శివధనుర్భంగం గురించి పూర్తినిడివి ఖండిక ఒకటి, శంకరయ్యగారిచ్చిన నియమం పాటిస్తూ వ్రాస్తే బాగుంటుందని. ఇది పూర్తినిడివి కాబట్టి ఆ పేజీలో ఒక వ్యాఖ్యగా వ్రాయటం కూడా సాధ్యం కాదు. అందుచేత వీలు చూచుకొని ఇది వ్రాయటానికి ఉపక్రమించాను. వాల్మీకులవారి శ్రీమద్రామాయణం బాలకాండలో ఈఘట్టం 66, 67వ సర్గలుగా వస్తుంది. ముందుగా 66వ సర్గను రేఫరహితంగా వ్రాసి పంపితే శంకరయ్యగారు దానిని పరిష్కరించి తమశంకరాభరణం బ్లాగులో ప్రకటించారు. తదుపరి రెండవభాగాన్నీ అలాగే రేఫరహితంగా వ్రాసి పంపితే పరిష్కరించి తమ శంకరాభరణం బ్లాగులో దానిని కూడా ప్రకటించారు. వారికి నా కృతజ్ఞతలు. అక్కడ కవిమిత్రులు పరిశీలించి చెప్పిన సవరణలు కూడా జతపరచి ఇప్పుడు ఈ నా బ్లాగులో కూడా పొందుపరుస్తున్నాను.
ఆదిత్యకులపావనాకృతులైన బాలకులను గాధివంశపావనుని చాల సన్మానించి జనక భూపతియు భగవానుడా నాదు భాగ్యంబు పండి చనుదెంచితివి నీదు సంకల్పమునకు లోకంబులన్నియు లొంగి సేమంబు గలిగి నడచుచునుండు గాధేయ నేడు నా కేమి యానతి నా బల్క మెచ్చి మూడు కాలంబుల ముచ్చట లెల్ల తెలిసిన ముని యిట్లు తీయతీయంగ నుడివె నీ బిడ్డలు కొడుకు లయోధ్య నతికుశలత నేలు నట్టి మహాను భావుడు దినమణి వంశవల్లభుడు జనహితుండైన దశస్యందనునకు నీ యొద్ద నున్నట్టి నిస్తులం బైన శివమహాచాపంపు చెలువంబు జూప నేనె దెచ్చితి నయ్య నీ సభ కిట్లు దానిని తిలకించి తమ యింటి కేగ తలచు బిడ్డల కీవు దాని చూపించ వలయును మాదగు వాంఛితం బిదియ యనినంత తమ యాన యనెను భూపతియు అటు బల్కి యుత్సాహ మతిశయించగను పలుక జొచ్చెను మహీపాలు డా పైన వినవయ్య మునినాథ వినిపింతు నీకు భవుని చాపము మాకు వచ్చిన విధము జననాథవంశభూషణు లిది వినుడు భవుని చాపము మాకు వచ్చిన విధము అల్లుడు శివునిపై నలిగి దక్షుండు శివదేవునే వెలి జేసి యజ్ఞంబు ఘటియింప జూచిన కలుషాత్ము డైన దక్షుని భయమున దడదడ మనుచు దేవత లేగిన దేవదేవుండు శివుడంత కోపించి చేబూని విల్లు భవునకు భాగంబు పంచక నొకడు జన్నంబు చేయుట చాల తప్పనక సమధికోత్సాహులై చన్నట్టి మీదు తలలెల్ల డుల్లించ తలచితి ననిన భీతులై దేవత లాతని పాద పద్మంబులను బట్టి పనవిన జాలి పడి నిలింపుల గాచి పదపడి యట్టి పెనువింటి నెలమిని వినుడు మా వంశ మందొక్క భక్తుని మన్నించి యిచ్చె నాతడు నిమి చన నైదవవాడు పదునైదు మందికి పైవాడు నాకు యజ్ఞదీక్షితుడనై యవనిని దున్న నాగేటి చాలున నాకు లభించి నది యయోనిజ సీత యమిత సుశీల భూలోకలక్ష్మియై పుట్టిన బాల చాల దయామృతస్వాంత మా సీత భూజాతయై పుట్టి యీ జనకు నింట వెలసిన యీ తల్లి విధమెల్ల తెలిసి మా కన్య నడుగుచు మహినున్న గొప్ప జననాథు లిటు వచ్చి జనినది నిజము బలశాలి యగు వాని భాగ్యమీ తన్వి బలశాలి యెవడన్న పశుపతి వింటి నెక్కిడ జాలిన చక్కని వాడె యను నట్టి నా మాట నాలించి వేగ శివమహాచాపంబు చేబూన బోయి ఎంత కష్టించియు నించుక యైన కదలింప సాధ్యంబు కాకున్న కినిసి జనపతు లంతట జతగూడి మిథిల పైకెత్తి వచ్చిన వెనుదీయ కేను యుధ్ధంబు గావించి యుంటి నొక్కేడు పోవక భూపతుల్ పోటెత్తి యుండ చేయ వినతులు జేజేలకు నేను నా బలంబంతట నాల్గింట నుబ్బె నా పైన దుష్టుల నణచితి నేను మీ యాన చొప్పున మునివేగి మీకు చూపింతు నేపైన చాపంబు నిపుడె ఈ నాడు గాని యీ యినకులేశుండు పశుపతి చాపంబు పట్టి పై కెత్తి జతచేయ గలిగెనా చక్కగా గుణము బలశాలు లందున బలశాలి యితడె ఈ యయోనిజ సీత నీతని కిచ్చి చేసెద పెండ్లి జేజేలెల్ల మెచ్చ అన మెచ్చుకొని మహాముని గాధిసుతుడు జననాథ యెనలేని ఘనచాప మిపుడు గనకుండ మనసాగ దనుమాట నిజము జలజాక్షు నకు దాని సత్వంబు జూడ సభజూడ తన దైన సత్వంబు జూప దానిని తెప్పింప దగునయ్య నీకు నా విని జనకుడా నందంబు చెలగ దైవదత్తంబైన నావింటి నంత సభకు తెండని బంపె సమధిక బలుల ఎనిమిది చుట్టుల పెనుబండి మీద నిటలాక్షు చాపంబు నెలకొని యున్న మణిగణాలంకృతమంజూష నపుడు వేసట నా యైదు వేలమందియును కొనితెచ్చి నిలుపగా జనకుని యెదుట కనుగొని యొడయడు మునిమండనునకు అద్దాని జూపించి అఖిల లోకేశు పెద్ద చాపం బిదె యిద్దాని నెత్త మానవనాథుల మాట యెందులకు యక్షదనుజనాగు లక్షీణబలులు దేవముఖ్యులకైన దీనిని బూని వంచి గుణంబును బంధించ నలవె యుత్కృష్టమగు వింటి నో మహాభాగ గాధేయ మౌనిపుంగవ యింక దీని తమ శిష్యులకు జూప దగునయ్య యనగ కలువకన్నులవాడ ఘననీలవపుష జలజాప్తఘనకులతిలక బాలేందు మౌళి తాల్చిన యట్టి మహితచాపంబు కన్నులపండువుగా కనవయ్య యని ముని వేడుక నాన తీయగను వినయాతిశయమున మునినాథునకును జననాథునకును వందనములు చేసి గజగమనంబున ఘనమైన విల్లు శోభించుచుండు మంజూషను గదిసి నడచిసవ్యంబుగా గడు భక్తి జూపి ఓ శివచాపమా యుధ్ధతు డగుచు వచ్చెను వీడని భావింపవలదు శివుడన్న నాకుండు చిత్తంబు నందు నిశ్చలంబై యుండు నిజమైన భక్తి భవునదై యొప్పెడు బాణాసనంబు పావనములయందు పావనమనుచు భావించి వచ్చితి భవదీయమైన తేజంబు నీక్షించ దీనికి నీవు కోపించకుండగ గొంకెంచకుండ నా యందు దయచూపి నన్ను నీ చెలిమి గొననిమ్ము నా చేత గొననిమ్ము నిన్ను నని చాల వినుతించి వినయంబు వెలయ గడియలు విడిపించి ఘనమైన పెట్టె తలుపు నల్లన దీసి తా గాంచెనపుడు దివ్యశోభల నీను దేవుని విల్లు ఠీవి నెగడు దేవదేవుని విల్లు కని దాని ఘనశోభ కమలాక్షు డపుడు మునిపతి జనపతు లను గని పలికె కైలాసపతివింటి గంటి మీ వలన దయతోడ దీనిని తాకు భాగ్యంబు అనుమతించుడు ధన్యమగు నాదు జన్మ మా పైన మీ దైన యానతి యున్న వాంఛింతు గుణము నవశ్యంబు దొడుగ బాణంబు సంధించు భావంబు గలుగు పెద్దలు మీ జెప్పు విధము చేసెదను మీ పాదముల సాక్షి తాపసనాథ మీ పాదముల సాక్షి మిధిలాధినాథ యనవిని మునిపతి జనపతు లపుడు మిక్కిలి ముదమంది చక్కని పలుకు పలికితి వయ్య నీ తలచిన యట్లు శివుని చాపంబును చేబూన వయ్య చక్కగా గుణమును సంధించ వయ్య జయమస్తు శుభమస్తు జలజాక్ష యనగ ధనువును వెస డాసి దాని మధ్యమున జనపతియగు దశస్యందను పెద్ద కొడుకు చేయిడి పైకి గొబ్బున లేపె వేల మంది కదుప వీలు కానట్టి నీలగళుని విల్లు లీలగా నెత్తె నెత్తుటయే యేమి ఈశాను దివ్య చాపంబు గుణమున సంధించె వేగ శింజిని నాపైన చెవిదాక లాగి దినపతికులమౌళి కనువిందు చేయ నంతలో వింతగా నంతకాంతకుని పెనువిల్లు నడిమికి ఫెళ్ళున తునిసె భూకంపమనునట్లు పుట్టిన ధ్వనికి విలయమేఘధ్వానవిధమైన ధ్వనికి మునిపుంగవుండన జనపతి యనగ దినమణికులమణిదీపకు లనగ చక్కగ నిలువంగ సభనున్న జనులు వివశులై తక్షణం బవనిపై బడగ తెలివిడి జనులకు గలిగెడి దాక తాళి నృపాలుండు తాపసిం డాసి ముకుళిత హస్తుడై మోదం బెసంగ పలుకాడ దొడగెను పదిమంది వినగ భగవానుడా నాదు భాగ్యంబు పండె ఈ నాటి కొక జోదు నీశాను వింటి నెత్తగా జాలిన యెక్కటి మగని కన్నులపండువుగా చూడ గంటి ఇనవంశమున నెంత ఘనుడుదయించె ముక్కంటి పెనువిల్లు తుక్కాయె నిపుడు శివుని విల్లెత్త నా శివునకే తగును శివుడు గా కున్న కేశవునకే తగును కలనైన నూహింప గా దన్యు డొకడు లీలగా కొని తన కేల నద్దాని బేలపోవగ జేసె బెండు విధాన నన్నట్టి దద్భుత మాయె మహాత్మ ఇనకులపావను నెలమి సీతమ్మ తనపతిగా గొని ధన్యయై వెలుగు జనకుల కులయశంబును చాల నెగయు ఘనబలశాలికై జనకుని బిడ్డ వధువని పలికితి పంతంబు నెగ్గె తమ యాన యగు నేని తద్దయు వేడ్క నా యయోధ్యాపతి కతివేగముగను సంగతి తెలుపగా సచివుల నిపుడు పంపువాడను వివాహంపు వైభవము నకు బిల్వ నంపెద నా పట్టణమున అనవిని గాధేయు డమిత సంతుష్టు డై మిధిలాధీశు నటు చేయ బంచె. |
[గమనికః ఈ కృతి రెండుభాగాలుగా శంకరాభరణం బ్లాగులో ఈ మధ్యనే ప్రకటించబడినది.]
మలిపలుకు:
ఇలా రేఫరహితంగా వ్రాయటంలో పెద్ద ఘనకార్యం ఏమీ లేదు. ఒక చిన్న సరదా ప్రయోగం మాత్రమే. నిరోష్ట్యంగా కావ్యాలకు కావ్యాలే వ్రాసినవారున్నారు. (నిరోష్ఠ్యం అంటే చెప్పాలి. ఓష్ఠము అంటే పెదవి. అక్షరమాలలోని కొన్ని అక్షరాలను పెదవులు కలిపి పలుకుతాం. అవి ప-ఫ-బ-భ-మ అనే పవర్గం. ఇవే ఓష్ఠ్యవర్గం అక్షరాలన్న మాట. ఈ అక్షరాలను వాడకుండా ఒకటో రెండో పద్యాలు చెప్పటం ఒక చిన్నపాటి తమాషా అనుకుంటే, ఏకంగా ఒక కావ్యమే చెప్పటం అతి గొప్ప సర్కస్ ఫీట్ అన్నమాటే.) అందుచేత కేవలం రేఫలు - అంటే రెండు అక్షరాలు - 'ర', 'ఱ' అనేవి ఎక్కడా వాడకుండా వ్రాయటం అనేది మరీ గొప్ప చెప్పుకోవలసిన విషయం ఏమీ కాదు.
ఐతే, ఈ క్రమంలోనూ నాకు తగినన్ని కష్టాలు రానే వచ్చాయి. రామ పదం రాకూడదాయె. విశ్వామిత్రుడు అనకూడదాయె. దశరథుడు అని కూడా అనకూడదు. ధనుర్భంగం అనకూడదన్నది అలా ఉంచి విల్లు కాస్తా 'విఱిగె' అని కూడా అనకూడదు. శివుడు ఈ వింటిని జనకుడి పూర్వీకుడైన దేవరాతుడు అనే రాజుకు ఇచ్చాడు. సరిసరి ఈయన పేరూ అనకూడదు. రాముడు వింటికి నారిని తొడిగి ఆకర్ణాంతం లాగాడు. ఈ నారి అని కూడా అనరాదు. ఇలాంటి ఈతిబాధలు సవాలక్ష అన్నమాట. అట్లాగని ఎలాగో అలాగ పూర్తిచేస్తే కాదు. సారస్యం ఏమీ చెడకూడదు. నా సహజశైలికి మరీ దూరంగా వస్తే కృతకంగా తయారైపోతుంది. అది బాగుండదు. నిఘంటువుల్లోని పదాలు వాడితే అదొక కృతకమైన కిట్టింపువ్యవహారం ఐపోతుంది. సులభమైన మాటలే వాడాలని నా అప్రకటిత నియమం.
ఇలా పూర్తిచేయగా, ఈకృతి మొత్తం రెండు సర్గల్లోని 53శ్లోకాలను దాదాపు 190మంజరీద్విపద పాదాల్లోనికి సరళంగానే అనువాదం చేయటం జరిగింది.
ఒక తమాషా విషయం ఏమిటంటే, మనం నాటకాలూ, సినీమాలూ, సీరియళ్ళలో చూస్తున్నట్లుగా రాముడు విల్లు విరవాలని సీతమ్మవారు మనస్సులో కోరుకుంటూ ఏమీ డైలాగులు చెప్పలేదు. ఆ విల్లు కాస్తా విరిచేయగానే గబగబా వచ్చి రాముడి మెళ్ళో దండను వేసెయ్యలేదు. నిజానికి ఆ ఘట్టంలో సీతమ్మ ఆ సభాస్థలంలో లేనేలేదు! నమ్మండి. వాల్మీకంలో ఉన్నదే చెబుతున్నాను. అందులో ఉన్న సంగతే యథాతధంగా నా ద్విపదఖండికలో వ్రాసాను. కొద్దిగా నా స్వకపోలకల్పితం ఏదైనా ఉంటే అది పాత్రను ఉద్దీపింపచేయటానికి పాత్రోచితంగా ఒకటిరెండు మాటలు తప్ప మరేమీ లేదు. విషయం అంతా వాల్మీకుల వారిదే ఈ ఖండికలో.
రంగనాథ రామాయణంలో రాముడు శివధనస్సును చూసి
ఇది చాల చులకన ఇది చాల అలతి
పొగడిది దీని నా ముందు భూపాల
అంటాడు. అదంతా కవిగారి అతివేలమైన రామభక్తివిశేషంచేత ఆయన అలా రాముడి నోట పలికించారు. అది అనుచితం అని నాకు ఎప్పటినుండో కించగా ఉన్న మాట వాస్తవం.
మునిపల్లె సుబ్రహ్మణ్యకవి గారి సుప్రసిధ్ధకృతి ఆధ్యాత్మరామాయణం లోని కీర్తనల్లొ ఒకటైన వినవె శౌరి చరితము గౌరి కీర్తనలో కూడా
బెండువంటి నిల్లు నడిమికి
రెండు జేసి ..........
రెండు జేసి ..........
అని రాముణ్ణి పరశురాములవారు ఆక్షేపించటం చూస్తాం. అది కూడా కవిగారి భక్తిచిశేషం చేతనే కాని అది నిజంగా బెండువంటి విల్లైతే దానిని ఎనిమిదిచక్రాల పెద్దబండిమీద వేసి వేలకొద్దీ మంది ప్రయాసపడుతూ లాగుకొని రావలసిన అగత్యం ఏమీ ఉండదు కదా.
ఎటొచ్చీ, ఈ సందర్భంలో నేను కొంచెం భిన్నంగా రాముడి చేత సముదాచారయుక్తమైన మాటలు పలికించాను రసజ్ఞులకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాగే అక్కడక్కడ నా మాటలు ఒకటి రెండు ఉండవచ్చును అంతే.
ఇది చదివి వాల్మీకంలో శివధనస్సు గురించీ దానిని రాముడు భగ్నంచేయటం గురించీ వాస్తవంగా వాల్మీకంలో ఏమి ఉందో చదువరులు తెలుసుకోవచ్చును. అంటే ఇక్కడ సంస్కృతంలో స్వయంగా చదువుకొనలేని చదువరులు అని నా అభిప్రాయం.
ఇక ఈ ఖండిక యొక్క అందచందాలంటారా? కాకిపిల్ల కాకికి ముద్దు. నాకైతే బాగానే ఉంటుంది మరి. ఏ మాత్రం సరసంగా ఉందో చదువరులే చెప్పాలి.
మీమీ స్పందనలు తెలియజేస్తే సంతోషం.
20, సెప్టెంబర్ 2013, శుక్రవారం
కైకమ్మవరాలు
శ్రీరామచంద్రుని సింహాసనమున సుప్రతిష్ఠితు జేయు సుముహూర్త మెల్లి యనుమాట చెప్పుట నానందపడుచు దశరథభూజాని తన చిన్న భార్య కైకమ్మ యింటికి గబగబ వచ్చె సంతోషపూర్ణుడై యంతఃపురమున కాలు పెట్టిన రాజు కళవళ పడగ నిశ్శబ్ద మెల్లడ నెలకొని యుండె కైకమ్మ యున్నది శోకగృహమున తల్లడిల్లిన రాజు తన్వితో పలికె తనువున స్వాస్థ్యంబు తప్పలేదు గద ఘనవైద్యులున్నారు కష్టంబు వలదు అనవుడు కైకేయి యాగ్రహ మొల్క రాజేంద్ర నాకేమి రాయిలా గుంటి నని బల్కి పెడమోము గొని యుండె నంత నిర్ఘాంతపడి రాజు నెలతను గాంచి పొరబాటు జరిగెనా పొలతి నావలన దిద్దుకొందును తప్పు తెలుపుమా కైక నా కున్న సర్వంబు నీకిచ్చి నాను కోపకారణ మేమి కోమలి నీకు నీ విట్టు లున్నచో నే జూడ లేను ఏది కోరిక చెప్పు మింతిరో నీవు అని బల్క కైకమ్మ యడిగెద కాని ఇత్తురో యీయరో యేమి నమ్మకము యని విన్నవించగ నా భూమిపతియు నవ్వుచు తప్పక నా మాట మీద నమ్మక ముంచుము నాతిరో నీవు కోరవే వరములు కొంచక యిత్తు ఆడి తప్పని వార మని బల్కినంత అటు గాదు భూనాధ యడిగిన విత్తు అని ఆన బెట్టక అడుగరా దనగ రామునిపై యాన రమణి నీ కోర్కె చెల్లింతు నది యేమొ చెప్పు వేగిరమె అన విని కైకమ్మ యవనీశ నాడు తిమిరధ్వజునితోడ సమరమ్ము నీవు చేయు నప్పుడు నాదు సాయమ్ము మెచ్చి ఇచ్చిన వరములు పుచ్చుకొనుటకు బుధ్ధిపుట్టెను నేడు పొలుపుగా నాకు దయచేయు డవి చాలు ధర్మప్రతిజ్ఞ అన విని ధరణీశు డడుగుమా యనిన ఇత్తునంటివి దీనె కెందరో సాక్షి ఇలవేల్పు లందరు నిందుకు సాక్షి దేవత లెల్లరు దీనికి సాక్షి సూర్యచంద్రులు సాక్షి క్షోణియే సాక్షి ఈరాజు వరముల నిత్తు నన్నాడు ఈయక తప్పుచో నిక పైన నేను విషమును సేవించి విడుతు ప్రాణముల అన్నంత దశరధు డంత మాటేల అడుగుమా వరముల నతివ నీ వనగ రాజేంద్ర వినవయ్య రాముని బదులు పట్టంబు గట్టుము భరతున కుర్వి నవపంచవర్షముల్ కువలయనాధ పంపుము రాముని వనవాసమునకు ఈ రెండు వరముల నీయగా వలయు నీవు సత్యము నందు నిలువగా వలయు అశనిపాతము లివి యనగ కైకేయి మాటలు వినవచ్చి మతిపోయి రాజు బిట్టార్చి యిల వ్రాలి యట్టె మూర్ఛిల్లి కొంత తడవుకు లేచి కుమతి యిదియేమి ధర్మవిరుధ్ధంబు తలపోసి నావు రామునిపై నెంత ప్రేమ చూపెదవు నేడు వనముల కంప వేడు చున్నావు రాముడు లేక నా ప్రాణంబు లున్నె రాముని హింసింప నేమి కారణము రాముడు లేకున్న రాజ్యమే లేదు నీ కెవ్వ రీబుధ్ది నేర్పించినారు తల్లివి తనయుని దండింప రాదు కోపమ్ము విడువుము కోరు మన్యముల ధర్మమార్గంబును తప్పకు మన్న ఏమయ్య ధర్మంబు నెవరు తప్పారు నీ వల్ల జరిగెను నేడు మోసంబు కాదని యందువా మేదినీనాథ ఏమయ్య దశరథా యెంత చేసితివి ఇటువంటి పనిని నీవెట్లు చేసితివి మన బిడ్డకే పట్ట మనుచు చెప్పితివి మా నాన్న కానాడు మాట ఇచ్చితివి మాట ఇచ్చిన మాట మరచి పోయితివి చేసిన ప్రతిననే చెరిపి వేసితివి గంగలో నా యాశ కలిపి వేశితివి భరతుని బ్రతుకునే బుగ్గి చేసితివి ఇనవంశ కీర్తినే యిగుర జేసితివి ఇంతటి దుష్కార్య మేల చేసితివి భరతుని దూరంబు పంపివేసితివి రామున కీ నాడు రాజ్య మిచ్చితివి కౌసల్యతో నీవు కలసి పోయితివి కైకేయిపై నీవు కత్తి కట్టితివి పెద్దభార్యకు చాల ప్రేమ చూపితివి చిన్నభార్యను నీవు చిన్న బుచ్చితివి నా వద్ద నెంతగా నటన జూపితివి కూరిమి జూపించి గొంతు కోసితివి కౌసల్యకే నన్ను దాసి చేసితివి ఇటు జేయ భరతుని యెడము జేసితివి మంత్రిసామంతుల మాట లొప్పితివి కుమతులతో చేరి కుట్ర పన్నితివి మొదటి బిడ్డకు నీవు మొగ్గు చూపితివి ఎఱిగి భరతున కెంత యెగ్గు చేసితివి అరివీరభీకర యాడి తప్పితివి పరమధర్మజ్ఞుడ పాడి తప్పితివి న్యాయవిశారద మాయ చేసితివి నీ యింటి యశ మెల్ల మాయ జేసితివి పట్టాభిషేకంబు ప్రకటించు నపుడు భరతుని పిలిపించ వైతి వెందులకు రాముని కిచ్చుచో రాజ్యంబు నీవు భరతు డడ్డంబని భావించి నావు భరతుడు రాముని భక్తుడే యన్న విషయంబు నెఱిగియు వేగిర పడుట నీ కుయుక్తియె గాదె నిజమెన్ని చూడ నిక్కంబు రామున కెక్కుడు ప్రేమ నే జూపియుంటిని నిశ్చయంబుగను యెఱిగియు నీవు నా కెఱిగింప కుండ నిశ్చయించితి వయ్య నీ పెద్దకొడుకు గద్దె కెక్కెడు నట్టి ఘనముహూర్తంబు నన్ను నమ్మక చేసినావు ద్రోహంబు ఏ రామచంద్రుని గారాబముగను పెంచినా నిన్నాళ్ళు ప్రియమార నతడు నా వద్ద కేతెంచి యీ వార్త జెప్ప తలపోయనే లేదు కులదీపనుండు ఈ కుట్రలో వాడు నిమిడి యున్నాడు చెనటివై వానిని చెడగొట్టినావు నా బిడ్డ కైనను నాకైన రక్ష రాముడు పాలించు రాజ్యంబు నందు దొఱకునా చెప్పుమా దుర్మతీ నీవు నయవంచనము నా హృదయమును విరిచె ధర్మపన్నంబులు తడవుట మాని వేగమే రాముని పిలిపించి నీవు వనముల కఱుగగా వచియించ వయ్య భరతుని పిలిపించి పట్టంబు గట్టి వరములు చెల్లించ వలయు దశరథ అని కైక గద్దించె నాగ్రహంబునను వివశుడై భూమీశు డవనిపై గూలి మూర్ఛిల్లి యుండిన ముదిత కైకమ్మ ఆతని దీనత కాతుర పడియు బింకంబు గానుండె జంకు లేకుండ మానిని యాత్మలో మరి యిట్లు తలచె దివ్యర్షులార యో దేవత లార మీ రడగి నట్లుగా మేదినీపతిని వేధించి వరములు విలుచుకొన్నాను సింహాసనము వీడి చింతయే లేక కోదండరాముడై కోరి యీ పృధ్వి భారంబు తీర్చగా వచ్చిన యట్టి ఆదిపూరుషు డింక నడవుల కేగి అందరు దనుజుల నడగించి వచ్చు లోకంబు కొఱ కిట్లు కైక సేసినది లోక మెఱుగక యున్న లోకేశు డెఱుగు ఇక మీద జగమెల్ల నీసడించినను నా రాము డొక్కడు నన్ను మన్నించు |
17, సెప్టెంబర్ 2013, మంగళవారం
శ్రీరామచంద్రుడి తలనొప్పి
శ్రీరామచంద్రుడు పేరోలగమున సింహాసనస్థుడై చెన్నొంది యుండి పెద్ద తడవు దాక తద్దయు శ్రధ్ధ ఆయవ్యయంబుల నడిగి కన్గొనియె నగరముఖ్యుల వచనము లాలకించె మంత్రిసామంతుల మాటలు వినెను కార్తాంతికులు పలుకాడగా వినెను సంగీతసాహిత్యసద్గోష్టి జరిపె విప్రవినోదుల వీక్షించె పంపె మేటి నట్టువరాండ్ర యాటలు జూచె చాలించి సభ నిజ సదనంబు చేరె అనాడు రామయ్య కమితమైనట్టి అలసట కలిగెను తలనొప్పి వచ్చె ఎన్నడు నలసట నెఱుగడే రాజు ఎన్నడు తలనొప్పి నెఱుగడే రాజు వాడిన మొగముతో వచ్చిన రాజు వ్రాలెను పడకపై బాధ తాడించ అంతిపురంబు వా రది గాంచి వేగ ఉపచారములు చేయ నుద్యుక్తులైరి స్నానంబు చేసిన శాంతించు నన్న స్నానమాడెను బాధ శాంతించ లేదు పరిమళద్రవ్యముల్ పరచిరి గదిని తలనొప్పి వానితో తగ్గనే లేదు శొంఠిపట్టున నొప్పి స్రుక్కున టన్న నుదురంత బిగబట్టె నొప్పి హెచ్చినది వైద్యులు వచ్చిరి వారి మందునకు సామ్రాట్టు తలనొప్పి సమసి పోలేదు కౌసల్య ఇంతలో గబగబ వచ్చి దృష్టి దోషంబని దిష్టి దీసినది పుత్రుని తలనొప్పి పోకున్న దాయె ఇంత లోపల పురోహితు లరుదెంచి ఇంత విభూతి మంత్రించి యలదిరి ఎవరేమి చేసినా యినకులేశ్వరుని తలనొప్పి ఇసుమంత తగ్గనే లేదు శివపూజలోనున్న సీతమ్మ వారు పూజలు సాలించి సౌజన్యమూర్తి దైవగృహంబును తాను వెల్వడిన అంతలో చెలికత్తె లంద రేతెంచి అమ్మగారికి స్వామి యుమ్మలికము తెలియంగ బల్కిన తెఱవ వేవేగ పరువెత్తి కొనిపోయి పతి బాధ నెఱిగి ఇంతటి తలనొప్పి యెట్లు వచ్చినది రావని యెరిగియు రామభక్తులకు కష్టంబు లన్నవి కలలోన నైన వ్యగ్రులై యరయుచు వారి సేమంబు సకల లోకంబుల సంగతు లెల్ల చిన్నవి పెద్దవి చీకాకు లెల్ల అరమర లేకుండ నవధరించుచును కొఱతల నూహించి కొందలపడుచు సాకేతరాజ్యంపు సమృధ్ధి జూచి ఓర్వని వారల యుక్తు లెన్నుచును కవులు గాయకులును గతమెన్ను వారు మిమ్ము కీర్తించెడు మిషమీద మీకు అహితంబు లగు నాటి యాపద లెల్ల దడవుచుండిన విన దప్పక వినుచు అలయు చున్నా రయ్య జలజాక్ష మీరు కావున తలనొప్పి కలిగెగా స్వామి అని సీత యీ రీతి యంగలార్చుచును పతి శయ్యపై చేరి పావనమూర్తి ఫాలంబుపై చేయి పరచి ప్రేముడిని నిమురుచు తన్వి కన్నీళ్ళు నించినది సీతాకరస్పర్శ శీతాంశు కిరణ స్పర్శంబు కంటెను చల్లనై సోకి జలధరశ్యాముండు గలగల నవ్వె శ్రీరామచంద్రుడు సేద దీరగను తృటిలోన తలనొప్పి మటుమాయ మాయె |
12, సెప్టెంబర్ 2013, గురువారం
సీతారాముల ఉద్యానవన విహారం
శ్రీరామచంద్రుడు సీతమ్మ తోడ నందనోద్యానంబునకు సాటివచ్చు తన పెద్ద తోటలో తద్దయు వేడ్క విహరించు చుండగా విమలాంతరంగ విజ్ఞానవతి యిట్లు విన్నవించినది హరియులచ్చియు నన నమరియున్నాము అరుదైన దాంపత్య మమరించినట్టి పరమేశ్వరున కిదే వందనశతము వచ్చు జన్మంబుల వదలక నన్ను చేపట్టవే రామభూపాల కూర్మి అన విని రాముడో అవనిజ వినుము హరి నేనె శ్రీలక్ష్మి వన నీవె నిజము ఎఱుగవీ సంగతి తరుణి యటంచు గడ్డంబు పైకెత్తి ఘనముగా పలికె అటుమీద నిటుప్రొద్దు నటువ్రాలు దాక నడువ బుచ్చిరి కాలినడకను వారు అంతట సీతమ్మ కడుగులు నొవ్వ తిరుగుట సాలించి మరలి రిర్వురును తప్పేమి యని పతి తన భుజములకు సతి నెత్తుకొని వేడ్క సాగుచుండగను రాముడలసిన చూచి రమణి సీతమ్మ అక్కజ పడుచుతా గ్రక్కున నొక్క చెట్టుపండును చూసి చేజాచి కోసి శ్రీరామచంద్రుని చేతి కిచ్చినది వెరగంది సాధ్వితో విభు డిట్లు పలికె తరుణిరో నీ వెంత తప్పు చేసితివి వనదేవతకు చెప్ప వైతివే సీత పండు కోయుట కిది పధ్ధతి కాదు చెట్టు నడుగక నీవు చేయి వేసితివి పండు కోయుట కిది పధ్ధతి కాదు దేవుని తలపక త్రెంచితి విపుడు పండు కోయుట కిది పధ్ధతి కాదు వనదేవతకు చెప్ప వైతివే సీత వనభూమి వసియింప బాయు దోషంబు చెట్టు నడుగక నీవు చేయి వేసితివి భూరుహంబుల గొల్వ తీరు దోషంబు దేవుని తలపక త్రెంచితి విపుడు తాపసవృత్తితో తరుగు దోషంబు సందెవేళను పండు సాధించి నావు బతుకుసందె కడుపు పండించు నీకు కవలపండును కోసి కాన్క చేసితివి కవలబిడ్డలు నీకు కలుగుదు రోయి తొలుత నీ దోషంబు తొలగకుండగను ఫలమొసంగిన పుణ్య ఫలితంబు రాదు అనియిట్లు నిజవిభు డాన తీయగను వనితాశిరోమణి వడవడ వణకె శ్రీరామ మీయందు చిత్తంబు నిలిపి జీవించుదాన నీ చిన్న తప్పునకు విధియించి నారెంత విపరీత శిక్ష విధి నాకు తాపసి వేషంబు వేసి తరుమగా కానల తరువుల సేవ వనదేవతల సేవ మునిజన సేవ చేయుచు ఘనమైన చింతాభరమున కాలంబు గడపుట కనవచ్చె నాకు ప్రభుపాదసేవ దుష్ప్రాప్యమై బ్రతుకు యోగంబు పట్ట నా యుసురెట్లు నిలచు నాకేది దారి యని నాతి రోదించె అంత శ్రీరాముడా యతివను డించె ఉత్తరీయంబున నువిద కన్నీళ్ళు మెల్లగా తుడిచి యమ్మేదినీ సుతకు చిత్తంబు చల్లగా సెలవిచ్చె నిట్లు సత్యదూరంబుగా జనదు నే నొకట పరిహాసమున కేని పలికిన పలుకు క్షీరాబ్ధికన్యవో సీత నీ వనగ నారాయణుడ నేను నరరూపధరుడ రావణాదుల జంపి రక్షింప జగము దేవకార్యంబున దిగివచ్చి నాము పదివేలు నాపైన పది వందలైన వత్సరంబులు భూమి వర్తిల్లు నట్లు సంకల్పమును జేసి చనుదెంచి నాము కార్యంబు లన్నియు కడదేర వచ్చె వైకుంఠమున కేగు పధ్ధతి దలచి నడపించనగు మీది నాటక మెల్ల అనవిని తన దుఃఖ మంతంబు కాగ తన్ను దా దెలసిన తన్వంగి విభుని పాదపద్మము లంటి పలికె నీ రీతి పద్మసంభవు డేని భవు డేని నీదు లీలావిహారముల్ లీలగా నైన తెలియగా లేడయ్య దేవాధిదేవ అమడల ధరియించి యడవుల కేగి మునిపల్లె లందుండి మున్ముందు మీకు కులదీపనుల నిచ్చి యిల యెల్ల మెచ్చు విధమున నేను భూవివరంబు సొచ్చి తొల్లింట చేరెద దురితాపహారి రామనారాయణ రాజీవనయన అని ఇట్లు సీతామహాలక్ష్మి బలుకు నంతలో రవిబింబ మస్తాద్రి చేరె ఇనకులేశుడు సీతయును నవ్వు లొలుకు మోముల నిజపురమును చేరు కొనిరి |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)