శ్రీరామచంద్రుడు సీతమ్మ తోడ నందనోద్యానంబునకు సాటివచ్చు తన పెద్ద తోటలో తద్దయు వేడ్క విహరించు చుండగా విమలాంతరంగ విజ్ఞానవతి యిట్లు విన్నవించినది హరియులచ్చియు నన నమరియున్నాము అరుదైన దాంపత్య మమరించినట్టి పరమేశ్వరున కిదే వందనశతము వచ్చు జన్మంబుల వదలక నన్ను చేపట్టవే రామభూపాల కూర్మి అన విని రాముడో అవనిజ వినుము హరి నేనె శ్రీలక్ష్మి వన నీవె నిజము ఎఱుగవీ సంగతి తరుణి యటంచు గడ్డంబు పైకెత్తి ఘనముగా పలికె అటుమీద నిటుప్రొద్దు నటువ్రాలు దాక నడువ బుచ్చిరి కాలినడకను వారు అంతట సీతమ్మ కడుగులు నొవ్వ తిరుగుట సాలించి మరలి రిర్వురును తప్పేమి యని పతి తన భుజములకు సతి నెత్తుకొని వేడ్క సాగుచుండగను రాముడలసిన చూచి రమణి సీతమ్మ అక్కజ పడుచుతా గ్రక్కున నొక్క చెట్టుపండును చూసి చేజాచి కోసి శ్రీరామచంద్రుని చేతి కిచ్చినది వెరగంది సాధ్వితో విభు డిట్లు పలికె తరుణిరో నీ వెంత తప్పు చేసితివి వనదేవతకు చెప్ప వైతివే సీత పండు కోయుట కిది పధ్ధతి కాదు చెట్టు నడుగక నీవు చేయి వేసితివి పండు కోయుట కిది పధ్ధతి కాదు దేవుని తలపక త్రెంచితి విపుడు పండు కోయుట కిది పధ్ధతి కాదు వనదేవతకు చెప్ప వైతివే సీత వనభూమి వసియింప బాయు దోషంబు చెట్టు నడుగక నీవు చేయి వేసితివి భూరుహంబుల గొల్వ తీరు దోషంబు దేవుని తలపక త్రెంచితి విపుడు తాపసవృత్తితో తరుగు దోషంబు సందెవేళను పండు సాధించి నావు బతుకుసందె కడుపు పండించు నీకు కవలపండును కోసి కాన్క చేసితివి కవలబిడ్డలు నీకు కలుగుదు రోయి తొలుత నీ దోషంబు తొలగకుండగను ఫలమొసంగిన పుణ్య ఫలితంబు రాదు అనియిట్లు నిజవిభు డాన తీయగను వనితాశిరోమణి వడవడ వణకె శ్రీరామ మీయందు చిత్తంబు నిలిపి జీవించుదాన నీ చిన్న తప్పునకు విధియించి నారెంత విపరీత శిక్ష విధి నాకు తాపసి వేషంబు వేసి తరుమగా కానల తరువుల సేవ వనదేవతల సేవ మునిజన సేవ చేయుచు ఘనమైన చింతాభరమున కాలంబు గడపుట కనవచ్చె నాకు ప్రభుపాదసేవ దుష్ప్రాప్యమై బ్రతుకు యోగంబు పట్ట నా యుసురెట్లు నిలచు నాకేది దారి యని నాతి రోదించె అంత శ్రీరాముడా యతివను డించె ఉత్తరీయంబున నువిద కన్నీళ్ళు మెల్లగా తుడిచి యమ్మేదినీ సుతకు చిత్తంబు చల్లగా సెలవిచ్చె నిట్లు సత్యదూరంబుగా జనదు నే నొకట పరిహాసమున కేని పలికిన పలుకు క్షీరాబ్ధికన్యవో సీత నీ వనగ నారాయణుడ నేను నరరూపధరుడ రావణాదుల జంపి రక్షింప జగము దేవకార్యంబున దిగివచ్చి నాము పదివేలు నాపైన పది వందలైన వత్సరంబులు భూమి వర్తిల్లు నట్లు సంకల్పమును జేసి చనుదెంచి నాము కార్యంబు లన్నియు కడదేర వచ్చె వైకుంఠమున కేగు పధ్ధతి దలచి నడపించనగు మీది నాటక మెల్ల అనవిని తన దుఃఖ మంతంబు కాగ తన్ను దా దెలసిన తన్వంగి విభుని పాదపద్మము లంటి పలికె నీ రీతి పద్మసంభవు డేని భవు డేని నీదు లీలావిహారముల్ లీలగా నైన తెలియగా లేడయ్య దేవాధిదేవ అమడల ధరియించి యడవుల కేగి మునిపల్లె లందుండి మున్ముందు మీకు కులదీపనుల నిచ్చి యిల యెల్ల మెచ్చు విధమున నేను భూవివరంబు సొచ్చి తొల్లింట చేరెద దురితాపహారి రామనారాయణ రాజీవనయన అని ఇట్లు సీతామహాలక్ష్మి బలుకు నంతలో రవిబింబ మస్తాద్రి చేరె ఇనకులేశుడు సీతయును నవ్వు లొలుకు మోముల నిజపురమును చేరు కొనిరి |
12, సెప్టెంబర్ 2013, గురువారం
సీతారాముల ఉద్యానవన విహారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
జై శ్రీ సీతా రామ చంద్ర ప్రభువుకీ
రిప్లయితొలగించండిజై శ్రీ రాజా రామ చంద్ర ప్రభువుకీ