19, సెప్టెంబర్ 2013, గురువారం

మహాభారతయుధ్దం గురించి భండారు వారి వ్యాసంలో పొరపాటు అభిప్రాయాలు.

ఈ వ్యాసం భండారు శ్రీనివాస రావు - వార్తా వ్యాఖ్య బ్లాగు లోని గురువారం 19 సెప్టెంబర్ 2013 నాటి మహాభారత యుద్ధం కవుల కల్పనా? అన్న వ్యాసానికి సమాధానంగా వ్రాసినది.   నా వ్యాఖ్యానం పెద్దగా ఉండటం వలన ఆ మహాభారత యుద్ధం కవుల కల్పనా? వ్యాసం క్రింద వ్యాఖ్యాగా జతపరిచేందుకు అనువుగా లేక ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను.  దయచేసి ఈ విషయం గమనించ గలరు. 

భండారు వారి వ్యాసంలోని పంక్తులు ఇలా ఎర్ర రంగులో ఇటాలియన్ స్టైల్‌లో ఉటంకిస్తున్నాను.
భండారు వారి మాటలకు నా వ్యాఖ్యానాన్ని ఇలా నీలి రంగులో పొందు పరుస్తున్నాను.  ఇక విషయం లోనికి వద్దాం.
 
యుద్ధానికి సంబంధించి కానీ, దాని ఫలితానికి సంబంధించి కానీ ఏ ఒక్క ఖచ్చితమయిన  కబురు ఆయా దేశాలకు చేరలేదని స్పష్టమవుతుంది.

అలా అంత ఖచ్చితంగా నిర్ణయం చేయలేము.  వార్తాహరులు, చారులు మొదలైన వాళ్ళతో కూడిన ఉపవ్యవస్థలు వేరేగా ఉంటాయి.  వాళ్ళు యుధ్ధంలో పాల్గొనే వీరులు కాదు. అందుచేత ప్రతిదేశానికి ఆయా రాజ్యాలకు చెందిన ఆయా వ్యవస్థలు సమాచారం ఇస్తాయనే భావించటం సముచితం.


రాజు యుద్ధానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. అతడి వెంట వెళ్ళిన సైన్యం అతీగతీ లేకుండా అదృశ్యం అయిపొయింది. పన్నులు వసూలు చేసే వాళ్లు లేరు. అథవా చేసినా  ఆ మొత్తంలోనుంచి కప్పం సొమ్మును చక్రవర్తి ఖజానాకు  దఖలు పరిచే యంత్రాంగం లేదు...దాంతో  హఠాత్తుగా ఈ చిన్న రాజ్యాలకు వూహించని రీతిలో స్వేచ్చ లభిస్తుంది.

ఇదంతా కేవలం తప్పుడు ఊహాగానం.  ఎవరైనా రాజు యుధ్ధానికి వెళ్ళగానే రాజ్యం అరాచకం కాదు. యువరాజు అనే  deputy ఉంటాడు రాజ్యానికి. అదీ కాక, పరమ సందేహాస్పదమైన యుధ్ధాదులకి వెళ్ళే‌ రాజులు వారసుడికి రాజ్యం ఇచ్చి పూర్తిగా వ్యవస్థితం చేసి మరీ కాలు బయట పెడతారు. అదీ కాక సైన్యం మొత్తం దూరదేశానికి యుధ్ధానికి పోవటం రాజనీతి కాదు.  తగినంత మూలసైన్యం ఎప్పుడూ రాజ్యంలోనే ఉండి తీరుతుంది.  ఉదాహరణకు జరాసంధవధ చూడండి.  భీముడితో యుధ్ధం తరువాత తన ఉనికి సంశయం కాబట్టి, తన కొడుకు సహదేవుడికి రాజ్యం అప్పచెప్పి మరీ అతడితో యుధ్ధం చేశాడు జరాసంధుడు.


నాటి  అస్త్ర శస్త్రాల ప్రయోగ ఫలితంగా ఆవిర్భ వించిన మహానలం  తాలూకు  అగోచర శక్తి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషుల మనసులను  కలుషితం చేసివుండాలి. 

ఇది కూడా ఊహాగానమే! శస్త్రాలు అనేవి మంత్రసంబంధ ఉన్నవి కాదు - కత్తులూ, శూలాలు వగైరా వంటి ఆ శస్త్రాల వల్ల ఏ మహానలమూ ఉత్పన్నం కావటం అన్న ప్రశ్నే రాదు. పోతే అస్త్రాలు కేవలం మంత్రబలంఅధారంగా ప్రయుక్తం అయ్యే ఆయుధాలు - వాటిలో ఆయుధం కేవలం వాహిక మాత్రమే. రాముడు ఒక దర్భపుల్లకు బ్రహ్మాస్త్రం అనుసంధించి వదిలిన రామాయణఘట్టం ప్రసిధ్ధమే.  ఐతే అస్త్రం అనేది కేవల ఉద్దేశించిన ప్రత్యర్థిని మాత్రమే ఎదుర్కుంటుంది సాధారణంగా. చివరికి బ్రహ్మాస్త్రం ఐనా అంతే.  కాని నారాయణ, పాశుపతాది అస్త్రాలు ప్రత్యేకలక్షణాలు కలవి.  అశ్వత్థామ నారాయణాస్త్రం వేసినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏమిటంటే దానికి ఎదురుగా ఎవరు ఆయుధంతో కనిపించినా వదలక కేవలం నమస్కరించిన వారినీ, నిరాయుధుల్నీ అది మన్నిస్తుందని.  పాశుపతం లోకసంహారం చేసేందుకు సమర్థం - దానిని అర్జునుడు కేవల ఒక్కసారే కార్యర్థం ప్రయోగించాడు. సారాంశం ఏమిటంటే మహాభారతయుధ్ధంలో సామూహిక హననంకోఎవరూ దివ్యస్త్రాలు ప్రయోగించలేదు కాబట్టి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషులను శిక్షించటం అవి చేయటం ప్రసక్తి లేదు.

మహాభారత యుద్దానంతరం కొన్నిలక్షల  సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది. దీన్ని చీకటి కాలంగా భావించారని  అనుకోవడానికి  కొన్ని ఆధారాలు వున్నాయి... ప్రాచీన తమిళ సాహిత్యంలో సైతం ఈ చీకటి ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. ఆ భాషలో ఈ కాలాన్ని ‘కలపిరార్ కాలం’ అంటారు....దాదాపు యాభయ్ రెండు లక్షల ఏళ్లకు  పైగా ఈ చీకటి యుగం  సాగిందని చెబుతారు.   


ముద్రారాక్షసం కాదు. నిజంగా లక్షలనే వ్రాసారు.  చాలా ఆశ్చర్యకరమైన సంగతి.  ఈ మాట శుధ్ధతప్పు.


ప్రస్తుత కలియుగం  3102 BCE లో ప్రారంభం అయింది.  కలి ప్రారంభానికి 36 సంవత్సరాలకు ముందు మహాభారత యుధ్ధం జరిగింది ద్వాపరయుగాంతంలో.  అంటే మహాభారతయుధ్ధం జరిగి ఇప్పటికి 3102+2013+36 = 5151 సంవత్సరాల కాలం గడిచింది.  అంతే కాని మహాభారత యుధ్ధం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలు కాలేదు!

తమిళభాషపై మీకున్న అభిమానం దొడ్డదే కావచ్చు.  కాని, ఆ భాష మాత్రం కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం నుండి ఉన్నది కాదు సుమా! అత్యంత ప్రాచీన తమిళసాహిత్యం -300BCE కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.  అంతకు రెండువందల సంవత్సరాలకు పూర్వపు శిలాశాసనాలు ఉన్నాయని చెబుతున్నారు.  అంతే కాని తమిళం కొన్ని లక్షల సంవత్సరాల నుండీ ఉన్న భాష కాదు.   ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం నరులు ఉద్భవించి రెండు లక్షల ఏళ్ళు కావచ్చును. అంతే. 

ఆ రోజుల్లో సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొనే సైనికులను అనుదినం  ఉల్లాస పరచడానికి నాట్య, నటీనట బృందాలను,  విదూషకులను ఆయా  రాజులు తమ తమ దేశాలనుంచి  వెంటబెట్టుకు వెళ్ళేవాళ్ళు....  ఈ కళాకారుల ప్రాణాలకొచ్చే ముప్పేమీ వుండదు.కానీ యుద్ధానంతరం వీరి పరిస్తితి దయనీయం. తమను తీసుకొచ్చిన రాజులు, వారి సైన్యాలలో ఏ ఒక్కరూ మిగలక పోవడంతో దిక్కులేనివాళ్లు గా మిగిలిపోతారు. వీరికి తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియదు. ఆ నాటి యుద్ధనియమాల ప్రకారం ఇలాటివారందరూ గెలిచిన రాజుకు వశమవుతారు.

ఈ మాటలూ సరైనవి కావు.  రాజు చచ్చి, సైన్యమూ దాదాపుగా నశించినంత మత్రాన కళాకారులకు తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియని పరిస్థితి ఎందుకు వస్తుంది?  వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి ఎవరూ యుధ్ధప్రాంతానికి తరలించ లేదు కదా?  అదీ కాక, అప్పట్లో ప్రయాణం అంతా భూమార్గం గుండానే కదా? అందరితో పాటు వారు గుర్రాలు, బండ్ల మీద రోజుల తరబడి ప్రయాణం చేసి వచ్చిన వారే కదా? దారి తెలియక పోవటం చిక్కేమిటి తిరిగి పోవటానికి?  

ఆనాటి యుధ్ధనియమాల ప్రకారం హతశేషులైన ఆయుధదారులైన సైనికులూ, రాజపురుషులూ విజేతలకు వశం అవుతారు.  అంతే కాని వార్తాహరులు, కళాకారులు వంటి ఆయుధం చేత పట్టి యుధ్ధం చేయని వాళ్ళను ఏ విజేతా నిర్బంధించే ప్రసక్తి ఉండదు.

అస్త్రాలనేవి మునులను, దేవతలను మెప్పించి వీరులు  సంపాదించుకునేవి.  వాటిని పొందిన వారు యుద్ధంలో మరణించిన తరువాత  ఆ అస్త్రాలన్నీ తిరిగి స్వస్తానాలకు చేరుకుంటాయి.

అస్త్రాలు మంత్రాల రూపంలో ఉండే యుధ్ధసాధనాలు.  మరణించిన వీరుడు ఏ అస్త్రాన్నీ ప్రయోగించ లేడు.  అంతే కాని అస్త్రాలు స్వస్థానానికి పోవటం అనేది ఏమీ ఉండదు.   అనేక అస్త్రాలు ఒకరి కంటె ఎక్కువ మంది వీరులకు స్వాధీనంలో ఉంటాయి.  వారిలో, మరణించిన వారు కాక మిగిలిన వారు ఆయా అస్త్రాల్ని నిక్షేపంగా ప్రయోగించ గలరు.

అస్త్రాలకు కాక వాటికన్న తక్కువ తరగతి మారణాయుధాలు శక్తులు అని పిలువబడేవి ఉన్నాయి.  ఇవి అస్త్రాలకు తక్కువ, శస్త్రాలకు ఎక్కువ అన్నమాట.  శక్తి అంటే అప్పటికే మంత్రపూతమైన శస్త్రం.  సాధారణంగా, దేవతలు మంత్రించి ఇచ్చే ఆయుధాలు అన్న మాట.   అవి ఏ వీరుని కొరకు దేవతలు అనుగ్రహించారో వారికి మాత్రమే పని చేస్తాయి.   ఆ వీరుడు మరణిస్తే ఆ శక్తి కేవలం సామాన్యమైన శస్త్రమే అవుతుంది.  అలాగే శక్తి ఆయుధాలు అన్నీ ఒక్కసారి మాత్రమే పని చేస్తాయి. ఒక శక్తిని, అది పొందిని వీరుడు ఒకసారి ప్రయోగించాక, అది ఐతే శత్రువుని వధిస్తుంది లేదా అది భూపతనం పొంది దానిని ఆవేశించి ఉన్న మంత్రబలం మాయమై నిర్వీర్యం ఐపోతుంది.   రామాయణ యుధ్ధంలో రావణాదులు శక్తి ఆయుధాలు ప్రయోగించారు. భారత కథలో కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తిని ఇచ్చాడు.  ఏ శక్తి ఐనా ఒక్క సారి మాత్రమే వాడటానికి పనికి వస్తుంది.  అంతే కాని అస్త్రాలు స్వస్థానానికి చేరుకోవటం అన్న మాట అవగాహనా రాహిత్యంతో అన్నది.

సుమేరియన్ సంస్కృతిలో వెల్లడయిన మరో విశేషాన్ని మహా భారత యుద్ధం కవుల కల్పన కాదనడానికి  ఆధారంగా కొన్ని వెబ్  సైట్లు  పేర్కొంటున్నాయి.  వేదాలు వేద విజ్ఞానం గురించిన ఒక ఇంగ్లీష్ వెబ్  సైట్ లో ఇచ్చిన వివరాలు ఈ వ్యాసానికి ఆధారం.

సుమేరియన్ సంస్కృతికి భారతయుధ్ధంతో ఎలా ముడివేస్తారు? సుమేరియన్లు భారతదేశంలో వాళ్ళు కాదు కదా?
సుమేరియన్ స్కృతి మెసొపొటామియా  (ప్రస్తుత ఇరాక్) భూభాగానికి చెందినది.   సుమేరియన్ సంస్కృతి ప్రసక్తి అనవసరం.


అదీ కాక వెబ్  సైట్లు  ఇచ్చే సమాచారం ప్రామాణికం అనుకోవటం కష్టం కదా?  ఇలా వెబ్ సైట్లు ఇచ్చే సమాచారం ఆధారంగా రచనలు చేయటం వాటిని జనసామాన్యంలో ప్రచారంలోనికి తేవటానికి పత్రికలలో ప్రచురించటం దుస్సంప్రదాయం.  ఆలాంటి పనుల వలన తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాప్తికి వచ్చే ప్రమాదం చాలా హెచ్చుగా ఉంది.  దానికి మనం విశ్లేషిస్తున్న వ్యాసమే ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.


ముఖ్యంగా భండారు వారి వ్యాసం పేరు మహాభారత యుద్ధం కవుల కల్పనా? అని.  అన్నింటి కంటే ఈ విషయంలో ఎక్కువ ఆశ్చర్యం కలుగుతుంది.  అసలు వ్యాసంలో ఈ ప్రశ్నపై చర్చ జరగనే లేదు.  అది కల్పన కాదు లెండి.  ఆ విషయంలో చర్చించ వలసినది కూడా లేదు.

8 వ్యాఖ్యలు:

 1. ఈ సంవత్సరాల లెక్కలు కొంత అస్పష్టంగా ఉన్నాయనిపిస్తోంది నాకు. ఉదాహరణకు (1) రామాయణానికీ భారతానికీ మధ్యలో ఒక యుగం అంతరం ఉంది కదా. కాని చరిత్రకారులు రామాయణం క్రీ.పూ 5000 సంవత్సరం దరిదాపుల్లో జరిగిందని చెప్తున్నారు. ఆ లెక్కన పంచాంగం లో రాసినట్లు యుగం యొక్క పరిమాణం లక్షల సంవత్సరాలు కాదా? సీతారాములు పరిపాలించిన కాలం ఎన్ని సంవత్సరాలు? తులసీదాసు రామాయణం లో 10 వేల సంవత్సరాలు అని చదివినట్లు గుర్తు (సరిగా గుర్తులేదు నిజానికి). మరి వాల్మీకి రామాయణం లో ఏమని రాసి ఉందో తెలియదు.(2) కలి ప్రారంభానికి 36 ఏళ్ళ ముందు భారత యుద్ధం జరిగితే ఈ లెక్కన పాండవులు గెలిచిన రాజ్యాన్ని పాలించినది ఎంత కాలం?

  ఒకవేల యుగం పరిమాణం లక్షల సంవత్సరాలైతే భండారు గారి వాదనల్లో కొన్ని సాధ్యమైనవేమో?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రామాయణ భారత కాలాల అంతరం గురించి వీలు వెంబడి చర్చిస్తాను. రామాయణం క్రీ.పూ 5000 సంవత్సరం దరిదాపుల్లో జరిగిందని చెప్తున్నది మన లెక్కల ప్రకారం సరికాదు. కృత,త్రేత, ద్వాపర,కలియుగాలు నాలుగూ కలిపి ఒక మహాయుగం. మహాయుగం ప్రమాణం 43,20,000 సంవత్సరాలు రామాయణం 23వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిన కథ. మన ఇప్పుడు 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం.

   శ్రీరామచంద్రుడి పాలనా కాలం వాల్మీకం ప్రకారం "దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ" అంటే 10x1000 + 10x100 = 11,000 సంవత్సరాలు. సీతతోకూడి పదివేల సం॥లు, సీతాపరిత్యాగం తరువాత వేయి సంవత్సరాలూ రాముడు పాలించాడు.

   భారతయుధ్ధం జరిగాక ధర్మరాజుగారు 36 సంవత్సరాలు పాలించారు. ఆ తరువాత శ్రీకృష్ణనిర్యాణం జరిగింది. శ్రీకృష్ణుడు అవతారం వదలిన వెంటనే, అనాడే కలియుగం ప్రారంభం అయింది.

   భండారుగారి లెక్క శుధ్దతప్పు అని వివరించాను. నా టపాను మరొకసారి శ్రధ్ధగా చదవండి. ద్వాపదయుగం 8,64,000 సం॥లో ఇంక 36 సం॥ మిగిలి ఉన్న సమయంలో జరిగింది మహాభారత యుధ్ధం. ఆ తరువాత కలియుగం వచ్చింది.కలియుగం 4,32,000 సం॥ ఉంటుంది. మనం ఇంకా కలియుగం మొదట్లోనే ఉన్నాం. మనకు భారతయుధ్ధం గడచి ఎన్నేళ్ళయిందన్న లెక్కకోసం ఈ‌యుగాల పూర్తి పరిమాణంతో పనేమీ లేదు కదా. నిదానంగా ఆలోచించండి.

   తొలగించు
  2. "శ్రీరామచంద్రుడి పాలనా కాలం వాల్మీకం ప్రకారం "దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ" అంటే 10x1000 + 10x100 = 11,000 సంవత్సరాలు. సీతతోకూడి పదివేల సం॥లు, సీతాపరిత్యాగం తరువాత వేయి సంవత్సరాలూ రాముడు పాలించాడు."
   అసలు ఓక్ మనిషి ఎన్నేళ్ళు జీవిస్తాడు. ఇక్కడ పేర్కొన్న సంవత్సరాలూ ఇప్పుడు మనం పాటిస్తున్న సంవత్సరాలూ ఒక్కటేనా? - శరత్

   తొలగించు
 2. భగవంతుడు ప్రతీ మహాయుగం లోనూ దశావతారాలూ ధరిస్తాడనీ అది అనివార్యంగా సాగిపోతుందని కదా చెప్తుంటారు (నేను విన్నంతవరకు). అది నిజం కాదంటారా? ఎందుకంటే మీ వివరణ ప్రకారం, రామాయణ గాథకూ, మహాభారతానికీ మధ్య ఒక యుగానికి బదులు కొన్ని మహాయుగాల అంతరమే ఉంది. అదీ కాక వేంకటేశుడు వెలసింది (ఈ) కలి యుగం లోనే అయితే ఆ ఘట్టం దాదాపుగా ఎపుడు జరిగి ఉంటుందా అనే ఊహ మనసును తొలుస్తూ ఉంది. పూజా సంకల్పాల్లో కలియుగే ప్రథమ పాదే అని చదువుతూ ఉంటాం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినా మనం కలియుగం ప్రధమ పాదం లోనే ఉండాలి. అందుకే ఎవరైనా బయటగాని, ఇంటర్నెట్ లోగాని కల్కి అవతారం మొదలైందని అంటే నవ్వు వస్తుంది నాకు!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అధునికి విజ్ఞానశాస్త్రం ప్రకారం నరులు ఉద్భవించి రెండు లక్షల ఏళ్ళు కావచ్చును. అంతే.

  మహాయుగం ప్రమాణం 43,20,000 సంవత్సరాలు రామాయణం 23వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిన కథ. మన ఇప్పుడు 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం.

  శ్రీరామచంద్రుడి పాలనా కాలం వాల్మీకం ప్రకారం "దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ" అంటే 10x1000 + 10x100 = 11,000 సంవత్సరాలు. సీతతోకూడి పదివేల సం॥లు, సీతాపరిత్యాగం తరువాత వేయి సంవత్సరాలూ రాముడు పాలించాడు.

  రెండూ మీ వ్యాఖ్యలే.. కొద్దిగా కాంట్రాడిక్షన్గా లేదూ...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నా మాటల్లో కాదండీ విబేధం.
   అది ఆధునిక విజ్ఞానశాస్త్ర శోధనలకీ, పురాణేతిహాసాల్లో చెప్పిన కాలమానాలకీ ఉన్న విబేదం.

   తొలగించు
 4. 'శ్యామలీయం' బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఈ వ్యాసాన్ని యధాతధంగా నా బ్లాగులో పోస్ట్ చేస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.