10, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఏమో అనుకొంటి!

అక్కడ వాతావరణం చాలా ఉత్సాహభరితంగా ఉంది.
ఎందరో స్త్రీలు.
అందరూ స్త్రీలే.
అందరూ దాదాపు ముఫ్పై సంవత్సరాల ప్రాయంలోని యువతులు.
అందరి ముఖాల్లోనూ ఎంతో సంతోషం.

ఆ పెద్ద తోటలో ఎన్నెన్నో పూపొదరిండ్లు.
వివిధరకాలైన రంగురంగుల పూలగుత్తులతో పరమమనోహరమైన పూదోట అది.
అన్ని పొదరిండ్ల వద్దా అందమైన రంగవల్లులు.
అవి అన్నీ కూడా అత్యంత కళాత్మకంగా తీర్చి దిద్దబడి ఉన్నాయి.
ఆ రంగవల్లికల మధ్యన చక్కగా అలంకరించబడిన రత్నవేదికలు.
ప్రతి వేదిక మీదా స్త్రీజనం.

వారి సౌందర్యాలు వర్ణనాతీతం.
వారు ధరించిన వస్త్రాభరణాల సొగసులూ చెప్పనలవి కాకుండా ఉన్నాయి.

కొన్ని కొన్ని వేదికల మీద స్త్రీలు నృత్యం చేస్తున్నట్లుంది.
కొన్ని కొన్ని వేదికల మీద స్త్రీలు వాద్యగోష్ఠి నెఱపుతున్నట్లుంది.
కొన్ని కొన్ని వేదికల మీద స్త్రీలు పూల మాలలు గుచ్చుతున్నారు.
ఒక వేదిక మీద ఎవరో ఒక మనోజ్ఞమూర్తి.
ఆమె మధురాతిమధురంగా గానం చేస్తున్నది.
ఇంకా అనేక మంది స్త్రీలు హడావుడిగా తిరుగుతున్నారు.
వాళ్ళందరి ముఖాల్లోనూ ఎంతో ఉత్సాహం.

నేను ఎక్కడ ఉన్నదీ‌ నాకు సరిగా తెలియదు.
ఆ అందమైన పూదోట లోపలికి ఎందుకు వెళ్ళానో, ఎలా వెళ్ళానో తెలియదు.
ఎంత అందమైన తోట!
ఎంత తిరిగినా మరింత విశాలంగా కనిపిస్తూ‌ నన్ను ఆశ్చర్య పరచుతున్న పూతోట.
అలా ఆ తోటలో‌ తిరుగుతూ ఉండగా గాలిమోసుకు వచ్చిందా గానమాధుర్యాన్ని.
కాని ఎక్కడో కొంచెం దూరంగా ఉన్న చోటు నుండి వినవస్తున్నది.
కాబట్టి మాటలు వివరంగా తెలియటం లేదు.
ఎవరా అంత అందంగా పాడుతున్నారూ అనిపించింది.
అందుకే గానం వినవచ్చిన దిశగా అన్వేషిస్తూ నడక సాగించాను.
నేను అక్కడికి వెళ్ళే సరికి నా కళ్ళకు కనిపించిన అత్యంత అద్భుతమైన దృశ్యం అది.

అక్కడికి నేను వెళ్ళాక గానం చాలా స్పష్టంగా వినవచ్చింది.
గొతువిప్పి పాడుతున్న ఆమె పాడుతున్న పాటలో నాకు ఈ పాదం వినిపించింది.

ఏమో‌ యనుకొంటి శ్రీరాము డందగాడే!

ఈ పాదాన్నే ఆమె రకరకాలుగా గానం చేస్తున్నది నేను చూచేటప్పటికి. 

ఒక నిముషం పాటు ఆ గానామృతంలో మునిగి ఉన్నాను.
హఠాత్తుగా గానం ఆగింది.

నా ఆనందపారవశ్యాన్ని భంగపరుస్తూ ఒక కోమల స్వరం ఇలా ప్రశ్నించింది.

"ఎవరవయ్యా నువ్వు!
ఇదేమిటీ ఇలా వచ్చావు?
ఇక్కడికి ఎవరూ రాకూడదు!!"

అలా అడుగుతున్న స్త్రీ కంఠంలో ఎంతో ఆశ్చర్యం, చిరుకోపం‌ ధ్వనిస్తున్నాయి.

నాకేమి చెప్పాలో తోచలేదు.
జవాబు తెలిస్తే‌ కదా చెప్పటానికి!

ఆమె నా జవాబు కోసం నా ముఖం లోనికి గుచ్చి గుచ్చి చూచింది.

బిడియపడుతూ ఇలా అన్నాను

"పాట వినబడితే వచ్చాను"

అక్కడ ఇంకా ఎవరో ఉన్నారు, కాని నా దృక్కోణం నుంచి కనిపించటం లేదు.
నాకు ఒక మృదుమధురస్వరం ఏదో మరొకరితో మెల్లగా అంటున్నట్లు వినిపించింది
కొంచెం దూరంగా ఉన్నట్లున్నా రామె.  కాబట్టి సరిగా వినిపించలేదు.
ఇద్దరు స్త్రీలు నన్ను ప్రశ్నిస్తున్న స్త్రీ వద్దకు వచ్చి చెవిలో ఏదో చెప్పారు.
ఆమె తల ఊపింది.

అతిమృదువుగా నాతో అన్నదామె. "ఏ మాత్రం విన్నావు పాటని?"

నేను విన్నదెంత? ఒక్క వాక్యమే. అదే చెప్పాను.
"ఏమో‌ యనుకొంటి శ్రీరాము డందగాడే! అని పాడుతుండగా వచ్చాను." అన్నాను.
"మరేమీ వినలేదా అంతకు ముందు?"
కొంచెం ఆలోచించాను. ఒకటి రెండు మాటలు చూచాయగా వినవచ్చాయి. "కామారి నుతుడు" అని కాబోలు కొంచెం లీలగా వినిపించింది అన్నాను.
ఆమె చిన్నగా నవ్వింది. "అంతేనా?" అన్నది.
నేను తల ఊపాను.

ఆమె ప్రక్కన నిలుచున్న ఇద్దరు స్త్రీలూ కూడా నాకేసి చిరునవ్వుతో చూసారు.

నాతో సంభాషిస్తున్న ఆమె కొంచెం ఖచ్చితంగా ఇలా అంది. 
"ఇక్కడికి రాకూడదు. సరే, ఇంక వెళ్ళిపో"

నేను కొంచెం ఆసక్తిగా అడిగాను, "మరి ఈ‌ పాట?"

అమె నవ్వి, "విన్నది చాలు.  ఆ ఒక్క చివరి వాక్యమూ సరిగానే పూర్తిగా విన్నావు కదా, అది గుర్తు పెట్టుకో. ఫరవాలేదు, గుర్తు ఉంటుందిలే, మననం చేసుకో, ఉపయోగిస్తుంది నీకు. ఇక వెళ్ళు" అన్నది.

అసలు ఎక్కడిదీ ఈ‌ తోట?
ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చానూ?
వీళ్ళంతా ఎవరూ?
నోరు తెరిచి ఏమీ అడిగే అవకాశం రాలేదు.
మెలకువ వచ్చింది.

ఆమె సెలవిచ్చినట్లు "ఏమో‌ యనుకొంటి శ్రీరాము డందగాడే!" అన్న వాక్యాన్ని ఆ మనోహరమైన గానం రూపంలో పదిలంగా గుర్తుపెట్టుకున్నాను.  ఇప్పటికీ అది నా హృదయంలో మెదలుతూనే ఉంది.

తరువాత ఆ స్వప్నవృత్తాతం గురించి ఆలోచిస్తూ ఉండగా శ్రీరామకర్ణామృతం లోని ఈ‌ శ్లోకం గుర్తుకు వచ్చింది.

మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ
వేద్యాం వేద్యాం కిన్నరీ‌బృందగీతం
గీతే గీతే మంజులాలాపగోష్ఠీ
గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర

[ ప్రతి దారిలోనూ‌ చెట్లక్రింద చక్కని రత్నవేదికలు.  ఆ వేదికలమీద కూర్చుని కిన్నెరస్త్రీల బృందాలు గీతాలాపనలు చేస్తున్నాయి. అన్నీ ఎంతో వినసొంపైన పాటలు. ఓ‌ రామచంద్రప్రభూ, అన్ని పాటల్లోనూ నీ‌ కథామృతమే‌ నయ్యా వినబడుతున్నది.]


ఈ‌ స్వప్నానుభవం మొన్న ఆరవతారీఖు శుక్రవారం‌ నాటి రాత్రి కలిగింది.

6 కామెంట్‌లు:


  1. వేద్యాం వేద్యాం శ్యామలీయ రామో రామం !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. యద్భావం తత్కలప్రాప్త: :)) నాకు సంస్కృతం రాదు శ్యామలీయం గారు. అలా అనాలనిపించింది అనేశా!

    రిప్లయితొలగించండి
  3. శ్యామలీయం గారు ,

    కష్టే ఫలి శర్మ గారు సెలవిచ్చినట్లు మీ ఆధ్యాత్మిక అనుభవాలను , అనుభూతులను పదిమందిలో వెల్లడి చేయటం , ఓ రకంగా అల్లరి పడటమే . అంతే కాదు ఆధ్యాత్మికతలో పూర్తి పట్టా పుచ్చుకోకుండా , పదిమందికి తెలియచేయకూడదు . దానివల్ల పురోగతికంటే అధోగతి పాలయ్యే అవకాశం అధికంగా వుంటుంది .
    విగ్రహారాధన నమ్మని అమెరికా వాళ్ళే ఓ మాట చెప్పి నానుడిగా వెల్లడించాడు . చేతిలో నున్న కప్పు లిప్పుని తాకే నడుమ ఎంతో కనపడని గ్యాప్ వున్నది అని . అంటే మనకు కనపడకుండా ఎన్నో వుంటాయన్నది ఒప్పుకొని తీరాలసిందే .
    కనుక మనం చేస్తున్న ఏ పనినైనా పూర్తి అయ్యేదాకా బయటకు చెప్పకూడదు అన్నది మనకు పురోగమనానికి సోపానమే .

    మీలాంటి పెద్దలకు మళ్ళీ గుర్తు చేయవలసిన అవసరం లేదు .

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.