29, డిసెంబర్ 2020, మంగళవారం

దయచూపవయా దాశరథీ

దయచూపవయా దాశరథీ భవ
భయము బాపి నాబాధలు తీరిచి

అభయదాయక హరి సర్వాత్మక
ఉభయదాయక యుర్వీనాయక
విభవదాయక విమలగుణప్రద
సభల నాపలుకు సవ్యముచేసి

మానవనాయక మహితగుణోన్నత
దానవనాయకదర్పవిదారక
జానకినాయక జనహితదాయక
మానిపించి కలిమాయలనింక

రవికులవర్ధన రణవిహరణచ
దురితనివారణ కరుణాభరణ
భవభయవారణ భక్తజనావన
అవలీలగ నాయలసట బాపి


27, డిసెంబర్ 2020, ఆదివారం

నీ‌ మహిమ తెలిపే‌ పాట

నీ‌ మహిమ తెలిపే‌ పాట నిజముగ మంత్రమే
మా మీద దయగల రామచంద్ర

శ్రవణసుభగమైన రసమయమైన పాట
భవదీయగుణచరితాపావననామ
వివరంబుల నొప్పి వెలయుచుండగ నది
భవతాపహరమంత్ర మవుగాదే హరి

ఒకమారు నీనామ ముఛ్ఛరించిన చాలు
ప్రకటితమగును శుభపరంపర లనగ
మకరందబిందుకోటిమాధురి గల నామ
నికరముగల పాట నిరుపమము హరి

శక్తిగల మంత్రమై సరిసాటిలేనిదై
ముక్తిప్రదంబై ముచ్చటైన పాట
రక్తిమీఱ పాడుట రామచంద్ర నీ
భక్తులైనవారిల భాగ్యము కద హరి


అన్ని యూళ్ళు మావే

అన్ని యూళ్ళు మావే యందరు మావారే

అన్ని చోట్ల మాకు స్వగృహంబు లున్నవి


కల రన్నదమ్ములు కల రప్పచెల్లెండ్రు

కల రెందరో బందుగణ మన్ని యూర్లను

కలవు మాకు స్వగృహంబుల తోడ భూములును

కలవారు గాన మా తలిదండ్రు లనగ


ఏమేమొ పనులపై రామయ గారింటికి

భూమిజనాళి వచ్చిపోవుచుందు రెపుడు

ఏమూల మాతండ్రి రామయ్య గారి పేరు

శ్రీమంతమును గొప్ప చేయని వారున్నారు


చెలువుగ సీతారాముల సంతానమే

యిల నింతలింతలై యిన్నిన్ని యూళ్ళాయె

కలయ నందరికన్న ఘనులు మాపితరులు

తెలియుడీ భరతభూమి దివ్యరామభూమి



26, డిసెంబర్ 2020, శనివారం

మొక్కండి మొక్కండి

మొక్కండి మొక్కండి చక్కనయ్యకు

చక్కగా మొక్కండి చల్లనయ్యకు


పిల్లలో అని వచ్చి వేడుకొనే వాళ్ళు

అల్లు డెక్కడయ్యా అని అడిగే వాళ్ళు

తల్లికి వైద్యమని తపనపడే వాళ్ళు

ఇల్లూ వాకిళ్ళనూ ఇమ్మనే వాళ్ళూ


విద్యనూ బుధ్ధినీ వేడుకొనే వాళ్ళు

ఉద్యోగం వేటలో ఉసురుసురను వాళ్ళు

చోద్యంగా ధనమున్నా సుఖంలేని వాళ్ళు

గద్యపద్యాలతో గడబిడగా మెక్కండి


తమరు మోక్షార్ధులై తరలి వచ్చినారా

ఇమడలేక వీళ్ళ మధ్య ఇటుగా ఉన్నారా

తమరు కూడ రాముడికి తప్పక మొక్కండి

తమరు గొప్పవారైనా తప్పక మొక్కండి


కనుగొంటిరే వాడే ఘనుడైన రాముడు

కనుగొంటిరే వాడే ఘనుడైన రాముడు
మనరాముడు మనరాముడు మనదేవుడు

కరుణాళువు వాడే కౌసల్యా రాముడు తన
చిరునగవుల మునులనైన చిత్తుచేయువాడు
పొరి దశరథనయనకుముద పూర్ణచంద్రుడు
పరాక్రమము నందు హరివంటివాడై తోచు

అడవులలో నున్నాడీ అయోధ్యారాముడు సుఖ
పడవలసిన వయసులోన పడతి సీత తోడ
విడిసియున్నాడు ఘోరవిపినభూము లందు
మడమత్రిప్ప నట్టి సత్యమంగళ స్వరూపుడు

కొండపై నున్నాడీ కోదండరాముడు వాని
కండగా నిలచినాడు హరిగణేశుడు తన
కండయై నిలచిన హరి కతికృతజ్ఞు డతడు
దండు నిదే పిలిచినాడు దండయాత్ర వెడలగ

అడిగడిగో వాడే అనందరాముడు భళి
తొడగొట్టి లంకేశుని పడగొట్టినాడు
వడివడిగా నిజపురికి బయలుదేరినాడు
పడతి సీత సౌమిత్రి పరమాప్తగణముతో

23, డిసెంబర్ 2020, బుధవారం

ఆడరో‌పాడరో అప్సరో‌గణము (అన్నమయ్య కీర్తన, సవ్యాఖ్యానం)

ఆడరో పాడరో అప్సరోగణము
వీడెము లిందరో విభవము నేఁడు

కమలారమణుని కళ్యాణమునకు
తమి నదె గరుడధ్వజ మెసగె
తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు
గమనించరో దివిఁగల దేవతలు

వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షత లవే
చెలఁగి గైకొనరొ శ్రీవైష్ణవులు

బడి శ్రీవేంకటపతికి శ్రీసతికి
అడరిన తలఁబా లందె నిదె
నడఁచీ బరుషలు నానా ముఖముల
ముడుపులు చదువరొ ముయిగా నరులు  

 

అన్నమయ్య చెప్పిన పెండ్లిపాట ఇది. లక్ష్మీవిభుని పెండ్లికి అన్నమయ్య చెప్పిన పాట. ఈ కీర్తన శృంగారసంకీర్తనాల్లోనిది. కాని నిజానికి ఇది ఒక అధ్యాత్మికసంకీర్తనం ఇది 22వ సంపుటంలో 1216వ రేకు పైన ఉన్న సంకీర్తన. ఈ అన్నమాచార్యుల సంకీర్తనకు మంగళకౌసిక రాగం అని ఇచ్చారు. ఈరాగం‌ ప్రచారంలో లేదు. బాలకృష్ణప్రసాద్ గారు దీనిని రామక్రియా రాగంలో పాడారు.



ఈ పాట పల్లవిలో‌ అడరో‌పాడరో అప్సరోగణము అన్నారు. ఈ అప్సరసలను గురించి నాటకాలా సినీమాల పుణ్యమా అని సమాజంలో తక్కువస్థాయి అభిప్రాయం‌ కనిపిస్తుంది. అది పొరపాటు. దేవతలు దివ్యదేహులు. మనవంటి పాంచబౌతికమైన దేహాలూ అభిరుచులూ ఉన్నవారు కారు. అప్సరసలు అందరూ విశ్వచైతన్యానికి వివిధరకములైన ప్రతీకలు. 

పురూరవుడి కథ అని ఒకటుంది. ఆయన ఊర్వశిని కాంక్షిస్తాడు. సరే కొంత కథ నడుస్తుంది. ఆవిడ వెళ్ళిపోతే మరలా రమ్మని కోరుతాడు. అదొక కథ. ఆమె వస్తుంది.ఆ ఊర్వశీపురూరవులు ఒక కొండమీద విహరిస్తుండగా ఆమె అంటుంది "రాజా, ఇక్కడ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన నరసింహస్వామి వారు వెలసి ఉన్నారు. మరుగై ఉన్నారు. వెదుకుదాం పద" అని అలా చెప్పి ఆరాజు చేత నరసింసస్వామిని అన్వేషింప జేసి ఆఅ సింహాచలం అప్పన్నను నరలోకానికి అందిస్తుంది. పురూరవుణ్ణి తరింప జేస్తుంది. ఆయన భౌతికవ్యామోహాలను వదలలేక పోతుంటే ఆయనకు బ్రహ్మవిద్యను ఉపదేశిస్తుంది. ఇదిగో అప్సరసలు ఇలాంటి వారు.

ఇటువంటి అచ్చరో గణం అంతా దేవుడి పెళ్ళికి వచ్చారట. మీరంతా దేవుడి కోసం ఆడండి ఆయన కీర్తిని పాడండి అన్నమయ్య పురికొల్పుతున్నారు.

దేవుడి పెళ్ళికి అందరూ‌ పెద్దలే. ఎందరెందరో మహానుభావులు. నరలోకంలోని శ్రీవైష్ణవులు. స్వర్గం నుండి దేవతానీకం ఇతరలోకాలనుండి మహాత్ములు ఎందరెందరో కుతూహలంతో ఉత్సాహంగా వచ్చారు. అందరికీ ఈ వైభవం జరుగుతున్న సమయంలో తాంబూలాలనిచ్చి ఆహ్వానించండీ అని అన్నమయ్య చెప్తున్నారు. ఎవరికీ? అప్సరసలకే లెండి. వారంతా అక్కడ పేరంట్రాండ్రు. పెళ్ళిపెద్దలు.

ఇక్కడ అన్నమయ్య చెప్పిన పెండ్లి హడావుడి విశేషాలు చూదాం.

  • కమలారమణుని కళ్యాణమునకు తమి నదె గరుడధ్వజ మెసగె 
  • తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు 
  • వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో 
  • కలగొన నిచ్చేరు గంధాక్షతలు 
  • బడి శ్రీవేంకటపతికి శ్రీసతికి అడరిన తలబా లందె నిదె 
  • నడచీ పరుషలు నానా ముఖముల   అన్న

అన్నమయ్య ఏ దైవతాన్ని ఉద్దేశించి సంకీర్తనం చేసినా ఆ దైవతం తరుమలకు రావలసిందే, వేంకటేశముద్ర వేయించుకోవలసిందేను.

ఇక్కడ పెండ్లి ఎవరిదయ్యా అంటే  ఆ విషయం చివరి చరణంలో చెప్తున్నారు శ్రీవేంకటపతికి శ్రీసతికి పెండ్లి అని. మొదటి చరణంలో ఆయన్ను కమలారమణుడు అంటున్నారు.

ఆయన అప్పటికే కమల అంటే లక్ష్మీదేవికి భర్త అని చెప్పనే చెప్తున్నారు కదా మరలా చివరన శ్రీవేంకటపతికి శ్రీసతికి పెండ్లి అంటారేం, ఎన్నిసార్లు చేస్తారూ‌ పెండ్లి అని అడగకండి.

భగవంతుడి కళ్యాళం లోకకళ్యాణం. అందుకే గుళ్ళల్లో దేవుడి పెళ్ళి చేసినప్పుడు మాంగల్యాధారణం మంత్రంలో చిన్న మార్పుతో చెప్తారు గమనించండి. సాధారణంగా ఆమంత్రంలో వరుడి చేత మమజీవన హేతునా అని చెప్పిస్తారు. వరుడి జీవనానికి అప్పటి నుండి ఈ వస్తున్న భార్యయే అధారహేతువు అని అ వరుడే స్వయంగా చెప్పుకుంటున్నాడన్న మాట. కాని దేవుడి పెళ్ళిలో ఆ ముక్కని మార్చి లోకరక్షణ హేతునా అని చెప్పిస్తారు.

అంటే ఏమన్న మాట? 

దేవుడి పెళ్ళి లోకరక్షణార్ధం. అది లోకకళ్యాణహేతువు.

అందుచేత భక్తులు గుళ్ళల్లో యథాశక్తి లోకసంగ్రహార్ధం దైవకళ్యాణం జరిపించి పుణ్యం‌ మూటకట్టుకుంటారు.

గుళ్ళల్లో అనే ఏముంది, శక్తి ఉంటే సందర్భం కుదిరితే ఇళ్ళదగ్గరా దైవకళ్యాణమహోత్సవం జరిపించవచ్చు.

చేయించిన వారికి పుణ్యం.

దర్శించిన వారిదీ పుణ్యం.

ఇలా దైవకళ్యాణం భక్తిగా చేయటం అనేది వేదోక్తమే, ఆగమోక్తమే.

అటువంటి లోకకళ్యాణార్ధం జరుగుతున్న వేంకటేశ్వర స్వరూపుడైన శ్రీమహావిష్ణువునకూ పద్మావతీ అమ్మవారి రూపంలో ఉన్న శ్రీలక్ష్మీ అమ్మవారికీ జరుగుతున్న కళ్యాణం యొక్క వైభవాన్ని అన్నమయ్య కీర్తిస్తున్నాడు.

కమలారమణుని కళ్యాణము, లక్ష్మీవిభుని పెండ్లి అని మరలా  శ్రీవేంకటపతికి శ్రీసతికి అనీ‌ పదేపదే‌ చెప్పటంకేవలం భక్త్యావేశాన్ని సూచించటం.భక్తిసాహిత్యంలో అందుకే పునరుక్తి దోషం లేదు. కళ్ళకు కట్టినట్లు చెప్పటంలో ఆ సంతోషాన్ని వ్యక్తం చేయటానికి అదే సంగతిని వివిధాలుగా చెప్పటం అన్నది సహజం. అది బాగుంటుంది కూడా.

అ వేంకటేశ్వర ప్రభువు కళ్యాణంలో గరుడధ్వజం ఎత్తారు అని చెప్పారు. అ సందర్భంలో సర్వం‌ ప్రతిధ్వనించేలా దేవదుందుభులు మ్రోగాయట. ఈదేవదుందుభులు అనటంలో ఒక విశేషం ఉంది. మన వద్ద ఉన్న దుందుభులు ఐతే ఎవరో పని కట్టుకొని వాయించాలి. వాటంతట అవి ఎందుకు మ్రోగుతాయీ - మ్రోగవు కదా. అందుకే ఇవి దేవదుందుభులు అనటం. ఒక మహావిశేషం జరుగుతున్నప్పుడు ఆ దేవలోకపు దుందుభులు వాటంతట అవే బ్రహ్మాండమైన శబ్దాలతో మ్రోగుతాయి. అలా ఇప్పుడు మ్రోగుతున్నాయి. జరుగుతున్నది దేవుడి పెళ్ళి ఐతే మ్రోగవా మరి?

ఓ దేవతలారా, మీ‌లోకంలో ఉన్న దుందుభులు విశ్వం మారుమ్రోగేలా ఉరుముతున్నాయి వింటున్నారా గమనిస్తున్నారా దేవుడి పెళ్ళి వేదుకనూ అని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు.

పూర్వం జరాసంధుడి దుర్గం మీద రెండు అద్భుతమైన దుందుభులు ఉండేవి. ఎవరైనా శత్రుభావంలో కోటలోనికి వస్తున్నట్లైతే అవి రెండూ‌ వాటంతట అవే‌ భీకరంగా మ్రోగేవి. రెండు ఉండటంలో ఒక గడుసుతనం ఉంది. మీరు ఒకదాన్ని పగలకొట్టగానే ఎలాగో అలా ఆ రెండోది ఈలోగా అల్లరి చేస్తుంది. రెండూ ఒకసారి పదకవేస్తే తప్ప నగరంలోనికి హెచ్చరిక వెళ్ళకుండా అపలేం‌ కదా. అందుకని శత్రువులకు కోటలో దూరటం దుస్సాధ్యంగా ఉండేది. 

ఐతే‌ శ్రీకృష్ణపరమాత్మ దీనికి విరుగుడు చేసాడు. ఆయన సూచన మేరకు భీముడు ఆ రెండు దుందుభుల మీదకీ ఒక్కసారిగా దూకాడు. అవి రెండూ‌పచ్చడి అయ్యాయి ఒకేసారి. జరాసంధుడికి శత్రువుల రాక తెలియ లేదు.

మానవలోకం లోనే రెండు వాటంతట అవే‌ మ్రోగే దుందుభులు అంటూ ఉన్నాయి కదా, ఏదో విశేషంగా ఐనా, మరి దేవలోకంలో వాటంతట అవి మోగవా ఏమి?

అదిగో మ్రోగుతున్నాయి మీ దుందుభులు గమనించారా? దేవుడి పెళ్ళి అని అన్నమయ్య హెచ్చరించాడన్న మాట.

పెళ్ళిలో అంకురార్పణం అని చేస్తారు. లోకవ్యవహారంలో అంకురార్పణం అంటాం కాని అసలైన పేరు అంకురారోపణం. పెండ్లి కుమార్తె చేత పాలికలలో నవధాన్యాలను మొలకలుగా నాటిస్తారు. ఇలా అంకురములను (విత్తనాలను)  పాలికలలో ఆరోపించటం (నాటటం) కాబట్టి ఇది అంకురారోపణం. జనం నోటిలో ఈమాట క్రమంగా అంకురార్పణం అయింది. ఇదీ  బాగానే అర్ధవంతంగానే ఉంది. అంకురములను ప్రకృతికి (మొక్కలుగా ఎదిగెందుకు) అర్పించటం  కాబట్టి అంకురార్పణం అన్నది సబబైన మాటయే అవుతున్నది.

అంకురాలను మొలవేయటం ఎందుకూ అంటే‌ ప్రాణులకు ఆధారం అన్నం. దీనిని ఉపనిషత్తుల భాషలో రయి అని కూడా అంటారు. ఇప్పుడు ఇద్దరు, కాని మున్ముందు వీరు వంశాభివృధ్ధి చేస్తారు. అందరికీ అన్నం‌ కావాలి. అన్నానికి మూలమైన అంకురాలను ప్రకృతికి అర్పించి పూజించటం అన్నది ఇక్కడ ఆచారంలోని అంతరార్ధం.

అదిగో‌ అంకురార్పణ మహోత్సవం జరుగుతోంది. అందరికీ గంధపుష్పాక్షతలను ఇస్తున్నారు. విష్ణుభక్తులు అందరూ అందుకోండి అని అన్నమయ్య దైవకళ్యాణానికి ఇచ్చేసిన భక్తవైష్ణవులను ఆహ్వానిస్తున్నాడు.

పెళ్ళిలో తలంబ్రాల తంతు వచ్చింది. 

అసలు సిసలు తంతు ఐన జీలకర్రా బెల్లం కార్యక్రమానికీ, అతి ముఖ్యమైన తంతు ఐన మాంగళ్యధారణకీ కన్నా ఈ తలంబ్రాలకి విశేషమైన స్పందన ఉంటుంది. వధూవరుల నుండీ, ఆహూతుల నుండీ‌ కూడా. మిగతావి వైదికమైన కార్యక్రమాల్లో భాగం మాత్రమే ఐనా తలంబ్రాలు మాత్రం గొప్పవినోదం. అందరికీ కూడా.

ఈవినోదం దర్శించటానికి భక్తులు తహతహ లాడుతున్నారు. నడిచీ‌ పరుషలు నానా ముఖముల అంటే అన్ని దిక్కులనుండీ భక్తసమూహాలు కదలి వస్తున్నారని మనకి చెప్తున్నారు.

చూసారు కదా ఓ‌నరులారా, భక్తులారా, ఇంక ముడుపులు సమర్పించుకోండయ్యా అంటున్నారు అన్నమయ్య గారు. ఇక్కడ ఆచార్యుల వారి ముయిగా అన్నారు. ఈ‌పదం ఇప్పుడు వాడుకలో లేదు కాబట్టి అర్ధం స్పష్టత లేదు. వేరొక కీర్తనలో ముట్టినదెల్లా ముయి పట్టినదెల్లా బంగారు అంటారు. మరొక కీర్తనలో ముట్టితేనే ముయిముచ్చటలూ అంటారు. దీనిని బట్టి ముయిగా అంటే చక్కగా వంటి అర్ధం తీసుకోవాలి అనిపిస్తున్నది.


22, డిసెంబర్ 2020, మంగళవారం

రారా?

వ్రాయించుట నీ‌ముచ్చట
వ్రాయుట యీ యాత్మ కీవు బహుమానముగా
చేయించెడు గౌరవమని
నా యాత్మేశ్వర యెఱిగి వినమ్రుడ నగుదున్

వ్రాయుచుంటి నన్న భావనయే లేదు
మాటలన్ని నీదు మహిమ చేత
పరచుకొనుచు నుండ బహుకీర్తనంబులై
నే నుపకరణమును నిశ్చయముగ

ఏమి కొఱత కలుగు నెవరు చదువకున్న
చదువ వచ్చునట్టి సజ్జనులకు
కొఱత లేదు సూవె కోదండరామ నీ
కరుణవలన నేటి వరకు నాకు

రారా విబుధవరేణ్యులు
రారా హరిభక్తియుతులు రారా మిత్రుల్
రారా మోక్షాపేక్షులు
రారా శ్రీరామచంద్ర రమ్యచరిత్రుల్

రాకపోరు రాకపోరు
నీ కొఱకని రాకపోరు
నాకు వారి రాక చాలు
నీకు వారి రాక చాలు

21, డిసెంబర్ 2020, సోమవారం

శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో శివస్తుతి హరిగతిరగడ

హరిగతి రగడలో పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు. పాదం‌ మధ్యలో యతిమైత్రిస్థానం. అనగా నాలుగుగణాల పిదప ఐదవగణం‌ మొదటి అక్షరం మీద యతిమైత్రి చేయాలి. ప్రాస నియమం ఉంది. సంప్రదాయం ప్రకారం ప్రాసనియమం ఉన్నపద్యాల్లో ప్రాసయతి వేయకూడదు.

పాదాంతవిరామం తప్పనిసరిగా పాటించాలి.

హరిగతిరగడకు చతుర్మాత్రాగణాలు అని చెప్పాను కదా. చతుర్మాత్రా గణాలను లెక్క వేదాం. అన్నీ‌ లఘువులతో తొలి చతుర్మాత్రాగణం I I I I అవుతున్నది. ఒక గురువును వాడవచ్చును అనుకుంటే అప్పుడు ఏర్పడే చతుర్మాత్రాగణాలు [U I I,  I U I, I I U ] అని మూడు సిధ్ధిస్తున్నాయి. రెండు గురువులను వాడచ్చును అనుకుంటే చతుర్మాత్రాగణం U U అవుతున్నది. I U అన్న క్రమాన్ని ఎదురునడక అంటారు. దేశిఛందస్సుల్లో ఎదురునడకని సాధారణంగా అంటరానిదిగా చూస్తారు. I U I కూడా ఎదురునడకే కాబట్టి అది చతుర్మాత్రా గణంగా వాడరు అన్నది కూడా గమనించాలి. ఎదురునడక నిషిధ్ధం కాబట్టి I U I గణాన్ని మనం వాడకూడదు. ఐతే కొందరు పూర్వ కవులు ఈ‌  I U I గణాన్ని వాడారు.

రగడల్లో మొదట్లో ప్రాసనియమం కాని అంత్యప్రాసలను కూర్చటం‌ కాని లేదు. కాలక్రమేణ ఇది ఒక పద్దతిగా రూపుదిద్దుకుంది. అలాగే కొందరు పూర్వకవులు తమతమ రగడల్లో ఎదురునడకనూ వాడారు కాని చాలా అరుదు.

మరొక ముఖ్యవిషయం. తెలుగు ఛందస్సుల్లో గణాల దగ్గర పదం విరుగుతూ ఉంటే బాగుంటుంది. అలాగని ప్రతి గణమూ ఒక కొత్తమాటతో ప్రారంభం అయ్యేలా చూడటం దుస్సాధ్యం. కాని వీలైనంత వరకూ ఇది ఒక నియమంలా పాటించాలి. రగడలనే కాదు కందంతో‌ అన్ని రకాల దేశిఛందస్సుల్లోనూ ఇది శ్రధ్దగా పాటిస్తే పద్యాల్లో పఠనీయత పెరుగుతుంది. దేశి ఛందస్సుల ముఖ్యలక్షణమైన గానయోగ్యతను ఇనుమడింప జేస్తుంది.

రగడలకు ప్రాసనియమమూ, అంత్యప్రాసనియమమూ ఉన్నాయని చెప్పుకున్నాం‌ కదా. ఈ రెండు నియమాలూ వదిలి పెట్టి వ్రాయటం‌ అన్న పద్దతి కూడా ఒకటి తప్పకుండా ఉంది. అలా రగడలను వ్రాయటం‌ మంజరి అంటారు. హరిగతి మంజరీ రగడ అంటే హరిగతి రగడనే ప్రాసనూ‌ అంత్య ప్రాసనూ నియమంగా తీసుకోకుండా వ్రాయటం‌ అన్నమాట. మనం ద్విపదలనూ ప్రాసలేకుండా వ్రాస్తున్నప్పుడు వాటిని మంజరీద్విపదలు అంటున్నాం‌ కదా, అలాగే నన్న మాట.

హరిగతికి పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు అన్నారు. అంటే 8 x 4 = 32 మాత్రల ప్రమాణం వస్తున్నది ప్రతిపాదానికి. గణాల కలగలుపు కూడదు. ఏగణానికి ఆగణం విడిగా రావాలి. "రాజరాజునకు" అని వాడామనుకోండి అది ఎనిమిది మాత్రల ప్రమాణం వస్తున్నది కదా దానిని రెండు చతుర్మాత్రాగణాలుగా తీసుకోండి అంటే‌ కుదరదు.

రగడను ఎవరూ‌ కేవలం రెండు పాదాలకు సరిపెట్టరు. కవులు అలా తోరణంగా వ్రాసుకుంటూ పోతారు.

హరిగతి రగడకు దగ్గరి బంధువు మధురగతి రగడ. హరిగతికి పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు ఐతే, మధురగతి రగడకు పాదానికి నాలుగు చతుర్మాత్రాగణాలు. అంటే మధురగతి పాదాన్ని రెట్టిస్తే హరిగతి రగడ అన్నమాట.

హరిగతి రగడ అంతా చతుర్మాత్రలతో‌ నడుస్తున్నది కదా, అందుచేత ఈరగడకు చతురస్రగతి  నప్పుతుంది గానం చేయటానికి. తాళంగా ఏకతాళమూ త్రిపుట బాగుంటాయి.

ఇంక ధూర్జటి గారి శివస్తుతి రగడను చూదాం.









జయజయ కలశీసుత గిరికన్యా శైవలినీతట కల్పమహీరుహ
జయజయ దక్షిణరజతక్షితిధర సంయమిసేవిత పాదసరోరుహ

జయజయ పీన జ్ఞానప్రసవాచలకన్యా కుచ ధృఢపరిరంభణ
జయజయ కృతదుర్గాధరణీధర సామ్యవినోదవిహార విజృంభణ

జయజయ భారద్వాజాశ్రమ నవసరసిజకేళీవన పరితోషణ
జయజల నీలక్ష్మాధరణపుణ్యస్థల కాపాలిక భాషితభూషిత

జయజయ మోహనతీర్థాలోకన సంభ్రమరత భవబంధవిమోచన
జయజయ శిఖితీర్థాశ్రిత యోగీశ్వరమానస సంవిత్సుఖసూచన

జయజయ సహస్రలింగాలయ దర్శనమాత్ర స్థిరమోదాపాదక
జయజయ ఘనమార్కండేయమునీశ్వర తీర్థనిషిక్త విపఛ్ఛేదక

జయజయ నిర్జరనాయకతీర్థ స్నాతకజన కలుషేంధనపావక
జయజయ కరుణేక్షణ రక్షిత నిజచరణారుణ పంకేరుహసేవక

దేవా నిను వర్ణింప రమా వాగ్దేవీ వల్లభులైనను శక్తులె
నీ విధ మెఱుగక నిఖిలాగమముల నేర్పరులైనను జీవన్ముక్తులె

కొందఱు సోహమ్మని యద్వైతాకుంఠిత బుధ్ధిని నిను భావింతురు
కొందఱు దాసోహమ్మని భక్తిని గుణవంతునిగా నిను సేవింతురు

కొందఱు మంత్రరహస్యమవని నిను గోరి సదా జపనియతి నుతింతురు
కొందఱు హఠయోగార్థాకృతివని కుండలిచే మారుతము ధరింతురు

తుది నందరు తమ యిచ్చల నేయే త్రోవలబోయిన నీ చిద్రూపము
గదియక గతిలేకుండుట నిజముగ గని చాలింతురు మది సంతాపము

నిను సేవించిన కృతకృత్యుడు మఱి నేరడు తక్కిన నీచుల గొల్వగ
నిను శరణంబని నిలచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగ

నీవనియెడు నిధి గాంచిన ధన్యుడు నేరడు తక్కిన యర్థము గోరగ
నీవే గతియని యుండెడు పుణ్యుడు నేరడు తక్కిన వారల జేరగ

భవదుర్వాసన పాయదు నీపదపంకజముల హృదయము వాసింపక
చవులకు గలుగవు సకలేంద్రియములు సతతమ్మును నిన్ను నుపాసించక

జననమరణములు ధరలో నిన్నును సమ్మతితో సేవింపక పాయవు
మననమునకు నీ చిన్మయరూపము మరగింపక యణిమాదులు డాయవు

మీ‌మాహాత్మ్యము మే మింతింతని మితి చేయగ మతి నెంతటి వారము
మామీదను కృపగల్గి మహేశ్వర మన్నింపుము నీకు నమస్కారము





20, డిసెంబర్ 2020, ఆదివారం

రారు!

పద్యముల కట్టు వారును
పద్యములను కుట్టు వారును
ఆ కట్టుకుట్ల గొప్ప లెంచు వారును
ఉరక భళీయటంచు యరచు వారును
నావ్రాత లరయ రారు.

కవుల మనువారు
బిరుదులు గలుగు వారు
కవుల సభలందు పాల్గొనగలుగు వారు
కవిముఠాలను నడిపించ గలుగు వారు
విరసులై యుంద్రు
నావ్రాత లరయ రారు

ఎప్పుడో ఎవ్వరో యిటు
తప్పిజారి చదువవత్తురు కాని
బ్లాగ్జాల కవులు గివులు పండితులును రారు
కేవలమును దారితప్పిన కొందరు తప్ప రారు

19, డిసెంబర్ 2020, శనివారం

మనుచరిత్రలోని ద్విరదగతి రగడ

 రగడలు తెలుగువారి విలక్షణ ఛందస్సులు.

లోగడ వృషభగతి రగడను పరిచయం చేసాను కదా అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ అన్న టపాలో. ఇప్పుడు అల్లసాని వారి ద్విరదగతి రగడను చెప్పుకుందాం.

రగడలు మాత్రాఛందస్సులు. ఈ ద్విరదగతి లక్షణం ఏమిటంటే రెండేసి పాదాలు ఒక పద్యంగా ఉండే దీనిలో‌ ప్రతిపాదానికి నాలుగేసి పంచమాత్రాగణాలు వాడుతారు. ప్రాసనియమం తప్పనిసరి. పాదం సరిగా మధ్యలో విరిచి యతిమైత్రి పాటిస్తారు.  రగడలకు సాధారణంగా అంత్యప్రాసను పాటిస్తారు.  పాదాంతవిరామం తప్పనిసరిగా పాటించాలి.

ఇకపోతే‌ పంచమాత్రా గణాలు అంటే చెప్పాలి కదా.  సూర్యగణాలూ‌చంద్రగణాలూ ఇంద్రగణాలూ అంటూ సాధారణగణవర్గాలని మర్చిపోండి కాస్సేపు. ఇక్కడ రగడల్లో మాత్రల కొలతే ముఖ్యాతిముఖ్యం. పంచమాత్రా గణం అంటే లఘువు ఒక మాత్రగానూ గురువు రెండు మాత్రలు గానూ‌ లెక్కిస్తూ ఐదు మాత్రల కొలత వచ్చే అక్షరసంపుటి ప్రతిది మంచమాత్రాగణమేను.

కొందరికి ఒక శంక కలుగవచ్చును ద్విరదగతికి నాలుగు పంచమాత్రాగణాలు కలిసి ఒక పాదం అన్నారు కదా. అంటే పాదానికి  5 x 4 = 20 మాత్రలు అని చెప్తే సరిపోతుంది కదా మళ్ళా  5 + 5 + 5 + 5 మాత్రలు అన్నట్లు చెప్పటం ఎందుకూ అని. 

కారణం ఉంది.

ఐదేసి మాత్రల దగ్గర విడిపోవాలి అక్షరాలు.

"రారాజేమయ్యే" అంటే అది కూడా పది మాత్రల ప్రమాణం వచ్చిందా లేదా? "రారాజేమయ్యే రణాంగణంబు వదలి" అంటే చక్కగా ఇరవై మాత్రల ప్రమాణం వచ్చిందా లేదా?

కాని అలా వ్రాయకూడదు. ఇక్కడ ఐదేసి మాత్రల దగ్గర విడగొట్టటం‌ కుదరదు అక్షరాలను కాబట్టి. "రారాజే" అనగానే ఆరు మాత్రలు అయ్యాయి. ఐదవ ఆరవ మాత్రలు కలిసి ఒకే అక్షరంలో ఇరుక్కున్నాయి. అలా కుదరదన్నమాట.

ఎందుకైనా మంచిదని, మనం‌ ఈ‌పంచమాత్రా గణాలను లెక్కించి చూదాం. ఒక్క గురువూ లేకుండా ఒకే ఒక పంచమాత్రాగణం I I I I I అనేది. ఒక గురువును వాడదాం అనుకుంటే ఇంక మూడు లఘువులకే చోటు ఉంటుంది కాబట్టి అలా ఏర్పడే పంచామాత్రా గణాలు [ U I I I,  I U I I,  I I U I,  I I I U ] అనే నాలుగు. రెండు గురువులను వాడుదాం అనుకుంటే ఒక లఘువుకు మాత్రం చోటుంటుంది కాబట్టి అలా ఏర్పడే పంచమాత్రా గణాలు [I U U,  U I U,  U U I] అనే మూడు. మూడు గురువులతో‌ పంచమాత్రా గణాలు రానే రావు. 

ఐతే ఇలా లెక్కకు వచ్చిన పంచమాత్రా గణాల్లో సాధారణంగా I U I I కాని I U U కాని వాడరు. I U అన్న క్రమాన్ని ఎదురునడక అంటారు. దేశిఛందస్సుల్లో ఎదురునడకని సాధారణంగా అంటరానిదిగా చూస్తారు. I U I కూడా ఎదురునడకే కాబట్టి అది చతుర్మాత్రా గణంగా వాడరు అన్నది కూడా గమనించాలి.

ఒక ముఖ్య విషయం ఏమిటంటే రగడపద్యలక్షణంగా రెండుపాదాలే‌ కాని ఎవ్వరూ కేవలం రెండుపాదాల పద్యంగా ఒక రగడను వ్రాసి సరిపెట్టరు. కవులంతా ఒకే‌రగడ ఛందంలో అనేక పద్యాలను ఒక తోరణంలాగా వ్రాసుకుంటూ‌ పోతారు.  మీకు తెలిసే ఉంటుంది ఒక వృత్తాన్ని కూడా ఒక మాలిక లాగా ఎన్ని పాదాలైనా వ్రాయవచ్చునూ‌ అని. ఎవరిదాకానో‌ఎందుకూ పెద్దన గారే పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ అంటూ ఒక పెద్ద ఉత్పలమాలికను చెప్పారు కదా అని.

ఏమిటయ్యా తేడా ఇక్కడ అంటే ఇలా రగడను పొడుగ్గా వ్రాసుకుంటూ‌ పోయేటప్పుడు ద్విపదకు లాగా రెండేసి పాదాలకు ఒకసారి ప్రాసను మార్చుకోవచ్చును. అదీ‌ సంగతి.

ద్విరదగతి రగడ ఐదేసి మాత్రల చొప్పున పాదంలో నాలుగుసార్లు విరుపుతో ఉంటుంది కాబట్టి ఇది ఖండగతిలో పాడటానికి నప్పుతుంది. అసలు రగడలన్నీ పాడటానికి చాలా బాగుంటాయి. 

రగడల్లో మొదట్లో ప్రాసనియమం కాని అంత్యప్రాసలను కూర్చటం‌ కాని లేదు. కాలక్రమేణ ఇది ఒక పద్దతిగా రూపుదిద్దుకుంది. అలాగే కొందరు పూర్వకవులు తమతమ రగడల్లో ఎదురునడకనూ వాడారు కాని చాలా అరుదు.

మరొక ముఖ్యవిషయం. తెలుగు ఛందస్సుల్లో గణాల దగ్గర పదం విరుగుతూ ఉంటే బాగుంటుంది. అలాగని ప్రతి గణమూ ఒక కొత్తమాటతో ప్రారంభం అయ్యేలా చూడటం దుస్సాధ్యం. కాని వీలైనంత వరకూ ఇది ఒక నియమంలా పాటించాలి. రగడలనే కాదు కందంతో‌ అన్ని రకాల దేశిఛందస్సుల్లోనూ ఇది శ్రధ్దగా పాటిస్తే పద్యాల్లో పఠనీయత పెరుగుతుంది. దేశి ఛందస్సుల ముఖ్యలక్షణమైన గానయోగ్యతను ఇనుమడింప జేస్తుంది.

రగడలకు ప్రాసనియమమూ, అంత్యప్రాసనియమమూ ఉన్నాయని చెప్పుకున్నాం‌ కదా. ఈ రెండు నియమాలూ వదిలి పెట్టి వ్రాయటం‌ అన్న పద్దతి కూడా ఒకటి తప్పకుండా ఉంది. అలా రగడలను వ్రాయటం‌ మంజరి అంటారు. ద్విరదగతి మంజరీ రగడ అంటే ద్విరదగతి రగడనే ప్రాసనూ‌ అంత్య ప్రాసనూ నియమంగా తీసుకోకుండా వ్రాయటం‌ అన్నమాట. మనం ద్విపదలనూ ప్రాసలేకుండా వ్రాస్తున్నప్పుడు వాటిని మంజరీద్విపదలు అంటున్నాం‌ కదా, అలాగే నన్న మాట.

అలాగూ ద్విపదలను కూడా ఇక్కడ ప్రస్తావించాం‌ కాబట్టి ఒక పోలిక చెప్పుకోవాలి. ద్విపదను ద్విరదగతి రగడలో ఇమడ్చవచ్చును సులభంగా. నాలుగు పంచమాత్రాగణాలనూ మనం ద్విరదగతిలో ఉన్న అదనపు మాత్రాగణాలను వదలి పంచమాత్రా ఇంద్రగణాలతో వ్రాయాలి. చివరి పంచమాత్రాగణం మొదట సూర్యగణం కలిసి వచ్చేలా వ్రాయాలి. అంతే సరిపోతుంది. చిత్రం ఏమిటంటే యతిమైత్రి స్థానం కూడా ఏమీ‌ ఇబ్బంది పెట్టదు ఆ ఇమిడిన ద్విపదకూ మనం వ్రాస్తున్న ద్విరదగతికీ కూడా ఒకే చోట యతిమైత్రి స్థానం. బాగుంది కదా.

ఇక పెద్దన్న గారి ద్విరదగతి రగడను చూదాం.

నేర్పుమై నల్లయది  నెఱులఁ దొలుపూఁ దుఱిమె,
దర్పకున కర్పింపఁ దలఁప దెంతటి పెరిమె?

యింతి పావురపురొద యేల వినె? దారజము
వింతయే? విరహిణుల వెతఁ బెట్టు బేరజము;

సురపొన్న క్రొన్ననలు సొచ్చి నలుగడ వెదకు
తఱగ దందుల తావితండంబు క్రొవ్వెదకు;

నఱిమి ననుఁ జివురునకు నగునె కంటక మాడఁ?
జుఱుకు మనె వేఱొక్కచోటఁ గంటక మాడఁ?

గుందములు నీ కొసఁగఁ, గూర్చితిని గైశికము
నిందులకు వెల యడుగ నేల? విడు వైశికము!

చిఱుఁదేంట్ల కొసఁగె గుజ్జెనఁగూళ్ళు గొజ్జంగ,
యెఱుఁగ కది పూ వంద నేల? యిటు రజ్జంగ?

నెదిరింపఁ బోలు నీ వింతి! రతిపతిఁ దెగడఁ
బొదలఁ జిగురులు తుదలఁ బూచి యున్నది పొగడ;

పుడుకు మల్లన గందవొడికి నీ ప్రేంకణము
దడయ కిటు నీకిత్తుఁ దగ రత్నకంకణము;

నెరసి పోఁ జూచెదవు నిలునిలువుమా, కనము,
గురియు తేనెల జీబుకొన్న దంతట వనము;

కా దల్లయది ఫుల్లకంకేళి, పన్నిదము,
మోదు, గోడిన నీదు ముత్యాలజన్నిదము;

ఏటవా లైనయది యీ యరఁటిబాలెంత,
చేటునకె యగు, చూలుచేఁ గలుగు మే లెంత?

నెలఁత! యీ గేదంగి నీకబ్బె బుక్కాము,
చిలుకు నీ పుప్పొళ్ళు చెంచెతల బుక్కాము;

మితిలేని తేనె నామెత చేసె విరవాది,
యితరలతికల మరిగి యేఁగు నది పరవాది;

కలిగొట్లు ప్రాఁకువేడ్కలె నీకుఁ దఱచెదను,
నలినాక్షి! కడిమిగండమున కే వెఱచెదను;

గురువెంద నదె గిలుబుకొనియెఁ బయ్యెరదొంగ,
విరులఁ గరికుంభకుచ! వెరఁజు మై యరఁ గ్రుంగ;

మెరమెరని కొలనిదరి మీలంచు లకుముకులు
మరగె నీకనుదోయి, మాయింపు చకచకలు;

ఏకాంతమని తొలఁగె దెందు నీవటె వేఱు?
చేకొనవె మున్నాడి చెలువ! యీ వటివేరు;

అరిది యీ యేడాకులరఁటి నగుకప్పురము
సరిరాదు దాని కల శశియొడలు కప్పురము;

పాళ కల్లది పోఁకఁ బ్రాఁక బందము దెగియె.
నాళి యది దిగజాఱునట్టి చందము నగియె;

మలయపవనుని బిలిచె మావి బళి! యీ వేళ
మలయు కోవెల పంచమస్వరం బను నీల;

సులభమై దొరకె మంజులవాణి! చంపకము,
చిలువానెఁ బూఁబొదలు, చేరి యిఁక వంపకుము;

చనకుఁ డిఁక దవ్వులకు సఖులార! పువ్వులకు
ననుచు నలరులు గోసి రతివ లల్లన డాసి.

ఈ ద్విరదగతి రగడలో 22పద్యా లున్నాయి. గణాలదగ్గర పదం విరగని తావులు ఈమొత్తం రగడలో లెక్కిస్తే కేవలం 23 మాత్రమే ఉన్నాయి. ప్రతిపద్యంలోనూ ఎనిమిది పంచమాత్రాగణాలు చొప్పున మొత్తం‌ రగడలో 176 గణాలున్నాయి. కేవలం వాటిలో 23మాత్రమే పదం గణారంభం‌ మీదరా లేదంటే నియమభంగం ఐనది 13% గణాలకే. అంటే మీరే గమనించండి పదాలను ఎలా గణాలతో సమన్వయం చేయాలో దేశికవిత్వంలో అన్నది.

యతిమైత్రి స్థానం విషయానికి వస్తే అక్కడ ఎలాగూ‌ గణారంభం ఉంది. ఈ 22పద్యా లున్నాయి కదా వీటిలో‌ కేవలం 6 సందర్బాల్లో మాత్రమే యతిస్థానం పదం మధ్యలోనికి వచ్చింది. అంటే 44పాదాల్లో‌ యతిమైత్రి స్థానం పదారంభంగా లేనిది కేవలం 13.6% సందర్భాల్లోనే.

పాదాంతవిరామం విధిగా పాటించబడిందని గమనించవచ్చును.


18, డిసెంబర్ 2020, శుక్రవారం

ధనమేరా అన్నిటికీ‌ మూలం‌ - 2 (రెండు కథలు)



ఎందుకో కాని ఈ రెండు కథలనూ కొంచెం‌ క్లుప్తంగా ఐనా తప్పకుండా అందరికీ చెప్పాలీ అనిపించింది.

రెండూ అలనాటి కథలే.  అంటే దశబ్దాల క్రిందటి కథలే.

ఉత్తుత్తి కథలు కావు. నిజంగా జరిగిన కథలే. ఈ రెండూ కూడా ఒకే ఊరి కథలు.

మొదటి కథ శ్రీరామమూర్తి-భగవంతరావు గార్లనే అన్నదమ్ముల కథ.  శ్రీరామమూర్తి గారంటే ఒకప్పుడు తూ.గో.జి.లో ప్రసిధ్ధులైన డాక్టరు గారు. ఆయన ఆర్.ఎం.పీ. డాక్టరు గారు. ఐతేనేం ఇంగ్లీషు మందులూ‌ ఇచ్చే వారు. ఆయుర్వేదం‌ మందులూ ఇచ్చే వారు. ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం అన్న ట్లన్నమాట.

శ్రీరామమూర్తిగారికి కొత్తపేట మెయిన్ రోడ్ మీద ఒక క్లినిక్ ఉండేది. ఆ క్లినిక్ ముందు అంబారుఖానా శ్రీరామమూర్తి అని చాలా పెద్దపెద్ద అక్షరాలలో వ్రాసి ఉండేది.

ఎందుకో తెలియదు కాని ఆ బోర్డుమీద అయన తమ్ముడు భగవంత రావు గారి పేరు ఉండేది కాదు.

భగవంత రావు గారు అన్నగారితో పాటు ఆ హాస్పిటల్‌లో వైద్యం చేస్తూ మహా బిజీగా ఉండే వారు. ఆయన కూడా ఆర్.ఎం.పీ డాక్టరు గారే.

పేషంట్లను చూడాలి బయటకు వెళ్ళి అన్నప్పుడు భగవంత రావు గారు ఒక పెద్ద మోటర్ సైకిల్ మీద అన్నగారిని తీసుకొని వెళ్తూ ఉండే వాడు. తరచుగా తానొక్కడే వెళ్ళటం కూడా ఉండేది.

వారి ఆహార్యాలు తమాషాగా అనిపించేవి. ముఖ్యంగా శ్రీరామ మూర్తి గారి విధానం. ఆయన కొంచెం గోదుమ రంగు పంచె చొక్కా వేసేవారు. ఆచొక్కాని పంచలోనికి టక్ చేసే వారు. ఆపంచను తన బూట్లలోనికి దోపేవారు. అవి కూడా హంటర్ బూట్లు అంటామే‌ అలాంటివి. భగవంతరావు గారు ఎప్పుడు మల్లెపూల వంటి తెల్లటి పేంట్ షర్టు వేసుకొనే వారు. ఇతరత్రా అహార్యంలో వీరిద్దరినీ ఎప్పుడూ చూడలేదు.

ఇద్దరూ వైద్యం‌ చేస్తున్నా అందరూ శ్రీరామమ్మూర్తి గారి ఆస్పత్రి అనే అనే వారు.

ఆ ఆస్పత్రి నిజంగా ఒక ధర్మాసుపత్రి అనే చెప్పాలి. ఇచ్చే వారు వారి తాహతుని బట్టి ఇచ్చే వారు. ఇవ్వలేని బీదాబిక్కీ ఇవ్వరు. ఎవ్వరూ‌ ఇంత అని అడగటం కూడా ఉండేది కాదు. ఐనా ధనవర్షం‌ బాగానే కురిసేది.

కురవదా మరి? ఊళ్ళో శ్రీరామ్మూర్తి గారిదే వైద్యం ముఖ్యంగా. 

ఒక్క కాశిన చిన్నంరాజు గారని ఒక ఎంబీబీయస్ డాక్టరు కూడా ఉండే వారు కాని వారు ఖరీదైన డాక్టరనే‌ ప్రతీతి. అందుచేత ఎక్కువ మంది వెళ్ళేది శ్రీరామమూర్తి గారి దగ్గరకే. 

అదీ‌కాక ఈ‌ చిన్నంరాజు గారికి ఒక తమాషా పేరుండేది - ఎంత చిన్న సమస్య కైనా పేజీకి తక్కువ మందులు వ్రాయరని. అది నిజమే  కూడాను. మా పక్కవాటా వక్కలంక నరసింహ మూర్తి గారి సతీమణికి ఒకసారి చాలా ఉధ్ధృతంగా శిరోవేదన వచ్చింది. ఇక తప్పదని డాక్టరు గారిని పిలిచారు. చిన్నంరాజు గార్ని అన్నమాట. ఆయన వచ్చి పరీక్షించి అక్షరాలా పేజీ నింపేశారు మందులతో. అవన్నీ ఇక్కడ దొరుకుతాయా మన కొత్తపేటలో అంటే  ప్రయత్నించండి అన్నారు. దొరకనివి చాలానే ఉండినవి - వాటిని మర్నాడు రాజమండ్రికి వెళ్ళి కొనాల్సిందే అనుకున్నారు. ఆరాత్రికి ఆవిడకు ఏమన్నా మందులు ఇచ్చారా అన్నది తెలియదు. ఏదైతేనేం తెల్లవారేసరికి తలనొప్పి గిలనొప్పి జాడలేదు. రాజమండ్రి పోలేదు. మందులూ తేలేదు. అందరూ చాలా కాలం నవ్వుకొనే వారం ఆ డాక్టరు గారి మందుల పట్టీ చూసి.

ఎందుకు అందరూ శ్రీరామ్మూర్తి గారి దగ్గరకు వెళ్ళి ఒకటి రెండు రూపాయల వైద్యంతో హాయిగా ఉండే వారో అర్ధం ఐనది కదా. అదీ సంగతి.

ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఈ‌ భగవంతరావు గారు మానాన్నగారికి చిన్ననాటి స్నేహితుడే - బెంచిమేట్ అనుకుంటాను. అందుచేత సహజంగా మా యింటి వైద్యం అంతా శ్రీరామమూర్తి గారు మరియు భగవంత రావు గార్ల చేతిలో నడిచేది.

ఈ శ్రీరామమూర్తి గారు కొత్తపేట ఊరి చివరన, పలివెల వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ మీద భవంతి కట్టుకున్నారు. గృహప్రవేశం కోలాహలంగా జరిగిందని విన్నాను కాని వివరాలు గుర్తులేవు. కాని ఆ తరువాత కాలంలో ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. మాకు కూడా ఒక ప్రత్యేకమైన అహ్వానం అందింది. హాస్పిటల్‌కు వచ్చిన వారికి ఆహ్వానం ఇచ్చినట్లుగా ఇవ్వటం కాదు, ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిచారని గుర్తు.

ఆరోజున సత్యనారాయణ వ్రతం మధ్యలో చదివింపులు మొదలయ్యాయి. డాక్టరు గారికి అన్నమాట. అవేమి చదివింపులో గంటో గంటన్నరో ఐనా తెమలటం‌ లేదు. ఆతరువాత మానాన్నగారు చెప్తే అర్ధమైంది. డాక్టరు గారు వైద్యం చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఊరి వారు యథాశక్తిగా కానుకలు సమర్పించుకోవటం అది అని. ముఖ్యంగా ఈచదివింపుల్లో ముప్పాతిక మువ్వీసం ధనరూపంలోనే. అలా వచ్చింది ఎన్నో వేలుంటుంది ఆ అరవైల్లోనే అంటే అతిశయోక్తి ఏమీ‌ లేదు.

ఈ వ్రతం జరిగే నాటికి నేను హైస్కూలు విద్యార్ధిని. దరిమిలా కొన్ని సంవత్సరాల తరువాత నేను హైదరాబాదుకు ఉద్యోగనిమిత్తం వచ్చాను. కొంతకాలం తరువాత శ్రీరామ మూర్తి గారు కాల గతి చెందారు.

ఆపుడు తెలిసింది ధనం అంటే ఏమిటో‌ దాని ప్రభావం ఏమిటో అన్నది.

శ్రీరామమూర్తి గారూ భగవంతరావు గారూ ఇద్దరూ రామలక్ష్మణులే అన్నట్లుండే వారు. రాముడెక్కడన్నా లక్ష్మణుడిని ముంచుతాడా నిలువునా?

ఈ కలియుగ రామ మూర్తి గారు ముంచారనే జనం విస్తుపోయారు.

ఆస్తిపాస్తులన్నీ రామమూర్తి గారివే. చివరకు భగవంత రావు గారి దర్జా స్కూటరూ శ్రీరామ మూర్తి గారి పేరనే ఉంది. ఈ లక్షణుడికి కనీసం ఉండటానికి స్వంత ఇల్లు ఐనా లేదు. పూచిక పుల్లంతైనా ఆస్తి పాస్తులన్నవి లేవు.

యావజ్జీవం ఏ‌హాస్పిటల్ కోసం ఊడిగం చేసాడో అందులో కాలు పెట్టరాదన్నారు.

కట్టుబట్టలతో మిగిలాడు ఈ అభినవ లక్ష్మణుడు. 

తానూ‌ డాక్టరే, వేరే చిన్న ఆస్పత్రి పెట్టుకున్నాడు. 

మిగిలిన కథ ఏముంది. ఉనికి కోసం కష్టపడ్డారు భగవంత రావు గారు. పిల్లలు అంది వచ్చారు లెండి దైవకృప వలన.

అన్ని పరిణామాలూ ఈకథలో నాకు అంత వివరంగా తెలియవు.


* * *


ఇప్పుడు రెండవ కథ. చెప్తాను. ముళ్ళపూడి వారు వారి ఇంటి పేరు. ఈ ఇంటిపేరు కల వారు అనేక వర్ణాల్లో ఉన్నట్లున్నారు. వీరు బ్రాహ్మణులు. శాఖా గీకా గురించి నాకు తెలియదు. అదేమీ ముఖ్యం కాదు. 

ఇంట్లో ఉండేది కొంచెం మందే. గృహస్థు, ఆయన భార్య, బావమరది, కుమారుడు మాత్రమే. ఇందులో నాకు తెలిసిన వ్యక్తి ఆ కుమారుడు ఒక్కడే. వాడి పేరు సత్యనారాయణ. మాస్కూల్‌మేట్. నాకన్నా ఒక క్లాసు దిగువన చదివే వాడు. కాని నాతో‌  మంచి దోస్తీ‌ ఉండేది. 

ఒక చేదు జ్ఞాపకం. ఎందుకో కాని వాడూ‌ నేనూ ఒకనాడు స్కూలు గ్రౌండ్‌ లోనే‌ బాగా తన్నుకున్నాం. ఎందుకో గుర్తులేదు. ఎవరిది తప్పూ అన్నది ఎవరికి గుర్తు. కొట్టుకున్నాం ఏదో చిన్న చిలిపి కారణానికే. కాని అది మా స్నేహానికి కించిత్తు కూడా దెబ్బ కొట్టలేదు. 

సత్యనారాయణ తండ్రి గారు ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉండే వారు. సంప్రదాయిక వైద్యుడు. ఆయన మీద గురి ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉండే వారేమో - వారి జరుగు బాటు బాగానే ఉండేది. వారి ఉనికి వారి స్వంత ఇంటిలోనే. చిన్నదే అయినా పక్కా పెంకుటిల్లు. ఆయింటికి నేను బోలెడు సార్లు వెళ్ళాను. వాడు కూడా మాయింటికి లెక్కలేనన్ని సార్లు వచ్చాడు. 

సత్యనారాయణ తండ్రిగారు అయన బావమరది కూడా ఆయుర్వేద వైద్యులే. ఈ బావమరది గారు స్వయాన వైద్యుడు కాకపోవచ్చును అని నా ఉద్దేశం. వైద్యం ఆపెద్దాయన చేస్తూ ఉంటే మందులు చేయటంలోనూ పేషంట్లను చూసుకోవటం లోనూ బావమరది సహాయకుడిగా ఉండే వారు. ఆయన చెప్తుంటే ఈ‌బావమరది మందులు కలపటమూ‌ నూరటమూ వంటివి చేస్తూ ఉండటం నేను స్వయంగా చాలా సార్లే చూసాను.

కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా. ఉన్నట్లుండి ముళ్ళపూడి వారు జబ్బుపడ్దారు. ఊరిలో ఉన్న వైద్యులు కొన్నాళ్ళు వైద్యం చేసి చేతులెత్తే సారు. కాకినాడ పెద్దాస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించండి అని సలహా ఇచ్చారు.

ఊళ్ళో‌ వైద్యం అంటే అది వేరే సంగతి. ఎంతైనా సాటి వైద్యులన్న గౌరవంతో ఎవరూ రొక్కించి అడగక పోవటంతో ఆట్టే ఖర్చు లేకుండానే ఇంత కాలమూ నడిచింది. కాకినాడ పట్నమే. ఎరగని ఊరే మరి. అక్కడెలా?

సకుటుంబంగా కాకినాడ వెళ్ళారు. వైద్యం నడుస్తోంది. దనం ధారాళంగా కర్చు అవుతున్నది.

మరీ అంత ఉన్నకుటుంబం కాదాయిరి. ఊళ్ళో నుండి కొంత సహయం అందిందేమో కొన్నాళ్ళు ఎలాగో అలా ఖరీదైన వైద్యానికి తట్టుకొని నిలిచారు.

జబ్బు తగ్గటం లేదు.

చివరికి తమ స్వంత ఇల్లు తెగనమ్మి వైద్యం చేయించాలని నిశ్చయించారు.

నిశ్చయించటం అంటే ఎవరిది నిర్ణయం?

సత్యనారాయణ తల్లికి ఉన్న దిక్కూ సలహా దారు తన తమ్ముడే. సత్యనారాయణ అంటే ఇంకా చిన్నపిల్లాడే‌ కదా.

వినండి. తప్పని సరై ఇల్లు అమ్మేసారని ఊరంతా గుప్పుమంది.

అందరూ చాలా బాధపడ్దారు. ఆకుటుంబం మంచి అందరికీ తెలుసును ఊళ్ళో. మా అమ్మగారూ‌ నాన్నగారూ కూడా బాధపడటం‌ నాకు బాగానే గుర్తుంది. తెల్లవారిలేస్తే ఈ సత్యనారాయణ అనే చిన్నపిల్లవాడు కళ్ళముందు తిరుగుతూ ఉండే వాడు కదా. అస్తమానం మాయింటికి వస్తూనే ఉండే వాడు కదా. వాడి కుటుంబానికి వచ్చిన కష్టం కదిలించకుండా ఉంటుందా చెప్పండి.

పెద్దాయన వైద్యం కోసం అని చెప్పి,  అక్కాతమ్ముళ్ళు వచ్చి ఇంటిని ముఫ్ఫైవేలకు అమ్మి సొమ్ముతో‌ అదరాబాదరా వెళ్ళిపోయారు కాకినాడకు.

మరి కొద్ది రోజుల్లోనే దుర్వార్త వినవలసి వచ్చింది.

దానితోపాటే అందర్నీ కలచివేసింది మరొక ముఖ్యమైన సంగతి.

సొమ్ముని మగదిక్కు తమ్ముడు గారు జాగ్రత్తగా పట్టుకొని అక్కగారితో‌ కాకినాడ వెళ్ళాడు. ఆవిడ భర్తను చూడటానికి అదరాబాదరా పరుగెత్తింది. 

కొద్ది సేపటికి డబ్బు సర్దుబాటు చేసుకొని వచ్చారా అని ఆస్పత్రి వారు అడిగారు. అవునండి, ఇదిగో మా తమ్ముడి దగ్గరుందీ.. అంటూ ఆవిడ తమ్ముడి కోసం చూసింది.

ఇంకా ఎక్కడి తమ్ముడు?

ఇంకా ఎక్కడి డబ్బు?

ఆ తమ్మయ్య గారి జాడ ఎవ్వరికీ ఎన్నటికీ దొరకలేదు.

ఇటు పెద్దాయనా దక్కలేదు.

అక్షరాలా అన్నీ పోగొట్టుకొని కట్టుబట్టలతో వెనక్కు వచ్చారు స్వగ్రామానికి! ఇంకా ఏం‌ స్వగ్రామం, ఇక్కడ నిలువ నీడ లేదు.

ఊరందరికీ మతిపోయినంత పని అయింది.

సత్యనారాయణ ఇలా జరిగింది అని కన్నీళ్ళతో చెప్తుంటే వింటున్న మాకు మతిపోయినంత పని అయింది.

సత్యనారాయణా వాళ్ళమ్మ గారూ‌ మరి ఎలా నిలద్రొక్కుకున్నారో నాకు సరిగా తెలియదు. వారు ఆ తరువాత పొన్నాడ రత్తమ్మ గారి ఇంట్లో అద్దెకు ఉండే వారు. ఇప్పుడు ఆ సత్యనారాయణ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో!

 

****

 

ఈ రెండు కథలను గమనించారుగా, డబ్బు ఎలాంటి ఎలాంటి తమాషాలకు కారణం అవుతుందో. అందుకే‌ అన్నారు "మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః" అని. డబ్బు ముందు అన్నీ‌ దిగదుడుపే అవుతున్నాయి దురదృష్టవశాత్తు. మానవసంబంధాలను ఈడబ్బు ఈడ్చి అవతల పారేస్తున్నది.


16, డిసెంబర్ 2020, బుధవారం

ధనమేరా అన్నిటికీ‌ మూలం.

ధనమేరా అన్నిటికీ‌ మూలం‌ అనగానే కొంతమందికి ఒక మంచి సినిమాపాట గుర్తుకు వస్తుంది. ఇదిగో ఆపాట. అన్నట్లు కొంతమందికే‌ గుర్తుకు వస్తుందీ అని ఎందుకనటం అంటే ఆధునికుల్లో అనేకులు తెలుపు-నలుపు సినిమా అంటే చచ్చినా చూడరు. అ పాతచింతకాయపచ్చడి సినిమాల్లో ఏముంటుందీ అనేస్తారు. రంగురంగుల హంగుల సినిమాల్లోనే ఎంతో గొప్పగొప్ప కథలూ నీతులూ అదేదో‌ ఎంటర్‌టైన్‌మెంట్ అంటారే అదీ, ఇంకా బోలెడు విలువైనవీ ఉంటాయని వాళ్ళ గాఠ్ఠి నమ్మకం మరి.



 

వార్తాపత్రిక తెప్పించటం మానివేసి చాలాకాలం ఐనది. ఎప్పటి నుండీ అని అడక్కండి. నాకూ తెలుసు, మీకూ తెలుసు కరోనాకాలం మొదలైనప్పటినుండి అని. కరోనామూలంగా వాడు పేపర్ వేయటానికి లేకుండా పోయింది. ఈమధ్య మళ్ళా పేపర్ వేస్తానూ అంటూ ఫోన్ చేస్తే, వద్దులే నాయనా మేం ఇలా అలవాటుపడిపోయాంలే అని చెప్పేసాం.

నిజానికి పేపర్ వస్తున్నాసరే బహుకాలంగా వార్తలకోసం టీవీలోని వార్తాఛానెళ్ళూ వివిధపత్రికలవాళ్ళ అంతర్జాలపత్రికలూ ఉపయోగించటం చేస్తున్నాం.

ఒకప్పుడు కొత్తవార్తలు అంటే అవి ఉదయం వచ్చే వార్తాపత్రికతోనూ లేదా రేడీయోలో సమయప్రకారం వచ్చే వార్తాప్రసారాలతోనూ మనదాకా వచ్చేవి. ఆ రేడియోల కాలం పోయింది. ఇప్పుడు ఎఫ్‌ఎమ్‌ అంటూ రణగొణధ్వానాల స్టేషన్‌లు వచ్చాయి కాని వాటిని వినే ఓపిక మాకు లేదు. ఇక టీవీలో ఐతే వచ్చే వార్తలకన్నా నరజీవులకుండే ఓపికను పరీక్షించే అడ్వర్టైజ్‌మెంట్ల గోలే చాలా ఎక్కువ.

అందుచేత తీరిక దొరికినప్పుడు అంతర్జాలంలో చూస్తాను వార్తల కోసం. 

అలా ఈఉదయం‌ కంటబడ్డది నయనకంటకమైన వార్త ఒకటి - కన్నతల్లిదండ్రుల ఫోటోకు చెప్పుల దండ వేసిన ప్రబుధ్ధుల గురించి.



(పైన ఇచ్చిన ఫోటో, ఆంధ్రజ్యోతి వారి వార్తతో ప్రచురించినది.)

ఏమిటీఅన్యాయం!

నిన్న టీవీలో వార్త చూశానన్నారు మిత్రులు విన్నకోట వారు.   అన్ని విలువలనూ పూర్తిగా వదిలేసిన సమాజంలాగా తయారవుతోంది. మీడియా, సినిమాలు, వ్యాపారులు ఈ రుగ్మతకు కారణం అంటున్నారు వారు.

కలికాలం అన్నారు మిత్రులు శర్మ గారు.

నిజం చెప్పాలంటే, డబ్బుకు తప్ప జీవితంలో మరి దేనికీ విలువే లేదన్న ఆధునిక జీవనసత్యాన్ని ఊహ తెలిసినప్పటి నుండి పిల్లలకు ఈకాలంలొ తలిదండ్రులే నూరిపోస్తున్నారు. చివరికి ఇలాంటి వికృత పరిణామాలు ఎదురైతే అందరూ గుండెలు బాదుకుంటూ గోలపెడుతున్నారు!

కొన్ని దశాబ్దాల క్రిందటి సంఘటన ఒకటి గుర్తుకు వస్తున్నది. నేను హైదరాబాదుకు వలసవచ్చిన రోజులవి. అప్పట్లో మా మేనమామ గారింట్లో కొన్నాళ్ళున్నాను. ఆ తరువాత కాలంలో కూడా వారింటికి వెళ్తూనే ఉండేవాడిని. ఒకరోజున ఆయన తన కుమార్తెపైన కోపగించుకుంటుండగా వెళ్ళాను.

ఆ పిల్ల అప్పుడు ఎల్‌కేజీలోనో యూకేజీలోనో ఉంది. స్కూల్లో క్లాస్ మెత్తానికి నాలుగవస్థానంలో వచ్చిందట. అంతక్రిందటి సంవత్సరం మొదటిదానిగా వచ్చిందట. ఇలా చదువులో వెనుకబడిపోతే ఎలా? ఇలా చదివితే పెద్ద జాబ్ ఎలా వస్తుంది, ఎలా దర్జాగా బతుకుతావూ అని ఆ అమ్మాయి మీద అరుస్తూ‌ క్లాస్ తీసుకుంటున్నాడు! ఆ పిల్ల ఈమానవుడికి ఏమయిందో అర్ధం కాక బిక్కమొఖం పెట్టి చూస్తోంది.

ముక్కుపచ్చలారని వయస్సులోనే మనం పిల్లలకి డబ్బు ఎంత ముఖ్యం అంటే దానితరువాతే‌ జీవితం సుమా అని నూరిపోస్తున్నాం. ఆముక్కలు చాలాబాగా వంటబట్టించుకొన్న కొందరు ఆ డబ్బుకోసం ఆ తలిదండ్రులమీదే అఘాయిత్యాలు చేస్తున్నారు మరి. తప్పెవరిది?

ఎప్పుడు ఎరుకలోనికి వచ్చిందో ఇప్పుడు సరిగా గుర్తులేదు కాని మరొక సంఘటన ఇలాంటిదే ఉంది. 

ఒక జంటకు ఇద్దరు పిల్లలు. ఆ భార్యాభర్తలకు ఏమాత్రం సఖ్యత లేదు కాని పిల్లల్ని మాత్రం కళ్ళల్లో పెట్టుకొని పెంచారు. సఖ్యత లేక పోవటం అంటే మరేమీ లేదు భార్యకు చిరుకోపం భర్తకు పెనుకోపం అన్నమాట. చిరుకోపం ఎందుకంటే డాక్టరు తినొద్దయ్యా అన్నవన్నీ తింటాడు ఇంటాయన. నువ్వు తినకూడదుగా అంటూ వండి పెట్టకపోతే ముందు అలుగుతాడు - ఆతరువాత కోపంతో అరుస్తాడు. రోజూ‌ తిండిదగ్గర పేచీలేను.

అన్నట్లు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళై ఎప్పుడో వెళ్ళిపోయారు. కూతురు సరే సరి, కొడుకు వేరు కాపురం కదా, అదన్నమాట. 

ఒకరోజున కొడుకు వచ్చాడు. ఆలూమగలు సంబరపడ్డారు. కొడుక్కి ఇష్టమైనవి అంటూ‌ ఇంటాయన లిష్టు చదివాడు. వాడికోసం కొంచెం చేస్తానులే అని కసిరింది ఆవిడ. లడాయి మొదలు.

కాని భోజానాలు పూర్తయ్యాక అసలు లడాయి మొదలైంది. ఎలాగూ మీరు నాదగ్గర వచ్చి ఉండవలసిందే కదా రేపోమాపో, అందుకని ఈ ఇల్లూ, కొట్టూ వగైరా అంతా ఇప్పుడే రాసిచ్చేయి అన్నాడు కొడుకు.

అమ్మానాన్నా కుదరదన్నారు. 

అంతే అతడు పట్టుబట్టడం, వాదు పెరగటం జరిగింది.

అసలే కోడలు వచ్చి కొడుకుని నిజంగానే దూరం చేసిందన్న కక్షతో ఉన్న అమ్మ కొంచెం మాట విసిరింది. ఇదంతా నీకు నీ‌ పెళ్ళాం నూరిపోసిందిలే అని.

కొడుకు విచక్షణ కోలుపోయాడు. అమ్మని లాగి లెంపకాయ కొట్టాడు.

అమ్మానాన్నలు మ్రాన్పడిపోయారు.

అమ్మ గ్రుడ్లనీరు కుక్కుకుంది. కాని కొడుకుతో ఏమీ మాట్లాడాలి అనిపించక కాబోలు మౌనంగా ఉండిపోయింది.

తండ్రి రంకెలు వేసాడు. నా యింట్లోంచి బయటకు నడు అంటూ, ఏమేమో అన్నాడు.

కొడుకు కోపంలో తండ్రికి తగ్గ వారసుడేగా. ఊగిపోతూ తండ్రిమీదికి దూకాడు.

తండ్రిమీద చేయి వేసేలోగా ఉన్నట్లుండి విరుచుకొని పడిపోయాడు.

ఎందుకంటే తల్లి చీపురుకట్ట తిరగేసి వాడి తలమీద ఒక్కటిచ్చింది బలంగా! 

ఎంతైనా కన్నప్రేగు కదా. కొడుక్కేమైందో అని ఆలూమగలు లబలబ లాడారు. ఎన్నో ఉపచారాలు చేసారు. అదృష్టవశాత్తూ ఏమీ కాలేదు వాడికి. కొద్దిసేపటికే స్పృహలోనికి వచ్చాడు. అమ్మానాన్నల్ని అనరాని మాటలన్నాడు. మీ అంతుచూస్తాను అని కూడా అన్నాడు. ఆతరువాత తండ్రికి వేలు చూపిస్తూ ఇంటినుండి వెళ్ళిపోయాడు.

సంగతి అంతా తెలిసి ఊళ్ళొనే ఉండే కూతురు అన్నగారి మీద పోలీసులకి ఫిర్యాదు చేసింది. వాడి మీద ఇప్పటికే  రౌడీషీటర్ అన్న బిరుదు ఉంది. మా అమ్మానాన్నలకి ప్రాణాపాయం ఉంది అని. వార్త పేపర్లకి ఎక్కింది.

ఏదో‌ నాదృష్టిలో ఉన్నది ఒకటి వ్రాసాను కాని ఇలాంటి తరచు చూస్తూనే ఉన్నాం.

నాగరికత పేరుతో ఆధునిక విద్యపేరుతో మనం సామాజిక విలువలను ఎప్పుడో ధ్వంసం చేసుకున్నాం. అందుకే ఇటువంటి సంఘటనలు సాధారణం అయిపోయాయి.

వేమన పద్యం ఒకటి గుర్తుకు వస్తున్నది.


తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ


వేమన పద్యాలను ఈరోజుల్లో ఎక్కడా బళ్ళల్లో చెప్పరు. సుమతీ శతకం చెప్పరు. కృష్ణ శతకం చెప్పరాదు. అవన్నీ పాత చింతకాయలు. పనికిరావు నేటి చదువులకి. పసిపిల్లల చేత రైన్ రైన్ గో అవే‌వంటి దౌర్బాగ్యపు రైమ్స్ మాత్రం చెప్పిస్తారు. అదీ చూస్తామంటారా ఇదిగో



వీళ్ళకి వాన రావటం ఇష్టం లేదట. చాలా బాగుంది. వానలు పడకపోతే ముద్ద నోటికి ఎలావస్తుందో మరి.

అమ్మానాన్నలనూ, ఆమాటకు వస్తే అందరినీ గౌరవంగా ఎలా చూడాలో ఆదర్శంగా అచరించి చూపిన రాముడి కథను మెచ్చదు నేటి మేథావి గణం. రామాయణం విషభాండం అనో విషవృక్షం అనో చెప్తారు. టీచర్లను ఎలా ఎగతాళీ చెయ్యాలో పాపం స్కూళ్ళల్లో నేర్పటం లేదు కాని అందుకోసం మన సినిమాలవాళ్ళు ప్రతిసినిమాలోనూ తప్పకుండా పాఠాలు చెబుతూనే ఉంటారు.

దిక్కుమాలిన చదువులూ దిక్కుమాలిన నాగరికతాను, అమ్మానాన్నల్ని అవమానించటం మాత్రం బాగా నేర్పుతున్నాయి.

15, డిసెంబర్ 2020, మంగళవారం

శివలింగముపై చీమప్రాకిన

శివలింగముపై చీమప్రాకిన
శివునకు కొరత కలిగేనా ఆ
చీమకు ఘనత కలిగేనా

సజ్జనుని గని దుర్జను డరచిన
సజ్జనునకు దుర్గతి కలదా ఆ
దుర్జనునకు సద్గతి కలదా

భక్తుని పామరు డెంత తిట్టిన
భక్తుని ఘనత తొలగేనా ఆ
పామరునకు ఘనతబ్భేనా

ఏనుగు వెడలిన కుక్క మొఱగిన
ఏనుగు దర్జా తొలగేనా ఆ
కుక్కకు దర్జా కలిగేనా

సూర్యునిపై నొక డుమిసి నంతట
సూర్యుని తేజము తరిగేనా ఆ
ధూర్తుని మొగమే తడిసేనా

గుడిలో దేవుని కూడని వడుగ
వడి దేవుడు వరమిచ్చేనా ఆ
అడుగువాడు చెడిపోయేనా

హరిహరులకు బేధముల నెంచిన
హరిహరులకు వాదయ్యేనా ఆ
నరునకు నరకం బయ్యేనా

రాముని రాక్షసు లెంత తిట్టిన
రాముని యశమది తరిగేనా ఆ
రాక్షసులకు యశ మబ్బేనా

నవ్వినవ్వి యలసిన

నవ్వినవ్వి యలసిన నాడది నీదయ యందును

నవ్వే లేని బ్రతుకైన నాడును నీదయ యందును


బలములు బలగములు నంది వచ్చిన నీదయ యందును

బలములు బలగములు నాకు తొలగిన నీదయ యందును

నలుగురు నను పొగడుచున్న నాడది నీదయ యందును

నలుగురు నను తెగడుచున్న నాడును నీదయ యందును


నాలుగు పాటలు పాడిన నాడది నీదయ యందును

నాలుక కొకటియును రాని నాడును నీదయ యందును

నా లక్ష్యము సిద్ధించిన నాడది నీదయ యుందును

నా లక్ష్యము సిధ్ధించని నాడును నీదయ యందును


జయములు కలిగిన వేళల స్వామీ నీదయ యందును

భయములు కలిగిన వేళల వలయును నీదయ యందును

తులలేని సద్భక్తి నాకు కలిగెను నీదయ యందును

జలజాక్ష రామా నీవే సకలము నాకని యందును


14, డిసెంబర్ 2020, సోమవారం

నీ ఘనత చెప్ప తరము కాదు శివలింగమా

శివలింగమా ఓ శివలింగమా
నీ ఘనత చెప్ప తరము కాదు శివలింగమా

మారేడు చెట్టు కింద శివలింగమా
ఆ - చెట్టు దెంత భాగ్యమే శివలింగమా
అది - పత్రిపూజ చేసెనే శివలింగమా
అది - నిత్యపూజ చేసెనే శివలింగమా
ఏ  - ఆశలేని పూజచేసె శివలింగమా
దాని -  కింక జన్మ మున్నదా శివలింగమా
అది - మోక్షమునే పొందునే శివలింగమా

చెట్టు కింద పుట్టలో శివలింగమా
ఆ - పుట్టదెంత భాగ్యమే శివలింగమా
అది  - ఉరగహారముల లిచ్చె శివలింగమా
ఆ  - పాములా భాగ్యమేమి శివలింగమా
వాటి -  కింక జన్మమున్నదా శివలింగమా
అవి - -మోక్షమునే పొందునే శివలింగమా
ఆ - పుట్ట కట్టె చీమలెన్నొ శివలింగమా
అవి - మోక్షమునే పొందునే శివలింగమా

గొల్లపడుచు గూటిలో శివలింగమా
ఆ  - పడుచుదెంత భాగ్యమే శివలింగమా
అది - నీకిన్ని పాలుపోసె శివలింగమా
ఏ - మంత్రాల పూజలనూ శివలింగమా
అది -  యెరుగనే యెరుగదే శివలింగమా
అది - -మనసారా పాలుపోసె శివలింగమా
ఆ - పడుచు కింక జన్మమేది శివలింగమా
అది - మోక్షమునే పొందునే శివలింగమా

పుట్టనే పెళ్ళగించి శివలింగమా
ఒకడు - పాములను వెళ్ళగొట్టె శివలింగమా
వాడు - మారేడు చెట్టెక్కెను శివలింగమా
పత్రి - నెత్తుకొని పోయెనే శివలింగమా
వాడు -  శివపూజకు పత్రినమ్మె శివలింగమా
వాడి -  దెంతెంత పాపమే శివలింగమా
వాడు -  మోక్షమునకు దూరమే శివలింగమా
వాడి - భార్య గొల్లపడుచు శివలింగమా
వాడి - పాపమే మెరుగదాయె శివలింగమా

అంతలోన నేమాయె శివలింగమా
ఆ - పాపమెల్ల పోయెనే శివలింగమా
వాడు -పత్రి కోయుచుండగా శివలింగమా
కొంత - జారి నీపైన పడెనె శివలింగమా
వాడు - పూజ చేసి నట్లాయె శివలింగమా
దాని - పుణ్య మింతనరాదే శివలింగమా
వాడి - పాపమెల్ల పోయెనే శివలింగమా
వాడు - మోక్షమునే పొందునే శివలింగమా

మరల పుట్ట పెరిగెనే శివలింగమా
ఆ - పాము లన్ని చేరెనే శివలింగమా
అ - చెట్టు పత్రి పూజించే శివలింగమా
అ - గొల్లభామ పూజించే శివలింగమా
కడు - మంచిపూజ లిట్టివే శివలింగమా
అవి - మంచి చేయు పూజలే శివలింగమా
అ - సహజమైన పూజలకు శివలింగమా
నీవు - మెచ్చి ముక్తి నిత్తువే శివలింగమా

13, డిసెంబర్ 2020, ఆదివారం

జీవితమున కాధారము

జీవితమున కాధారము శ్రీరాముని నామము

జీవులను తరింపజేయు శ్రీరాముని నామము


శ్రీరాముని నామము చిత్తశుద్ధి కలిగించును

శ్రీరాముని నామము చింతలన్ని తొలగించును

శ్రీరాముని నామము చేకూర్చును శుభములను

శ్రీరాముని నామము భూరియశము నిచ్చును


శ్రీరాముని నామము శ్రీకరంబగు మంత్రము

శ్రీరాముని నామము శివుడు జపించే మంత్రము

శ్రీరాముని నామము శీఘ్రమే ఫలించు మంత్రము

శ్రీరాముని నామము జిహ్వకింపైన మంత్రము


శ్రీరాముని నామము చింతితార్ధముల నిచ్చును

శ్రీరాముని నామము క్షేమము కలిగించును

శ్రీరాముని నామము జీవులను రక్షించును

శ్రీరాముని నామము చేయవలయు నెల్లపుడు


భవవినాశకనామ

భవవినాశకనామ పరమపావననామ
పవనజనుతనామ పాహిపాహి

ధరణిజాప్రాణనామ దనుజాంతకనామ
పరమశివనుతనామ భయనివారణనామ
గిరిసుతామోక్షనామ కేవలానందనామ
దురితనివారణనామ దుఃఖవిఛ్ఛేదనామ

మునిగణవినుతనామ మోక్షకారణనామ
వనజభవనుతనామ వాంఛితార్ధదనామ
ఘనసుఖాస్పదనామ అనిమిషార్చితనామ
మనశ్శాంతిదనామ మంగళాస్పదనామ

నిగమాగమనుతనామ నిర్వాణసుఖనామ
జగద్విఖ్యాతనామ శత్రుహరణనామ
జగద్వందితనామ జన్మసాఫల్యనామ
విగతకల్మాషభక్తవిజయసంధాననామ

 

శ్రీరామచంద్రునకు నీరాజనం

నీరాజనం జగన్నియామకున కీశ్వరునకు
శ్రీరామచంద్రునకు నీరాజనం

కారుణ్యధామునకు కమనీయగాత్రునకు
మారకోటిసుందరునకు నీరాజనం
భూరిపరాక్రమునకు భువనమోహనాకృతికి
ధారుణీవలయపతికి నీరాజనం

ఘోరభవాంతకునకు కువలయార్తిహరునకు
వారిజభవనుతునకు నీరాజనం
సీరధ్వజునల్లునకు సీతాసమేతునకు
ధారాధరవర్ణునకు నీరాజనం

వారిజాతాక్షునకు వాంఛితార్ధప్రదునకు
మేరునగధీరునకు నీరాజనం
శూరలోకేశునకు మారీచమథనునకు
నారాయణమూర్తికి నీరాజనం

కరుణామయుడ వీవు

కరుణామయుడ వీవు చిరమిత్రుడవు నీవు

నరనాథుడవు నీవు నాస్వామీ


హరి వచ్యుతుడ వీవు పరమేశ్వరుడ వీవు

నిరుపమానుడ వీవు నిర్గుణుండవు

నిరుపాధికుడ వీవు నరసింహుడవు నీవు

ధరణిజాపతి వీవు దశరథాత్మజా


సుగుణాన్వితుడ వీవు శుభ్రకీర్తివి నీవు

జగదీశ్వరుడ వీవు జయశాలివి

నిగమవేద్యుడ వీవు విగతరాగుడ వీవు

భగవంతుడవు నీవు పట్టాభిరామా


సుజనాశ్రయుడ వీవు సుందరాకృతి వీవు

నిజబంధుడవు నీవు నీరజనయన

కుజనాంతకుడ వీవు కోసలేశ్వరుడ వీవు

విజితామరారి వీవు విజయరామా


న్యాయమా రామచంద్ర

న్యాయమా రామచంద్ర నా మొరాలకించవు

నీ యందే నా చిత్తము నిలిచియున్న ది


మోసకారి కలిమాయలు మోమాటపెట్టు చుండ

త్రోసిపుచ్చుచు రానా నే తొల్లిటి నుండి

దాసుడనై నీ సేవలు వీసమంత విసువులేక

చేసికొనుచు నుంటి కదా చిత్తగించవు


ఇన్ని జన్మముల నుండి ఇంపుగా నీకు సేవ

లన్ని వేళలను చేయునట్టి వాడనే

చిన్నచిన్న దోసముల నెన్ని మౌనమూనుదువు

మన్నించవు కదా తండ్రి విన్నపములను


నీవు కరుణించుదాక నిన్నే సేవింతుగాని

భావించగనేర నెంత వారినైనను

నీవు చేయుపరీక్షకు నిలిచితిన్ని జన్మములుగ

నీవింకను దయను చూపనేరవా ప్రభూ


నిన్నే నమ్మి యున్నవాడ

నిన్నే నమ్మి యున్నవాడ నీదే భారము చిక్కు
లన్ని దీర్చి భవముడిపి యాదరించవే

మున్ను దీనుడౌ గజేంద్రు ముదమున రక్షించినావు
మున్ను బాలప్రహ్లాదుని వెన్నుగాచి నాడవు
మున్నంబరీషుని మునిముప్పు నుండి కాచినావు
నన్నేల కావవయ్య నారాయణ శ్రీరామ

కన్నబిడ్ఖ లటుల నీవు కాచితివే పాండవులను
మిన్నగా ద్రోవదికి నీవే మేలుచేసినాడవు
సన్నుతాంగ వారి వలెనె శరణము జొచ్చితిని నిన్ను
నన్ను రక్షించవయ్య నారాయణ శ్రీరామ

అన్నన్నా భక్తుడనని యనుకొనవో నన్ను నీవు
పన్నుగ నను రక్షింప వచ్చునట్లు తోచదు
ఎన్నెన్నో జన్మలెత్తి యెంతో విసివితిని తండ్రి
నన్ను దయచూడవయ్య నారాయణ శ్రీరామ

 

చూడనే చూసినది

చూడనే చూసినది చుప్పనాక అందగాని
చూడనే చూసినది చుప్పనాక సీతను

వీడు మన్మథుని వంటి వాడు సరిజోడు నాకు
వీడు నాకు జోడైతే వేడుకయే‌ ప్రతిదినము
వీడు నాకు తోడైతే విరుగు నా వైరిగణము
వీడు నా పగను తీర్చు వీరుడని యెంచినది

అనరణ్యుడు మున్ననడే యినకులము నందొకడు
జనియించును రావణుని సంహరించు ననుచు
యినకులేశు డితడు నా పనిదీర్చు పసగలాడు
ఘనముగ వీని పొందుదు ననుచు యెంచినది

కాదనునో వీడిపుడు కలదు కదా వీని తరుణి
ఆదుష్టుని కడకు పోయు యగ్గించి దీని సౌరు
పాదుకొలుపుదు పోరు వాడు వీని చేనణగు
నా దైన్యము తీరునని నమ్మి హరిని చేరినది

11, డిసెంబర్ 2020, శుక్రవారం

ఎంత మంచివాడ వయ్య

ఎంత మంచివాడ వయ్య యినకులేశ్వరా నీ
వెంత అమాయకుడవో అవనిజాపతీ

పట్టాభిషేకవేళ పట్టుబట్టి కైకమ్మ
కట్టించ నారలే కటకటా వేగ
నట్టడవికి కిమ్మనకనె నడచిపోయితి వయ్య
కట్టుకున్న భార్యతో‌ కడుగూర్చు తమ్మునితో

అడవిలోన రాకాసి యాలినెత్తుక పోయె
పడరానిపాట్లు పడి వానిని పట్టి
వడి యుధ్ధము చేయువేళ వా డలసి నాడనుచు
విడచి రేపు రమ్మను టది వెఱ్ఱితనము కాదటయ్య

పదివేల యేండ్ల పిదప పనిలేని వాడెవడో
వదరినాడని చెడ్డవాక్య మొక్కటి
అదేజనవాక్యమనుచు అవనిజనే యడవుల
అదయుడవై విడచితివేవే అది పిచ్చియె కాదటయ్య

 

10, డిసెంబర్ 2020, గురువారం

హరిని కీర్తించ

హరిని కీర్తించ రం డమ్మలారా మీరు

హరిని కీర్తించ రం డయ్యలారా


హరేరామ యనుచు రం డమ్మలారా మీరు

హరేకృష్ణ యనుచు రం డయ్యలారా

హరేరామ హరేకృష్ణ యనుచు రం డందరును

హరే నారసింహ యనుచు నందరు రండి


పరమాత్ముని కీర్తించగ భక్తులారా మీరు

త్వరత్వరగ హరిభజనకు తరలి రండి

పరమహర్షము తోడ పరుగున రండి నేడు

హరిభజనానందంబున కందరు రండి


హరినామకీర్తనమే హరిగుణకీర్తనమే

హరికథావర్ణనమే యమితసుఖము

పరమాత్ముని కీర్తించు వారలదే పుణ్యము

హరిని పొగడి యాడిపాడ నందరు రండి


కలలోన నీకెవరు

కలలోన నీకెవరు కనిపించినా రయా

కలలోన వేలుపులను కాంచితిని సీతా


కలలోన వేలుపులు సెలవిచ్చిన దేమని

ఇలమీదకి నీరాక యిందుకేనా యని

నిలదీసిరి సీతా నిష్ఠురములు పలికిరి

జలజాక్ష ఆమాటలు చాల చిత్రంబులు


వచ్చిన పని మరచితివని పలికిరి యది యేమో

అచ్చెరువా రామ నీవు యజనసంభవుడవై

వచ్చినా వేమొ వారి పనిమీదను భువికి

అచ్చముగ నాకు నదే యనిపించును సీతా


మాపని చెడరాదనుచును మాటలాడిరే

ఆపని యది యిట్టిదని అనరేల సీతా

ఈపట్టాభిషేకము నిపుడు కానిండు

రేపు మీకు తెలుపగలరు శ్రీవసిష్ఠు లదేమో


నిడుద నామము వా డతడు

నిడుద నామము వా డతడు

    పొడుగు చేతుల వా డతడు

నడుము సన్నని వా డతడు

    వడిగల తూపుల వా డతడు


స్మరశతసముడగు వా డతడు

    వరగుణనిథియగు వా డతడు

నరులకు పతియగు వా డతడు

    అరులకు యముడగు వా డతడు

సురలకు హితుడగు వా డతడు

    సురగణ నుతుడగు వా డతడు

సురరిపు విధ్వంసను డతడు

    వరచరితుండగు వా డతడు


నిరుపమానుడగు వా డతడు

    నిరమిత్రుండగు వా డతడు

పరమవీరుడగు వా డతడు

    స్థిరయశస్కుడగు వా డతడు

పరము లొసంగెడి వా డతడు

    పరమయోగిగణనుతు డతడు

పురుషోత్తముడగు వా డతడు

    పరమాత్ముండగు వా డతడు


కువలయాక్షుడగు వా డతడు

    భువనము లేలెడి వాడతడు

రవికులపతియగు వా డతడు

    కువలయతనయా పతి యతడు

పవనజసంసేవితు డతడు

    భవమోక్షణుడగు వా డతడు

భువి కరుదెంచిన హరి యతడు

    అవునతడే మన శ్రీరాముడు


కొల్లలుగ వరములు

కొల్లలుగ వరములు వెల్లువగ దయలు హరి

యెల్లరకు నొసగ చింత లెవరి కుండును


హరి యను దైవంబు గలడని తెలియని వారికి

హరి యందు విశ్వాస మది లేని వారికి

హరి సేవనమున శ్రధ్ధ యలవడని వారికి

తరచుగాను చింతలవి తగులుకొనును గాక


హరి యందు ద్వేషమే యధికమైన వారును

హరిహరులకు భేదంబు లరయుచుండు వారును

హరి కప్యదైవంబుల నర్చించెడు వారును

పరిపాటిగ బహుచింతల పాలగుదురు గాక


హరిసేవన మందు గడుపు నట్టి వారికి లేవు

హరికన్యము తలపకుండు నట్టి వారికి లేవు

హరేరామ హరేకృష్ణ యనెడు వారికి లేవు

మరి యితరులు చింతలతో మ్రగ్గుచుంద్రు గాక


9, డిసెంబర్ 2020, బుధవారం

సత్య మిదని తెలియరే

 సత్య మిదని తెలియరే సర్వవిధముల మీరు సత్యమైన మార్గమున సంచరించరే

నిత్యుడైన పరమాత్ముని నిర్మలులై సేవించి నిశ్చయముగ ముక్తులై చెలంగ నేరరే


పాపమని యొకటిలేదు పుణ్యమని యొకటిలేదు పాపపుణ్యములు మనసుచేయు భావనలు

పాపపుణ్యముల మనసు భావించు టుడుగుదాక భవము లెన్నేని గలవు బాధలు గలవు

రూపరక కర్తనను భావనము జీవునకు పాపపుణ్యములు పట్టి పీడించును

ఏ పగిది రెండింటి నీసడించుట యన్న నీశ్వరుని భావించుటే మార్గము


జీవుడు భగవంతుని చిత్తమం దేమరక భావించుటే భవము దాటు మార్గము

భావించి దేవుని వదలక నిదురనైన సేవించుటే పరము చెందు మార్గము

సేవించి యీశ్వరుని చింతలన్ని విడచుటే జీవునకు ముక్తిసిధ్ధించు మార్గము

జీవుడు ముక్తుడై ప్రకృతి కతీతుడై దేవునిలో‌ నైక్యమై తేజరిల్లును


ముక్తుడైన వాడు శోకమోహములను పొందక ముదమున నీశ్వరుని పొంది యుండును

ముక్తుడైనవాడు లోకసంగ్రహార్ధమై వచ్చు ముముక్షువుల మేలుకై భూమి మీదకు

ముక్తుడైనవాని వలన ముముక్షువు దారితెలిసి ముక్తిమార్గమున బోయి ముక్తి చెందును

ముక్తుడైనవాని వలన  రామభక్తి మార్గమే ముక్తిమార్గ మగుట తెలిసి ముక్తి చెందును


ఈనామమే చాల హితవైన నామము

ఈనామమే చాల హితవైన నామము
మానక జపియింతు నీ మంచినామము

ఆక్కజముగ రాక్షసులను మిక్కిలి భయపెట్టు నామము
వెక్కసముగ సజ్జనులకు వేయిమేళ్ళు గూర్చు నామము
మక్కువతో పలుకువారికి మంచిగతుల నిచ్చు నామము
చక్కని శ్రీరామ నామము సర్వసుజనసేవ్యనామము

సురవరులు కొలుచు నామము హరుడు నిత్యము తలచు నామము
వరమునులు పొగడు నామము వరములొసగు భవ్యనామము
పరమసులభమగు నామము పరమపావనమైన నామము
నిరుపమమానము రామనామము పరమపదము చేర్చు నామము

మిక్కిలి ప్రియమైన నామము చక్కగ నన్నేలు నామము
చిక్కులు తొలగించు నామము చక్కని శ్రీరామ నామము
దిక్కులన్నిట మారుమ్రోగు దేవదేవుని దివ్యనామము
మక్కువతో‌ హరుడిచ్చిన మంచినామము రామనామము

8, డిసెంబర్ 2020, మంగళవారం

పాహి పాహి రామ

పాహి పాహి రామ భవబంధమోచనా వై
దేహీసహిత నీవే దిక్కు దైవమా

వచ్చి పోవు వారేలే బ్రహ్మాదులన్న నింక
వచ్చిపోవు జీవుల లోపము లెన్న నేటికి
ముచ్చటగా మాయావిమోహితుడీ జీవుడు తా
నెచ్చటెచ్చటనగ తిరిగి యిపుడు నిన్నెఱిగితినో

రకరకముల పుట్టువుల రాటుదేలి తుట్టతుదకు
ప్రకటించితి నీకు నేను పాదదాసుడ నని
సకలలోకములను తిరిగి సర్వేశ్వర యెఱిగితి నీ
వొకడవె యీ తిరిగుడాప నోపుదువని నిజముగ

భక్తజన మందారుని భగవానుని నిన్ను నే
శక్తి కొలది ప్రార్ధింతును జానకీనాయక
ముక్తి కోరి నీదుపాదముల నాశ్రయించితి ఏ
యుక్తి చేసి నన్ను వేగ నుధ్ధరింతువో రామ

 

పాహి పాహి పద్మనాభ

పాహి పాహి పద్మనాభ పాహి పట్టాభిరామ
పాహి పాహి లోకావన పాహి పరమపావన

పాహి పాహి లక్ష్మీపతి పాహి సీతాపతి
పాహి పాహి సకలసద్భక్తప్రాణనాథ
పాహి పాహి ఆదిశేషపర్యంక శయాన
పాహి పాహి రామ శేషాహిలక్ష్మణాగ్రజ

పాహి పాహి వైకుంఠ పాహి కోశలేశ
పాహి పాహి సకలసద్భక్తజనజీవన
పాహి పాహి సదాసుపర్ణ దివ్యవాహన
పాహి పాహి రామ సుపర్ణసంసేవిత

పాహి పాహి శాంగధర పాహి కోదండధర
పాహి పాహి సకలసద్భక్తసర్వార్తిహర
పాహి పాహి సదాదుర్వారరాక్షసాంతక
పాహి పాహి రామ గర్వాంధరావణాంతక

4, డిసెంబర్ 2020, శుక్రవారం

సెటిలర్స్

తరచుగా ఆంధ్రాప్రాంతం వారిని ఉద్దేశించి సెటిలర్స్ అని సంబోధించటం గమనించవచ్చును. ఇప్పటికీ ఆ దిక్కుమాలిన సంబోధన మారటం లేదు. ఇదిగో ఈరోజున కొండలరావు గారు కూడా తన బ్లాగులో ఒకవ్యాఖ్యలో ఈ రోజున "ఇప్పటివరకూ విశ్లేషణలు చూస్తుంటే సెటిలర్స్ మాత్రమే టీ.ఆర్.ఎస్ ను కాపాడారనిపిస్తోంది." అని ఆ పదాన్ని ప్రయోగించారు. ఎంతో‌ విచారం కలుగుతూ ఉంటుంది ఆ సెటిలర్ అన్న మాట తటస్థించినప్పుడల్లా. మరొకరూ ఆసెటిలర్స్ అన్నపదాన్ని కొనసాగించారనీ మనం అక్కడ గమనించవచ్చును.

సెటిలర్. ఈ మాటకు అర్ధం‌ నాకు తెలుసుననే అనుకుంటున్నాను. ఇదే‌ కదా? "తన స్వస్థలం విడచి పరాయి ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న వ్యక్తి" అని.

ఈ‌ మాట విన్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది.

ఇదేదో తప్పుమాట అని కాదు. ఈమాటను తెలుగువాళ్ళు అన్వయిస్తున్న విధానం వలననే నాకు మనస్తాపం కలగతున్నది.

ఈ మాటను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో లేదా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో నా బాధ కాదు. తెలుగువాళ్ళే సాటితెలుగువాళ్ళ పట్ల ఎంత అవమానకరంగా ఎలా వాడుతున్నారో అని నా బాధ.

మన తెలుగువాళ్ళలో కూడా తోలుమందం మనుష్యులు కోకొల్లలుగా ఉన్నారు. కాని వాళ్ళతో‌పాటే నాలాంటి కొంచెం‌ సున్నితమనస్కులు కూడా ఉన్నారు. తోలుమందం జనాభాకైతే పట్టించుకోకుండా కించిత్తూ బాధపడకుండా ఉండే హక్కు ఎలాగైతే ఉందో, నాలాంటి వారికి కొద్దో గొప్పో‌ బాధపడే  హక్కు కూడా అలాగే ఉంది. తోలుమందం జనాభాకు మౌనంగా మాటల్ని భరించే హక్కు ఎలా ఉందో (అదీ‌ ఒక హక్కే‌నా అని ఎవరికన్నా అనుమానం వస్తే మంచిదే!), నాలాంటి వారికి భరించలేక తమ అభిప్రాయాన్నీ నిర్మొగమాటంగా చెప్పే‌ హక్కూ‌ అలాగే ఉంది. అందువలన ఒకరి అనుమతి అవసరం లేదు నా అభిప్రాయ ప్రకటనకు.

పాలపొంగు ఒకటి తెలుగుప్రజల రాష్ట్రాన్ని ఎలా రెండుముక్కలు చేసిందో అందరమూ చూసిందే. దరిమిలా ఒక తెలుగురాష్ట్రం (ప్రస్తుతానికి) రెండుగా మారి, తెలుగువారికీ రెండు రాష్ట్రాలు ఏర్పాటై, తమకు ఒక్క రాష్ట్రమేనా అని విచారించే అమృతహృదయులకు ఎలా ఊరట చేకూర్చిందో అందరికీ తెలిసిందే.

ఒకటి చివరకు రెండు ఐన తెలుగుప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వాలు చివరకు ఎలా అభివృధ్ధిపథంలో దూసుకొని పోతున్నాయో కూడా మనందరికీ‌ బాగా అవగతం అవుతూ ఉన్నదే.

ఈ విషయంలో నాకు విచారించటానికి వ్యక్తిగతంగా కారణం ఏమీ‌ లేదు. కాని చిక్కల్లా ఆ మహర్దినం దాకా స్వరాష్ట్రంలోనే ఉన్నవాడిని కాస్తా హఠాత్తుగా నా చిరనివాసప్రాంతంలోనే పరాయి వాడిని ఐపోవటమే. అలా ఐపోయానని నేను అనుకొనటం‌ మానటం అంత ముఖ్యమైన సంగతి కాదు. నేను అలా పరాయివాడినీ‌ అని ఘడియకు ఒకసారి గుర్తుచేసే సహృదయవాక్యాలను తట్టుకోవటం ఎంత కష్టంగా ఉంటుందీ‌ అన్నదే‌ ముఖ్యమైన సంగతి.

కాని ఈరాష్ట్రంలోనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణానికి ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణా వారిగానూ మిగతా వారంతా పరాయి వారుగానూ తెలంగాణా రాష్ట్రప్రభుత్వాధినేతయే చేసిన ప్రకటనలు ఎంతమందికి ఇంకా గుర్తున్నాయో నాకు తెలియదు. ఈకొద్ది సంవత్సరాలలోనే అదేదో గత త్రేతాయుగం నాటి సంగతి కదా ఇప్పుడెవ్వరికి పట్టింది అన్నట్లు మర్చిపోగల వాళ్ళకు ఒక నమస్కారం. అది నావల్ల కాదు. కానే కాదు. ఎందుకో చెప్పనివ్వండి.

నేను నలభైయేడేళ్ళ క్రిందట పొట్టచేత్తో పట్టుకొని వచ్చాను హైదరాబాదు నగరానికి. అప్పటికి అదింకా నిర్వివాదంగా తెలుగువాళ్ళ స్వరాష్ట్రానికి ముఖ్యపట్టణం. అందుచేత నేను అప్పట్లో నాస్వరాష్ట్రరాజధానికి ఉద్యోగనిమిత్తం వచ్చాను కాని ఏదో పరాయి ప్రాంతానికి ప్రవాసం పోలేదు. నేను వచ్చింది నా పొట్టపోసుకుందుకే‌ కాని ఏదో తెలంగాణా ప్రజల పొట్టకొట్టి ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో ఐపోయి పెత్తనం చేదామని కాదు. ఆ వచ్చింది కూడా భారతప్రభుత్వం అధీనం లోని సంస్థకు కాని ఇక్కడి ఏదో‌ ప్రైవేట్ కంపెనీకి ఐనా కాదు.

నేను వచ్చిన కొద్ది కాలానికే నా కుటుంబం అంతా, మా నాన్నగారి నిర్యాణానంతరం, నా దగ్గర ఉండటానికి వచ్చారు. అందరం ఇక్కడే ఉన్నాం అప్పటినుండి. నాసోదరసోదరీమణులంతా ఈ హైదరాబాదులోనే చదువుకున్నారు. మా చెల్లెళ్ళందరినీ హైదరాబాదు వాస్తవ్యులకే ఇచ్చి వివాహాలు చేసాం.

పందొమ్మిది వందల యాభైఆరు నవంబరు కన్నా ముందుగానే దీర్ఘదర్శనులై మా తాతగారు హైదరాబాదు వచ్చి స్థిరావాసం ఏర్పరుచుకొన లేదు కాబట్టి మేమంతా పరాయి వాళ్ళం అన్న తెలంగాణా ప్రభుత్వం‌ మాట ఎలా సబబు అని మాకు అనిపిస్తుంది చెప్పండి?

ఈ రెండురాష్ట్రాలు ఏర్పడినప్పటినుండీ నాకు 'సెటిలర్' అన్న బిరుదు ఇస్తానంటే నేనెలా ఒప్పుతాను చెప్పండి?

ఆంధ్రాప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చి అర్ధశతాబ్దం కావస్తున్నది. అక్కడివారికి ఇప్పుడు దాదాపుగా పరాయివాడిని. ఇక్కడి వారికి కూడా నేనొక 'సెటిలర్'ను అనగా పరాయివాడికి. చాలా బాగుంది. ఇదెక్కడి న్యాయం?

మా ఆఖరు తమ్ముడు ఇక్కడే‌ జన్మించాడు. ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు వాడికీ ఒక కుటుంబం ఉంది. వాళ్ళంతా కూడా 'సెటిలర్స్' అనటం‌ అసహజం అభ్యతరకరం కాదా?

నాలాంటి వారు ఈ‌హైదరాబాదులో కొల్లలు. ఎవరి కథ వారిది. వాళ్ళంతా పొట్ట చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వచ్చినవారే.

అంద్రాప్రాంతం నుండి వచ్చిన వారంతా దుష్టులు అని అ తెలంగాణా ఉద్యమం రోజుల్లో తిట్టిపోసింది చాలు. ఒక పెద్దమనిషి, నా స్నేహితులే‌ లెండి, అవసరం ఐతే ఆంద్రావారంతా చచ్చిపోయి ఐనా తెలంగాణా రావలసిందే అని చెప్పారు. ఉద్యమం వేడి అట. వేడి! ఎంత చక్కని మాట.

ఆంద్రావాళ్ళు బిర్యానీ‌చేస్తే పేడలా ఉంటుంది అని వెక్కిరించి వెకిలిగా నవ్వులు చిలికించిన పెద్దమనిషి ఓట్ల అవసరం రాగానే ఆంధ్రావాళ్ళమీద కొంచెం ప్రేమ ఒలికించే‌మాటలూ మాట్లాడారు అనుకోండి. అంతమాత్రం చేత ఆ గుండెల్లో ప్రేమను చూడటం నావల్ల కాదు.

సరే జరిగిందేదో జరిగిపోయింది. రాజకీయాల్లో బోలెడు జరుగుతూ ఉంటాయి. వాటికి ఎవరూ ఏమీ చేయలేరు.

కాని ఇంకా అంధ్రప్రాంతం వారిని 'సెటిలర్స్' అంటూ వేరుగా చూడటం సమంజసమా?  ఆప్రాంతం నుండి వచ్చి ఈతెలంగాణాలో స్థిరపడిన కుటుంబాలు మరొక ఐదువందల యేళ్ళైనా సెటిలర్స్ అనే పిలవబడుతారా?

ఈ‌హైదరాబాదులో అంధ్రప్రాంతం నుండే‌ కాక భారతదేశంలోని అనేక ప్రాంతాలనుండి వచ్చి 'సెటిల్' ఐన కుటుంబాలు కొల్లలు. కాని చూస్తుంటే వారెవర్నీ 'సెటిలర్స్' అన్నట్లు కనిపించదు. ఆంద్రప్రాంత నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఈ  సాటి తెలుగువాళ్ళే తెలంగాణావారికి పరాయి వారు, 'సెటిలర్స్' అన్నమాట. భారతదేశంలోని ఏయితర ప్రాంతనుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారూ తెలంగాణా ద్రోహులు కారు. సాటి తెలుగువారైన ఆంధ్రాప్రాంతం వారే తెలంగాణాద్రోహులు (పుట్టుకచేతనే ఆంధ్రాప్రాంతం వారు తెలంగాణాద్రోహులు అన్నమాటనూ రాజకీయులు అనగా విన్నాను.). కాబట్టి సాటి తెలుగువారికి ద్రోహులు అని నిత్యం గుర్తుచేయటానికి వారిని మాత్రమే‌ సెటిలర్స్ అంటారన్నమాట.

ఎన్నికలూ వగైరా అవసరాలు వచ్చినప్పుడు ఓట్లకోసం అంధ్రప్రాంతం వాళ్ళకి మెరమెచ్చు మాటల చెప్పే ఈరాజకీయులు 'ఆంధ్రానుండి వచ్చినవాళ్ళూ మావాళ్ళే' అంటూ ఉండటం విన్నదే. ఆమాటల్లో ఉన్న నిజాయితీ గురించి మేధావులు అనబడే‌ కొందరు ఎంతో చక్కటి విశ్లేషణలు అందిస్తారనటంలో సందేహం లేదు. కాని అవన్నీ పైపై మాటలే అన్నసంగతి మాత్రమే అసలు నిజం.

నేను అమెరికాలో‌ కొన్నేళ్ళు ఉండి వచ్చాను. ఎందరో అమెరికాలో సెటిల్ అయ్యారు మన తెలుగువాళ్ళు. కాని అక్కడ సెటిల్ ఐనా మన వాళ్ళని ఎవరూ అక్కడ 'సెటిలర్స్' అనరు.

ఏదో నాగోడు నేను చెప్పుకున్నాను. ఎందరు ఏకీభవిస్తారో, ఎవరు ఏకీభవించరో అన్నది వేరే‌ విషయం. సత్యం కళ్ళముందే ఉంది. అటు ఆంధ్రకూ ఇటు తెలంగాణకూ చెందని రెండింటికీ చెడిన రేవడులే ఈ సెటిలర్స్ అన్నదే ఆనిజం.

ఒక్కొక్కసారి అనుకుంటూ‌ ఉంటాను. నేను కూడా ఎంతో‌ మంది సాటి తెలుగువారిలాగే ఆ అమెరికాలోనే సెటిల్ అయ్యుంటే ఈ‌అవమానకరమైన సెటిలర్ టైటిల్ నా నెత్తి మీద ఉండేది కాదు కదా అని.

1, డిసెంబర్ 2020, మంగళవారం

హరిహరి అంటే తప్పు లన్ని

హరిహరి అంటే తప్పు లన్ని ఒప్పు లయ్యేనా
హరిహరి  అనడా ఒప్పు లన్ని తప్పు లయ్యేనా

వింతవింత మాటలేల వీర హరి భక్తులార
అంతగ మీ రతిశయోక్తు లాడనేమిటికి
ఎంతైన హరిభక్తి నెన్ని పల్కుదురుగాక
సుంత నమ్మదగిన విధము చూచి పలుకరేల

హరినామము పూర్వపాప మంతటిని దహించును
మరల తప్పుచేయ డతడు మరిపాప మెక్కడ
హరి నెన్నని వాని పాప మంతరించు దారేది
హరే రామ హరే కృష్ణ యని తరించు గాక

హరినామస్మరణమున  నంతగొప్ప లాభమా
హరినామము తప్ప కలిని మరి దారే లేదు
హరేరామ హరేకృష్ణ యంటే సరిపోవునా
నరుడెంతగ నమ్మికొలుచు నంతగొప్పఫలము

మన రామయ్యకు మంగళము

మన రామయ్యకు మంగళము మంగళమూర్తికి మంగళము
మన జానకమ్మకు మంగళము మంగళదాయికి మంగళము

కువలయపతికుల సందీపనునకు గోవిందునకు మంగళము
అవనీసుతయై అవతరించిన హరియిల్లాలికి మంగళము
అవలీలగ శివధనువును విరచిన అతివీరునకు మంగళము
భువనేశ్వరు డీ రాముని పతిగా పొందిన తల్లికి మంగళము

జనకుని పనుపున వనముల కఱిగిన మన రామయ్యకు మంగళము
తనపతి వెనుకనె వనముల కఱిగిన జనని జానకికి మంగళము
దనుజుని చెఱలో పతిరాకకు వేచిన మనతల్లికి మంగళము
దనుజుని ద్రుంచి సతిని గ్రహించిన మన రామయ్యకు మంగళము

జయశీలునకిదె మంగళము త్రయీస్తుత్యునకు మంగళము
దయాశాలికిదె మంగళము ధర్మరూపునకు మంగళము
దయాశాలినికి మంగళము ధర్మరూపిణికి మంగళము
రయమున భక్తుల నేలే సీతారాముల కెప్పుడు మంగళము

30, నవంబర్ 2020, సోమవారం

మా చెల్లెలు అరుణ రచించి పాడిన తెలంగాణా జానపద గీతం

 

 

ఓ మావ జర ఇ నే..

దండ లోని దారమల్లె ఓ మావా
మన  బంధముండి పోవాలి ఓ మావ
పాలు తేనె లెక్క ఓ మావ
మనం కలసి మెలసి ఉండాలి ఓ మావా


ఊపమంటే  ఊపవు ఉయ్యాల
నే ఉసులెట్టా సెప్పాలా ఇయ్యాల
ఉలకవు పలకవు ఈయెళ
నీ అలకే ట్టా తీర్చేది ఇయ్యాల
ఓహో మావ... ఓ బంగారి మావా

సక్కాని సుక్కను నేనైతే
నా నిండు సందమామ  నువ్వు కదా
రంగుల హరివిల్లు నేనయితే
కురిసేటి కరిమబ్బు నువ్వు కదా
ఓహో  మావా.. ఓ బంగారిమామ

అడుగుల అడుగేసి నీవెంట
నే ఏడడుగులు మరి నడవాలా
ఊరంతా పందిరేసి సెయ్యాలా
మన పెండ్లి వేడుకలు చోద్యంగా
ఓహో మావ.. ఓ బంగారిమామ

ఈ పాట రచన, గానం మా చెల్లెలు అరుణవి. 

మా చెల్లాయి పాట కాబట్టి నాకు బాగుంటుంది సహజంగా. బాగా పాడింది అనిపించి నలుగురికి తెలియజేసి ప్రోత్సహించాలన్న దృష్టితో ఆమె పాటను నా బ్లాగుద్వారా కూడా పరిచయం చేస్తున్నాను.

తను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే బాగా పాడుతున్నదని అనిపించి కొన్ని చిన్న చిన్న పాటలు నేర్పి పాడించే వాడిని. అంతకంటే నేను తనకి చేసింది ఏమీ లేదు.

స్వయంగా తనకళను తానే అభివృధ్ధి చేసుకుంది.

ఇప్పుడు స్వయంగా పాటలు వ్రాసుకొని పాడుతున్నది అంటే చాలా సంతోషం కలిగింది.

ఈ పాట వెనుక పూర్వాపరాలు నాకు అంతగా తెలియవు. నాకు పంపితే విని బాగుందనిపించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను.

ప్రొద్యూసర్ గారి పేరు రమణ ప్రసాద్.  మ్యూజిక్ డైరక్టర్ పేరు డేవిడ్. వీడియో ఎడిటర్ సింహ అని చెప్పింది.

ఆసక్తి కలవారు ఈపాటను విని అమె పాటను యూ-ట్యూబ్ ఛానెల్ లింక్ వద్ద లైక్ చేసి ప్రోత్సహించండి.

తనకు తెలంగాణా మాండలికం మీద మంచి పట్టు ఉన్నది. 

చాలా కాలం క్రిందట, అప్పుడు తాను స్కూలు పిల్లగా ఉన్న రోజుల్లోనే ఒకసారి ఒక చిన్న సంఘటన. ఎవరో బయట అరుగుమీద ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. ఫక్తు తెలంగాణా మాండలికంలో. అందులో విశేషం ఏమీ‌ లేదు కాని అందులో ఒక గొంతు మాత్రం బాగా పరిచయం ఉన్న గొంతులాగా అనిపించింది. బయటకు వచ్చి చూస్తే స్నేహితురాళ్ళతో‌ అరుణ కబుర్లాడుతున్నది తెలంగాణా యాసలో. 

కబుర్లు పూర్తై ఇంట్లోనికి వచ్చాక అడిగితే, వాళ్ళకి మన ఆంద్రాభాష అర్ధం‌ కాదు అందుకని ఫ్రెండ్స్‌తో వాళ్ళభాషలోనే‌ మాట్లాడుతాను అని చెప్పింది.

అలా చిన్నప్పటినుండి,  హైదరాబాదీ అమ్మాయే అరుణ. అందుకని ఇదం‌ బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్లు మాతో ఆంద్రా యాసలోనూ ఇతరత్రా అవసరమైనప్పుడు తెలంగాణా యాసలోనూ ధారాళంగా మాట్లాడుతుంది.

ఇదిగో ఇప్పుడు తెలంగాణా బాణీ  మాండలికం పాటలూ పాడుతోంది. పాడటమే‌ కాదు వ్రాసి మరీ పాడుతోంది.

ఈ పాటను తను పది నిముషాల్లో వ్రాసిందట.

 


29, నవంబర్ 2020, ఆదివారం

తపమెరుగ

తపమెఱుగ జపమెఱుగ తండ్రీ  యేమెఱుగ

నిపుడు నన్నుధ్ధరించు నితరు లెవరి నెఱుగ


ఎఱుక లేక చెడినట్టి వెన్ని జన్మలగు గాక

ఎఱుకలే కుంటినని యిపుడు తెలిసి కొంటిరా

ఎఱుక గల వారి జాడ లెరిగించుము రామయ్య

ఎఱుక లేని నాపైన నించుక దయ చూపవయ్య


వేదములు నేర్వలేదు విదుల శుశ్రూష లేదు

వేదాంతము నేర్వలేదు విన్నాణ మసలులేదు

బూదిపాలైన చాల పుట్టువుల తీరట్టిది

వేదన కలిగేను రామ వేగ దయచూపవయ్య


నిన్ను గూర్చి వినుచుంటి నీవు దయాశాలివట

నన్ను బోలు పామరుల నవ్వుచు రక్షింతువట

నిన్ను చేరి కొలుచు నేను డెన్నడును చెడిపోడట

నన్ను కటాక్షించవయ్య నా తండ్రీ రామయ్య


తాను వలచినది రంభ

తాను వలచినది రంభ తాను మునిగినది గంగ
తాను వేసినది చిందు ధరను పామరునకు

తన జనకుడు శ్రీరాముడు తన గురువు శ్రీరాముడు
తన చుట్టము శ్రీరాముడు తన నెయ్యము శ్రీరాముడు
తన సంపద శ్రీరాముడు తన సర్వము శ్రీరాముడు
తన దైవము శ్రీరాముడు తలప రామభక్తునకు

రాము డిచ్చినది తనువు రాము డిచ్చినది మనసు
రాము డిచ్చినది గుణము రాము డిచ్చినది ధనము
రాము డిచ్చినది మెతుకు రాము డిచ్చినది బ్రతుకు
రాము డిచ్చినది హాయి రామభక్తిపరునకు

తాను పలుకు రామునితో తాను కులుకు రామునితో‌
తాను కుడుచు రామునితో తాను నడచు రామునితో
తాను తిరుగు రామునితో తాను కెరలు రామునితో
తాను చెలగు రామునితో‌ తలప రాముని భక్తుడు

28, నవంబర్ 2020, శనివారం

కాల మిట్టిదనుచు

 కాల మిట్టిదనుచు చెప్పజాల రెవ్వరూ మీ

రాలసింతు రేల హరి నాశ్రయించగ


నేడు రేపు భోగముల వేడుకగా ననుభవించి

వేడుదును పిమ్మట శ్రీవిభుని నే ననగరాదు 

నేడో రేపో యముడు రాడని యనలేముగా

వాడు వచ్చులోన హరిని వేడవలయును


కళ్ళముందు కాలు డొరుల కబళించుట గనుచును

ఎల్లకాల ముండ ననెడు నెరుక గలుగు దెవరికిని

కల్లబ్రతుకు చెదరులోన నిల్లు విడచి కదలు నొడలు

చల్లబడెడు లోన మీరు జానకీశు వేడవలెను


కాలకాలుడైన నీలకంఠు డెపుడు జపియించు

కాలాత్మకుడైన హరి ఘననామసహస్రిలో

చాల పేరుగొన్ప రామచంద్రుని నామమును మీరు

కాలవశులు కాకమున్నె మేలుగా జపించవలెను


రామా నిన్ను నమ్మితిని

రామా నిన్ను నమ్మితిని నామనసు నిచ్చితిని

కామితము నీపాదకమలసేవ యంటిని


సుజనులతో చేరుటయే సుగుణమని తెలిసితిని

కుజనులతో వాదములు కూడవని విడచితిని

స్వజను లనగ నీదు భక్తజను లనుచు నెరిగితిని

నిజభక్తుల భవముక్తుల నీవు చేయు టెరిగితిని


నా కన్నియు నీవనుచు నమ్మి నిన్ను కొలిచితిని

లోకు లాడు నిందలకు శోకించక నిలచితిని

శ్రీకరమౌ నీరూపమె చిత్తములో నిలిపితిని 

చేకొని నిజ భక్తుల రక్షింతువని తెలిసితిని


ఎన్నో జన్మము లెత్తితి నేనెన్నెన్నో చూచితిని

ఎన్నో చోట్ల తిరిగితి నే నెందరినో చూచితిని

ఎన్ని చిక్కులైనను నిన్నెపుడు మరువకుంటిని

నన్ను నీవు విడువవని నమ్ముకొని యుంటిని


27, నవంబర్ 2020, శుక్రవారం

హౌస్ క్లీనింగ్

అందరమూ ఇల్లు సర్దుకోవటం లేదా హౌస్ క్లీనింగ్ అనే పనిని ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాం.

కొందరైతే ఈపనిని చాలా శ్రధ్ధగా చేస్తారు.

మరికొందరైతే ఈపనిని శ్రధ్ధగానే కాదు, చాలా తరచుగానూ ప్రణాళికాబధ్ధంగానూ చేస్తూ ఉంటారు. నాబోటి గాళ్ళు అనేకమందైతే ఇంక తప్పని సరి ఐతే చచ్చినట్లు చేస్తారు.

ఈ ఇల్లు సర్దుకోవటం అంటె కేవలం, ప్రహ్లాదుడు చెప్పినట్లు "ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలన్" అన్నట్లుడే నివాసగృహం‌ అనబడే దానికి మాత్రమే పరిమితం కాదు. అబ్బో‌ ఇంకా చాలా వాటికి కూడా భేషుగ్గా వర్తిస్తుంది.

ఒకప్పుడు ఆఫీసులో నాచేతిలో ఒకసారి అనేక ప్రాజెక్టులు ఉండి ఉక్కిరిబిక్కిరిగా ఉన్న పరిస్థితిలో ఒక రోజున మా బాస్ నా సీట్ దగ్గరకు వచ్చి "కొంచెం తీరిక చేసుకొని నీ‌ టేబుల్ కాస్త నీట్‌గా సర్దుకోవయ్యా" అని సలహా ఇచ్చి చక్కాపోయాడు. ఆ టేబుల్ అంత ఘోరమైన అరణ్యంలా ఉంది మరి!

పనిలో‌పనిగా టేబుల్ పైన ఉన్నవే‌ కాక దాని అరల్లో ఉన్న కాగితాలూ‌ కలాలూ వగైరా మొత్తం సామాను బయటకు ఈడ్చి సర్దటం‌ మొదలు పెడితే ఆ పని ఒక రోజంతా పట్టేసింది. చివరకు నాదగ్గర ఉన్న దానిలో చెత్తను పాడేస్తే పదిశాతం కూడా పనికివచ్చేవి లేవు కదా అని తేలింది.

మన యిళ్ళల్లోనూ‌ అంతే కదా తరచుగా. ఇప్పుడు మాయింట్లో ఉన్న చెత్తను కూడా ఊడ్చి పారేసే చూస్తే తొంభైశాతం బయటకు నడిచిందని తేలుతుంది. మీయింట్లో సంగతి యేమో కాని మా యింట్లో చెత్త లేదని బడాయికి పోకండి. అలా అంటే దానర్ధం మీఇంట్లో ఏమేం‌ ఉన్నాయో అన్నది మీకు బొత్తిగా తెలియదని. కొత్తగా పెళ్ళై ఇంకా ఇంటికి కావలసినవి ఏర్పాటుచేసుకుంటున్న వారిని మినహాయిస్తే అందరిళ్ళల్లోనూ 80-20 రూల్ అప్లై అవుతుంది. ఈ  80-20 రూల్ ప్రకారం అన్ని సందర్భాల్లో 80 శాతం పొల్లు అని. మీకు వందమంది ఫ్రెండ్స్ ఉంటే అందులో  20 మంది మాత్రమే అక్కరకు వచ్చేవారు. మీరు ఒక ప్రోగ్రాం వ్రాస్తే అందులో ఏ సమయంలో ఐనా ఇరవై శాతం‌ మాత్రమే చురుగ్గా ఉండే కోడ్. ఏదేశంలో ఐనా సరే 80శాతం సంపద 20శాతం మంది చేతుల్లో ఉంటుంది. ఇదంతా Pareto రూల్ అంటారు. మీరూ ఇలాంటివి బోలెడు ఊహించుకోవచ్చును. ఆకాశమే హద్దు.

అమెరికాలో కొన్నాళ్ళు శాన్‌ఫ్రాన్సిస్కో ఈష్ట్‌బే ఏరియాలో అలమీడాలో ఉన్నాను. అబ్బే ఎంతో‌ కాలం లేనండీ ఆర్నెల్లంటే అర్నెల్లేను. అక్కడ నాకు రాజేంద్ర అని ఒక స్నేహితుడు దొరికాడు. ఆయన ఒకరోజున ఉదయం టీ టైమ్‌లో అనుకుంటాను నలుగురి మధ్యలో ఒకరిని ఉద్దేశించి ఒకమాట అన్నాడు. అది ఇప్పటికీ‌ భలే గుర్తు. "అందరూ ఇక్కడకి ఇండియా నుండి రెండేసి సూట్‌కేసులతో  వచ్చినవాళ్ళే. సరిగ్గా రెండేళ్ళు గడిచేసరికి ప్రతివాడి కొంపలోనూ‌ రెండు ట్రక్కుల సామాను పైనే ఉంటుంది. అందులో ముప్పాతికశాతం వేష్ట్ పర్చేజెస్. ఏం చేస్తున్నారయ్యా మీరు, కనిపించిన దల్లా కొనెయ్యటమేనా? మీ‌దగ్గర ఉన్న సామానుల్లో ఎనభై శాతం కేవలం  మీకు అవసరం లేని చెత్తే"

జంతికల గొట్టం లేదని ఒకటి కొంటాం. కొన్నాళ్ళకు మరేదో వస్తువు కోసం వెదుకుతుంటే అప్పుడు ఈ‌ జంతికల గొట్టంతో పాటు మరొక జంతికల గొట్టం కూడా కనిపిస్తుంది. అరె అనుకుంటాం. జాగ్రత్తగా రెండూ ఒకచోట పెడతాం. తమాషా ఏమిటంటే జంతికలు చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ రెండు గొట్టాలూ కూడా పత్తా ఉండవు. వెదికి విసుగొచ్చి పక్కింటి పిన్నిగారిది అరువు తేవటమే. ప్రక్కింటి పిన్నిగారు ఇవ్వనంటే, ఒళ్ళుమండి పిల్లాణ్ణి బజారుకు తోలి మరొకొటి తెప్పించటమే.

అసలు ఈజంతికల గొట్టాలో మరొకటో ఎందుకు కనిపించవూ‌ అంటే ఇంటినిండా సామాను ఎక్కువై పోతే వాటి మధ్యలో ఎక్కడో ఇరుక్కుని కనిపించవు అన్నమాట.

రాజేంద్ర ఒక సలహా ఇచ్చాడు. ఏదన్నా కొనాలీ అంటే అది కచ్చితంగా మనకి అవసరమా? అది మనకి ఇప్పుడే బాగా అవసరమా? అన్న ప్రశ్నలు వేసుకోవాలట. ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుందిలే అని ఏదీ కొనకూడదు అని ఆయన గట్టిగా హెచ్చరించాడు అందరినీ.

తరువాత ఇల్లు సర్ధుకుందాం వీలు చూసుకొని అని అందరూ ఎప్పుడో ఒకప్పుడు అనుకొనే ఉంటారు. ఇప్పుడు కూడా చదువరుల్లో ఆముక్క ఈరోజునో నిన్ననో అనుకున్న వాళ్ళూ తప్పక ఉండే ఉంటారు. అయ్యా ఆ వీలు అన్నది జన్మలో దొరకదు. గ్యారంటీ. మీరేమో ఆ వీలు కోసం ఎదురుచూస్తూ ఉండగానే ఏదో ఒకవస్తువును ఇంట్లో వెదకి పట్టుకోవటం అత్యవసరం ఐపోయి నానా గోలా అవుతుంది. ఇది కూడా గ్యారంటీ. తప్పనిసరై ఇల్లుపీకి పందిరి వేస్తారు. అంతకంటే ఇంట్లో అనవసరమైన సామాను చేర్చకుండా ఉండటమూ, తరచూ ఉన్నసామాగ్రిని పొందికగా సర్దుకోవటమూ చేస్తూ ఉంటే ఇల్లూ‌ శుభ్రంగా ఉంటుంది. అత్యవసరం వెదుకులాటలూ తప్పుతాయి. ఓస్ ఈమాత్రం నాకు తెలుసు అంటారు. తప్పకుండా అంటారు మీరు. కానీ మీరూ నేనూ అందరమూ తెలిసితెలిసే ఇళ్ళను గోడౌనుల్లా ఉంచుకుంటున్నాం కదా. అనుమానం ఉంటే ఒక్కసారి మీ యింటిలో అన్ని గదుల్లోనూ పరిస్థితి ఎలా ఉందీ అన్నది బేరీజు వేస్తూ పరిశీలించి రండి. అప్పుడు చెప్పండి నామాట ఎంతవరకూ సత్యమో.

ఇల్లు సర్ధుకోవటం అవసరం అని ఇంకా నొక్కి వక్కాణించనక్కర లేదు. కాని ఈ‌యిల్లు సర్దటం అన్నది మాత్రం ఒక మహాయజ్ఞం. ఒకపట్టాన తెమలదు.

అన్నింటికంటే తేలికైన పని ఏదీ అంటే ధర్మరాజుగారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఇతరులకు సలహాలు ఇవ్వటం అట. అవును కదా. అందుకని నేను మీకు కొన్ని విలువైన సలహాలు ఇస్తాను.

మొదటిది. ఖరీదైన వస్తువులు. వీటిని కొని వాటి బిల్లులూ, వారెంటీ‌ కాగితాలూ మాన్యువల్స్ వంటివి ఒక పద్దతిలో దాచిపెట్టరు. ఇది గొప్పగొప్ప చిక్కులను సృష్టిస్తుంది. అవసరమైనప్పుడు కంపెనీవాడు మిమ్మల్ని కాగితాలు అడుగుతాడు. ఎంతవెదికినా అవి మీకు దొరకవు! అందుచేత ప్రతి ఖరీదైన వస్తువు తాలూకు ముఖ్యమైన కాగితాలూ ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో ఉంచి అలాంటి కవర్లనీ ఒక ఒక జిప్ ఫోల్డర్ వంటి దానిలో ఉంచాలి.

రెండవది. రకరకాల సర్టిఫికేట్లు, నగానట్రాకొన్న రసీదులు, ఆస్తుల దస్తావేజులు. వీటినీ పైవిధంగానే చేయాలి.

మూడవది. చిన్నచిన్న విలువైన వస్తువులు. అది మీ నాన్నగారి వాచీ‌ కావచ్చు, మీ అత్తగారు పెట్టిన, ఇప్పుడు మీ వేలికి పట్టని , ఉంగరం కావచ్చు. ఇలాంటి వన్నీ చిన్నచిన్న పెట్టెల్లో దాస్తారు లెండి తెలుసు. కాని ఏది ఏపెట్టెలో? ఇలాంటి వివరాలను ఒక నోట్ పుస్తకంలో రికార్డు చేసుకొని అది వారెంటీ పేపర్లూ వగైరా దాచే సంచీలో ఉంచండి.

మీరు ఎవరికైనా అప్పున్నా, మీకు ఎవరైనా అప్పున్నా అటువంటి వ్యవహారాలు కూడా అలాంటి రికార్డులో ఉండాలి.

ఇలాంటి సూత్రాలూ గట్రా మీరే తయారు చేసుకోవచ్చును. కాని చిక్కల్లా నిష్టగా పాటించటం దగ్గరే.

ఈ సర్దుకోవటం అన్నది ఇంటికే‌ కాదు అనేక చోట్ల అవసరం అని చెప్పాను కదా. అలాంటి అవసరాలు కొన్ని చూదాం.

మీ‌ దగ్గర బోలెడు పుస్తకాలుంటాయి. ఒక్కోసారి అందులో మీకు అనవసరం అనిపించేవీ‌ ఉంటాయి. మీరు గమనించరు అంతే. నా దగ్గర అలాంటివి చాలానే ఉన్నాయి. అమెరికాలో నా ఫ్రెండ్ ఒకతనికి టీ షర్టుల పిచ్చి. ఎన్నో‌ కొంటూ‌ ఉండే వాడు. ఒకసారి ఒక తమాషా విషయం చెప్పాడు. లివర్ మూర్ వెళ్ళి అక్కడ ఒక టీ షర్టు కొన్నాడు, ఏదో ఫాక్టరీ ఔట్‌లెట్ దగ్గర. మర్నాడు ఎందుకో అనుమానం వచ్చి వెదికితే మెర్విన్ వాడి దగ్గర కొన్న మరొక టీషర్ట్ బయటపడింది. అదే‌ డిజైన్ అనే కాదు అదే‌ షర్ట్ మరొక కాపీ. మెర్విన్ వాడి స్టిక్కర్ ఇంకా దాని మీదే ఉంది $17 అని. ఇప్పుడు అరవై మైళ్ళ దూరం పోయి తెచ్చుకున్నది చవగ్గా కేవలం $40 ధరకే. ఫన్నీగా లేదూ. అతను మాత్రం కొంచెం విచారంగా నాట్ సో ఫన్నీ అన్నాడనుకోండి. ఇలా ఎందుకు జరిగిందీ అంటే కొని పాడేసి ఎప్పుడొ బుధ్ధిపుట్టినపుడు వేసుకొనే అలవాటు వలన ఎన్నో‌ పోగులు పడ్డాయి. చెత్త పేరుకుపోయి స్పష్టత లేక శృంగభంగం అయింది. ఇది అతడి ఉద్దేశమే నాది కాదు!

అమ్మాయిలూ‌ తక్కువ కాదు ఈవిషయంలో . అమ్మాయిల హేండ్ బ్యాగుల్లో ఏముంటాయి? అన్నీ‌ పనికి వచ్చేవేనా? నాకు లలితా శ్రీనివాసన్ అని ఒక ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఎందుకో ఒకనాడు ఒక పిన్నీసు అవసరం పడింది. పిన్నీసు కదా అని లలిత డెస్క్ దగ్గరకు వెళ్ళి నీదగ్గర ఒక పిన్నీసు ఉంటే ఇవ్వవా అని అడిగాను. అమె తన హేండ్ బ్యాగ్ తెరిచి ఒక పెద్ద చైన్ అఫ్ పిన్నీసులు తీసింది. ఆ తోరణంలో ఒక ఒక యాభై ఉంటాయి. ఇంత పెద్ద దండ ఎందుకూ అన్నాను. నవ్వుతూ బ్యాగ్ లోనుండి మరొక దండ తీసింది అందులో నూటయాభై పైన ఉంటాయి. ఓర్నాయనో అనుకున్నాను. ఇలాగని సూర్యప్రభ గారు అనే‌ మరొక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడతో‌ చెప్తే, ఆవిడ కసురుకుంది. అమ్మాయి హేండ్ బ్యాగ్ అంటే మినీప్రపంచం తెలుసా పో అంది. అలా అని ఊరుకుందా, ఆవిడ తన హేండ్ బ్యాగ్ నా ముందు బోర్లించింది టేబుల్ మీద. అప్పుడు  అందులోంచి ఒక కీ బయటపడి అవిణ్ణే అశ్చర్యానికి గురిచేసింది. దానికోసం మొన్ననే వెదుక్కుందిట ఆవిడ.  మరి అలాగని అమ్మాయిలు తమ హేండ్ బ్యాగులు ఎప్పుడన్నా సర్దుకుంటూ ఉంటారా అంటే ఏమో‌ తెలియదు.

మీ దగ్గర కంప్యూటరు ఉంది. లేదా కనీసం మొబైల్ ఉంది. అదీ నానా గడ్డీ గాదంతో‌ నిండిపోయి గోల అవటం చూస్తూనే ఉన్నాం కదా. ఈ‌వాట్సాప్ పుణ్యమా అని ఈ‌నిండిపోవటం దారుణమైన వేగంతో‌ జరుగుతుంది తరచుగా. అన్నట్లు వాట్సాప్ వాడు వారం తరువాత హుష్ కాకీ అని కొత్త ఫీచర్ ఇచ్చి నిన్ననే పుణ్య‌ం కట్టుకున్నాడు.

మీ దగ్గర వందల వాట్సాప్ కాంటాక్ట్ లిష్ట్ ఉంది కదా. అది ఎప్పుడన్నా క్లీన్ చేసారా? ఎనభై శాతం‌ పైచిలుకు చెత్తే‌ అక్కడ చూసుకోండి! అసలు మీ ఫోన్ కాంటక్ట్స్ లిష్ట్ ఒకమాటు పరిశీలించండి బోలెడు మంది అక్కడ అనవసరంగా ఉన్నారని తెలుస్తుంది.

మీ కొక బ్లాగు ఉంది. లేదా బోలెడు బ్లాగులున్నాయి. కాని ప్రతిబ్లాగులోనూ కాలంచెల్లిన టపాలూ, ఇప్పుడొకసారి చదివి చూసుకొంటే అనవసరంగా వేసాం అనిపించే టపాలూ,  అసమగ్రంగా ఉన్నాయని ఇప్పుడనిపించే టపాలూ, మనకే ఇప్పుడు నచ్చని టపాలూ వగైరా బోలెడు చెత్త టపాలు కనిపిస్తాయి. అందులో‌ కొన్ని ఫక్తు అయోమయం టపాలూ ఉంటాయి చూసుకోండి. అవన్నీ ఎప్పుడు క్లీన్ చేస్తారూ? ఎన్ని టపాలు వేసాం అన్నది ముఖ్యం అన్న స్థితిని మీరు దాటిపోయి ఉంటే మీరు తప్పకుండా వాసిగల టపాలు ఎన్ని అని ఆలోచించుకొన వలసిన సమయం వచ్చే ఉంటుందని గమనించండి. ఇలా బ్లాగ్ క్లీనింగూ ఒక హౌస్ క్లీనింగే. చాలా ముఖ్యమైన క్లీనింగ్ కూడా.

బ్లాగు అనే‌ కాదండి. మనిషి బుఱ్ఱ ఆనేదీ చెత్తతో నిండిపోతూ ఉంటుంది తరచుగా. చెత్త అభిప్రాయాలూ, చెత్త నిర్ణయాలూ, చెత్తఆలోచనలూ, చెత్తవిషయాలూ, చెత్తసమాచారమూ, చెత్తలెక్కలూ వంటివి బోలెడు మన బుఱ్ఱల్లో నిండిపోయి గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ ఆత్మావలోకనం చేసుకుంటూ చెత్తను వదలించుకుంటూ 'అలా ముందుకు పోవాలి' లేదా చెత్తబ్రతుకు ఐపోతుంది. చెత్తవదిలించుకోవటం అంటే‌ అది మూడు విభాగాలుగా ఉంటుంది. 'మూల కారణం బెవ్వడు' అంటూ ప్రతిచెత్తకూ మూలాల్ని గ్రహించి వాటిని దూరం‌ పెట్టాలి. చెత్తను సరే‌ ఎలాగూ వదిలించుకోవాలి. మూడవది ఆ చెత్తయొక్క మూల కారణం మనకు దగ్గర కావటానికి కల మన బలహీనతలూ పొరపాట్లూ ఏమిటో గ్రహించి వాటినీ‌ నిగ్రహించాలి. అప్పుడు మనం సరిగ్గా ముందుకు పోగలం.


ఈ సోదంతా ఎందుకు వ్రాసానూ అంటే‌ నాకే‌ సమాధానం తెలియదు. కాని వ్రాయాలని అనిపించింది. వ్రాసాను. ఎవరికైనా ఈ వ్యాసం వలన ఉపయోగం ఉంటే మంచిది. నా వరకు నాకు ఈ‌ఆలోచన ఇక్కడ ఉంచటానికి ఉన్న కారణం ఈబ్లాగులో కూడా చెత్తను తీసివేయటం అనే కార్యక్రమం అవసరం అని నా భావనగా చెప్పటం. చదువరులు తమతమ బ్లాగుల్లో చెత్తను వదల్చుకోవటం‌ మానటం తమయిష్టం. కొందరైతే చెత్తను పేర్చటమే‌ ఏకైక కార్యక్రమంగా తమ బ్లాగుల్ని నడిపిస్తున్నారనుకోండి. వాళ్ళెవరని అడక్కండి. మీకూ‌ తెలుసు నాకూ తెలుసు సమాధానం.

చెత్తను వదల్చటం అంటే చెత్త మెటీరియల్ అనే‌ కాదు, చెత్తగా అనిపించిన లేదా చెత్తగా తయారైన విధానాలను కూడా వదల్చుకోవటం అన్న నా భావన చదువరులు అర్ధంచేసుకోగలరు. నాకా నమ్మకం ఉంది. నా బ్లాగులో చెత్తను ఎత్తివేయటం‌ మొదలు పెడుతున్నాను. చెత్తవిధానాలూ కొన్ని మార్చుతున్నాను. వాటి గురించి త్వరలోనే‌ మరొక లఘువ్యాసంలో చెప్తాను.
 
 

26, నవంబర్ 2020, గురువారం

తప్పులే మాయందు

తప్పులే మాయందు తరచు కదప్పా మా

అప్పా రామప్పా ఓ ఒప్పులకుప్పా


కటకటపడ నించుక కారణమున్న

దిటవుచెడి నీదయలే దేబిరించేము

చిటికెడంత సుఖభావన చేకూరినచో

చటుకున నిను మరచి సంచరింతుము


తలగాచు నీవు మా దాపున నున్న

కలిసిరాని చుట్టాలకు కాళ్ళుపట్టేము

అలుగని నీదయలతో ఆపద కడచి

సులువుగ నిను మరచి మెలగుచుందుము


వెన్నుడ ఓ దేవుడా వివర మెరిగియు

మున్నెరుగని దేవుళ్ళకు మ్రొక్కుచుందుము

ఎన్ని తప్పు లున్న గాని ఎంతో దయతో

మన్నింతు వని మేము మరువకుందుము

గోంగూర పచ్చడి లేక..

గోంగూర పచ్చడి లేక గొప్ప విందు కాదు

శృంగార మన్నది లేక జీవితమే కాదు


హరిశాస్రము కాదా అది చదువే కాదు

‌హరిభక్తులు లేరా అది సభయే కాదు

హరిసేవకు పోదా అది తనువే కాదు

హరిప్రసాదము కాదా అన్నమే కాదు


హరేరామ యనదా యది నోరే కాదు

హరిభక్తులు లేరా అది యూరే కాదు

హరితీర్ధము కాదా అది సేవ్యమె కాదు

హరి భజనము లేని సభ కందమే లేదు


రామజపము లేక దినము రమ్యమే కాదు

రామకీర్తన లేని భజన రమ్యమే కాదు

రామస్మరణ లేని బ్రతుకు రమ్యమే కాదు

రామకోవెల లేని యూరు రమ్యమే కాదు


పందెం చెప్పమంటే

పందెం చెప్పమంటే నీవు పలుకవేమయ్యా ఓ

అందగాడ నాతో ఆట అంత కఠినమా


అందగాడ నేనోడితే పందె మేమంటే నే

నెందు బోక నీసేవలే యెపుడు చేసెదను నీ

కెందును లోటు రానీయక యేమరకుందును ఆ

నందముగా నాలో నిలిపి ఆరాధించెదను


అందగాడ నీవోడితే పందె మేమయ్యా నరు

లందరితో కలియ మరల నరుడవయ్యేవో నీకు

చెందిన ఐశ్వర్యమునే నా చేతికిచ్చేవో ఆ

నందముగా సెలవీవయ్య పందె మేమిటో


అందగాడ నీకపజయ మన్నదున్నదా నీ

పందెమేమి పందెమేమి పావనగుణధామ ఏ

పందెమైన గెలుపు నీదే పట్టాభిరామ ఆ

నందముగా నన్నోడించు నాస్వామి రామ


24, నవంబర్ 2020, మంగళవారం

అసంభావితాలు?


ఈ జిలేబి గారికి బహుసరదా ఐన వ్యాపకాల్లో రెండవది తన బ్లాగులో తానే పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యలు వ్రాసుకోవటం. మొదటి వ్యాపకం గురించి అందరికీ తెలిసిందే ఎక్కడపడితే అక్కడ కందాలను పోలినవి వ్రాస్తూ వీలైన చోట్ల పుల్లలు పెడుతున్నట్లు హడావుడి చేస్తూ ఇల్లేరమ్మలాగా బ్లాగ్లోకం అంతా కలయదిరుగుతూ ఉండటం.

ఆవిడ తన ద్వంద్వం అన్న టపా క్రింద తానే వ్రాసిన ఒక వాఖ్యలో  ఇలా అన్నారు.

ఇందులో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి ? :)
చిలుకలు, సింహముల్, కరులు చెన్నుగ చక్కెర బొమ్మలాయె నా
వెలుతురు బోవ గుట్టుగ ప్రవేశము చేయుచు కూక లేకనా
యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్,
పిలిచె జిలేబి యయ్యరును భీతిని చెందుచు వంటయింటిలోన్!

ఇక్కడ విన్నకోట నరసింహా రావు గారు అసంభావితాలు అంటే ఏమిటా అని సందేహం వెలిబుచ్చారు. దానికి జిలేబీ‌  గారు వినరా వారూ మీరు తెలుగువారేనా ? అసంభావితాలు అన్న పదం తెలీక పోవడమేమిటండీ  అని హాశ్చర్యం వెలిబుచ్చారు. మరి "ఆంధ్రభారతి" వారు కూడా అటువంటి పదమేమీ లేదు పొమ్మన్నారు అని విన్నకోట నరసింహా రావు గారు మరలా విన్నవించుకొన్నారు. మరి జిలేబీ గారు ఉలకరు పలకరు. చిత్రం.జిలేబీకీ సైలెన్స్ అన్నమాటకీ చుక్కెదురు కదా.

అవునూ? ఈ అసంభావితాలు అంటే ఏమిటీ‌?

ఈ సందేహం మీకూ వచ్చిందా?

ఐతే చదవండి.

ముందు ఒక పదం భావితం అన్నదానిని గురించి తెలుసుకోవాలి. భావితం అన్నది భావితము అనే మాటకు కొంచెం క్లుప్తరూపం. 

భావన అన్న మాట గురించి తెలుసును కదా. ఆలోచన అని దానికి అర్ధం అని కూడ తెలుసును కదా.  అలాగే ఇంచుక్ ప్రత్యయం చేర్చితే ఈ‌ భావన అన్న మాటకు మనకు భావించు అన్న మాట వస్తున్నదనీ తెలుసును కదా. ఇప్పుడు ఈ‌భావించు అన్న మాట గురించి కూడా సాధారణంగా వాడబడే‌మాట కాబట్టి దాని గురించి కూడా తెలుసును కదా. "భావన చేయు" అన్న అర్ధంతో భావించు అన్న మాటను వినియోగిస్తారని అందరూ సులభంగానే గ్రహిస్తారు కాబట్టి ఇక్కడ ఎవరికీ ఏ యిబ్బందీ లేదు కదా.

ఇప్పుడు ఆ భావితము అన్న మాట భావన అన్న మాట నుండి ఏర్పడింది అని సులువుగానే తెలుస్తుంది తెలుగులోకానికి. భావింంచ బడినది భావితము. మనం ఏదైనా వస్తువును గురించి కాని విషయాన్ని గురించి కాని భావిస్తూ ఉంటే, అదేనండీ భావన చేస్తూ ఉంటే ఆ వస్తువో భావనో ఇక్కడ భావితము అన్నమాట. మీరు ఆఫీసు పని చేస్తూనో ఆరో తరగతి పుస్తకం చదువుతూనో పులుసటుకుల్ని గురించి మనస్సులో ఆలోచిస్తున్నారనుకోండి. అప్పుడు ఆ భావితము ఐనది పులుసు అటులుకు అన్నమాట. అన్నమాట కేం‌ లెండి, ఉన్నమాటే.

మీరెప్పుడైనా సంభావన అన్న మాట విన్నారా? వినే ఉంటారు లెండి. ఈ‌సంభావన అన్న మాటకు రెండు అర్ధాలున్నాయి. గౌరవపూర్వకంగా అందిచేది, మనస్సులో చక్కగా తలచుకొనేది అని. నిజానికి మొదట చెప్పిన గౌరవపూర్వకంగా అందించేది అన్న అర్ధం కూడా మనస్సులో చక్కగా ఇష్టపూర్వకంగా తలంచుకొని ఇస్తున్నది అన్న భావన నుండే ఏర్పడిన అర్ధం. కాబట్టి సంభావన అంటే మనస్సులో చక్కగా భావించటం. మనస్సులో భావించటం అన్న అర్ధంలో భావన అంటే సం అన్న ఉపసర్గను ముందు చేర్చి  సం+భావన => సంభావన అనటం ఎందుకంటే ఆ తలంచుకోవటం అన్నది ఎంతో‌ ప్రీతితో చేయటం అని నొక్కి చెప్పటానికి తప్ప మరేమీ‌ లేదు.

 ఏమాటకామాట చెప్పుకోవాలి సంభావన ఇస్తున్నారు అంటే లెక్కప్రకారం ఎంతో‌ ప్రీతితో‌ అదరించి ఏదన్నా ఇస్తున్నారు అని సుళువుగానే అందరికీ‌ బోధపడుతూ‌నే ఉన్నా అన్ని సందర్భాల్లోనూ అది పైపైపలుకే. ఇప్పుడు అలా అంటే మనవాళ్ళకి అర్ధం అవుతూ‌ ఉండవచ్చును కాని పూర్వమూ అంతేనూ అంటేనే గొప్ప హాశ్చర్యం‌ కలుగుతుంది.

ఒకప్పుడు అడిదం సూరకవి గారు ఎవరింటికో పనిబడి వెళ్ళారట. సరిగ్గా ఆనాడు అక్కడ ఆ గృహస్థు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడు. ఎందరో వచ్చారు అక్కడికి సంభావనల కోసం. ఏం చేస్తారు చెప్పండి. ఈ బ్రాహ్మలంతే. నన్నయ్యే అనేశాడు కదా ఆదిపర్వంలో "వసువులు వసుహీనవిప్రులక్రియ  పరగి దక్షిణాశ్రితులైరి" అని. ఈ‌ముక్కలో భలే‌సొగసుగా రెండర్ధాలు వస్తాయి దక్షిణాశ్రితులైరి అన్నప్పుడు. వసువులు దక్షిణదిక్కుగా పారిపోయారని చెప్పటం ఒకటి ఐతే మరొక ఆ పారిపోవటాన్ని డబ్బులేని బ్రాహ్మలు దక్షిణలను ఆశ్రయించి నట్లు అని అనటం. ఏం చేస్తారు గతిలేని వారు, ఎవరో ఇంత సంభావన అని చెప్పి పడేస్తే, ఆ అరకొరకే ఆనందపడి వారిని ఆశీర్వదించి పోవటం తప్ప. సరే ఆ గృహస్థు ఇంటికి అలా దక్షిణలకోసం బోలెడు మంది వచ్చారు. గుమ్మందగ్గర కొందరు వీళ్ళని చూసుకొందుకు ప్రత్యేకంగా ఉన్నారట. అబ్బెబ్బే‌ వాళ్ళు దక్షిణలు ఇచ్చి పంపటానికి కాదండి. సెలెబ్రిటీ బ్రాహ్మల్ని తిన్నగా లోపలికీ, మిగిలిన జనాభాని దొడ్డిలోనికి పంపించటానికి. కార్యక్రమంలో సెలెబ్రిటీలకు దక్షిణలు ఇచ్చి ఆశీర్వాదాలూ పద్యపంచరత్న స్తుతులూ వగైరా అందుకొన్నాక గృహస్థు ఆనవాయితీగా దొడ్డిలోనికి వచ్చాడు అక్కడ పోగైన బ్రాహ్మలకి సంభావనలు ఇవ్వటానికి. అప్పట్లో సెలెబ్రిటీకి రూపాయి సంభావన. రూపాయేనా అనకండి అది నేటి ఒక ఐదొందలైనా చేస్తుంది. దొడ్డిసంభావన లెక్క పావలా. వరసగా అందరూ వచ్చి గృహస్థు దగ్గర పావలా సంభావన పుచ్చుకొని వెళ్తున్నారు. హఠాత్తుగా గృహస్థు ముందుకు వచ్చి చేయి జాచిన ఒకాయన్ను చూసి తెల్లబోయాడు. "అయ్యయ్యో ఇదేమి చోద్యం భావగారూ మీరిక్కడ ఉన్నారేమిటీ‌ లోపలికి దయచెయ్యక" అని గడబిడపడ్డాడు. సూరకవి నవ్వేసి, ఈవేళ ప్రాప్తం ఇంతే‌ భావగారూ అన్నాడట. ఇంతకూ‌ ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం‌ అంటే, ఇలా ఇచ్చే‌ దొడ్డిసంభావన అత్యంత ప్రీతిపూర్వకం కాదు కాని ఉట్టి విధాయకం అని తెలుస్తున్నది కదా, దీన్ని బట్టి సంభావన అంటే ఇలా గూడా ఉండవచ్చునూ అని తెలుసుకుందుకు అన్నమాట.

ఇప్పుడు సంభావితము అంటే ఏమిటో మీకు చూచాయగా బోధపడి ఉంటుంది. ఏ విషయం లేదా వస్తువు మనస్సులో ప్రీతిపూర్వకంగా తలచుకోబడిందో అది సంభావితము అన్నమాట. నిజంగా అంతే. ఐతే కవులు కొంచెం‌ డాంబికంగా తమ గణాలూ‌ గట్రా బాగా కుదరటానికీ అనిచెప్పి ఉత్తుత్తినే కూడా భావితము అనటం బదులు సంభావితము అని వాడిపారేస్తూ ఉంటారు. అది మనం గమనించి సందర్భాన్ని బట్టి ఆ 'సం' అన్న ఉపసర్గని కోవలం పూరణాయాసం క్రిందో‌ బడాయి క్రిందో లెక్కగట్టి మరీ అంత పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది.

అలాగని కవులంతా ఊరకే సంభావిత అన్న మాటను భావిత అంటే సరిపోయే చోటకూడా బడాయికి వాడేస్తారని అనుకోకండి. మహాకవులు తెలిసే వాడుతారండీ. కావలిసి వస్తే మీరీ కవిబ్రహ్మ గారి పద్యం చూడండి.

ఉ. నీవును జూచి తట్టి సభనేని వినంబడ దేయుగంబులన్
భూవలయంబులో నది యపూర్వము సర్వమనోజ్ఞ మిష్టభో
గావహ మేక్రియం బడసె నయ్య మహాత్ముఁడు దాన నేమి సం
భావిత భాగ్యుఁ డయ్యెను బ్రభాకర తేజుఁడు ధర్మజుం డిలన్. 

ఎంత గడుసుగా సొగసుగా చెప్పారో చూసారా ధర్మరాజు గారి భాగ్యం గురించి? రాజసూయం తర్వాత రగిలిపోతున్న ధుర్యోధనుడు అంటున్నాడూ, ధర్మరాజు గారి భాగ్యం అక్కడికి వచ్చిన జనం అందరిచేతా సంభావితం ఐనది అని. అంటే ఆ రాజలోకమూ తదితరులూ అందరూ ఆయన భాగ్యగరిమని మనస్సులో మిక్కిలి ప్రీతితో మనస్సుల్లో తలచుకుంటున్నారని అసూయతో రగిలిపోతూ దుర్యోధనుడు 'అయన భాగ్యం సంభావితం ఐనదీ' అంటున్నాడు. అదీ‌ మహాకవి ప్రయోగం అంటే!

మరి అసంభావితము అంటే ఏమిటీ అన్న ప్రశ్న గురించి ఇప్పుడు ఆలోచించాలి. 

ఈ 'అ' అన్న ఉపసర్గను వ్యతిరేకార్థంలో వాడుతాం‌ అన్నది అందరికీ తెలిసిందే. అందుచేత సంభావితము కానిది అసంభావితము అన్న మాట.

మీరు పులుసటుకుల గురించి భావిస్తూ ఉంటే అది సంభావితము అనుకోవచ్చును. భేషుగ్గా అనుకోవచ్చును. మరి ఈ సందర్భంలో అసంభావితములు ఏమిటండీ? ఇక్కడ సంభావితము కానిది అని కదా. అంటే పులుసటుకులు కానిది అని అర్ధం. అందుబాటులో ఉన్నవో కానివో‌ కాని పులుసటుకులు కాని సవాలక్ష ఖ్యాద్యపదార్దాల్లో ప్రతిదీ అసంభావితమే అన్నమాట. 

ఏడ్చినట్లుంది. ఇది ఫలానా అని నిర్దేశించక ప్రపంచంలో నేను తలచుకొనే ఫలానాది కానిది అని డొంకతిరుగుడు ఏమిటీ అనవచ్చును మీరు. మరంతే. అదే అసంభావితము అన్న మాటకి అర్ధం.

ఒక్కసారి జిలేబీ‌ పద్యాన్ని పరిశీలనగా చదివి అర్ధం చేసుకోండి. 

 అయ్యబాబోయ్ అంటారా. నేనూ అదే అంటానండీ. 

ఊరికే‌ మాటవరసకి అర్ధం చేసుకోండి అన్నాను. అందులో జిలేబి సంభావించినవి ఏమన్నా ఉంటే మిగిలినవన్ని అసంభావితాలు అన్నమాట.

అదీ జిలేబీ "ఈ‌ పద్యంలో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి?" అనటం వెనుక ఉన్న ఆంతర్యం. మరింకేం అవుతుందీ? అంతే‌ కావాలి.

కాని ఎక్కడో తేడా కొడుతున్నదా.

మీరు సరిగానే గమనించారు. జిలేబీ గారి పద్యం (పద్యం లాంటిది!?) చదివిన తరువాత కూడా మీ బుఱ్ఱలు అమోఘంగా పనిచేస్తున్నాయంటే గట్టిబుఱ్ఱలే! అభినందనలు. 

నేనైతే అంత సాహసం చేయలేదు. ఈ వ్యాసం వ్రాయాలి కదా! బుఱ్ఱని జాగ్రతగా చూసుకోవాలి కదా!

సరే విషయంలోనికి వస్తున్నాను.

మీరెప్పుడన్నా కావ్యదోషాలు అన్న మాట విన్నారా?

మూడురకాల దోషాలను కావ్యంలో జాగ్రతగా కవులు పరిహరించాలీ అని పెద్దలు చెప్తారు. అవి అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనేవి.

అతివ్యాప్తి అంటే అక్కడొక నల్లని కాకి ఉంది అని చెప్పటం‌ లాంటిది. కాకులన్నీ నల్లగానే ఉంటాయికదా. (కోటి కొక బొల్లికాకి ఉంటే ఉండనీండి). కాకి అంటే సరిపోయే దానికి నల్లనికాకి అని చెప్పటం అనవసరం. ఇది అతివ్యాప్తి అంటారు. 

అవ్యాప్తి అంటే అరుదైన విషయాన్ని సాధారణం అన్నట్లు చెప్పటం. అక్కడ పదో పదిహేనో త్రాచుపాములున్నాయి, ఒక్కోటీ పది పది-పన్నెండు అడుగుల పొడవుంది అని చెప్పటం. త్రాచుపాము ఎక్కడన్నా అరుదుగా ఒకటి పదడుగులు ఉందంటే అది వేరే సంగతి కాని ఓ గుంపు త్రాచులు పన్నెండేసి అడుగులున్నవి ఉన్నాయని చెప్పటం బాగోదు. అలా ఎక్కడా ఉండదు. ఇటువంటివి అవ్యాప్తి.

ఇంక అసంభవం అంటే, వాడా గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ‌ గట్టిగా పట్టుకొని లొంగదీసుకున్నాడు అని చెప్పటం వంటిది. కొమ్ములుండవు గుఱ్ఱాలకి. అందుచేత గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ‌ గట్టిగా పట్టుకొని లొంగదీసుకోవటం అసంభవం.

ఇకపోతే నాదృష్టిలో మరొక మూడు కావ్యదోషాలున్నాయి. అవి అనుచితం,అసందర్భం, అసభ్యం అని. ఏదైనా సందర్భంలో  ఉచితం కాని విధంగా విషయం గురించి చెప్పటం అనుచితం ఐతే‌ సందర్భానికి అతకని విషయాన్ని చెప్పటం అసందర్భం. ఇంక అసభ్యం అంటే వేరే చెప్పలా? ఏది (పదుగురు ఉండే‌) సభలో ప్రస్తావించటం‌ నాగరికప్రవర్తన కాదో అటువంటిది పదుగురినీ చదవమని కావ్యంలో వ్రాయటం.

జరగటానికి వీలే లేని విషయాలు అసంభవాలు కదా. తన పద్యంలో అసంభవమైన విషయాలు రెండు ఉన్నాయని సూచించటానికి జిలేబీ‌ గారు "రెండు అసంభావితాలున్నాయి" అని ఉండవచ్చును అనుకుంటున్నాను. రెండు అసంభవాలు అనే అనవచ్చును కదా మరి అసంభావితాలు అనటం ఎందుకు అని మీరు అడగవచ్చును. 

బాగుండండోయ్ నన్నడుగుతారేమిటీ?

ఏమో కొంచెం‌ డాంబికంగా గంభీరంగా ఒక ముక్క వాడుదాం అని అనుకొని అలా అన్నారేమో మరి జిలేబీ‌గారు.

నాకు తెలియదు. ఆ జిలేబీ‌ గారికే తెలియాలి.

మరైతే ఈ వ్యాసం ఎందుకు వ్రాసినట్లూ.

ఎందుకంటే జిలేబీకి ఇంకే‌పనీ తోచక ఒక పద్యం. నాకేమో మరేమీ‌ తోచక ఈ వ్యాసం.

23, నవంబర్ 2020, సోమవారం

కాలమా నీ యింద్రజాలము

కాలమా నీ యింద్రజాలము నన్ను వంచ

జాలదే నేను రామస్వామి భక్తుడ 


వేయించి రకరకాల వేషాలు నాచేత

మాయదారి నటనలు చేయించి

మోయించితివి బాధల  మూటలను నాచేత

రాయిడించినది చాలు రామునిపై యాన


వేలాది యేండ్లు నన్ను పీడించినది చాలు

యేలాగునో నా కీ యినకులేశు

మేలైన కొలువు దొరికె మిగుల హాయిగ నుంటి

చాలించు నీయాటలు జానకిపతి యాన


నన్ను నే నెరిగితినే నిన్ను నే నెరిగితిని

మిన్నకుండుటే యింక  మేలు నీకు

పన్నక హరి భక్తుల పట్ట నుపాయములు

తిన్నగా నుండవె రామ దేవునిపై యాన


22, నవంబర్ 2020, ఆదివారం

ఎంతతడవి నాతప్పుల

ఎంతతడవి నాతప్పుల నేమి లాభము నీకు నే

నెంతవగచి నాతప్పుల కేమి లాభము నాకు


ధనము కొరకు వెంపర తప్పనిదగు తప్పు యీ

తనువు మీద మోహము తగనిగొప్ప తప్పు

మనికి మీద ప్రేముడి మానలేని తప్పు లోక

మునకు భయపడుటే మనిషి బతుకున తప్పు


కాముకుడై యుండుటే కడు పెద్దతప్పు పెద్ద

లేమి బోధించిన వినని దెంతో గొప్పతప్పు

రామనామమును విడచి బ్రతుకుట తప్పు తాను

నీ మనిషి నని మరచుట నిక్కమైన తప్పు


ఎప్పుడు నే చేయునవే యీ తప్పులు ము

న్నెప్పడో నా కలవడినవి యీ తప్పులు

తప్పులని తెలిసి కూడ తప్పని యీ తప్పులు న

న్నెప్పటికి విడుచు రామ యీ తప్పులు


తప్పులను మన్నించుము

తప్పులను మన్నించుము దశరథరామ నేను

తప్పక నీవాడ గద దశరథరామ


తప్పులెన్ని పెద్దలనే దశరథరామ నేను

తప్పులనే చేసినాను దశరథరామ

తప్పక నే దండ్యుడనే దశరథరామ యిట్టి

తప్పు లింక చేయనయ్య దశరథరామ


ధరను మనుజజాతికి దశరథరామ యిదే

తరణోపాయ మనుచు దశరథరామ  

తరచు నామస్మరణమునే దశరథరామ మరచు

తరళితాంతరంగుడను దశరథరామ


విశదయశుడ వీవయ్య దశరథరామ పాప

ప్రశమనైక నాముడవని దశరథరామ

దిశలన్నిట నీతేజము దశరథరామ నిండ

కుశలమె నీవారి కెపుడు దశరథరామ


19, నవంబర్ 2020, గురువారం

అటుతిరిగిన నిటుతిరిగిన

 అటుతిరిగిన నిటుతిరిగిన హరివారలన్నదే

స్ఫుటమైన సత్యము సుజనులార వినుడు


హరి యెడల కలిగెనా పరమప్రేమభావము

హరిని గూర్చి తలచుచుండు నన్నివేళల మనసు

హరిని గూర్చి భావించు నన్నిచోటుల మనసు

హరికన్యము వినబడదా హరికన్యము కనబడదు


హరి యెడల కలిగెనా పరమద్వేష భావము

హరిని గూర్చి తలచుచుండు నన్నివేళల మనసు

హరిని గూర్చి భావించు నన్నిచోటుల మనసు

హరికన్యము వినబడదా హరికన్యము కనబడదు


ఆహరహమును రామరామ యనుచుండెడి వారైన

అహరహమును రామునిపై నరచుచుండు వారైన

అహహా శ్రీరామచంద్రు నందు బుధ్ధి నిలుపుకొనుచు

విహరించుచు నున్నారు వేడుకతో వసుధమీద


తరచుగా నింద్రాదులు

 తరచుగా నింద్రాదులు హరిని జూడ వత్తురు

హరి దౌవారికుల నల్పు లన్నటుల జూతురు


పరమభాగవతుల మని భావించుకొనుచుందురు

పరమభాగవతుల గూడి వచ్చుచుందు మందురు

పరమభాగవతుల దౌవారికుల జయవిజయుల

పరమనిరాదరణ చేసి పలుకరించకుందురు


నిత్యము హరిసన్నిధిలో నిలచియుండు వారల

సత్యమైన భాగ్యగరిమ క్షణమైనను తలుపక

భృత్యమాత్రులే యని యీ పెద్దలు భావించుట

అత్యంతము దుస్సహమని యలిగిరి జయవిజయులు


తనవారల పరితాపము తనకే పరితాపమాయె

సనకసనందనుల వలన శాపము మిష హరిచేసె

ఘనులు జయవిజయులు రాకాసులై విక్రమించ

కనులుతెరచి వారి గొప్ప కనుగొనిరా సురవరులు


18, నవంబర్ 2020, బుధవారం

నాగులచవితి


 


 

నాగులచవితి పాటను బసవరాజు అప్పారావు గారు రచించారు. ఇది కన్యాశుల్కం సినిమాలో ఉపయోగించుకున్నారు.


ఒక ఆసక్తి కరమైన ఐతిహ్యం చెప్తాను.

 తాతల నాటి కథ.  ఒక కుటుంబానికి కులదైవంగా నాగేంద్రుడు ఉన్నాడు. దంపతులు సంతానభాగ్యం కోసం పరితపిస్తున్న రోజుల్లో ఒకనాడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది.

ఎవరో వాకిట ముందుకు వచ్చి ఆనాటి ఉదయం "భవతీ భిక్షాం దేహి" అన్నాడు.

ఇంటి ఇల్లాలు ఇన్ని తండులాలు భిక్షతీసుకొని వచ్చి వేసింది.

ఆ బిచ్చగాడు చూడటానికి ఎవరో ఒక సాధువు గారిలా ఉన్నాడు కాషాయవస్త్రాల్లో. అయన భిక్షను స్వీకరించి ఇలా అన్నాడు. "అమ్మా సంతానభాగ్యం లేదని మీరిద్దరూ చాలా విచారంలో ఉన్నారు కదా, నిజమేనా?"

"అవును స్వామీ" అన్నది ఆ గృహిణి.

"మీ ఇలవేల్పు నాగేంద్రుడు. కొన్నాళ్ళుగా అయనకు సరిగా మీ‌యింట ఆదరణ లభించటం లేదు. అందుకే మీకు సంతానం ఆలస్యం అవుతున్నది" అన్నాడు సాధువు.

"అయ్యో అలాగా స్వామీ, ఇప్పుడు మాకు ఏదన్నా దారి చూపండి" అని అమె వేడుకొన్నది.

"భయపడకండి. మీరు కావాలని అలక్ష్యం చేయలేదు. ఇకనుండి శ్రధ్ధవహించండి. నాగుల చవితి వస్తోంది. మీరిద్దరూ‌ ఉపవాసం ఉండి నాగేంద్రుణ్ణి ప్రార్ధిచండి. మీకు శుభం‌ కలుగుతుంది." ఇలా ఊరడించి ఆ సాధువు వెళ్ళి పోయాడు.

నాగులచవితి వచ్చింది. దంపతులు నిష్టగా నాగేంద్రుణ్ణి ఆరాధించి వేదుకొన్నారు.

మరలా కొన్నాళ్ళకు ఆ సాధువు మరలా ఇంటి ముందుకు వచ్చాడు.

గృహిణీ ముఖం విప్పారింది. ఆనందంగా భిక్ష వేసింది.

సాధువు ఇలా అన్నాడు. "మీ‌యందు నాగేంద్రుడు ప్రసన్నుడై ఉన్నాడు."

గృహిణి సంతోషంతో సాధువుకు నమస్కారం చేసింది. అనందంతో ఆవిడ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.

సాధువు "మరొక్క మాట అమ్మా. ఒకనాటి రాత్రి మీరు శయనించి ఉండగా నాగేంద్రుడు మీ‌పడకగదిలో ప్రత్యక్షం అవుతాడు. ఏమీ‌ భయపడకండి. మీరు నమస్కరించుకోండి. మీకంతా శుభం‌ కలుగుతుంది. మీ‌ పిల్లవాడికి నాగేంద్రుడి పేరు పెట్టుకోవాలి సుమా" అని చెప్పి వెళ్ళపోయాడు.

సాధువు గారు చెప్పినట్లే‌ జరిగింది. ఒకనాటి రాత్రి వారి శయనమందిరంలో ఆయన ఏకంగా దంపతులు యిద్దరి నడుమకు వచ్చి దర్శనం ఇచ్చాడు. 

 బుస వినిపించి. ఏదో‌ మెత్తటి స్పర్శ తగిలి ఇద్దరూ మేలుకాంచారు. మధ్యలో‌ పెద్ద పాము!

ఇద్దరూ‌ భయంతో క్రిందికి ఉరికారు. కరచరణాలు ఆడలేదు వారికి. మెల్లగా సాధువు చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకున్నారు. భయం భయంగానే నమస్కారాలు చేసారు. ఆ నాగేంద్రుడు బయటకు వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ళకు వారికి పుత్రసంతానం కలిగింది. ఆ పిల్లవాడికి సుబ్బారావు అని పేరు పెట్టుకున్నారు.

ఆసుబ్బారావు గారు మా పితామహులు.

ఆ నాటి నుండి మా యింటిలో నాగేంద్రుడు అప్పుడప్పుడు ప్రత్యక్షం కావటం వాడుకగా ఉన్నది.

 

*   *   *      *   *   *


ఒక వేసవి కాలం మధ్యాహ్నం. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. అదే‌ పడుకగది. మానాన్నగారు, అయన ప్రక్కన నేను పడుకొని నిదురపోతున్నాం భోజనానంతరం.

భోజనాలవసారాకు ఆ పడుకగది నుండి ఒక కిటికీ ఉంది. అక్కడ నిలబడి మా నాయనమ్మ గారు మెల్లగా పిలుస్తున్నారు మమ్మల్ని.

ముందు నాకు మెలకువ వచ్చింది. మా నాన్నగారిని లేపాను. మా బామ్మ గారు కిటికీ ఆవల నిలబడి "పామురా పాము" అంటూ చెప్తున్నారు.

పడుకగది తలుపులు తెరచి బయటకు వస్తున్నాం.

పడుకగది తలుపులు ఇంటి మధ్యన ఉన్న హాలులోనికి తెరచుకుంటాయి. ఆ హాలులో పైన పెద్ద అటక ఉంది. ఆ అటక ముఖగహ్వరం పడకది గుమ్మానికి ఎదురుగా పైకి ఉండి అక్కడి నుండి చక్కగా కనిపిస్తూ ఉంటుంది.

అటక మీద ముఖద్వారం దగ్గర ఒక నిట్రాటను చుట్టుకొని ఒక పెద్ద తెల్లని సర్పం మాకు దర్శనం ఇచ్చింది.

అందరం చాలా భయపడ్దాం.

చూస్తూ‌ ఉండగానే అది నిట్రాటను దిగి అటక లోపలికి వెళ్ళిపోయింది.

మానాన్నగారు పాములవాళ్ళని పిలిపించారు. వాళ్ళు మాయింటి పెరటి వైపున ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరనే ఉంటారు.  వాళ్ళు ధైర్యంగా అటక ఎక్కి గాలించారు. పాము జాడ లేదు.

అటక మీదికి కరెంటు వైర్లు పరిచి ప్రయత్నించారు. మళ్ళా మళ్ళా గాలించారు. 

అటక మీదనే‌ కాదు ఇల్లంతా బాగా గాలించారు, పెరడుతో‌ సహా.

మా నాన్నగారికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. లేకపోతే ఆయనకే తోచిందో. ఊళ్ళో ఎవరో మంత్రాలు వేసే అయన దగ్గరకు వెళ్ళి మంత్రించిన మినుములు తెచ్చారు. వారిచ్చిన సలహా మేరకు ఆ మినుముల్ని ఇంట్లో అన్ని చోట్లా చల్లాం. ఇంటి బయట పెరట్లోనూ‌ సందులోనూ‌ కూడా చల్లాం. ఇంటి సింహద్వారం ముందూ, పెరటి గుమ్మం దగ్గరా కూడా చల్లాం.

ఐనా మాకు భయంభయం‌ గానే ఉంది.

రాత్రి భోజనాలు కానిచ్చి నిదురపోతున్నాం. అర్ధరాత్రి ఏవో‌ ఘాటు సువాసనలతో‌ మెలకువ వచ్చింది అందరికీ. నిజానికి ఎవరమూ ఆదమరచి నిద్రపోవటం లేదు.

కాసేపు మల్లెపూవుల సువాసన వచ్చింది.

ఆతరువాత మొగలి పూవుల వాసన.

కొద్ది సేపటి మరొక సువాసన.

ఈ వాసనలన్నీ‌ దగ్గరలో ఉన్నట్లే వస్తున్నాయి.

లైట్లన్నీ వేసాం. అప్పటికి ఒకటి రెండు సంవత్సరాల క్రిందటనే‌ ఇంటికి కరెంటు కనెక్షన్ పెట్టించాం.

మా వీధిలో మొత్తం మూడు ఇళ్ళు. అంతే. మాది మధ్యలోని. అటూ ఇటూ‌ఉన్న ఇళ్ళూ మా జ్ఞాతులవే. కుడిప్రక్క ఇంట్లో ఉండే గోపాలం నాకు అన్నయ్య అవుతాడు. అతనూ మరి కొందరూ కర్రలు వేసుకొని వచ్చారు. ఇల్లంతా గాలించారు. పెరట్లో ఒక ఇటుకల దిబ్బ ఉంది. పాము అందులో కాని దూరిందేమో అని వాళ్ళు అనుమానించారు.

ఎలాగో రాత్రి గడిచింది.

ఉదయం మానాన్న గారు మళ్ళా ఆ మంత్రాలు వేసే ఆయనదగ్గరకు వెళ్ళారు.

అక్కడి నుండి తిరిగి వచ్చి మా నాన్నగారు అన్నమాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. "నాగేంద్రుడు మన కులదైవం. మనం‌ ఇలా ఆయన్ను తరిమేయాలని మంత్రాలూ వగైరా వేయించటం అపచారం. మనని నాగేంద్రుడు ఏమీ చేయడని దణ్ణం పెటుకుంటే చాలని చెప్పారు."

ఆ రోజున అందరం దణ్ణాలు పెట్టుకున్నాం. మా బామ్మ గారూ, మా అమ్మగారు ఉపవాసం ఉండి పూజ చేసుకున్నారు. 

ఇంక ఆరాత్రి ఏమీ వాసనలు రాలేదు.

 

*   *   *      *   *   *

 

మా యింట్లో అనే‌ కాదు మా తాతమ్మ గారి ఇంట్లో‌ కూడా నాగేంద్రుడిని చాలా నిష్టగా పూజించటం అనే అనవాయితీ ఉంది. మా తాతమ్మగారు నాగులచవితి నాడు చాలాచాలా నిష్టగా ఉండే వారు.

ఒక సారి పెద్దతనం వలన ఆవిడ ఉండలేక ఇబ్బంది పడుతున్నారని అందరూ బలవంతం చేసి ఏ పాలో తాగించారట. అంతే. కొద్ది సేపటికి ఆవిడకు ఒళ్ళంతా బొబ్బలు వచ్చి గందరగోళం అయ్యిందట. ఆవిడ నాగేంద్రుడికి మొక్కుకుంటే ఆ బొబ్బలూ అవీ వెంటనే తగ్గిపోయాయట. నేనిలా 'అట' అంటూ‌ చెబుతున్నాను కాని ఈ‌సంఘటన మా అమ్మగారి ప్రత్యక్షంలోనే‌ జరిగిందని మా అమ్మగారే నాకు చెప్పారు. మా తాతమ్మ గారు మహాతెల్లగా మిసమిసలాడుతూ‌ఉండే వారు పండుముదుసలి ఐనా - అటువంటి వళ్ళంతా బొబ్బలతో ఎరుపెక్కి పోయిందని మా అమ్మగారు అన్నారు. మా తాతమ్మ గారంటే మా అమ్మగారికి చాలా ఆరాధనాభావం ఉండేది.

 

*   *   *      *   *   *

 

మా నాన్న గారు ఉపాధ్యాయులు కాబట్టి మేం‌ మా ఊళ్ళో ఉన్నది తక్కువ ఊళ్ళు తిరిగింది చాలా ఎక్కువ. అప్పుడప్పుడు సకుటుంబంగా స్వంత ఊరికి వచ్చి కొద్దిరోజులు ఉండి వెళ్తూ ఉండే వారం.  మా బామ్మగారు మాత్రం తరచూ మా స్వంత ఇంట్ళోనే దీర్ఘకాలం మకాం వేసి ఉండే వారు.

అలా ఒకసారి స్వంత ఊరికి వచ్చిన మా బామ్మగారు పడకగది అడివిలాగా ఉందని సర్దుతూ ఉంటే పెట్టెలో నాగేంద్రుడు. యధాలాపంగా పైకి తీసి పట్టుకున్నాక తెలిసి కెవ్వున అరిచి బయటకు పరిగెత్తారు.

మళ్ళా మా గోపాలం జనంతో వచ్చి వెతికించాడు కాని ఆ నాగేంద్రుడు జాడ లేదు.

మరొక సందర్భంలో ఇలా సకుటుంబంగా మేము సెలవులకు స్వంత ఊరికి వచ్చి ఉన్న రోజుల్లో మా అమ్మగారు పెరట్లో పని చూసుకొని భోజనాల వసారాలోనికి వచ్చి అనుమానం కలిగి వెనుదిరిగి చూసారు. ఆవిడ దాటి వచ్చింది గుమ్మాన్నే‌ కాదు గడపమీద పరచుకొని ఉన్న నాగేంద్రుణ్ణి కూడా.

ఏముంది, యధా ప్రకారం నలుగురూ చేరి వెదికితే‌ నాగేంద్రుడు పత్తాలేడు. ఎప్పుడో‌ జారుకున్నాడు.

ఇలాంటి సంఘటనలు మరొకొన్ని జరిగాయి.

మా అమ్మగారు ఒకసారి అన్నారు. "నాగేంద్రుడు కూడా మనింట్లో ఒకళ్ళా తిరుగుతున్నాడేమో" అని.

 

*   *   *      *   *   *

 

మా సోదరసోదరీమణుల్లో ఒకమ్మాయి పేరులోనూ ఒకబ్బాయి పేరులోనూ‌ నాగేంద్రుడి పేరును కలుపుకున్నాం. ఆ అమ్మాయి పేరు సూర్యసుబ్బలక్ష్మి, ఆ అబ్బాయి పేరు వేంకట సుబ్రహ్మణ్య వేణు గోపాలకృష్ణ.

మాలో‌ ఆఖరున పుట్టిన వాడికి సత్యప్రకాశ్ అని మా నాన్నగారి పేరు పెట్టుకున్నాం. సత్యప్రకాశ్ తన కుమారుడికి కార్తికేయ అని పేరు పెట్టి నాగేంద్రుడి పేరు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాడు.

 

*   *   *      *   *   *

 

ఇప్పుడు ఆ యిల్లు లేదు.

నాగేంద్రుడి దర్శనం కూడా లేదు.

మా కుటుంబంలో ఇప్పటికీ నాగేంద్రుడి పట్ల భక్తి ప్రపత్తులు మాత్రం అలాగే ఉన్నాయి.