24, నవంబర్ 2020, మంగళవారం

అసంభావితాలు?


ఈ జిలేబి గారికి బహుసరదా ఐన వ్యాపకాల్లో రెండవది తన బ్లాగులో తానే పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యలు వ్రాసుకోవటం. మొదటి వ్యాపకం గురించి అందరికీ తెలిసిందే ఎక్కడపడితే అక్కడ కందాలను పోలినవి వ్రాస్తూ వీలైన చోట్ల పుల్లలు పెడుతున్నట్లు హడావుడి చేస్తూ ఇల్లేరమ్మలాగా బ్లాగ్లోకం అంతా కలయదిరుగుతూ ఉండటం.

ఆవిడ తన ద్వంద్వం అన్న టపా క్రింద తానే వ్రాసిన ఒక వాఖ్యలో  ఇలా అన్నారు.

ఇందులో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి ? :)
చిలుకలు, సింహముల్, కరులు చెన్నుగ చక్కెర బొమ్మలాయె నా
వెలుతురు బోవ గుట్టుగ ప్రవేశము చేయుచు కూక లేకనా
యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్,
పిలిచె జిలేబి యయ్యరును భీతిని చెందుచు వంటయింటిలోన్!

ఇక్కడ విన్నకోట నరసింహా రావు గారు అసంభావితాలు అంటే ఏమిటా అని సందేహం వెలిబుచ్చారు. దానికి జిలేబీ‌  గారు వినరా వారూ మీరు తెలుగువారేనా ? అసంభావితాలు అన్న పదం తెలీక పోవడమేమిటండీ  అని హాశ్చర్యం వెలిబుచ్చారు. మరి "ఆంధ్రభారతి" వారు కూడా అటువంటి పదమేమీ లేదు పొమ్మన్నారు అని విన్నకోట నరసింహా రావు గారు మరలా విన్నవించుకొన్నారు. మరి జిలేబీ గారు ఉలకరు పలకరు. చిత్రం.జిలేబీకీ సైలెన్స్ అన్నమాటకీ చుక్కెదురు కదా.

అవునూ? ఈ అసంభావితాలు అంటే ఏమిటీ‌?

ఈ సందేహం మీకూ వచ్చిందా?

ఐతే చదవండి.

ముందు ఒక పదం భావితం అన్నదానిని గురించి తెలుసుకోవాలి. భావితం అన్నది భావితము అనే మాటకు కొంచెం క్లుప్తరూపం. 

భావన అన్న మాట గురించి తెలుసును కదా. ఆలోచన అని దానికి అర్ధం అని కూడ తెలుసును కదా.  అలాగే ఇంచుక్ ప్రత్యయం చేర్చితే ఈ‌ భావన అన్న మాటకు మనకు భావించు అన్న మాట వస్తున్నదనీ తెలుసును కదా. ఇప్పుడు ఈ‌భావించు అన్న మాట గురించి కూడా సాధారణంగా వాడబడే‌మాట కాబట్టి దాని గురించి కూడా తెలుసును కదా. "భావన చేయు" అన్న అర్ధంతో భావించు అన్న మాటను వినియోగిస్తారని అందరూ సులభంగానే గ్రహిస్తారు కాబట్టి ఇక్కడ ఎవరికీ ఏ యిబ్బందీ లేదు కదా.

ఇప్పుడు ఆ భావితము అన్న మాట భావన అన్న మాట నుండి ఏర్పడింది అని సులువుగానే తెలుస్తుంది తెలుగులోకానికి. భావింంచ బడినది భావితము. మనం ఏదైనా వస్తువును గురించి కాని విషయాన్ని గురించి కాని భావిస్తూ ఉంటే, అదేనండీ భావన చేస్తూ ఉంటే ఆ వస్తువో భావనో ఇక్కడ భావితము అన్నమాట. మీరు ఆఫీసు పని చేస్తూనో ఆరో తరగతి పుస్తకం చదువుతూనో పులుసటుకుల్ని గురించి మనస్సులో ఆలోచిస్తున్నారనుకోండి. అప్పుడు ఆ భావితము ఐనది పులుసు అటులుకు అన్నమాట. అన్నమాట కేం‌ లెండి, ఉన్నమాటే.

మీరెప్పుడైనా సంభావన అన్న మాట విన్నారా? వినే ఉంటారు లెండి. ఈ‌సంభావన అన్న మాటకు రెండు అర్ధాలున్నాయి. గౌరవపూర్వకంగా అందిచేది, మనస్సులో చక్కగా తలచుకొనేది అని. నిజానికి మొదట చెప్పిన గౌరవపూర్వకంగా అందించేది అన్న అర్ధం కూడా మనస్సులో చక్కగా ఇష్టపూర్వకంగా తలంచుకొని ఇస్తున్నది అన్న భావన నుండే ఏర్పడిన అర్ధం. కాబట్టి సంభావన అంటే మనస్సులో చక్కగా భావించటం. మనస్సులో భావించటం అన్న అర్ధంలో భావన అంటే సం అన్న ఉపసర్గను ముందు చేర్చి  సం+భావన => సంభావన అనటం ఎందుకంటే ఆ తలంచుకోవటం అన్నది ఎంతో‌ ప్రీతితో చేయటం అని నొక్కి చెప్పటానికి తప్ప మరేమీ‌ లేదు.

 ఏమాటకామాట చెప్పుకోవాలి సంభావన ఇస్తున్నారు అంటే లెక్కప్రకారం ఎంతో‌ ప్రీతితో‌ అదరించి ఏదన్నా ఇస్తున్నారు అని సుళువుగానే అందరికీ‌ బోధపడుతూ‌నే ఉన్నా అన్ని సందర్భాల్లోనూ అది పైపైపలుకే. ఇప్పుడు అలా అంటే మనవాళ్ళకి అర్ధం అవుతూ‌ ఉండవచ్చును కాని పూర్వమూ అంతేనూ అంటేనే గొప్ప హాశ్చర్యం‌ కలుగుతుంది.

ఒకప్పుడు అడిదం సూరకవి గారు ఎవరింటికో పనిబడి వెళ్ళారట. సరిగ్గా ఆనాడు అక్కడ ఆ గృహస్థు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడు. ఎందరో వచ్చారు అక్కడికి సంభావనల కోసం. ఏం చేస్తారు చెప్పండి. ఈ బ్రాహ్మలంతే. నన్నయ్యే అనేశాడు కదా ఆదిపర్వంలో "వసువులు వసుహీనవిప్రులక్రియ  పరగి దక్షిణాశ్రితులైరి" అని. ఈ‌ముక్కలో భలే‌సొగసుగా రెండర్ధాలు వస్తాయి దక్షిణాశ్రితులైరి అన్నప్పుడు. వసువులు దక్షిణదిక్కుగా పారిపోయారని చెప్పటం ఒకటి ఐతే మరొక ఆ పారిపోవటాన్ని డబ్బులేని బ్రాహ్మలు దక్షిణలను ఆశ్రయించి నట్లు అని అనటం. ఏం చేస్తారు గతిలేని వారు, ఎవరో ఇంత సంభావన అని చెప్పి పడేస్తే, ఆ అరకొరకే ఆనందపడి వారిని ఆశీర్వదించి పోవటం తప్ప. సరే ఆ గృహస్థు ఇంటికి అలా దక్షిణలకోసం బోలెడు మంది వచ్చారు. గుమ్మందగ్గర కొందరు వీళ్ళని చూసుకొందుకు ప్రత్యేకంగా ఉన్నారట. అబ్బెబ్బే‌ వాళ్ళు దక్షిణలు ఇచ్చి పంపటానికి కాదండి. సెలెబ్రిటీ బ్రాహ్మల్ని తిన్నగా లోపలికీ, మిగిలిన జనాభాని దొడ్డిలోనికి పంపించటానికి. కార్యక్రమంలో సెలెబ్రిటీలకు దక్షిణలు ఇచ్చి ఆశీర్వాదాలూ పద్యపంచరత్న స్తుతులూ వగైరా అందుకొన్నాక గృహస్థు ఆనవాయితీగా దొడ్డిలోనికి వచ్చాడు అక్కడ పోగైన బ్రాహ్మలకి సంభావనలు ఇవ్వటానికి. అప్పట్లో సెలెబ్రిటీకి రూపాయి సంభావన. రూపాయేనా అనకండి అది నేటి ఒక ఐదొందలైనా చేస్తుంది. దొడ్డిసంభావన లెక్క పావలా. వరసగా అందరూ వచ్చి గృహస్థు దగ్గర పావలా సంభావన పుచ్చుకొని వెళ్తున్నారు. హఠాత్తుగా గృహస్థు ముందుకు వచ్చి చేయి జాచిన ఒకాయన్ను చూసి తెల్లబోయాడు. "అయ్యయ్యో ఇదేమి చోద్యం భావగారూ మీరిక్కడ ఉన్నారేమిటీ‌ లోపలికి దయచెయ్యక" అని గడబిడపడ్డాడు. సూరకవి నవ్వేసి, ఈవేళ ప్రాప్తం ఇంతే‌ భావగారూ అన్నాడట. ఇంతకూ‌ ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం‌ అంటే, ఇలా ఇచ్చే‌ దొడ్డిసంభావన అత్యంత ప్రీతిపూర్వకం కాదు కాని ఉట్టి విధాయకం అని తెలుస్తున్నది కదా, దీన్ని బట్టి సంభావన అంటే ఇలా గూడా ఉండవచ్చునూ అని తెలుసుకుందుకు అన్నమాట.

ఇప్పుడు సంభావితము అంటే ఏమిటో మీకు చూచాయగా బోధపడి ఉంటుంది. ఏ విషయం లేదా వస్తువు మనస్సులో ప్రీతిపూర్వకంగా తలచుకోబడిందో అది సంభావితము అన్నమాట. నిజంగా అంతే. ఐతే కవులు కొంచెం‌ డాంబికంగా తమ గణాలూ‌ గట్రా బాగా కుదరటానికీ అనిచెప్పి ఉత్తుత్తినే కూడా భావితము అనటం బదులు సంభావితము అని వాడిపారేస్తూ ఉంటారు. అది మనం గమనించి సందర్భాన్ని బట్టి ఆ 'సం' అన్న ఉపసర్గని కోవలం పూరణాయాసం క్రిందో‌ బడాయి క్రిందో లెక్కగట్టి మరీ అంత పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది.

అలాగని కవులంతా ఊరకే సంభావిత అన్న మాటను భావిత అంటే సరిపోయే చోటకూడా బడాయికి వాడేస్తారని అనుకోకండి. మహాకవులు తెలిసే వాడుతారండీ. కావలిసి వస్తే మీరీ కవిబ్రహ్మ గారి పద్యం చూడండి.

ఉ. నీవును జూచి తట్టి సభనేని వినంబడ దేయుగంబులన్
భూవలయంబులో నది యపూర్వము సర్వమనోజ్ఞ మిష్టభో
గావహ మేక్రియం బడసె నయ్య మహాత్ముఁడు దాన నేమి సం
భావిత భాగ్యుఁ డయ్యెను బ్రభాకర తేజుఁడు ధర్మజుం డిలన్. 

ఎంత గడుసుగా సొగసుగా చెప్పారో చూసారా ధర్మరాజు గారి భాగ్యం గురించి? రాజసూయం తర్వాత రగిలిపోతున్న ధుర్యోధనుడు అంటున్నాడూ, ధర్మరాజు గారి భాగ్యం అక్కడికి వచ్చిన జనం అందరిచేతా సంభావితం ఐనది అని. అంటే ఆ రాజలోకమూ తదితరులూ అందరూ ఆయన భాగ్యగరిమని మనస్సులో మిక్కిలి ప్రీతితో మనస్సుల్లో తలచుకుంటున్నారని అసూయతో రగిలిపోతూ దుర్యోధనుడు 'అయన భాగ్యం సంభావితం ఐనదీ' అంటున్నాడు. అదీ‌ మహాకవి ప్రయోగం అంటే!

మరి అసంభావితము అంటే ఏమిటీ అన్న ప్రశ్న గురించి ఇప్పుడు ఆలోచించాలి. 

ఈ 'అ' అన్న ఉపసర్గను వ్యతిరేకార్థంలో వాడుతాం‌ అన్నది అందరికీ తెలిసిందే. అందుచేత సంభావితము కానిది అసంభావితము అన్న మాట.

మీరు పులుసటుకుల గురించి భావిస్తూ ఉంటే అది సంభావితము అనుకోవచ్చును. భేషుగ్గా అనుకోవచ్చును. మరి ఈ సందర్భంలో అసంభావితములు ఏమిటండీ? ఇక్కడ సంభావితము కానిది అని కదా. అంటే పులుసటుకులు కానిది అని అర్ధం. అందుబాటులో ఉన్నవో కానివో‌ కాని పులుసటుకులు కాని సవాలక్ష ఖ్యాద్యపదార్దాల్లో ప్రతిదీ అసంభావితమే అన్నమాట. 

ఏడ్చినట్లుంది. ఇది ఫలానా అని నిర్దేశించక ప్రపంచంలో నేను తలచుకొనే ఫలానాది కానిది అని డొంకతిరుగుడు ఏమిటీ అనవచ్చును మీరు. మరంతే. అదే అసంభావితము అన్న మాటకి అర్ధం.

ఒక్కసారి జిలేబీ‌ పద్యాన్ని పరిశీలనగా చదివి అర్ధం చేసుకోండి. 

 అయ్యబాబోయ్ అంటారా. నేనూ అదే అంటానండీ. 

ఊరికే‌ మాటవరసకి అర్ధం చేసుకోండి అన్నాను. అందులో జిలేబి సంభావించినవి ఏమన్నా ఉంటే మిగిలినవన్ని అసంభావితాలు అన్నమాట.

అదీ జిలేబీ "ఈ‌ పద్యంలో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి?" అనటం వెనుక ఉన్న ఆంతర్యం. మరింకేం అవుతుందీ? అంతే‌ కావాలి.

కాని ఎక్కడో తేడా కొడుతున్నదా.

మీరు సరిగానే గమనించారు. జిలేబీ గారి పద్యం (పద్యం లాంటిది!?) చదివిన తరువాత కూడా మీ బుఱ్ఱలు అమోఘంగా పనిచేస్తున్నాయంటే గట్టిబుఱ్ఱలే! అభినందనలు. 

నేనైతే అంత సాహసం చేయలేదు. ఈ వ్యాసం వ్రాయాలి కదా! బుఱ్ఱని జాగ్రతగా చూసుకోవాలి కదా!

సరే విషయంలోనికి వస్తున్నాను.

మీరెప్పుడన్నా కావ్యదోషాలు అన్న మాట విన్నారా?

మూడురకాల దోషాలను కావ్యంలో జాగ్రతగా కవులు పరిహరించాలీ అని పెద్దలు చెప్తారు. అవి అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనేవి.

అతివ్యాప్తి అంటే అక్కడొక నల్లని కాకి ఉంది అని చెప్పటం‌ లాంటిది. కాకులన్నీ నల్లగానే ఉంటాయికదా. (కోటి కొక బొల్లికాకి ఉంటే ఉండనీండి). కాకి అంటే సరిపోయే దానికి నల్లనికాకి అని చెప్పటం అనవసరం. ఇది అతివ్యాప్తి అంటారు. 

అవ్యాప్తి అంటే అరుదైన విషయాన్ని సాధారణం అన్నట్లు చెప్పటం. అక్కడ పదో పదిహేనో త్రాచుపాములున్నాయి, ఒక్కోటీ పది పది-పన్నెండు అడుగుల పొడవుంది అని చెప్పటం. త్రాచుపాము ఎక్కడన్నా అరుదుగా ఒకటి పదడుగులు ఉందంటే అది వేరే సంగతి కాని ఓ గుంపు త్రాచులు పన్నెండేసి అడుగులున్నవి ఉన్నాయని చెప్పటం బాగోదు. అలా ఎక్కడా ఉండదు. ఇటువంటివి అవ్యాప్తి.

ఇంక అసంభవం అంటే, వాడా గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ‌ గట్టిగా పట్టుకొని లొంగదీసుకున్నాడు అని చెప్పటం వంటిది. కొమ్ములుండవు గుఱ్ఱాలకి. అందుచేత గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ‌ గట్టిగా పట్టుకొని లొంగదీసుకోవటం అసంభవం.

ఇకపోతే నాదృష్టిలో మరొక మూడు కావ్యదోషాలున్నాయి. అవి అనుచితం,అసందర్భం, అసభ్యం అని. ఏదైనా సందర్భంలో  ఉచితం కాని విధంగా విషయం గురించి చెప్పటం అనుచితం ఐతే‌ సందర్భానికి అతకని విషయాన్ని చెప్పటం అసందర్భం. ఇంక అసభ్యం అంటే వేరే చెప్పలా? ఏది (పదుగురు ఉండే‌) సభలో ప్రస్తావించటం‌ నాగరికప్రవర్తన కాదో అటువంటిది పదుగురినీ చదవమని కావ్యంలో వ్రాయటం.

జరగటానికి వీలే లేని విషయాలు అసంభవాలు కదా. తన పద్యంలో అసంభవమైన విషయాలు రెండు ఉన్నాయని సూచించటానికి జిలేబీ‌ గారు "రెండు అసంభావితాలున్నాయి" అని ఉండవచ్చును అనుకుంటున్నాను. రెండు అసంభవాలు అనే అనవచ్చును కదా మరి అసంభావితాలు అనటం ఎందుకు అని మీరు అడగవచ్చును. 

బాగుండండోయ్ నన్నడుగుతారేమిటీ?

ఏమో కొంచెం‌ డాంబికంగా గంభీరంగా ఒక ముక్క వాడుదాం అని అనుకొని అలా అన్నారేమో మరి జిలేబీ‌గారు.

నాకు తెలియదు. ఆ జిలేబీ‌ గారికే తెలియాలి.

మరైతే ఈ వ్యాసం ఎందుకు వ్రాసినట్లూ.

ఎందుకంటే జిలేబీకి ఇంకే‌పనీ తోచక ఒక పద్యం. నాకేమో మరేమీ‌ తోచక ఈ వ్యాసం.

19 కామెంట్‌లు:

 1. హ్హ హ్హ హ్హ, శ్యామలీయం గారు చక్కటి వ్యాసం వ్రాసారండీ. "జిలేబి" గారి విన్యాసాలు, ప్రయోగాలు అర్ధం చేసుకోవడానికి ప్రయాస పడే బదులు ... మనం వేరే పని చేసుకుంటూ, బలే సొగసుగా తయారు చేస్తారు అంటూ గిరీశం సిఫారసు చేసిన పులుసటుకులను "భావితం" చేసుకోవడం ఉత్తమం 😀.

  అనేక అంశాలను సరళంగా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలండీ.
   (అన్నట్లు ఇప్పుడే మరికొంచెం వ్రాసాను ఈవ్యాసంలో. చూడగలరు.)

   తొలగించండి
  2. "జిలేబి" గారంతే కదండీ, మనం తిరిగి వారిని ప్రశ్నిస్తే గప్-చుప్ అయిపోతారు.

   సంభావన గురించి మరింత వివరిస్తూ అడిదం సూరకవి గారి ఉదంతం కూడా చేర్చడంతో మీ వ్యాసం ఇంకా హృద్యంగా ఉంది.

   తొలగించండి
  3. సంభావన అనగా అనే possibility (likelihood of occurrence) అర్ధం కూడా ఉంది.

   తొలగించండి
  4. జై గారు సంభావన అంటే possibility అన్న అర్ధం రాదండీ. సంభావ్యత అంటే వస్తుంది. సంభావ్యము అంటే possible అనీ, సంబావ్యత అంటే possibility అని వాడటం‌ సబబు. ఎవరన్నా సంభావన అంటే possibility అని వాడితే అది కచ్చితంగా పొరపాటు ప్రయోగం. కొంచెం కృదంతాలూ‌ తధ్ధితాంతాల గురించి అధ్యయనం ఉన్న వాళ్ళు అలా వాడరు.

   తొలగించండి
  5. Sorry to disagree but the usage of సంభావన for possibility is widespread Sir

   తొలగించండి
  6. నేను ప్రచారంలో ఏఅర్ధంలో వాడుతున్నారు అన్న సంగతిని ప్రస్తావించలేదు. ఆ మాటకు ఆ అర్ధం సుగతమేనా, సరైన పదప్రయోగం ఏమిటీ అన్నదే వివరించాను.ఎన్నోమాటలను తప్పుగా వాడుతున్నారు. వివాదం అవసరం లేదనుకుంటాను.

   తొలగించండి
  7. గురువు గారూ, మీరు "అసంభావితాలు" గురించి రాసిన టపాలో నేను "సంభావన" గురించి రామాయణంలో పిడకల వేట తెచ్చినందుకు మన్నించండి.

   ఏ భాష అయినా జనం నుంచే పుడుతుంది, మంది నోట్లో నానుతేనే మాటకి మనుగడ. అనేక పాదాలకు బహుళార్దలు & విభిన్న పదప్రయోగాలు ఉంటాయి: అవాటి ప్రాచుర్యం యూనిఫాముగా కాక కాలప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది.

   సంస్కృతాధార పదాలు భారత భాషలకు అన్నిటికీ సహజం. ఒక్కో భాషలో ప్రధాన అర్ధం వేరేగా ఉండవచ్చును, కానీ తత్తిమ్మా అర్ధాలు కూడా అన్ని భాషలలోనూ వర్తిస్తాయి. ఉ. ఆగ్రహం అన్న పదానికి తెలుగులో కోపం, హిందీలో అభ్యర్థన అన్నవి ప్రాచుర్యమయినా వైసీ వరసా కూడా ఆమోదమే. An important characteristic of inheritance lexicon (as opposed to loan words) is that no original meaning can be disowned by the daughter language.

   చివరిగా నిఘంటువులు సేకరించిన వ్యక్తులు మహనీయులు కావొచ్చును కానీ వారికీ పరిమితులు ఉండే ఉంటాయి. వారు మిస్ అయినంత మాత్రాన భాష భాష కాకుండా పోదు.

   ఇకపోతే ఆంధ్రభారతి సెర్చ్ ఫలితాలు (పాక్షికం). Settings: entry word, exact match, fuzzy search ON

   సంభావ్యత: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు

   సంభావన, సంభావనము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report an error about this Word-Meaning
   n.

   1. fitness, propriety, suitableness, adequacy;
   2. possibility;
   3. considering, reflecting;
   4. supposition, idea, fancy, imagination, thought;
   5. regard, esteem, honor, respect, worship;
   6. affection, love;
   7. celebrity, fame.

   తొలగించండి
  8. జై గారు,
   హిందీ గొప్ప భాష ఐతే కానీయండి, కాని తెలుగు భాషలో సంస్కృతశబ్దాలకు అర్ధచ్యుతి కాని విపరీతార్ధాలు కాని ఉండక మూలంలోని అర్ధభావనలే ఉంటాయి. ఇకపోతే ఆధునీకం పేరుతో మేమంతా ఇలా వాడుతున్నాం కాబట్టి ఇదే సరైన భాష అనీ పూర్వకవులు మీదా నిఘంటుకర్తల మీదా ఏదో కొంచెం జాలిపడతాం లెండి అంటే అలాగే కానీయండి. నవ్యప్రియత్వపు దెబ్బకి మిగతాదంతా తీసికట్టే.

   ఎవరెలా భాషని అడ్డదిడ్డం చేస్తున్నా అదంతా ఆధునికం అనుకొని మాట్లాడరాదంటే, అష్లాగే.

   తొలగించండి
  9. సంస్కృతం, హిందీ, తెలుగు అన్నీ గొప్ప భాషలే సార్.

   పండితులకు జనం నుంచి అందినవి కొన్ని (లేదా శానా) రాసారు, అంచేత వాళ్ళూ గొప్పోరే. Having said this, let us acknowledge "experts" are compilers, *not* creators.

   నేను "ఆధునికం" (e.g. "అసంభావితాలు") సమర్తించలేదని గమనించ మనవి.

   తొలగించండి


 2. ఆహా!

  నా యొక్క కాలము లోనే నా పదాలకు
  భాష్యకారులు రావడం‌ నే చేసుకున్న సుకృతం- భాషాయోష సాచివిలోకితము ! :)


  ఈ పాటి చిన్ని పదము తెలీక ఎలా వున్నారండీ వినరా వారూ .  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీకేమైనా కాపీరైట్ ఉందా ఆపదం పైన? నిఘంటువుల్లోని పదాలు కామెంట్లలోనికీ మీ పద్యవిన్యాసాలకీ వాడే ముందు ఆ వాడకం ఉద్దిష్టమైన అర్ధాన్ని ఇస్తోందో చూసుకోవాలి. పైగా మీకేదో కితాబులు దొరుకుతున్నట్లు డప్పు కొట్టుకోవటం ఒకటా?

   తొలగించండి


  2. ఈ టపా వుంటుందా లేక హుష్ కాకీ ఐపోతుందా :)


   కొందరు కామెంటు డెలీటు రాయుళ్లు
   మరి కొందరు టపా డెలీటు రాయుళ్లు

   :)

   నారదా
   జిలేబి

   తొలగించండి
  3. ఇంగ్లీషు వాడు incurable అంటాడు చూడండి, జిలేబి గారూ, మీరు ఆకోవకు చెందుతారని అనిపిస్తున్నది. ఈ టపా వుంటుందా, డిలీట్ ఐపోతుందా అన్న అనుమానం మీకు రావటానికి ఆస్కారమే లేదే - నేను ఈరోజు టపాలు వేసి రేపు డిలీట్ చేసే బాపతు కాదని బ్లాగులోకంలో అందరికీ తెలిసి, ఇరవైనాలుగ్గంటలూ ఇక్కడే తిష్టవేసుకొని ఉండే మీకు తెలియదని అనుకోవాలా? జనంలో అపోహ ఒకటి వ్యాప్తిచేద్దామన్న దురద కాకపోతే మీకు? ఇలాంటి అసందర్భాలు మాట్లాడకండి.

   తొలగించండి


 3. ఓ యబ్బో ! ఇదేమైనా జిలేబీయమా లేక సూక్షి‌ యా :)

  బ్రౌను దొర నిఘంటువులోని పదమేగా :)  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పదం ఎక్కడికీ అని అనలేదు కదండీ, మీరు తెలిసీతెలియక వాడి ఉంటారూ అన్నాను కాని.

   తొలగించండి
  2. "జిలేబి" గారు,
   బ్రౌన్ దొర నిఘంటువు చెబుతున్నది అవధరించండి
   ===============================================
   Charles Philip Brown (1798-1884)
   A Telugu-English Dictionary.
   No results for search term అసంభావితము

   Back to the Search Page | Back to the DDSA Page
   ====================================================

   కాబట్టి "జిలేబీయమే" అయ్యుండవచ్చునేమో? :)

   తొలగించండి
 4. శ్యామలరావు గారు,
  “భా నో ద యం”, “ద్రౌ ప తి” ..... ఈ ప్రయోగాలు బాగా ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని బ్లాగుల్లో తరచూ ప్రత్యక్షమవుతుంటాయి.

  అటువంటి వాటిని సవరించుకోమని పదేపదే చెబుతూ ఎందుకండీ మీరు వృధాప్రయాస పడతారు? సరిదిద్దుకునే వాళ్ళు తక్కువ అనిపిస్తోంది.

  రిప్లయితొలగించండి
 5. అందరికీ ధన్యవాదాలు.
  ఇంతటితో చర్చను ముగిద్దాం.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.