రామకీర్తనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామకీర్తనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, నవంబర్ 2024, శనివారం

అందమైన శ్రీరాముని


అందమైన శ్రీరాముని జూడగ 
    నరుగుదమా గుడికి మన
మందరమును శ్రీరాముని జూడగ 
    నరుగుదమా గుడికి

కనులవిందుగ గుడిలో కొలువై 
    కనబడు మన శ్రీరాముని
హనుమల్లక్ష్మణసీతాయుతుడై 
    యలరారే మన రాముని
ధనువును దాలిచి చిరునగవులతో 
    దరిసెన మిచ్చెడు రాముని
మనకోరికలను వినినవెంటనే 
    మన్నించెడు మన రాముని

వచ్చిన యార్తుల దయతో జూచుచు
    వలదిక భయమను రాముని
హెచ్చిన కౌతుకమున తన సన్నిధికి
    వచ్చిన మెచ్చెడు రాముని
ముచ్చట లడుగుచు మ్రొక్కెడు వారల
    బుధ్ధుల నెరిగెడు రాముని
సచ్చరితులు విజ్ణానులు వచ్చిన
     సంతోషించెడు రాముని


శ్రీరామ్ శుభనామ్ సీతారామ్


శ్రీరామ్ శుభనామ్ సీతారామ్ హరి 
  శ్రీరామ్ రఘురామ్ సీతారామ్
శ్రీరామ్ గుణధామ్ సీతారామ్ హరి 
  శ్రీరాం జయరామ్ సీతారామ్

శ్రీరామ్ దశరథనందన రామ్ 
  శ్రీరామ్ రవికుల భూషణ రామ్
శ్రీరామ్ మునిమఖరక్షక రామ్ 
  శ్రీరామ్ మునిజనసన్నుత రామ్
శ్రీరామ్ దశముఖమర్ధన రామ్ 
  శ్రీరామ్ సురగణప్రస్తుత రామ్
శ్రీరామ్ భక్తజనావన రామ్ 
  శ్రీరామ్ మోక్షప్రదాయక రామ్

శ్రీరామ్  కంజదళేక్షణ రామ్ 
  శ్రీరామ్ కార్ముకభంజన రామ్ 
శ్రీరామ్ ధర్మవివర్ధన రామ్  
  శ్రీరామ్ దానవభంజన రామ్  
శ్రీరామ్ నిరుపమవిక్రమ రామ్  
  శ్రీరామ్ నిత్యనిరంజన రామ్
శ్రీరామ్ సజ్జనరంజన రామ్ 
  శ్రీరామ్ భవభయభంజన రామ్


10, నవంబర్ 2024, ఆదివారం

ఏమండీ ఆమోక్ష మెట్లు వచ్చును

ఏమండీ ఆమోక్ష మెట్లు వచ్చును
రాము డిచ్చు నందురా ఆమోక్షము

రామనామ మొకటి లేక రాదు మోక్షము శ్రీ 
రామ రామ రామ యనక రాదు మోక్షము

రాముని సత్కృపయె లేక రాదు మోక్షము శ్రీ 
రామునిపై భక్తి లేక రాదు మోక్షము

రాముని సేవించకుండ రాదు మోక్షము శ్రీ 
రామభజనపరత లేక రాదు మోక్షము 

రామ తత్త్వ మెరుగకుండ రాదు మోక్షము శ్రీ 
రామచింతనపరుడు గాక రాదు మోక్షము 

రాముని కీర్తించకుండ రాదు మోక్షము శ్రీ 
రాముని పూజించకుండ రాదుమోక్షము

రామపాద మంటకుండ రాదు మోక్షము శ్రీ 
రాము డీయకుండ నీకు రాదు మోక్షము

శ్రీరఘురాముని నమ్మండి

శ్రీరఘురాముని నమ్మండి శ్రీరఘురాముని తెలియండి

శ్రీరఘురాముని చేరండి శ్రీరఘురాముని కొలవండి


శ్రీరఘురాముని చిత్తము నందున చేర్చిరహించిన  కైవల్యం

శ్రీరఘురాముని కన్యము నెఱుగక జీవించినచో కైవల్యం

శ్రీరఘురాముని తత్త్వము నిత్యము చింతించినచో కైవల్యం

శ్రీరఘురాముని సేవను విడువక చేయుట మరగిన కైవల్యం


శ్రీరఘురాముని కథలను నిత్యము ప్రీతిగ చదివిన కైవల్యం

శ్రీరఘురాముని కీర్తన లెప్పుడు చెలగుచు పాడిన కైవల్యం

శ్రీరఘురాముని నామము విడువక చేయుచు నుండిన కైవల్యం

శ్రీరఘురాముని భక్తిని విడువక జీవించినచో కైవల్యం


శ్రీరఘురాముని సత్కృప వలననె జీవికి కలుగును కైవల్యం

శ్రీరఘురాముని దాస్యము చేసిన జీవికి కలుగును కైవల్యం

శ్రీరఘురాముని మరువక బ్రతికే జీవికి కలుగును కైవల్యం

శ్రీరఘురాముని సీతారాముని చేరి పొందుడీ కైవల్యం





3, నవంబర్ 2024, ఆదివారం

రామరామ యన వేలా


రామరామ యన వేలా శ్రీరఘురాముని కొలువ వదేలా


రామనామమును మించిన మంత్రము భూమిని లేదని చక్కగ నెఱిగియు

రామనామమును చేసిన జీవులు రయముగ మోక్షము పొందుట నెఱిగియు

రామదాసులకు సర్వసంపదలు రాముడు తప్పక నిచ్చుట నెఱిగియు

రామదాసులకు రాముడె యోగక్షేమము లరయుచు నుండుట నెఱిగియు

రామనామమును శివుడే నిత్యము ప్రేమగ ధ్యానము చేయుట నెఱిగియు

రామనామమును పలికిన వినినను రోమహర్షణము కలుగుట నెఱిగియు

రాముడు శ్రీమన్నారాయణుడని బ్రహ్మాదులు ప్రకటించుట నెఱిగియు

రాముని కన్నను దైవము లేడని భూమినందరును పొగడుట నెఱిగియు

బ్రహ్మాదికసురపూజ్యుడు రాముడు భగవంతుం డని బాగుగ నెఱిగియు

బ్రహ్మానందము రామనామమును పాడుటలోనే కలదని యెఱిగియు

సర్వకాలముల రామనామమును చక్కగ జేయగ దగునని యెఱిగియు

సర్వాత్మకుడగు రాముం డొక్కని శరణము జొచ్చిన చాలని యెఱిగియు


26, అక్టోబర్ 2024, శనివారం

నారాయణ యని

నారాయణ యని నా తండ్రీ యని నోరారా పిలవండి 
శ్రీరామా యని శ్రీకృష్ణా యని నోరారా పిలవండి

ముప్పొద్దులను మెక్కుటకేనా మూతి దేవుడిచ్చె

ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని యీశుని పిలవండి


తప్పుడుమాటలు పలుకుటకా హరి తలకు తెలివినిచ్చె

తప్పు తెలుసుకొని హరినామములే యొప్పుగ పలకండి


దేవుళ్ళాడగ రుచులకు జిహ్వను దేవుడిచ్చినాడా

శ్రీవిభునామము నిప్పటికైనా జిహ్వకు చేర్చండి


దేవుడు నరులను పొగడుటకేనా తెలివికి నీకిచ్చె

దేవదేవుని నామము పలికే తెలివి తెచ్చుకోండి



24, అక్టోబర్ 2024, గురువారం

రామనామ మన్నది

రామనామ మన్నది కడు రంజు గున్నది
అది యేమేమో సుఖము లందించు చున్నది

చెవుల కది సోకిన సుఖమే సుఖము
చవుల నాలుక కదే చక్కటి సుఖము
అవిరళముగ నెడదలో నమరుచు సుఖము
భవశృంఖలలు త్రెంచి భలేసుఖము

స్మరణముచే మనసున శాంతియు సుఖము

నిరత మాత్మానంద నిర్మల సుఖము

హరిదయాలబ్ధిచే నద్భుతసుఖము 

మురిపించుచు నిచ్చే మోక్షసుఖము 

జయభయహరణా

జయభయహరణా జయభవహరణా
జయశుభచరణా జానకిరమణా

జయజయ దశరథనందన రామా జయ రఘువర రామా
జయజయ సీతానాయక రామా జయ రఘువర రామా
జయజయ దనుజవినాశక రామా జయ రఘువర రామా
జయజయ సర్వశుభంకర రామా జయ రఘువర రామా

జయ మునిజనసన్నుత శుభవిగ్రహ జయ రఘువర రామా
జయ సురవరసన్నుత శుభవిక్రమ జయ రఘువర రామా
జయ బుధవరసన్నుత శుభదాయక జయ రఘువర రామా
జయ  జయకారణ జయశుభకారణ జయ రఘువర రామా

జయజయ తారకనామా రామా జయ రఘువర రామా
జయజయ త్రిజగత్పోషక రామా జయ రఘువర రామా
జయజయ భక్తజనాశ్రయ రామా జయ రఘువర రామా
జయజయ మంగళవిగ్రహ రామా జయ రఘువర రామా


23, అక్టోబర్ 2024, బుధవారం

రామ రామ యని


రామ రామ యని వినబడగానే రాకాసులు పరుగెత్తేరు

రామదాసులు కనబడగానే రాకాసులు పడిపోయేరు


రామా యని యెవరెవరిని పిలిచిన రాకాసులు వెరగందేరు

రాముని బాణము గురితప్పదని రాకాసులు  పరుగెత్తేరు


రాముని గుడి గల యూరుల వంకకు రాకాసులు రాకుండేరు

రాముని నమ్మెడు మనుజుల జోలికి రాకాసులు రాకుండేరు


రాముని బంటుల బంటుల జోలికి రాకాసులు రాకుండేరు

రాముని రాజ్యపు పొలిమేరలకు రాకాసులు రాకుండేరు


22, అక్టోబర్ 2024, మంగళవారం

శ్రీరాముల కీర్తనమును


శ్రీరాముల కీర్తనమును చేయవలయును
దారుణభవసాగరమును దాటవలయును

వారి వీరి గొలుచుబుధ్ధి వదలవలయును
నారాయణసేవకే నడువవలయును
ఊరివారి గొడవలలో దూరుట మాని
తీరుగ హరిభక్తులతో చేరవలయును

తలపులు హరిచరితములే తడువవలయును
పలుకులు హరినామములే పలుకవలయును
వలచిన హరిచేరికనే వలచవలయును
నిలచిన హరిసన్నిధినే నిలువవలయును

హరిమయ మీవిశ్వమనున దెఱుగవలయును
హరికన్యము మిథ్య యనున దెఱుగవలయును
హరేరామ యనుచు నెపుడు మురియవలయును
హరేకృష్ణ యనుచు జగము మరువవలయును


నీనామము నోటనుండ


నీనామము నోటనుండ నీవు నా యెడదనుండ
దేనికయా చింత నాకు దేవదేవ రామా

దుర్మదవిధ్వంసకమై తోచుచుండు నీనామము
కర్మక్షయకారకమై కలుగుచుండు నీనామము
నిర్మలశుభదాయకమై నిలచుచుండు నీనామము
ధర్మాత్ముల జిహ్వలపై తాండవించు నీనామము

సకలసంపదల నొసంగ చక్కనైన నీనామము
సకలతాపముల నడంచు చల్లనైనన నీనామము
సకలసుజనసేవ్యమైన శర్మదమగు నీనామము
సకలజీవులకును ముక్తిసాధనమగు నీనామము

దీనబాంధవుడవైన దేవదేవ నీనామము
ధ్యానించెడు వారినెల్ల దయచూచెడు నీనామము
అనందదాయకమై యలరారెడు నీనామము
నానుడువుల కులుకుచుండి నన్నేలెడు నీనామము


రామ రామ శ్రీరామా

రామ రామ శ్రీరామా యను మని ప్రేమగ శివుడే బోధించె
రామనామమును చేయక మోక్షము రాదని చక్కగ బోధించె

శ్రీవిభునకు సరిదైవము లేడని శివుడు సూటిగా బోధించె
భూవలయంబున రామచంద్రుడై పుట్టెను హరి యని బోధించ
జీవులందరకు రామనామమే సిధ్ధౌషధమని బోధించె
భావము నందున రాముని నిలిపిన బ్రతుకు పండునని బోధించె

అందరు రాముని నామము చేయుట కర్హులె సుమ్మని బోధించె
అందమైన యీనామమునకు సరి యెందును లేదని బోధించె
వందనీయుడగు రాముని ధ్యానము వదలకుండుమని బోధించె
మందబుధ్ధులకు మాత్రము రాముని మహిమ తెలియదని బోధించె

15, అక్టోబర్ 2024, మంగళవారం

హరిని పొగడండి

హరిని పొగడండి మీరు హరినే పొగడండి
హరిని పొగుడు సుజనులకే యపవర్గం మండి

శరణాగతవత్సల యని హరినే పొగడండి

కరుణారససాగర యని హరినే పొగడండి 

సురగణైకపోషక యని హరినే పొగడండి 

సురవైరివినాశక యని హరినే పొగడండి


పరమపురుష యని మీరు హరినే పొగడండి 

పరమయోగి సేవితుడని హరినే పొగడండి 

పరమాత్ముడ ననుచు మీరు హరినే పొగిడిండి

పరమభక్తు లగుచు మీరు హరినే పొగడండి


హరేపరాత్పరా యని హరినే పొగడండి

వరదాయక యని మీరు హరినే పొగడండి

హరేరామ యని మీరు హరినే పొగడండి

హరేకృష్ణ యని మీరు హరినే పొగడండి



చేయండి తరచుగ

 చేయండి తరచుగ శ్రీరామనామం
    చేయండి చేయండి చేయండి 
చేయండి మోక్షము సిధ్ధించునండీ
    చేయండి చేయండి చేయండి 

చిత్తశాంతిని మీకు చేకూర్చు నామం

    చేయండి చేయండి చేయండి

చిత్తశుద్ధిగ మీరు శ్రీరామ నామం

    చేయండి చేయండి చేయండి 

చిత్తమున వలచి శ్రీరామ నామం 

    చేయండి చేయండి చేయండి 

చిత్తుచిత్తుగ కలిని చెండాడు నామం

    చేయండి చేయండి చేయండి 


చింతలన్నింటిని చిదిమెడు నామం

     చేయండి చేయండి చేయండి 

చింతితార్ధము నిచ్చు శ్రీరామ నామం 

    చేయండి చేయండి చేయండి 

చెంతనుండి శుభము చేకూర్చు నామం

    చేయండి చేయండి చేయండి 

చింతింపకన్యంబు శ్రీరామ నామం 

     చేయండి చేయండి చేయండి

ఎరుక గలిగితే

 ఎరుక గలిగితే యెల్లతావులను 
    హరి పరమాత్ముడు ప్రత్యక్షం 
చరాచరంబుల నెల్ల వేళలను 
    సర్వాత్ముడు హరి ప్రత్యక్షం 

దేహధారులను పాత్రలతో హరి 
    దివ్య నాటకము సృష్టి యని
మోహము చెందక పాత్రను నిలచుట 
    బుద్ధిమంతుల కొప్పునని

హరేరామ యని హరేకృష్ణ యని 
    ఆనందముతో పలుకగను
హరికన్యంబగు నదియే లేదని 
    అంతరంగమున చక్కగను

మరపు లేక హరినామము పొందే 
    మనసును నిలుపుట కార్యమని
హరినామంబును హరియును నొకటే 
    యనుచు చక్కగా హృదయమున 

11, అక్టోబర్ 2024, శుక్రవారం

రామ రామ భవతారకనామా


రామ రామ భవతారకనామా రారా వేగమె రక్షింప

రామ రామ నీ నామమె దప్ప రాదన్యము హరి నానోట


పరమశివుడు నీనామధ్యానము వదలకుండునని వింటినిరా

నిరంతరంబుగ నాంజనేయుడును నీనామమె జపియించునట

ధరాసుతావర దశరథనందన తరచుగ నీశుభనామమునే

నరమాత్రుడ నాశక్తికొలదిగ నడిపింతునురా నానోట


హరి సంసారము దాటునుపాయం బరయగ నీనామం బొకటే

ధరాతలంబున నరులకు గలదని నమ్మకముగ నే వింటినిరా

పరాత్పరా నీనామామృతమును పానముజేయుచు నుంటినిరా

నిరాకరించక సాయుజ్యంబను వరమొక్కటికి హరి నాకీరా


నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు దైవమవు

నీవే నాకిల గలిగిన చుట్టము నీవే కూర్చెడు మిత్రుడవు

నీవే సర్వము నీవే లోకము నీవే దిక్కని నమ్మితిని

నీవే తప్ప నితఃపరమెఱుగను నిక్కము రక్షింపగ రారా


12, సెప్టెంబర్ 2024, గురువారం

పండనీ

 పండనీ యీబ్రతుకు భగవంతుడా నీ
యండనే యటుగాక యది యెందుకు

నరవేషమును వేసి ధర నుండు టెందుకు

పరమాత్మ నినుగూర్చి పాడుటకు కాక

కరచరణములు దాల్చి గర్వించు టెందుకు

తరచు నీసేవలో తిరుగుటకు గాక


ధర నిన్ను వెదకుచు తిరుగాడు టెందుకు

పరమాత్మ నీవు నాభావ మందుండ

సురుచిరంబులు భావసుమము లవి యెందుకు

హరి నీకునై నిత్యమమరుకు గాక


నాకండ వగు శ్రమయు నీకెందుకో రామ

నీ కన్యమెఱుగక నేనుండుటను కాక

నాకున్న బ్రతుకిదియు నీకొఱకు గాక

నాకేల కోరదగినది యేమి కలదు


శ్రీరామనామ మొకటి

శ్రీరామనామ మొకటి చేరెను మదిలో
ఆరామనామమయ మాయెను బ్రతుకే

నాలుకపైకెక్కి యది నాట్యమాడ జొచ్చినది

చాలుననుచు వ్యర్ధప్రసంగములు మానెనది


కనులలోన చేర నది కైపు తలకెక్కినది

కనును రామమయముగా కనులు జగమంతటిని


తలలోపల చేరి యది తలపులన్ని మార్చినది

తలపులన్ని రామపాదములమీద వ్రాలినవి


సర్వేంద్రియముల నది శాసించగ దొడగినది

యుర్వి నన్యకార్యముల కురుకుట నవి మానినవి


ఆత్మ నది యాక్రమించి యతిశయించి నిలచినది

ఆత్మేశుడు రామునిలో నది కలసిపోయినది


7, సెప్టెంబర్ 2024, శనివారం

పొగడనీయవయ్య రామ

 


పొగడనీయవయ్య రామ పొగడనీయవయ్య

పొగడదగినవాడవు జగదీశుడ


పొగడనీ రసన యలసిపోవు దాకా నిన్ను

పొగడనీ పెదవు లలసిపోవు దాకా రామ

పొగడనీ తనువు పడిపోవు దాకా నిన్ను

పొగడనీ పొగడనీ పురుషోత్తమ


పొగడనీ కాల మాగిపోవు దాకా నిన్ను

పొగడనీ మాట లుడిగిపోవు దాకా రామ

పొగడనీ జగము లణగిపోవు దాకా నిన్ను

పొగడనీ నిత్యమును పురుషోత్తమ


పొగడనీ పొగడి హృదయముప్పొంగ నిన్ను

పొగడనీ పొగడి మురిసి పోదును రామ

పొగడనీ సకలసుగుణభూషణుడ వగు నిన్ను

పొగడనీ విరివిగా పురుషోత్తమ


6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ఇదియేమి యిటులాయె

 
ఇదియేమి యిటులాయె నినకులతిలక
యిదియంతయు నీమాయయే కాదా


నేడు నీనామ మేల నిలువదు నానాలుకపై
వేడుకగా రామచంద్ర వివరమేమి టయ్య
నేడు నీరూప మేల నిలువదు నామనసులోన
చూడచక్కని తండ్రి యీచోద్యమేమి

దినదినము నీయశో గీతికలుపాడు నానోరు
దినపతికులనాథ మూగదనము చెందనేల
మనసు నోరుపెగల నీయని మంకుదన మేటికి
వినుతశీల పూనినదా వివరమేమి

తెలిసె రామచంద్ర నీదు దివ్యతేజంబులోన నే
కలిసిపోయి కరిగిపోయి నిలచిపోయి నీయందే
తెలియనైతి కాలంబును తెలియనైతి యొడలిని
నిలువనిమ్ము నీలోనే నీరజాక్ష