31, జనవరి 2020, శుక్రవారం

న్యాయంతో నిర్భయ హంతకుల బంతులాటలు


వాస్తవం అన్నది  ఒక్కొక్కసారి నమ్మశక్యంగా ఉండదు.

2012నాటి నిర్భయ కేసులో నిందితులు కాదు కాదు నేరస్థులు మరొకసారి న్యాయవ్యవస్థతో బంతులాట ఆడారు. సమాజాన్ని మరొకసారి వెక్కిరించారు.

మొట్టమొదట ఆ రాక్షసాధముల్లో ఒకడు బాలుడట!

వాడు బాలుడా?

బాలుడి ప్రవర్తన అలాగ కూడా ఉంటుందా ఎక్కడన్నా?

అటువంటి నీచకృత్యాలు బాలురు చేసేవా?

అంత నీచంగా ప్రవర్తించగలిగిన వాడిది మానసికంగా బాలప్రవృత్తి అనగలిగిన వాళ్ళది నాలుకా తాటిమట్టా?

సాంకేతికంగా వాడికి బాల్యావస్థ దాటలేదట. ఇంకొక పది నిముషాలు సమయం ఉన్నా ఆ బాల్యావస్థావినోదం దాటటానికి, వాడు ఎలాంటి నీచనికృష్టమైన దారుణానికి తెగబడినా, బాలుడన్న నిర్వచనం క్రిందకే వచ్చేసాడు మరి. అహా మన న్యాయవ్యవస్థ ఎంత ఉదారమైనది! తలచుకుంటే ఎవ్వరికైనా ఒళ్ళు కంపరం ఎత్తిపోవలసిందే కదా దేవుడా!

అందుచేత వాడు తన బాల్యం అన్న బంతిని ఎరవేసి ఇంచక్కా తప్పించుకున్నాడు, ఆ తప్పించుకున్న ఘనకార్యం వలన ఎంత లభ్ది వాడికి?

ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. అసలు వాడెవడో కూడా ఎవరికీ తెలియదు. వాడి పేరుతో సహా అన్నింటినీ వాడి సంక్షేమం కోసం మార్చి మహోపకారం చేసి వాడి నెత్తిన పాలు కాదు కాదు అమృతం కురిపించింది మన వ్యవస్థ. వాడి గురించి ఎవరికీ ఏమీ తెలియకూడదు. వాడికి ఎవరన్నా అపకారం చేస్తారేమో అని వాడికి ఇలా శ్రీరామరక్ష కల్పించారు. అందుచేత వాడు హాయిగా జనం మద్యన తిరుగుతూ మరొక ఘోరం చేసేందుకు వాడికి అన్నివిధాలా అనుజ్ఞ దయచేసి సంరక్షించటం జరిగిందన్న మాట.

ఈ అరడజను మందీ ఇలా బాలురు అన్న నిర్వచనం లోనికి రాలేకపోయారు కదా పాపం. అందులో ఒకడు తొందరపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి మన చట్తాల గొప్పదనం మీదా వాటిని అమలు చేయవలసిన వ్యవస్థల ప్రయోజకత్వం మీదా అనవసరంగా చాలా నమ్మకం ఎందుకు కుదిరేసిందో తెలియదు. వాడు చచ్చి నరకానికి పోయాడు.

ఇక మిగిలింది నలుగురు. వీళ్ళు బంతాటలో ఎంత ఘనులో చూడండి. మన శిక్షావ్యవస్థను అక్షరాలా ఆడుకుంటున్నారు.

ఒకరి వెనుకాల ఒకరు పిటీషనులు దాఖలు చేస్తూ ఉరిశిక్షను విజయవంతంగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతున్నారు.

ఈ నేరస్థులు ఎవరూ తమ చేతికి చిక్కిన అమాయక జీవికి తప్పించుకుందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదే, మరి వీళ్ళకి వ్యవస్థలు అవకాశాల మీద అవకాశాలు అనంతంగా ఇస్తూ పోవటం ఏమిటీ? ఏమిటీ విడ్డూరం?

ఇలా అవకాశాలు ఇస్తూ పోవటానికి అంతేం లేదా?

ఇప్పటిదాకా సామాన్య జీవులం అంతా రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరిస్తే అంతే సంగతులు అనుకుంటూ ఉండే వాళ్ళం కదా? అంతే కదా?

కాదట!

రాష్ట్రపతికి వివరాలు సరిగ్గా చెప్పలేదూ అని కోర్టుకు విన్నవించుకోవచ్చునట.

ఠాఠ్‍ రాష్ట్రపతి నిరాకరించటం వెనుక కుట్ర ఉందీ అని న్యాయస్థానానికి ఎక్కవచ్చునట!

ఇంకా నయం , రాష్ట్రపతికి తిరస్కరించే హక్కు లేదూ అనో ఆ హక్కునుప్రశ్నిస్తున్నాం అనో కూడా న్యాయస్థానానికి ఎక్కవచ్చునేమో.

ఇవన్నీ చెల్లని వాదనలు కావచ్చు.

కాని ప్రతిసారీ న్యాయస్థానాలు సాదరంగా వారి దిక్కుమాలిన అర్జీలను స్వీకరించటం ఒకటి.

వెంఠనే ఉరిని నిలుపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేస్తూ ఉండటం ఒకటి.

మళ్ళా ఏదో బ్రహ్మాండమైన పాయింట్లున్న కేసుల్లాగా వాటిపైన తీరిగ్గా విచారణలు జరిపించటం ఒకటి.

ఏమిటిదంతా?

బాధితులు న్యాయం కోసం యుగాలకు యుగాలు ఎదురుచూడవలసి రావటం వారికి అన్యాయాన్ని తీవ్రతరం చేయటమే కాదా?

అది బాధితులకు మరింత అన్యాయం చేయటమే కాదా?

పైపెచ్చు ఈ రాక్షసులకు ఎప్పటికీ ఉరిశిక్ష అమలు కాదంటూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఘట్టిగా బాధితురాలి తల్లిని ఛాలెంజి చేయటం ఎంత దారుణం. అలా ఆవిడను వెక్కిరించే హక్కు ఆ లాయరుగారికి ఎవరిచ్చారు? అసలు అటువంటి వ్యక్తిని న్యాయవాది అనటం కూడా అన్యాయం కావచ్చును.

ఒకడిని చట్టం అక్షరాలా రక్షించగా, మరొకడు భయపడి చావగా ఇంక మిగిలిన వారు కేవలం నలుగురు మాత్రమే. ఇలా ఒకరి తరువాత ఒకరు బంతాటను నడిపిస్తూ ఎంత కాలయాపన చేసినా , మనం చూస్తుండగానే ఆ ఆటలన్నీ అంతం కాక తప్పదు. వాళ్ళకు ఉరి కూడా తప్పదు.

గ్రుడ్డిలో మెల్ల అన్న ఒక సామెత ఉంది. ఇక్కడ ఆట ఆడుతున్నది నలుగురు మాత్రమే. అదృష్టం కొద్దీ అదేదో కేసులో లాగా  ఇరవై ముగ్గురో నలభై ముగ్గురో కాదు.

అంటే ఇలా సామూహిక అత్యాచారాల వంటి అకృత్యాలకు దిగే వాళ్ళకు అధికస్య అదికం ప్రయోజనం అన్నమాట ఉరితప్పించుకొనే బంతాటలో.

ఇంకా మనకు తెలియని దిక్కుమాలిన చట్టసౌలభ్యాలే మన్నా ఉన్నాయేమో మెల్లగా అవీ తెలియవస్తాయి.

అసలు ఇంత హంగామా జరగటానికి పూర్వరంగంలో వవస్థ ఎంత కాలయాపన చేసిందీ ఎంత ఉదాసీనంగా ఉన్నదీ అన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు.

సినిమాల్లో చెబుతూ ఉంటారే ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదూ అంటూ, అటువంటి గొప్ప ఆత్రంలో మన వ్యవస్థలు నేరగాళ్ళకు తప్పించుకు తిరిగేటందుకు గాను వీలైనంత పొడవైన తాళ్ళని అందిస్తూ ఉన్నాయన్న మాట. ఎంత ఔదార్యం ఎంత ఔదార్యం!

ఆదేవుడెవరో పాపులను రక్షించును అన్నట్లుగా ఈ వ్యవస్థ ఏదో నేరస్థులను రక్షించును అని అనిపిస్తోంది.

అవును మరి justice delayed is justice denied కదా!

చట్టం నేరస్థులకి శిక్షలు అమలు చేస్తుంది అని ఎలా నమ్మకం కలుగుతుంది ఇంక మన దేశంలో సామాన్యులకు?

30, జనవరి 2020, గురువారం

దశరథనందన రామప్రభో


దశరథనందన రామప్రభో ధర్మావతార రామప్రభో
దశముఖమర్దన రామప్రభో దయతో నేలుము రామప్రభో

ఇందునిభానన రామప్రభో ఇనవంశోత్తమ రామప్రభో
ఇందీవరనేత్ర రామప్రభో ఇభరాజగమన రామప్రభో
కుందరదన హరి రామప్రభో కువలయపూజిత రామప్రభో
వందనములు నీకు రామప్రభో పాలించుము మము రామప్రభో

మునిరాజకాంక్షిత రామప్రభో మునిక్రతురక్షక రామప్రభో
మునిలోకమోదక రామప్రభో మునిజనసన్నుత రామప్రభో
అనుపమదోర్దండ రామప్రభో జనకసుతావర రామప్రభో
నిను నమ్ముకున్నాము రామప్రభో వినుమా మనవులు రామప్రభో

నిత్యశాంతాకృతి రామప్రభో నిరుపమగుణనిధి రామప్రభో
సత్యవాక్పాలక రామప్రభో సర్వజనప్రియ రామప్రభో
స్తుత్యచరిత హరి రామప్రభో శూరాగ్రేసర రామప్రభో
భృత్యులమయ్యా రామప్రభో వేడుక నేలుము రామప్రభో

కాలాత్మక హరి రామప్రభో కలుషవిధ్వంసన రామప్రభో
నీలగగన శ్యామ రామప్రభో నిజభక్తపోషక రామప్రభో
పాలితాఖిలలోక రామప్రభో కాలకాలనుత రామప్రభో
జాలమేలనయ్య రామప్రభో చక్కగ బ్రోవవె రామప్రభో


27, జనవరి 2020, సోమవారం

అమరావతికి ఊపిరి?

వనజ గారి అమరావతీ... ఊపిరి పీల్చుకో.. అన్న టపా చూసాను .
ఆవిడ ఆ టపాను 24న వ్రాసినా, నేను మూడు రోజుల తరువాత నేడు 27న మధ్యాహ్నం దాకా చూడలేదు.

అమరావతి గురించీ, సందు చూసుకొని కొన్ని అరాచకశక్తులు చేస్తున్న అనవసర కులనిందల గురించీ ఆవిడ చాలా బాధపడుతున్నారు.

అక్కడ ఆవిడ బ్లాగులో నేను వ్యాఖ్యలను ఉంచలేను. అది వేరే విషయం.

కాబట్టి విడిగా నా స్పందన ఇలా నా బ్లాగు ముఖంగా వ్రాస్తున్నాను.

ఆవిడ అన్నది నిజం.

ఈరోజుల్లో వార్తల పేరుతో కనవచ్చేవీ వినవచ్చేవీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి.

మన తెలుగుబ్లాగుల్లో ఐతే అంతా సో-కాల్డ్ పచ్చ బేచ్ v ఇన్ ఫాక్ట్ పిచ్చి బేచ్.
యుధ్ధవాతావరణం భీతావహంగా ఉంది.

నేను వార్తాపత్రికలు చదవటం మానివేసాను,
నేను వార్తల ఛానెళ్ళను విసర్జించాను.
నేను  యూట్యూబులో వస్తున్న విశ్లేషణలను చూడటం లేదు.
నేను బ్లాగుల్లో వస్తున్న రొట్టనూ దూరం పెడుతున్నాను, వీలైనంత వరకూ.
నేను నా మొబైల్ నుండి  వార్తల ఆప్ లను అన్నింటినీ తొలగించాను.
ఇవన్నీ చేసి కొద్ది రోజులు అయింది.

జరిగేది ఎలాగూ మనకు తెలియక పోదు కదా. పెద్ద ఇబ్బంది లేదు.
ప్రజలు గొప్ప మెజారిటీ ఇచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది.
అందుచేత ప్రజలకు పర్యవసానాలను అనుభవించక తప్పదు.

జరిగే వన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు కవి.
అలా అనుకోలేదని వాళ్ళు పెరుగుట విరుగుట కొరకే అనుకుంటారేమో మరి.

నిజానికి చాలా మంచి జరుగుతోందని కూడా కొందరు అంటున్నారు.

ఇంగ్లీషు వాడిది,  People get the government they deserve అని ఒక మంచి సామెత ఉంది.
అలా ఉంది పరిస్థితి అచ్చంగా.
ఈ తెలుగువాళ్ళని దేవుడే రక్షించాలి.

ప్రస్తుతం అకారణంగానో సకారణంగానో తెలుగువాళ్ళు తమను తామే బాగా శిక్షించుకుంటున్నారు.

ఇది నా అభిప్రాయం.

అందరికీ నా అభిప్రాయం నచ్చాలని లేదు.

(విషయం లేకుండా వీరావేశంతో ఎవరన్నా వ్యాఖ్యానిస్తే, అది వాళ్ళిష్టం. అది అచ్చు వేయటమా మానటమా అన్నది నా యిష్టం అని అందరూ గమనించగలరు.)

22, జనవరి 2020, బుధవారం

వేదముల నెఱిగినా వేదాంత మెఱిగినా


(బేహాగ్)

వేదముల నెఱిగినా వేదాంత మెఱిగినా
శ్రీదయితుని కృపలేక చిత్తశాంతి లేదు

కనుల వత్తి వేసుకొని ఘనమైన శాస్త్రముల
మనసు పెట్టి చదువుకొని మంచిపండితు డైన
ఘనకీర్తిమంతుడై జనపూజితు డైన
తనకు లాభమేమి రామతత్త్వ మెఱుక పడక

గురువులే మెచ్చినా గురుపదమే దొరకినా
విరచించి గ్రంథములే విఖ్యాతి కెక్కినా
ధరను తన మాటయే పరమప్రమాణమైన
సరిసరి శ్రీరాము నెఱుగ జాలకున్న యెడల

నిరక్షర కుక్షి యైన నిర్భాగ్యుడే యైన
హరికృప గలవాడే యమితభాగ్యశాలి
పరమసంపన్నుడగు పండితోత్తముడగు
హరికృపయే లేక చిత్త మల్లకల్లోలము

నేనెఱిగినది యెంత నినుగూర్చి పాడగా


నేనెఱిగినది యెంత నినుగూర్చి పాడగా
జ్ఞానినా మౌనినా సర్వేశ్వరా రామ

చదువలేదు నేనేమియు శాస్త్రగ్రంథంబులను
విదుల శుశ్రూష చేసి విడువ నజ్ఞానమును
పదిలముగ నానోటను భవదీయ నామమే
కదము త్రొక్కుచుండు నీ కరుణవలన రామ

తపము చేయు నంత సాధనసంపత్తియె లేదు
విపరీతపు బుద్ధిగల వీఱిడి నైయుంటిని
అపరాధిని నేను మిగుల కపటవర్తనుండను
కృపజూపితిట్టి నాపై నృపతిశేఖర రామ

అంతే చాలు ననుచు నిన్నవరతము పొగడగ
సుంత సాహసించితిని సూర్యవంశతిలక
యెంతైనను నీవు తండ్రి వెంతో మెచ్చుకొనుచు
చింతతీర్చి ప్రోచెదవు సీతారామస్వామిఫ్రీ డౌన్‍లోడ్ తెలుగు లైబ్రరీలు

2012 - 12  - 16
మ్యూజిక్‍ రీసెర్చ్ లైబ్రరీ పుస్తకాలు (ఫ్రీ డౌన్‍లోడ్) యాదృఛ్ఛికంగా ఈ లైబ్రరీ నాదృష్టికి వచ్చింది ఆసక్తి కల వారు సందర్శించండి

  మ్యూజిక్‍ రీసెర్చ్ లైబ్రరీ పుస్తకాలు

ఇక్కడ ఈనాటికి 131 పుస్తకాలు కనిపిస్తున్నాయి.

2012 - 12 - 27
మందరము - సవ్యాఖ్యానం  అన్నిపుస్తకాలు వేరొక చోట శ్రీ రామసేవాకుటీరములో లభిస్తున్నాయి.
మందరము-సవ్యాఖ్యానం.


2020-01-04
ఈసైట్ గురుకుల్ ఆర్గ్ అని లాభార్జన దృష్టిలేని ఆధ్యాత్మికపరమైన ఉచిత సమాచార వెబ్ సైటు.  అందులో ఉచిత భక్తి పుస్తకాలు అని ఒక పేజీ ఉంది ఉంది. అనేక పుస్తకాలని ఇక్కడ వర్గీకరించి అందిస్తున్నారు. ఈ సాయిరాం సైట్ లో 'ఉచిత భక్తి పుస్తకాలు',  'ఉచిత భక్తి మాసపత్రికలు',  'ఉచిత భక్తి వీడియోలు',  'ఉచిత భక్తి సమాచారం',  'ఉచిత పరిశోధన',  App అనే విభాగాలను సైట్ హోం పేజీ పైన  చూడవచ్చును.

2020-01-04

తెలుగు థీసిస్.కామ్  తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Telugu Books and Sanskrit books Free. ఇక్కడ అనేక పుస్తకాలూ ఇతర సమాచారమూ చూడవచ్చును. కంకంటి అని వెదకితే కంకంటి పాపరాజు ఉత్తరరామాయణమూ విష్ణుమాయావిలాసమూ రెండూ కనిపించాయి.

2020-01-04

అభినవ వ్యాస' 'జ్ఞాన ప్రపూర్ణ' శ్రీ దేవిశెట్టి చలపతిరావు గారు సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధముగా వ్యాఖ్యానించిన కొన్ని గ్రంధముల పుస్తకములను PDF ఫార్మాట్‍లో వారి సైట్ నుండి దిగుమతి చేసుకోవచ్చును. ఇక్కడ 53 పుస్తకాలు కనిపిస్తున్నాయి.

2020-01-04

జీవన్ముక్తి సాధన అని ఒక బ్లాగు ఉంది. ఇక్కడ చాలా విలువైన సమాచారం ఉంది. వైదిక ధార్మిక గ్రంధాలూ ఇంకా బోలెడు వర్గాలుగానూ సమాచారం ఉంది.

2020-01-04

కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి రచనలు ఉచితంగా పొందవచ్చును. వీటిలో కొన్ని చర్ల నారాయణ శాస్త్రి గారి రచనలు (చర్ల గణపతి శాస్త్రి గారి తండ్రి).  మరికొన్ని చర్ల సుశీల గారి రచనలు (చర్ల గణపతి శాస్త్రి గారి భార్య). ఈ పేజీలో మొత్తం 96 పుస్తకాలు లభిస్తున్నాయి.  వీటిలో 15 పుస్తకాలకు download links ఈయబడ లేదు.

2020-01-04

ఉచితంగా తెలుగులో PDF పుస్తకాలు ఫ్రీ గురుకుల్ ఆర్గ్ బ్లాగు సైట్‍ వద్ద లభిస్తున్నాయి. ఇక్కడ స్త్రీ ధర్మ సంబంద 16 పుస్తకాలు, సంగీత సంబంద 32 పుస్తకాలు, వివాహం/పెండ్లి సంబంద 15 పుస్తకాలు, ఆరోగ్య సంబంద 55 పుస్తకాలు, తెలుగు/తెలుగు చరిత్ర సంబంద 23 పుస్తకాలు, ధర్మసందేహాలు(Q&A) సంబంద 30 పుస్తకాలు, తీర్ధయాత్ర సంబంద 60 పుస్తకాలు, వ్రత సంబంద 25 పుస్తకాలు, స్తోత్ర సంబంద 94 పుస్తకాలు ఉన్నాయి.

2020-01-08

ఇది సాంకేతికం. ఆంగ్లమాధ్యమం. 951+ Free Maths Books అనే సైట్ ఉన్నది. ఇక్కడ అనేక గణితశాస్త్ర విభాగాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.

నిజానికి Free Stuff అనే సైట్‍లో పైన చెప్పిన గణితగ్రంథాలది ఒక భాగం మాత్రమే.

2020-01-10

Divine Life Society  వారి ప్రచురణలు ఉచితంగా ఆన్‍లైన్‍లో చదువుకుందుకు లేదా డౌన్‍లోడ్‍ చేసుకుందుకు లబిస్తున్నాయి. వివరాలకు Divine Life Society వారి డౌన్‍లోడ్‍ పేజీని దర్శించండి. ఆపేజీలోనే స్వామి కృష్ణానంద గారి పుస్తకాలు కూడా లభిస్తున్నాయి.

మరొక సైట్‍ HolyBooks.com. ఇక్కడ వారి మాటల్లో Download PDF's: holy books, sacred texts and spiritual PDF e-books in full length for free. Download the Bible, The Holy Quran, The Mahabharata and thousands of free pdf ebooks on buddhism, meditation etc. Read the reviews and download the free PDF e-books.  ఆసక్తి కలవారు ఈసైట్‍ను దర్శించండి.

2020-01-11

ఒక మంచి బ్లాగు ఉంది ఈ పని చేస్తూ.  ఆ బ్లాగు పేరు తెలుగు డౌన్‍లోడింగ్‍. ఇక్కడ ముఖ్యంగా కొత్తా పాతా తెలుగు పుస్తకాలు దొరుకుతున్నాయి. ఉదాహరణకు అడవి బాపిరాజు గారి నరుడు కనిపించింది, డౌన్‍లోడ్ చేసుకున్నాను. ఐతే నాకు ఇక్కడ యండమూరివి 69 పుస్తకాలు ఉన్నాయి కాని విశ్వనాథ వారిది ఒక్కటీ లేదు. అదీ కాక, ఈబ్లాగులో 21 డిసెం, 2014 తరువాత పోష్టింగులు లేవు.

మరొక బ్లాగు. దాని పేరు ఫ్రీ డౌన్‍లోడ్‍ PDF ఫైల్స్ అని. అక్కడ కూడా పుస్తకాలు బాగానే ఉన్నాయి.  వారు  Free download Pdf files of Comics, Novels, Magazines, Ebooks అనిచెప్పుకున్నారు. నాకు అక్కడ చలం పుస్తకం భగవాన్ పాదాల ముందు.. దివాన్  దొరికింది.


2020-01-19

అరవిందాశ్రమం వారి సైట్ దర్శించండి. అక్కడ అరవిందుల వారి మరియు మదర్ వారి రచనలు అరవిందాశ్రమం లైబ్రరీ పేజీ నుండి ఉచితంగా పొందవచ్చును.  అలాగే ఇక్కడ మరొక పేజీ నుండి కూడా వీటిని పొందవచ్చును - ముఖ్యంగా ఇక్కడ Collected PDFs అని పేజీ చివరన ఒక సంపుట‌ం‌ ఉంది. అది దింపుకుంటే చాలు అన్ని పుస్తకాలు ఒక దొంతిగా వచ్చేస్తాయి.

2020-01-21

దివ్యజ్ఞానసమాజం (The Theosophical Society) వారి సైట్‍ నుండి e-పుస్తకాలు ఉచితంగా లబిస్తున్నాయి. దివ్యజ్ఞానసమాజం గురించిన వికీపీడియా పేజీని ఆసక్తి కలవారు తిలకించండి.

మేడమ్‍ బ్లావట్స్కీ స్టడీ సెంటర్‍ నుండి ఆవిడ రచనలు ఉచితంగా లభ్యం అవుతున్నాయి. ఈవిడ దివ్యజ్ఞాన సమాజ స్త్జాపకురాలు.

World Teachers Trust వారు మాష్టర్ CVV గారి యోగ మార్గప్రచారకులు. వారి సైట్ నుండి డాక్టర్ కె. పార్వతీకుమార్ గారి నుండి వెలువడిన తెలుగు ప్రచురణలు ఉచిత తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ సైట్‍లొ ఇవేకాక ఇతరమైన అనేక గ్రంథాలు కూడా లభిస్తున్నాయి. సైట్ తెరచి పబ్లికేషన్స్ అన్న టాబ్ చూడగానే అందులో మనకు ఆన్‍లైన్‍ బుక్స్ అన్న లింక్ కనిపిస్తుంది. అందులో Dr. Ekkirala Krishnamacharya,Dr. K. Parvathi Kumar,Other, Russian Books, Telugu Books అన్న లింక్స్ కనిపిస్తాయి. కావలసిన పుస్తకాలను దిగుమతి చేసుకొని చదువవచ్చును.

2020-01-22

ఒక సైట్ ఉంది Rare Book Society Of India అని. అక్కడ అనేక అరుదైన పుస్తకాలు లభిస్తాయి డౌన్‍లోడ్ చేసుకుందుకు. ప్రస్తుతం పేజీకి 20 చొప్పున,  అక్కడ 112 పేజీలలో అవి చూపబడుతున్నాయి.  నాకు అక్కడ మహావీరాచార్యుడి గణితసార సంగ్రహం పుస్తకం దొరికింది . ఇది పావులూరి మల్లన గణితానికి మూల గ్రంథం. మీరు వెదికి అనేక పుస్తకాలను మీకు ఆసక్తి కలిగించేవాటిని దించుకోవచ్చును.

2021-01-25
శ్రీ సాయి మాస్టర్ సేవా ట్రస్టు వారి పేజీలో తెలుగులో 72పుస్తకాల వరకూ లభిస్తున్నాయి. ఇంకా ఆంగ్ల, తదితర భాషల్లోనూ పుస్తకాలున్నాయని తెలుస్తున్నది.

2021-02-02 కొత్త సమాచారం

పీడీయఫ్ డ్రైవ్ అని ఒక సైట్ ఉంది. అందులో వివిధ విభాగాలకు చెందిని పుస్తకాలు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొన వచ్చును. ఉదాహరణకు Python Programming  గురించిన పుస్తకాలూ‌ ఉన్నాయి.  Paul Brunton రచించిన పుస్తకాలూ‌ ఉన్నాయి. నేనొక పుస్తకం Python Programming  గురించినది దించుకొని చూసాను. సులభంగానే‌ వచ్చింది.

 

2021-05-15

మీరు archive.org site నుండి చాలా పుస్తకాలను download  చేసుకోవచ్చును. అనేక పాత పుస్తకాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రయత్నించండి తప్పక.

2021-09-27

శ్రీపువ్వాడ రామదాసు గారి కీర్తనల పుస్తకమూ, శ్రీ పువ్వాడ శేషగిరిరావు గారి గ్రంథాలూ మనకు పువ్వాడకవిత అనే‌ సైట్ ద్వారా లబిస్తున్నాయి ఉచితంగా.  అకాశవాణి విజయవాడ  కేంద్రం వారు ప్రసారం చేసిన ఎక్కడ నున్నావు కృష్ణయ్యా అన్న పువ్వాడ రామదాసు గారి కీర్తనను విని అంతర్జాలాన్ని శోధించితే ఈ పుస్తకాలు కనిపించాయి.

Jyothish Books : ఈ సైట్‌లో జ్యోతిషగ్రంథాలు ఉచితంగా లభిస్తున్నాయి. (ఇంకా నేను ప్రయత్నించలేదు!)

Post Last Updated On  Feb 2 2022

19, జనవరి 2020, ఆదివారం

ఊహల నితరుల వర్జించి


ఊహల నితరుల వర్జించి
శ్రీహరి నొక్కని చింతించి

పొందెడు సుఖమే పూతంబైనది
అందచందముల నధికంబైనది
అందర కదియే అపవర్గప్రద
మిందు వివాదం‌ బెన్నడు లేదు

ఏమానవుడీ యిలపై నుండెడు
నా మానవునా హరిరక్షించును
కామాదుల కెఱ గాకుండగ నిం
దేమియు సందియ మించుక లేదు

రామ రామ యని స్వామిని మనసున
ప్రేమమీఱగను పిలచిన చాలును
వేమరు లితరుల వేడి చెడకుడు
శ్యాముని మరచిన సద్గతి లేదు


18, జనవరి 2020, శనివారం

సాకేతనాయక సకలలోకనాయక


సాకేతనాయక సకలలోకనాయక
శ్రీకర మమ్మేలు సీతానాయక

మామాటలు మాచేతలు మాతలపులు మాచూడ్కులు
మామనసులు మాబ్రతుకులు మాచదువులు మానడతలు
మాముక్తులు మాశక్తులు మాధనములు మాయాశలు
మామాధవదేవ నీవు మాకిచ్చినవే

నీతేజము నీరూపము నీశౌర్యము నీబలము
నీతత్త్వము నీశాంతము నీవేగము నీగుణము
నీతాల్మియు నీవిభవము నీయీవియు నీదయయు
మాతండ్రి నిలువనిమ్ము మాకు రక్షగా

నిన్ను నమ్ముకొన్నట్టి నిన్ను సేవించునట్టి
నిన్ను కీర్తించునట్టి నిన్ను పూజించునట్టి
నిన్ను ధ్యానించునట్టి నిజభక్తులమగు మమ్ము
మన్నించి రక్షించవె మానక నెపుడు


హరిని నమ్మి కీర్తించునదియే చాలు


హరిని నమ్మి కీర్తించునదియే చాలు
హరినామము పలుకుచుండు నదియే చాలు

హరిభక్తుల కలసి తిరుగు నదియే చాలు
హరికథలను వినుచునుండు నదియే చాలు
హరిపురాణములు చదువు నదియే చాలు
హరిభజమును చేయు చుండు నదియే చాలు

హరిసేవకుడై రహించు నదియే చాలు
హరికన్యము నెఱుగకుండు నదియే చాలు
హరితత్త్వములో రమించు నదియే చాలు
హరిని యెల్లెడల జూచు నదియే చాలు

హరే రామ హరే కృష్ణ యని లోలోన
నిరంతరము జపియించు నదియే చాలు
హరికరుణను పొందుచుండు నదియే చాలు
హరిలోనే కలసిపోవు నదియే చాలు

16, జనవరి 2020, గురువారం

కలలో నైనా యిలలో నైనా


కలలో నైనా యిలలో నైనా కలరా వేరొక రెవరైనా
తలచుట కైనా వలచుట కైనా దశరథరాజకుమారా

భూమికి వచ్చిన తొలనాళ్ళను నా బుధ్ధియె పెడదారినిపోయె
నీ‌మాటయె నే మరచి యుంటి నది నిక్కముగా నా తప్పేను
ఈమాయామయ లోకంబున నే నెంతటి తెలివిడి గలవాడ
రామా నను దారికి తెచ్చితివి రక్షించితివని మురిసితిని

నిజము వచించితి నీయాన ఇక నీవు నమ్మితే అది చాలు
ఋజువులు సాక్ష్యము లెందుకయా నా నిజతత్త్వము నీ వెఱుగుదువే
విజయరామ బహుకాలముగా నీ వెనుకనె తిరుగుచు నుంటిగదా
అజాపజా లేకుండ దాగెదవు అన్యాయం బిది రామయ్యా

నను సామాన్యుని నీదాసునిగ నొనరించుకొని నిత్యమును
కనుసైగలలో నన్నుంచుకొని కాపాడెడు నా రామయ్యా
నిను కనలేక నేనెటు లుందును నీ వెఱుగనిదా రామయ్యా
మనవిని విని నను మన్నించి యిక మఱుగుపాటు విడనాడవయా

రాము డొకడు చాలు నాకు రాముని కృప చాలు


రాము డొకడు చాలు నాకు రాముని కృప చాలు నాకు
నామత మిది నచ్చకున్న నన్ను విడచి పొండు

మంచి చెడ్డ తనువు లెన్నొ మాటికి నే తొడగితిని
మంచి చెడ్డ లెన్నో యీ‌మహిలో చవి చూచితిని
అంచితమగు రామ నామ మది యెన్నడు విడువ లేదు
మంచివాడు రాముడు నను మరిచి యుండి నదియు లేదు

నోరు దేవు డిచ్చినది యూరివారి పొగడుటకా
నారాయణ నామములు నమ్మి కీర్తించుటకా
శ్రీరామ యని పలుకగ చిత్త మిచ్చగించనిచో
మీరు నన్ను మెచ్చలేరు మిమ్ము నేను మెచ్చలేను

కామాదుల నుజ్జగించి రామాంకిత జీవనులై
భూమినెందరో ఘనులు పొంది నారు మోక్షమునే
ఆ మోక్షము నందు నాకు నభిలాష కలదు మీకు
నా మతము నచ్చె నేని నాతో కలసి రావలయు

14, జనవరి 2020, మంగళవారం

అటవీ స్థళముల కరుగుదమా!యతి రాజ్యం అనే అమ్మాయి నాకెప్పుడూ గుర్తుంటుది.

సంక్రాంతి పండగప్పుడు ఈ అటవీ స్థలముల పాటను ఎవరో ఒకరు ప్రస్తావిస్తూ ఉంటారు. ఈరోజున   గారు  బోల్డన్ని కబుర్లు బ్లాగులో ప్ర స్తావించినట్లు.

ఆపాటతో బాటే నాకు యతిరాజ్యం కూడా గుర్తుకు వస్తుంది తప్పకుండా.

ఒక సంప్రదాయ వైష్ణవకుటుంబంలోని పిల్ల యతిరాజ్యం.

చదివేది ఏడవ తరగతి. మా బేబిపిన్నికి స్నేహితురాలు.

అటవీ స్థలముల పాటను ఆ అమ్మాయి ఇలాగే అటవీ స్థళముల కరుగుదమా అని తమాషాగా పాడేది.

ఆ పాట ఇలా ఉంటుంది.

అటవీ స్థలములు కరుగుదమా చెలి
వట పత్రమ్ములు కోయుదమా

చింత పిక్కాలాడుదమా
   చిరు చిరు నవ్వులు నవ్వుదమా

చెమ్మా చెక్కాలాడుదమా
   చక్కిలిగింతలు పెట్టుదమా

కోతీ కొమ్మచ్చులాడుదమా
   కొమ్మల చాటున దాగుదమా

చల్లని గంధం తీయుదమా
   సఖియా మెడకూ పూయుదమా

పూలదండలు గుచ్చుదమా
   దేవుని మెడలో వేయుదమా

అప్పట్లో మా బేబీ పిన్ని మాయింట్లోనే ఉండి ఒక యేడాది చదువుకుంది. అప్పుడు నేను ఆరవతరగతి, తాను ఏడవ తరగతి అన్నమాట.

ఐతే యతిరాజ్యం నాకు బాగా గుర్తు ఉండిపోవటానికి కారణం ఈపాట కాదు. ఆమె అటవీ స్థళముల కరుగుదమా అని  ల ను ళ చేసి అనటం కూడా కాదు.

యతిరాజ్యం నా ప్రియాతిప్రియమైన బేబీ పిన్నికి స్నేహితురాలు కావటం కూడా కాదు.

అవన్నీ కొంతవరకే కారణాలు.

అసలు కారణం వేరే ఉంది.

అప్పట్లో మేము గెద్దనాపల్లిలో ఉండే వాళ్ళం. మా నాన్నగారు అక్కడి జిల్లాపరిషత్ మిడిల్ స్కూలుకు ప్రథానోపాధ్యాయులుగా ఉండేవారు. అదే పాఠశాలలో నేను ఆరవతరగతిలోనూ మా బేబీ పిన్ని ఏడవతరగతిలోనూ ఉండేవాళ్ళం. యతిరాజ్యం మా పిన్నికి స్నేహితురాళ్ళలో ఒకమ్మాయి. మరొకమ్మాయి పేరు వరలక్ష్మి అనుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు మరొకరిద్దరు అమ్మాయిలూ మా పిన్నితో పాటు మాయింటికి వచ్చేవారు ఆడుకుందుకు.

వాళ్ళెవ్వరితోనూ నాకు పరిచయం ఐతే ఉన్న గుర్తులేదు. యతిరాజ్యం మాత్రం ఈఅటవీ స్థళముల పుణ్యమా అని బాగానే గుర్తు.

ఒకరోజున మా యింటికి భాష్యం గారు వచ్చారు.  భాష్యం గారు అంటే యతిరాజ్యం వాళ్ళ నాన్నగారన్న మాట. ఆయన మా నాన్నగారికి ఒక శుభవార్త చెప్పటానికి వచ్చారు.

ఆ శుభవార్త ఏమిటంటే యతిరాజ్యానికి పెళ్ళి కుదిరింది అని.

ఆ రోజున మా నాన్న గారూ మా అమ్మ గారూ భాష్యంగారితో కొంత సేపు మాట్లాడారు.

ఏముంటుందీ, అంత చిన్నపిల్లకు పెళ్ళేమిటండీ అనే.

భాష్యం గారు మాత్రం ఆచారం అనీ సంప్రదాయం అనీ ఏమేమో చెప్పారట మా అమ్మానాన్నలకు సమాధానంగా. వాళ్ళు మాత్రం పాపం ఏం చేస్తారు. వీలైనంతగా చెప్పి చూడగలరే కాని.

యతిరాజ్యం ఆ తరువాత మా యింటికి ఎప్పుడూ రాలేదు.

యతిరాజ్యం స్కూలు మానివేసింది

యతిరాజ్యానికి పెళ్ళయిపోయింది.

చాలా కాలం పాటు, ఆ అమ్మాయి గుర్తుకు వచ్చినప్పుడల్లా మా అమ్మగారు, బంగారం లాంటి పిల్ల అంటూ బాధపడే వారు.

ఎవరు ఎక్కడ అటవీ స్థలముల పాట పాడినా నాకు యతిరాజ్యం గుర్తుకు వస్తుంది. బంగారం లాంటి అభం శుభం తెలియని ఏడో తరగతి అమ్మాయికి పెళ్ళి చేసిన ఆ అమ్మాయి పెద్దల చాదస్తం గుర్తుకు వస్తుంది.

మా పిన్ని భాషాప్రవీణ చేసింది.  ఆతరువాత కొన్నాళ్ళు నిడదవోలులో ఉపాధ్యాయురాలిగా పని చేసింది.

మా పిన్నిని నేను తరచూ కలుసుకుంటూనే ఉండే వాడిని. ఆమెను కలుసుకుందుకు కొవ్వూరు వెళ్తూ ఉండే వాడిని.

ఒకసారి యతిరాజ్యం ప్రసక్తి వచ్చింది మా మధ్యన.

ఆడపిల్లల బ్రతుకులు వాళ్ళ చేతుల్లో ఉంటాయేమిట్రా అనేసింది ఆరోజున మా బేనీ పిన్ని.


6, జనవరి 2020, సోమవారం

ఏలుదొరా తాత్సార మేలదొరా

ఏలుదొరా తాత్సార మేలదొరా రామదొరా
కాలునకు చిక్కకుండ కావవయా రామదొరా

పాపీ యని పిలిచి నన్ను పట్టుకొని పోవుటకై
యే పూటను వచ్చునో ఆనాడు కాలు డిటు
నీ పేరు చెప్పుకొన్న పోపొమ్మని విడచేనా
నాపాలిటి దైవమా నన్ను నీవు బ్రోవకున్న

ఎప్పటివో తప్పులన్ని యేకరువు పెట్టుగాని
యిప్పుడు నీభక్తుడ నని యించుక కరుణించునా
చెప్పరాని సైపరాని శిక్ష లతడు వేయునయా
చప్పున నీ వేలకున్న గొప్పచిక్కు లున్నవయా

నీ పాటలె పాడు వాడ నీ నామమె పలుకు వాడ
రేపు యముడు నిన్ను నన్ను రేవుపెట్టి తిట్టునేమొ
నీ పేరును చెడగొట్టిన నీచుడకా నోపనయా
ఆపైనను నీచిత్తము కాపాడుము రామదొరా


తామసుడు మాయన్న నుండి

తామసుడు మాయన్న నుండి దయతొ నన్ను గాచినావు
రాముడా ప్రియమిత్రుడా నను రాజుగా నొనరించినావు

కపివర సుగ్రీవ నేనన నృపతిధర్మము నెరపినాను
శపధ మొక్కటి కలదు నాకు శరణుజొచ్చిన కాచితీరుదు
కుపధవర్తను లైన వారల గొట్టు టన్నది రాజధర్మము
చపలచిత్తము లేక నీవును చక్కగా నీరాజ్యమేలుము

మిత్రుని క్షేమంబు గోరుట మిత్రధర్మము లోక మందున
మిత్రు నభ్యుదయము గోరుట మిత్రధర్మము లోక మందున
మిత్రు డర్ధించినది చేయుట మిత్రధర్మము లోక మందున
మిత్రధర్మము నెరపినాడను మీదు మిక్కిలి యేమి సేసితి

రామ జయజయ వాగ్విదాంవర నీమనోరధ మేనెరుంగుదు
భూమికన్యక జాడలరయగ నామహాసైన్యంబు గలదు
శ్యామసుందర నాల్గు దిక్కులు చక్కగా జల్లించ గలదు
ఆ మహాసాధ్వియును నీవును నవని నంతయు నేలగలరు

రామలక్ష్మణు లార రమ్యగుణశాలు లార

రామలక్ష్మణు లార రమ్యగుణశాలు లార
యీ మహానుభావులు విశ్వామిత్రులు

వీరి పాదకమలములకు వినయముతో మ్రొక్కుడు
వీరి యాశీర్వాదములు విజయసోపానములు
వీరు మీ కభ్యుదయము కోరి వచ్చి  యున్నారు
మీరు వీరి వెంట జని వెలయించుడు యాగరక్ష

ఇన్నాళ్ళును తండ్రి వెనుక నున్న చిన్ని కుఱ్ఱలై
యున్నవార లిరువురు భయ మన్నదే యెఱుగరు
జన్నమును రక్షించగ జనుచు నున్నారు మీరు
కన్నతండ్రు లార తపసి కటాక్షమును బడయుడు

కామరూప కామగమన ఘనవిద్యలు కలవారిని
యేమాత్రము లక్షించక యీసడించి రాకాసుల
మీ మార్గణముల ధాటి మెరయించి సమయించి
యీ మహానుభావు మెప్పు నిపుడు మీరు బడయుడు

శ్రీరస్తని సతము శుభాశీశ్శు లొసగు వశిష్ఠులు

శ్రీరస్తని సతము శుభాశీశ్శు లొసగు వశిష్ఠులు
మీరు మా పురోహితులు మిగుల గూర్చు వారు

పరమపావనము సూర్యవంశ ముందు నేను పుట్టి
యరువది వేలేండ్లుగా నవని నేలుచున్న వాడ
పరమాత్ముని దయ యిది యనుచు భావించు వాడ
పరమవృధ్ధుడను నేను వ్రాలుచున్న సూర్యుడను

సురలు పొగడ విక్రమము చూపి పేరు తెచ్చుకొంటి
సురలు మెచ్చ ధర్మమును శోభ లీనగ జేసితి
హరికి కరుణ యేల రాదాయెనో యెరుగనయా
పరమునిచ్చు సుపుత్రుని బయడనైతి మహాత్మా

ఇనకులాబ్ధి సోముడై యిందువదనుడై సుజన
మనఃకాము డగుచు సర్వమంగళాకారు డగుచు
మనసును చల్లన జేయు మంచి కొడుకు కలుగగా
ననుగ్రహము చూపి దశరథుని ధన్యుని చేయరే

వారగణనం - 3


కొందరికి పట్టిలు భట్టీయం వేయటం అంటే అస్సలు రుచించదు.

శతాబ్ది సంస్కారంతో సహా వారగణన సూత్రం

    సంవత్సరం + సంవత్సరం/4 + నెలకు ఇండెక్స్ + తేదీ -  2 x ( శతాబ్దిని 4తో భాగించితే వచ్చే శేషం) -1

అని చెప్పుకున్నాం కదా వారగణనం - 2 టపాలో. ఇక్కడ ఇండెక్సుల పట్టికను గుర్తుపెట్టుకోవాలి మరి. అది నచ్చని వారికి దారులు మూసుకుపోలేదు. మరొక విధానం ఉంది.  ( అవసరమైన వారు వారగణనం-1 నుండి మొదలు పెట్టి చదువుకోండి)

భట్టీయం వేయటం అంటే అస్సలు రుచించని వారికి, కావలసిన నెలకు ఇండెక్సును గణితం చేయటానికి ఒక మంచి ఫార్ములా ఉంది.

ఇండెక్సు = 13  x ( నెల సంఖ్య + 1) / 5
   (సూచనలు: 1. శేషం వదిలేయండి.  2. జవాబులో వీలైనన్ని 7లను తీసివేయండి!)

ఇది మార్చి నుండి డిసెంబరు వరకూ బ్రహ్మాండంగా పని చేస్తుంది. (జనవరి ఫిబ్రవరి నెలల సంగతి తరువాత చూదాం.)

ఉదాహరణకు:

మార్చి ఇండెక్సు   = 13 x (3 + 1) / 5  = 13 x 4 / 5 = 52 / 5 = 10 = 3
అగష్టు ఇండెక్సు   = 13 x (8 + 1) / 5  = 13 x 9 / 5 = 117/ 5 = 23 = 2
డిసెంబరు ఇండెక్సు = 13 x (12 + 1) / 5 = 13 x 13 / 5 = 169 / 5 = 169/5 = 33 = 5

ఐతే జనవరి ఫిబ్రవరి నెలలకు మాత్రం ఆ నెలల సంఖ్యను 13, 14 గా తీసుకోవాలి.  సమాధానం నుండి 1 తీసివేయాలి.

జనవరి ఇండెక్సు = 13 x (13+1) / 5 = 182 / 5 = 36 = 1 సరిచేయగా 0
ఫిబ్రవరి ఇండెక్సు = 13 x (14+1) / 5 = 195 / 5 = 39 = 4 సరిచేయగా 3

ఈ ద్రవిడ ప్రాణాయామం కన్నా జనవరి=0 ఫిబ్రవరి=3 అని గుర్తుపెట్టుకోవటమే సులువుగా ఉంటుంది.

ఇండెక్సుల టేబుల్ సరిగా గుర్తులేని పక్షంలో ఈ సూత్రం ప్రకారం దానిని తిరిగి వ్రాసుకోవటం / తెలుసుకోవటం సులభంగా ఉంటుంది.

ఇలా వచ్చే ఇండెక్సులు అన్నీ పాత ఇండెక్సు టేబుల్‍తో సరిపోలుతాయి.

ఈ విధంగా వారగణనం అసక్తి ఉన్నవారు అభ్యాసం చేయండి. ఐతే లీపు సంవత్సరాలలో జనవరి, ఫిబ్రవరి నెలలకు వచ్చే వార సంఖ్యను ఒకటి తగ్గించటం మరచిపోకండి.

వారగణనం - 2 (updated)


మనం ఇప్పటి వరకూ 1900 నుండి 1999 వరకూ ఏ సంవత్సరంలో ఐనా సరే ఏ తేదీ కయినా సరే అది ఏవారం అవుతుందో ఎలా సులభంగా లెక్కవేయవచ్చునో  తెలుసుకున్నాం. సరిగా గుర్తు లేని వారు వారగణనం-1 టపాను మరొకసారి చదువుకోవలసిందిగా సూచన.

ఇంతవరకూ బాగుంది.

కొన్నేళ్ళ క్రిందటి వరకూ ఈ గణితం సాధారణంగా అందరికీ సరిపోయేది. ఎందుకంటే మన యెఱుకలో ఉన్న జనాభా అందరూ 1900 నుండి 1999 మధ్యలో పుట్టిన వాళ్ళూనూ మనం గుర్తుపెట్టుకొనే అవసరం ఉన్న తేదీ లన్నీ ఈ సంవత్సరాలకే చెందినవి కావటమూ కారణం.

ప్రస్తుతం మనం ఆ కాలం దాటి ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనలో అనేకులకు ఆ పాత సంవత్సరాలలోని తేదీలూ ముఖ్యమైనవి ఉంటున్నాయి. కొత్తగా మనం వాడుకచేస్తున్న సంవత్సరాలన్నీ 20తో మొదలౌతున్నాయి.

ఉదాహరణకు అనేకుల పుట్టినరోజు ఏదో ఒక 19XX సంవత్సరం ఐతే పెళ్ళిరోజో ఉద్యోగంలో చేరిన రోజో ఒక 20XX సంవత్సరంలో ఉంటోంది.

పూర్వం అవధానులను అడిగే తేదీలన్నీ ఏవో కొన్ని19XX సంవత్సరాలే కాని నేటి అష్టావధానికి ఆసౌకర్యం లేదు. ఏదో ఒక 19XX లేదా 20XX సంవత్సరంలో తేదీ అడుగవచ్చును కదా!

కాబట్టి మన ఇంతవరకూ నేర్చుకున్న గణితంలో శతాబ్ది సంఖ్యనూ పరిగణనలోనికి తీసుకోవాలంటే మార్పు చేయక తప్పదు.

అదెలాగో చూదాం.

అసలు ఒక శతాబ్దంలో ఎన్నిరోజులుంటాయీ అన్న ప్రశ్నకు సమధానం చూదాం మొదట.  మనకు తెలిసి ప్రతిసంవత్సరంలోనూ 365రోజులూ పైగా నాలుగేళ్ళ కొకసారి అదనంగా ఫిబ్రవరి 29 అనే మరొక రోజూ. కాబట్టి శతాబ్దం అంటే 100 సంతర్సరాలలో 100 x 365 + 100/4 = 36500 + 25 = 36525 రోజులన్న మాట.

కొద్దిగా తప్పాం. నిజానికి 36524 రోజులేను.

ఎందుకలా?

ప్రతినాలుగేళ్ళకూ ఒక లీప్ సంవత్సరం వస్తుంది కాని సంవత్సరసంఖ్య 00 ఐతే అది లీప్ ఇయర్ కానక్కర లేదు!

1500  లీప్ ఇయర్ కాదు
1600  లీప్ ఇయర్!
1700  లీప్ ఇయర్ కాదు
1800  లీప్ ఇయర్ కాదు
1900  లీప్ ఇయర్ కాదు
2000  లీప్ ఇయర్!
2100  లీప్ ఇయర్ కాదు

అంటే ఏమిటన్న మాట? శతాబ్దాన్ని తెలిపే సంఖ్య4 యొక్క గుణిజం (12, 16, 20, 24 అలా) ఐతేనే 00 సంవత్సరం లీప్ సంవత్సరం. కాకపోతే ఆ సంవత్సరానికి 365రోజులే.

కాబట్టి సాదారణంగా 100 సంవత్సరాలలో 24 లీప్ సంవత్సరాలే ఉంతాయి. కాబట్టి మొత్తం రోజులు 365000+24 మాత్రమే.

ఇఅతే ప్రతి నాలుగువందలయేళ్ళకు ఒకసారి అదనంగా లీప్ ఇయర్ వస్తోంది కదా. 1600, 2000, 2400 సంవత్సరాలు లీప్ సంవత్సరాలే కాబట్టి ఆ సంవత్సరాల్లో ఫిబ్రవరి 29వ తారీఖు ఉంటుంది.

ఇప్పుడు 400 సంవత్సరాలకు ఎన్ని రోజులూ అని? లెక్క తేలికే 4 x 36524 + 1 అంటే 146097 రోజులు.

ఇదంతా ఎందుకు తవ్వి పోసామూ అంటే అక్కడకే వస్తున్నాను. వందేళ్ళల్లో 36524 రోజులు అంటే 5217 వారాల పైనా 5రోజులు. అనగా మరొక్క వారానికి 2 రోజులు తక్కువ.

అలాగే 400 సంవత్సరాలకు ఎన్నిరోజులూ అంటే 146097 రోజులు అన్నాం కదా, అది సరిగ్గా 20871 పూర్తి వారాలు. ఒక్కరోజు కూడా అదనంగా లేదు - తరుగ్గానూ లేదు.

ఒక్కొక్క వంద సంవత్సరాలకూ 2 రోజుల చొప్పున కొట్టివేయాలి కాబట్టి శతాబ్ది సంఖ్యను 4చేత భాగించి శేషాన్ని రెట్టించితే సరి. ఈ అదనం విలువను మన పాత గణితంలో తగ్గించాలి.

మన 19 అనేది శతాబ్ది సంఖ్య అనుకుంటే దాన్ని 4తో భాగిస్తే 3 శేషం వస్తుంది. దీన్ని రెట్టిస్తే 6. న్యాయంగా 19XX సంవత్సరానికి చేసిన గణితంలోనుండి ఈ సవరణ ప్రకారం 6 తగ్గించాలి. కాని అదెలా?  ఈ సవరణకు పూర్వమే మనగణితం అన్ని 19XX సంవత్సరాలకూ సరిపోతోందిగా!

కాబట్టి మన సవరణనే కొంచెం సంస్కరించాలి. అదనంగా 1 తగ్గించటం ద్వారా. అంటే శతాబ్ధి సంఖ్య 19 ఐతే మనం 6 బదులుగా 6+1 = 7 తగ్గించుతున్నాం.. అంటే ఏమీ తగ్గించటం లేదనే.

ఇప్పుడు అంతిమంగా శతాబ్ది సంస్కారం ఏమిటీ అంటే

 - 2 x ( శతాబ్ది సంఖ్యను 4తో భాగించితే వచ్చే శేషం)  -1

ఈ శతాబ్ది సంస్కారంతో సహా వారగణన సూత్రం
   సంవత్సరం + సంవత్సరం/4 + నెలకు ఇండెక్స్ + తేదీ -  2 x ( శతాబ్దిని 4తో భాగించితే వచ్చే శేషం)  -1

ఉదాహరణలు కొన్ని చూదాం.

1618-10-9: 18+4+0+9-0-1 = 30 = 2 మంగళ
1718-10-9: 18+4+0+9-2-1 = 28 = 0 ఆది
1818-10-9: 18+4+0+9-4-1 = 26 = 5 శుక్ర
1918-10-9: 18+4+0+9-6-1 = 24 = 3 బుధ
2018-10-9: 18+4+0+9-0-1 = 30 = 2 మంగళ
2118-10-9: 18+4+0+9-2-1 = 28 = 0 ఆది
2218-10-9: 18+4+0+9-4-1 = 26 = 5 శుక్ర
2318-10-9: 18+4+0+9-6-1 = 24 = 3 బుధ
2418-10-9: 18+4+0+9-0-1 = 30 = 2 మంగళ

ఈ విధంగా ఏశతాబ్దంలో ఐనా సరే ఏ సంవత్సరంలో ఐనా సరే ఇచ్చిన తేదీకి సులభంగా వారం గణితం చేయవచ్చును.

ఎవరైనా సరే చక్కగా అభ్యాసం చేస్తే ఈ గణితాన్ని కేవలం నోటిలెక్కగా సెకనుల్లో చేయవచ్చును.

ఐతే మనం ఈ ఫార్ములాని కొద్దిగా క్లుప్తీకరించ వచ్చును. మనం నెలకు ఒక ఇండెక్స్ సంఖ్యను అనుకున్నాం కదా అవి

 0 3 3 6
 1 4 6 2
 5 0 3 5

అని. వీటితో మనం  మన ఫార్ములా లోని -1 అన్న సంఖ్యను విలీనం చేయవచ్చును. ఋణాత్మకసంఖ్య వచ్చిన చోట అదనంగా ఒక 7ను కలిపితే సరి. ఇప్పుడు సరి చేసిన ఇండెక్సులు ఇలా ఉంటాయి.

 6 2 2 5
 0 3 5 1
 4 6 2 4

అలాగే ఈ -1 లేకుండా శతాబ్ది సంస్కారంతో సహా వారగణన సూత్రం
   సంవత్సరం + సంవత్సరం/4 + నెలకు(కొత్త) ఇండెక్స్ + తేదీ -  2 x ( శతాబ్దిని 4తో భాగించితే వచ్చే శేషం)

ఉదాహరణకు:

1818-10-9: 18+4+6+9-4 = 33 = 5 శుక్ర
1918-10-9: 18+4+6+9-6 = 31 = 3 బుధ
2018-10-9: 18+4+6+9-0 = 37 = 2 మంగళ

కాని ఇలా కొత్త ఇండెక్సులను వాడటాన్ని నేను ప్రోత్సహించను. మొదట ఇచ్చిన ఇండెక్సు టేబుల్ మాత్రమే వాడటం మంచిది. అలా ఎందుకు అన్నది వచ్చే టపా వారగణనం-3 లో చెబుతాను.

అసక్తి ఉంటే మీరూ ప్రయత్నించండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన గణితం ప్రకారం లీపు సంవత్సరాలలో మాత్రం జనవరి, ఫిబ్రవరి నెలలకు సమాధానాన్ని ఒకరోజు వెనక్కు జరపాలి.

2, జనవరి 2020, గురువారం

పరమాత్ముడని మీరు భావించరే


పరమాత్ముడని మీరు భావించరే
మరువక సేవించరే మన రాముని

రాముడే సర్వజగద్రక్షకుడను నమ్మికతో
రాముడే సర్వమని రక్తి మీఱగ
రామపూజనాదులను రమ్యముగ చేయరే
రామభక్తులార మీ ప్రేమ చాటరే

వీని యశోవ్యాప్తికై వీధులలో నిలబడి
పూని వివిధరీతుల పొలుపు మీఱగ
వీని గుణగానమ్మును విడువకుండ సేయరే
వీని కథలు వర్ణించి వినిపించరే

పదుగురకు రామనామ పరమమంత్రంబును
ముదమార నేర్పించ కదలి రారే
సదయుడౌ రామచంద్రజగత్ప్రభువు సేవకు
కదలించి జనావళిని ఘనతకెక్కరే


1, జనవరి 2020, బుధవారం

నిద్రాభోగం

నిద్రాభోగం అంటే అది అలాంటిలాంటి భోగం కాదు. చాలా గొప్పభోగం. ఆ సంగతి అనుభవం లోనికి వస్తేనే కాని తెలియదు. ఆ అనుభవం లోనికి రావటం కూడా అంత తేలిక కాదు.

నిద్రాభోగం అనటం బదులు నిద్రాసుఖం అనవచ్చును. సుఖనిద్ర అన్నమాట అందరూ వింటూనే ఉంటారు కదా. అందుచేత సుఖనిద్ర అంటే బాగుంటుందేమో. ఈ వ్యాసానికి పేరుగా అదే అనుకున్నాను ముందుగా. కాని అలోచించగా అది సరిపోదని తోచింది.

నిద్రాభాగ్యం అని కూడా ఒక ముక్క తోచింది. ఇదీ బాగుందే అనుకున్నాను. ఎందుకో చెప్తాను. భోగభాగ్యాలు అన్న మాటను మీరంతా వినే ఉంటారు. అసలు అవేమిటో ఒకసారి చూదాం. సాధారణంగా భాగ్యం అంటే సంపద అనీ అదృష్టం అనీ అర్ధం తీస్తూ ఉంటాం. ముఖ్యంగా సంపద అని ఎక్కువగా వాడుక.

దేవుడికి భగవంతుడు అన్న పర్యాయ పదం అందరికీ తెలిసిందే. ఈమాటకు అధారం భగం అన్న శబ్దం. ఈ భగ శబ్దమే భాగ్యం అన్న పదానికీ ఆధారం.

భగం అంటే శ్రీ అనీ, సంపద అనీ, తెలివీ, ఇఛ్చా జ్ఞాన వైరాగ్యాలనీ, ఐశ్వర్యం అనీ, బలమూ, కీర్తీ, ప్రయత్నమూ, ధర్మమూ మోక్షమూ అనీ ఇలా చాలానే అర్ధాలున్నాయి. సంపద దండిగా ఉన్నవాడిని భాగ్యవంతుడు అనేస్తున్నాం.  ఇవన్నీ ఉన్నవాడు ఒక్క దేవుడే. కాబట్టే ఆయన్ను భగవంతుడు అనటం. స్త్రీయోనికి కూడా భగం అన్న పేరుంది. ఇదెక్కువగా ప్రచారంలో ఉన్నట్లుంది.

వేదాంత పదకోశికలో శ్రీ, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, యశస్సు, ఆనందం అనే ఆరింటికీ కలిపి భగం అని పేరు అనీ ఈ ఆరులక్షణాలూ ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి భగవంతుడు అంటాం అనీ ఉంది.

భగమును కలిగి ఉండటమే భాగ్యం. అంటే భగవల్లక్షణాల్లో ఒకటో అరో ఉంటే వాడు ఎంతో కొంత భాగ్యవంతు డన్నమాట నిజానికి.

విషయానికి వద్దాం. మంచి నిద్ర కూడా ఒక సంపద అన్న సంగతిని గుర్తించాలి. అందుచేత నిద్రాభాగ్యం అంటే నిద్ర అనే మంచి సంపద అని నా ఉద్దేశం. భాగ్యం అంటే అదృష్టం కూడా. కాబట్టి మంచి నిద్రకు నోచుకోవటం అని చెప్పుకోవచ్చును.

ఐనా బాగా అలోచించి చివరికి నిద్రాభోగం అని ఖరారు చేసాను. సుఖం అన్న పేరు చాలా సాదాసీదాగా ఉంది. భోగం అన్న పేరు కొంచెం దర్జాగా ఉంది. నిజానికి భోగం అన్నా సుఖమే. అయితే కించిత్తు తేడా ఉంది. కనీసం నా ఉద్దేశంలో ఉంది.

సుఖం అన్నది ఒక స్థితి. అది మానసికం. ఒక సమయంలో మనం ఆనందంగా ఉండటాన్ని తెలియజేస్తుంది. అది అవిఛ్ఛిన్నమా కాదా అన్నది అక్కడ అర్ధంలో అస్పష్టం. భోగం అనేదీ మానసిక స్థితినే చెప్తుంది. కాని అది ఒక వ్యక్తి యొక్క స్థితిని బయటకు వ్యక్తీకరించే పదం. అందులో ఆ వ్యక్తి అప్పుడప్పుడూ అని కాక నిత్యం సంతోషంగా సుఖంగా ఉండటాన్ని చెప్తున్నది.

అందుచేత భోగభాగ్యాలు అన్నప్పుడు సంపదను కలిగి ఉండటాన్నీ, దాన్ని అనందంగా అనుభవించటాన్నీ కలేసి చెప్పుకోవటం అన్నమాట.

అందుచేత ఎవడికన్నా సాధారణంగా నిత్యం హాయిగా నిద్రపోయే అదష్టం ఉందనుకోండి. అది వాడి భాగ్యం. అలా ఉండటాన్ని వాడు అనందించగలగటం వాడి భోగం అన్నమాట.

అందుకని నిద్రాభోగం అన్నాను. తెలిసింది కదా.

ఈ నిద్రాభోగం అందరికీ దొరికేది కాదు. మనక్కావాలంటే దాన్ని దొరకబుచ్చుకోవటం కూడా అంత సుళువు కూడా కాదు.

ఒకాయన ఉన్నాడు. ఆయన భార్య బ్రహ్మాండంగా గురకపెడుతుంది. ఆ మానవుడికి నిద్రాభోగం దూరమే కదా. తద్విపరీతం కూడా అంతే నిజం. ఆయనే గురకేశ్వర రావు ఐతే ఆ యింటి పార్వతీదేవమ్మకి నిద్రాభోగం గగనకుసుమమే. ఈరోజుల్లో ఐతే ఎవ్వరూ ఏడింటి దాకా లేవటం లేదు.  పూర్వం ఐతే ఆడవాళ్ళు మూడున్నరకో నాలుక్కో లేవవలసి ఉండేది పాపం.

కొందరు నిద్రలో కలలు వచ్చి పొలికేకలు పెడతారు. అప్పుడప్పుడే లెండి అస్తమానూ కాదు. ఆకేకలు విన్నవాళ్ళకు ఎంత నిద్రలో ఉన్నా మెలుకువ రావటం ఖాయం. గుండెలు మహావేగంగా డబాడబా కొట్టుకోవటం ఖాయం. అలాంటి వాళ్ళ ప్రక్కనున్న జీవులకు నిద్రాభోగం ఎంత అపురూపమో ఆలోచించండి.  ఎందుకలా కేకలు పెడతారూ నిద్రలో అంటే వాళ్ళలో గూడుకట్టుకొన్న భయాలూ అభద్రతాభావాలూ వంటివి కారణం అంటారు.

అభద్రతాభావం అంటే గుర్తుకు వచ్చింది.  పనివత్తిడి వంటివి కూడా అభద్రతకు కారణమే. వత్తిడి ఒకమాదిరిగా ఉన్నప్పుడు వారి అభద్రతాభావం కారణంగా పీడకలలు వస్తాయి. వత్తిడి మరీ ఎక్కువైన పక్షంలో అసలు నిద్రకే దూరం కావచ్చును.

పని వత్తిడి అంటే నాకు సాఫ్ట్‍వేర్‍ జనాభా గుర్త్తుకు వస్తారు. అదేదో సినిమాలో బ్రహ్మీ ది సాఫ్ట్‍వేర్ ఇంజనీరుగా బ్రహ్మానందాన్ని పెట్టి వాళ్ళను జోకర్లను చేసారు. కాని వాళ్ళెప్పుడూ పాపం డెడ్‍లైన్ల మీదే బ్రతుకీడుస్తూ ఉంటారు. అది అసలే అభద్రమైన ఉద్యోగరంగం. వాళ్ళకు కార్మికసంఘాల్లాంటివి ఉండవు కదా. ఎప్పుడు ఉద్యోగం పీకినా నోర్మూసుకొని బయటకు పోయి మరొకటి వెతుక్కోవాలి. అందుచేత వాళ్ళకు ఉద్యోగంలో ఉన్నా నిద్రాభోగం ఉండదు ఉద్యోగం లేకపోయినా ఉండదు.  ఏమాట కామాట చెప్పుకోవాలి. ఈకాలంలో కార్మికసంఘాలకు యాజమాన్యాలు ఆట్టే విలువ ఇస్తున్నట్లు లేదు. ఈమధ్య గవర్నమెంట్లూ ఆట్టే విలువ ఇవ్వటం లేదు. ఈమధ్య అనకూడదు లెండి. జార్జి ఫెర్నాండెజ్‍ గారి నాయకత్వంలో ఎనభైలో కాబోలు ఎనభై రోజులు సమ్మె చేస్తే ఇందిరమ్మ ఖాతరు చేయలేదుగా.

అనారోగ్యం అన్నది కూడా నిద్రను దూరం చేస్తుంది తరచుగా. చివరికి చెయ్యి బెణికినా సరే అది సర్ధుకొనే దాకా నిద్రుండదు కదా. మన అనారోగ్యం అనే కాదు, కుటుంబసభ్యుల్లో ఎవరికి అనారోగ్యం కలిగినా  నిద్రాభోగం లేనట్లే.

ఒక్కొక్క సారి అనారోగ్యం కలిగిన వారు హాయిగా నిద్రపోతూ ఉండవచ్చును. కాని మిగిలిన వాళ్ళకే సరిగా నిద్రుండదు. వారిని గమనిస్తూ ఉండాలి జాగ్రతగా. మాటవరసకు మధుమేహం ఉన్నవాళ్ళకి రాత్రి నిద్రలో సుగర్ డౌన్ ఐతే? చాలా ప్రమాదం కదా. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అలా డౌన్ ఐనా సరే నీరసం వచ్చినా మెలకువ రాకపోయే అవకాశం ఉంది. ఎవరూ గమనించక పోతే అది కోమాకు దారి తీయవచ్చును. కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తరచుగా ఒంటి మీద చేయి వేసి మరీ పరీక్షిస్తూ ఉండాలి చెమటలు పడుతున్నాయేమో అన్నసంగతిని. ఈకాపలాదారులకు నిద్రాభోగం ఎక్కడిది?

అసలు పిచ్చిగా ఏదన్నా ధ్యాసలో పడ్డా నిద్ర పారిపోవచ్చును. కొందరికి విజ్ఞానదాహం ఉంటుంది ఎప్పుడూ ఆలోచిస్తూనో పరిశోధిస్తూనో ఉంటారు. నిద్రా సమయంలో ఏదన్నా ధ్యాస వచ్చిందా నిద్ర గోవిందా. న్యూటన్ మహశయుడైతే దాదాపు తెల్లవారుజాము దాకా పనిచేసుకుంటూనే ఉండే వాడట. ఐనా, ఎంత కాదనుకున్నా అలసి నిద్రపోవలసి వస్తుంది కదా.  ఆయన గారి పెంపుడు పిల్లి బయట డిన్నరు చేసొచ్చి తలుపు కొట్టే సమయమూ ఆయన నడుం వాల్చే సమయమూ తరచు ఒక్కటయ్యేవట. దానితో ఆయన వడ్రంగిని పిలిచి వీధి తలుపుకు రెండు కన్నాలు చేయమన్నాడట. పిల్లి గారి కొకటి. ఆపిల్లి గారి పిల్లగారి కొకటి. అది కూడా తల్లితో పాటే డిన్నరు చేసి వచ్చేది కదా మరి.  అసలు సైంటిష్టులు మనలా ఆలోచిస్తే ఎలా? వాళ్ళకీ మనకీ ఆమాత్రం తేడా ఉండద్దూ ఆలోచనల్లో.

పిచ్చి అంటే పని పిచ్చి అనే కాదు. తిండి పిచ్చి కూడాను. ఒక ముద్ద ఎక్కువ తింటే నిద్ర రానుపో అనవచ్చును. ఐనా సరే ఒక ముద్ద తక్కువ తినటానికి అలాంటి వాళ్ళలో ఎవరూ సిధ్ధపడరు మరి. ఈ తిండిపిచ్చి నేరుగా నిద్రమీద దాడి చేయకపోయినా మెల్లగా ఏదో అనారోగ్యానికి దారి తీస్తుంది. అప్పుడు అది నిద్రకు ఎసరు పెడుతుంది.

ఇంటి బాద్యతలతో నిద్రాభోగం చాలా మందికి అందదు. వయస్సు కాస్తా మీదపడిందా, ముప్పాతిక మువ్వీసం మందికి నిద్రాభోగం తగ్గిపోతుంది. దానికి తోడు అనారోగ్యాలు కూడా పలకరించాయా నిద్ర పలకరించటం మానేస్తుంది. ఇంటికి కాని పెద్దకొడుకుగా పుట్టాడా వాడికి  మంచి వయస్సులో ఉన్నా ఆట్టే నిద్రాభోగం ఉండదు. అంటే వెరసి యావజ్జీవం అలాంటి వాళ్ళకి నిద్రాభోగం అందని మ్రాని పండే అన్నమాట.

మంచి వయస్సులో ఉన్న వాళ్ళు అంటే గుర్తుకు వచ్చింది. వాళ్ళకి నిద్రాభోగాన్ని దూరం చేసేది పిల్లపిడుగులు. వాళ్ళు రాత్రి అంతా గుక్క త్రిప్పుకోకుండా కచేరీ చేయగలరు. వాళ్ళు కాస్త పాపం పెద్దవాళ్ళని పడుకోనిధ్ధాం అనుకొనే వయస్సుకు వచ్చే దాకా తిప్పలు తప్పవు. ఈబీ నాష్‍ అని పూర్వం ఒక హోమియోపతీ వైద్యశిఖామణి ఉండే వాడు. అయనింకా శిఖామణి స్థాయికి రాక ముందు వచ్చిన ఒక కేసు గురించిన ముచ్చట చూడండి. ఒకావిడ బిడ్డను తీసుకొని వచ్చింది. రాత్రంతా ఏడుపే, మందివ్వండి అని. ఒకటేమిటి, కుర్రడాక్టరు గారు చాలా మందులే ప్రయత్నించారు. ఫలితం ఏమిటంటే బిడ్డ ఇప్పుడు రాత్రీ పగలూ అని తేడా చూడటం లేదు. ఒకటే ఏడుపు. ఇలా మానవప్రయత్నాల్లో భాగంగా ఆయన జలాపా అన్న మందుని ఇచ్చారట. అది పని చేసింది. అదీ జలాపా ప్రయోజనం అని నాష్ గారు ఆ మందుని వివరించారు.

కొంచెం పెద్దపిల్ల లుంటారు. వాళ్ళకీ నిద్రాభోగం దొరకటం కష్టమే. పోటీపరీక్షల కోసం కోచింగు సెంటర్లవాళ్ళు హడలేసి రాత్రీపగలూ అనకుండా తోముతూ ఉంటే, నిద్ర అన్నది వాళ్ళకి అందని మహాభోగంగా మారిపోతుంది.జీవితం అంటే డబ్బు సంపాదన. దానికి ఆధారం మంచి కెరీర్. దానికి దారి పోటీపరీక్షలు అని బుర్రల్లోకి బాగా ఎక్కించటం కారణంగా ఎక్కడ దెబ్బతిన్నా కొందరు పిల్లలు ఐతే డిప్రెషన్ లోనికి వెళ్తున్నారు లేదా మనని విడిచి పోతున్నారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు అన్నీ కాళరాత్రులే సంవత్సరాల తరబడి.

రాత్రి నిద్ర చాలకపోతే ఏంచేస్తాం. వీలు కుదిరితే పగలు కొంచెం పడక వేస్తాం. వినటానికి బాగానే ఉంది. కాని వీలే కుదిరి చావదు. సెలవు రోజు కాకపోతే ఎలాగూ అది కుదరదు. కాని సెలవు రోజున మాత్రం కాస్త ఆ నిద్రాభోగం కోరుకోవటం మామూలే. ఆట్టే తప్పు కాదు కూడా. ఏవో ఇంటి పనులుంటాయి. లేదా కుటుంబసభ్యులు సినిమా అనో మరొకటో చెప్పి బయలుదేర దీస్తారు.

అదేం లేదు. కుదిరింది. ఇంకేం పడక వేసారు. కొంచెం మాగన్ను పడగానే మొబైల్ మోగుతుంది. ఎవరన్నా స్నేహితులు కావచ్చును కదా అని ఫోన్ ఎత్తుతారు.  ఏదో బ్యాంకి వాడు. మీకు లోన్ ఇస్తానంటాడు. తిట్టి పెట్టేస్తారు. మళ్ళీ పడుకుంటారు. ఇంతలో మరొక ఫోన్. ఈసారి ఎవడో ప్లాట్లు కావాలా అని మొదలు పెడతాడు. ఏడుపూ వస్తుంది. తిక్కా పుడుతుంది. ఓసారి నాకలాగే తిక్కరేగి రూపాయి కెన్నిస్తున్నారూ ప్లాట్లూ అని అడిగాను. పోనీ లెండి నిజంగానే ఎవరో తెలిసిన వాళ్ళ ఫోన్ అనుకుందాం. వాళ్ళు ఫోన్ వదలరు. మీకు నిద్ర వదిలి పోతుంది. ఇంక రోజంతా తిక్కతిక్కగా ఉంటుంది.

మీకు ఉపాయం తెలిసింది కదా? మొబైల్ పీక నొక్కి మరీ పడుకోవాలీ అని!

ఒక్కోసారి హఠాత్తుగా కాలింగ్ బెల్‍ మోగుతుంది. మీ మధ్యాహ్ననిద్రాప్రయత్నం మీద దెబ్బకొడుతూ. ఇంటికి అతిథులు వస్తారు. అందరి చేతుల్లోనూ ఒకటో రెండో మొబైలు ఫోనులు ఉంటాయి. మళ్ళా ఒక్కొక్క దాని లోనూ ఒకటో రెండో సిమ్‍ కార్డు లుంటాయి. ఐనా మీకు ఏ ఒక్కరూ కాల్‍ చేయరు. నేరుగా వచ్చి మీ బ్యూటీస్లీప్ మీద దాడి చేస్తారు.  ఇంకా తమాషా ఏమిటంటే మీరు తలుపు తీసే సరికి ఆ వచ్చిన అతిథుల్లొ కొందరు తమ ఫోన్ల మీద చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటారు. అదీ మీ యింటి గుమ్మం ముందు నిలబడి. ఏదో ఒకటి మీకు నిద్రాభోగం లేదంతే.

ఒక వేళ మీరు కాని మొబైల్ పీకనొక్కి మరీ నిద్రపోతుంటే అప్పుడొస్తుంది డైలాగ్. అతిథుల నుండే లెండి. వాళ్ళలో ఒకరు తప్పకుండా అంటారు. కాల్ చేస్తే తీయలేదూ. పనిలో ఉన్నారో లేక మీఫోను ఛార్జింగులో ఉందో అనుకున్నాం. ఎలాగూ ఈప్రాంతానికి వచ్చాం కాబట్టి ఉన్నారేమో చూసి వెళ్దామని వచ్చాం అంటారు. మీకు ఏడవాలో నవ్వాలో తెలియదు. అదంతే.

ఒక్కొక్క సారి,  ఇంటి నుండి పారిపోవాలీ అనిపిస్తుంది. ఎక్కడికన్నా పోయి నాలుగు రోజులు ఉండాలీ అనిపిస్తుంది. అదీ ఈ దిక్కుమాలిన ఫోన్ నోరు మూసి మరీ. అబ్బే కుదిరే పని కాదు లెండి. అన్ని వ్యవహారాలూ ఈఫోను మీదనే కదా. అది కాస్తా మూసుకొని కూర్చుంటే ఏమన్నా ముఖ్యమైన సమాచారాలూ వగైరా తప్పిపోవచ్చును కదా. అస్సలు మన చేతిలో లేదండీ మన జీవితం.

ఈ మొబైల్ ఫోనుల కారణంగా నిష్కారణంగా నిద్రాభోగాన్ని చెడగొట్టుకునే వాళ్ళూ ఉన్నారు. వాళ్ళకు తెలియటం లేదు పాపం. కళ్ళు పొడిబారి నిద్ర దూరం అయ్యేదాక రాత్రంతా ఆ దిక్కుమాలిన ఫోనుతో కాలక్షేపం చేస్తారు. వాటిలో  సినిమాలు చూసే వాళ్ళున్నారు. వాటిలో ఏవేవో పిచ్చిపిచ్చి గేమ్స్ ఆడుతూ కూర్చునే వాళ్ళున్నారు. ఇదంతా కేవలం కుర్రకారు వ్యవహారం అనుకోకండి. కొందరు పెద్దలదీ ఇదే తీరు. వీళ్ళు నిద్ర ఎంత అవసరమో గుర్తించటం లేదు. మంచి నిద్ర ఎంత గొప్ప భోగమో తెలుసుకోవటం లేదు.

భగవద్గీతలో ఒక ముక్క ఉంది. మనవి చేస్తాను. "యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి  భూతాని  సా  నిశా  పశ్యతః  మునేః" అని రెండవ అధ్యాయంలో వస్తుంది ఒక శ్లోకం. అది అరవై తొమ్మిదవది అక్కడ. జీవులంతా రాత్రి నిద్రపోతుంటే యోగులు ఆ సమయంలో మెలకువగా ఉంటారని ఈశ్లోకం చెబుతోంది. ఐతే ఆ ప్రాణులన్నీ మెలకువగా లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలే పగళ్ళు యోగులకు మాత్రం రాత్రులట. లౌకిక వ్యవహారాలకు కదా పగలు. అవి లేని సమయం రాత్రి. యోగులకు లౌకిక వ్యవహారాలు పట్టవు కాబట్టి ఆపగళ్ళు వాళ్ళకు రాత్రుల వంటివే అన్నమాట. రాత్రులు వారు పారలౌకిక వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. కాబట్టి మన రాత్రులు వాళ్ళకు పగళ్ళ వంటివి. వడ్ల గింజలో బియ్యపు గింజ.

ఏతావాతా యోగులు రాత్రులు నిద్రపోరు. రోగులూ నిద్రపోరు. నిద్రాభోగం లేక రోగులు తమ గురించీ ప్రపంచవ్యవహారాల గురించీ ఆలోచిస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉంటారు. యోగులు మాత్రం భగవంతుడి గురించిన ఆలోచనల్లో ఎప్పుడు తెల్లవారినదీ  కూడా సరిగ్గా గమనించే స్థితిలో ఉండరు.

నేనే మంతగా చెప్పుకోదగిన యోగిని కాదు. ఆ మాటకు వస్తే యోగిని అని చెప్పుకోదగిన వాడినే కాదు. కాని తరచూ నా రాత్రులు కూడా ఆ కోవలోనికి వచ్చేస్తున్నాయి. ఈ రాము డొకడు. ఈయన పుణ్యమా అని చాలా రాత్రులు నిద్ర పట్టటం లేదు.

ఇన్నేళ్ళుగా ఈ ఉపాధిలో ఉన్న జీవుడి నుండి వందలాది రామకీర్తనలు వచ్చాయి. అందులో అనేకం ఆయన పుణ్యమా అని వేళాపాళా లేకుండా రాత్రిపూటల్లో వచ్చినవే! అలా యెందుకు రావాలీ అంటే అది ఆయన యిష్టం. అవి ఎప్పుడు రావాలో చెప్పటానికి నేనెవడిని.

ఇలా రామచింతన నన్ను నిద్రాభోగానికి దూరం చేసింది. అందుకని చింత యేమీ లేదు. యోగసాధనలో భోగత్యాగం వీలైనంతగా చేయవలసిందే. ఐతే ఈముక్క కూడా ఎందుకు చెప్పటం అనవచ్చును. బాగుంది. చెప్పకుండా దాచుకోవటం మాత్రం ఎందుకు? అదేం తప్పుపని కాదే సిగ్గుపడి దాచేసేందుకు. పైగా ఈనా అనుభవం మరొకరికి పనికి రావచ్చును. గీతలో బోధయంత పరస్పరం అన్నాడు కదా. ఏమో ఈ విషయం ఎవరికి ఉపయోగపడుతుందో. పడనివ్వండి. చెప్పటం ఐతే నావంతుగా చెప్పేసాను.

  • భగవద్గీతలో "యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా" అని ఒక శ్లోకం ఉంది భగవా నువాచగా.  స్వప్నావబోధ అంటే కలల లోకం నుండి ఇహలోకం లోనికి విచ్చేయటం. అసలు ముందు మనం స్వప్నజగత్తులోనికి అడుగుపెట్టాలి కదా. అంటే నిద్రాభోగం ఉండి తీరాలి కదా. వత్తిడిలో ఏదో నిద్ర పట్టిందని పించుకున్నా అప్పుడు పీడకలలు వస్తాయి తరచుగా. అబ్బే అది యుక్త స్వప్నావబోధ చచ్చినా కాదు. ఇంక అదేం ఉపకరిస్తుంది మనకి. యోగి కావటం మాట దేవుడెరుగు.

అందుచేత యావన్మంది ప్రజలారా,  సరైన నిద్ర అనేది ఒక భోగం అని గుర్తుపెట్టుకోండి. దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి.

వీ డన్నకు ప్రాణమైన వాడు


వీ డన్నకు ప్రాణమైన వాడు మా  లక్ష్మణుడు
వీడు నాకు ప్రాణమైన వాడు రాముడు

మునివర వీ రిరువురు మీ ముందు నిలచి యున్నారు
వినయశీలురైన బాలవీరులు వీరు
వనములకు వచ్చి మీ సవనమును రక్షించుటకు
ఇనకులాలంకారుల ననుమతించుడు

నేల మీద నడచుచున్న నిండుచందమామలను
చాల సుగుణవంతుల మీచరణయుగళిపై
చాల భక్తి తోడ నేను సమర్పణము చేసితినిదె
యేలు కొనుడు మీ సొమ్ము లీబాలకులు

వరయజ్ఞఫలము లనగ ప్రభవించిన బాలురను
వరయజ్ఞరక్షణకై పంపుచుంటిని
పరమసంతోషముతో పంపుచుంటి నాబిడ్డల
వరమునీంద్ర మీదే యిక భారమంతయు