29, మార్చి 2017, బుధవారం

ఉగాది


అరువది యైదు వచ్చిన వుగాదులు నే జనియించి నేటికిన్
వరుసగ వచ్చిపోయినవి వన్నెలపూల వసంతకాలముల్
చురచుర మండు నెండలును క్షోణితలంబును ముంచువానలున్
పరమమనోహరంబులన వచ్చు శరత్తులునుం సమస్తమున్

పరువము వచ్చి పోయెనది వచ్చుటయే గమనించనైతి నా
గరువము వచ్చి పోయెనది కాలప్రవాహము కొంచుపోవగన్
మరణము పల్కరించినది మానక మాటికి నీశ్వరాజ్ఞచే
మరలక దేహమందు తిరమైనవిధంబున నుంటి నేడిటుల్

వచ్చె వసంతకాలమని పండువ చేయగ నెల్లవారలున్
మెచ్చి కవీంద్రులందరును మేలిమికైతల గుప్పుచుండగన్
ముచ్చటగా నుగాది మన ముందుకు వచ్చెను కాని నేటికే
హెచ్చిన యెండవేడిమికి యెందును కోయిల కూతలుండెనే

ఐనను సంప్రదాయమని యందరు చేయు వసంతగానముల్
వీనుల విందుగా వినుచు వేడుక చేయుచు క్రొత్త యేట రా
నైన శుభాశుభాదికము లాత్రుతమీఱ విమర్శ చేయుచున్
నేనును హేమలంబికి ననేక ప్రణామము లాచరించెదన్
  

26, మార్చి 2017, ఆదివారం

అకారాద్యక్షరమాలా శివస్తోత్రమ్


అత్యంతసుఖసంతోషప్రదాయ పరమాత్మనే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఆత్మరూపాయ వృధ్ధాయ అనుగ్రహపరాయతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఇనచంద్రాగ్నినేత్రాయ ఈశ్వరాయ నమోస్తుతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఈశానాయచ విఘ్నేశగురవే గురురూపిణే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఉమానాథాయ శర్వాయ లోకనాథాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఊర్థ్వలింగాయ పూజ్యాయ దివ్యలింగాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఋగాదివేద వేద్యాయ దుఃఖనాశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఏకానేకస్వరూపాయ  శోకాదివర్జితే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఐశ్వర్యదాయ విశ్వాయ విశ్వసంపూజితే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఓంకార వాచ్యరూపాయ మహాదేవాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఔక్థికప్రీతచిత్తాయ మహారూపాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

కాలాయ కాలకాలాయ కాలకంఠాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఖగరాడ్వాహసంపూజ్యమానదివ్యాంఘ్రియుగ్మతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

గజచర్మాంబరాఛ్ఛాధ్యసుశ్వేతవపుషే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఘోరశ్మశానవాసాయ గతాతతాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జ్ఞానరూపాయ శాంతాయ ధ్యానగమ్యాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

చంద్రచూడాయ నిత్యాయ లోకప్రియాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఛందోనువాకస్సంస్త్యుస్త్య నిజప్రభావతే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జన్మమృత్యుజరాబాధానివారకాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఝుంకారభ్రామరీయుక్త శ్రీశైలాధిప తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జ్ఞానగమ్యాయ యజ్ఞాయ వ్యాళరూపాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

టంకటీకాయ త్వష్టాయ త్రికంటకాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఠంకారమేరుకోదండయుక్తహస్తాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

డమరుకసృష్టవాక్ఛాస్త్రమూలసూత్రాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఢంకాతూర్యాదికస్సర్వవాద్యప్రియాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

నిస్తులాయ ప్రసన్నాయ గిరిధన్వాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

తత్త్వమసీతివాక్యార్థ లక్ష్యరూపాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

స్థాణవే సర్వసేవ్యాయ జంగమాధిప తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

దుఃఖనాశాయ సూక్ష్మాయ మహాకేశాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ధ్రువాయాభివాద్యాయ హరిణాక్షాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

నృత్యప్రియాయ హైమాయ హరికేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

పంచవక్త్రాయ భర్గాయ పరమేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఫాలనేత్రాయముఖ్యాయ సర్వవాసాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

బలాయ శిపివిష్ఠాయ జటాధరాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

భవాయ భవనాశాయ భూతనాథాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

మహాతపాయ సోమాయ వామదేవాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

యమగర్వాపహర్తాయ నిరవద్యాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

రుద్రాయ లోహితాక్షాయ బహురశ్మిశ్చ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

లింగాద్యక్షాయ సర్వాయ మహాకర్మాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

విరూపాక్షాయ దక్షాయ వ్యోమకేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

శత్రుఘ్నాయ భవఘ్నాయ ధర్మఘ్నఘ్నాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

షడధ్వాతీతరూపాయ షడాశ్రయాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

సర్వవేదాంత సారాయ సద్యఃప్రసాదినే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

హరాయ లోకథాతాయ హరిప్రియాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

లలాటాక్షాయ వైద్యాయ పరబ్రహ్మాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

క్షేమంకరాయ యోగీంద్రహృన్నివాసాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.23, మార్చి 2017, గురువారం

స్వయంప్రభ


వేణువు బ్లాగర్ వేణుగారు ఆ నవల కోసం.... ఏళ్ళ తరబడి సాగిన అన్వేషణ!  అనే అద్భుతమైన టపా వ్రాసారు. ఆ టపాకు నేను వ్రాసిన వ్యాఖ్యలో నేను స్వయంప్రభ అన్న నవల ప్రస్తావన తెచ్చాను. నేనూ ఆ స్వయంప్రభ నవల ఎక్కడన్నా దొరికితే బాగుండునని చూస్తున్నాను మరి. ఆనవల కథ నాకింకా గురుతు ఉన్నదనీ ఆవిషయమై ఒకటపా వ్రాస్తాననీ వేనుగారితో అన్నాను. ఇదిగో అటపా.
 
ఈ స్వయంప్రభ అన్న పేరే చాలా ఆకట్టుకుంది.  శ్రీమద్రామాయణంలో వానరులు సీతాన్వేషణం చేస్తూ పోయి, ఒక గుహలో ప్రవేశించి చూసి, అందులో చిక్కుపడి బయటికిపోయే దారితెలియక అందులోనే తిరుగుతూ, అక్కడ ఒకచోట తపస్సు చేసుకుంటున్న ఒకామెను చూస్తారు. ఆమె పేరు స్వయంప్రభ. అమె వారి కథ విని, వారికి బయటకు పోయే మార్గం చూపుతుంది.

స్వయంప్రభ అంటే స్వప్రకాశం‌ కలవ్యక్తి అని అర్థం వస్తుంది. అంటే తన వ్యక్తిత్వం ద్వారానే అందరినీ ప్రభావితం చేసే వ్యక్తి అన్నమాట. బాగుంది కదా?

ఈ నవల రచయిత పేరు అట్టమీద కె.సుబ్బయ్య అని ఉంది. ఈ విషయం ఇన్ని దశాభ్దాలు గడిచినా కచ్చితంగా గుర్తు ఉంది. ఈ సుబ్బయ్య గారి గురించిన వివరాలేవీ తెలియవు ఇప్పటికీ‌ నాకు.

"స్వయంప్రభ" నవలలో ప్రారంభవాక్యం. ఈ రోజు అమ్మ నన్ను బడికి వెళ్ళవద్దంది అని ఉందని బాగా గుర్తు. ఆతరువాతి వాక్యాల్లో మాప్లిమౌత్ కారు కూడా అమ్మేశారు. మేము మా పెద్ద బంగాళాలో నుండి ఊరి చివర ఒక చిన్న ఇంట్లోకి మారాం అంటూ స్వయంప్రభ స్వగతంతో నవల మొదటి పేరా మొదలు అవుతుంది.

నిజానికి ఈ‌ నవల అంతా స్వయంప్రభ అనే స్త్రీమూర్తి తనకథను మనకు చెబుతున్నట్లుగా నడుస్తుంది.

స్వయంప్రభ తండ్రి ఒక వ్యాపారస్థుడు. ఉండేది విజయవాడలో. ఆ పిల్ల రోజూ కారులో బడికి వెళ్ళేది ఆ రోజుల్లోనే. ఉన్నట్లుండి రోజులు మారాయి. తండ్రి వ్యాపారం దివాళా తీసింది. ఆస్తి అంతా పోయింది. కారూ బంగాళా అన్నీ‌ పోయాయి. చదువు మానేసింది. ఊరి చివర ఒక మురికివాడకు చేరింది ఆ అమ్మాయి కుటుంబం.  తండ్రి ఒక చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. తల్లి నాలుగిళ్ళలో పాచిపనికి వెళ్ళసాగింది.

తీరికసమయాల్లో  అక్కడి పాటకజనంలో ఉన్న దురలవాట్లను మానిపించటానికి స్వయంప్రభ తలిదండ్రులు కృషిచేస్తున్నారు.

తండ్రి గతించి, పరిస్థితులు ఇంకా దిగజారతాయి. ఒకసారి తల్లి కొద్దిగా జబ్బుపడటంతో చిన్నారి స్వయంప్రభ స్వయంగా తానే తల్లి పనిచేసే ఇండ్లకు వెళ్ళవలసి వస్తుంది.

పనిచేయటానికి వెళ్ళిన ఒకచోట ఒక నరరూపవిషసర్పం‌ కాటుకు గురియైంది స్వయంప్రభ. ఆ అమ్మాయి ఎలాగో పోరాడి తప్పించుకొని వచ్చింది. తనకేమీ కాలేదని ఆ అమ్మాయి భ్రమపడటాన్ని తప్పని ప్రకృతి ఎత్తి చూపింది.
చీత్కారానికి గురియై ఇంటి నీడకు దూరం ఐనది.

ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు ఒక దయామయి ఐన వైద్యురాలి సహాయం‌ లభిస్తుంది. తనకు పుట్టిన బిడ్డ నేలమీదపడిన వెంటనే గతించిందని తెలిసి నిర్వేదానికి గురి ఔతుంది స్వయంప్రభ. అస్పత్రిలో ఎక్కువరోజులు ఉంచుకోరు కదా. మరలా బజారున పడుతుంది ఆమె జీవితం.

ఎక్కడైనా పనిపాటలు చేసుకొని బ్రతుకుదామంటే లోకంలో గృహిణులు అందరూ ఆమె సౌందర్యాన్నీ వయస్సునూ చూసి బెజవాడ జాంపడులా ఉన్నావు నువ్వు పనిచేయటానికి వస్తావా? మా మగాళ్ళని బుట్టలో వేసుకుందుకు వస్తావా? వెళ్ళు వెళ్ళు అని కసిరి పంపేవారే.

చివరకు ఆమెకు ఒక రైల్వే టికెట్ కలెక్టర్ ఆదరణ లభిస్తుంది. ఒక రాత్రివేళ టికెట్ లేకుండా పట్టుబడి అనుకుంటాను. అతడి ఇంట్లో అశ్రయం అంటే - అక్కడ అతడి భార్యాపిల్లలు ఎవరూ లేకపోవటం చూసి విస్తుపోతుంది. అమెను ఇంటిలో దింపి డ్యూటీకి వెళ్ళిపోతాడతను. తను సౌజన్యంతో వర్తించినా, అమె అక్కడినుండి వెళ్ళిపోతుంది.

అనంతర కాలంలో ఆమె ఒక కారు ప్రమాదానికి గురై గాయపడుతుంది. కారు నడిపే వ్యక్తి ఒక ఆగర్భశ్రీమంతుడైన జమీందారు యువకుడు. త్రాగుబోతు. వ్యక్తిగతంగా మిగతా నడవడికలో మంచి బుధ్ధిమంతుడే. అతడు అమెను ఇంటికి తీసుకొనిపోయి వైద్యం చేయిస్తాడు. స్వయంప్రభ యొక్క సత్ర్పవర్తన అతడిలో అనూహ్యమైన మార్పు తెస్తుంది. దుర్వ్యసనాలు మాయం అవుతాయి. అతడికి స్వయంప్రభ అంటే గొప్ప ఆరాధనా భావం. ఆమెను అందరూ జమీందారిణిగా భావించేలా ఆమె స్థితిగతులు మారుతాయి. కాని ఇద్దరిమధ్యనా ఏవిధమైన సంబంధమూ ఏర్పడలేదు.

సంక్రాతికి జమీందారు స్వయంప్రభతో సహా  ఒక గ్రామానికి వెడతాడు. అక్కడి సంక్రాంతి సంబరాలను రచయిత అద్భుతంగా వర్ణిస్తాడు. ముఖ్యంగా ఈ సందర్భంలో బంతిపూలపైన ఆయన వ్రాసిన అమోఘమైన పాట ఒకటి ఉంది.

స్వయంప్రభ తల్లినీ తోబుట్టువులనూ చూడటానికి వెడుతుంది. కాని తన కూతురు ఒక భ్రష్ట అన్న భావనలో ఉన్న తల్లి ఆమెతో మాటలాడేందుకు కూడా తిరస్కరిస్తుంది. తీవ్రవిచారంతో స్వయంప్రభ తిరిగి వెడుతుంది.

కథలో ఇంకొన్ని మలుపులు వస్తాయి.

ఆమెకు కొంత ఆత్మన్యూనత కలుగుతుంది. జమీందారుకు తనను వివాహం చేసుకొనే ఉద్దేశం ఉందని తెలిసి, తానతనికి తగనని భావించి దూరంగా తొలగిపోతుంది. అతడు తట్టుకోలేక మరలా త్రాగుడును ఆశ్రయిస్తాడు. స్వయంప్రభకు ఒకప్పుడు ఆశ్రయం ఇచ్చిన రైల్వే ఉద్యోగి మరలా తారసపడతాడు. భార్య మరణంతో అతడు జీవఛ్ఛవంలా ఉండటం చూసి ఆమె తల్లడిల్లుతుంది. అతడి సోదరిగా అతని వద్దే నిలిచి మరలా మనిషిని చేస్తుంది. ఇలా అనేక సంఘటనల్లో ఆమె వ్యక్తిత్వం ఇతరులకు సహాయపడటంలో ప్రస్ఫుటంగా భాసిస్తూ ఉంటుంది.

మరలా జమీందారు ఆమె జీవితంలోనికి వస్తాడు. కాని ఆమెకు అప్పటికే జీవితంపై ఏవిధమైన స్వకీయమైన కోరికలూ లేని స్థితి. నలుగురికీ సహాయపడాలనే అమె ఆరాటం. తనలాగే ఎందరో సంఘంలో విధివంచితలు. వారికి తానేమైనా చేయాలన్న ఆశయం ఒక్కటే ఆమెను నడిపిస్తుంది. అది ఆమెను ఎరిగిన వారికి ఆమోదం కలిగిస్తుంది.

స్వయంప్రభ చివరకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అభాగినులైన స్త్రీలకు ఆశ్రయం కల్పించి అసరా ఇస్తుంది.

ఇదీ క్లుప్తంగా స్వయంప్రభావృత్తాంతం. ఈ‌నవలను రచయిత చాలా సరళమైన భాషలో, భావోద్వేగాలను చక్కగా పండిస్తూ నడిపించారు.

ఈ రోజున మరలా వెబ్ మీదపడి కొంచెం గాలించగా http://www.wikiwand.com/te/శ్రీ_సూర్యరాయ_విద్యానంద_గ్రంథాలయ_పుస్తకాల_జాబితా_-2  అనే పేజీలో స్వయంప్రభ అన్న 771వ entry కనిపించింది. అది ఈ పుస్తకమే ఐతే ఆనందమే.