6, నవంబర్ 2011, ఆదివారం

నీ కోసం కట్టిన యీ గుడిలో రాకాసులు యెటులో చేరినవి


నీ కోసం కట్టిన యీ గుడిలో
    రాకాసులు యెటులో చేరినవి
నీ కొలువు కెవరూ రాకుండా
    వాకిటనే అవి కాపుండినవి

రసనారాజద్వారము ముంగిట
    నామము లాడుట యాగినది
చెవుల గుమ్మముల చెంగట మ్రోగే
    శుభగుణ గానము లాగినవి

నేత్రద్వారములందిచే శుభ
    హారతి వెలుగులు సమసినవి
సకలద్వారముల పూజాప్రకరణ
    విధులను మూకలు మూసినవి

దేహాలయమున నరిషడ్వర్గము
    దూరిన దెటులో తెలియదయా
పూజలాగినవి వేగమె వాటిని
    తరిమే దెటులో తెలుపవయా

2, నవంబర్ 2011, బుధవారం

కనుపించని నిను చూడాలని నా కనులు రేబవలు తపించునయా

పలుచని స్పృహగల వారు రేబవలు పరితపించినా ఫల మేమి
   తెల్లముగా తమ సత్వమె నీవను  తెలివిడి వారికి లేదు గదా

కనుపించని నిను చూడాలని నా కనులు రేబవలు తపించునయా
  నీ కొక రూపము  లేదని యెఱిగే తెలివిడి వాటికి లేదు గదా

వినిపించని నీ మాటవినాలని చెవులు రేబవలు తపించునయా
   మరి మౌనమె నీ భాషగ నెఱిగే తెలివిడి వాటికి లేదు గదా

ఎటనో దాగిన నిను నా పదములు వెదుక  రేబవలు తపించునయా
    నీకొక తావని లేదని యెఱిగే తెలివిడి వాటికి లేదు గదా

దయగనుమని నిను చేతులు పూజలు చేసి రేబవలు తపించునయా
      చేతులు కాదు చేతలు గుణమను  తెలివిడి వాటికి లేదు గదా

మంత్రములతొ నిను భావించెదనని  రసన రేబవలు తపించునయా
     వట్టి పలుకులకు పట్టుబడవనే తెలివిడి  దానికి లేదు గదా

 యెడబాయని నీ చెలిమి మరగినది యెడద రేబవలు  సుఖించునయా
     తెలివిడి యనగా దానిది కాదా   తెలియును తనలో నిన్ను సదా

1, నవంబర్ 2011, మంగళవారం

నిజము ముమ్మాటికిది యొండె నిజము నిజము

నే  నొకడ ననుచు గలనా
నే నును గలననుచు  జెప్పు నెడల నెవడనన్
పూని వచించిన వాడన
నే నని యెటులందు నీవె నేనై యుండన్

నేను నీకంటె వేఱైతి నేని నన్ను
నేన సృజియించి కొనియుంటి నేమొ లేక
నీవె సృజియించి  యుంటివో నిశ్చయముగ
మంచి ప్రశ్నయె  దీని యోచించ వలయు

నన్నునేనె సృష్టించుకో నగుట పొసగు
నేని మనమధ్య బాంధవ్య మెట్టి దగును
ప్రభుత యిర్వుర యందు కన్పట్టు టెట్లు
కనుక నీవాద మొప్పు గా దనుచు దోచు

నీవు సృష్టించి నావను భావనంబు
నిన్ను కర్తగా సేయక నెట్లు కుదురు
కర్త వగుదేని బోక్తయు గావలయును
కర్మ బంధంబు నీకును కలుగ వలయు

నన్నునేనె సృష్టించుకో నగుట గాని
నీవు సృష్టించి నావను భావనంబు
గాని పొసగమి నేనెట్లు కలిగితినన
దాని కెయ్యది  తగు సమాధానమగునొ

సర్వమిప్పుడు చాల సుస్పష్టమాయె
నిర్వురము వేఱుగా నున్కి నిజము గాదు
మనకు బేధమే లేదన్నమాట యొకటె
నిజము ముమ్మాటి కిది యొండె నిజము నిజము