1, నవంబర్ 2011, మంగళవారం

నిజము ముమ్మాటికిది యొండె నిజము నిజము

నే  నొకడ ననుచు గలనా
నే నును గలననుచు  జెప్పు నెడల నెవడనన్
పూని వచించిన వాడన
నే నని యెటులందు నీవె నేనై యుండన్

నేను నీకంటె వేఱైతి నేని నన్ను
నేన సృజియించి కొనియుంటి నేమొ లేక
నీవె సృజియించి  యుంటివో నిశ్చయముగ
మంచి ప్రశ్నయె  దీని యోచించ వలయు

నన్నునేనె సృష్టించుకో నగుట పొసగు
నేని మనమధ్య బాంధవ్య మెట్టి దగును
ప్రభుత యిర్వుర యందు కన్పట్టు టెట్లు
కనుక నీవాద మొప్పు గా దనుచు దోచు

నీవు సృష్టించి నావను భావనంబు
నిన్ను కర్తగా సేయక నెట్లు కుదురు
కర్త వగుదేని బోక్తయు గావలయును
కర్మ బంధంబు నీకును కలుగ వలయు

నన్నునేనె సృష్టించుకో నగుట గాని
నీవు సృష్టించి నావను భావనంబు
గాని పొసగమి నేనెట్లు కలిగితినన
దాని కెయ్యది  తగు సమాధానమగునొ

సర్వమిప్పుడు చాల సుస్పష్టమాయె
నిర్వురము వేఱుగా నున్కి నిజము గాదు
మనకు బేధమే లేదన్నమాట యొకటె
నిజము ముమ్మాటి కిది యొండె నిజము నిజము

3 కామెంట్‌లు:

  1. మధురమైన పద్యాలు. లోతైన భావాలు. ఉచిత పదప్రయోగం. వెరసి అద్భుతంగా ఉంది మీ కవిత్వం.
    మొదటి పద్యం మొదటి పాదంలో గణభంగం. సరిచేయండి.

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్య గారికి ధన్యవాదాలు. గణభంగం సరి జేసాను. (తమాషా యేమిటంటే నా చిత్తు ప్రతిలో సరిగానే ఉంది. పేజీ లోనికి తెచ్చేటప్పుడు సరిగా టైప్ చేయలేదు!)

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగున్నాయండీ. మీరు లోతైన భావాలని తేలిక పదాలలో అద్భుతంగా అందిస్తున్నారు.

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.