2, నవంబర్ 2011, బుధవారం

కనుపించని నిను చూడాలని నా కనులు రేబవలు తపించునయా

పలుచని స్పృహగల వారు రేబవలు పరితపించినా ఫల మేమి
   తెల్లముగా తమ సత్వమె నీవను  తెలివిడి వారికి లేదు గదా

కనుపించని నిను చూడాలని నా కనులు రేబవలు తపించునయా
  నీ కొక రూపము  లేదని యెఱిగే తెలివిడి వాటికి లేదు గదా

వినిపించని నీ మాటవినాలని చెవులు రేబవలు తపించునయా
   మరి మౌనమె నీ భాషగ నెఱిగే తెలివిడి వాటికి లేదు గదా

ఎటనో దాగిన నిను నా పదములు వెదుక  రేబవలు తపించునయా
    నీకొక తావని లేదని యెఱిగే తెలివిడి వాటికి లేదు గదా

దయగనుమని నిను చేతులు పూజలు చేసి రేబవలు తపించునయా
      చేతులు కాదు చేతలు గుణమను  తెలివిడి వాటికి లేదు గదా

మంత్రములతొ నిను భావించెదనని  రసన రేబవలు తపించునయా
     వట్టి పలుకులకు పట్టుబడవనే తెలివిడి  దానికి లేదు గదా

 యెడబాయని నీ చెలిమి మరగినది యెడద రేబవలు  సుఖించునయా
     తెలివిడి యనగా దానిది కాదా   తెలియును తనలో నిన్ను సదా