1, జనవరి 2020, బుధవారం

నిద్రాభోగం

నిద్రాభోగం అంటే అది అలాంటిలాంటి భోగం కాదు. చాలా గొప్పభోగం. ఆ సంగతి అనుభవం లోనికి వస్తేనే కాని తెలియదు. ఆ అనుభవం లోనికి రావటం కూడా అంత తేలిక కాదు.

నిద్రాభోగం అనటం బదులు నిద్రాసుఖం అనవచ్చును. సుఖనిద్ర అన్నమాట అందరూ వింటూనే ఉంటారు కదా. అందుచేత సుఖనిద్ర అంటే బాగుంటుందేమో. ఈ వ్యాసానికి పేరుగా అదే అనుకున్నాను ముందుగా. కాని అలోచించగా అది సరిపోదని తోచింది.

నిద్రాభాగ్యం అని కూడా ఒక ముక్క తోచింది. ఇదీ బాగుందే అనుకున్నాను. ఎందుకో చెప్తాను. భోగభాగ్యాలు అన్న మాటను మీరంతా వినే ఉంటారు. అసలు అవేమిటో ఒకసారి చూదాం. సాధారణంగా భాగ్యం అంటే సంపద అనీ అదృష్టం అనీ అర్ధం తీస్తూ ఉంటాం. ముఖ్యంగా సంపద అని ఎక్కువగా వాడుక.

దేవుడికి భగవంతుడు అన్న పర్యాయ పదం అందరికీ తెలిసిందే. ఈమాటకు అధారం భగం అన్న శబ్దం. ఈ భగ శబ్దమే భాగ్యం అన్న పదానికీ ఆధారం.

భగం అంటే శ్రీ అనీ, సంపద అనీ, తెలివీ, ఇఛ్చా జ్ఞాన వైరాగ్యాలనీ, ఐశ్వర్యం అనీ, బలమూ, కీర్తీ, ప్రయత్నమూ, ధర్మమూ మోక్షమూ అనీ ఇలా చాలానే అర్ధాలున్నాయి. సంపద దండిగా ఉన్నవాడిని భాగ్యవంతుడు అనేస్తున్నాం.  ఇవన్నీ ఉన్నవాడు ఒక్క దేవుడే. కాబట్టే ఆయన్ను భగవంతుడు అనటం. స్త్రీయోనికి కూడా భగం అన్న పేరుంది. ఇదెక్కువగా ప్రచారంలో ఉన్నట్లుంది.

వేదాంత పదకోశికలో శ్రీ, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, యశస్సు, ఆనందం అనే ఆరింటికీ కలిపి భగం అని పేరు అనీ ఈ ఆరులక్షణాలూ ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి భగవంతుడు అంటాం అనీ ఉంది.

భగమును కలిగి ఉండటమే భాగ్యం. అంటే భగవల్లక్షణాల్లో ఒకటో అరో ఉంటే వాడు ఎంతో కొంత భాగ్యవంతు డన్నమాట నిజానికి.

విషయానికి వద్దాం. మంచి నిద్ర కూడా ఒక సంపద అన్న సంగతిని గుర్తించాలి. అందుచేత నిద్రాభాగ్యం అంటే నిద్ర అనే మంచి సంపద అని నా ఉద్దేశం. భాగ్యం అంటే అదృష్టం కూడా. కాబట్టి మంచి నిద్రకు నోచుకోవటం అని చెప్పుకోవచ్చును.

ఐనా బాగా అలోచించి చివరికి నిద్రాభోగం అని ఖరారు చేసాను. సుఖం అన్న పేరు చాలా సాదాసీదాగా ఉంది. భోగం అన్న పేరు కొంచెం దర్జాగా ఉంది. నిజానికి భోగం అన్నా సుఖమే. అయితే కించిత్తు తేడా ఉంది. కనీసం నా ఉద్దేశంలో ఉంది.

సుఖం అన్నది ఒక స్థితి. అది మానసికం. ఒక సమయంలో మనం ఆనందంగా ఉండటాన్ని తెలియజేస్తుంది. అది అవిఛ్ఛిన్నమా కాదా అన్నది అక్కడ అర్ధంలో అస్పష్టం. భోగం అనేదీ మానసిక స్థితినే చెప్తుంది. కాని అది ఒక వ్యక్తి యొక్క స్థితిని బయటకు వ్యక్తీకరించే పదం. అందులో ఆ వ్యక్తి అప్పుడప్పుడూ అని కాక నిత్యం సంతోషంగా సుఖంగా ఉండటాన్ని చెప్తున్నది.

అందుచేత భోగభాగ్యాలు అన్నప్పుడు సంపదను కలిగి ఉండటాన్నీ, దాన్ని అనందంగా అనుభవించటాన్నీ కలేసి చెప్పుకోవటం అన్నమాట.

అందుచేత ఎవడికన్నా సాధారణంగా నిత్యం హాయిగా నిద్రపోయే అదష్టం ఉందనుకోండి. అది వాడి భాగ్యం. అలా ఉండటాన్ని వాడు అనందించగలగటం వాడి భోగం అన్నమాట.

అందుకని నిద్రాభోగం అన్నాను. తెలిసింది కదా.

ఈ నిద్రాభోగం అందరికీ దొరికేది కాదు. మనక్కావాలంటే దాన్ని దొరకబుచ్చుకోవటం కూడా అంత సుళువు కూడా కాదు.

ఒకాయన ఉన్నాడు. ఆయన భార్య బ్రహ్మాండంగా గురకపెడుతుంది. ఆ మానవుడికి నిద్రాభోగం దూరమే కదా. తద్విపరీతం కూడా అంతే నిజం. ఆయనే గురకేశ్వర రావు ఐతే ఆ యింటి పార్వతీదేవమ్మకి నిద్రాభోగం గగనకుసుమమే. ఈరోజుల్లో ఐతే ఎవ్వరూ ఏడింటి దాకా లేవటం లేదు.  పూర్వం ఐతే ఆడవాళ్ళు మూడున్నరకో నాలుక్కో లేవవలసి ఉండేది పాపం.

కొందరు నిద్రలో కలలు వచ్చి పొలికేకలు పెడతారు. అప్పుడప్పుడే లెండి అస్తమానూ కాదు. ఆకేకలు విన్నవాళ్ళకు ఎంత నిద్రలో ఉన్నా మెలుకువ రావటం ఖాయం. గుండెలు మహావేగంగా డబాడబా కొట్టుకోవటం ఖాయం. అలాంటి వాళ్ళ ప్రక్కనున్న జీవులకు నిద్రాభోగం ఎంత అపురూపమో ఆలోచించండి.  ఎందుకలా కేకలు పెడతారూ నిద్రలో అంటే వాళ్ళలో గూడుకట్టుకొన్న భయాలూ అభద్రతాభావాలూ వంటివి కారణం అంటారు.

అభద్రతాభావం అంటే గుర్తుకు వచ్చింది.  పనివత్తిడి వంటివి కూడా అభద్రతకు కారణమే. వత్తిడి ఒకమాదిరిగా ఉన్నప్పుడు వారి అభద్రతాభావం కారణంగా పీడకలలు వస్తాయి. వత్తిడి మరీ ఎక్కువైన పక్షంలో అసలు నిద్రకే దూరం కావచ్చును.

పని వత్తిడి అంటే నాకు సాఫ్ట్‍వేర్‍ జనాభా గుర్త్తుకు వస్తారు. అదేదో సినిమాలో బ్రహ్మీ ది సాఫ్ట్‍వేర్ ఇంజనీరుగా బ్రహ్మానందాన్ని పెట్టి వాళ్ళను జోకర్లను చేసారు. కాని వాళ్ళెప్పుడూ పాపం డెడ్‍లైన్ల మీదే బ్రతుకీడుస్తూ ఉంటారు. అది అసలే అభద్రమైన ఉద్యోగరంగం. వాళ్ళకు కార్మికసంఘాల్లాంటివి ఉండవు కదా. ఎప్పుడు ఉద్యోగం పీకినా నోర్మూసుకొని బయటకు పోయి మరొకటి వెతుక్కోవాలి. అందుచేత వాళ్ళకు ఉద్యోగంలో ఉన్నా నిద్రాభోగం ఉండదు ఉద్యోగం లేకపోయినా ఉండదు.  ఏమాట కామాట చెప్పుకోవాలి. ఈకాలంలో కార్మికసంఘాలకు యాజమాన్యాలు ఆట్టే విలువ ఇస్తున్నట్లు లేదు. ఈమధ్య గవర్నమెంట్లూ ఆట్టే విలువ ఇవ్వటం లేదు. ఈమధ్య అనకూడదు లెండి. జార్జి ఫెర్నాండెజ్‍ గారి నాయకత్వంలో ఎనభైలో కాబోలు ఎనభై రోజులు సమ్మె చేస్తే ఇందిరమ్మ ఖాతరు చేయలేదుగా.

అనారోగ్యం అన్నది కూడా నిద్రను దూరం చేస్తుంది తరచుగా. చివరికి చెయ్యి బెణికినా సరే అది సర్ధుకొనే దాకా నిద్రుండదు కదా. మన అనారోగ్యం అనే కాదు, కుటుంబసభ్యుల్లో ఎవరికి అనారోగ్యం కలిగినా  నిద్రాభోగం లేనట్లే.

ఒక్కొక్క సారి అనారోగ్యం కలిగిన వారు హాయిగా నిద్రపోతూ ఉండవచ్చును. కాని మిగిలిన వాళ్ళకే సరిగా నిద్రుండదు. వారిని గమనిస్తూ ఉండాలి జాగ్రతగా. మాటవరసకు మధుమేహం ఉన్నవాళ్ళకి రాత్రి నిద్రలో సుగర్ డౌన్ ఐతే? చాలా ప్రమాదం కదా. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అలా డౌన్ ఐనా సరే నీరసం వచ్చినా మెలకువ రాకపోయే అవకాశం ఉంది. ఎవరూ గమనించక పోతే అది కోమాకు దారి తీయవచ్చును. కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తరచుగా ఒంటి మీద చేయి వేసి మరీ పరీక్షిస్తూ ఉండాలి చెమటలు పడుతున్నాయేమో అన్నసంగతిని. ఈకాపలాదారులకు నిద్రాభోగం ఎక్కడిది?

అసలు పిచ్చిగా ఏదన్నా ధ్యాసలో పడ్డా నిద్ర పారిపోవచ్చును. కొందరికి విజ్ఞానదాహం ఉంటుంది ఎప్పుడూ ఆలోచిస్తూనో పరిశోధిస్తూనో ఉంటారు. నిద్రా సమయంలో ఏదన్నా ధ్యాస వచ్చిందా నిద్ర గోవిందా. న్యూటన్ మహశయుడైతే దాదాపు తెల్లవారుజాము దాకా పనిచేసుకుంటూనే ఉండే వాడట. ఐనా, ఎంత కాదనుకున్నా అలసి నిద్రపోవలసి వస్తుంది కదా.  ఆయన గారి పెంపుడు పిల్లి బయట డిన్నరు చేసొచ్చి తలుపు కొట్టే సమయమూ ఆయన నడుం వాల్చే సమయమూ తరచు ఒక్కటయ్యేవట. దానితో ఆయన వడ్రంగిని పిలిచి వీధి తలుపుకు రెండు కన్నాలు చేయమన్నాడట. పిల్లి గారి కొకటి. ఆపిల్లి గారి పిల్లగారి కొకటి. అది కూడా తల్లితో పాటే డిన్నరు చేసి వచ్చేది కదా మరి.  అసలు సైంటిష్టులు మనలా ఆలోచిస్తే ఎలా? వాళ్ళకీ మనకీ ఆమాత్రం తేడా ఉండద్దూ ఆలోచనల్లో.

పిచ్చి అంటే పని పిచ్చి అనే కాదు. తిండి పిచ్చి కూడాను. ఒక ముద్ద ఎక్కువ తింటే నిద్ర రానుపో అనవచ్చును. ఐనా సరే ఒక ముద్ద తక్కువ తినటానికి అలాంటి వాళ్ళలో ఎవరూ సిధ్ధపడరు మరి. ఈ తిండిపిచ్చి నేరుగా నిద్రమీద దాడి చేయకపోయినా మెల్లగా ఏదో అనారోగ్యానికి దారి తీస్తుంది. అప్పుడు అది నిద్రకు ఎసరు పెడుతుంది.

ఇంటి బాద్యతలతో నిద్రాభోగం చాలా మందికి అందదు. వయస్సు కాస్తా మీదపడిందా, ముప్పాతిక మువ్వీసం మందికి నిద్రాభోగం తగ్గిపోతుంది. దానికి తోడు అనారోగ్యాలు కూడా పలకరించాయా నిద్ర పలకరించటం మానేస్తుంది. ఇంటికి కాని పెద్దకొడుకుగా పుట్టాడా వాడికి  మంచి వయస్సులో ఉన్నా ఆట్టే నిద్రాభోగం ఉండదు. అంటే వెరసి యావజ్జీవం అలాంటి వాళ్ళకి నిద్రాభోగం అందని మ్రాని పండే అన్నమాట.

మంచి వయస్సులో ఉన్న వాళ్ళు అంటే గుర్తుకు వచ్చింది. వాళ్ళకి నిద్రాభోగాన్ని దూరం చేసేది పిల్లపిడుగులు. వాళ్ళు రాత్రి అంతా గుక్క త్రిప్పుకోకుండా కచేరీ చేయగలరు. వాళ్ళు కాస్త పాపం పెద్దవాళ్ళని పడుకోనిధ్ధాం అనుకొనే వయస్సుకు వచ్చే దాకా తిప్పలు తప్పవు. ఈబీ నాష్‍ అని పూర్వం ఒక హోమియోపతీ వైద్యశిఖామణి ఉండే వాడు. అయనింకా శిఖామణి స్థాయికి రాక ముందు వచ్చిన ఒక కేసు గురించిన ముచ్చట చూడండి. ఒకావిడ బిడ్డను తీసుకొని వచ్చింది. రాత్రంతా ఏడుపే, మందివ్వండి అని. ఒకటేమిటి, కుర్రడాక్టరు గారు చాలా మందులే ప్రయత్నించారు. ఫలితం ఏమిటంటే బిడ్డ ఇప్పుడు రాత్రీ పగలూ అని తేడా చూడటం లేదు. ఒకటే ఏడుపు. ఇలా మానవప్రయత్నాల్లో భాగంగా ఆయన జలాపా అన్న మందుని ఇచ్చారట. అది పని చేసింది. అదీ జలాపా ప్రయోజనం అని నాష్ గారు ఆ మందుని వివరించారు.

కొంచెం పెద్దపిల్ల లుంటారు. వాళ్ళకీ నిద్రాభోగం దొరకటం కష్టమే. పోటీపరీక్షల కోసం కోచింగు సెంటర్లవాళ్ళు హడలేసి రాత్రీపగలూ అనకుండా తోముతూ ఉంటే, నిద్ర అన్నది వాళ్ళకి అందని మహాభోగంగా మారిపోతుంది.జీవితం అంటే డబ్బు సంపాదన. దానికి ఆధారం మంచి కెరీర్. దానికి దారి పోటీపరీక్షలు అని బుర్రల్లోకి బాగా ఎక్కించటం కారణంగా ఎక్కడ దెబ్బతిన్నా కొందరు పిల్లలు ఐతే డిప్రెషన్ లోనికి వెళ్తున్నారు లేదా మనని విడిచి పోతున్నారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు అన్నీ కాళరాత్రులే సంవత్సరాల తరబడి.

రాత్రి నిద్ర చాలకపోతే ఏంచేస్తాం. వీలు కుదిరితే పగలు కొంచెం పడక వేస్తాం. వినటానికి బాగానే ఉంది. కాని వీలే కుదిరి చావదు. సెలవు రోజు కాకపోతే ఎలాగూ అది కుదరదు. కాని సెలవు రోజున మాత్రం కాస్త ఆ నిద్రాభోగం కోరుకోవటం మామూలే. ఆట్టే తప్పు కాదు కూడా. ఏవో ఇంటి పనులుంటాయి. లేదా కుటుంబసభ్యులు సినిమా అనో మరొకటో చెప్పి బయలుదేర దీస్తారు.

అదేం లేదు. కుదిరింది. ఇంకేం పడక వేసారు. కొంచెం మాగన్ను పడగానే మొబైల్ మోగుతుంది. ఎవరన్నా స్నేహితులు కావచ్చును కదా అని ఫోన్ ఎత్తుతారు.  ఏదో బ్యాంకి వాడు. మీకు లోన్ ఇస్తానంటాడు. తిట్టి పెట్టేస్తారు. మళ్ళీ పడుకుంటారు. ఇంతలో మరొక ఫోన్. ఈసారి ఎవడో ప్లాట్లు కావాలా అని మొదలు పెడతాడు. ఏడుపూ వస్తుంది. తిక్కా పుడుతుంది. ఓసారి నాకలాగే తిక్కరేగి రూపాయి కెన్నిస్తున్నారూ ప్లాట్లూ అని అడిగాను. పోనీ లెండి నిజంగానే ఎవరో తెలిసిన వాళ్ళ ఫోన్ అనుకుందాం. వాళ్ళు ఫోన్ వదలరు. మీకు నిద్ర వదిలి పోతుంది. ఇంక రోజంతా తిక్కతిక్కగా ఉంటుంది.

మీకు ఉపాయం తెలిసింది కదా? మొబైల్ పీక నొక్కి మరీ పడుకోవాలీ అని!

ఒక్కోసారి హఠాత్తుగా కాలింగ్ బెల్‍ మోగుతుంది. మీ మధ్యాహ్ననిద్రాప్రయత్నం మీద దెబ్బకొడుతూ. ఇంటికి అతిథులు వస్తారు. అందరి చేతుల్లోనూ ఒకటో రెండో మొబైలు ఫోనులు ఉంటాయి. మళ్ళా ఒక్కొక్క దాని లోనూ ఒకటో రెండో సిమ్‍ కార్డు లుంటాయి. ఐనా మీకు ఏ ఒక్కరూ కాల్‍ చేయరు. నేరుగా వచ్చి మీ బ్యూటీస్లీప్ మీద దాడి చేస్తారు.  ఇంకా తమాషా ఏమిటంటే మీరు తలుపు తీసే సరికి ఆ వచ్చిన అతిథుల్లొ కొందరు తమ ఫోన్ల మీద చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటారు. అదీ మీ యింటి గుమ్మం ముందు నిలబడి. ఏదో ఒకటి మీకు నిద్రాభోగం లేదంతే.

ఒక వేళ మీరు కాని మొబైల్ పీకనొక్కి మరీ నిద్రపోతుంటే అప్పుడొస్తుంది డైలాగ్. అతిథుల నుండే లెండి. వాళ్ళలో ఒకరు తప్పకుండా అంటారు. కాల్ చేస్తే తీయలేదూ. పనిలో ఉన్నారో లేక మీఫోను ఛార్జింగులో ఉందో అనుకున్నాం. ఎలాగూ ఈప్రాంతానికి వచ్చాం కాబట్టి ఉన్నారేమో చూసి వెళ్దామని వచ్చాం అంటారు. మీకు ఏడవాలో నవ్వాలో తెలియదు. అదంతే.

ఒక్కొక్క సారి,  ఇంటి నుండి పారిపోవాలీ అనిపిస్తుంది. ఎక్కడికన్నా పోయి నాలుగు రోజులు ఉండాలీ అనిపిస్తుంది. అదీ ఈ దిక్కుమాలిన ఫోన్ నోరు మూసి మరీ. అబ్బే కుదిరే పని కాదు లెండి. అన్ని వ్యవహారాలూ ఈఫోను మీదనే కదా. అది కాస్తా మూసుకొని కూర్చుంటే ఏమన్నా ముఖ్యమైన సమాచారాలూ వగైరా తప్పిపోవచ్చును కదా. అస్సలు మన చేతిలో లేదండీ మన జీవితం.

ఈ మొబైల్ ఫోనుల కారణంగా నిష్కారణంగా నిద్రాభోగాన్ని చెడగొట్టుకునే వాళ్ళూ ఉన్నారు. వాళ్ళకు తెలియటం లేదు పాపం. కళ్ళు పొడిబారి నిద్ర దూరం అయ్యేదాక రాత్రంతా ఆ దిక్కుమాలిన ఫోనుతో కాలక్షేపం చేస్తారు. వాటిలో  సినిమాలు చూసే వాళ్ళున్నారు. వాటిలో ఏవేవో పిచ్చిపిచ్చి గేమ్స్ ఆడుతూ కూర్చునే వాళ్ళున్నారు. ఇదంతా కేవలం కుర్రకారు వ్యవహారం అనుకోకండి. కొందరు పెద్దలదీ ఇదే తీరు. వీళ్ళు నిద్ర ఎంత అవసరమో గుర్తించటం లేదు. మంచి నిద్ర ఎంత గొప్ప భోగమో తెలుసుకోవటం లేదు.

భగవద్గీతలో ఒక ముక్క ఉంది. మనవి చేస్తాను. "యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి  భూతాని  సా  నిశా  పశ్యతః  మునేః" అని రెండవ అధ్యాయంలో వస్తుంది ఒక శ్లోకం. అది అరవై తొమ్మిదవది అక్కడ. జీవులంతా రాత్రి నిద్రపోతుంటే యోగులు ఆ సమయంలో మెలకువగా ఉంటారని ఈశ్లోకం చెబుతోంది. ఐతే ఆ ప్రాణులన్నీ మెలకువగా లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలే పగళ్ళు యోగులకు మాత్రం రాత్రులట. లౌకిక వ్యవహారాలకు కదా పగలు. అవి లేని సమయం రాత్రి. యోగులకు లౌకిక వ్యవహారాలు పట్టవు కాబట్టి ఆపగళ్ళు వాళ్ళకు రాత్రుల వంటివే అన్నమాట. రాత్రులు వారు పారలౌకిక వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. కాబట్టి మన రాత్రులు వాళ్ళకు పగళ్ళ వంటివి. వడ్ల గింజలో బియ్యపు గింజ.

ఏతావాతా యోగులు రాత్రులు నిద్రపోరు. రోగులూ నిద్రపోరు. నిద్రాభోగం లేక రోగులు తమ గురించీ ప్రపంచవ్యవహారాల గురించీ ఆలోచిస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉంటారు. యోగులు మాత్రం భగవంతుడి గురించిన ఆలోచనల్లో ఎప్పుడు తెల్లవారినదీ  కూడా సరిగ్గా గమనించే స్థితిలో ఉండరు.

నేనే మంతగా చెప్పుకోదగిన యోగిని కాదు. ఆ మాటకు వస్తే యోగిని అని చెప్పుకోదగిన వాడినే కాదు. కాని తరచూ నా రాత్రులు కూడా ఆ కోవలోనికి వచ్చేస్తున్నాయి. ఈ రాము డొకడు. ఈయన పుణ్యమా అని చాలా రాత్రులు నిద్ర పట్టటం లేదు.

ఇన్నేళ్ళుగా ఈ ఉపాధిలో ఉన్న జీవుడి నుండి వందలాది రామకీర్తనలు వచ్చాయి. అందులో అనేకం ఆయన పుణ్యమా అని వేళాపాళా లేకుండా రాత్రిపూటల్లో వచ్చినవే! అలా యెందుకు రావాలీ అంటే అది ఆయన యిష్టం. అవి ఎప్పుడు రావాలో చెప్పటానికి నేనెవడిని.

ఇలా రామచింతన నన్ను నిద్రాభోగానికి దూరం చేసింది. అందుకని చింత యేమీ లేదు. యోగసాధనలో భోగత్యాగం వీలైనంతగా చేయవలసిందే. ఐతే ఈముక్క కూడా ఎందుకు చెప్పటం అనవచ్చును. బాగుంది. చెప్పకుండా దాచుకోవటం మాత్రం ఎందుకు? అదేం తప్పుపని కాదే సిగ్గుపడి దాచేసేందుకు. పైగా ఈనా అనుభవం మరొకరికి పనికి రావచ్చును. గీతలో బోధయంత పరస్పరం అన్నాడు కదా. ఏమో ఈ విషయం ఎవరికి ఉపయోగపడుతుందో. పడనివ్వండి. చెప్పటం ఐతే నావంతుగా చెప్పేసాను.

  • భగవద్గీతలో "యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా" అని ఒక శ్లోకం ఉంది భగవా నువాచగా.  స్వప్నావబోధ అంటే కలల లోకం నుండి ఇహలోకం లోనికి విచ్చేయటం. అసలు ముందు మనం స్వప్నజగత్తులోనికి అడుగుపెట్టాలి కదా. అంటే నిద్రాభోగం ఉండి తీరాలి కదా. వత్తిడిలో ఏదో నిద్ర పట్టిందని పించుకున్నా అప్పుడు పీడకలలు వస్తాయి తరచుగా. అబ్బే అది యుక్త స్వప్నావబోధ చచ్చినా కాదు. ఇంక అదేం ఉపకరిస్తుంది మనకి. యోగి కావటం మాట దేవుడెరుగు.

అందుచేత యావన్మంది ప్రజలారా,  సరైన నిద్ర అనేది ఒక భోగం అని గుర్తుపెట్టుకోండి. దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి.