16, ఫిబ్రవరి 2015, సోమవారం

శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో శివస్తుతి రగడ


జయజయ కలశీసుత గిరికన్యా శైవలినీతట కల్పమహీరుహ
జయజయ దక్షిణరజతక్షితిధర సంయమిసేవిత పాదసరోరుహ

జయజయ పీన జ్ఞానప్రసవాచలకన్యా కుచ ధృఢపరిరంభణ
జయజయ కృతదుర్గాధరణీధర సామ్యవినోదవిహార విజృంభణ

జయజయ భారద్వాజాశ్రమ నవసరసిజకేళీవన పరితోషణ
జయజల నీలక్ష్మాధరణపుణ్యస్థల కాపాలిక భాషితభూషిత

జయజయ మోహనతీర్థాలోకన సంభ్రమరత భవబంధవిమోచన
జయజయ శిఖితీర్థాశ్రిత యోగీశ్వరమానస సంవిత్సుఖసూచన

జయజయ సహస్రలింగాలయ దర్శనమాత్ర స్థిరమోదాపాదక
జయజయ ఘనమార్కండేయమునీశ్వర తీర్థనిషిక్త విపఛ్ఛేదక

జయజయ నిర్జరనాయకతీర్థ స్నాతకజన కలుషేంధనపావక
జయజయ కరుణేక్షణ రక్షిత నిజచరణారుణ పంకేరుహసేవక

దేవా నిను వర్ణింప రమా వాగ్దేవీ వల్లభులైనను శక్తులె
నీ విధ మెఱుగక నిఖిలాగమముల నేర్పరులైనను జీవన్ముక్తులె

కొందఱు సోహమ్మని యద్వైతాకుంఠిత బుధ్ధిని నిను భావింతురు
కొందఱు దాసోహమ్మని భక్తిని గుణవంతునిగా నిను సేవింతురు

కొందఱు మంత్రరహస్యమవని నిను గోరి సదా జపనియతి నుతింతురు
కొందఱు హఠయోగార్థాకృతివని కుండలిచే మారుతము ధరింతురు

తుది నందరు తమ యిచ్చల నేయే త్రోవలబోయిన నీ చిద్రూపము
గదియక గతిలేకుండుట నిజముగ గని చాలింతురు మది సంతాపము

నిను సేవించిన కృతకృత్యుడు మఱి నేరడు తక్కిన నీచుల గొల్వగ
నిను శరణంబని నిలచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగ

నీవనియెడు నిధి గాంచిన ధన్యుడు నేరడు తక్కిన యర్థము గోరగ
నీవే గతియని యుండెడు పుణ్యుడు నేరడు తక్కిన వారల జేరగ

భవదుర్వాసన పాయదు నీపదపంకజముల హృదయము వాసింపక
చవులకు గలుగవు సకలేంద్రియములు సతతమ్మును నిన్ను నుపాసించక

జననమరణములు ధరలో నిన్నును సమ్మతితో సేవింపక పాయవు
మననమునకు నీ చిన్మయరూపము మరగింపక యణిమాదులు డాయవు

మీ‌మాహాత్మ్యము మే మింతింతని మితి చేయగ మతి నెంతటి వారము
మామీదను కృపగల్గి మహేశ్వర మన్నింపుము నీకు నమస్కారము

2 వ్యాఖ్యలు:

 1. అద్భుతం మాస్టారు. గోదావరి బ్రిడ్జి మీద స్పీడుగా వెళ్ళే రైలు నడకలా ఉంది. శివతాండవానికి సరిపడే ఈ రగడ నిజంగా రగడే. దీని సృష్టికర్త ధూర్జటిగారేనా వేరెవరైనా ఈ ఛందస్సులో రచనలు చేశారా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తెలుగు ఛందస్సులలో రగడలు అని ఒకరకమైన మాత్రా ఛందస్సుకు సంబంధించిన పద్యాలండి. ఈ పైన ఇచ్చిన రగడ ధూర్జటి మహాకవి గారి శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో శాపవిమోచనం పొందిన కాళము (పాము), హస్తి (ఏనుగు) పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు అయనపై చేసిన స్తుతి ఇది. రగడలు చాలా అందంగా ఉంటాయి. రగడలను మన తెలుగుకవులు అక్కడక్కడా వాడారు.

   ( పై రగడలో పదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు చొప్పున ఉన్నాయి. ప్రాస నియమం ఉన్నది. 4 చతుర్మాత్రాగణాలపైన యతిస్థానం. ప్రాసనియమం ఉన్నప్పుడు పద్యాల్లో ప్రాసయతి వాడరు కాబట్టి ప్రాసయతి ఈ రగడల్లో వాడకూడదు. సంప్రదాయిక లక్షణం ప్రకారం జగణం నిషిధ్ధం కాని ధూర్జటిగారు దాన్ని పట్టించుకోలేదు - హాయిగా జ-గణాలు వేసారు. రగడల గురించి మాలికపత్రికలో వ్యాసం ఇక్కడ చదవండి. )

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.